QuoteIt is a matter of great joy to have handed over appointment letters for government jobs to 51 thousand youth in the Rozgar Mela
QuoteIt is our commitment that the youth of the country should get maximum employment: PM
QuoteToday India is moving towards becoming the third largest economy in the world: PM
QuoteWe promoted Make in India in every new technology,We worked on self-reliant India: PM
QuoteUnder the Prime Minister's Internship Scheme, provision has been made for paid internships in the top 500 companies of India: PM

అంద‌రికీ న‌మ‌స్కారం!

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగాగల యువ మిత్రులు, సోదరసోదరీమణులారా!

ఈ రోజు ధ‌న్‌తేర‌స్ ప‌ర్వ‌దినం... ఈ సందర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దీంతోపాటు దీపావళి వేడుకలు కూడా చేసుకోబోతున్నాం. ఈ ఏడాది పండుగ మనకు అత్యంత ప్రత్యేకం. ఏటా చేసుకునే వేడుకలే కదా... ఈసారి దీపావళికి అంత ప్రత్యేకత ఏమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఆ వైశిష్ట్యం ఏమిటంటే- శ్రీరాముడు (రామ్ లల్లా-బాల రాముడు) అర్ధ శతాబ్దం (500 ఏళ్ల) తర్వాత ఈ ఏడాదిలోనే అయోధ్యలోని తన అద్భుత ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ బాల రాముని ప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపావళి. ఎన్నో తరాలు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూశాక, లక్షలాదిగా ప్రజల త్యాగాలు, కష్టాల అనంతరం ఆవిష్కృతమైన మధుర క్షణమిది. అంతటి అత్యద్భుత, అసాధారణ దీపావళి వేడుకలకు  ప్రత్యక్ష సాక్షులం కావడం నిజంగా మన సుకృతం.

ఈ వేడుకల నడుమ, ఇంతటి పవిత్ర దినాన నేటి ఉపాధి సమ్మేళనంలో 51,000 మంది యువత ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నా అభినందనలు.. శుభాకాంక్షలు.

 

|

మిత్రులారా!

దేశంలోని లక్షలాది యువతకు శాశ్వత ప్రభుత్వోద్యోగ కల్పన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. బీజేపీ, ‘ఎన్‌డిఎ’ పాలనలోగల రాష్ట్రాల్లోనూ లక్షలాది యువతకు నియామక పత్రాలు జారీ చేశారు. ఇందులో భాగంగా హర్యానాలో ఇటీవల కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తక్షణమే 26,000 మందికి ఉపాధి కానుక ఇచ్చింది. అంబరాన్నంటిన ఆనందంతో యువత సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలను ఆ రాష్ట్రం గురించి తెలిసిన వారు సులువుగా ఊహించుకోగలరు. హర్యానాలోని మా పార్టీ ప్రభుత్వం ఒక విశిష్ట విధానాన్ని అనుసరిస్తోంది- అక్కడ ఉపాధి కల్పనలో ఎలాంటి వ్యయప్రయాసలు, లంచగొండి లావాదేవీలకు తావుండదు. ఈ నేపథ్యంలో 26,000 మంది హర్యానా యువతకు ఈ వేదిక నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. దీనికి అదనంగా ఈ రోజు 51 వేల మందికి నియామక పత్రాల జారీతో ఉపాధి కల్పనలో మనం గణనీయ ప్రగతి సాధించడం హర్షణీయం.

మిత్రులారా!

దేశ యువతకు గరిష్ఠ స్థాయిలో ఉపాధి కల్పన మా బాధ్యత. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు ఉపాధి కల్పనను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో నేడు  దేశమంతటా ఎక్స్‌ ప్రెస్‌వేలు, హైవేలు, రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఫైబర్ లైన్లు, మొబైల్ టవర్ల ఏర్పాటు వంటి ఎన్నో ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేశం నలుమూలలా కొత్త పరిశ్రమల విస్తరణకు బాటలు వేస్తున్నాం. కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణం సహా నీటిసరఫరా, గ్యాస్ పైప్‌లైన్లు విస్తృతంగా వేస్తున్నాం. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల ద్వారా రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిక అనుగుణంగా కొనసాగే ఈ కార్యక్రమాలు పౌరులకు మెరుగైన సౌకర్యాలతోపాటు లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తున్నాయి.

మిత్రులారా!

నిన్నటి నా వడోదర పర్యటనలో భాగంగా అక్కడ రక్షణ రంగ రవాణా విమానాల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. ఈ ఒక్క ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా వేలాది మందికి ఉపాధి లభించడం మాత్రమే కాదు... విమానాల ఉత్పత్తికి విడిభాగాల అవసరం విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఇది గణనీయ సంఖ్యలో అదనపు ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తుంది. ఈ విడి భాగాల తయారీ, సరఫరా కోసం అనేక చిన్న కర్మాగారాల నెట్‌వర్క్ ఏర్పడుతుంది. ఇందులో దేశంలోని సూక్ష్మ-లఘు-మధ్యతరహా (ఎంఎస్ఎంఇ) పరిశ్రమలు అంతర్భాగమవుతాయి. దీంతోపాటు డిమాండుకు అనుగుణంగా కొత్త ‘ఎంఎస్ఎంఇ’లు కూడా ఏర్పాటు కాగలవు. ఒక విమానం తయారీకి 15,000 నుంచి 25,000 దాకా చిన్నాపెద్దా విడిభాగాలు అవసరం కాబట్టి, వాటిని తయారుచేసే ప్రతి కర్మాగారానికీ సరఫరాల కోసం వేలాది ఇతర ఫ్యాక్టరీల్లోనూ ఉత్పత్తి కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఈ విధంగా మన ‘ఎంఎస్ఎంఇ’ రంగానికి గణనీయ ప్రోత్సాహం లభించడంతోపాటు లెక్కలేనన్ని ఉపాధి అవకాశాల సృష్టికి వీలుంటుందనడంలో సందేహం లేదు.

మిత్రులారా!

ఈ రోజున ఒక పథకానికి శ్రీకారం చుడుతున్నామంటే- దానివల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలకు మాత్రమే మా దృష్టి పరిమితం కాదు. దాని ప్రభావం మరింత విస్తృతం కావాలన్నది మా ధ్యేయం. కొత్త ఉపాధి అవకాశాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం. ‘ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం ఇందుకు ఒక ఉదాహరణ. సాధారణ దృష్టితో చూస్తే ఇది ఉచిత గృహవిద్యుత్ సరఫరాకు ఉద్దేశించినదిగా కనిపించవచ్చుగానీ, లోతుగా పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. గడచిన ఆరు నెలల్లోనే దాదాపు 1.25 కోట్ల నుంచి 1.50 కోట్ల మంది వినియోగదారులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. వీరి ఇళ్లకు అవసరమైన వ్యవస్థల ఏర్పాటు కోసం 9,000 మంది విక్రేతలు ముందుకొచ్చారు. ఇప్పటికే 5 లక్షలకుపైగా ఇళ్ల పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల 800 గ్రామాలను సౌర విద్యుత్ ఆధారిత ఆదర్శ గ్రామాలుగా రూపొందించే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనికి తగినట్లు సౌర విద్యుత్ వ్యవస్థ అమర్చే పనిలో 30,000 మంది శిక్షణ పొందారు. మొత్తంమీద ఈ ఒక్క పథకమే తయారీదారులు, విక్రేతలు, అమర్చేవారు, మరమ్మతుదారుల రూపంలో లక్షలాది కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేసింది.

 

|

మిత్రులారా!

ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం... ఇందులో భాగంగా చిన్న గ్రామాల గురించి మొదట వివరిస్తాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ ఖాదీ ఒక చర్చనీయాంశంగా ఉంది. అయితే, నేడు ఖాదీ-గ్రామీణ పరిశ్రమలో వచ్చిన అద్భుత ప్రగతిశీల మార్పులను గమనించండి. గడచిన 10 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వ విధానాలు ఈ పరిశ్రమను సంపూర్ణంగా పునరుద్ధరించాయి. దీనివల్ల పరిశ్రమ ప్రతిష్ఠ ఇనుమడించడమేగాక ఇందులో అంతర్భాగమైన గ్రామీణుల ఆర్థిక స్థితిగతులు కూడా ఎంతో మెరుగుపడ్డాయి. ఖాదీ-గ్రామీణ పరిశ్రమ నేడు ఏటా రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. మునుపటి-ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల గణాంకాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దశాబ్దం కిందటి పరిస్థితితో పోలిస్తే- ఆశ్చర్యకర వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఖాదీ విక్రయాలు ‘యుపిఎ’ ప్రభుత్వ కాలంకన్నా 400 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీన్నిబట్టి చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, వ్యాపారులు గణనీయ లబ్ధి పొందుతున్నారన్నది స్పష్టమవుతోంది. అలాగే ఈ రంగంలో కొత్త అవకాశాలతోపాటు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా అందివస్తాయి.

ఇదే తరహాలో మన గ్రామీణ మహిళల ఉపాధి-స్వయం ఉపాధికి ‘లక్షాధికారి సోదరి’ పథకం కొత్త బాటలు వేసింది. గడచిన దశాబ్ద కాలంలో 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయ సంఘాల్లో చేరి, వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు కావడమే కాకుండా తమ కృషితో ఆదాయార్జన కూడా చేస్తున్నారు. వీరంతా నేడు ఉపాధి-స్వయం ఉపాధి మార్గాల్లో కుటుంబ సంపాదనకు తమ ఆర్జనను జోడిస్తుండటం అభినందనీయం. పది కోట్లు అంటే పెద్ద సంఖ్యే అయినా, ఆ మహిళలు సాధించిన ప్రగతిని చాలామంది గమనించకపోవచ్చు. కానీ, ప్రభుత్వం వారికి పూర్తి చేయూతనిస్తూ అవసరమైన వనరులు, ఆర్థిక సహాయం సమకూర్చింది. దీంతో వివిధ రకాల ఉపాధి మార్గాల్లో వారంతా ఆదాయార్జన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలను ‘‘లక్షాధికారి సోదరీమణులు’’గా మార్చాలని మా ప్రభుత్వం లక్ష్య నిర్దేశం చేసుకుంది. తదనుగుణంగా ఆదాయ సృష్టికి మాత్రమే పరిమితం కాకుండా దాన్ని మరింత పెంచడమే ధ్యేయంగా పెట్టుకుంది. దీంతో ఇప్పటిదాకా దాదాపు 1.25 కోట్ల మంది ఈ లక్ష్యాన్ని అధిగమించగా, వారి వార్షికాదాయం నేడు లక్ష రూపాయలు దాటింది.

మిత్రులారా!

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే లక్ష్యంతో మన దేశం నేడు దూసుకెళ్తోంది. ఇదంతా చూస్తున్న మన యువతరంలో ఇంతకుముందు ఇంత వేగంగా, భారీగా అభివృద్ధి ఎందుకు సాధ్యం కాలేదన్న సందేహం తలెత్తడం సహజం. గత ప్రభుత్వాలకు సంకల్పం, విధానాలు... రెండూ లేకపోవడమే ఇందుకు కారణమని ఒక్కముక్కలో జవాబు చెప్పవచ్చు.

మిత్రులారా!

మన దేశం అనేక రంగాల్లో... ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత వెనుకబడిందో మీకు గుర్తుండే ఉంటుంది. ప్రపంచంలో పుట్టుకొచ్చే కొత్త సాంకేతికత కోసం భారత్ ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. మనదాకా వచ్చేసరికి పాశ్చాత్య దేశాల్లో అది పాతబడిపోయేది. పైగా మన దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి అసాధ్యమనే అపోహ ఒక ధోరణిగా మారిపోయింది. ఈ దురవగాహన మన పురోగతిని విపరీతంగా దెబ్బతీసింది. దీంతో ఆధునిక అభివృద్ధి పరుగు పందెంలో వెనుకబడటమేగాక ఉపాధి వనరులను కూడా గణనీయంగా కోల్పోయింది. ఉపాధి కల్పించగల ఆధునిక పరిశ్రమలు లేనిదే ఉద్యోగ సృష్టి సాధ్యమా? అందుకే గత ప్రభుత్వాల కాలం చెల్లిన ఆలోచన ధోరణి నుంచి దేశాన్ని విముక్తం చేస్తూ మా కృషికి శ్రీకారం చుట్టాం. తదనుగుణంగా అంతరిక్ష రంగం నుంచి సెమీకండక్టర్ల వరకు... ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాల దాకా... ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞాన పరిధిలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని అమలు చేశాం. తద్వారా స్వయం సమృద్ధ భారత్ లక్ష్య సాధనకు కృషి చేశాం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేలా ‘ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకం’ ప్రారంభించాం. ఈ రెండు కార్యక్రమాలతో ఉపాధి అవకాశాల సృష్టి అనూహ్య స్థాయిలో వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా నేడు ప్రతి రంగంలోనూ పరిశ్రమల సంఖ్య పెరుగుతూ యువతకు కొత్త అవకాశాలు అందివస్తున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడుల రాకతోపాటు అవకాశాల సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశంలో గత ఎనిమిదేళ్లలో 1.5 లక్షలకుపైగా అంకుర సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకురావరణంగా మారింది. ఈ పరిణామాల ఫలితంగా ముందడుగు వేసే అవకాశాలు కలిసి రావడంతో మన యువత ఉపాధి పొందుతున్నారు.

 

|

మిత్రులారా!

దేశ యువత శక్తిసామర్థ్యాలను పెంచే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిపై నిశితంగా దృష్టి సారించిన ప్రభుత్వం ‘నైపుణ్య భారత్’ (స్కిల్ ఇండియా) వంటి కార్యక్రమాలను  ప్రారంభించింది. దీనికింద దేశవ్యాప్తంగా వందలాది నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో యువత శిక్షణ పొందుతున్నారు. అటుపైన అనుభవం, అవకాశాల కోసం అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి లేదన్న భరోసా యువతలో కల్పించాం. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌ షిప్ యోజన’ కింద దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలలో నెలకు రూ.5,000 వంతున భృతితో ఏడాదిపాటు అనుభవ శిక్షణ పొందగలిగేలా నిబంధనలు రూపొందించాం. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మంది యువత ప్రయోజనం పొందాలన్నది మా లక్ష్యం. ఈ అమూల్య అనుభవ శిక్షణ వివిధ రంగాల్లో వాస్తవ ప్రపంచ వ్యాపార వాతావరణంతో యువతను అనుసంధానించి, వారి భవితను తీర్చిదిద్దగలదు.

మిత్రులారా!

   మన యువతరం విదేశాల్లో మరింత సులువుగా ఉద్యోగాలు పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం కొత్త అవకాశాలు కల్పిస్తోంది. భారత్ కోసం జర్మనీ ‘‘నిపుణ కార్మికశక్తి వ్యూహం’’ పేరిట ఒక ప్రత్యేక ప్రణాళిక ప్రకటించడాన్ని ఇటీవల మీరు పత్రికలలో చూసే ఉంటారు. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే నిపుణ యువతరం కోసం జర్మనీ గతంలో ఏటా 20,000 వీసాలు మాత్రమే జారీ చేసేది. అయితే, ప్రత్యేక వ్యూహానికి అనుగుణంగా ఈ సంఖ్యను 90,000కు పెంచాలని నిర్ణయించింది. జర్మనీలో పనిచేసే అవకాశం లభించడం ద్వారా మరింత మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఇటీవలి సంవత్సరాల్లో గల్ఫ్ దేశాలుసహా జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, మారిషస్, ఇజ్రాయెల్, ‘యుకె’, ఇటలీ వంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన 21 దేశాలతో వలస-ఉపాధిపై భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ఏటా 3,000 మంది భారతీయులకు రెండేళ్ల విద్యాభ్యాసం-ఉపాధి కోసం ‘యుకె’ వీసాలు జారీ చేస్తుంది. అలాగే 3,000 మంది భారత విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువుకునే అవకాశం లభిస్తుంది. భారత్ ప్రతిభ దేశాభివృద్ధికి మాత్రమేగాక ప్రపంచ ప్రగతిలోనూ ఇతోధిక పాత్ర పోషించే దిశగా మనం పురోగమిస్తున్నాం.

మిత్రులారా!

   దేశ యువతరంలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆకాంక్షలు నెరవేర్చగల ఆధునిక వ్యవస్థకు రూపమివ్వడం నేటి ప్రభుత్వ బాధ్యత. ఆ మేరకు మీరు ఏ హోదాలో ఉన్నా యువతరానికి, పౌరులకు గరిష్ఠ చేయూత సహా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మీరు పనిచేయాలి.

మిత్రులారా!

   మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగం లభించడంలో దేశంలోని పన్ను చెల్లింపుదారులు, పౌరులదే కీలక పాత్ర. మనకీ హోదా, అవకాశాలు రావడానికి కారణం వారే కాబట్టి, మన నియామకాల  లక్ష్యం ఇకపై ప్రజలకు సేవ చేయడమే. వ్యయప్రయాసలు, పలుకుబడితో నిమిత్తం లేకుండా ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చే ఈ కొత్త సంస్కృతిలో మన బాధ్యత చాలా కీలకం. ఆ మేరకు  పౌర జీవనంలో సమస్యల పరిష్కారం ద్వారా వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి. మనం పోస్ట్‌ మ్యాన్ లేదా ప్రొఫెసర్‌ కావచ్చు... హోదా, పాత్ర ఏదైనా దేశ ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం. ముఖ్యంగా పేదలు, వెనుకబడిన-అట్టడుగు వర్గాలు, గిరిజనులు, మహిళలు, యువతరం విషయంలో మన బాధ్యతలు నెరవేర్చాలి. వీరిలో ఎవరికి సేవ చేసే అవకాశం వచ్చినా దాన్నొక అదృష్టంగా భావిస్తూ మనల్ని మనం కర్తవ్య బద్ధులను చేసుకుందాం.

నవ భారత నిర్మాణానికి యావద్దేశం సంకల్పించిన ప్రస్తుత సమయంలో మీరంతా కేంద్ర ప్రభుత్వంలో భాగమవుతున్నారు. ఈ సంకల్పం సాకారం కావాలంటే ప్రతి రంగంలో మనం రాణించాలి. ఇందులో మీలాంటి యువ సహోద్యోగుల సహకారం అత్యావశ్యకం. అందుకే చక్కగా పని చేయడం ఒక్కటే కాకుండా విలక్షణ రీతిలో విధి నిర్వహణ మీ లక్ష్యం కావాలి. మన ప్రభుత్వోద్యోగుల పనితీరు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శప్రాయంగా మారాలి. మనపై దేశ ప్రజలకు ఎన్నో అంచనాలు ఉండటం సహజం... అందునా ఆకాంక్షాత్మక భారత్ స్ఫూర్తి ఫలితంగా మనపై వారి ఆశలు మరింత ఎక్కువగా ఉంటాయి. మనపై ప్రజలకుగల నమ్మకాన్ని ప్రతిబింబించే ఈ ఆశలు, ఆకాంక్షలే దేశ ప్రగతికి సారథ్యం వహిస్తున్నాయి. కాబట్టి, మనం ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేసేలా చూసేది వారిలోని ఈ విశ్వాసమే.

 

|

మిత్రులారా!

ఈ నియామకంతో వ్యక్తిగత జీవితంలోనూ మీ కొత్త పయనం మొదలవుతుంది. అయితే, మనం పాలకులం కాదు... సేవకులమనే వాస్తవాన్ని గుర్తుంచుకుని, వినయంతో మెలగాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రయాణంలో నిరంతర అభ్యాసంతో కొత్త నైపుణ్యాలను సముపార్జించండి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ‘ఐగాట్’ (iGOT) కర్మయోగి వేదిక ద్వారా వివిధ కోర్సులు అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆన్‌లైన్‌ డిజిటల్ శిక్షణ మాడ్యూళ్లు మీకు అందుబాటులో ఉంటాయి. వీలు చిక్కినప్పుడల్లా మీకు ఆసక్తిగల అంశాలపై ఈ కోర్సులు పూర్తి చేయవచ్చు. మీ విజ్ఞాన విస్తరణకు ఈ వనరులను సద్వినియోగం చేసుకోండి.

మిత్రులారా! మీ కృషి ఫలితంగా 2047 నాటికి మన దేశం ‘వికసిత భారత్’గా మారుతుందనే నమ్మకం నాకుంది. ఇప్పుడు మీరంతా 20, 22 లేదా 25 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు... భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే సమయానికి మీరంతా మీ ఉద్యోగాల చరమాంకానికి చేరుతారు. అంటే- ‘వికసిత భారత్’ను తీర్చిదిద్దడంలో మీ 25 ఏళ్ల కృషి కూడా దోహదం చేసిందని మీరు సగర్వంగా చాటుకోగలరు. ఇదెంతో గొప్ప అవకాశం.. గౌరవం! అంటే- మీకు ఇవాళ ఒక్క ఉపాధి మాత్రమే కాదు... గొప్ప అవకాశం కూడా లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని, మీ కలల సాకారానికి దృఢ సంకల్పంతో కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ మేరకు ‘వికసిత భారత్‌’ సంకల్పం నెరవేరేదాకా మనం విశ్రమించ రాదు.. అంకితభావంతో కూడిన ప్రజాసేవ ద్వారా కర్తవ్యం నిర్వర్తించాలి.

ఈ రోజు నియామక పత్రాలు అందుకున్న మిత్రులందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు. ఉజ్వల భవిష్యత్తు దిశగా మీరు అన్నిటా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆనందాన్ని మీ కుటుంబాలు కూడా పంచుకుంటాయి కాబట్టి, వారికి కూడా నా శుభాకాంక్షలు. దీపావళి పండుగ శోభతోపాటు ఈ కొత్త అవకాశంతో మీకు సంబరాలు రెట్టింపు సంతోషంతో సాగుతాయి. మిత్రులారా... ఈ క్షణాన్ని అమితానందంతో ఆస్వాదించండి. శుభం భూయాత్!

ధన్యవాదాలు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive

Media Coverage

What Happened After A Project Delayed By 53 Years Came Up For Review Before PM Modi? Exclusive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand
July 15, 2025

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Saddened by the loss of lives due to a road accident in Pithoragarh, Uttarakhand. Condolences to those who have lost their loved ones in the mishap. May the injured recover soon.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”