నమస్కార్
ఎలా ఉన్నారు? గుజరాత్‌లో చలి తీవ్రత ఉందా? లేదా? గుజరాత్ గవర్నర్ ఆచార్య దేబవ్రత్ జీ, ముఖ్యమంత్రి శ్రీమాన్ విజయ్ రూపానీజీ, శాసనసభ స్పీకర్ శ్రీ రాజేంద్ర త్రివేదీ జీ, కేంద్ర వైద్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జీ, డిప్యూటీ సీఎం భాయీ నితిన్ పటేల్ జీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీమాన్ అశ్విని చౌబే జీ, మన్‌సుఖ్ భాయ్ మాండవీయా జీ, పురుషోత్తమ్ రూపాలాజీ, గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులు శ్రీ భూపేంద్రసింగ్ చూడసమాజీ, శ్రీ కిశోర్ కనానీ జీ, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర మహానుభావులు
సోదర, సోదరీమణులారా,
కొత్త సంవత్సరం వస్తోంది. ఈ సందర్భంగా దేశ వైద్య మౌలికవసతులను మరింత బలోపేతం చేసుకునేందుకు మరో కేంద్రాన్ని జోడిస్తోంది. రాజ్‌కోట్‌లో ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్)కు శంకుస్థాపన చేయడం ద్వారా గుజరాత్‌తోపాటు దేశంలోని వైద్య, వైద్యవిద్య నెట్‌వర్క్ కు సరికొత్త శక్తి అందనుంది. సోదర, సోదరీమణులారా, 2020 సంవత్సరానికి ఓ సరికొత్త జాతీయ వైద్య సదుపాయంతో వీడ్కోలు పలకడం.. ఈ ఏడాది ఎదుర్కున్న సమస్యలను ప్రతిబింబించడంతోపాటు.. కొత్త సంవత్సరంలోని మన ప్రాధాన్యతలను కూడా స్పష్టం చేస్తుంది. ఈ ఏడాది యావత్ ప్రపంచానికి వైద్యపరంగా అపూర్వమైన సవాల్ గా మిగిలిపోయింది. అంతేకాదు.. మన పూర్వీకులు చెప్పినట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యమనే జీవన విధానాన్ని మరోసారి మనకు గుర్తుచేసింది. ఒకసారి అనారోగ్యానికి గురయితే.. తర్వాత జీవితంలోని ప్రతి అడుగుపైనా దాని ప్రభావం ఉంటుంది. ఒక్క మన కుటుంబమే కాదు.. సమాజం మొత్తం ఆ సమస్యలో చిక్కుకుపోతుంది. అందుకే 2020 సంవత్సరపు చివరి రోజు.. కరోనాపై పోరాటంలో ముందువరసలో ఉన్న లక్షల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మెడికల్ దుకాణాల్లో పనిచేసేవారందరినీ గుర్తుచేసుకోవాల్సిన అవసరముంది. వారు మానవాళిని కాపాడేందుకు వారి జీవితాలను త్యాగం చేశారు. కర్తవ్యనిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన వారందరికీ ఇవాళ మరోసారి గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. ఇవాళ యావద్భారతం.. కరోనానుంచి కాపాడుకునేందుకు అవసరమైన మౌలికవసతుల కల్పనలో అహోరాత్రులు శ్రమించిన మిత్రులను, శాస్త్రవేత్తలను, కార్మికులను గుర్తుచేసుకుంటోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశంలోని పేదలకు భోజనంతోపాటు ఇతర అవసరాలు తీర్చేందుకు అంకితభావంతో పనిచేసిన వారందరినీ ప్రశంసిస్తున్నాను. దీర్ఘకాలంపాటు ఇంత పెద్ద సమస్య ఇబ్బందులు పెట్టినా.. సమాజమంతా ఏకమై సేవాభావాన్ని ప్రదర్శిస్తూ.. బాధితుల ఆవేదనను ఆలకించింది. దాని ఫలితమే దేశంలోని ఒక్క పేదవాడు కూడా కరోనా సమయంలోనూ ఆకలితో పడుకునే పరిస్థితి రాలేదు. అలాంటి సేవాకార్యక్రమాలు చేసినవారందరూ అభినందనీయులు
మిత్రులారా,
భారతీయులంతా ఏకమైతే.. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా ఎదుర్కుని ముందుకెళ్తారని కరోనా సమయంలోని పరిస్థితులు మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. దేశమంతా ఒక్కటై సమయానుగుణంగా తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల కారణంగానే మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం. 130కోట్ల జనాభా కల దేశంలో పేదరికంతోపాటు ఇతర సమస్యలున్న చోట దాదాపు కోటిమంది కరోనాతో పోరాడి విజయం సాధించారు. కరోనా బాధితులను కాపాడడంలో ప్రపంచంతో పోలిస్తే భారత్ రికార్డు స్థాయి ప్రదర్శనను కనబరిచింది. భారతదేశంలో రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోంది.
సోదర, సోదరీమణులారా,
2020 ప్రారంభం నుంచీ నిరాశాజనకంగా, చింతాజనకంగా నలువైపులనుంచీ సవాళ్లతోనే కొనసాగింది. కానీ 2021 కరోనా చికిత్సకు సంబంధించిన కొత్త ఆశను తీసుకొస్తోంది. టీకా విషయంలో భారతదేశానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశంలో తయారైన టీకా.. వేగంగా సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా మేం చేస్తున్న ప్రయత్నాలు చివరిదశకు చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశంలో ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. కరోనాను ఎదుర్కునేందుకు మనమంతా ఏకమై ఎలా ముందడుగు వేశామో.. టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ అదే దృఢచిత్తంతో ముందుకెళ్తామనే విశ్వాసం నాకుంది.
మిత్రులారా,
గుజరాత్‌లో కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు ఇప్పుడు టీకా కార్యక్రమ ఏర్పాట్లలోనూ ప్రశంసనీయమైన కార్యక్రమాలు నిర్వహించారు. గత 2 దశాబ్దాల్లో గుజరాత్ లో ఏ విధంగానైనా వైద్యరంగంలో మౌలికవసతుల కల్పన జరిగిందో.. దాని కారణంగా కరోనా సమస్యనుంచి ఈ రాష్ట్రం విజయవంతంగా బయటపడుతోంది. రాజ్‌కోట్ ఏయిమ్స్.. గుజరాత్ లో వైద్య అనుసంధానతను మరింత సశక్తం, బలోపేతం చేస్తుంది. ఇకపై తీవ్రమైన వైద్యసమస్యలకు కూడా ఆధునిక వైద్య సదుపాయాలు రాజ్ కోట్ లోనే అందుబాటులోకి రానున్నాయి. వైద్యం, వైద్య విద్యతోపాటు ఉపాధికల్పన విషయంలోనూ ఎన్నో అవకాశాలు ఏర్పడతాయి. కొత్త ఆసుపత్రిలో పనిచేసేందుకు దాదాపు 5వేల మందికి నేరుగా లబ్ధి చేకూరుతుంది. దీంతోపాటుగా ఉండటానికి వసతులు, భోజనసదుపాయాలు, రవాణా, ఇతర వైద్య సదుపాయాలకు సంబంధించిన ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పెద్ద ఆసుపత్రి ఉన్నచోట ఓ చిన్న పట్టణమే ఏర్పాటవుతుంది.
సోదర,సోదరీమణులారా,
వైద్యరంగంలో గుజరాత్ సాధిస్తున్న విజయానికి.. గత రెండు దశాబ్దాలుగా అనవరతమైన ప్రయత్నం, సమర్పణ, బలమైన సంకల్పం కారణమయ్యాయి. గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వైద్యం, వైద్యవిద్యకు సంబంధించి పెద్దమొత్తంలో జరిగిన కార్యక్రమాల లబ్ధి గుజరాత్‌కు కూడా లభిస్తోంది.
మిత్రులారా,
పెద్ద ఆసుపత్రుల పరిస్థితి, అక్కడ ఉండే ఒత్తిడి మీకు సుపరిచితమే. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా కేవలం ఏయిమ్స్ మాత్రమే ఏర్పాటయ్యాయి. అది కూడా 2003లో అటల్ జీ ప్రభుత్వం 6 ఏయిమ్స్ ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు 9 ఏళ్లు పట్టింది. 2012లో అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత ఆరేళ్లలో 10 కొత్త ఏయిమ్స్ ఆసుపత్రులు నిర్మాణం మొదలైంది. ఇందులో చాలా మటుకు ఇవాళ ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఏయిమ్స్ తోపాటు దేశంలో ఏయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కూడా జరుగుతోంది.
మిత్రులారా,
2014కు ముందు మన దేశంలో వైద్యరంగం వేర్వేరు దిశల్లో పనిచేసేంది. వేర్వేరు ఆలోచనలతో పనులు జరిగేవి. ప్రాథమిక వైద్యరంగానికి ప్రత్యేక వ్యవస్థ ఉండేది. గ్రామాల్లో దారుణమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. మేం వచ్చాక వైద్యరంగంలో ఓ సంపూర్ణమైన ఆలోచనతో పనిచేయడం ప్రారంభించాం. నివారణ జాగ్రత్తల (ప్రివెంటివ్ కేర్)పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. దీంతోపాటు ఆధునిక వసతులకూ ప్రాధాన్యత కల్పించాం. పేదల వైద్యానికి అయ్యే ఖర్చును తగ్గించడతోపాటు.. దేశవ్యాప్తంగా వైద్యుల సంఖ్యను వేగంగా పెంచడంపైనా దృష్టిపెట్టాం.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోనూ దాదాపు లక్షన్నర వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటుచేసే కార్యక్రమం చాలావేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఇందులో 50వేల కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో దాదాపు 5వేలు గుజరాత్‌లో ఉన్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోటిన్నర మందికి రూ.5లక్షల రూపాయల వైద్యం ఉచితంగా లభించింది. ఈ పథకం ద్వారా పేద సోదర, సోదరీమణులకు ఎంతగా లబ్ధి చేకూరిందనే లెక్కలను మీకు తెలియజేద్దామనుకుంటున్నాను.
మిత్రులారా,
ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు దాదాపు రూ.30వేలకోట్లకు పైగా ఆదా అయ్యాయి. రూ.30వేల కోట్లు చాలా పెద్ద మొత్తం. ఈ పథకం పేదలకు ఎంత పెద్ద ఆర్థికపరమైన చింత నుంచి విముక్తి కల్పించాయో మీరే ఆలోచించండి. కేన్సర్ అయినా.. గుండె,కిడ్నీ సంబంధిత సమస్యలు వంటి తీవ్రమైన ఇబ్బందులకు కూడా మన దేశ పేదలకు ఉచితంగా చికిత్స అందుతోంది. అది కూడా మంచి ఆసుపత్రుల్లో.
మిత్రులారా,
చికిత్స తీసుకుంటున్న సమయంలో పేదలకు మరొక మంచి నేస్తం.. జన ఔషధీ కేంద్రాలు. దేశవ్యాప్తంగా దాదాపు 7వేల జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు అతి తక్కువ ధరకే మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా దాదాపుగా 90శాతం తక్కువ ధరకే మందులు దొరుకుతున్నాయి. రూ.100 ధర ఉండే మందు.. కేవలం రూ.10కే దొరుకుతుంది. ప్రతిరోజూ మూడున్నర లక్షల మంది పేదలు ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే పేదలు మందులపై పెట్టే ఏటా రూ.3,600కోట్ల ఖర్చు ఆదా అవుతోంది. ఎంత పెద్ద మొత్తంలో మేలు జరుగుతోందో.. మీరు అంచనా వేయవచ్చు. ప్రభుత్వం వైద్య ఖర్చులపై, మందులపై చేసే ఖర్చును తగ్గించాలని ఎందుకు అనుకుంటోందని చాలా మందికి సందేహం రావొచ్చు!
మిత్రులారా,
మనమందరం ఎక్కువగా ఇదే నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లం. పేదలు, మధ్యతరగతికి చెందిన వారి ఇళ్లలో చికిత్సకు అయ్యే ఖర్చు విషయంలో చాలా ఆందోళన ఉంటుంది. పేదవాడి ఇంట్లో అనారోగ్యం వస్తే వారసలు చికిత్సే చేయించుకోకుండా ఉండిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చికిత్సకు అవసరమయ్యే డబ్బు లేకపోవడం, ఇంట్లో ఇతర ఖర్చులు ఉండటం, బాధ్యతల విషయంలో చింత వంటి వాటి వల్ల మన ఆలోచనలు మారిపోతాయి. పేదవాడు అనారోగ్యం పాలైతే డబ్బులు లేకపోవడం వల్ల వాళ్లు నెమ్మదిగా తాళ్లూ తాయెత్తుల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. పూజలు, పారాయణాల్లోకి వెళ్లిపోతారు. దీనివల్ల ఏదో ఒక రకంగా నయమైపోతుందని, బతికిపోతామని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వారి వద్ద సరైన వైద్యం కోసం కావలసిన డబ్బులు లేవు. పేదరికం అతడిని అతలాకుతలం చేస్తోంది.
మిత్రులారా,
డబ్బులు లేకపోవడం వల్ల మారిపోయే వ్యవహారశైలి, పేదవాడికి ఒక సురక్షాకవచం ఉంటే వేరే విధంగా ఉండటం కూడా మనమంతా చూశాం. బలహీనత ఆత్మవిశ్వాసంగా మారిపోతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల చికిత్స విషయంలో పేదలలోని చింత, ఆందోళనను తొలగించి, పరిస్థితి మార్చడంలో విజయం సాధించడం చూశాము. గతంలో డబ్బులు లేనందున చికిత్స చేయించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లేవారు కాదు. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో పెద్దలు… అంటే 45-50 ఏళ్ల వయసున్న వారు తాము పెద్దవారు కాబట్టి మందులు తీసుకోవడం, చికిత్స చేయించుకోవడం వంటివి చేసేవారు కాదు. ఎందుకంటే తమ అప్పుల భారం పిల్లల మీదపడుతుందని, వారు సర్వనాశనమైపోతారని వారు భావించేవారు. పిల్లలు ఇబ్బంది పడకూడదని తల్లిదండ్రులు జీవితమంతా నొప్పిని భరిస్తూ బతికేవారు. నొప్పుల వల్లే చనిపోయేవారు. తమ సంతానం కష్టాలపాలు కాకూడదని, వారు చికిత్సను చేయించుకోకుండా ఉండేవారు. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే విషయంపై గతంలో ప్రజలు ఆలోచించేవారు కాదు. ఆయుష్మాన్ భారత్ వచ్చిన తరువాత ఈ పరిస్థితి మారుతోంది.
మిత్రులారా,
ఆరోగ్యం విషయంలో భద్రతా భావన వల్ల, చికిత్స కోసం డబ్బుల విషయంలో చింత లేకపోవడం వల్ల సమాజం ఆలోచనలో మార్పు వచ్చింది. మనం దాని పరినాఆలను కూడా చూస్తున్నాం. నేడు ఆరోగ్యం విషయంలో ఒక జాగరూకత, కొంత ఆలోచన ఏర్పడింది. ఇది కేవలం పట్టణాలకే పరిమితం కాలేదు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ జాగరూకత కానవస్తోంది. ఇతర రంగాల్లోనూ వ్యవహార శైలిలో మార్పు కానవస్తోంది. ఉదాహరణకు శౌచాలయాల లభ్యత ప్రజలలో స్వచ్ఛత విషయంలో జాగరూకతను పెంచింది. హర్ ఘర్ జల్ (ఇంటింటా నీరు) పథకం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన మంచి నీరు అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. వంటింట్లోకి గ్యాస్ అందుబాటులోకి రావడంతో మన చెల్లెళ్లూ, ఆడబిడ్డల ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, మొత్తం కుటుంబంలో సకారాత్మకమైన మార్పు వచ్చింది. అదే విధంగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ పథకం వల్ల గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకునేలా ప్రోత్సాహం అందుతోంది. నియమిత పరీక్షల వల్ల గతం లో కన్నా ఎక్కువ శ్రద్ధతో వ్యవహరించడం జరుగుతోంది. ఫలితంగా గర్భిణులుగా ఉన్నప్పుడే క్లిష్టమైన కేసులను ముందస్తుగా గుర్తించడానికి, సకాలంలో చికిత్స అందించడానికి వీలు కలుగుతోంది. అదే విధంగా ప్రధానమంత్రి మాతృవందన పథకం ద్వారా గర్భిణులకు తగినంత పోషకాహారం లభిస్తోంది. వారికి సంరక్షణ లభిస్తోంది. పోషణ పథకం కూడా వారిలో జాగరూకతను పెంచుతోంది. వీటన్నిటి వల్ల కలిగిన లాభం ఏమిటంటే దేశంలో గర్భిణుల మరణం గతంతో పోలిస్తే చాలా తగ్గింది.
మిత్రులారా,
కేవలం పరిణామాల మీదే దృష్టిని కేంద్రీకరిస్తే సరిపోదు. ప్రభావం చాలా ముఖ్యం. కానీ అమలు విధానం కూడా అంతే ముఖ్యం. అందుకే వ్యవహార శైలిలో మార్పు రావాలంటే ప్రక్రియలను సంస్కరించడం చాలా అవసరం. గత కొన్నేళ్లుగా దేశంలో దీనిపై చాలా దృష్టి పెట్టడం జరిగింది. దీని ఫలితంగా నేడు దేశంలో ఆరోగ్య రంగంలో అట్టడుగు స్థాయిలో మార్పు వస్తోంది. ధానితో పాటు ప్రజలు ఈ ఆరోగ్య సేవా సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ప్రభుత్వ పథకాలన్నిటి వల్ల మన బాలికల విద్యపై ఎలాంటి ప్రభావం పడుతున్నదో తప్పక అధ్యయనం చేయమని దేశంలోని ఆరోగ్య, విద్య నిపుణులను కోరుతున్నాను. ఈ పథకాలు, ఈ అవగాహనల వల్ల స్కూలులో బాలికలు చదువు మధ్యలోనే మానేసేయడం బాగా తగ్గింది.
మిత్రులారా,
దేశంలో వైద్య విద్యకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలోనూ మిషన్ మోడ్ లో పని జరుగుతోంది. వైద్య విద్య నిర్వహణకు సంబంధించిన సంస్థల్లో సంస్కరణలను చేపట్టడం జరిగింది. పరంపరాగత భారతీయ చికిత్సా విదానాల విధ్యలోనూ అవసరమైన మేరకు సంస్కరణలను చేపట్టడం జరిగింది. జాతీయ మెడికల్ కమీషన్ ను ఏర్పాటు చేసిన తరువాత వైద్య విద్య నాణ్యత పెరిగి తీరుతుంది. సంఖ్యాపరంగానూ పురోగతి ఉంటుంది. గ్రాడ్యుయేట్ల కోసం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, దానితో పాటు రెండేళ్ల పోస్ట్ ఎంబీబీఎస్ డిప్పలొమా, పోస్ట్ గ్రాడ్యయేట్ డాక్టర్ల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ స్కీమ్ వంటి చర్యల కోసంఅవసరమైన చర్యలు అదే విధంగా నాణ్యమైన విద్యా ప్రమాణాల దిశగా పనిచేయడం జరుగుతోంది.
మిత్రులారా,
ప్రతి రాష్ట్రంలో ఒక ఆలిండియా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండాలి.. ప్రతి మూడు లోకసభ స్థానాలకు కనీసం ఒక మెడికల్ కాలేజీ తప్పకుండా ఉండాలన్నదే మన లక్ష్యం. ఈ దిశగా చేసిన ప్రయత్నాల వల్ల గత ఆరేళ్లలో ఎంబీబీఎస్ లో 31000 కొత్త సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ లో 24000 కొత్త సీట్లు పెంచడం జరిగింది. మిత్రులారా… ఆరోగ్య రంగంలో భారత్ అట్టడుగు స్థాయిలో ఒక పెద్ద మార్పు దిశగా పయనిస్తోంది. 2020 ఆరోగ్యపరమైన సవాళ్ల సంవత్సరమైతే 2021 ఆరోగ్యపరమైన పరిష్కారాల సంవత్సరం కానున్నది. 2021 లో ఆరోగ్యం విషయంలో ప్రపంచం మరింత జాగరూకతతో ఉండాలి. పరిష్కారాల దిశగా పయనించాలి. భారత్ కూడా 2020 లో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనే విషయంలో తన వంతు పాత్రను ఎలా పోషించిందో ప్రపంచం యావత్తూ చూసింది. నేను ప్రారంభంలోనే దీని గురించి ప్రస్తావించాను.
మిత్రులారా,
భారతదేశపు యోగదానం 2021 లో ఆరోగ్య పరిష్కారాల దిశగా, ఆరోగ్య పరిష్కారాల స్కేలింగ్ దిశగా చాలా ముఖ్యమైనది కాబోతోంది. భారత్ ఆరోగ్యపు భవిష్యత్తు విషయంలో, భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో మహత్వపూర్ణమైన పాత్రను పోషించబోతోంది ఇక్కడ ప్రపంచానికి సమర్థులైన వైద్య నిపుణులు లభించడమే కాదు, వారి సేవా తత్పరత కూడా లభిస్తుంది. ఇక్కడ సామూహిక రోగనిరోధకత విషయంలో అనుభవమూ లభిస్తుంది. అభిజ్ఞత కూడా లభిస్తుంది. ప్రపంచానికి అవసరమైన ఆరోగ్య పరిష్కారాలను, టెక్నాలజీతో సమన్వయం చేయడంలో స్టార్టప్ లు లభించడమే కాదు. స్టార్టప్ లకు అవసరమైన ఎకో సిస్టమ్ కూడా లభిస్తుంది.. ఈ స్టార్టప్ లు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవడం తో పాటు, ఆరోగ్యపరమైన పరిణామాలను మరింత మెరుగుపరుస్తాయి.
మిత్రులారా,
నేడు మనం వ్యాధుల ప్రపంచీకరణను చూస్తున్నాం. కాబట్టి ఆరోగ్య పరిష్కారాల గ్లోబలీకరణ కూడా జరగాలి ప్రపంచమంతా ఒక్కటిగా కలిసి వచ్చి స్పందించాలి. ఈ రోజు వేర్వేరుగా పనిచేయడం, విడివిడిగా ప్రయత్నించడం వల్ల ఉపయోగం ఉండబోదు. దారిలో అందరినీ కలుపుకుపోవడం, అందరిగురించి ఆలోచించడం అవసరం. భారత్ ఈ విషయంలో పనిచేసి చూపించి, ఒక అంతర్జాతీయ పాత్రధారిగా నిలిచింది. భారత్ అవసరం మేరకు మార్పు చెందుతూ, వికసిస్తూ, విస్తరిస్తూ తన సామర్థ్యాన్ని ఋజువు చేసుకుంది. మనం ప్రపంచంతో పాటు ముందుకు సాగుతాం. ఉమ్మడి ప్రయత్నాలకు విలువను జోడించాం. అన్నిటి కన్నా ఎత్తెదిగి, మానవతను కేంద్ర బిందువుగా ఉంచి, మానవాళికి సేవ చేశాము. నేడు భారత్ కు సామర్థ్యం ఉంది. సేవా భావం కూడా ఉంది. అందుకే భారత్ నేడు ఒక ప్రపంచ వైద్యానికి ప్రాణ కేంద్రంగా ఎదిగింది. 2021 లో మనం భారత్ యొక్క పాత్రను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
మన దేశంలో సర్వమన్య పరిత్యజ్య శరీరం పాలయేదత్ అంటారు అంటే శరీర ఆరోగ్య పరిరక్షణ అన్నిటి కన్నా ముఖ్యమైనది. అన్నిటినీ పక్కన బెట్టి ముందు ఆరోగ్యం పై దృష్టిని కేంద్రీకరించాలి. కొత్త సంవత్సరంలో మనం ఈ మంత్రానికి మన జీవితాలలో ప్రాధాన్యాన్నివ్వాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటాం. మనం నిర్వహిస్తున్న ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం యువకులకు మాత్రమే సంబంధించినది కాదు. ఏ వయస్సువారైనా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి. ఈ వాతావరణం కూడా ఈ ఫిట్ ఇండియా ఉద్యమానికి ఊతాన్నిచ్చేదే. యోగా కావచ్చు. ఫిట్ ఇండియా కావచ్చు. మనల్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి. నిజానికి అనారోగ్యం వచ్చిన తరువాత ఎంత కష్టపడాలో, అంత కష్టం కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పడాల్సిన అవసరం లేదు. అందుకే మనం ఫిట్ ఇండిఆ ను అనునత్యం గుర్తుంచుకుని, మనల్ని మనం ఫిట్ గా ఉంచుకోవాలి. ఇదే మన మనందరి కర్తవ్యం.
రాజ్ కోట్ కి చెందిన నా సోదర సోదరీమణులారా కరోనా వ్యాప్తి ఖచ్చితంగా తగ్గుతోంది. కానీ ఇది చాలా వేగంగా మనల్ని ఆక్రమించుకుంటుందని మరిచిపోకండి. కాబట్టి గజం దూరం లో ఉండటం, మాస్క్ ను ధరించడం, పారిశుధ్యం వంటి విషయాల్లో ఏ మాత్రమూ అజాగ్రత్తగా ఉండకూడదు. కొత్త సంవత్సరం మనందరికీ చాలా ఆనందాన్ని తీసుకురావాలి. కొత్త సంవత్సరం మీకు, దేశానికి మంగళకరంగా ఉండాలి. నేను మొదట్నుంచీ పదేపదే చెబుతూ వచ్చాను… మందు లేనంత వరకూ అజాగ్రత్త కూడదు. ఇప్పుడు మందులు వస్తున్నాయి. ఇంకొంత కాలమే వేచి ఉండాలి. అయితే మందును కూడా వాడాలి. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మందు వచ్చేస్తే ఇక అన్నీ మానేయొచ్చు అని భ్రమలో ఉండకండి. ప్రపంచం ఇదే చెబుతోంది. శాస్త్రవేత్తలు ఇదే చెబుతున్నారు. అందుకే ఇకపై 2021 లో మన మంత్రం దవాయీ భీ కడాయీ భీ… అంటే మందు వేసుకోవాలి. ముందు జాగ్రత్తలూ కఠినంగా పాటించాలి.
ఇంకో విషయం. మన దేశంలో వదంతుల బజారు చాలా జోరుగా నడుస్తోంది. రకరకాల వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతారహితంగా రకరకాల వదంతులను ప్రచారం చేస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే పని మొదలైన సమయంలోనూ పుకార్లు షికారు చేయవచ్చు. ఎవరినో తక్కువ చేసి చూపేందుకు సాధారణ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందన్న విషయాన్ని పట్టించుకోకుండా అనేకానేక అబద్ధాలను ప్రచారం చేసే అవకాశం ఉంది. కొన్ని పుకార్లు ఇప్పటికే మొదలయ్యాయి. కొందరు అమాయక పేదలు, మరికొందరు దురుద్దేశాలున్న వారు ఈ పుకార్లను నమ్మి ప్రచారం చేస్తూంటారు. కరోనా పై యుద్ధం ఒక అజ్ఞాత శత్రువుతో పోరాడటం వంటిదని నేను దేశవాసులకు మనవి చేస్తున్నాను. పుకార్లను నమ్మవద్దు. వాటిని ప్రచారం చేయొద్దు. సోషల్ మీడియాలో ఏదో చూడగానే ముందూ వెనుకా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేయకండి. బాధ్యతాయుతులైన పౌరులుగా మనందరం రానున్న రోజుల్లో దేశంలో చేపట్టనున్న ఆరోగ్య ఉద్యమంలో మనవంతు బాథ్యతలను నిర్వర్తిద్దాం. మనమందరం మన బాధ్యతను స్వీకరించాలి. ప్రజలకు విషయాలను తెలియచేయాలి. పూర్తి మద్దతునివ్వాలి. వ్యాక్సిన విషయంలో ఎలాంటి పురోగతి ఉన్నా దేశంలోని ప్రజలందరికీ సరైన సమయంలో తెలియచేయడం జరుగుతుంది. నేను మరో సారి 2021 నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను.