మహానుభావులారా,
మహిళలు మరియు సజ్జనులారా,
నమస్కారం.
వణక్కమ్.
చరిత్ర మరియు సంస్కృతి ల పరం గా సమృద్ధం అయినటువంటి చెన్నై నగరాని కి మీ అందరికి ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ను చూడడానికి మీకు కొంత సమయం చిక్కుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడి స్ఫూర్తిదాయకం అయిన శిల్ప కళ మరియు గొప్ప శోభ ల వల్ల అది ‘‘తప్పక చూసితీరవలసిన’’ ప్రదేశం అని చెప్పుకోవచ్చును.
మిత్రులారా,
రెండు వేల సంవత్సరాల క్రితం నాటి గ్రంథం తిరుక్కురళ్ నుండి కొన్ని మాటల ను ఉదాహరిస్తూ నా ప్రసంగాన్ని మొదలు పెట్టనివ్వండి. మహర్షి తిరువళ్ళువర్ గారు ఇలా అన్నారు.. ‘‘నెడుంకడలుమ్ తన్నీర్ మై కుండుమ్ తాడిన్తెడిలీ తాన్ నాల్గా తాగి విడిన్’’ ఈ మాటల కు.. ‘‘మహా సముద్రాల లోని నీటి ఆవిరి ని గ్రహించిన మేఘాలు గనుక ఆ జలాల ను వర్షం రూపం లో తిరిగి ఇవ్వకపోయినట్లయితే, సాగరాలు సైతం ఇగుర్చుకుపోతాయి’’ అని అర్థం. భారతదేశం లో ప్రకృతి మరియు ప్రకృతి యొక్క స్వభావం జ్ఞానార్జన కు మార్గాలు గా ఉంటూ వచ్చాయి. ఈ సంగతి ని అనేక ధర్మ గ్రంథాల లో, నానుడుల లో గ్రహించవచ్చును. మేం నేర్చుకున్న అంశాల లో ‘‘పిబన్తీ నధ్యః స్వయమేవ నాంభః, స్వయం న ఖాదన్తి ఫలాని వృక్షాః, నాదన్తి స్వయం ఖలు వారివాహాః, పరోపకారాయ సతాం విభూతయాః ’’ అనేది కూడా ఉంది. ఈ మాటల కు.. ‘‘నదులు వాటి లోపలి నీటి ని త్రాగ లేవు, మరి వృక్షాలు వాటి సొంత ఫలాల ను ఆరగించ లేవు. మేఘాలు వాటి లోని జలం తో తయారైన తిండి గింజల ను భుజించ జాలవు’’ అని భావం. ప్రకృతి మనల ను పోషిస్తున్నది, మనం కూడా తప్పక ప్రకృతి ని సంరక్షించాలి, ధరణి మాత ను సంరక్షించడం, ధరణి మాత పట్ల శ్రద్ధ వహించడం అనేవి మన మౌలిక బాధ్యతలు గా ఉన్నాయి. ప్రస్తుతం లో ఇదే ‘క్లయిమేట్ యాక్శన్’ రూపాన్ని సంతరించుకొన్నది. ఇలా ఎందుకు అంటే, ఈ కర్తవ్యాన్ని చాలా కాలం గా ఎంతో మంది ఉపేక్షిస్తూ వచ్చారు. భారతదేశం యొక్క సాంప్రదాయిక జ్ఞానాన్ని బట్టి చూస్తే, క్లయిమేట్ యాక్శన్ అనేది ఆవశ్యం ‘అంత్యోదయ’ ను అనుసరించాలని నేను బల్లగుద్ది చెప్తాను. అంటే మనం సమాజం లో చిట్టచివరి వ్యక్తి యొక్క ఉన్నతి మరియు అభివృద్ధి కి పూచీ పడాలన్న మాట. గ్లోబల్ సౌథ్ దేశాలు జలవాయు పరివర్తన మరియు పర్యావరణ సంబంధి అంశాల తో, మరీ ముఖ్యం గా ప్రభావితం అయ్యాయి. మనం ‘‘యుఎన్ క్లయిమేట్ కన్ వెన్శన్’’, ఇంకా ‘‘పేరిస్ అగ్రీమెంట్’’ లలో భాగం గా చెప్పుకొన్న సంకల్పాల విషయం లో కార్యాచరణ ను వృద్ధి పరచుకోవలసిన అవసరం ఉంది. ఈ కార్యాచరణ గ్లోబల్ సౌథ్ దేశాలు వాటి అభివృద్ధి సంబంధి మహత్వాకాంక్షల ను శీతోష్ణస్థితి కి మిత్ర పూర్వకం గా ఉండే రీతి లో నెరవేర్చుకోవడం లో కీలకం అవుతుంది.
మిత్రులారా,
భారతదేశం తన మహత్వాకాంక్ష యుక్తమైనటువంటి ‘‘నేశనల్లీ డిటర్ మిన్డ్ కాంట్రిబ్యూశన్’’ ద్వారా మార్గదర్శి గా ఉంది అని చెప్పడాని కి నేను గర్వపడుతున్నాను. భారతదేశం తాను నిర్దేశించుకొన్న 2030 వ సంవత్సరాని కల్లా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్తు స్థాపిత సామర్థ్యం సాధన అనే లక్ష్యాన్ని అంతకు తొమ్మిది సంవత్సరాల ముందుగానే సాధించింది. మరి, మేం మా యొక్క తాజా లక్ష్యాల ద్వారా మరింత ముందడుగు ను వేశాం. ప్రస్తుతం భారతదేశం నవీకరణ యోగ్య శక్తి స్థాపిత సామర్థ్యం పరం గా చూస్తే ప్రపంచం లోని అగ్రగామి 5 దేశాల లో ఒకటి గా నిలచింది. మేం 2070 వ సంవత్సరానికల్లా ‘‘నెట్ జీరో’’ ను సాధించాలన్న లక్ష్యాన్ని కూడాను పెట్టుకొన్నాం. ఇంటర్ నేశనల్ సోలర్ అలాయన్స్, సిడిఆర్ఐ, ఇంకా ద ‘‘లీడర్ శిప్ గ్రూప్ ఫార్ ఇండస్ట్రీ ట్రాంజీశన్’’ లు సహా పలు కూటముల ద్వారా మా భాగస్వామ్య దేశాల తో సహకరించడాన్ని కొనసాగిస్తాం.
మిత్రులారా,
భారతదేశం ఒక మహా వైవిధ్యభరితం అయినటువంటి దేశం గా ఉంది. జీవవైవిధ్య సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ మరియు సంవర్ధనీకరణ సంబంధి కార్యాచరణ విషయం లో మేం నిరంతరాయం గా అగ్రభాగాన నిలచాం. ‘‘గాంధీనగర్ ఇంప్లిమెంటేశన్ రోడ్ మేప్ ఎండ్ ప్లాట్ ఫార్మ్’’ ద్వారా కార్చిచ్చు లు మరియు గనుల తవ్వకం వల్ల ప్రభావితం అయినటువంటి ప్రాధాన్య భూ భాగాల పునరుద్ధరణ ను మీరు గుర్తెరుగుతున్నారు. భారతదేశం మన భూ గ్రహం లోని ఏడు పెద్ద పులుల జాతుల సంరక్షణ కోసం ‘‘ఇంటర్ నేశనల్ బిగ్ కేట్ అలాయన్స్’’ ను ఇటీవలే ప్రారంభించింది. అది మా మార్గనిర్దేశకమైనటువంటి సంరక్షణ కార్యక్రమం ‘ప్రాజెక్టు టైగర్’ నుండి మేం నేర్చుకొన్న అంశాల పై ఆధారపడి ఆవిష్కరించినటువంటి ఒక వేదిక గా ఉంది. ప్రాజెక్ట్ టైగర్ ఫలితం గా ప్రస్తుతం ప్రపంచం లోని వ్యాఘ్రాల లో 70 శాతం వ్యాఘ్రాలు భారతదేశం లో మనుగడ సాగిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. మేం ప్రాజెక్ట్ లయన్ మరియు ప్రాజెక్ట్ డాల్ఫిన్ ల గురించి కూడా కసరత్తు చేస్తున్నాం.
మిత్రులారా,
భారతదేశం అమలు పరచే కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం తో ముందుకు కదులుతున్నాయి. ‘‘మిశన్ అమృత్ సరోవర్’’ ఒక విశిష్టమైనటువంటి జల సంరక్షణ సంబంధి కార్యక్రమం గా ఉంది. ఈ మిశన్ లో భాగం గా అరవై మూడు వేల పైచిలుకు జల వనరుల ను కేవలం సుమారు ఒక సంవత్సరం లో అభివృద్ధి పరచడం జరిగింది. ఈ మిశన్ ను సాంకేతిక విజ్ఞానం సాయం తో సముదాయ భాగస్వామ్యం ద్వారా అమలు పరచడమైంది. ‘కేచ్ ద రేన్’ ప్రచార ఉద్యమం లో మేం చక్కటి ఫలితాల ను సాధించాం. నీటి ని సంరక్షించడం కోసం రెండు లక్షల ఎనభై వేల కు పైగా హార్ విస్టింగ్ స్ట్రక్చర్ లను ఈ ప్రచార ఉద్యమం లో తీర్చిదిద్దడమైంది. దీని కి అదనం గా రీ యూస్ అండ్ రీ ఛార్జ్ స్ట్రక్చర్ లను రమారమి రెండు లక్షల యాభై వేల సంఖ్య లో రూపొందించడమైంది. ఇది అంతా కూడా ను స్థానిక భూ స్థితి ని మరియు జల స్థితి ని గమనించి ప్రజల భాగస్వామ్యం ద్వారా సాకారం చేయడమైంది. గంగ నది శుద్ధి కై మేము తలపెట్టిన ‘‘నమామి గంగే మిశన్’’ లోను సముదాయ భాగస్వామ్యాన్ని ప్రభావశీలం అయిన రీతి లో వినియోగించుకొన్నాం. దీనితో గంగ నది లో అనేక చోటుల లో ఆ నది లో మాత్రమే అగుపించేటటువంటి డాల్ఫిన్ లు మరోమారు ఉనికి లోకి రావడం అనే ప్రధానమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. మాగాణి నేల సంరక్షణ కోసం మేం సాగించిన ప్రయాస లు సైతం ఫలించాయి. 75 మాగాణి నేలల ను రాం సర్ స్థలాలుగా పేర్కొన్నందువల్ల ఆసియా లోనే అతి పెద్ద రాం సర్ స్థలాల ను కలిగివున్నటువంటి దేశం అయింది.
మిత్రులారా,
ప్రపంచం అంతటా మూడు వందల కోట్ల మంది కి పైగా ప్రజల బ్రతుకుతెరువు కు మన మహా సముద్రాలు దన్ను గా నిలుస్తున్నాయి. అవి ఒక కీలకమైన ఆర్థిక వనరుగా ఉన్నాయి. ప్రత్యేకించి ‘‘చిన్న ద్వీప దేశాలు’’ - వాటి ని నేను ‘‘పెద్ద సాగర దేశాలు’’ అని పిలవడానికి ఇష్టపడతాను- అవి విస్తృతమైన జీవ వైవిధ్యాని కి ఆలవాలం గా కూడాను ఉంటున్నాయి. ఈ కారణం గా మహాసముద్ర వనరుల ను సంబాళించడం, బాధ్యతాయుతం గా ఉపయోగించుకోవడం ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశాలు గా ఉన్నాయి. ‘‘ఒక స్థిర ప్రాతిపదిక కలిగినటువంటి మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి బ్లూ ఇకానమి కై మరియు సాగర ఆధారిత ఆర్థిక వ్యవస్థ కై నడుం కట్టిన జి20 ఉన్నత స్థాయి సిద్ధాంతాల కు ఆమోద ముద్ర లభిస్తుందని నేను ఆశ పడుతున్నాను. ఈ సందర్భం లో ప్లాస్టిక్ సంబంధి కాలుష్యాని కి స్వస్తి పలకడం కోసం అంతర్జాతీయ స్థాయి లో చట్టబద్ధమైన ఒక ప్రభావశీల సాధనాన్ని ప్రవేశపెట్టడానికి జి-20 సభ్యత్వ దేశాలు తదేకం గా కృషి చేయాలి అని కూడా నేను కోరుతున్నాను.
మిత్రులారా,
కిందటి సంవత్సరం లో, ఐక్య రాజ్య సమితి సెక్రట్రి జనరల్ తో కలసి నేను ‘మిశన్ లైఫ్’ - లైఫ్ స్టయిల్ ఫార్ ఎన్ వైరన్ మంట్ ను ప్రారంభించాను. మిశన్ లైఫ్ అనేది ఒక ప్రపంచ వ్యాప్త ప్రజా ఉద్యమం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వ్యక్తిగత మరియు సామూహిక కార్యాచరణ కు ఇది ప్రేరణ ను ఇస్తుంది. భారతదేశం లో ఏ వ్యక్తి, ఏ సంస్థ లేదా ఏ స్థానిక సంస్థ అయినా సరే వారు చేపట్టేటువంటి పర్యావరణ మిత్రపూర్వక కార్యాలు గుర్తింపునకు నోచుకోకుండా ఉండబోవు. తత్సంబంధి కార్యాచరణ ఇటీవల ప్రకటించిన ‘‘గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్’’ లో భాగం గా ఇక మీదట గ్రీన్ క్రెడిట్స్ ను సంపాదించి పెడుతుంది. దీనికి అర్థం మొక్కల ను పెంచడం, నీటి ని సంరక్షించడం, దీర్ఘకాలం పాటు వ్యవసాయం వంటి కార్యకలాపాలు ఇక వ్యక్తుల కు, స్థానిక సంస్థల కు మరియు ఇతర పక్షాల కు ఆదాయాన్ని అందించ గలుగుతాయి అన్నమాట.
మిత్రులారా,
నా ప్రసంగాన్ని ముగించే ముందు మనం ప్రకృతి మాత పట్ల మన కర్తవ్యాల ను మరచిపోకూడదు అని నన్ను పునురుద్ఘాటించనివ్వండి. ముక్కచెక్కల తరహా విధానాల ను ప్రకృతి మాత హర్షించదు. ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అంటే ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే సూత్రం పట్ల మొగ్గుచూపుతుంది. మీరంతా ఒక సార్థకమైనటువంటి మరియు ఫలప్రదమైనటువంటి సమావేశం నిర్ణయాల తో ముందుకు వస్తారని నేను కోరుకొంటున్నాను. మీకు ఇవే ధన్యవాదాలు.
నమస్కారం.