జై జగన్నాథ్,
ఈ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొంటున్న.. పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటరీ జీవనంలోనూ ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేస్తూ ఓ సజీవమైన ఉదాహరణగా నిలుస్తున్న సోదరుడు భర్తృహరి మహతాబ్ జీ, ధర్మేంద్ర ప్రధాన్ జీ, ఇతర పెద్దలు, సోదర, సోదరీమణులారా, ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారికి సంబంధించిన కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు ఏడాదిన్నర క్రితం మనమంతా ‘ఉత్కళ్ కేసరి’ హరేకృష్ణ మహతాబ్ గారి 120వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నాం, వారి ఆలోచనల స్ఫూర్తిని మనలో నింపుకున్నాం. ఇవాళ వారి ప్రసిద్ధ పుస్తకం ‘ఒడిశా ఇతిహాస్’ హిందీ సంకలనాన్ని జాతికి అంకితం చేసుకుంటున్నాం. ఒడిశాలోని వైవిధ్యమైన చరిత్ర దేశప్రజలందరికీ చేరాల్సిన ఆవశ్యకత ఉంది. ఒడియా, ఇంగ్లీషు తర్వాత హిందీలో ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. ఈ ప్రయత్నానికి గాను సోదరులు భర్తృహరి మహతాబ్ గారికి, హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ వారికి, మరీ ముఖ్యంగా శంకర్‌లాల్ పురోహిత్ గారికి ధన్యవాదాలతోపాటు హార్దిక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
భర్తృహరి గారు ఈ పుస్తకావిష్కరణ కోసం అడగడానికి వచ్చినపుడు నాకోసం ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు. నేను పూర్తిగా చదవలేకపోయాను కానీ.. పైపైన అంశాలను చదువుతూ వెళ్తున్నప్పుడు ఈ పుస్తకం హిందీ అనువాదంలో ఎన్నో యాదృచ్ఛికమైన విషయాలున్నాయి. భారతదేశం ‘ఆజాదీకీ అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న సందర్భంలో ఈ పుస్తకం విడుదలవడం, హరేకృష్ణ మహతాబ్ గారు కాలేజీ విద్యాభాసాన్ని పూర్తిచేసుకుని స్వాతంత్ర్య సంగ్రామంలోకి వచ్చిన సమయంలో జరిగిన ఘటనలకు కూడా వందేళ్లు పూర్తవుతుండటం యాదృచ్ఛికమే. మహాత్మాగాంధీ దండి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినపుడు.. హరేకృష్ణ మహతాబ్ గారు ఆ ఉద్యమాన్ని ఒడిశాలో ముందుండి నడిపించారు. అంతేకాదు 2023 నాటికి ‘ఒడిశా ఇతిహాస్’ తొలి ప్రచురణకు 75 ఏళ్లు పూర్తవుతుండటం కూడా యాదృచ్ఛికమే. ఏదైనా సిద్ధాంతం, ఆధారంగా దేశసేవ, సమాజ సేవ ప్రారంభించినపుడు ఇలాంటి యాదృచ్ఛికాలెన్నో మనకు కనిపిస్తాయి.
మిత్రులారా,
ఈ పుస్తకం పీఠికలో భర్తృహరి గారు రాస్తూ.. ‘డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ గారు చరిత్ర సృష్టించిన వ్యక్తి. చరిత్ర నిర్మాణాన్ని దగ్గరుంచి చూసిన వ్యక్తి కూడా’ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి చారిత్రక వ్యక్తిత్వాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి మహాపురుషులు చరిత్రలో కీలకమైన అధ్యాయంగా మిగిలిపోతారు. మహతాబ్ గారు స్వాతంత్ర్య సంగ్రామంలో తన జీవితాన్ని త్యాగం చేశారు. తన యవ్వనాన్ని అర్పించారు. జైలు జీవితం గడిపారు. అయితే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో స్వాతంత్ర్య సంగ్రామంలో తలమునకలై ఉన్నా సమాజసేవ విషయంలోనూ వెనక్కు తగ్గలేదు. కుల,మత, జాతి వివక్షలకు వ్యతిరేకంగా గళం విప్పారు. తమ పూర్వీకుల ఆలయంలో అందరికీ ప్రవేశం కల్పించారు. నేటికీ ఆ ఆలయం, వారు నెలకొల్పిన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఓ చక్కటి ఉదాహరణగా నిలిచిపోయింది. నాటి పరిస్థితుల్లో వారు తీసుకున్న బలమైన, స్పష్టమైన నిర్ణయాన్ని నేడు మనం ఊహించలేం కూడా. అదెంత పెద్ద సాహసమో అంచనా కూడా వేయలేము. వారి కుటుంబంలోనూ ఇదే సంస్కృతిని తీసుకొచ్చారు. స్వాతంత్ర్యానంతరం కూడా ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒడిశాకు బంగారు భవిష్యత్తు ఉండేందుకు ఎంతగానో కృషిచేశారు. పట్టణాల ఆధునీకరణ, నౌకాశ్రయాల ఆధునీకరణ, స్టీల్ ప్లాంట్ల నిర్మాణం.. వంటి ఎన్నో మహత్కార్యాల్లో వారి క్రియాశీల పాత్ర చిరస్మరణీయం.
మిత్రులారా,
అధికారాన్ని చేపట్టినప్పటికీ తనను తాను స్వాతంత్ర్య సమరయోధుడిగానే భావించేవారు. జీవితాంతం అదే స్ఫూర్తితో నడుచుకున్నారు. ఏ పార్టీనుంచయితే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారో.. ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ తీరుపై స్పష్టమైన, సూటి విమర్శలు చేశారు. ఈ విషయం నేటి ప్రజాప్రతినిధులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం కల్పించేందుకు జైలుకెళ్లడంతోపాటు.. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కూడా జైలుకెళ్లిన అరుదైన వ్యక్తి వారు. ఎమర్జెన్సీ పూర్తయిన తర్వాత వారిని కలిసేందుకు ఒడిశాకు వెళ్లడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతకుముందు వారితో నాకు పరిచయం లేదు. అయినా వారు నాకు సమయాన్నిచ్చారు. నాకు బాగా గుర్తుంది, మధ్యాహ్న భోజనానికి ముందే సమావేశానికి అనుమతిచ్చారు. సహజంగా భోజనానికి ముందే సమయం ఇస్తే.. ఆలోపే మాట్లాడుకోవడం పూర్తవుతుంది, మనం వెళ్లిపోవచ్చు. కానీ నాకు బాగా గుర్తుంది. వారితో జరిగిన ఆనాటి సమావేశం దాదాపు రెండు, రెండున్నర గంటలపాటు కొనసాగింది. వారు భోజనానికి కూడా వెళ్లలేదు. చాలాసమయం పాటు చాలా విషయాలను నాతో పంచుకున్నారు. ఎందుకంటే నేను ఓ వ్యక్తి గురించి పరిశోధన చేస్తూ.. మరింత సమాచారం కోసం వారిని కలిశాను. మామూలుగా అయితే.. పెద్ద కుటుంబాల్లో వారి పిల్లలను చూస్తే కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. వీళ్లెందుకు ఇలా చేస్తుంటారని అనిపిస్తుంది. కానీ హరేకృష్ణ గారిని చూశాక అలా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే హరేకృష్ణ మహతాబ్ గారు తన ఆలోచనలు, సిద్ధాంతాలు, సంస్కృతి సంప్రదాయాలను కుటుంబంలోని ప్రతి ఒక్కరూ పాటించేలా చొరవతీసుకున్నారు. వాటి ఫలితమే మనం భర్తృహరి మహతాబ్ గారి వంటి చక్కటి మిత్రుల సాంగత్యం.
మిత్రులారా,
ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనూ.. రాష్ట్ర భవిష్యత్తుతోపాటు రాష్ట్ర చరిత్ర గురించి కూడా వారు ఆలోచిస్తూనే ఉన్నారు. భారతదేశ చరిత్ర కాంగ్రెస్ కోసం కూడా వారు కీలకంగా పనిచేశారు. ఒడిశా చరిత్రను కూడా జాతీయస్థాయికి తీసుకొచ్చారు. ఒడిశాలో మ్యూజియం అయినా, ఆర్కైవ్స్ (పురాతన దస్తావేజులు) అయినా, పురాతత్వ విభాగమైనా.. ఇవన్నీ శ్రీ మహతాబ్ గారి చారిత్రక దృష్టికోణంతోనే సాధ్యమయ్యాయి.
మిత్రులారా,
మహతాబ్ గారు రాసి ‘ఒడిశా చరిత్ర’ను చదివితే మీకు ఒడిశాకు సంబంధించిన విషయాలన్నీ అవగతం అవుతాయని చాలా మంది నాకు చెప్పారు. ఇది వాస్తవం కూడా. చరిత్ర కేవలం గతానికి సంబంధించిన ఓ అధ్యాయం మాత్రమే కాదు.. భవిష్యత్తుకు అద్దం పట్టేది కూడా. ఈ ఆలోచనను దృష్టిలో ఉంచుకునే నేడు దేశవ్యాప్తంగా ‘ఆజాదీకీ అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహిస్తున్నాం. మన చరిత్రను మరోసారి పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాం. మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, వారి బలిదానాల కథలను పునరుజ్జీవింప చేస్తున్నాం. తద్వారా మన యువత ఈ వీరగాథలను తెలుసుకోవడంతోపాటు వాటిలోని స్ఫూర్తిని పొంది సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి, ఏదైనా సాధించగలమనే లక్ష్యంతో, సంకల్పంతో ముందడుగేయాలనేది మా ఉద్దేశం. స్వాతంత్ర్య పోరాటంతో అనుసంధానమైన ఎన్నో వాస్తవగాథలున్నాయి. అవన్నీ సరిగ్గా ప్రజల ముందుకు రాలేదు. ఇప్పుడు భర్తృహరిగారు చెప్పినట్లు భారతీయ చరిత్ర రాజమందిరాల చరిత్ర కాదు. ప్రజలందరి జీవితాల్లో గూడుకట్టుకున్న చరిత్ర అది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్నదే మన చరిత్ర. వేల ఏళ్ల మన ఘనమైన వారసత్వ సంపదను ఇకపైనా అదే స్ఫూర్తితో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మనకు ప్రేరణనిచ్చేది చరిత్ర. వలసవాద, బాహ్య ప్రేరిత ఆలోచనల కారణంగా కేవలం రాజమందిరాలు, వారి చుట్టుపక్కల జరిగిన ఘటనలనే చరిత్రగా మనం భావిస్తున్నాం. మొత్తం రామాయణం, మహాభారతం చూడండి. ఇందులో 80శాతం సామాన్య మానవుల జీవినానికి సంబంధించినదే కదా. అందుకే మన చరిత్ర.. సామాన్య ప్రజల జీవనం కేంద్రంగానే కొనసాగింది. నేటి యువత చరిత్రలోని అలాంటి ఘట్టాలపై అధ్యయనం చేస్తున్నారు. మరింతగా ఈ అంశాలపై దృష్టిపెట్టాలి కూడా. ఈ అధ్యయనాన్ని భవిష్యత్ తరాలకు అందించే పనిచేయాలి. ఈ దిశగా పని జరుగుతోంది కూడా. ఈ ప్రయత్నాల ద్వారా ఎన్ని స్ఫూర్తిమంతమైన గాథలు తెరపైకి వస్తాయి? దేశంలోని వైవిధ్యభరితమైన, రంగులమయమైన చరిత్రను మనం అర్థం చేసుకుంటామనేది చూడాలి.
మిత్రులారా,
హరేకృష్ణ గారు స్వాతంత్రోద్యమంలోని ఎన్నో కీలకమైన ఘట్టాలను మనకు పరిచయం చేశారు. దీని ద్వారా ఒడిశాకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పాయిక్ పోరాటం, జంగామ్ ఆందోళన, లారజ్ బొగ్గు ఉద్యమం, సంబల్‌పూర్ సంగ్రామం వరకు ఎన్నో సందర్భాల్లో ఒడిశా ప్రజలు.. వలసవాద పాలకులతో జరిపిన పోరాటాలను ఎప్పటికీ స్ఫూర్తిమంతంగానే ఉంటాయి. ఈ పోరాటాలకు సంబంధించి ఎందరోమంది నాయకులను బ్రిటిషర్లు జైల్లో వేశారు, చిత్రహింసలు పెట్టారు, ఎందరోమంది బలిదానాలు చేశారు. కానీ ఏ ఒక్కరిలోనూ స్వాతంత్ర్యకాంక్ష తగ్గలేదు. సంబల్‌పూర్ సంగ్రామంలో విప్లవయోధులైన సురేంద్ర సాయ్ నేటికీ మనందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. మహాత్మాగాంధీ బ్రిటిష్ పాలకులపై తుదిసమరాన్ని ప్రారంభించినపుడు ఒడిశా ప్రజలు అందులో కీలకమైన పాత్ర పోషించారు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాల్లోనూ, ఉప్పుసత్యాగ్రహంలో పండిత్ గోపబంధు, ఆచార్య హరిహర్, హరికృష్ణ మహతాబ్ వంటి నాయకులు ఒడిశాలో ప్రజలకు నాయకత్వం వహించారు. రమాదేవి, కోకిలాదేవి, మాలతీ దేవి, రాణీ భాగ్యవతి వంటి ఎందరోమంది తల్లులు, సోదరీమణులు స్వాతంత్రోద్యమానికి సరికొత్త దిశను చూపించారు. ఇదే విధంగా, ఒడిశాకు చెందిన మన ఆదివాసీల పాత్ర ఎవరు మరిచిపోగలరు. మన ఆదివాసీలు తమ శౌర్య పరాక్రమాలు, దేశభక్తితో విదేశీపాలకులకు కంటిలో నలుసుగా మారారు. స్వాతంత్రోద్యమంలో ఆదివాసీలు పోషించిన పాత్రను దేశానికి మావంతుగా తెలియజేస్తున్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో వారి భవిష్యత్ తరాలకోసం ఓ మ్యూజియాన్ని నిర్మించాలి. లెక్కలేనన్ని కథలు, ఎన్నో త్యాగాలు, బలిదానాలు, వారు చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి వాటిని ఒకచోట చేర్చాల్సిన అవసరం ఉంది. వారి ప్రాంతాల్లో కాలుపెట్టేందుకు ప్రయత్నించి ఆంగ్లేయులకు ఆ అవకాశాన్ని ఇచ్చేవారే కాదు. వారు అనుసరించిన వ్యూహాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలి. ఆదివాసీల నేతృత్వంలో జరిగిన పోరాటాల గురించి చరిత్రలోనూ సరిగా పొందుపరచలేదు. వారి విషయంలో చాలా అన్యాయం జరిగింది. వారి త్యాగాలకు సంబంధించి ఎన్నో వీరగాథలున్నాయి. అవన్నీ ఒకేసారి తెరపైకి రావు. మరింత అధ్యయనం, ప్రయత్నం ద్వారా వాటన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలి. ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లాలన్న ఉద్యమంలో ఆదివాసీ నాయకుడు లక్ష్మణ్ నాయక్ గారిని కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆంగ్లేయులు ఆయన్ను ఉరితీసినా.. స్వాతంత్ర్య కాంక్షను మనస్సులో నింపుకుని ఆయన భరతమాత ఒడిలో నిద్రపోయారు,
మిత్రులారా,
స్వాతంత్ర్య చరిత్రతోపాటు అమృత్ మహోత్సవ్ లోని ఓ కీలకమైన అంశం.. భారతీయ సాంస్కృతిక వైవిధ్యత. ఒడిశా మన భారతీయ సంస్కృతికి సంపూర్ణ చిత్రపటంలా నిలుస్తుంది. ఇక్కడి కళలు, ఆధ్యాత్మికత, ఇక్కడి ఆదివాసీ సంస్కృతి.. దేశ వారసత్వానికి నిదర్శనం. యావద్భారతానికి వీటి గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా కొత్త తరానికి దీని గురించి తెలియాలి. మనం ఒడిశా సంస్కృతిని ఎంత దగ్గరగా తెలుసుకుంటామో, ప్రపంచం ముందుకు తీసుకొస్తామో, అది మానవత్వాన్ని అర్థం చేసుకునేందుకు మనకెన్నో కొత్త విషయాలను తెలియజేస్తుంది. హరేకృష్ణ గారు తన పుస్తంలో ఒడిశా ఆత్మవిశ్వాసాన్ని, కళలను, వాస్తుశాస్త్రాన్ని ఇలా ఎన్నో అంశాలను స్పృశించారు. మన యువకులకు ఈ దిశగా అధ్యయనం చేసేందుకు సరికొత్త దారిని చూపించారు.
మిత్రులారా,
ఒడిశా యొక్క గతాన్ని అన్వేషిస్తే.. అందులో ఈ ప్రాంత చారిత్రక సామర్థ్యాన్ని, యావత్ భారతదేశాన్ని కూడా మనం చూడవచ్చు. చరిత్రలో పేర్కొన్న ఈ సామర్థ్యం.. నేటి, భవిష్యత్తు అవకాశాలతో ముడిపడి ఉంది. మన భవిష్యత్ కు మార్గనిర్దేశనం లభిస్తుంది. ఒడిశా కున్న విస్తారమైన సముద్ర తీరప్రాంత సరిహద్దు.. ఒకప్పుడు భారతదేశపు పెద్ద ఓడరేవులతో అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాలతో చేసిన వాణిజ్యం కారణంగా ఒడిశాతోపాటు భారతదేశానికి కూడా ఎంతో మేలుచేసింది. ఒడిశాలోని కోణార్క్ ఆలయంలో జిరాఫీల చిత్రాల ప్రకారం.. ఒడిశా వ్యాపారవేత్తలు ఆఫ్రికా వరకు వ్యాపారం చేసేవారని.. కొంతమంది చరిత్రకారుల పరిశోధనల్లో వెల్లడైంది. ఆ సమయంలో వాట్సాప్ లేదు. పెద్ద సంఖ్యలో ఒడిశా ప్రజలు వ్యాపారం కోసం ఇతర దేశాలకు వెళ్లి నివసించేవారు, వారిని ‘దరియా పారీ ఒడియా’ (సరిహద్దు దాటిన ఒడియా) అని పిలిచేవారు. ఒరియాతో సారూప్యత ఉన్న లిపులను చాలా దేశాలలో గమనించవచ్చు. ఈ సముద్ర వాణిజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి సామ్రాట్ అశోకుడు.. కళింగపై దాడి చేశాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ దాడి అశోక చక్రవర్తిని ‘ధమ్మ అశోకుడి’గా మార్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే, ఒడిశా వాణిజ్య కేంద్రంగా అదే సమయంలో భారతదేశపు బౌద్ధ సంస్కృతి కేంద్రంగా నిలిచింది.
మిత్రులారా,
ఆ కాలంలో మనకున్న సహజ వనరులను.. మనకు కూడా ఈ ప్రకృతి అందించింది. మన వద్ద నేటికీ.. అదే స్థాయిలో విస్తృతమైన సముద్ర శ్రేణి, మానవ వనరులు, వ్యాపార సామర్థ్యం ఉన్నాయి. దీనికితోడుగా మనవద్ద ఈ రోజు ఆధునిక విజ్ఞాన సామర్థ్యం ఉంది. ఆ పురాతన అనుభవాలను నేటి ఆధునిక అవకాశాలను ఒకచోట చేరిస్తే.. ఒడిశా అభివృద్ధి సరికొత్త దశకు చేరుకుంటుంది. ఈరోజు దేశం ఈ దిశగా ఎంతో కృషిచేస్తోంది. మేం కూడా ఈ ప్రయత్నాలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను ప్రధాని పీఠాన్ని అధిరోహించకముందు.. అంటే అప్పటికి ఎన్నికలకు సంబంధించిన నిర్ణయమేదీ వెలువడలేదు. 2013లో పార్టీ కార్యక్రమంలో నేను చేసిన ఓ ప్రసంగంలో.. భారతదేశ భవిష్యత్తును నేనెలా చూస్తున్నానో వివరించాను. అందులో నేను మాట్లాడుతూ.. ఒకవేళ భారతదేశంలో సమతుల్యమైన అభివృద్ధి జరకగపోతే.. మన శక్తిసామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకోలేమని చెప్పాను. ఒకవేళ తూర్పు భారతాన్ని, పశ్చిమభారతాన్ని స్పష్టంగా గమనిస్తే.. పశ్చిమంలో జరిగిన అభివృద్ధి తూర్పు ప్రాంతంలో కనిపించదు. ఆర్థిక కార్యకలాపాల్లోని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. తూర్పుభారతంలో కిందినుంచి పై వరకు సహజవనరులు ఎన్నో ఉన్నాయి. క్రియాశీలకమైన, సృజనాత్మకమైన వ్యక్తులున్నారు. తూర్పున ఒడియా అయినా, బీహార్, అస్సాం, ఈశాన్య భారతమైనా ప్రతిచోటా చక్కటి మానవనరులున్నాయి. ఇంతటి అద్భుతమైన శక్తికి ఇవన్నీ కేంద్రాలుగా ఉన్నాయి. ఒక్క ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా యావద్భారతం అభివృద్ధి చెందుతుంది. అంతటి శక్తిసామర్థ్యాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మీరు గత ఆరేళ్లుగా పరిస్థితులను విశ్లేషిస్తే.. తూర్పు భారతదేశం అభివృద్ధికి సంబంధించి మరీ ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన విషయలో ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గమనించవచ్చు. సహజసిద్ధమైన కారణాలను విశ్లేషిస్తే.. తూర్పు, పశ్చిమ భారతదేశాల మధ్య ఉన్న 19-20శాతం తేడాను చాలా స్పష్టంగా గమనించవచ్చు. భారతదేశపు స్వర్ణయుగంలో తూర్పుభారతమే.. యావద్ దేశానికి నేతృత్వం వహించిన మాట వాస్తవమే కదా. ఒడిశా అయినా, బిహార్ అయినా, కోల్ కతా అయినా ఈ ప్రాంతాలు ముందుండి దేశాన్ని నడిపించాయి. స్వర్ణయుగం అంటే ఇక్కడున్న అద్భుతమైన శక్తిసామర్థ్యాలకు ప్రతీక. ఆ సామర్థ్యాన్ని పున:జాగృతం చేసి మళ్లీ భారతదేశాన్ని ఉన్నతస్థానానికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మనమంతా గుర్తించాలి.
మిత్రులారా,
వ్యాపారం, పరిశ్రమలకోసం మౌలికవసతులు అత్యంత కీలకం. ఇవాళ ఒడిశాలో వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు సిద్ధమవుతున్నాయి. తీరప్రాంతంలో.. నౌకాశ్రయాలను అనుసంధానం చేసే కోస్టల్ హైవేల నిర్మాణం వేగవంతంగా సాగుతోంది. గత ఆరేడు ఏళ్లలో రైల్వే లైన్లను ఏర్పాటుచేసే పనికూడా వేగంగా సాగుతోంది. సాగర్ మాల ప్రాజెక్టులో భాగంగా కూడా వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. మౌలికవసతుల కల్పన తర్వాత అత్యంత కీలకమైన రంగం పరిశ్రమలు. ఈ దిశగా కంపెనీలు, పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు సాగుతున్నాయి. ఒడిశాలోని చమురు, సహజవాయువు రంగంతో అనుసంధానమైన పరిశ్రమలకోసం కూడా వేలకోట్ల పెట్టుబడులు వచ్చేశాయి. ఆయిల్ రిఫైనరీలు, ఇథనాలు బయో రిఫైనరీలకు సంబంధించిన కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇదే విధంగా స్టీల్ పరిశ్రమను మరింత విస్తరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఒడిశాలో వేలకోట్ల పెట్టుబడులు పెట్టారు. ఒడిశాలో వనరుల సమృద్ధితోపాటు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయి. నీలి విప్లవం ద్వారా కూడా వనరుల కల్పనకూడా ఒడిశా అభివృద్ధికి కేంద్ర బిందువు కానుంది. తద్వారా ఇక్కడి మత్స్యకారులు జీవన ప్రమాణాలు మరింత పెరుగుతాయి.
మిత్రులారా,
రానున్న రోజుల్లో ఈ అవకాశాలు మరింత విస్తృతం అయ్యేందుకు నైపుణ్యాభివృద్ధి కూడా చాలా అవసరం. ఒడిశా యువకులకు నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా అవకాశఆలు ఎన్నో పెరుగుతాయి. ఇందుకోసం ఐఐటీ భువనేశ్వర్, ఐఐఎస్ఈఆర్ బర్హంపూర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్ వంటి సంస్థలు ప్రారంభం కానున్నాయి. ఇదే ఏడాది జనవరిలో.. ఒడిశాలో ఐఐఎం సంభల్‌పూర్‌కు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. ఈ సంస్థ రానున్న రోజుల్లో ఒడిశా భవిష్యత్ నిర్మాణానికి కేంద్రం కానుంది. ఇక్కడ జరగాల్సిన అభివృద్ధికి కొత్త దిశను చూపుతుంది.
మిత్రులారా,
ఉత్కళ్ మణి గోపబంధు దాస్ గారు ‘ జగత్ సర్‌సే భారత్ కనల్, తా మధే పుణ్య్ నీలాచల్’ అని రాశారు. నేడు భారతదేశం స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు జరుపుకుంటున్న సందర్భంలో మనం ఈ సంకల్పాన్ని మరోసారి సాకారం చేయాల్సిన అవసరాన్ని మదిలో నింపుకోవాలి. ఒడిశా కాకుండా.. కోల్‌కతా తర్వాత సూరత్ లో ఒడియాను ఎక్కువగా మాట్లాడతారు. దీనికి సంబంధించి నా దగ్గర సరైన లెక్కలు లేకపోయినా.. ఇది వాస్తవం. అందుకే సహజంగానే నాకు ఒడిశాతో మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి సరళమైన, సాదాసీదా జీవనాన్ని గడుపుతూనే ఆనందంగా ఉన్న పరిస్థితులను చాలా దగ్గర్నుంచి చూశాను. వారి జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకుల్లేవు. వారు శాంతిసామరస్యాలన ప్రేమించేవారు. నేను తూర్పుభారతం గురించి మాట్లాడేటప్పుడు ముంబై గురించిన చర్చ జరుగుతుంది. స్వాతంత్ర్యానికి ముందు కరాచీ, లాహోర్ గురించిన చర్చ జరిగేది. ఇప్పుడు మెల్లి-మెల్లిగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై గురించి మాట్లాడుతున్నారు. దేశ ప్రగతిలో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన కోల్‌కతా గురించి కూడా తరచుగా ప్రస్తావిస్తుంటారు. ‘వైబ్రెంట్ కోల్‌కతా’ పేరుతో సరైన అభివృద్ధి జరిగి ఉండే ఒక్క బెంగాల్‌కే కాదు యావద్ తూర్పు భారతానికి అదొక అభివృద్ధి కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ ఆ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. కోల్‌కతా మరోసారి వైబ్రంట్ గా మారాలనేదిశగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి. కోల్‌కతా మరోసారి కీలకమైన శక్తిగా ఎదగాలనే దిశగా పనిచేస్తున్నాం. ఏ పనిచేసినా దేశాభివృద్ధి జరగాలనేదే మా సంకల్పానికి బలాన్నిస్తుంది. శ్రీ మహతాబ్ గారి పనులను, ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సరైన సమయమిదని.. ‘హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్’ సభ్యులందరినీ కోరుతున్నాను.
ఒడిశా చరిత్రను, ఇక్కడి సంస్కృతిని ఇక్కడి వాస్తువైభవాన్ని వారు దేశ, విదేశాలకు అందించాలి. అమృత్ మహోత్సవంలో దేశమంతా ఏకమై ముందుకు సాగుదాం. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. శ్రీ మహతాబ్ గారు చూపిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అమృత్ మహోత్సవ్ ఉద్యమం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్దాం. ఈ సంకల్పంతో.. మరోసారి మహతాబ్ గారి కుటుంబసభ్యులతో కలిసే అవకాశం లభించినందుకు ఆనందిస్తూ.. మహతాబ్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులు భర్తృహరి గారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరి ముందుకు వచ్చి నా ఆలోచనలు పంచుకునే అవకాశం లభించింది. ఇందుకుగానూ, చారిత్రకమైన ఘటనలతో ముడిపడిన అంశాలను గుర్తుచేసుకునే అవకాశం లభించినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా గౌరవపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.
అనేకానేద ధన్యవాదములు!