గౌరవ అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ,
ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్
ఉపాధ్యక్షులు భర్రాత్ జాగ్దేవ్
మాజీ అధ్యక్షులు డొనాల్డ్ రామోతార్
గయానా క్యాబినెట్ సభ్యులు
ఇండో-గయానా సంతతి సభ్యులు
సోదర సోదరీమణులు
నమస్తే..
సీతారామ్
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
స్నేహితులారా,
గయానా అత్యున్నత జాతీయ అవార్డు- ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్వీకరించడం నాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు గయానా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఇక్కడున్న 3 లక్షల మంది ఇండో-గయానా ప్రజలకూ, గయానా అభివృద్ధికి వారు అందించిన సేవలకూ లభించిన గుర్తింపు.
స్నేహితులారా,
రెండు దశాబ్దాల కిందట నేను గయానాను సందర్శించిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆ సమయంలో నాకు ఎలాంటి అధికారిక గుర్తింపూ లేదు. గయానా గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో కూడిన ఒక పర్యాటకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. అనేక నదుల సంగమంగా ఉన్న గయానాకు నేడు భారతదేశ ప్రధానమంత్రిగా హోదాలో మరోసారి వచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చినా, గయానా సోదసోదరీమణులు చూపిస్తున్న ఆత్మీయతలో ఎలాంటి మార్పూ లేదు! భారతదేశం నుంచి వచ్చిన ప్రతి భారతీయుడినీ మీరు ఆదరిస్తారు. అలాగే, వచ్చిన ప్రతిభారతీయుడిలో భారతదేశాన్నీ చూడగలరు. నా అనుభవం నాకు చెబుతున్నదిదే.
స్నేహితులారా,
ఇండియా అరైవల్ మాన్యుమెంట్ ను ఈ రోజు నేను చూశాను. రెండు వందల ఏళ్ల కిందట మీ పూర్వీకులు చేపట్టిన క్లిష్టతరమైన ప్రయాణం నేడు కళ్ల ముందు కదలాడుతుంది. వారంతా భారతదేశంలోని భిన్న ప్రాంతాల నుంచీ వచ్చారు. వారితోపాటు భిన్నమైన సంస్కృతులనూ, భాషలనూ, సంప్రదాయాలనూ వారు వెంట తెచ్చారు. కాలక్రమంలో ఇక్కడే స్థిరపడిపోయారు. నేడు… ఈ భాషలూ, కథలూ, సంప్రదాయాలూ గొప్పదైన గయానా సంస్కృతిలో అందర్భాగంగా మారిపోయాయి. ఇండో-గయానా ప్రజల ధైర్యసాహసాలకు నేను వందనం చేస్తున్నాను. మీరు స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గయానాను తీర్చిదిద్దేందుకు మీరు ఎంతో శ్రమించారు. ఎంతో శ్రమించి మీరు ఈ ఉన్నత స్థితిని సాధించారు. శ్రీ చెదీ జగన్ ఇలా అనేవారు: ‘‘ఒక వ్యక్తి ఎలా పుట్టారన్నదాన్లో ఏం లేదు. కానీ వారు ఏం సాధించారన్నదే ముఖ్యం’’. ఆయన చెప్పిన ఈ మాటలను తూచ తప్పకుండా పాటించారు. శ్రామికుల కుటుంబం నుంచి ఆయన వచ్చారు. ప్రపంచస్థాయి నేతగా ఎదిగారు. అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ఉపాధ్యక్షులు భర్రాత్ జాగ్దేవ్, మాజీ అధ్యక్షులు డొనాల్డ్ రామోతార్… వీళ్లంతా ఇండో-గయానా సంతతి వారికి ప్రతినిధులుగా ఉన్నారు. ఇండో-గయానా సంతతికి చెందిన జోసెఫ్ రుహోమాన్ తొలితరం మేధావుల్లో ఒకరు. రాంచరితార్ లల్లా- ఇండో-గయానా సంతతికి చెందిన కవుల్లో ఒకరు. షానా యార్దాన్- విఖ్యాత మహిళా కవయిత్రి. ఇండో-గయానాకు చెందిన ఇలాంటి వారెందరో విద్య, కళలు, సంగీతం, వైద్య రంగాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేశారు.
స్నేహితులారా,
మన స్నేహానికి పునాది- మనలోని సారూప్యాలే. భారత-గయానాలను కలుపుతున్న వాటిలో ముఖ్యంగా మూడింటి గురించి చెప్పాలి. సంస్కృతీ, వంటలూ, క్రికెట్! కొన్ని వారాల కిందట మీరు కూడా దీపావళి చేసుకుని ఉంటారు. కొన్ని నెలల కిందట- భారతదేశం హోళీ పండుగ చేసుకుంటే, గయానా- ఫగ్వా పండగ చేసుకుంటుంది. 500 సంవత్సరాల తర్వాత బాల రాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భంగా ఈ ఏడాది నిర్వహించిన దీపావళికి ఎంతో ప్రాముఖ్యత చేకూరింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం గయానా పుణ్య జలాలనూ, ఇటుకల్నీ పంపిన సంగతి.. భారతీయులు మర్చిపోరు. రెండు దేశాల మధ్య దూరం ఎంతున్నా… భారతదేశంతో మీకున్న సాంస్కృతిక బంధం ఎంతో బలమైనది. ఈ రోజు ఉదయం ఆర్య సమాజ్ స్మృతి చిహ్నాన్నీ, సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించినపుడు కూడా నా మనసులో ఇదే భావన. భిన్నమైన గొప్ప సంస్కృతులను కలిగి ఉన్నందుకు భారత-గయానా దేశాలు గర్వించవచ్చు. అందరికీ చోటు ఉండటం కాదు.. భిన్నత్వాన్ని కలిగి ఉండటమే ఒక సంబరం. సాంస్కృతిక భిన్నత్వం ఏ రకంగా బలమైందో మన రెండు దేశాలూ చూపిస్తాయి.
స్నేహితులారా,
భారతీయులు ఎక్కడికి వెళ్లినా వారితోపాటు ఒక ముఖ్యమైంది ఒకటి వెంట తీసుకువెళతారు. ఆహారం! ఆహారానికి సంబంధించి ఇండో-గయానా వాసుల్లో ఒక మంచి అలవాటు ఉంది. వారు వెంట తీసుకెళ్లే ఆహారంలో భారతదేశానికి చెందిన ఆహారం, దాన్లో గయానాకి చెందిన రుచులూ ఉంటాయి. ఇక్కడ దాల్-పూరీకి బాగా ఆదరణ ఉందని నాకు తెలుసును. అధ్యక్షులు అలీగారింట్లో నేను తీసుకున్న ఏడు రకాల కూరలతో కూడిన భోజనం.. ఎంతో రుచికరంగా ఉంది. దీనిని నేను ఎప్పుడూ మర్చిపోను.
స్నేహితులారా,
క్రికెట్ పై ఉన్న ప్రేమ- మన దేశాలను కలిపి ఉంచుతుంది. అది కేవలం ఒక ఆట కాదు. జాతీయతతో ముడిపడిన జీవన విధానం. గయానాలోని ప్రుడెన్స్ జాతీయ క్రికెట్ స్టేడియం.. మన స్నేహానికి గుర్తు. కన్హాయ్, కాలీచరణ్, చందేర్ పాల్… వంటి పేర్లు భారతదేశంలో బాగా తెలిసిన పేర్లు. క్లయివ్ లాయిడ్, అతని టీంని అనేక తరాలు ప్రేమిస్తాయి. ఇక్కడున్న యువ ఆటగాళ్లకు కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. నైపుణ్యం కలిగిన ఈ ఆటగాళ్లలో కొందరు ఈ రోజు మనతో ఇక్కడున్నారు. ఈ యేడు మీరు నిర్వహించిన టీ-20 ప్రపంచ కప్పు ఆటను మన అభిమానులెందరో ఆస్వాదించారు. బ్లూ టీంకు మీరు అందించిన ప్రోత్సాహం.. భారతదేశంలో కూడా ప్రతిధ్వనించింది!
స్నేహితులారా,
ఈ ఉదయపు వేళ… గయానా పార్లమెంటును ఉద్దేశించిన నేను ప్రసంగించాను. కరీబియన్ ప్రాంతంలో ప్రాచుర్యం పొందుతున్న ప్రజాస్వామ్య దేశాల్లోని ఒక ప్రజాస్వామ్య దేశంతో మాకున్న బంధాన్ని ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను ఒక అలౌకిక బంధాన్ని ప్రత్యక్షంగా చూశాను. మనకున్న సారూప్య చరిత్ర ఇద్దరినీ బలంగా కలిపి ఉంచుతోంది. పరాయిపాలనపై పోరాటంలోనూ, ప్రజాస్వామ్యాన్నీ, వైవిధ్యాన్నీ ప్రేమించడంలోనూ ఈ సారూప్యతలు ఉన్నాయి. కలలు కంటున్న భవిష్యత్తు విషయంలోనూ- మన ఆలోచనలు ఒకటే. ఎదుగుదల, అభివృద్ధి, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం వంటి విషయాల్లో చిత్తశుద్ధితోపాటు మన ఆశలూ, ఆకాంక్షలూ ఒకటే. ప్రపంచం న్యాయబద్ధంగా ఉండాలనీ, ఏక రీతిలో ఉండాలనీ నమ్ముతున్నవాళ్లం.
స్నేహితులారా,
గయానా ప్రజలు భారత దేశపు హితులని నాకు తెలుసు. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు చాలా ఆసక్తితో గమనిస్తున్నారు. గత దశాబ్దం నుంచీ ఎదుగుదల, వేగం, స్థిరత్వం విషయంలో భారత ప్రయాణం ఏకరీతిలో ప్రయాణిస్తున్నది. భారతదేశం కేవలం పదేళ్ల కాలంలో- పదో ఆర్థిక వ్యవస్థ స్థానం నుంచీ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంది. సమీప కాలంలోనే మూడో స్థానానికి కూడా చేరుకుంటాం. అతిపెద్ద అంకుర వ్యవస్థలున్న దేశాల్లో మూడో అతి పెద్ద దేశంగా భారతదేశాన్ని మా యువత నిలిపింది. ఈ కామర్స్, కృత్రిమ మేధ, వ్యవసాయం, టెక్నాలజీ ఇంకా ఎన్నింటిలోనో.. భారతదేశం ప్రపంచ కూడలిగా రూపుదిద్దుకున్నది. మేం మార్స్ గ్రహాన్నీ, చంద్రుడినీ చేరుకున్నాం. జాతీయ రహదారుల నుంచీ ఇంటర్నెట్ దారుల వరకూ, విమాన మార్గాల నుంచీ రైలు మార్గాల వరకూ… మాదైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. బలమైన సేవా రంగం మా దగ్గర ఉన్నది. తయారీ రంగంలో కూడా మేం మాదైన ముద్రను వేయబోతున్నాం. మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్న దేశాలతో పోల్చితే భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా ఉంది.
స్నేహితులారా,
భారతదేశ ప్రగతి- కేవలం స్ఫూర్తిదాయకమే కాదు, అది అందరినీ కలుపుకుని పోతున్నది. మా డిజిటల్ పరంగా ఉన్న మౌలిక సదుపాయాలు పేదవారిని కూడా బలోపేతం చేస్తున్నాయి. 50 కోట్ల బ్యాంకు అక్కౌంట్లను ప్రజలకు అందించాం. డిజిటల్ గుర్తింపుతోనూ, మొబైల్ ఫోన్లతోనూ ఈ బ్యాంకు అక్కౌంట్లను అనుసంధానం చేశాం. దీనివల్ల ప్రభుత్వ సాయం ఎకాఎకి వారి అక్కౌంట్లకే చేరుతుంది. ఆయుష్మాన్ భారత్… ప్రపంచంలోనే అతి పెద్ద భీమా పథకం. 50 కోట్ల మందికి దీని వల్ల లబ్ధి కలుగుతోంది. అవసరమైన 3 కోట్ల మందికి ఇళ్లను నిర్మించాం. కేవలం ఒక దశాబ్దంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. మా కార్యక్రమాల వల్ల పేదల్లో కూడా ఎక్కువ లబ్ది చేకూరింది మహిళలకే. దిగువ స్థాయిలో లక్షలాది మంది మహిళలు వాళ్ల కాళ్లపై వారు నిలబడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా ఉద్యోగాలు, మరెన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
స్నేహితులారా,
ఒకవైపు ఇలా అభివృద్ధి పెద్ద ఎత్తున కొనసాగిపోతుంటే, మరోవైపు మనుగడవైపు కూడా దృష్టి సారించాం. కేవలం దశాబ్ద కాలంలో మా సౌరశక్తి 30 రెట్లు పెరిగింది! మీరు ఊహించగలరా? మేం ఇప్పటికే కాలుష్యంలేని హరిత రవాణాకి మారిపోయాం. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలుపుతున్నాం. పర్యావరణ మార్పుల కోసం అంతర్జాతీయ స్థాయిలో మేం కీలక పాత్ర నిర్వహించాం. అంతర్జాతీయ సౌర సమాఖ్య, ప్రపంచ జీవఇంధనాల సమాఖ్య, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే మౌలిక సదుపాయాల సమాఖ్య… ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలను బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయ పులుల సమాఖ్యను కూడా మేం ప్రారంభించాం. దీనివల్ల గయానాలో జాగ్వార్స్ కు ఎంతో మేలు జరుగుతుంది.
స్నేహితులారా,
గత ఏడాది భారతదేశంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దినోత్సవానికి ముఖ్య అతిధిగా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. ప్రధానమంత్రి మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షులు భర్రాత్ జాగ్దేవ్ కూడా విచ్చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు మేం అనేక చర్యలు తీసుకున్నాం. ఇంధనాల నుంచి కంపెనీల వరకూ, ఆయుర్వేదం నుంచి వ్యవసాయం వరకూ, మౌలిక సదుపాయాల నుంచీ ఆవిష్కరణల వరకూ, ఆరోగ్య రంగం నుంచి మానవ వనరుల వరకూ, డేటా నుంచి అభివృద్ధి వరకూ- కలిసి పని చేయాలని ఈ రోజే నిర్ణయించుకున్నాం. విస్తృత ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుంటే మా భాగస్వామ్యానికి ఎంతో విలువ ఉంది. నిన్న జరిగిన ఇండియా- కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు కూడా అలాంటిదే. ఐరాస సభ్యులుగా బహుముఖీనతపైన ఇరువురికీ విశ్వాసం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలుగా… గ్లోబల్ సౌత్ బలం ఏమిటో మాకు తెలుసు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములుగా చేయాలనీ, వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని మేం కోరుతున్నాం. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న అభివృద్ధి, పర్యావరణం.. ప్రాధమ్యాంశాలుగా ఎంచుకున్నాం. దౌత్యం ద్వారానూ, చర్చల ద్వారానూ ప్రపంచ సంక్షోభాలను పరిష్కరించుకోవాలన్నది మా పంథా.
స్నేహితులారా,
విదేశాల్లోని భారత సంతతి ప్రజలను రాష్ట్రదూతలుగా భావిస్తాను. రాయబారి అంటే రాజదూతలని అర్థం. కానీ నాకు మాత్రం అందరూ రాష్ట్ర దూతలే. భారతీయ సంస్కృతీ సంప్రదాయ విలువలకు వారంతా రాయబారులు. తల్లి ఒడికి మించిన ప్రాపంచిక ఆనందం మరొకటి ఉండదు. మీరు… ఇక్కడున్న ఇండో-గయానా సంతితి ప్రజలు… రెండు రకాలుగా అదృష్టవంతులు. గయానా మీకు మాతృదేశమైతే, భారతమాత మీకు వారసత్వాన్ని అందించిన భూమి. భారతదేశం- అవకాశాలకు చిరునామాగా మారిన ఈ సమయంలో- మీలో ప్రతి ఒక్కరూ ఈ రెండు దేశాలనూ కలపడంలో కీలకపాత్ర పోషించవచ్చు.
స్నేహితులారా,
‘‘భారతదేశం గురించి తెలుసుకుందాం’’ అన్న క్విజ్ ను ఇప్పటికే ప్రారంభించాం. అందులో మీరంతా పాలుపంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇందులో పాల్గొనేలా గయానాలోని మీ స్నేహితులను కూడా ప్రోత్సహించండి. భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికీ, విలువలు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడానికీ ఇదో మంచి అవకాశం అవుతుంది.
స్నేహితులారా,
వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్ లో కుంభమేళా జరుగుతుంది. కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ కలిసి మీరు దీనికి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. బస్తీ లేదా గోండా ప్రాంతాల నుంచీ ఇక్కడికి ఎక్కువ మంది వచ్చారు. మళ్లీ మీరు అక్కడికి వెళ్లిరండి. అయోధ్యలోని రామ మందిరాన్ని కూడా చూసి రండి. మీకు మరో ఆహ్వానం కూడా ఉంది. అది జనవరిలో భువనేశ్వర్ లో జరిగే ప్రవాసీ భారతీయ దినోత్సవం. మీరు అక్కడికి వస్తే, పనిలో పనిగా పూరీలోని జగన్నాధస్వామి ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు. ఇన్ని జరుగుతున్నాయి… ఆహ్వానాలూ ఉన్నాయి. మీరు భారతదేశానికి విచ్చేస్తారని నేను భావిస్తున్నాను. నాపైన మీరు చూపించిన ప్రేమకూ, ఆదరానికీ మీకు మరోసారి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు...
కృతజ్ఞతలు….
నా స్నేహితుడు అలీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.