భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!
ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర గవర్నర్ శ్రీ సత్య దేవ్ నారాయణ్ ఆర్య జీ, ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి ప్రతిమ భూమిక్ జీ, త్రిపుర శాసనసభాపతి శ్రీ రతన్ చక్రవర్తి జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణు దేవ్ వర్మ జీ, నా స్నేహితుడు, పార్లమెంటు సభ్యుడు శ్రీ బిప్లబ్ దేబ్ జీ, త్రిపుర ప్రభుత్వంలోని గౌరవనీయ మంత్రులందరితో పాటు, నా ప్రియమైన త్రిపుర ప్రజలారా!
నమస్కారం !
ఖులుముఖా ! (మాట్లాడుకుందాం!)
మాతా త్రిపుర సుందరి నివసిస్తున్న ప్రాంతంలో ఉన్నందుకు నేను ధన్యుడిని. మాతా త్రిపుర సుందరి పుణ్య భూమికి నమస్కరిస్తున్నాను.
దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా నేను మీ అందరికీ క్షమాపణలు కోరుతూ, నమస్కరిస్తున్నాను. నేను మేఘాలయ నుంచి వస్తున్నాను. అక్కడ ముందుగా నిర్ణయించుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పట్టింది. కొంతమంది ఇక్కడ 11-12 గంటల నుంచి కూర్చున్నట్లు నాకు చెప్పారు. నా ఆలస్యం కారణంగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులకు నేను మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటు, నన్ను ఆశీర్వదించటానికి వేచి ఉన్నందుకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. పరిశుభ్రతకు సంబంధించిన భారీ ప్రచారాన్ని ప్రారంభించడానికి కృషి చేసిన త్రిపుర ప్రజలకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు గత ఐదేళ్లలో పరిశుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. ఫలితంగా, దేశంలోని చిన్న రాష్ట్రాలలో పరిశుభ్రమైన రాష్ట్రంగా ఈసారి త్రిపుర నిలిచింది.
మిత్రులారా!
మాతా త్రిపుర సుందరి ఆశీస్సులతో త్రిపుర అభివృద్ధి ప్రయాణం నేడు నూతన శిఖరాలను అధిరోహిస్తోంది. అనుసంధానత, నైపుణ్యాభివృద్ధి తో పాటు, పేదలకు ఇళ్లకు సంబంధించిన పథకాలు అందుకుంటున్న మీ అందరికీ అభినందనలు. త్రిపురలో ఈరోజు మొదటి దంత వైద్య కళాశాల ప్రారంభమయ్యింది. త్రిపుర యువత ఇక్కడే వైద్యులు కావడానికి ఇది సహాయపడుతుంది. ఈ రోజు త్రిపురలోని రెండు లక్షలకు పైగా పేద కుటుంబాలు కొత్త పక్కా గృహాలను పొందుతున్నాయి. వీటిలో చాలా గృహాలకు మన మాతృమూర్తులు, సోదరీమణులు యజమానులుగా ఉన్నారు. ఒక్కో ఇంటికి లక్షల రూపాయలు ఖర్చు అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వీరిలో, మొదటిసారి వారి పేరుతో ఆస్తి నమోదు చేయబడిన సోదరీమణులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు, లక్షల రూపాయల విలువైన ఇళ్ల యజమానులైన, త్రిపురకు చెందిన నా మాతృమూరులు, సోదరీమణులందరికీ, వారు లక్షాధికారులైన సందర్భంగా, నా అభినందనలు తెలియజేస్తున్నాను.
పేదలకు ఇళ్ల నిర్మాణంలో దేశంలోనే త్రిపుర అగ్రగామిగా ఉంది. ఈ విషయంలో, మాణిక్ జీ తో పాటు, ఆయన బృందం ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. ఎవరైనా కనీసం ఒక రాత్రి ఆశ్రయం ఇచ్చినా, వారికి జీవితాంతం ఆశీర్వాదాలు లభిస్తాయని మనకు తెలుసు. ఇక్కడ, ప్రతి ఒక్కరికి చక్కటి ఆశ్రయం ఉంది. అందువల్ల, మనందరికీ త్రిపుర నుండి పుష్కలమైన ఆశీస్సులు లభిస్తున్నాయి. నేను విమానాశ్రయం నుంచి ఇక్కడికి రావడానికి కొంత సమయం పట్టింది, ఎందుకంటే నన్ను ఆశీర్వదించటానికి, ప్రజలు పెద్ద సంఖ్యలో రహదారికి ఇరువైపులా వేచి ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి దారిలో ఉన్న వారి సంఖ్య, బహుశా ఇక్కడ కూర్చున్న వారి కంటే పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. నేను కూడా వారిని అభినందించి, నమస్కరించాను. నేను ఇంతకు ముందు చెప్పినట్లు మేఘాలయలో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ సమావేశానికి హాజరయ్యాను. ఈ సమావేశంలో, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రాబోయే కొన్నేళ్ల రోడ్ మ్యాప్ పై చర్చించాము. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి ఎనిమిది అంశాలను ఆ సమావేశంలో నేను చర్చించాను. త్రిపురలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది. అందువల్ల, ఇక్కడ అభివృద్ధికి చెందిన రోడ్ మ్యాప్ మరింత వేగంగా పుంజుకునేలా మేము నిర్ధారిస్తున్నాము.
మిత్రులారా!
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడక ముందు, త్రిపుర, ఈశాన్య ప్రాంతాలు రెండు కారణాల వల్ల మాత్రమే వార్తల్లో నిలిచాయి. ఒకటి, ఎన్నికలు జరిగినప్పుడు, రెండోది, హింసాత్మక సంఘటనలు జరిగినప్పుడు. ఇప్పుడు పరిస్థితి మారింది. నేడు త్రిపుర పరిశుభ్రత గురించి, మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లక్షల మంది పేద ప్రజలు ఇళ్లు పొందుతున్నారు; అదే విషయం ఇప్పుడు చర్చించబడుతోంది. త్రిపురలో కనెక్టివిటీ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇస్తుండగా, దాన్ని వేగంగా అమలు చేస్తూ ఇక్కడి ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో త్రిపురలో జాతీయ రహదారి ఎంత విస్తరించిందో మీరు చూడండి. గత ఐదేళ్లలో చాలా కొత్త గ్రామాలకు రహదారులు అనుసంధానం అయ్యాయి. ఇప్పుడు త్రిపురలోని ప్రతి గ్రామాన్ని రహదారులతో అనుసంధానించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు శంకుస్థాపన చేసిన రహదారుల ద్వారా త్రిపుర రహదారి వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రాజధాని రాకపోకల వ్యవస్థను అగర్తల బైపాస్ రహదారి మెరుగుపరుస్తుంది, ప్రజల జీవన విధానం మరింత సులభతరమవుతుంది.
మిత్రులారా!
ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలో అంతర్జాతీయ వాణిజ్యానికి త్రిపుర ముఖద్వారంగా మారుతోంది. అగర్తల-అఖౌరా అనుసంధాన రైలు మార్గం కూడా వాణిజ్యానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. అదేవిధంగా, భారత్-థాయ్‌లాండ్-మయన్మార్ రహదారి వంటి రహదారి మౌలిక సదుపాయాల ద్వారా ఇతర దేశాలతో సంబంధాలకు కూడా ఈశాన్య ప్రాంతం ముఖద్వారంగా మారుతుంది. అగర్తలలోని మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణంతో దేశ, విదేశాలకు అనుసంధానత సులభతరమయ్యింది. ఫలితంగా, ఈశాన్య ప్రాంతాలకు ముఖ్యమైన సరకు రవాణా కేంద్రంగా త్రిపుర అభివృద్ధి చెందుతోంది. త్రిపురలో ఇంటర్నెట్ తీసుకురావడానికి మేము చేసిన కృషి కారణంగా ఈ రోజు ప్రజలు, ముఖ్యంగా నా యువత ప్రయోజనం పొందుతున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిపురలోని అనేక పంచాయతీలకు సైతం ఆప్టికల్ ఫైబర్ చేరుకుంది.
మిత్రులారా!
బి.జె.పి. నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు, సామాజిక మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి పెడుతోంది. నేడు, బి.జె.పి. ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశం ఏమిటంటే, చికిత్స ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే, తక్కువ ధరలో, అందుబాటులో ఉండాలి. ఈ విషయంలో ఆయుష్మాన్ భారత్ యోజన చాలా ఉపయోగకరంగా మారుతోంది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద, ఈశాన్య ప్రాంతంలోని గ్రామాల్లో 7,000 కంటే ఎక్కువ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఆమోదించబడ్డాయి, త్రిపురలో సుమారు 1,000 కేంద్రాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు సంబంధించి వేలాది మంది రోగులను పరీక్షించారు. అదేవిధంగా, ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద, త్రిపురలోని వేలాది మంది పేదలకు ఐదు లక్ష రూపాయల వరకు ఉచిత చికిత్స సౌకర్యం లభించింది.
మిత్రులారా!
మరుగుదొడ్లు, విద్యుత్ లేదా గ్యాస్ కనెక్షన్ లకు సంబంధించిన విస్తృతమైన పనులు మొదటిసారిగా జరిగాయి. ఇప్పుడు గ్యాస్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం త్రిపురలోని ఇళ్లకు చౌక ధరలో పైపు ద్వారా గ్యాస్ సరఫరా కు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీటిని సరఫరా చేయడానికి కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పని చేస్తోంది. త్రిపురలో కేవలం మూడేళ్లలో నాలుగు లక్షల కొత్త కుటుంబాలకు పైపుల ద్వారా నీటి సౌకర్యం కల్పించారు. 2017 సంవత్సరానికి ముందు త్రిపురలో పేదల రేషన్ లో దోపిడీ జరిగేది. నేడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రతి పేద లబ్ధిదారునికి రేషన్ అందిస్తోంది, గత మూడు సంవత్సరాలుగా ఉచిత రేషన్ కూడా అందిస్తోంది.
మిత్రులారా!
ఇలాంటి పథకాలన్నింటిలో అత్యధికంగా లబ్ధి పొందేది మన మాతృమూర్తులు, సోదరీమణులే. త్రిపురలో లక్ష మందికి పైగా గర్భిణులైన మాతృమూర్తులు కూడా ప్రధాన మంత్రి మాతృ వందన యోజన ద్వారా ప్రయోజనం పొందారు. ఈ పథకం కింద పౌష్టికాహారం కోసం ప్రతి మాతృమూర్తి బ్యాంకు ఖాతాలో వేలాది రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది. నేడు ఎక్కువ ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి, మాతా శిశువుల జీవితాలను రక్షించడం జరుగుతోంది. త్రిపురలో సోదరీమణులు, కుమార్తెల స్వావలంబన దిశగా ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా మిక్కిలి ప్రశంసనీయం. మహిళల ఉపాధి కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినట్లు నాకు చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత త్రిపురలో మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య తొమ్మిది రెట్లు పెరిగింది.
సోదర సోదరీమణులారా!
దశాబ్దాలుగా, త్రిపురలో భావజాలం ప్రాముఖ్యత కోల్పోయిన, అవకాశవాద రాజకీయాలను ఆచరించే పార్టీలే అధికారంలో ఉన్నాయి. త్రిపురను అభివృద్ధికి దూరం చేశారు. త్రిపుర లో ఉన్న వనరులను సైతం స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. దీని వల్ల పేదలు, యువత, రైతులు, నా మాతృమూర్తులు, సోదరీమణులు ఎక్కువగా నష్టపోయారు. ఇలాంటి భావజాలం, మనస్తత్వం ప్రజలకు మేలు చేయలేవు. ప్రతికూలతను ఎలా వ్యాప్తి చేయాలో మాత్రమే వారికి తెలుసు. వారికి ఎలాంటి సానుకూల ఎజెండా లేదు. ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి సంకల్పంతో పాటు, దాన్ని సాధించడానికి సానుకూల కార్యాచరణ ప్రణాళిక కూడా ఉంది. త్రిపురలో యాక్సిలరేటర్ అవసరమైన సందర్భాల్లో నిరాశావాదులు రివర్స్ గేర్ లో డ్రైవ్ చేస్తారు.
మిత్రులారా!
ఈ అధికార రాజకీయాలు మన ఆదివాసీ సమాజానికి పెను నష్టం కలిగించాయి. గిరిజన సమాజాలు, గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరమయ్యాయి. ఈ రాజకీయాలను బీ.జే.పీ. మార్చేసింది. ఈ రోజు, ఆదివాసీ సమాజానికి, బీ.జే.పీ. యే మొదటి ఎంపిక కావడానికి ఇదే కారణం. గుజరాత్ లో ఇప్పుడే ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో బీ.జే.పీ. 27 ఏళ్లు అధికారంలో ఉన్నా, ప్రస్తుత భారీ విజయం వెనుక గిరిజన సమాజం పాత్ర ఎంతో ఉంది. గిరిజన వర్గాలకు రిజర్వ్ చేసిన 27 స్థానాల్లో బీ.జే.పీ. 24 స్థానాలు గెలుచుకుంది.
మిత్రులారా!
అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ప్రభుత్వం మొదటిసారిగా గిరిజన వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. మీరు మాకు ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చినప్పటి నుండి, మేము గిరిజన సమాజానికి సంబంధించిన ప్రతి అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. గిరిజన సమాజ బడ్జెట్ ను 21 వేల కోట్ల రూపాయల నుంచి 88 వేల కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా గిరిజన విద్యార్థుల ఉపకార వేతనాలు కూడా రెట్టింపుకు పైగా పెంచారు. ఇది త్రిపురలోని గిరిజన సమాజానికి కూడా ప్రయోజనం చేకూర్చింది. 2014 సంవత్సరానికి ముందు గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ పాఠశాలలు 100 కంటే తక్కువగా ఉండగా, నేడు ఆ పాఠశాలల సంఖ్య 500 కి చేరుకుంది. త్రిపురలో కూడా 20కి పైగా ఇటువంటి పాఠశాలలు ఆమోదించబడ్డాయి. అంతకు ముందు ప్రభుత్వాలు 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే ఎం.ఎస్.పి. ఇచ్చేవి. కాగా, ఇప్పుడు, బి.జె.పి. ప్రభుత్వం 90 అటవీ ఉత్పత్తులపై ఎం.ఎస్.పి. ఇస్తోంది. అదేవిధంగా, నేడు, గిరిజన ప్రాంతాల్లో 50,000 కంటే ఎక్కువ వన్-ధన్ కేంద్రాలు ఉన్నాయి, ఇవి సుమారు 9 లక్షల మంది గిరిజనులకు ఉపాధి హామీ నిచ్చాయి, వారిలో ఎక్కువ మంది మన సోదరీమణులు ఉన్నారు. గిరిజన సమాజానికి వెదురు వ్యాపారాన్ని సులభతరం చేసింది కూడా బీ.జే.పీ. ప్రభుత్వమే.
మిత్రులారా!
‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ (ఆదివాసి ఆత్మ గౌరవ దినోత్సవం) ప్రాముఖ్యతను తొలిసారిగా గుర్తించింది బీజేపీ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నవంబర్, 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతిని దేశవ్యాప్తంగా 'జన్ జాతీయ గౌరవ్ దివస్' గా జరుపుకోవడం ప్రారంభించింది. దేశ స్వాతంత్రోద్యమ సమయంలో ఆదివాసీలు చేసిన సహకారాన్ని నేడు దేశ, విదేశాలు గుర్తించి, ముందుకు తీసుకువెళ్తున్నాయి. నేడు దేశవ్యాప్తంగా 10 గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల ప్రదర్శన శాలలను ఏర్పాటవుతున్నాయి. ఇటీవల, త్రిపురలో మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య ప్రదర్శనశాలకు, సాంస్కృతిక కేంద్రానికి, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ శంకుస్థాపన చేశారు. గిరిజనుల తోడ్పాటు, సంస్కృతిని ప్రోత్సహించడానికి త్రిపుర ప్రభుత్వం కూడా నిరంతర కృషి కొనసాగిస్తోంది. త్రిపురలోని గిరిజన కళలు, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులను పద్మ అవార్డులతో సత్కరించే భాగ్యం కూడా బీ.జే.పీ. ప్రభుత్వానికి దక్కింది. ఇలాంటి అనేక కార్యక్రమాల కారణంగానే త్రిపురతో సహా దేశంలోని గిరిజన సమాజం బీ.జే.పీ. పై గరిష్ట విశ్వాసాన్ని కలిగి ఉంది.
సోదర సోదరీమణులారా!
త్రిపురలోని చిన్న రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు ఉత్తమ అవకాశాలను పొందాలని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న కృషి కొనసాగుతోంది. నేడు త్రిపురకు చెందిన పైనాపిల్ (అనాస పండు) ప్రపంచ మార్కెట్లకు చేరుతోంది. బంగ్లాదేశ్, జర్మనీ, దుబాయ్ దేశాలకు వందల కొద్దీ మెట్రిక్ టన్నుల ఇతర పండ్లు, కూరగాయలు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి చేయబడ్డాయి. ఫలితంగా, రైతులు, తమ ఉత్పత్తులకు అధిక ధరలు పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి త్రిపురలోని లక్షలాది మంది రైతులు ఇప్పటివరకు ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. త్రిపురలో అగర్ బత్తి పరిశ్రమను బీజేపీ ప్రభుత్వం బలోపేతం చేస్తున్న తీరు రాబోయే సంవత్సరాల్లో అర్థవంతమైన ఫలితాలనిస్తుంది. ఇది త్రిపుర యువతకు కొత్త అవకాశాలతో పాటు, కొత్త సంపాదన మార్గాలు పొందడానికి దారి తీస్తుంది.
మిత్రులారా!
త్రిపుర ఇప్పుడు ముఖ్యంగా శాంతి, అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఇప్పుడు త్రిపురలో అభివృద్ధి డబుల్ ఇంజన్ ఫలితాలను చూపుతోంది. త్రిపుర ప్రజల సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అభివృద్ధి మరింత వేగవంతం చేద్దాం. ఈ నమ్మకంతో, త్రిపుర ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రోజు పలు పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా త్రిపుర ప్రజలకు నేను మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమీప భవిష్యత్తులో త్రిపుర మరిన్ని నూతన శిఖరాలను అధిరోహిస్తుందన్న ఆశాభావంతో, మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
భారత్ మాతా కీ - జై!
భారత్ మాతా కీ - జై!