హర్ హర్ మహదేవ్!
కంచి కామకోటి పీఠం శంకరాచార్య పూజ్యశ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్; శంకర నేత్ర నిధి ప్రతినిధి శ్రీ ఆర్.వి.రమణి, ఇతర ప్రముఖులు డాక్టర్ శ్రీ ఎస్.వి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మురళీ కృష్ణమూర్తి, శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా, సంస్థ విశిష్ట సభ్యులు, గౌరవనీయ సోదరసోదరీమణులారా!
ఈ పవిత్ర మాసంలో కాశీ సందర్శనే ఒక ఆధ్యాత్మిక దివ్యానుభూతి. ఇక్కడ నగరవాసులే కాకుండా పలువురు సాధువులు, దాతలున్నారు. ఈ సందర్భాన్ని మీరంతా ఒక పావన సమ్మేళనంగా మార్చారు! గౌరవనీయ శంకరాచార్య గారిని దర్శించుకుని, ప్రసాదంతోపాటు వారి ఆశీస్సులు పొందడం నాకు దక్కిన భాగ్యం. ఆయన ఆశీర్వాదంతోనే కాశీ, పూర్వాంచల్ ప్రాంతాలకు నేడు మరో ఆధునిక వైద్యశాల రూపంలో వరం లభించింది. శంకర భగవానుని నిలయమైన ఈ దివ్య నగరంలో ఆర్‌జె శంకర కంటి ఆసుపత్రి ఈ క్షణం నుంచి ప్రజలకు అంకితమైంది. దీనిపై ఈ రెండు ప్రాంతాల కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
మన ఇతిహాసాల్లో ‘‘తమసోమా జ్యోతిర్గమయః’’ అన్నది మనందరికీ తెలిసిన నానుడి. అంటే- ‘‘ఓ ప్రభూ! మమ్మల్ని అంధకారం నుంచి వెలుగువైపు నడిపించు’ అని అర్థం. అందుకు అనుగుణంగా ఆర్‌జె శంకర కంటి ఆస్పత్రి ఇకపై అసంఖ్యాక ప్రజానీకం జీవితాల్లోని అంధకారాన్ని పారదోలి, వారి కళ్లలో వెలుగులు పూయిస్తుంది. నేనిప్పుడే ఆస్పత్రిని సందర్శించి వచ్చాను. అది అన్ని కోణాల్లోనూ ఆధ్యాత్మికత-ఆధునికతల సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ ఆస్పత్రి పెద్దలకు సేవలతోపాటు పిల్లలకూ కొత్త చూపునిస్తుంది. వేలాది పేదలకు ఇక్కడ ఉచిత వైద్యం లభిస్తుంది. అంతేకాదు... ఈ ఆస్పత్రి ఏర్పాటుతో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందివచ్చాయి. దీంతోపాటు వైద్య విద్యార్థుల అనుభవ శిక్షణ, అభ్యాసానికీ వీలుంటుంది. అలాగే సహాయక సిబ్బంది రూపంలో మరికొందరికి ఉపాధి లభిస్తుంది.
మిత్రులారా!
‘శంకర ఐ ఫౌండేషన్’ ఉదాత్త సేవా కార్యక్రమాలతో నాకు ఇంతకుముందు కూడా అనుబంధం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో శంకర కంటి ఆస్పత్రి ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను. పూజనీయుడైన మీ గురువుగారి మార్గదర్శకత్వాన ఆ పని చేపట్టిన కీర్తి నాకు లభించింది. ఇప్పుడిక్కడ మీ మార్గనిర్దేశంలో నా వంతు కర్తవ్య నిర్వహణకు మరోసారి అవకాశం వచ్చింది. దీంతో నా హృదయం ఎనలేని సంతృప్తితో నిండిపోయింది. వాస్తవానికి నాకు మరో మహత్తర ఆశీర్వాదం కూడా లభించిందని పూజ్య స్వామిజీ గుర్తుచేశారు. ఆ మేరకు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దీవెనలు లభించడం నాకు దక్కిన భాగ్యం. లోగడ చాలా సందర్భాల్లో నేను పరమాచార్య పాదాల వద్ద కూర్చునే అవకాశం కూడా నాకు లభించింది. అలాగే పరమపూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అపార ప్రేమాదరాలను కూడా నేను చవిచూశాను. ఆయన మార్గదర్శకత్వంలో అనేక కీలక ప్రాజెక్టులను నేను పూర్తిచేశాను. ప్రస్తుతం జగద్గురు శంకరాచార్య శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని ఇలా కలుసుకోవడం నాకు లభించిన మరో అదృష్టం. ఒక విధంగా ముగ్గురు సంప్రదాయక జగద్గురువులతో అనుబంధం నా జీవితంలో లభించిన మహాశీర్వాదం. ఇది వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన అంశం. ఈ రోజు నా నియోజకవర్గంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పావనం చేసేందుకు జగద్గురు కరుణతో సమయమిచ్చారు. ఇక్కడి ప్రజాప్రతినిధిగా మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఈ సందర్భంగా నా ప్రియ మిత్రుడు శ్రీ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గుర్తుకురావడం సహజం. వ్యాపార సమాజంలో ఆయన స్థానం ఎంత విశిష్టమైనదో ప్రపంచానికి తెలియనిది కాదు. అందువల్ల ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. అయితే, సామాజిక సమస్యల పరిష్కారంపై ఆయన అంకితభావం నేడిక్కడ ప్రస్ఫుటం అవుతోంది. ఆ వారసత్వాన్ని ఆయన కుటుంబం నేడు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా ఈ సత్కార్యం కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం మొత్తాన్నీ కలిసే అవకాశం లభించడం సంతోషదాయకం. శంకర నేత్ర వైద్యశాల, చిత్రకూట్ కంటి ఆస్పత్రి యాజమాన్యాలను వారణాసిలోనూ ఆ సేవలు ప్రారంభించాలని నేను అభ్యర్థించడం నాకు గుర్తుంది. తదనుగుణంగా కాశీ ప్రజానీకం ఆకాంక్షను మన్నించిన ఆ రెండు సంస్థలకూ నా ప్రగాఢ కృతజ్ఞతలు. ఇంతకుముందు నా పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు వేలాదిగా చిత్రకూట్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇకపై వారణాసిలో ఈ రెండు సరికొత్త అత్యాధునిక సదుపాయాలుగల సంస్థల ద్వారా వారు సేవలు పొందుతారు.
మిత్రులారా!
అనాదిగా మత-సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపుగల కాశీ నగరం ఇకపై ఉత్తరప్రదేశ్, పూర్వాంచల్ ప్రాంతాలకు ప్రధాన ఆరోగ్య సంరక్షణ కూడలిగానూ గుర్తింపు పొందుతుంది. గత దశాబ్ద కాలంలో ‘బిహెచ్‌యు’లోని ట్రామా సెంటర్, సూపర్-స్పెషాలిటీ ఆస్పత్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రితోపాటు కబీర్‌చౌరా ఆస్పత్రిలో సౌకర్యాల మెరుగుదల, వృద్ధులు-ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు, వైద్య కళాశాల తదితరాల రూపంలో కాశీకి అనేక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు సమకూరాయి. ఇవే కాకుండా బెనారస్‌లో ఆధునిక కేన్సర్ చికిత్సాలయం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో స్థానికంగానే నాణ్యమైన వైద్యం లభిస్తుంది కాబట్టి వ్యాధి పీడితులు ఢిల్లీ లేదా ముంబై నగరాలకు వెళ్లాల్సిన అవస్థ తప్పుతుంది. అలాగే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా ప్రజలు చికిత్స కోసం ఇక్కడకు వచ్చే వీలుంటుంది. మనకు మోక్షప్రదాయని అయిన కాశీ నగరం నేడు నవ్యోత్తేజంతో, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వనరులతో సరికొత్త చైతన్య కేంద్రంగా రూపాంతరం చెందుతోంది.
మిత్రులారా!
మునుపటి ప్రభుత్వాల హయాంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల రీత్యా వారణాసి సహా పూర్వాంచల్ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఓ పదేళ్ల కిందట కూడా పూర్వాంచల్ ప్రాంతంలో చివరకు సమితి స్థాయిలో కూడా మెదడువాపు వ్యాధికి చికిత్స లభించని దుస్థితి ఉండేది. ఫలితంగా తరచూ పిల్లల మరణాలతో విషాదం తాండవించేది. దీనిపై పత్రికలలో వార్తలు రాని రోజంటూ ఉండేది కాదు. అయినప్పటికీ పాత ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారానికి చేసింది శూన్యం. ఇలాంటి దురవస్థ నుంచి గత దశాబ్ద కాలంలో కాశీతోపాటు పూర్వాంచల్ ప్రాంతం బయటపడింది. ఇప్పుడు అంతటా అద్భుత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు విస్తరించడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడిక్కడ మెదడువాపు వ్యాధి పీడితుల కోసం 100కుపైగా ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలాగే పదేళ్ల వ్యవధిలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదనంగా 10,000కుపైగా పడకలు సమకూరాయి. అంతేకాకుండా పూర్వాంచల్ పరిధిలోని గ్రామాల్లో 5,500కుపైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పదేళ్ల కిందట జిల్లా ఆసుపత్రుల్లో డయాలసిస్ సదుపాయం లేకపోగా, ఇప్పుడు 20కిపైగా యూనిట్లు రోగులకు ఉచిత సేవలందిస్తున్నాయి.
మిత్రులారా!
ఆరోగ్య సంరక్షణ విషయంలో కాలం చెల్లిన ఆలోచన ధోరణులను, విధానాలను ప్రస్తుత 21వ శతాబ్దపు నవ భారతం పూర్తిగా మార్చేసింది. దేశంలో నేటి ఆరోగ్య సంరక్షణ ప్రణాళిక 5 మూలస్తంభాల ప్రాతిపదికన రూపొందింది. వీటిలో మొదటిది... వ్యాధి నిరోధం- ముందస్తు రోగనివారణ చర్యలు తీసుకోవడం. రెండోది... సకాలంలో వ్యాధుల నిర్ధారణ. మూడోది... ఖరీదైన మందులు సహా ఉచిత లేదా స్వల్ప వ్యయంతో చికిత్స. నాలుగోది... వైద్యుల కొరత పరిష్కారంతోపాటు చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవల లభ్యత. చివరిది... ఆరోగ్య సంరక్షణలో సాంకేతికత విస్తరణ.
మిత్రులారా!
నేటి భారత ఆరోగ్య విధానంలో వ్యాధుల నుంచి వ్యక్తిగత రక్షణకు అగ్ర ప్రాధాన్యం ఇస్తుండగా, ఆరోగ్య రంగానికి ఇది మొదటి మూలస్తంభంగా నిలుస్తోంది. అణగారిన వర్గాలకు అనారోగ్యం వాటిల్లితే వారు మరింత పేదరికంలోకి జారిపోతారు. అయితే, గడచిన పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులయ్యారు. అయినప్పటికీ, తీవ్ర అనారోగ్యం వారిని తిరిగి సులువుగా పేదరికంలోకి నెట్టేస్తుంది. అందుకే, వ్యాధి నివారణ చర్యలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రత్యేకించి పరిశుభ్రత, యోగా, ఆయుర్వేదం, పౌష్టికాహారం సంబంధిత అంశాలపై మేము దృష్టి సారిస్తున్నాం. అలాగే టీకాల కార్యక్రమాన్ని ఇంటింటికీ చేరువ చేస్తున్నాం. ఓ పదేళ్ల కిందట దేశంలో టీకా లభ్యత 60 శాతం జనాభాకు మాత్రమే పరిమితం. ఫలితంగా కోట్లాది బాలలు టీకాలకు దూరమయ్యారు. దీనికితోడు టీకాల వార్షిక విస్తరణ కేవలం 1 నుంచి 1.5 శాతం మించేది కాదు. పరిస్థితులు అలాగే కొనసాగి ఉంటే మరో 40, 50 ఏళ్లకుగానీ ప్రతి ప్రాంతంలో ప్రతి చిన్నారికీ టీకా వేయడం సాధ్యమయ్యేది కాదు. ఈ పరిస్థితి దేశ యువతరానికి ఎంత చేటు చేస్తుందో మనం ఊహించవచ్చు. అందువల్ల మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక పిల్లలకు టీకాలు వేయడం, మరిన్ని ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడంపై శ్రద్ధ చూపాం. ఆ దిశగా ‘మిషన్ ఇంద్రధనుస్సు’కు శ్రీకారం చుట్టి, ఏకకాలంలో అమలు చేసేలా వివిధ మంత్రిత్వ శాఖలకు భాగస్వామ్యం కల్పించాం. దీంతో టీకాల విస్తరణ గణనీయంగా పెరగడమేగాక అంతకుముందు దీని పరిధిలోని రాని కోట్లాది గర్భిణులు, పిల్లలకు కూడా టీకాలు వేశారు. టీకాల కార్యక్రమానికి భారత్ ఇచ్చిన ప్రాధాన్యం ఎంత కీలకమైనదో కోవిడ్-19 మహమ్మారి సమయంలో లభించిన ప్రయోజనాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు కూడా టీకాల కార్యక్రమం దేశమంతటా వేగంగా కొనసాగుతోంది.
మిత్రులారా!
వ్యాధి నివారణ ఎంత ముఖ్యమో, సకాలంలో వాటిని గుర్తించడమూ అంతే ముఖ్యం. అందుకే దేశవ్యాప్తంగా లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తద్వారా కేన్సర్, మధుమేహం వంటి వ్యాధులను ముందుగానే గుర్తించే సౌలభ్యం కలిగింది. మేమిప్పుడు దేశంలో ప్రాణరక్షక యూనిట్లు, ఆధునిక ప్రయోగశాలల నెట్‌వర్క్ కూడా రూపొందిస్తున్నాం. దీంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ రెండో మూలస్తంభం లక్షలాదిగా ప్రజలకు ప్రాణరక్షణ కల్పిస్తోంది.
మిత్రులారా!
మూడో మూలస్తంభం కింద ఖరీదైన మందులు సహా ఉచిత లేదా స్వల్ప వ్యయంతో చికిత్స అందిస్తున్నాం. తద్వారా దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై ప్రతి పౌరుడి సగటు వ్యయం 25 శాతం దాకా తగ్గింది. ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాల ద్వారా ప్రజలకు నేడు 80 శాతం ధర తగ్గింపుతో మందులు లభిస్తున్నాయి. గుండె చికిత్సకు వాడే స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్లు లేదా కేన్సర్ మందులు సహా ఈ అత్యవసర చికిత్స వ్యయం కూడా గణనీయంగా తగ్గించాం. పేదలకు ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సదుపాయం కల్పించే ‘ఆయుష్మాన్ యోజన’ అనేకమందికి ప్రాణదాతగా మారింది. దీనికింద దేశంలో ఇప్పటిదాకా 7.5 కోట్ల మందికిపైగా ఉచిత చికిత్స ప్రయోజనం పొందారు. ఈ ఉచిత వైద్యసేవలు ఇకపై ప్రతి కుటుంబంలో 70 ఏళ్లు నిండిన వృద్ధులకూ లభిస్తాయి.
మిత్రులారా!
నాలుగో మూలస్తంభం కింద చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నందున ఉన్నతస్థాయి చికిత్స కోసం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు వెళ్లే అవసరం లేదు. ఈ మేరకు గత పదేళ్లలో చిన్న పట్టణాల్లోనూ ‘ఎయిమ్స్’, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాం. అలాగే దేశవ్యాప్తంగా వైద్యుల కొరత పరిష్కారం దిశగా వైద్య విద్యలో సీట్లు వేల సంఖ్యలో పెంచాం. మరో ఐదేళ్లలో ఇంకా 75,000 సీట్లు అదనంగా జోడిస్తాం.
మిత్రులారా!
ఆరోగ్య సంరక్షణలో ఐదో మూలస్తంభం సాంకేతికత విస్తరణ ద్వారా ఆరోగ్య సేవల సౌలభ్యం కల్పన. ఇందులో భాగంగా డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య జారీ చేశాం. అంతేకాకుండా ‘ఇ-సంజీవని’ యాప్ సాయంతో ఇంటినుంచే వైద్యులతో సంప్రదింపులకు వీలుంటుంది. ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికిపైగా ప్రజలు దూరవైద్య సేవా సదుపాయాన్ని వినియోగించుకున్నారు. తాజాగా ఆరోగ్య సంరక్షణ సేవలను డ్రోన్ సాంకేతికతతో సంధానించేందుకు కృషి చేస్తున్నాం.
మిత్రులారా!
‘వికసిత భారత్’ సంకల్ప సాకారానికి ఆరోగ్యవంతులైన, సమర్థ యువతరం ఎంతయినా అవసరం. ఈ ఉద్యమం విజయం దిశగా పూజనీయ జగద్గురు శంకరాచార్య మద్దతు రూపంలో ఆశీర్వాదం లభించడం నాకెంతో సంతోషంగా ఉంది. సమర్థ, ఆరోగ్య భారత్ రూపొందేలా ఈ కార్యక్రమం మరింత బలపడాలని కాశీ విశ్వనాథ స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రోజు పూజ్య శంకరాచార్య గారి పాదాల వద్ద కూర్చున్న సమయంలో నా చిన్ననాటి సంఘటనలు మదిలో మెదిలాయి. అప్పట్లో మా గ్రామ వైద్యుడొకరు ఏటా స్వచ్ఛంద కార్యకర్తల బృందంతో ఒక నెలపాటు బీహార్‌లో పర్యటించేవాడు. అక్కడ ‘‘నేత్ర యజ్ఞం’’ పేరిట ఆయన పెద్ద ఎత్తున కంటిశుక్లాల శస్త్రచికిత్స కార్యక్రమం నిర్వహించేవాడు. మా గ్రామ ప్రజలు అనేకమంది ఆయన ఏటా నిర్వహించే ఈ సత్కార్యంలో స్వచ్ఛంద కార్యకర్తలుగా పాలుపంచుకునేవారు. నేను పసివాణ్నే అయినప్పటికీ బీహార్ ప్రాంతంలో ఈ సేవల ఎంత అవసరమో నాకు దీన్నిబట్టి అర్థమైంది.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోనూ ఇలాంటి శంకర కంటి ఆస్పత్రి ప్రారంభించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఇవాళ పూజ్య శంకరాచార్య గారిని నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. ఇటువంటి సేవ బీహార్ ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుందో నా చిన్ననాటి జ్ఞాపకాలను బట్టి అవగతం చేసుకోగలను. దేశం నలుమూలలకూ విస్తరణపై స్వామి సదాలోచన చేస్తున్న క్రమంలో బీహార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, మీ ఆశీస్సులు ఆ రాష్ట్రానికి లభిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. సజ్జనులు, శ్రమజీవులైన బీహార్ ప్రజలకు సేవ చేయడం గొప్ప గౌరవం మాత్రమేగాక వారి శ్రేయస్సుకు చేయూతనివ్వడం ద్వారా మన జీవితం పరిపూర్ణం కాగలదు. ఈ సందర్భంగా మరొక్కసారి మీకందరికీ... ముఖ్యంగా అంకితభావంగల మన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఈ ఉదాత్త కార్యకలాపాల్లో భాగస్వాములైన సోదర, సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అపార భక్తిభావనతో పూజ్య జగద్గురు శంకరాచార్యకు ప్రణమిల్లుతున్నాను. ఆయన నిరంతర ఆశీస్సులు, మార్గదర్శకత్వం కోసం హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను. నిండు హృదయంతో కృతజ్ఞతలర్పిస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.
హర్ హర్ మహదేవ్!