ప్రియమైన నా మిత్రులారా,
గాంధీ మహాత్ముని జన్మభూమి అయిన గాంధీనగర్ లో జరుగుతున్న వలస జాతుల 13వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీజ్ (సిఒపి) సమ్మేళనాని కి మిమ్ములను అందరి ని ఆహ్వానించడం నాకు సంతోషాన్ని ఇస్తోంది.
ప్రపంచం లో అత్యంత వైవిధ్యభరిత దేశాల లో ఒక దేశం భారతదేశం. ప్రపంచ భూవిస్తీర్ణం లో 2.4 శాతం వాటా తో ప్రపంచ స్థాయి లోని జీవ వైవిధ్యం లో 8 శాతం వాటా ను కలిగివుంది. భిన్న పర్యావరణం తో కూడిన ఆవాస ప్రాంతాలు, నాలుగు జీవ వైవిధ్య కేంద్రాలు భారతదేశ ప్రత్యేకతల లో భాగం గా ఉన్నాయి. తూర్పు హిమాలయాలు, పడమటి కనుమ లు, భారత- మయన్మార్ భూమండలం, అండమాన్- నికోబార్ దీవులు జీవ వైవిధ్యానికి నెలవుగా గల నాలుగు ప్రధాన కేంద్రాలు. ఈ కారణం గా ప్రపంచం లోని భిన్న ప్రాంతాల నుండి వలస వచ్చిన 500కు పైగా పక్షిజాతుల కు ఆవాస ప్రాంతం భారతదేశం.
సోదర సోదరీమణులారా,
ఎన్నో యుగాలు గా వన్యమృగాలు, వాటి ఆవాస కేంద్రాల ను పరిరక్షించడం భారతదేశ సంస్కృతి విలువల లో అంతర్భాగం గా ఉంది. ఇది కరుణ కు, సహజీవన ధోరణి కి ప్రోత్సాహం ఇచ్చిన అంశం. జంతుజాలం పరిరక్షణ ను గురించి మా వేదాలు ఎంతగానో బోధించాయి. సామ్రాట్ అశోకుడు అడవుల నిర్మూలన ను, జంతు వధ ను నిషేధించాడు. మహాత్మ గాంధీ స్ఫూర్తి తో అహింస, జంతు సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ సిద్ధాంతాల ను రాజ్యాంగం లో తగు రీతి లో పొందుపరచడం జరిగింది. ఎన్నో చట్టాల లో, శాసనాల లో ఇది ప్రతిబింబిస్తున్నది.
ఈ దిశ గా ఎన్నో సంవత్సరాలు గా జరుగుతున్న కృషి సత్ఫలితాలను ఇచ్చింది. 2014వ సంవత్సరం లో 745 గా ఉన్న సంరక్షణ కేంద్రాల సంఖ్య 2019 నాటికి 870కి చేరుకొంది. ఇవి 1.7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్నాయి.
దేశం లో అడవుల విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం అందుబాటు లో ఉన్న అంచనాల ప్రకారం మొత్తం దేశ భూభాగం లో అడవుల విస్తీర్ణం 21.67 శాతం ఉంది.
సంరక్షణ, జీవజాలం మనుగడ కు అవకాశం ఇచ్చే జీవన శైలి, హరిత ప్రాంతాల అభివృద్ధి తో కూడిన వాతావరణ కార్యాచరణ చేపట్టడం లో భారతదేశం అగ్రగామి గా ఉంది. 450 మెగావాట్ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, విద్యుత్తు తో నడిచే వాహనాల కు ప్రోత్సాహం, స్మార్ట్ సిటీ ల అభివృద్ధి, జల సంరక్షణ వంటి చర్యలు ఇందులో భాగం గా ఉన్నాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ), వైపరీత్యాల కు తట్టుకోగల మౌలిక వసతుల అభివృద్ధి సహకారం, స్వీడన్ నాయకత్వం లో పరిశ్రమ ల పరివర్తన వంటి కార్యక్రమాల లో భారతదేశం చురుకైన భాగస్వామి గా ఉండడం భిన్న సిద్ధాంతాలు గల దేశాలు కూడా ఆయా కార్యక్రమాల లో భాగస్వాములు కావడానికి దోహదం చేసింది. ఉష్ణోగ్రత ల పెరుగుదల ను 2 డిగ్రీల సెల్సియస్ కు అదుపు చేయడం లక్ష్యం గా పని చేస్తున్న పారిస్ ఒప్పందాని కి కట్టుబడిన కొద్ది దేశాల లో ఒకటి గా భారతదేశం ఉంది.
మిత్రులారా,
భారతదేశం ప్రత్యేకం గా గుర్తించి జంతు, పక్షి జాతుల సంరక్షణ పై దృష్టి ని సారించింది. అది మంచి ఫలితాలను ఇచ్చింది. పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య ప్రారంభం లోని 9 నుండి ఇప్పుడు 50కి పెరిగింది. ప్రస్తుతం భారతదేశం లో 2970 వ్యాఘ్రాలు ఉన్నాయి. 2022 నాటికి పులుల సంఖ్య ను రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని భారతదేశం రెండు సంవత్సరాల ముందే సాధించింది. పులుల సంరక్షణ లో విశేషమైన పురోగతి ని సాధించి ఒక నమూనా గా నిలచిన దేశాల తో అనుభవాల ను, విధివిధానాల ను పంచుకోవడం ద్వారా పులుల సంరక్షణ చర్యల ను పటిష్ఠం చేయాలని ఈ సమావేశం లో పాల్గొంటున్న పులుల సంతతి ఉన్న దేశాల ను, ఇతర దేశాల ను కూడా నేను అభ్యర్థిస్తున్నాను.
ప్రపంచం లోని ఆసియా ఏనుగు ల సంతతి లో 60 శాతం ఏనుగుల కు భారతదేశం ఆవాసం గా నిలుస్తోంది. మా రాష్ట్రాలు 30 ఏనుగు ల సంరక్షణ కేంద్రాల ను గుర్తించాయి. ఆసియా ఏనుగు ల సంరక్షణ లో ప్రమాణాల ను నిర్దేశించడానికి భారతదేశం పలు కార్యక్రమాలను చేపట్టింది.
మంచు ప్రాంత చిరుత ల పేరిట ఒక ప్రాజెక్టు ను మేము ప్రారంభించాము. మంచు ఖండాల లో తిరిగే చిరుతల ను, హిమాలయాల లోని వాటి ఆవాస ప్రాంతాల ను సంరక్షించే చర్యల ను తీసుకొన్నాము. 12 దేశాలు భాగస్వాములు గా ఉన్న ప్రపంచ మంచు ఖండ చిరుతల కు అనుకూలమైన వాతావరణ కల్పన (జిఎస్ఎల్ఇపి) సారథ్య కమిటీ కి భారతదేశం ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. మంచు ప్రాంతాల చిరుత ల సంరక్షణ కు అనుకూలమైన విధి విధానాల ను దేశాల వారీ గా చేపట్టడానికి, సహకారాన్ని విస్తృతపరచుకోవడాని కి పిలుపు ను ఇస్తూ ఢిల్లీ డిక్లరేశన్ ను చేయడానికి ఆ సమావేశం మార్గాన్ని సుగమం చేసింది. ప్రజల భాగస్వామ్యం తో పర్వత ప్రాంతాల వాతావరణ సంరక్షణ కు ప్రాధాన్యం గల హరిత ఆర్థిక వ్యవస్థ ను అభివృద్ధిపరచడం లో భారతదేశం నాయకత్వ పాత్ర ను పోషిస్తున్నదని ప్రకటించేందుకు నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
ఆసియా సింహ సంతతి కి అనుకూలమైన వాతావరణం గల ఒకే ఒక్క ప్రాంతం గుజరాత్ లోని గిర్. 2019వ సంవత్సరం నుండి మేము ఆసియా సింహ సంతతి ని పరిరక్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రస్తుతం భారతదేశం లో 523 ఆసియా సింహాలు ఉన్నాయని తెలియజేసేందుకు నేను ఆనందిస్తున్నాను.
దేశం లోని అసమ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఒకే కొమ్ము గల ఖడ్గమృగాల నిలయాలు గా గుర్తింపు పొందాయి. భారతదేశాని కి చెందిన “ఒక కొమ్ము గల ఖడ్గమృగం సంరక్షణ కు జాతీయ వ్యూహాన్ని” భారతదేశ ప్రభుత్వం 2019వ సంవత్సరం లో ప్రకటించింది.
అంతరించిపోతున్న తెగ కు చెందిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ కు కూడా మేము ప్రాధాన్యాన్ని ఇస్తున్నాము. ఈ పక్షుల గుడ్లను సేకరించి పిల్లలు గా మార్చేందుకు చేపట్టిన కార్యక్రమం లో భాగం గా వన్యప్రదేశాల నుండి 9 గుడ్లను విజయవంతం గా సేకరించారు. అబూధాబీ కి చెందిన అంతర్జాతీయ హౌబారా కన్జర్వేశన్ నిధి సాంకేతక సహకారం తో భారతదేశ శాస్త్రవేత్తలు, అటవీ శాఖ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ కు గుర్తుగా జిఐబిఐ-ద గ్రేట్ పేరిట ఒక చిహ్నాన్ని (మస్కట్) మేము తయారుచేశాము.
మిత్రులారా,
వలస సంతతి కి చెందిన జీవజాలం 13వ సిఓపి సదస్సు గాంధీనగర్ లో నిర్వహించడం మాకు దక్కిన గౌరవం.
ఇక్కడ పెట్టిన సిఎమ్ఎస్ సిఒపి 13 లోగో ప్రకృతి తో ఎంతో సామరస్యపూర్వకం గా సహజీవనం సాగిస్తున్న దక్షిణ భారతదేశం లోని సాంప్రదాయిక కోలమ్ ప్రాంతం స్ఫూర్తి తో రూపొందించిన అంశం మీరు గమనించే ఉంటారు.
మిత్రులారా,
“అతిథి దేవో భవ” అనేది మేం సంప్రదాయ సిద్ధం గా ఆచరిస్తున్న సిద్ధాంతం. సిఎమ్ఎస్ సిఒపి 13: “వలస జీవజాలం భూగోళ అనుసంధానం, ఉమ్మడి ఆహ్వానం” అనే నినాదం లో ప్రతిబింబించింది. ఈ వలస జీవజాలం అంతా ఎటువంటి పాస్ పోర్టుల, వీజా లు అవసరం లేకుండా వివిధ దేశాల మధ్య తిరుగుతూ శాంతి, సుసంపన్నత ల సందేశాన్ని మోసుకు పోయే వాహకాలు గా ఉంటాయి. వాటిని పరిరక్షించడం మన అందరి బాధ్యత.
సోదర సోదరీమణులారా,
భారతదేశం రాబోయే మూడు సంవత్సరాల పాటు ఈ కన్వెన్శన్ కు నాయకత్వ స్థానం లో ఉంటుంది. మా అధ్యక్షత న ఈ దిగువ అంశాల పై భారతదేశం దిశానిర్దేశం చేయనుంది.
వలస పక్షుల సంతతి తరలివెళ్లే సెంట్రల్ ఆసియా గగన మార్గం లో (ఫ్లైవే) భారతదేశం భాగం గా ఉంది. ఈ కారణం గా ఆ వలస పక్షులను, వాటి ఆవాస ప్రాంతాల ను పరిరక్షించే లక్ష్యంతో “సెంట్రల్ ఏశియన్ గగన మార్గం మీదుగా ఎగిరి వెళ్లే వలస పక్షుల సంరక్షణ కు జాతీయ కార్యాచరణ ప్రణాళిక” ను భారతదేశం సిద్ధం చేసింది. ఇతర దేశాలు కూడా ఈ తరహా కార్యాచరణ ను రూపొందించుకోవడం లో సహకరించడానికి భారతదేశం సిద్ధం గా ఉందని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. సెంట్రల్ ఏశియా గగన మార్గం లో ఉన్న దేశాల క్రియాశీల సహకారం తో వలస పక్షుల సంరక్షణ లో కొత్త నమూనా గా నిలవాలని భారతదేశం ఆసక్తి గా ఉంది. అలాగే అందరి కి ఒక ఉమ్మడి వేదిక ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభాగం లో పరిశోధన, అధ్యయనాలు, అంచనాలు, సామర్థ్యాల అభివృద్ధి కోసం ఒక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు చేయాలని కూడా నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశాని కి 7500 కిలోమీటర్ల సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంతం ఉన్నది. భారత సాగర జలాలు ఎన్నో జీవజాల సంతతి కి ఆశ్రయం గా నిలుస్తూ జీవ వైవిధ్యానికి ఆలవాలాలు గా ఉన్నాయి. ఈ విభాగం లో ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాల సంఘటన ను మరింత పటిష్ఠం చేయాలని భారతదేశం ప్రతిపాదిస్తోంది. ఇండో- పసిఫిక్ సముద్ర కార్యక్రమం (ఐపిఒఐ)తో సమాంతరం గా ఇది సాగుతుంది. ఇందులో భారతదేశం కీలక నాయకత్వ పాత్ర ను పోషిస్తున్నది. 2020వ సంవత్సరంలో భారతదేశం సాగర తాబేళ్ల విధానం, మరీన్ స్ట్రాండింగ్ నిర్వహణ విధానాన్ని రూపొందించనుంది. మైక్రో ప్లాస్టిక్ లు సృష్టిస్తున్న కాలుష్యం అరికట్టడానికి కూడా ఇది కృషి చేస్తుంది. ఏక వినియోగ ప్లాస్టిక్ పర్యావరణ పరిరక్షణ కు పెను సవాలు ను రువ్వుతోంది. వాటి వినియోగాన్ని తగ్గించేందుకు భారతదేశం ఉద్యమ ప్రాతిపదిక న కృషి చేస్తోంది.
మిత్రులారా,
భారతదేశం లోని పలు సంరక్షణ కేంద్రాలు పొరుగుదేశాల లోని సంరక్షణ కేంద్రాల తో ఉమ్మడి సరిహద్దు ను కలిగివున్నాయి. సరిహద్దు ఆవలి సంరక్షణ కేంద్రాల (ట్రాన్స్ బౌండరీ ప్రొటెక్టెడ్ ఏరియాస్) సంఘం ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో సానుకూల ఫలితాల ను సాధించ గలిగే అవకాశం ఉంటుంది.
మిత్రులారా,
ప్రపంచం లో స్థిరమైన అభివృద్ధి ఉండాలన్న సిద్ధాంతాన్ని నా ప్రభుత్వం ప్రగాఢం గా విశ్వసిస్తోంది. పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండానే అభివృద్ధి కి మేము భరోసా ను ఇస్తున్నాము. పర్యావరణం పరం గా సునిశితమైనవి గా గుర్తించిన ప్రాంతాల క్రమబద్ధమైన అభివృద్ధి కి దోహదపడేలా ఎటువంటి అతిక్రమణ లు లేని మౌలిక వసతుల నిర్మాణ విధాన మార్గదర్శకాల ను కూడా మేము విడుదల చేశాము.
భవిష్యత్ తరాల కోసం విలువైన మానవ వనరుల ను పరిరక్షించడం లో ప్రజల ను అతి ముఖ్యమైన భాగస్వాములు గా చేస్తున్నాము. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” నినాదం తో నా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశం లోని అటవీ పర్యావరణం లో నివసిస్తున్న లక్షలాది ప్రజల ను ఉమ్మడి అడవుల నిర్వహణ కమిటీ లు, పర్యావరణ అభివృద్ధి కమిటీల తో అనుసంధానం చేశాము. వారందరూ అడవులు, వన్య మృగాల సంరక్షణ లో భాగస్వాములుగా ఉన్నారు.
మిత్రులారా,
అంతరించిపోతున్న జీవజాలం, ఆవాస ప్రాంతాల పరిరక్షణ లో అనుభవాల ను వెల్లడి చేసుకొని, సామర్థ్యాల నిర్మాణాని కి ఒక చక్కని వేదిక గా ఈ సదస్సు నిలుస్తుందన్న నమ్మకం నాలో ఉంది. భారతదేశాని కి చెందిన ఆతిథ్యాన్ని, సుసంపన్నమైనటువంటి వైవిధ్యాన్ని అనుభూతి చెందే సమయం కూడా మీకు లభిస్తుందని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.