గవర్నర్ శ్రీ ఫగు చౌహాన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ నితిష్ కుమార్ జీ, నా కేబినెట్ సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్ జీ, శ్రీ వికె సింగ్ జీ, శ్రీ ఆర్ కె సింగ్ జీ, బిహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సుశీల్ జీ, ఇతర మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రియ సోదర సోదరీమణులారా,
బిహార్ అభివృద్ధి పయనంలో ఇది మరో ప్రధానమైన రోజు. కొద్ది సమయం క్రితమే బిహార్ కనెక్టివిటీని పెంచే 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. వీటిలో 4 లేన్లు, 6 లేన్ల రహదారులు, నదులపై 3 మెగా వంతెనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్న సమయంలో బిహార్ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా,
ఇది బిహార్ కే కాదు, యావత్ దేశానికి కూడా ముఖ్యమైన రోజు. యువభారతానికి కూడా పెద్ద రోజు. ఈ రోజున ఆత్మనిర్భర్ భారత్ కేంద్రాలుగా గ్రామాలు ముందడుగేస్తున్న దశను భారత్ చవి చూస్తోంది. అందువల్ల ఈ కార్యక్రమం యావత్ భారతదేశానికి చెందేదే అయినప్పటికీ బిహార్ నుంచి ప్రారంభం అవుతోంది. ఈ స్కీమ్ కింద దేశంలోని 6 లక్షల గ్రామాలకు 1000 రోజుల వ్యవధిలో ఆప్టికల్ ఫైబర్ అనుసంధానత ఏర్పడుతుంది. నితీష్ జీ సత్పరిపాలనతో బిహార్ దృఢమైన కట్టుబాటుతో ముందడుగేస్తోంది. ఈ స్కీమ్ తో ఆ ప్రయాణం మరింత వేగం పుంజుకుంటుంది.
మిత్రులారా,
కొద్ది సంవత్సరాల క్రితం వరకు గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పట్టణాల కన్నా అధికంగా ఉంటుందని కొద్ది కాలం క్రితం ఊహించైనా ఉండరు. గ్రామాల్లోని మహిళలు, రైతులు, యువత అంత తేలిగ్గా ఇంటర్నెట్ ఉపయోగించుకోగలరా అని అనుమానించారు. కాని ఈ రోజు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఈ రోజున భారతదేశం డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉంది. ఆగస్టు గణాంకాలనే తీసుకుంటే మొబైల్ ఫోన్లు, యుపిఐ ద్వారా రూ.3 లక్షలకు పైబడి లావాదేవీలు జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ ఇండియా ప్రచారం దేశంలోని సగటు ప్రజలకు ఎంతో సహాయకారిగా నిలిచింది.
మిత్రులారా,
ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తీరు వల్ల ఇప్పుడు గ్రామాలకు మంచి నాణ్యత గల హైస్పీడ్ ఇంటర్నెట్ తప్పనిసరి అయింది. ప్రభుత్వ కృషి కారణంగా ఆప్టికల్ ఫైబర్ 1.5 లక్షలకు పైగా పంచాయతీలకు చేరింది. గత ఆరేళ్ల కాలంలో 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఈ రోజు కనెక్టివిటీ దేశంలోని అన్ని గ్రామాలకు విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. వేగవంతమైన ఇంటర్నెట్ ప్రతీ ఒక్క గ్రామానికి చేరిన రోజున గ్రామాల్లోని విద్యార్థులు చదువుకోవడం తేలికవుతుంది. మన గ్రామాల్లోని పిల్లలు, గ్రామీణ యువత ప్రపంచంలోని మంచి పుస్తకాలు, మంచి టెక్నాలజీ మౌస్ ను ఒకే ఒక క్లిక్ చేయడం ద్వారా తేలిగ్గా తీసుకోగలుగుతారు. అంతే కాదు, మారుమూల గ్రామాల్లోని నిరుపేదలు టెలీ మెడిసిన్ ద్వారా సరసమైన ధరలకు, సమర్థవంతమైన చికిత్స పొందగలుగుతారు.
మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇంతకు ముందు మనం రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలంటే గ్రామాలకు సమీపంలోని పట్టణాలకు వెళ్లి సుదీర్ఘ సమయం క్యూలో నిలబడి టికెట్లు పొందాల్సి వచ్చేది. కాని ఈ రోజున గ్రామంలోని కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి మీరు రైల్వే రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నందు వల్ల మీరు ఎక్కడకు వెళ్లాలనుకున్నా తేలిగ్గా రిజర్వేషన్ చేయించుకోవచ్చు. మన రైతులు కూడా దీని వల్ల అంతే ప్రయోజనం పొందగలుగుతారు. కనెక్టివిటీ సహాయంతో కొత్త పంటలు, కొత్త విత్తనాలు, కొత్త విధానాలు, వాతావరణ మార్పులు వంటి భిన్న విభాగాల్లో జరిగిన ఆధునిక సాంకేతికపరమైన మార్పులకు సంబంధించిన సమాచారం రైతులు క్షణాల వ్యవధిలో సమాచారం పొందగలుగుతారు. అంతే కాదు, రైతులు తమ పంటలను దేశంలోను, ప్రపంచంలోను ఎక్కడైనా విక్రయించుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు నగరాల్లోని ప్రజల వలెనే ఇంటిలో కూచుని అన్ని సదుపాయాలు పొందగలిగే మౌలిక వసతులు సిద్ధం అవుతున్నాయి.
మిత్రులారా,
మౌలిక వసతుల్లో చిత్తశుద్ధితో పెట్టుబడులు పెట్టిన దేశాలు ప్రపంచ వ్యాప్తంగా త్వరితగతిన పురోగతి సాధించాయనేందుకు చరిత్రే నిదర్శనం. కాని ఇంత పెను మార్పునకు దారి తీసే ఇలాంటి ప్రాజెక్టుల పట్ల గత కొద్ది దశాబ్దాల కాలంలో ఇవ్వదగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆ అలసత్వానికి అధిక బాధిత రాష్ట్రం బిహార్.
మిత్రులారా,
వాస్తవానికి అటల్ జీ ప్రభుత్వం తొలిసారిగా మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళికలను రాజకీయాలకు ప్రధాన ఆధారంగా మార్చారు. అప్పటికి ఆ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ జీ దాన్ని మరింత ఎక్కువగా అనుభవించారు. పాలనలో వచ్చిన మార్పులను ఆయన సన్నిహితంగా వీక్షించారు.
మిత్రులారా,
ఈ రోజున మౌలిక వసతుల కల్పనలో చోటు చేసుకున్న వేగం పరిధి కూడా గతంలో కనివిని ఎరుగనిది. ఈ రోజున 2014 సంవత్సరం ముందు నాటి కన్నా రెండింతలు వేగంతో హైవేల నిర్మాణం జరుగుతోంది. అలాగే 2014 ముందు కాలంతో పోల్చితే హైవేల నిర్మాణ వ్యయాలు 5 రెట్లు పెరిగాయి. రాబోయే నాలుగైదు సంవత్సరాల కాలంలో మౌలిక వసతుల కల్పనపై రూ.110 లక్షల కోట్లు వ్యయం చేయడం లక్ష్యంగా నిర్దేశించాం. వాటిలో రూ.19 లక్షలకు పైబడిన పెట్టుబడులు హైవేలకే అందుతున్నాయి.
మిత్రులారా,
తూర్పు భారతంపై నేను ప్రత్యేకంగా దృష్టి సారించినందు వల్ల ఈ రోడ్ల విస్తరణ, కనెక్టివిటీ సంబంధిత మౌలిక వసతుల ప్రయోజనం బిహార్ కూడా అందుకోగలుగుతోంది. 2015 సంవత్సరంలో ప్రకటించిన పిఎం ప్యాకేజి కింద 3 వేలకు పైబడిన కిలోమీటర్ల నిడివి గల హైవే ప్రాజెక్టులను ప్రకటించడం జరిగింది. అదనంగా భారతమాల ప్రాజెక్టు కింద 650 కిలోమీటర్ల నిడివి గల జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతోంది. జాతీయ రహదారుల గ్రిడ్ పరిధిలోని పనులు ఈ రోజున బిహార్ కు విస్తరిస్తున్నాయి. తూర్పు, పడమర బిహార్ లను కలిపే నాలుగు లేన్ల ప్రాజెక్టులు నాలుగు, ఉత్తర భారతాన్ని దక్షిణాదితో అనుసంధానం చేసే 6 ప్రాజెక్టులు పురోగమన దశలో ఉన్నాయి. ఈ రోజున శంకుస్థాపన చేసిన హైవే విస్తరణ ప్రాజెక్టులు బిహార్ లోని ప్రధాన నగరాల కనెక్టివిటీని పటిష్ఠం చేస్తాయి.
మిత్రులారా,
ప్రధాన నదులున్న కారణంగా కనెక్టివిటీ విషయంలో బిహార్ భారీ అవరోధాలు ఎదుర్కొంటోంది. పిఎం ప్యాకేజి ప్రకటించినప్పుడు వంతెనల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కారణం ఇదే. పిఎం ప్యాకేజి కింద గంగానదిపై మొత్తం 17 వంతెనల నిర్మాణం జరుగుతోంది. వాటిలో చాలా పూర్తయ్యాయి. కొద్ది క్షణాల క్రితమే సుశీల్ జీ ఆ బ్లూప్రింట్ ను మీ అందరి ముందుంచారు. దీనికి దీటుగానే గండక్, కోసీ నదులపై వంతెనల నిర్మాణం కూడా జరుగుతోంది. మూడు నాలుగు లేన్ల వంతెనలకి ఈ రోజున శంకుస్థాపన జరిగింది. వీటిలో రెండు వంతెనలు గంగా నది పైన, ఒక వంతెన కోసీ నదిపైన నిర్మిస్తారు. ఈ వంతెనల నిర్మాణం పూర్తి కావడంతో గంగా, కోసీ నదులపై నాలుగు లేన్ల వంతెనల సామర్థ్యం మరింతగా పెరుగుతుంది.
మిత్రులారా,
బిహార్ కు జీవనరేఖ వంటి మహాత్మాగాంధీ సేతు దారుణమైన స్థితిని మనందరం చూశాం. దానికి ఇప్పుడు కొత్త రూపం కల్పిస్తున్నాం. నానాటికీ పెరుగుతున్న జనాభాను, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆ సేతుకు సమాంతరంగా మరో నాలుగు లేన్ల వంతెన నిర్మాణం కూడా చేపట్టబోతున్నాం. దానికి అనుసంధానంగా 8 లేన్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. గంగానదిపై విక్రమ్ శిల సేతుకు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వంతెన, కోసీ నదిపై నిర్మిస్తున్న మరో వంతెనతో బిహార్ కనెక్టివిటీ మరింతగా మెరుగుపడుతుంది.
మిత్రులారా,
కనెక్టివిటీ అంశాన్ని అడ్డుగోడల పరిధిలో కాకుండా విస్తృత దృక్పథంలో చూడాలి. ఇక్కడో వంతెన, అక్కడో రోడ్డు, ఇంకోచోట ఒక రైలు మార్గం, మరో చోట ఒక రైల్వే స్టేషన్ నిర్మించే వైఖరి వల్ల దేశానికి ఎంతో చేటు కలుగుతుంది. గతంలో నిర్మించిన రోడ్లు, హైవేలకు రైల్ నెట్ వర్క్ అనుసంధానత లేదు. అలాగే రైల్వేలకు పోర్టు కనెక్టివిటీ, పోర్టులకు విమానాశ్రయ కనెక్టివిటీ లేదు. ఇలాంటి లోపాలన్నింటినీ తొలగించుకుంటూ 21వ శతాబ్ది భారతం, 21వ శతాబ్ది బిహార్ ముందుకు సాగుతున్నాయి. ఈ రోజున మల్టీ మోడల్ కనెక్టివిటీకి దేశం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రోజున రైలు మార్గం, విమాన మార్గం అనుసంధానత గల హైవేల నిర్మాణం జరుగుతోంది. పోర్టులతో అనుసంధానత గల రైలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. ఒక రవాణా సాధనం మరో రవాణా వ్యవస్థకు బలంగా నిలవడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యం. ఈ విధానం వల్ల దేశంలో లాజిస్టిక్స్ పరంగా సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి.
మిత్రులారా,
మౌలిక వసతుల అభివృద్ధితో సమాజంలోని బలహీనులు, పేదలు అధికంగా ప్రయోజనం పొందుతారు. మన రైతులు కూడా దీని వల్ల అధికంగా లబ్ధి పొందుతారు. మంచి రోడ్ల నిర్మాణం, నదులపై మంచి వంతెనల నిర్మాణం వల్ల వ్యవసాయ క్షేత్రాలు, నగరాల్లోని మార్కెట్ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది.
మిత్రులారా,
పార్లమెంటు నిన్న దేశంలోని రైతులకు కొత్త హక్కులు కల్పించే చారిత్రక బిల్లులను ఆమోదించింది. ఈ రోజు బిహార్ ప్రజలతో మాట్లాడుతున్న ఈ సమయంలో దేశ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తున్న రైతులందరినీ నేను అభినందిస్తున్నాను. సంస్కరణలు 21వ శతాబ్ది అవసరం, ఇందులో సందేహం లేదు.