కార్యక్రమం ప్రారంభంలో.. బిహార్ దిగ్గజ రాజకీయ నేత శ్రీమాన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ గారు ఇకలేరనే వార్తను మీతో పంచుకోవడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తున్నాను. రఘువంశ్ బాబూ గారు పరమపదించడం వల్ల బిహార్‌తోపాటు దేశ రాజకీయాల్లో శూన్యత నెలకొంది. క్షేత్రస్థాయి విషయాలు తెలిసిన నేత, పేదల బాధలు తెలిసిన వ్యక్తి . వారి జీవితం మొత్తం బిహార్ కోసం పోరాడటంలోనే గడిపారు. తను నమ్మిన సిద్ధాంతం కొసం జీవితాంతం కృషిచేశారు.
నేను భారతీయ జనతాపార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నపుడు వారితోనాకు సాన్నిహిత్యం చాలా ఉండేది. టీవీ చర్చల్లో ఆసక్తికర చర్చలు జరిపేవాళ్లం. తర్వాత వారు కేంద్రీయ మంత్రిమండలిలో, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిరంతరం మాట్లాడుకునే వాళ్లం. మూడు, నాలుగు రోజల క్రితం కూడా వారిపై చర్చ జరిగింది. వారి ఆరోగ్య గురించి ఆవేదన చెందాను. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాను. వారు వీలైనంత త్వరగా కోలుకుని బిహార్ ప్రజలకు సేవచేసేందుకు వస్తారని ఆశించేవాణ్ని. కానీ వారి మనసులో ఏదో ఆవేదన, అంతర్మథనం జరుగుతోందని అర్థమైంది. ఇన్నాళ్లూ ఏ ఆదర్శాలను పాటిస్తూ వారు ముందుకుసాగారో.. ఆ బాటలో ఇక నడవటం వారికి చాలా కష్టంగా మారింది. మనస్సులో అంతర్గత పోరాటం జరిగేది. మూడు, నాలుగురోజుల క్రితం వారు తన అభిప్రాయాలను, మనసులో ఉన్న భావాలను లేఖరూపంలో ప్రకటించారు. దీంతోపాటు బిహార్ అభివృద్ధి విషయంలో తన ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలను పేర్కొంటూ బిహార్ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. బిహార్ రాష్ట్రం పట్ల, బిహారీల పట్ల వారి ప్రేమానురాగాలు ఆ లేఖలో కనిపించాయి.
శ్రీ నితీశ్ కుమార్ గారితో నేను విజ్ఞప్తి చేస్తున్నా.. శ్రీ రఘువంశ్ ప్రసాద్ గారు తన చివరి లేఖలో పేర్కొంన్న అంశాలను పూర్తిచేసేందుకు మీరు, నేను కలిసి పూర్తి ప్రయత్నం చేద్దాం. వారు పేర్కొన్న అభివృద్ధిని బిహార్ ప్రజలకు అందిద్దాం. మరోసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునేముందు శ్రీ రఘువంశ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
బిహార్ గవర్నర్ శ్రీ ఫాగు చౌహాన్ జీ, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ జీ, కేంద్ర మంత్రిమండలి సహచరులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ జీ, రవిశంకర్ ప్రసాద్ జీ, శ్రీ గిరిరాజ్ సింగ్ జీ, ఆర్కే సింగ్ జీ, అశ్వినీ కుమార్ చౌబేజీ, నిత్యానంద్ రాయ్ జీ, బిహార్ డిప్యూటీ సీఎం శ్రీ సుశీల్ కుమార్ మోదీజీ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అంతర్జాల వేదిక ద్వారా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రియ సోదర, సోదరీమణులారా,
మీ అందరికీ శుభాకాంక్షలు, నేడు అమరులు, శూరుల గడ్డపై ప్రారంభోత్సవం జరుగుతున్న పథకాలతో బిహార్‌తోపాటు తూర్పు భారత దేశంలోని చాలా ప్రాంతాలకు విస్తృత ప్రయోజనం జరగనుంది. ఇవాళ 900 కోట్ల రూపాయల విలువైన కీలకమైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎల్పీజీ పైప్ లైన్ ప్రాజెక్టు, భారీ బాట్లింగ్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇలాంటి చక్కటి పథకాలు ప్రారంభమవుతున్న సదర్భంగా బిహార్ వాసులందరికీ హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా,
కొన్నేళ్ల క్రితం బిహార్‌కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినపుడు మా దృష్టంతా రాష్ట్రంలో చేపట్టాల్సిన మౌలిక వసతులపైనే ఉంది. ఇందులో భాగంగా ఉద్దేశించిన దుర్గాపూర్-బాంకా సెక్షన్ మధ్యలోని కీలకమైన పైప్ లైన్ ప్రాజెక్టును ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండున్నరేళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశం కూడా నాకు కలిగింది. ఈ సెక్షన్ దాదాపు 200 కిలోమీటర్ల పొడవుంది. ఈ ప్రాంతంలో పైప్‌లైన్ పని చేయడం సవాళ్లతో కూడుకున్న పని అని నాకు చెప్పారు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 10 పెద్ద నదులు, దట్టమైన అడవులు, రాతికొండలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో పనిచేయడం అంత సులభమేం కాదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మన ఇంజనీర్లు, కార్మిక సోదరుల కఠిన శ్రమ కారనంగానే ఈప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికీ హార్దిక అభినందనలు తెలియజేస్తున్నాను.