నమస్కారం !
మీ అందరితో చర్చల సందర్భంగా క్షేత్ర స్థాయి పరిస్థితి గురించి మీరు వివరంగా తెలియజేసిన సమాచారంతో, మనం సరైన దిశలో పయనిస్తున్నట్లు గమనించడం జరిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రోజులు గడిచేకొద్దీ, కొత్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అందువల్ల, నిరంతరం మనం కలవడం, చర్చించడం కూడా చాలా ముఖ్యం !
మనం, ప్రతిరోజూ ఆస్పత్రులతో పాటు, మన ఆరోగ్య సంరక్షణ కార్మికులపై పెరుగుతున్న ఒత్తిడి మరియు రోజువారీ పనిలో కొనసాగింపు లేకపోవడం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాము. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా, ప్రతి రాష్ట్రం, అది కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా, దాని స్వంత స్థాయిలో పోరాడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను, మనం ఈ జట్టు స్ఫూర్తితో జట్టుగా నిరంతరం పని చేయగలమని మేము భావిస్తున్నాము. ఫలితాలను తీసుకురావడంలో ఈ సంఘటిత స్ఫూర్తి విజయవంతమైంది. ఇంత పెద్ద సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా కలిసి పనిచేయడం గొప్ప విషయం.
గౌరవనీయులైన ముఖ్యమంత్రులారా,
ఈ రోజున, 80 శాతం క్రియాశీల కేసులు ఈ 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి, కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఈ రాష్ట్రాల పాత్ర భారీగా మారుతుంది. ఈ రోజున, దేశవ్యాప్తంగా 6 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా, వీటిలో ఎక్కువ భాగం ఈ పది రాష్ట్రాల్లో ఉన్నాయి! అందుకే ఈ పది రాష్ట్రాలు కలిసి కూర్చుని, పరిస్థితిని సమీక్షించి, చర్చించవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాలు అనుసరిస్తున్న కొత్త కార్యక్రమాలు మరియు ఉత్తమ పద్ధతులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి రాష్ట్రం తమ తమ స్వంత మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నందున ఒకరి అనుభవాల నుండి మరొకరు నేర్చుకోవాలి. అదేవిధంగా, ఈ రోజు జరిగిన చర్చ నుండి మనం ఒకరి నుండి ఒకరు చాలా నేర్చుకున్నాము. ఈ పది రాష్ట్రాల్లో మనం కలిసి కరోనాను ఓడిస్తే, దేశం కూడా గెలుస్తుందన్న విషయాన్ని గ్రహించడం జరిగింది!
మిత్రులారా,
రోజువారీ నిర్వహించే పరీక్షల సంఖ్య 7 లక్షలకు చేరుకుంది, ఇది నిరంతరం పెరుగుతూ వస్తోంది. ఈ రోజు, సంక్రమణను గుర్తించడానికి, నివారించడానికి సహాయపడే ఫలితాలకు మనమే సాక్షి. ప్రపంచంతో పోలిస్తే, మన దేశంలో సగటు మరణాల రేటు గతంలో కంటే చాలా తక్కువగా ఉంది; సగటు మరణాల రేటు నిరంతరం తగ్గుతుండటం చాలా సంతృప్తికరమైన విషయం! అదేవిధంగా క్రియాశీల కేసుల శాతం క్రమంగా తగ్గుతోంది, రికవరీ రేటు నిరంతరం పెరుగుతోంది, మెరుగౌతోంది. అంటే, మన ప్రయత్నాలు సమర్థవంతంగా రుజువు అవుతున్నాయని దీని అర్థం! అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ప్రజలలో విశ్వాసాన్ని పెంచింది, భయ వాతావరణం కూడా క్షీణిస్తోంది.
నిర్ధారణ పరీక్షల సంఖ్యను మనం ఎంత ఎక్కువగా పెంచితే, మన విజయావకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయి. మరణ రేటును ఒక శాతం కన్నా తక్కువకు తీసుకురావడానికి మరింత ఎక్కువగా ప్రయత్నిస్తే, మనం కూడా ఆ లక్ష్యాన్ని సాధించగలం. ప్రస్తుతం ఏమిచేయాలీ, తరువాత ఏమి చేయాలి, ఇక ముందు ఎలా కొనసాగించాలి అనే దానిపై ఇప్పడు మనకు చాలా స్పష్టత వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే, ఏమి చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో అనే విషయాలు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికీ ఇప్పడు ఒక అవగాహన వచ్చింది. మనం భారతదేశంలోని ప్రతి పౌరునికీ ఈ సందేశాన్ని వ్యాప్తి చేయగలిగాము!
ఇప్పుడు మనం గమనించినట్లైతే, పరీక్ష రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా పాజిటివ్ కేసుల రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నట్లు మన చర్చలో వెల్లడయ్యింది!
మిత్రులారా,
కరోనాకు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతమైన ఆయుధం “నియంత్రణ, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు నిఘా” అని ఇప్పటివరకు మన అనుభవం మనకు తెలియజేసింది! ఇప్పుడు ప్రజలు కూడా దీనిని గ్రహించారు, వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అవగాహన స్థాయి పెంచడంలో మన ప్రయత్నాలతో, మనం మంచి ఫలితాలను సాధించే దిశగా పయనించాము. ఈ రోజున ఇళ్ళలోనే క్వారంటైన్ వ్యవస్థ బాగా అమలు కావడానికి కారణం ఇదే.
తాము నిర్దేశించిన విధంగా 72 గంటలలోపు కేసులను గుర్తించినట్లయితే, ఈ సంక్రమణ చాలా వరకు నెమ్మదిస్తుందని, నిపుణులు పేర్కొన్నారు. అందువల్ల చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నియమాలను పాటిస్తూ కొనసాగాలని నా హృదయపూర్వక కోరిక. మనం ఎక్కడా ఉమ్మివేయకూడదు. వీటితో పాటు, ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు, కరోనా యోధులు, సాధారణ ప్రజలలో కూడా మనం ఒక కొత్త మంత్రాన్ని వ్యాప్తి చేయాలి. మరియు ఆ మంత్రం ఏమిటంటే, ఎవరు కరోనా వైరస్ బారిన పడ్డారు, 72 గంటలలోపు, ఆ వ్యక్తి యొక్క అన్ని సన్నిహిత పరిచయాలు కరోనా కోసం గుర్తించబడి పరీక్షించబడాలి. మరియు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఒకే విధంగా ఉండాలి. ఈ 72 గంటల ఫార్ములాపై మనం నొక్కి చెబుతుంటే, మిగతా పనులన్నీ కూడా 72 గంటల్లోనే చేయాలి.
ఈ రోజు కోవిడ్ నిర్ధారణగా పరీక్షల నెట్ వర్క్ తో పాటు, మనకు ఆరోగ్య సేతు యాప్ కూడా అందుబాటులో ఉంది. ఆరోగ్య సేతు యాప్ సహాయంతో ఒక బృందం క్రమం తప్పకుండా విశ్లేషిస్తే, గరిష్ట ఫిర్యాదులు ఏ ప్రాంతం నుండి వస్తున్నాయో మనం సులభంగా తెలుసుకోవచ్చు. హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ల లోని కొన్ని జిల్లాలు కొంత కాలం పాటు మనకు చాలా ఆందోళన కలిగించిన విషయం మనకు తెలిసిందే. త్వరలో ఢిల్లీలో పెద్ద సంక్షోభం తలెత్తే ప్రమాదముందని కూడా ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే, నేను ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, మన హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి నాయకత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, ఒక వినూత్న విధానాన్ని చేపట్టడం జరిగింది. ఆ ఐదు జిల్లాలతో పాటు ఢిల్లీ నగరంలో కూడా చాలావరకు మనం ఆశించిన ఫలితాలను పొందాము.
ఒక పరిస్థితి ఎంత కష్టతరమైన విషయంగా కనిపించినప్పటికీ, ఒక క్రమపద్ధతిలో మనం ముందుకు సాగితే, ఒక వారం లేదా 10 రోజుల్లో మనకు అనుకూలంగా ఉన్న విషయాలను ముందుగా మనం సాధించవచ్చునన్న వాస్తవాన్ని నేను గమనించాను. ఈ వ్యూహానికి కేంద్ర అంశాలు ఈ విధంగా ఉన్నాయి: కంటైన్మెంట్ జోన్లను పూర్తిగా వేరుచేయడం; అవసరమైన చోట సూక్ష్మ నియంత్రణను సృష్టించడం; రిక్షా-కార్మికులు, ఆటో-రిక్షా డ్రైవర్లు, ఇళ్ళల్లో పనిచేసే కార్మికులు వంటి అధిక ప్రమాదం ఉన్నవారికి 100 శాతం నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం. ఈ రోజు, ఈ ప్రయత్నాల ఫలితాలు మన ముందు ఉన్నాయి! ఆసుపత్రుల్లో మెరుగైన యాజమాన్య నిర్వహణ, ఐ.సి.యు. పడకల సంఖ్య పెంచడం వంటి ప్రయత్నాలు కూడా చాలా సహాయపడ్డాయి!
మిత్రులారా,
అత్యంత ప్రభావవంతమైన అనుభవం మీదే! మీ మీ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా, విజయ మార్గం సృష్టించబడుతోంది! ఈ రోజు మనం చేయగలిగినదానిని సాధించడానికి మీ అనుభవాలు మనకు చాలా సహాయపడతాయి. ఈ అనుభవం యొక్క బలంతో, దేశం ఈ యుద్ధాన్ని పూర్తిగా గెలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను, ఇది కొత్త ఆరంభానికి శ్రీకారం చుడుతోంది! మీకు ఏవైనా ఇతర సలహాలు, సూచనలు ఉంటే, ఎప్పటిలాగే నేను మీకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటాను! మీరు నాకు తప్పకుండా తెలియజేయండి. ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ రోజు హాజరయ్యారు. కాబట్టి మీరు పేర్కొన్న, మీరు శ్రద్ధ చూపిన విషయాలపై అధికారుల బృందం వెంటనే తగిన విధంగా స్పందిస్తుందని నేను మీకు భరోసా ఇస్తున్నాను. అయితే, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో, అంటే, శ్రావణం నుండి దీపావళి వరకు, మరికొన్ని వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని మనకు తెలుసు. అందువల్ల, మనం ఆ వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే, మరణాల రేటును ఒక శాతం కంటే తక్కువకు తీసుకురావాలి. 72 గంటల కంటే తక్కువ సమయంలో కాంటాక్ట్ వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా రికవరీ రేటును వేగంగా పెంచవచ్చని నా నమ్మకం. ఈ అంశాలు, ఈ మంత్రాలపై దృష్టి పెడితే, 80 శాతం కేసులు, 82 శాతం మరణాలు ఉన్న 10 రాష్ట్రాలు, ఈ పరిస్థితిని తిప్పికొట్టగలుగుతాయి. ఈ 10 రాష్ట్రాలు కలిసి భారతదేశాన్ని విజయవంతం చేయగలవు, మనం దీన్ని సాధించగలమని నాకు నమ్మకం ఉంది. మీ సమయాన్ని వెచ్చించినందుకు నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం లేకపోయినప్పటికీ, మీరు మీ సమస్యలను చాలా బాగా లేవనెత్తారు.
అనేకానేక ధన్యవాదాలు !