దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ జీ, ఉత్సాహవంతుడు, ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ జైరామ్ జీ ఠాకూర్ జీకి, పార్లమెంటులో నా సహచరుడు, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు హిమాచల్ ప్రదేశ్ ముద్దు బిడ్డ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాజీకి, కేంద్ర మంత్రి మండలిలో నా సహచర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ జీకి, పార్లమెంటులో నా సహచరుడు హిమాచల్ ప్రదేశ్ బిజెపి అధ్యక్షులు శ్రీ సురేష్ కాశ్యప్ జీకి, ఇతర మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, పంచాయతీల ప్రజాప్రతినిధులకు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా సోదర సోదరమణులారా!
గత వందేళ్లలో ఎన్నడూ కనీ వినీ ఎరగని మహమ్మారి వైరస్‌పై పోరాటం జరగుతోంది. ఈ పోరాటం చేయడంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని అర్హతగల ప్రజలందరికీ ఒక డోసు టీకాను వేసిన మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం రికార్డు సాధించింది. ఇదే కాదు తన జనాభాలో మూడో వంతు ప్రజలకు రెండో డోసు టీకాను వేయించిన రాష్ట్రంగా నిలిచింది.
స్నేహితులారా,
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సాధించిన ఈ విజయం దేశ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. స్వయం సమృద్ధి సాధించడం ఎంత ముఖ్యమో చాటింది. టీకాల విషయంలో దేశం సాధించిన స్వయం సమృద్ధి కారణంగా అందరికీ ఉచిత టీకాలు వేయడం, 130 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని పొందడం సాధ్యమైంది. ఒకే రోజులోనే 1.25 కోట్ల టీకాలను వేయడంద్వారా భారతదేశం రికార్డు సృష్టించింది. ఒక రోజులో ఇండియా వేసే వ్యాక్సిన్ల సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల జనాభాకంటే ఎక్కువ. దేశంలోని ప్రతి పౌరుడు పడుతున్న కష్టం, ప్రతి పౌరుని సాహసం కారణంగా భారతదేశ టీకా కార్యక్రమం విజయవంతమవుతోంది. ఈ కార్యక్రమమనేది... భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటనుంచి నేను ప్రస్తావించిన సబ్ కా ప్రయాస్ అనే అంశాన్ని ప్రతిఫలిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం, దాద్రా నగర్ హవేలీలు మొదటి డోసును నూటికి నూరుశాతం వేయించినవిగా పేరు సంపాదించుకున్నాయి. పలు రాష్ట్రాలు ఈ మైలురాయిని అందుకోవడానికి దాదాపు సిద్ధంగా వున్నాయి. మొదటి డోసు తీసుకున్న ప్రతి ఒక్కరూ రెండో డోసు తీసుకునేలా మనం కృషి చేయాల్సిన సమయమిది.
సోదర సోదరీమణులారా,
ఆత్మవిశ్వాసం మెండుగా వుండడంవల్ల హిమాచల్ ప్రదేశ్ అత్యంత వేగంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ రాష్ట్రం తన సమర్థత మీద నమ్మకంతో, తన ఆరోగ్యరంగ కార్యకర్తల, దేశ శాస్త్రవేత్తల శక్తి మీద విశ్వాసంతో ముందడుగు వేసింది. రాష్ట్రానికి చెందిన ఆరోగ్య రంగ కార్యకర్తలు, ఆషా కార్యకర్తలు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఇంకా ఇతర సహచరులందరిలోని సమర్థత కారణంగా ఈ విజయం సాధించగలిగాం. వైద్య రంగానికి చెందిన సిబ్బంది, వాళ్లు వైద్యులు కావచ్చు, పారా మెడికల్ సిబ్బంది కావచ్చు, ఇంకా ఇతర సహాయకులు కావచ్చు వీరందరి కృషి వలన ఇది సాధ్యమైంది. ఇందులో కూడా భారీ సంఖ్యలో పాల్గొని నా సోదరీమణులు ప్రత్యేక పాత్ర పోషించారు. కొద్ది సేపటి క్రితమే మన సహచరులందరూ క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొన్న సవాళ్లను వివరంగా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో టీకా కార్యక్రమానికి అనేక రకాల అడ్డంకులు ఎదురయ్యాయి. పర్వతప్రాంతం కావడంతో కార్యక్రమ నిర్వహణలో అవరోధాలు వచ్చాయి. కరోనా టీకాను భద్రంగా దాచి వుంచడం, సరఫరా చేయడం చాలా కష్టమైన పని. అయితే జైరామ్ జీ ప్రభుత్వం రూపొందించిన వ్యవస్థలు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడం ఎంతైనా అభినందనీయం. టీకాలను వృధా చేయకుండా వాటిని వేగంగా ప్రజలకు వేయడంలో హిమాచల్ చేసిన కృషి ప్రశంసనీయం.
స్నేహితులారా,
భౌగోళికంగా కష్టమైన పరిస్థితులున్నప్పటికీ, ప్రజాబాహుళ్యానికి సమాచారం అందించడం, ప్రజలను భాగస్వాములను చేయడమనే ఈ పనులు టీకా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఒకో పర్వత పర్వతానికి ఒకో మాండలికం కలిగిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతం గ్రామీణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనంలో సంప్రదాయ విశ్వాసాలు విడదీయరాని బంధం కలిగి వుంటాయి. అంతే కాదు రాష్ట్ర ప్రజల జీవితంలో దేవుళ్లు, దేవతలకు ప్రాధాన్యత ఎక్కువ. కొద్దిసేపట్టి క్రింత మాట్లాడిన ఒక సోదరీమణి కులు జిల్లాలోని మలానా గ్రామం గురించి ఉదహరించారు. ప్రజాస్వామ్యానికి దశ దిశను ఇవ్వడంలో మలానా గ్రామం ప్రతిసారీ కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడి టీకా బృందం ఒక ప్రత్యేక క్యాంపును నిర్వహించింది. టీకాల బాక్సులను స్పాన్ వైర్ ద్వారా సరఫరా చేశారు. దేవ్ సమాజానికి చెందిన పెద్దవారి సమ్మతిని సంపాదించారు. మారు మూల ప్రాంతాలకు టీకాలను తీసుకుపోవడంలో అలాంటి వ్యూహం పలు ప్రాంతాల్లో చక్కగా పని చేసింది. ప్రజల భాగస్వామ్యాన్ని సాధించడం జరిగింది.
స్నేహితులారా,
హిమాచల్ ప్రదేశ్ లోని లహౌల్ స్పిటి జిల్లాకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. అయినప్పటికీ ఈ జిల్లా కూడా మొదటి డోసు టీకాను నూటికి నూరుశాతం ప్రజలకు అందించడంలో ముందువరసలో నిలిచింది. అటల్ టన్నెల్ నిర్మించడానికంటే ముందు ఈ జిల్లాకు దేశంలోని మిగతా ప్రాంతాలకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే పరిస్థితి వుండేది. విశ్వాసం, విద్య, విజ్ఞానం కలిస్తే ప్రజల జీవితాల్లో మార్పు తేవచ్చని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మరోసారి నిరూపించింది. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు పుకార్లను, తప్పుడు సమచారాన్ని నమ్మరు. ప్రపంచంలోనే భారీదైనటువంటి, వేగవంతమైనటువంటి టీకా కార్యక్రమాన్ని భారతదేశ గ్రామీణ ప్రజలు బలోపేతం చేయగలరనే విషయానికి హిమాచల్ ప్రదేశ్ సాక్ష్యంగా నిలిచింది.
స్నేహితులారా,
వేగంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకవడంద్వారా హిమాచల్ ప్రదేశ్ పర్యాటక రంగం లబ్ధి పొందుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం ఎక్కువమంది యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన ఇస్తోంది. టీకా వేసుకున్నప్పటికీ మాస్కులు ధరించడం, మనిషికి మనిషికి మధ్యన రెండు గజాల దూరాన్ని పాటించడమనే విషయాన్నిమనం మరిచిపోకూడదు. హిమపాతం కురిసిన తర్వాత ఇళ్లలోంచి బైటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా నడవడం ఎలాగో హిమాచల్‌ప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. అలాగే వర్షాలు కురిసిన తర్వాత ఎక్కడా జారిపడకుండా ఎంతో జాగ్రత్తగా మనం నడుస్తుంటాం. అదే విధంగా కరోనా మహమ్మారి తర్వాత కూడా మనం నడుచుకోవాలి. కరోనా సమయంలో ఇంటినుంచే పని, ఎక్కడినుంచైనా పని చేయడంలో హిమాచల్ ప్రదేశ్ ఆదర్శవంతంగా నిలిచింది. నగరాల్లో ఇంటర్ నెట్ కనెక్టివిటీ , ఇతర సదుపాయాలు బాగా వుండడంవల్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేక ప్రయోజనాలను పొందుతోంది.
సోదర సోదరీమణులారా,
ఈ కరోనా సమయంలో కూడా ఇతర ప్రాంతాలతో సంబంధాలను కలిగి వుండడమనేది ప్రజల జీవితం మీద, జీవనోపాధి మీద వేసే సానుకూల ప్రభావాన్ని హిమాచల్ ప్రదేశ తన అనుభవంలో చవిచూసింది. రోడ్డు, రైలు, విమానయానం లేదా ఇంటర్ నెట్ కావచ్చు..ఇప్పుడు దేశం యొక్క అత్యంత ప్రాధాన్యమైన విషయం కనెక్టివిటీ. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 8 నుంచి పది నివాస గృహాలున్న ప్రాంతాలకు సైతం రోడ్లను వేయడం జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన రహదారులు వెడల్పు అవుతున్నాయి. బలమైన కనెక్టివిటీ పెరుగుతండడంవల్ల రాష్ట్రానికి చెందిన పర్యాటక రంగం లబ్ధి పొందుతోంది. అంతే కాదు రాష్ట్రంలోని రైతులు, ఉద్యాన పంటల యజమానులు లబ్ధి పొందుతున్నారు. గ్రామాల్లో సైతం ఇంటర్ నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. దాంతో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన యువ ప్రతిభావంతులు పర్యాటక రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తమ సంస్కృతిని ఇతర ప్రాంతాలతోను, దేశాలతోను పంచుకుంటున్నారు.
సోదర సోదరీమణులారా ఆధునిక, డిజిటల్ సాంకేతికత ద్వారా రానున్న రోజుల్లో హిమాచల్ ప్రదేశ్ మరింతగా లబ్ధి పొందబోతున్నది. విద్య, ఆరోగ్య రంగాలలో భారీ మార్పులు రానున్నాయి. ఈ సాంకేతికత ద్వారా రాష్ట్రంలోని మారు మూల ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు విర్చువల్ గా కనెక్టవుతాయి. అవి రాష్ట్రంలోని పెద్ద పాఠశాలల ఉపాధ్యాయులతోను, పేరొందిన ఆసుపత్రుల వైద్యులతోను అనుసంధానమవుతాయి.
ఈ మధ్యనే మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇది డ్రోన్ సాంకేతికతకు సంబంధించిన నియమ నిబంధనల్లో మార్పునకు సంబంధించినది. ఇప్పుడు ఈ నియమ నిబంధనల్ని సులభతరం చేయడం జరిగింది. తద్వారా హిమాచల్ ప్రదేశ్ లో ని ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో నూతన అవకాశాలు ఏర్పడతాయి. మందుల సరఫరాలోను, ఉద్యానపంటల సాగులోను, భూముల సర్వేలలోను డ్రోన్లను విరివిగా ఉపయోగించుకోవచ్చు. పర్వత ప్రాంత ప్రజలు ఈ డ్రోన్ టెక్నాలజీని సరిగా ఉపయోగించుకుంటే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లోని అడవుల్ని సంరక్షించడానికి కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సేవలను అందించడంలో ఆధునిక సాంకేతికతను సాధ్యమైనంత ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
సోదర సోదరీమణులారా..
హిమాచల్ ప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు భారీ సవాళ్లను విసరుతున్నాయి. ఈ మధ్యకాలంలో సంభవించిన దురదృష్టకర ఘటనల్లో మనం పలువురు స్నేహితులను కోల్పోయాం. కాబట్టి కొండచరియలు విరిగిపడే ఘటనలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలు పొందడానికి వీలుగా శాస్త్రీయపరమైన పరిష్కారాలకోసం మనం వేగంగా కృషి చేయాల్సి వుంది. కొండ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా చేపట్టే నిర్మాణాలకు సంబంధించి నూతన సాంకేతికతను తయారు చేసే విషయంలో మన యువతకు తగిన సహకారాన్ని అందించాలి.
స్నేహితులారా,
గ్రామాలను, కమ్యూనిటీలను కలపడంద్వారా అర్థవంతమైన ఫలితాలను సాధించవచ్చనడానికి అతి పెద్ద ఉదాహరణ జల్ జీవన్ మిషన్. హిమాచల్ ప్రదేశ్‌లో ఒకప్పుడు అసాధ్యమనుకున్న ప్రాంతాల్లో సైతం కుళాయి నీళ్లను సరఫరా సౌకర్యాన్ని అందించగలుగుతున్నాం. ఇదే విధానాన్ని మన అటవీ సంపదను కాపాడుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి గ్రామాల్లోని స్వయం సహాయక బృందాల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్ అడవుల్లో వనమూలికలకు, కూరగయలకు , పండ్లకుకొదవ లేదు. వాటి డిమాండ్ రాను రాను పెరుగుతోంది. మన సోదరీమణులు ఈ వన సంపదను శాస్త్రీయ విధానాల ద్వారా ఉపయోగించుకొని వారి ఆదాయం పెంచుకోవచ్చు. వారికి ఎలక్ట్రానిక్ కామర్స్ అనే కొత్త విధానం కూడా అందుబాటులోకి వస్తోంది కాబట్టి..వారు దాన్ని కూడా ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు.
దేశంలోని స్వయం సహాయక బృందాల మహిళలకోసం ప్రత్యేకమైన ఆన్ లైన్ వేదికను తయారు చేస్తున్నామని ఆగస్టు 15న ఎర్రకోట మీదనుంచి నేను ప్రకటించడం జరిగింది. ఈ మాధ్యమంద్వారా వారు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు అమ్ముకోవచ్చు. మన హిమాచల్ ప్రదేశ్ సోదరీమణులు దేశంలోని మారు మూల ప్రాంతాలకు సైతం తాము సేకరించిన ఆపిల్స్ ను, నారింజ పండ్లను, కిన్నోవాలను, పుట్టగొడుగులను, టమోటాలను, ఇంకా అలాంటి అనేక ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యవసాయ సదుపాయాల కల్పన కోసం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ఒక లక్ష కోట్ల రూపాయల నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిధిని ఉపయోగించుకొని మన స్వయం సహాయక బృందాల మహిళలు, రైతు సంఘాల సభ్యులు తమ ప్రాంతాలలో శీతలీకరణ గిడ్డంగులను, ఫుడ్ ప్రాసెసంగ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా వారు తమ పండ్లను, కూరగాయలను స్టోర్ చేసుకోవడానికిగాను ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం వుండదు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రైతులు, ఉద్యాన పంటల యజమానులు ఈ నిధిని సాధ్యమైనంతమేరకు ఉపయోగించుకోగలరని నేను భావిస్తున్నాను.
స్నేహితులారా,
స్వాతంత్ర్యం సంపాదించి 75 సంవత్సరాలైన సందర్భంగా దేశంలో అమృత్ మహోత్సవ్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రైతులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. రాబోయే పాతిక సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా మార్చగలమా? మనం కాలక్రమంలో మన భూములను రసాయనిక మందుల చెరనుంచి తప్పించాలి. మన భూమి ఆరోగ్యంతోపాటు మన రాబోయే తరాల ప్రజల ఆరోగ్యం భద్రంగా వుండేలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు హిమాచల్ ప్రదేశ్ ప్రజల మీద, యువత సమర్థత మీద పూర్తి నమ్మకం వుంది. దేశ సరిహద్దులను రక్షించడంలో హిమాచల్ ప్రదేశ్ యువత తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నట్టే రాష్ట్రంలోని ప్రతి రైతు తమ తమ గ్రామాల్లోని నేలల్ని రక్షించుకునే పని చేయడంలో ముందు భాగాన నిలుస్తారని అనుకుంటున్నాను.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తన సమర్థతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ముందు ముందు కూడా కొనసాగిస్తుందని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందనలు. పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం నిర్వహించుకున్న రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నిలవాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాక్షంలు తెలియజేస్తున్నాను. దేశ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా విషయంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వుండండి. ఇంతవరకూ దేశంలో 70 కోట్ల టీకాలను వేయడం జరిగింది. వైద్యులు, నర్సులు, అంగన్వాడీ, ఆషా సోదరీమణులు, స్థానిక ప్రభుత్వాల సిబ్బంది, టీకాల తయారీ కంపెనీలు, శాస్త్రవేత్తలు తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చూపారు. దేశంలో వేగంగా టీకా కార్యక్రమం నడుస్తోంది. అయితే మనందరం ఎలాంటి అజాగ్రత్తకు తావు లేకుండా వ్యవహరించాలి. మొదటి రోజునుంచి నేను చెబుతూనే వున్నాను. టీకా వేసుకోవాలి, అదే సమయంలో నియమ నిబంధనల్ని పాటించాలని అందరికీ చెబుతూనే వున్నాను. మరోసారి హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు నా శుభకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ అభినందనలు.