భూటాన్ ప్రధానమంత్రి - నా తమ్ముడు, ఫిజీ ఉప ప్రధానమంత్రి, భారత సహకార మంత్రి శ్రీ అమిత్ షా, అంతర్జాతీయ సహకార సమాఖ్య అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, దేశదేశాల నుంచి వచ్చి ఇక్కడ సమావేశమైన సహకార ప్రపంచ భాగస్వాములు, సోదరీ సోదరులారా!
మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.
అంతర్జాతీయ సహకార కూటమి అంతర్జాతీయ సదస్సు భారత్‌లో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇప్పుడు మనం భారత్‌లో సహకార ఉద్యమానికి కొత్త కోణాన్ని అందిస్తున్నాం. భారత భవిష్యత్తు సహకార ప్రస్థానానికి ఆవశ్యకమైన కౌశలాన్ని ఈ సదస్సు ద్వారా మేం పొందుతామనీ.. అదే సమయంలో అంతర్జాతీయ సహకార ఉద్యమానికి భారత అనుభవాలు కొత్త అవకాశాలను, 21వ శతాబ్దం కోసం నూతన స్ఫూర్తినీ అందిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. 2025ను అంతర్జాతీయ సహకార సంఘాల ఏడాదిగా ప్రకటించిన ఐక్యరాజ్య సమితికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా,
సహకార సంఘాలు ప్రపంచానికి ఓ ఆదర్శం. కానీ, భారత్ లో సంస్కృతికి, జీవన విధానానికి అవి పునాది. సం గచ్ఛధ్వం సం వదధ్వం అని వేదాలు చెప్తున్నాయి. అంటే- కలిసి నడుద్దాం, సామరస్యంగా మాట్లాడుకుందాం. సర్వే సంతు సుఖినః అని మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే- అందరూ సంతోషంగా ఉండాలని అర్థం. మన ప్రార్థనలలో కూడా సహజీవనం ప్రధాన అంశంగా ఉంటుంది. ‘సంఘ’ (ఐక్యత), ‘సహ’ (సహకారం) భారతీయ జీవనంలో ప్రాథమిక అంశాలు. మన కుటుంబ వ్యవస్థకు కూడా ఇది ఆధారం. సహకార సంఘాల ప్రధాన విలువల్లో ఈ స్ఫూర్తి కచ్చితంగా ఉంటుంది. ఈ సహకార స్ఫూర్తితో భారత నాగరికత విలసిల్లింది.
మిత్రులారా,
మన స్వాతంత్ర్యోద్యమానికి కూడా సహకార సంఘాలు స్ఫూర్తినిచ్చాయి. అవి ఆర్థిక సాధికారతకు మాత్రమే కాకుండా, స్వతంత్ర సమరయోధులకు ఉమ్మడి వేదికగా కూడా సేవలందించాయి. మహాత్మా గాంధీ గ్రామస్వరాజ్య భావన సామాజిక భాగస్వామ్యంలో నవోత్తేజాన్ని నింపింది. సహకార సంఘాల ద్వారా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల వంటి రంగాల్లో కొత్త ఉద్యమానికి ఆయన నాంది పలికారు. ఇవాళ మన సహకార సంఘాల సహకారంతో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు కొన్ని అతిపెద్ద బ్రాండ్లను కూడా అధిగమించాయి. అదే సమయంలో సర్దార్ పటేల్ రైతులను ఏకం చేసి పాల సహకార సంఘాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి పుట్టిన అమూల్ నేడు ప్రపంచ అగ్రశ్రేణి ఆహార బ్రాండ్లలో ఒకటి. భారత్ లో సహకార సంఘాలు భావనల నుంచి ఉద్యమాలుగా, ఉద్యమాల నుంచి విప్లవాలుగా, విప్లవాల నుంచి సాధికారత దిశగా ఎదిగాయని మనం చెప్పవచ్చు.
మిత్రులారా,
నేడు ప్రభుత్వం, సహకార సంఘాల శక్తిని మేళవించి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతున్నాం. ‘సహకర్ సే సమృద్ధి’ భావన మాకు మంత్రప్రదమైనది. నేడు భారత్ లో 8 లక్షలకు పైగా సహకార సంఘాలు ఉన్నాయి, అంటే ప్రపంచంలోని ప్రతి నాలుగు సహకార సంఘాలలో ఒకటి భారతదేశంలో ఉంది. సంఖ్యాపరంగానే కాదు, పరిధిలో కూడా ఈ సహకార సంఘాలు విస్తారమైనవి, వైవిధ్యమైనవి. గ్రామీణ భారతదేశంలో 98% సహకార సంఘాల పరిధిలో ఉంది. దాదాపు 30 కోట్ల మంది ప్రజలు – అంటే సహకార సంఘాల్లో ప్రపంచంలోని ప్రతీ ఐదుగురిలో ఒకరికీ, ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరికీ – సహకార సంఘాలతో అనుబంధం ఉంది. చక్కెర, ఎరువులు, చేపల పెంపకం, పాల ఉత్పత్తి వంటి రంగాల్లో సహకార సంఘాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి.
పట్టణ సహకార బ్యాంకింగ్, గృహనిర్మాణ సహకార సంఘాలలో భారత్ కొన్ని దశాబ్దాలుగా గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం భారత్ లో దాదాపు 2,00,000 హౌసింగ్ సహకార సంఘాలున్నాయి. ఇటీవలి కాలంలో సంస్కరణల ద్వారా సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రూ.12 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ బ్యాంకులను మరింత బలోపేతం చేసి వీటిపై నమ్మకాన్ని పెంచడానికి ప్రభుత్వం పలు సంస్కరణలు ప్రవేశపెట్టింది. గతంలో ఈ బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) పరిధిలో ఉండేవి కావు. ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వచ్చాయి. ఈ బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా కవరేజీని ఒక్కో డిపాజిట్టుదారుడికీ రూ.5 లక్షలకు పెంచాం. సహకార బ్యాంకుల్లో డిజిటల్ బ్యాంకింగ్‌ను విస్తరించారు. ఈ చర్యలు భారత సహకార బ్యాంకులను మునుపెన్నడూ లేనివిధంగా మరింత పోటీతత్వంతో, పారదర్శకంగా మార్చాయి.
మిత్రులారా,
భవిష్యత్ వృద్ధిలో సహకార సంఘాలకు గణనీయమైన స్థానం ఇవ్వాలని భారత్ భావిస్తోంది. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో మొత్తం సహకార వ్యవస్థలో పరివర్తన తెచ్చే దిశగా కృషి చేశాం. ఈ రంగంలో భారత్ అనేక సంస్కరణలు చేపట్టింది. సహకార సంఘాలను బహుళ ప్రయోజనాల కోసం తీర్చిదిద్దడం మా లక్ష్యం. ఇందుకోసం భారత ప్రభుత్వం ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ సంఘాలను బహుళ ప్రయోజనాల కోసం తీర్చిదిద్దడానికి కొత్త తరహా నిబంధనలను ప్రవేశపెట్టాం. సహకార సంఘాలను ఐటీ ఆధారిత వ్యవస్థతో సమీకృతం చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార బ్యాంకింగ్ సంస్థలతో అనుసంధానం చేశాం. నేడు ఈ సంఘాలు భారత్ లో రైతుల కోసం స్థానిక సహాయక కేంద్రాలను నడుపుతున్నాయి. ఈ సహకార సంఘాలు పెట్రోల్, డీజిల్ రిటైల్ వాణిజ్యాన్ని నిర్వహిస్తున్నాయి. అనేక గ్రామాల్లో నీటి వ్యవస్థలను నిర్వహిస్తున్నాయి. సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నాయి. వ్యర్థం నుంచి ఇంధన కార్యక్రమం కింద గోబర్ ధన్ పథకానికి కూడా ఈ సహకార సంఘాలు దోహదం చేస్తున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి సేవా కేంద్రాలుగా సహకార సంఘాలు ప్రస్తుతం గ్రామాల్లో డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. ఈ సహకార సంఘాలను బలోపేతం చేయడం, తద్వారా అందులోని సభ్యులు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మేం కృషిచేస్తున్నాం.
మిత్రులారా,
ప్రస్తుతం సహకార సంఘాలు లేని 2,00,000 గ్రామాల్లో బహుళ ప్రయోజన సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. తయారీ, సేవా రంగాల్లో సహకార సంఘాలను విస్తరిస్తున్నాం. సహకార రంగంలో ప్రపంచంలో అతిపెద్ద ధాన్యం నిల్వ పథకంపై భారత్ కృషిచేస్తోంది. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా గోదాములను నిర్మించే ప్రణాళికను ఈ సహకార సంఘాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న రైతులకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూరుస్తుంది.
మిత్రులారా,
మన చిన్న రైతులను ఆహార ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పీవో)గా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిన్న రైతుల ఎఫ్ పీవోలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వీటిలో దాదాపు 9,000 ఎఫ్ పీవోలు ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ వ్యవసాయ సహకార సంఘాలకు బలమైన సరఫరా, విలువ శ్రేణులను నెలకొల్పడంతోపాటు వాటిని క్షేత్రస్థాయి నుంచి వంటిళ్లకూ, మార్కెట్లకూ అనుసంధానించడం మా లక్ష్యం. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాం. డిజిటల్ వాణిజ్యం కోసం సార్వత్రిక వేదికల (ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్-ఓఎన్ డీసీ) ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడం కోసం సహకార సంఘాలకు ఓ సరికొత్త మాధ్యమాన్ని మేం అందిస్తున్నాం. సహకార సంఘాలు తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) వేదిక కూడా సహకార సంఘాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
మిత్రులారా,
ఈ శతాబ్దంలో, ప్రపంచ వృద్ధిలో మహిళల భాగస్వామ్యం ప్రధాన అంశం. మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించే సంఘాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం భారత్ లో అభివృద్ధి మహిళల నేతృత్వంలో జరుగుతోంది. దీనిపై మేం ఎక్కువగా దృష్టిపెడుతున్నాం. సహకార రంగంలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 60% కన్నా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళల నేతృత్వంలోని అనేక సహకార సంఘాలు ఈ రంగాన్ని బలోపేతం చేశాయి.
మిత్రులారా,
సహకార నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం మేం కృషిచేస్తున్నాం. ఈ మేరకు బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టాన్ని సవరించాం. బహుళ రాష్ట్ర సమకార సంఘాల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు ఉండడం ఇప్పుడు తప్పనిసరి. అంతే కాకుండా అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లను కల్పించడం ద్వారా సంఘాలను మరింత సమ్మిళితం చేశాం.
మిత్రులారా,
భారత్‌లో స్వయం సహాయక బృందాల (ఎస్ హెచ్ జీ) ఉద్యమం గురించి కూడా మీరు విని ఉంటారు. భాగస్వామ్యం ద్వారా మహిళా సాధికారత దిశగా ఇదొక బృహత్తరమైన కార్యక్రమం. నేడు భారత్‌లో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. దశాబ్ద కాలంలో ఈ స్వయం సహాయక బృందాలు ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీ రేట్లపై రూ. 9 లక్షల కోట్ల రుణాలు పొందాయి. ఈ స్వయం సహాయక బృందాలు గ్రామాల్లో గణనీయమైన సంపదను సృష్టించాయి. మహిళా సాధికారత కోసం అనేక దేశాలు అనుసరించదగిన నమూనాగా ఇది నిలవగలదు.
మిత్రులారా,
ఈ 21వ శతాబ్దం ప్రపంచ సహకార ఉద్యమ దిశను సమష్టిగా నిర్ణయించాల్సిన సమయం. సహకార పెట్టుబడులను సులభతరమూ, మరింత పారదర్శకమూ చేసే సహకార ఆర్థిక నమూనాను మనం ఆలోచించాలి. చిన్న, ఆర్థికంగా వెనుకబడిన సహకార సంఘాలకు చేయూతనివ్వడం కోసం ఆర్థిక వనరులను సమీకరించడం కీలకమైన అంశం. భాగస్వామ్య ఆర్థిక వేదికలు పెద్ద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చగలవు, సహకార సంఘాలకు రుణాలను అందించగలవు. సేకరణ, ఉత్పత్తి, పంపిణీలో భాగస్వామ్యం ద్వారా సరఫరా శ్రేణులను మెరుగుపరచడంలో కూడా మన సహకార సంఘాలు దోహదపడగలవు.
మిత్రులారా,
మరో అంశాన్ని కూడా చర్చించాల్సి ఉంది... ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలకు ఆర్థిక సహాయం చేయడానికి విస్తృతమైన అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను మనం నెలకొల్పగలమా? అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) సమర్థవంతంగా తన పాత్ర నిర్వర్తిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో మన అవసరాలు దీనికి అతీతంగా ఉండవచ్చు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు సహకార ఉద్యమానికి గణనీయమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా సమగ్రత, పరస్పర గౌరవాలకు సహకార సంఘాలను పతాకదారులుగా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందుకోసం మన విధానాలను సృజనాత్మకంగా రూపొందించి, వ్యూహరచన చేయాలి. వర్తుల ఆర్థిక వ్యవస్థ సూత్రాలను కూడా అవవలంబిస్తూ.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని నిలిచేలా సహకార సంఘాలు ఎదగాలి. అంతేకాకుండా, సహకార సంఘాల్లోని అంకుర సంస్థలను ప్రోత్సహించే మార్గాలను అన్వేషించాలి. దీనిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
మిత్రులారా,
అంతర్జాతీయ సహకారంలో సహకార సంఘాలు కొత్త జవసత్వాలను తేగలవని భారత్ విశ్వసిస్తోంది. ముఖ్యంగా నిర్దిష్ట వృద్ధి నమూనాలు ఆవశ్యకమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహకార సంఘాలు కీలకమైన సహకారాన్ని అందించగలవు. అందువల్ల, సహకార సంఘాల్లో అంతర్జాతీయ సహకారం దిశగా మనం ఆవిష్కరణలు చేయాలి, కొత్త దారులు వేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించడంలో ఈ సదస్సు గణనీయమైన పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి. అత్యధిక జీడీపీ వృద్ధి మాత్రమే కాదు.. నిరుపేదలకు కూడా దాని ప్రయోజనాలు అందాలన్నది మా లక్ష్యం. ప్రపంచం వృద్ధిని మానవ కేంద్రీకృత దృక్పథంతో చూడడమూ అంతే ముఖ్యం. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ మానవీయతకు ఎల్లవేళలా భారత్ ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో అవసరమైన వనరులను అందించాం. వెనుకబడి ఉన్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఔషధాలు, టీకాలను భారత్ అందించింది. ఆర్థికపరంగా ఆలోచిస్తే పరిస్థితిలో సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. అది సరైన మార్గం కాదని మానవీయత బోధించింది. లాభం కోసం కాకుండా.. సేవా మార్గాన్ని ఎంచుకునేలా ఇది మనకు దిశానిర్దేశం చేసింది.
మిత్రులారా,
సహకార సంఘాల ప్రధాన్యం వాటి నిర్మాణంలోనో, చట్టపరమైన వ్యవస్థలోనో లేదు.. ఈ అంశాలు వ్యవస్థలను నిర్మించి వృద్ధి, విస్తరణను సులభతరం చేయగలవు. సహకార సంఘాల నుంచి గ్రహించవలసింది వాటి స్ఫూర్తి. సహకార సంస్కృతిలో పాతుకుపోయిన ఈ సహకార స్ఫూర్తి ఉద్యమానికి జీవనాడి. సహకార సంఘాల విజయం వాటి సంఖ్యపై కాక, అందులోని సభ్యుల నైతిక వికాసంపై ఆధారపడి ఉంటుందని మహాత్మా గాంధీ విశ్వసించారు. మనం తీసుకునే నిర్ణయాలు ఎల్లప్పుడూ మానవాళి విస్తృత ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూడడం నైతికత ద్వారా సాధ్యపడుతుంది. అంతర్జాతీయ సహకార సంవత్సరంలో ఈ స్ఫూర్తి మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసం నాకుంది. మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే ఐదు రోజుల పాటు ఈ సదస్సులో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ ఫలితం సమాజంలోని ప్రతి వర్గానికీ, ప్రతి దేశానికీ సాధికారతను, సుసంపన్నతను చేకూరుస్తుందనీ.. సహకార స్ఫూర్తి పురోగమిస్తుందనీ నేను విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసంతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ధన్యవాదాలు.