అందరికీ నమస్కారం,
వందేళ్ల క్రితం, పూజనీయ బాపూజీ హిందూస్థాన్ టైమ్స్‌ను ప్రారంభించారు. ఆయన గుజరాతీ మాట్లాడతారు. వందేళ్ల తర్వాత మరో గుజరాతీని మీరు ఇక్కడకు ఆహ్వానించారు. హిందూస్థాన్ టైమ్స్‌కు, ఈ వందేళ్ల చారిత్రక ప్రయాణంలో ఈ పత్రికతో కలసి పనిచేసిన వారికి, అభివృద్ధిలో భాగస్వాములైనవారికి, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ అభినందనలకు, గౌరవానికి వీరంతా అర్హులు. వందేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపునకు మీరంతా అర్హులు, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రాగానే, ఈ కుటుంబ సభ్యులను నేను కలుసుకున్నాను. వందేళ్ల ప్రయాణాన్ని (హిందూస్థాన్ టైమ్స్) తెలియజేసే ప్రదర్శనను సందర్శించాను. మీకు సమయం ఉంటే, ఇక్కడి నుంచి వెళ్లే ముందు దాన్ని సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అది ప్రదర్శన మాత్రమే కాదు. ఓ అనుభవం. నా కళ్ల ముందే వందేళ్ల చరిత్ర నడయాడిన అనుభూతికి నేను లోనయ్యాను. భారత దేశానికి స్వాంతంత్య్రం వచ్చిన రోజు, రాజ్యాంగం అమల్లోకి వచ్చన నాటి పత్రికలను నేను చూశాను. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి విశిష్ట వ్యక్తులు హిందూస్థాన్ టైమ్స్‌లో వ్యాసాలు రాసేవారు. వారి రచనలు పత్రికను సుసంపన్నం చేశాయి. నిజంగా మనం చాలా దూరమే ప్రయాణించాం. స్వాంతంత్య్రం సాధించడానికి చేసిన పోరాటం నుంచి, స్వాంతంత్య్రం అనంతరం సరిహద్దులు లేని ఆశల తరంగాలను చేరుకోవడం వరకు చేసిన ప్రయాణం అద్భుతం, అసాధారణం. అక్టోబర్ 1947లో కశ్మీర్ భారత్‌లో విలీనమైన తర్వాత ప్రతి పౌరుడూ అనుభవించిన ఉత్సాహాన్ని మీ వార్తా పత్రిక ద్వారా తెలుసుకున్నాను. సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో హింస ఎలా చెలరేగిందో కూడా తెలుసుకోగలిగాను. గతానికి భిన్నంగా జమ్ము కశ్మీర్లో రికార్డు స్థాయిలో జరిగిన పోలింగ్‌కు సంబంధించిన వార్తలను ఈ రోజు మీ పత్రికలో ప్రచురిస్తున్నారు. పత్రిక మరో పేజీ కూడా పాఠకుల దృష్టిని ఆకర్షించింది. ఒక వైపు అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారన్న వార్తను ప్రచురిస్తే, మరో పక్క అటల్‌జీ బీజేపీకి పునాది వేశారన్న వార్త ప్రచురించారు. ఈ రోజు అస్సాంలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించడం కాకతాళీయమే.నిన్ననే బోడో ప్రాంత ప్రజలు అట్టహాసంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. దానిని ఢిల్లీ మీడియా పట్టించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. హింస, బాంబులు, తుపాకులు వంటి వాటిని వదిలిపెట్టి అయిదు దశాబ్దాల తర్వాత యువ బోడోలు తమ సాంస్కృతిక ఉత్సవాన్ని ఢిల్లీలో జరుపుకొంటున్నారని వారు గుర్తించలేకపోయారు. ఇది ఒక ప్రధాన చారిత్రక కార్యక్రమం. నిన్న నేను అక్కడ ఉన్నాను. అది నన్ను కదిలించింది. బోడో శాంతి ఒప్పందం అక్కడి ప్రజల జీవితాలను మార్చేసింది. ఎగ్జిబిషన్ సందర్శిస్తున్నప్పుడు 26/11 ముంబయి దాడులకు సంబంధించిన వార్తలను సైతం నేను చూశాను. ఆ సమయంలో పొరుగు దేశం చేసిన ఉగ్రదాడుల కారణంగా తమ ఇళ్లు, నగరాల్లో సైతం తమకు రక్షణ లేదనే అభద్రతాభావనలో ప్రజలుండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆ దేశ ఉగ్రవాదులకు వారి భూభాగంలోనే భద్రత లేదు.
స్నేహితులారా,
తన వందేళ్ల ప్రయాణంలో హిందూస్థాన్ టైమ్స్ 25 ఏళ్ల వలస పాలనకు, 75 ఏళ్ల స్వతంత్రానికి సాక్ష్యంగా నిలిచింది. ఈ వందేళ్లలో భారతదేశ భవిష్యత్తును రూపొందించి, దిశను నిర్దేశించింది సామాన్య భారతీయుడి శక్తి సామర్థ్యాలే. చాలా మంది నిపుణులు సైతం సగటు భారతీయుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. బ్రిటిషు వారు భారతదేశాన్ని వదిలి వెళ్లినప్పుడు ఈ దేశానికి భవిష్యత్తు లేదని, ముక్కలైపోతుందని అన్నారు. ఆత్యయిక పరిస్థితి ఎదురైన సమయంలోనూ అది శాశ్వతంగా ఉండిపోతుందని, ప్రజాస్వామ్యం కూలిపోతుందని చాలా మంది భావించారు. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఆ పరిస్థితికి కారణమైన వారి పక్షాన నిలిచాయి. కానీ భారతీయులు దానికి ఎదురు నిలబడ్డారు. ఎమర్జెన్సీని తొలగించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కరోనా సవాలు ఎదురైన సమయంలో భారత్ ప్రపంచానికి భారంగా మారుతుందని అంతర్జాతీయ సమాజం భావించింది. కానీ భారత పౌరులు పోరాడి పుంజుకోవడం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించారు.
మిత్రులారా,
1990ల నాటి సమయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో భారత్‌లో పదేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి. ఇంత పెద్ద దేశంలో పదేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు! ఈ అస్థిరత నిపుణులు, న్యూస్ పేపర్ కాలమిస్టుల్లో భారత్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందనే భావనను కలిగించింది. ఈ నిపుణుల అభిప్రాయం తప్పని మరోసారి భారతీయులు రుజువు చేశారు. ప్రస్తుతం ప్రపంచం సందిగ్ధత, అస్థిరతను ఎదుర్కొంటోంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వాలు మారే దేశాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. కానీ భారత్ లో మాత్రం వరుసగా మూడు సార్లు ఒకే ప్రభుత్వం ఎన్నికైంది.
స్నేహితులారా,
మీలో చాలామంది భారత రాజకీయాలను, విధానాలను చాలాకాలంగా అనుసరిస్తూనే ఉన్నారు. ‘‘మంచి ఆర్థికమంటే చెడు రాజకీయాలే’’ అని నానుడి తరచూ వినిపించేది. నిపుణులని పేరు పెట్టుకున్నవారంతా ఈ భావాన్ని బాగా ప్రోత్సహించారు. గత ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఉండే అవకాశాన్నిచ్చారు. మరో మాటలో చెప్పాలంటే అసమర్థ పాలనను కప్పిపుచ్చే మార్గంగా అది మారింది. ఇంతకు ముందు ప్రభుత్వాలు తర్వాతి ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే పనిచేసేవి. ఓటు బ్యాంకును సృష్టించి, వారిని సంతోషపరిచే విధంగా మాత్రమే విధాననిర్ణయాల రూపకల్పన జరిగేది. ఈ తరహా రాజకీయాల వల్ల దేశంలో అసమానత, అసమౌతల్యం ఏర్పడి తీరని నష్టం జరిగింది. అభివృద్ధికి సంబంధించిన ప్రకటన చాలా అరుదుగా వచ్చేది. ఈ విధానం ప్రభుత్వంపై నమ్మకాన్ని క్షీణింపచేసింది. ఓటుబ్యాంకు రాజకీయాలకు వేల మైళ్ల దూరంలో ఉంటూ, స్పష్టమైన ఉద్దేశంతో ఈ నమ్మకాన్ని మేము తిరిగి నిలబెట్టగలిగాం. మా ప్రభుత్వం ఉద్దేశం ఉన్నతమైనది, సమగ్రమైనది: మేము ‘ప్రజల అభివృద్ధి, ప్రజలతో అభివృద్ధి, ప్రజల కోసం అభివృద్ధి’ అనే మంత్రాన్ని జపిస్తున్నాం. మా లక్ష్యం వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్)ను రూపొందించడం. పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు, భారత పౌరులు మాపై నమ్మకం ఉంచారు. ఈ సామాజిక మాధ్యమ యుగంలో తప్పుడు సమాచార ప్రభావం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. లెక్కలేనన్ని పత్రికలు, ఛానళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ప్రజలు మాపై, మా ప్రభుత్వంపై నమ్మకం ఉంచారు.
మిత్రులారా,
ప్రజల నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు, అది జాతీయ అభివృద్ధిపై మునుపెన్నడూ లేని ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రాచీన నాగరికతల నుంచి నేడు అభివృద్ధి చెందిన దేశాల వరకు కనిపించే ఒక సాధారణ లక్షణం సవాళ్లను స్వీకరించడం. ఒకప్పుడు మన దేశం వాణిజ్యం, సంస్కృతికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఓ వైపు మన వ్యాపారస్తులు, వర్తకులు ఆగ్నేసియాలో వ్యాపారాలు నిర్వహించేవారు. మరో వైపు అరబ్బు, ఆఫ్రికా, రోమన్ రాజ్యాలతో బలమైన బంధాలను కొనసాగించేవారు. వారు సవాళ్లను స్వీకరించారు కాబట్టే సుదీర్ఘ తీరాలకు భారతీయ ఉత్పత్తులను చేరవేయడం సాధ్యమైంది. స్వాంతంత్య్రం తర్వాత మనం తెగువను ప్రదర్శించే స్ఫూర్తిని పెంచుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. గత ప్రభుత్వాలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నాలేమీ చేయలేదు. ఫలితంగా కొన్ని తరాలు ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వేశాయి.
గడచిన దశాబ్డంలో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. భారతీయుల్లో సవాళ్లను స్వీకరించే స్ఫూర్తి పెరిగింది. తెగువ కలిగిన మనదేశ యువత ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉన్నారు. ఒకప్పుడు ఏదైనా సంస్థను స్థాపించాలంటే సాహసంతో కూడుకున్న వ్యవహారంగా అనిపించేది. పదేళ్ల క్రితం అంకుర సంస్థల కథలు చాలా అరుదుగా వినిపించేవి. కానీ ఇప్పుడు దేశంలో 1,25,000 రిజిస్టరయిన అంకుర సంస్థలు ఉన్నాయి. క్రీడలను వృత్తిగా ఎంచుకోవడమంటే అదో ప్రమాదకరమైన వృత్తిగా భావించిన సమయం ఉండేది. కానీ ఈ రోజు చిన్న నగరాల నుంచి వచ్చిన యువత సైతం సవాలును స్వీకరించి దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నవారు మరో ఉదాహరణ. ప్రస్తుతం మన దేశంలో దాదాపుగా కోటి మంది ‘లఖ్‌పతీ దీదీ’లు ఉన్నారు. వారు గ్రామాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే ఓ మహిళతో నేను మాట్లాడాను. ట్రాక్టర్ కొనుగోలు చేయడం ద్వారా తన కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందో ఆమె వివరించింది. ఇక మహిళ తెగువ ప్రదర్శించి మొత్తం తన కుటుంబంలోని వారి జీవితాలను మార్చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మార్పు కనిపిస్తుంది. ఈ రోజు మనం భారత్‌లో చూస్తున్నది ఇదే.
స్నేహితులారా,
భారతీయ సమాజం ఇప్పుడు అపూర్వమైన ఆకాంక్షలతో నిండి ఉంది. దానిని మా విధానానికి పునాదిగా మలుచుకున్నాం. మా ప్రభుత్వం పౌరులకు ఉపాధిని కల్పించేందుకు పెట్టుబడి, గౌరవాన్ని పెంచే అభివృద్ధిల మేలు కలయికను మా ప్రభుత్వం అందిస్తుంది. పెట్టుబడులను సృష్టించి, ఉపాధిని కల్పించి, భారతీయ ప్రజల గౌరవాన్ని పెంపొందించే అభివృద్ధి నమూనాను మేం ప్రోత్సహిస్తున్నాం. ఉదాహరణకు దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం. చిన్నవిగా కనిపించినప్పటీ గణనీయమైన విలువ కలిగిన సమస్యల గురించి నేను మాట్లాడుగతున్నాను. సోదాహరణంగా నేను మీకు దీన్ని వివరిస్తాను. మరుగుదొడ్లు నిర్మించి తద్వారా సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజల భద్రతను, గౌరవాన్ని కాపాడటమే మా లక్ష్యం. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కోట్లాది టాయిలెట్లు కట్టించారని ప్రజలు చర్చించుకున్నారు.
ఈ లెక్కలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి టాయిలెట్ నిర్మాణం కోసం ఉపయోగించిన ఇటుకలు, ఇనుము, సిమెంట్ లాంటి వాటితో ముడిపడి ఉపాధి కల్పన జరిగింది. ఈ వస్తువులన్నీ ఏదో ఒక దుకాణం నుంచి కొన్నవే, ఏదో ఒక పరిశ్రమ ఉత్పత్తి చేసినవే. వాటిని ఎవరో ఒక రవాణాదారుడు ఇంటికి తరలించే ఉంటారు. అంటే దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందని, పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన జరిగిందని అర్థమవుతుంది. ఫలితంగా జీవనం సులభమైంది. ప్రజల్లో మర్యాద, ఆత్మ గౌరవం పెరిగాయి. అదనంగా అభివృద్ధి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది ఉపాధిని కల్పించే పెట్టుబడులు, గౌరవానికి భరోసా ఇచ్చే అభివృద్ధి అనే విజయసూత్రాన్ని ఇది సూచిస్తుంది.
స్నేహితులారా,
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు మరో ఉదాహరణ. గతంలో గ్యాస్ సిలిండర్ ఉండటం అంటే అది స్థాయికి చిహ్నంగా ఉండేది. గ్యాస్ పొయ్యి ఉంది కాబట్టి వారిని ఇరుగుపొరుగువారు ప్రభావవంతమైన వ్యక్తులుగా, గొప్ప స్థాయి కలిగిన వారిగా చూసేవారు. గ్యాస్ కనెక్షన్ లేని వారు గ్యాస్ పొయ్యిపై వంట చేసుకునేందుకు ఎదురుచూసేవారు. గ్యాస్ కనెక్షన్ కోసం పార్లమెంటు సభ్యుల నుంచి సిఫార్సు లేఖలు తీసుకెళ్లే పరిస్థితి. నేను మాట్లాడుతున్నది 18వ శతాబ్ధం గురించి కాదు 21వ శతాబ్ధపు తొలినాళ్ల గురించే. 2014కి ముందు, ప్రభుత్వాలు ఏడాదికి గ్యాస్ సిలిండర్లు ఆరు ఇవ్వాలా తొమ్మిది ఇవ్వాలా అని చర్చిస్తూ ఉండేవి. ఆ చర్చల నుంచి మా దృష్టిని మరల్చి అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యమిచ్చాం. స్వాంతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో ఇచ్చిన వాటి కంటే గత పదేళ్లలో మేం ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లే ఎక్కువ. 2014లో దేశంలో 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఈ రోజు 30 కోట్లకు అవి పెరిగాయి. వినియోగదారులు భారీగా పెరిగనప్పటికీ ఎప్పుడైనా గ్యాస్ కొరత గురించి మీరు విన్నారా? లేదు. మీరు వినలేదు. ఇలాంటి వార్తను హిందూస్థాన్ టైమ్స్‌లో ఏమైనా ప్రచురించారా? లేదు. ఎందుకంటే ఇది జరగలేదు కాబట్టి. ఎందుకంటే మేము మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు పెట్టుబడులు పెట్టాం. దేశవ్యాప్తంగా బాటిలింగ్ ప్లాంట్లు, పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశాం. సిలిండర్లను నింపే కేంద్రాల నుంచి వాటిని పంపిణీ చేసేంత వరకు ఉద్యోగ కల్పన జరిగింది.
స్నేహితులారా,
ఇలాంటివి లెక్కలేనన్ని ఉదాహరణలు నేను మీకు ఇస్తాను. ఉదాహరణకు మొబైల్ ఫోన్లు లేదా రూపే కార్డులను తీసుకోండి. గతంలో డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే అది తమ హోదాకి చిహ్నంగా భావించేవారు. వాటిని గర్వంగా చూపించేవారు. ఆ కార్డులను చూసి ఏదో ఒక రోజు తమకంటూ వాటిని సంపాదించుకోవాలని పేదవారు కలలు కనేవారు. కానీ రూపే కార్డు రాకతో మన దేశంలోని పేదవారు కూడా డెబిట్, క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. ఫలితంగా వారు అందరితోనూ సమానమనే భావన కలగడంతో పాటు వారి ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు పేదరికంలో ఉన్నవారు సైతం ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. ఖరీదైన కారులో దిగిన వ్యక్తి పెద్ద మాల్‌లో ఏ యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగిస్తున్నారో వీధి వ్యాపారి కూడా అదే వ్యవస్థను వాడుతున్నారు. పెట్టుబడులు ఉపాధిని ఎలా పెంచుతాయో, అభివృద్ధి గౌరవాన్ని ఎలా పెంచుతుందో తెలియజేసేందుకు ఇదో గొప్ప ఉదాహరణ.
స్నేహితులారా,
ప్రస్తుత భారత పురోభివృద్ధిని అర్థం చేసుకోవడానికి, మా ప్రభుత్వ విధానాన్ని పరిశీలించడం చాలా అవసరం. ఆ విధానాల్లో ఒకటి ‘ప్రజల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం’, ‘ప్రజల కోసం పెద్దమొత్తంలో ఆదా చేయడం’ ఇది మేం అనుసరిస్తున్న మరో విధానం. మేం దీన్ని ఎలా చేయగలుగుతున్నామో మీలో ఆసక్తిని కలిగించవచ్చు. 2014లో మా బడ్జెట్ సుమారుగా రూ.16 లక్షల కోట్లు. ప్రస్తుతం ఈ బడ్జెట్ రూ.48 లక్షల కోట్లకు చేరుకుంది. 2013-14లో మూలధన వ్యయం రూపేణా రూ. 2.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రోజు ఆ మూలధన వ్యయం రూ.11లక్షల కోట్లను దాటింది. ఈ రూ.11 లక్షల కోట్లను ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్లు, రైల్వేలు, పరిశోధనా కేంద్రాలు, ప్రజలకు అవసరమయ్యే ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఉపయోగిస్తున్నాం. ప్రజా వ్యయాన్ని పెంచుతూనే, ప్రజా ధనాన్ని పొదుపు చేస్తున్నాం. మీకు ఆసక్తి కలిగించే కొన్ని లెక్కలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఉదాహరణకు, లబ్ధిదారునికి నేరుగా నగదు బదిలీ (డీబీటీ) చేయడం ద్వారా మధ్యలో జరిగే నష్టాలను నివారించి దేశంలో సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాం. ఆయుష్మాన్ భారత్ పథకం అందించిన ఉచిత వైద్య సేవల కారణంగా పేదవారికి రూ.1.1 లక్షల కోట్లు ఆదా అయింది. ఔషధాలను 80శాతం రాయితీతో ఇచ్చే జనఔషధి కేంద్రాల ద్వారా రూ. 30,000 కోట్ల సొమ్మును పౌరులు ఆదా చేయగలిగారు. స్టెంట్లు, మోకాలి ఇంప్లాట్ల ధరలను నియంత్రించడం ద్వారా వేల కోట్ల ప్రజల ధనం ఆదా అయింది. ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించే ఉజాలా పథకం రూ.20,000 కోట్ల మేర విద్యుత్ బిల్లులను తగ్గించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రోగాలను తగ్గించి ప్రతి గ్రామీణ కుటుంబానికి రూ.50,000ను ఆదా చేసింది. టాయిలెట్లు ఉన్న కుటుంబాలు ఒక్కోటీ రూ.70,000 వరకు ఆదా చేస్తాయని యునిసెఫ్ నివేదికలు తెలిపాయి.
మిత్రులారా,
మొదటిసారి కుళాయి కనెక్షన్లు పొందిన 12 కోట్ల కుటుంబాలపై డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం చేపట్టింది. దీనిలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల ఆ కుటుంబాలు ఏడాదికి రూ. 80,000 ఆదా చేశారని తేలింది.
స్నేహితులారా,
పదేళ్ల క్రితం భారతదేశం ఇంతగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మన విజయం పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయాలనే స్ఫూర్తిని మనకు ఇస్తుంది. ఈ శతాబ్ధం భారతదేశపు శతాబ్ధమవుతుందని మేం విశ్వసిస్తున్నాం. దీన్ని సాకారం చేయడానికి అన్ని రంగాల్లోనూ మా ప్రయత్నాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మనం వేగంగా ముందుకెళుతున్నాం. ప్రతి రంగంలోనూ మన సత్తాను చాటేలా ముందుకు సాగాలి. ఉత్తమమైన దానికంటే ఏదీ ఆమోదయోగ్యం కాదు అనే దృక్పథం మనం అలవరుచుకోవాలి. భారత్ పాటించే ప్రమాణాలు అత్యుత్తమమైనవిగా ఈ ప్రపంచం గుర్తించే విధంగా మనం విధానాలను రూపొందించాలి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా నాణ్యమైన వస్తువులను మాత్రమే మనం తయారుచేయాలి. మన నిర్మాణ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలుగా గుర్తించాలి. విద్యారంగంలో మన కృషి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించాలి. వినోద రంగంలో అంతర్జాతీయ ప్రశంసలు పొందేవాటిని రూపొందించాలి. ఈ విధానాన్ని ప్రచారం చేయడంలో హిందూస్థాన్ టైమ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ‘వికసిత్ భారత్’ ప్రయాణంలో మీ వందేళ్ల అనుభవం అమూల్యమైనది.
స్నేహితులారా,
మనం ఈ అభివృద్ధి వేగాన్ని కొనసాగించి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామనే విశ్వాసం నాకుంది. భారత్ వందేళ్ల స్వాంతంత్య్ర ఉత్సవాలను జరుపుకొనే సమయానికి హిందూస్థాన్ టైమ్స్‌కి కూడా 125 ఏళ్ల వయస్సు వస్తుంది. ‘వికసిత్ భారత్’లో ప్రధాన వార్తాపత్రికగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ ప్రయాణానికి మీరే సాక్షులుగా ఉంటారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీకో పని అప్పగిస్తాను. (శోభన) భర్తీయా జీ ఇదీ మీ బాధ్యత.
మన గొప్ప సాహితీవేత్తల రచనలపై పరిశోధనలు జరిగాయి. వివిధ అంశాలపై పరిశోధనకు పీహెచ్‌డీలు అందించారు. వందేళ్ల హిందూస్థాన్ టైమ్స్ ప్రయాణంపై పీహెచ్‌డీ చేస్తే? ఇది వలస పాలన, స్వాంతంత్య్ర అనంతర కాలాన్ని, కరవు రోజులను, ప్రభావశీలిగా మారిన తరుణాలకు సాక్షిగా నిలిచిన భారతీయ పాత్రికేయ ప్రయాణాన్ని వెలుగులోకి తీసుకువస్తుంది. ఇది గొప్ప పనిగా నేను పరిగణిస్తాను. సామజిక సేవా కార్యక్రమాలకు బిర్లా కుటుంబం పేరు గాంచింది. భారతదేశంతో పాటు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో హిందూస్థాన్ టైమ్స్ కేంద్రం ఏర్పాటు చేసి, పరిశోధనలు నిర్వహించి అసలైన భారత గుర్తింపును అంతర్జాతీయంగా వెలుగులోకి ఎందుకు తీసుకురాకూడదు? మీ పత్రిక ఎన్నో గొప్ప విజయాలను సాధించింది. వందేళ్లుగా మీరు సంపాదించిన గౌరవం, నమ్మకం హిందూస్థాన్ టైమ్స్ పరిధిని దాటి సేవలు అందిచగలదు. ఈ శతాబ్ధి ఉత్సవాలు ఇక్కడితో ముగిసిపోదని, మరిన్ని కార్యక్రమాలకు వేదికగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. రెండోది, మీరు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చాలా బాగుంది. దాని డిజిటల్ వర్షన్‌ను సమగ్ర వ్యాఖ్యానంతో రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాగలరా? ఇది భారతీయ చరిత్రలో ఎదురైన సవాళ్లు, సాధించిన అభివృద్ధికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఈ విషయంలో బాగా శ్రమించి ఉంటారని భావిస్తున్నాను. దీనిని డిజిటల్‌గా మార్చడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు ఆకర్షణీయమైన అభ్యాస సాధనంగా మారగలదని నేను విశ్వసిస్తున్నాను.
స్నేహితులారా,
వందేళ్లు ఓ విలువైన మైలు రాయి. ఈ మధ్య నేను వివిధ రకాల పనులతో తీరిక లేకుండా ఉన్నాను. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని నేను చేజార్చుకోవాలనుకోలేదు. ఇక్కడ నేను ఉండాలనుకున్నాను. ఎందుకంటే వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడమే పెద్ద ఘనత. ఈ సందర్భంగా మీకు, మీ సహోద్యోగులకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు!