శుభ సాయంత్రం!
స్టట్ గార్ట్ న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన అందరికీ నమస్కారం!
మంత్రి విన్‌ఫ్రైడ్, నా మంత్రివర్గ సహచరుడు జ్యోతిరాదిత్య సిందియా, ఈ సదస్సుకు హాజరైన సోదరీ సోదరులారా!
భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఓ సరికొత్త అధ్యాయం నేడు మొదలవుతోంది. జర్మనీలోని స్టట్ గార్ట్ వీఎఫ్ బీ, బాడెన్-వుర్టెంబర్గ్ సహకారంతో భారత్ కు చెందిన టీవీ 9 ఈ సదస్సును నిర్వహించింది. నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ కృషి చేస్తుండడం సంతోషాన్నిస్తోంది. భారత్, జర్మనీ ప్రజల మధ్య పరస్పర అవగాహన కోసం ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుంది. న్యూస్-9 అనే ఆంగ్ల వార్తా ఛానెల్‌ను కూడా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.
మిత్రులారా,
‘భారత్-జర్మనీ: సుస్థిర వృద్ధి కోసం ప్రణాళిక’ అనే ఈ సదస్సు ఇతివృత్తం ఇరుదేశాల మధ్య బాధ్యతాయుతమైన భాగస్వామ్యానికి ప్రతీక. మీరు రెండు రోజులుగా ఆర్థిక అంశాలు మాత్రమే కాకుండా క్రీడలు, వినోదానికి సంబంధించిన అంశాలపై సానుకూలంగా చర్చించారు.
మిత్రులారా,
భౌగోళిక రాజకీయ సంబంధాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడుల దృష్ట్యా భారత్ కు ఐరోపా కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. మాకు అతిముఖ్యమైన భాగస్వాములలో జర్మనీ ఒకటి. 2024లో భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 వసంతాలు పూర్తవుతుండడం చారిత్రక సందర్బం.. ఈ భాగస్వామ్యంలో ఇదో మైలురాయి. గత నెలలోనే చాన్సలర్ స్కాల్జ్ మూడో సారి భారత్ ను సందర్శించారు. 12 సంవత్సరాల్లో మొదటిసారిగా జర్మన్ వ్యవహారాల ఆసియా-పసిఫిక్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు సందర్భంగా ఫోకస్ ఆన్ ఇండియా పత్రాన్నీ, భారత్ కోసం నిపుణులైన కార్మికుల వ్యూహాన్నీ జర్మనీ విడుదల చేసింది. ఇది ఓ దేశం కోసం నిర్దిష్టంగా జర్మనీ రూపొందించిన తొలి వ్యూహం.
మిత్రులారా,
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. మన సాంస్కృతిక, మేధో సంబంధాలు శతాబ్దాల నాటివి. ఐరోపాలో తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని ఓ జర్మన్ రచించారు. జర్మన్ వర్తకుల ద్వారా తమిళం, తెలుగు భాషల్లో పుస్తకాలను ప్రచురించిన తొలి ఐరోపా దేశంగా జర్మనీ నిలిచింది. నేడు దాదాపు 3 లక్షల మంది భారతీయులు జర్మనీలో నివసిస్తున్నారు. దాదాపు 50 వేల మంది భారతీయ విద్యార్థులు జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో నమోదు చేసుకున్నారు. అక్కడి విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. భారత్-జర్మనీ సంబంధాలలోని మరో కోణం భారత్‌లో కనిపిస్తుంది. 1,800కు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో నడుస్తున్నాయి. మూడు నాలుగేళ్ల కాలంలో దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 34 బిలియన్ డాలర్లుగా ఉంది. మున్ముందు ఇది మరింత వృద్ధి చెందుతుందన్న విశ్వాసం నాకుంది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్, జర్మనీ మధ్య స్థిరంగా బలపడుతున్న భాగస్వామ్యం నాకీ నమ్మకాన్ని కలిగించింది.
మిత్రులారా,
నేడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ వృద్ధి నేపథ్యంలో ప్రతి దేశమూ భారత్ తో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. జర్మనీ రూపొందించిన ఫోకస్ ఆన్ ఇండియా పత్రం ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. భారత వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రపంచం గుర్తిస్తోందనడాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. దశాబ్ధ కాలంగా భారత్ అనుసరించిన ‘సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన’ మంత్రమే భారత్ పై ప్రపంచ దేశాల ఈ దృక్పథానికి కారణం. 21వ శతాబ్దపు వేగవంతమైన వృద్ధికి సిద్ధమయ్యేలా అన్ని రంగాలలో కొత్త విధానాలను భారత్ అమలు చేసింది. అకారణ జాప్యాన్ని మేం తొలగించాం, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచాం, వివిధ అంశాల్లో 30 వేలకు పైగా నిబంధనలను తగ్గించాం. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసి అభివృద్ధి కోసం అందుబాటు వ్యయంతో, సకాలంలో మూలధనాన్ని భారత్ అందించింది. సమర్థవంతమైన జీఎస్టీ విధానంతో పన్ను వ్యవస్థను మేం సులభతరం చేశాం. తద్వారా పురోగామి, స్థిరమైన విధాన రూపకల్పన వాతావరణాన్ని సృష్టించి వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించాం. వికసిత భారత దివ్య ప్రాసాద నిర్మాణం కోసం భారత్ నేడు బలమైన పునాదులు వేసింది. ఈ ప్రస్థానంలో జర్మనీ విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుంది.
మిత్రులారా,
జర్మనీ అభివృద్ధి ప్రస్థానంలో తయారీ, ఇంజినీరింగ్ రంగాలు కీలకమైనవి. భారత్ కూడా అంతర్జాతీయంగా ప్రధాన తయారీ రంగ కేంద్రంగా మారుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో చేరిన తయారీదారులను ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకాలతో ప్రోత్సహిస్తున్నాం. మా తయారీ రంగంలో గణనీయమైన పరివర్తన రావడం సంతోషాన్నిస్తోంది. నేడు మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటి. భారత్ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. ఉక్కు, సిమెంటు విషయాల్లో రెండో అతిపెద్ద దేశంగా ఉంది. నాలుగు చక్రాల వాహనాల విషయంలో నాలుగో అతిపెద్ద దేశంగా ఉంది. భారత సెమీకండక్టర్ పరిశ్రమ కూడా అంతర్జాతీయంగా సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రవాణా సంబంధిత వ్యయాలను తగ్గించుకోవడం, వాణిజ్య నిర్వహణను సులభతరం చేయడం, స్థిరమైన పాలన లక్ష్యంగా రూపొందించిన స్థిరమైన విధానాల ద్వారా ఈ వృద్ధి సాధ్యపడింది. ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే భౌతిక, సామాజిక, సాంకేతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఈ రంగాలన్నింటిలో భారత్ పురోగమిస్తోంది. డిజిటల్ సాంకేతికతపై మన పెట్టుబడులు, అందులో ఆవిష్కరణల ప్రభావాన్ని నేడు ప్రపంచం గమనిస్తోంది. ప్రపంచంలో అత్యంత విశిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్న దేశం భారత్.
మిత్రులారా,
నేడు జర్మనీకి చెందిన అనేక కంపెనీలు భారత్ లో ఉన్నాయి. తమ పెట్టుబడులను విస్తరించాల్సిందిగా వారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా భారత్‌లో ప్రవేశించని జర్మన్ కంపెనీలను కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఢిల్లీలో జరిగిన జర్మనీ కంపెనీల ఆసియా-పసిఫిక్ సదస్సు సందర్భంగా నేను చెప్పినట్టు.. భారత్ తో భాగస్వామ్యానికి ఇది సరైన తరుణం. జర్మనీ నిర్దిష్టతతో కూడిన భారత క్రియాశీలత, భారత ఆవిష్కరణలతో జతకట్టిన జర్మనీ ఇంజినీరింగ్ — ఈ సమ్మేళనం మన సమష్టి లక్ష్యం కావాలి. ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటిగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మేము ఎల్లప్పుడూ ఆహ్వానించాం, దేశ ప్రస్థానంలో వారిని భాగం చేశాం. ప్రపంచానికి సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో మాతో చేతులు కలపాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ధన్యవాదాలు!
ధన్యవాదాలు!