నిత్యం ఉత్సాహం పొంగిపొర్లే, ప్రజాదరణ గల గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ జీ; గోవా పుత్రుడు, నా కేంద్ర కేబినెట్ సహచరుడు శ్రీ శ్రీపాద్ నాయక్ జీ, కేంద్ర ప్రభుత్వంలో నా మంత్రి మండలి సహచరుడు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జీ, గోవాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కరోనా పోరాట యోధులు, సోదరసోదరీమణులారా!
మీ అందరికీ శ్రీ గణేశ్ పండుగ శుభాకాంక్షలు! రేపు అనంత్ చతుర్దశి పర్వదినాన మనం బప్పాకు వీడ్కోలు చెప్పి మన చేతులకు అనంత సూత్ర కట్టుకుంటాం. అనంత్ సూత్ర అంటే జీవితంలో ఆనందం, సుసంపన్నత, దీర్ఘాయుష్షుకు ఆశీస్సు.
ఈ పవిత్ర దినానికి ముందే గోవా ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకుని ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. గోవాలో అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు. కరోనాపై పోరాటంలో ఇది పెద్ద విజయం. గోవా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా,
భారతదేశ భిన్నత్వంలోని పటిష్ఠత స్పష్టంగా కనిపించే రాష్ట్రం గోవా. ప్రాచ్య, పాశ్చాత్యాలకు చెందిన సంస్కృతులు, జీవన ప్రమాణాలు,ఆహార అలవాట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గణేశోత్సవం, దీపావళి వేడుగ్గా నిర్వహించుకుంటారు. క్రిస్మస్ సమయంలో గోవా కాంతులు వెదజల్లుతుంది. ఇవి చేస్తూనే గోవా స్వంత సాంప్రదాయం కూడా అనుసరిస్తుంది. గోవా సాధించే ప్రతీ ఒక్క విజయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను మరింతగా బలోపేతం చేస్తుంది. నాకు మాత్రమే కాదు, దేశం యావత్తుకు ఆనందంగా, గర్వకారణంగా నిలుస్తుంది.
సోదరసోదరీమణులారా,
ఈ ఆనందకర సమయంలో నా మిత్రుడు, కర్మయోగి స్వర్గీయ మనోహర్ పారికర్ జీ గుర్తుకు రావడం అత్యంత సహజం. గోవా 100 సంవత్సరాల కాలంలో అతి పెద్ద సంక్షోభంతో విజయవంతంగా పోరాడిన ఈ రోజు ఆయన మన మధ్యన ఉండి ఉంటే మీ విజయానికి ఎంతో గర్వపడి ఉండేవారు.
ప్రపంచంలోనే అతి వేగవంతం, పెద్దది అయిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం - అందరికీ ఉచిత వ్యాక్సిన్ - విజయంలో గోవా ప్రముఖ పాత్ర పోషించింది. గత కొద్ది నెలల కాలంలో గోవా భారీ వర్షాలు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను శ్రీ ప్రమోద్ సావంత్ జీ నాయకత్వంలో ఎంతో సాహసోపేతంగా ఎదుర్కొంది. ఇలాంటి వైపరీత్యాల మధ్య కూడా కరోనా వ్యాక్సినేషన్ వేగం కొనసాగించినందుకు కరోనా పోరాట యోధులు, ఆరోగ్య కార్యకర్తలు, టీమ్ గోవాలో ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
ఈ రోజు ఎక్కువ మంది సహచరులు నాతో పంచుకున్న అనుభవాలు చూస్తుంటే ఇది ఎంత క్లిష్టమైన ప్రచారోద్యమమో అర్ధం అవుతుంది. నిత్యం ఎగిసిపడే నదులను దాటుకుంటూ సుదూర, విస్తార ప్రాంతాలకు చేరి సురక్షిత వ్యాక్సినేషన్ అందించడానికి విధినిర్వహణ పట్ల కట్టుబాటు, సమాజం పట్ల అంకిత భావం ప్రధానం. మీరందరూ ఎలాంటి విరామం లేకుండా అవిశ్రాంతంగా మానవాళికి సేవలందించారు. మీ సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి.
మిత్రులారా,
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ఎంత అద్భుతమైన విజయాన్ని అందిస్తుందో గోవా ప్రభుత్వం, పౌరులు, కరోనా పోరాట యోధులు, ముందువరుసలో నిలిచి పోరాడే కార్యకర్తలు నిరూపించారు. సామాజిక, భౌగోళిక సవాళ్లను అధిగమించడంలో వారు చూపిన సమన్వయం ప్రశంసనీయం. ప్రమోద్ జీ మీకు, మీ టీమ్ కి అభినందనలు. రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, సబ్ డివిజన్లలో కూడా త్వరితంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే ఇందుకు నిదర్శనం.
గోవా వేగం మందగించకుడా చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో కూడా రాష్ట్రంలో రెండో డోస్ కోసం టీకా పండుగ కొనసాగాలని మనం కోరుకుంటున్నాం. ఈ అద్భుత కృషితోనే గోవా ఇమ్యునైజేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలవగలిగింది. గోవా రాష్ట్ర జనాభాకు మాత్రమే కాదు, పర్యాటకులు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం మరింత ప్రధానాంశం.
మిత్రులారా,
దేశంలోని వైద్యులు, వైద్య సిబ్బంది, పాలనాయంత్రాంగంలోని ప్రతీఒక్కరికీ ఈ సందర్భంగా ప్రశంసలు అందించాలనుకుంటున్నాను. మీ అందరి కృషి ఫలితంగానే భారతదేశం నిన్న ఒక్క రోజులోనే 2.5 కోట్లకు పైబడిన వ్యాక్సిన్లు అందించి రికార్డు నమోదు చేసింది. సంపన్నమైన, శక్తివంతమైనవిగా చెప్పుకునే దేశాలుగా ఇది సాధించలేకపోయాయి. దేశం కోవిడ్ డాష్ బోర్డును ఎంతగా అనుసరించి, టీకాల కార్యక్రమంలో పెరుగుతున్న భాగస్వామ్యంతో ఉత్సుకత అనుభవిస్తుందో నిన్న మనం చూశాం.
నిన్న ప్రతీ ఒక్క గంటకు 15 లక్షలకు పైబడి, ప్రతీ నిముషం 26 వేలకు పైబడి, ప్రతీ ఒక్క సెకనుకు 425 మంది వంతున ప్రజలకు వ్యాక్సినేషన్లు వేశారు. దేశంలోని ప్రతీ ఒక్క భాగంలోనూ విస్తరించిన లక్షకు పైగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఈ కార్యక్రమం నిర్వహించాయి. భారతదేశానికి చెందిన సొంత వ్యాక్సిన్లు, వ్యాక్సినేషన్ కేంద్రాల అతి పెద్ద నెట్ వర్క్, నిపుణులైన మానవ వనరులు మన సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించి చూపారు.
మిత్రులారా,
నిన్న మనం సాధించిన విజయం కేవలం గణాంకాలే కాదు, భారతదేశం సామర్థ్యం ఏమిటో ప్రపంచం గుర్తించేలా చేసిన ఘనత. ప్రతీ ఒక్క భారతీయుని విధినిర్వహణకు నిదర్శనం.
మిత్రులారా,
ఈ రోజు నేను నా మనసు కూడా ఆవిష్కరిస్తున్నాను. ఎన్నో పుట్టినరోజులు వస్తాయి, పోతాయి...కాని నేను ఎప్పుడూ వేడుకలకు దూరంగా ఉంటాను. కాని ఈ వయసులో నిన్న నాకు ఒక భావోద్వేగం ఏర్పడింది. పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేందుకు ఎన్నో మార్గాలుంటాయి. ప్రజలు కూడా ఎన్నో విధాలుగా ఆ వేడుకలు నిర్వహించుకుంటారు. నేను అలాంటి వేడుకలను తప్పు పట్టే వ్యక్తిని కాదు. కాని మీ అందరి కృషి ఫలితంగా నిన్న మాత్రం నా జీవితంలో అత్యంత విశేషమైన రోజు.
వ్యాక్సినేషన్ రికార్డు విజయం కూడా గత ఏడాదిన్నర, రెండేళ్లుగా తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తూ కరోనాపై పోరాటంలో దేశ ప్రజలకు సహాయపడిన వైద్య రంగంలోని వారికే దక్కుతుంది. ఈ విజయానికి ప్రతీ ఒక్కరూ ఎంతో సేవ అందించారు. ప్రజలు కూడా సేవాభావంతో ఇందులో పాల్గొన్నారు. వారందరి దయాగుణం, విధినిర్వహణ పట్ల కట్టుబాటుతోనే ఒక్క రోజులో 2.5 కోట్ల వ్యాక్సినేషన్ల రికార్డు సాధ్యమయింది.
ప్రతీ ఒక్క వ్యాక్సిన్ డోసు ఒక జీవితాన్ని కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ఇంత తక్కువ సమయంలో 2.5 కోట్ల మంది పైగా ప్రజలకు రక్షణ కల్పించడం గొప్ప సంతృప్తినిఅందిస్తుంది. అందుకే నిన్నటి జన్మదినం ఒక మరపురాని రోజుగా నా హృదయాన్ని తాకింది. ఇందుకు ఎన్ని ధన్యవాదాలు తెలిపినా తక్కువే. ప్రతీ ఒక్క దేశవాసికి నేను హృదయపూర్వకంగా అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
సోదరసోదరీమణులారా,
భారతదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆరోగ్యానికే కాదు, జీవనోపాధికి కూడా రక్షణ కవచం. హిమాచల్ కూడా తొలి డోస్ లో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యం సాధించింది. అదే విధంగా గోవా, చండీగఢ్, లక్ష దీవుల్లో కూడా అర్హత గల ప్రతీ ఒక్కరికీ తొలిడోస్ వ్యాక్సినేషన్ అందింది. త్వరలోనే తొలి వ్యాక్సిన్ డోస్ విషయంలో సిక్కిం నూరు శాతం కవరేజి లక్ష్యం సాధించబోతోంది. అండమాన్ నికోబార్, కేరళ, లదాఖ్, ఉత్తరాఖండ్; దాద్రా నగర్ హవేలి కూడా ఈ విజయానికి ఎంతో దూరంలో లేవు.
మిత్రులారా,
దీనికి పెద్దగా ప్రచారం జరగకపోయినా పర్యాటక రంగంతో అధికంగా అనుసంధానమైన రాష్ర్టాల్లో వ్యాక్సినేషన్ కు భారత్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. రాజకీయం అవుతుందన్న ఆలోచనతో మేం మొదట్లో ఈ విషయం చెప్పలేదు. మన టూరిజం ప్రాంతాలు త్వరగా తెరుచుకోవడంలో ఇదే ప్రధానం. ఈ రోజు ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర కూడా సాధ్యమవుతోంది. ఇన్ని ప్రయత్నాల మధ్య గోవా సాధించిన 100% వ్యాక్సినేషన్ కు కూడా ప్రాధాన్యం ఉంది.
టూరిజం రంగం పునరుజ్జీవంలో గోవా పాత్ర కీలకం. హోటల్ పరిశ్రమ ఉద్యోగులు, టాక్సీ డ్రైవర్లు, హాకర్లు, దుకాణదారులు...ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకున్నట్టయితే పర్యాటకులు కూడా భద్రతా భావంతో ఇక్కడకు వస్తారు. ప్రజలకు వ్యాక్సిన్ రక్షణ ఉన్న ప్రపంచంలోని అతి కొద్ది అంతర్జాతీయ పర్యాటక గమ్యాల్లో ఇప్పుడు గోవా కూడా చేరింది.
మిత్రులారా,
గతంలో వలెనే ఇక్కడ పర్యాటక కార్యకలాపాలు ప్రారంభం కావాలని మేం కోరుతున్నాం. రాబోయే టూరిజం సీజన్ లో ప్రపంచం ఇక్కడకు తరలివచ్చి ఆనందిస్తుంది. సంపూర్ణ వ్యాక్సినేషన్ తో పాటు కరోనాకు సంబంధించిన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టింది, కాని మనం వైరస్ ను తేలిగ్గా తీసుకోకూడదు. భద్రత, పరిశుభ్రతపై ఎంత ఎక్కువగా దృష్టి సారిస్తే అంత ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు.
మిత్రులారా,
విదేశీ పర్యాటకులను ప్రోత్సహించడానికి ఇటీవల కేంద్రప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. దేశాన్ని సందర్శించే 5 లక్షల మంది పర్యాటకులకు ఉచిత వీసాలు ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. పర్యాటకం, రవాణా రంగాలతో సంబంధం ఉన్న వారందరికీ 100% ప్రభుత్వ హామీతో రూ.10 లక్షల రుణం కూడా ఇస్తున్నాం. టూరిస్టు గైడ్ లకు రూ.లక్ష రుణం ఇస్తున్నాం. దేశంలోని పర్యాటక రంగం త్వరిత పురోగతికి సహాయపడే ప్రతీ ఒక్క చర్య తీసుకోవాలని ప్రభుత్వం కట్టుబాటుతో ఉంది.
మిత్రులారా,
గోవా పర్యాటక రంగం ఆకర్షణీయంగా ఉండడానికి,రైతులు, మత్స్యకారులు, ఇతరుల ప్రయోజనం కోసం అమితశక్తి గల ప్రభుత్వం సహాయంతో మౌలిక వసతులు పటిష్ఠం చేస్తున్నాం. గోవాలో కనెక్టివిటీకి సంబంధించిన మౌలికవసతుల రంగంలో ప్రత్యేకంగా కనివిని ఎరుగని కృషి జరుగుతోంది. మోపాలో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయం రాబోయే కొద్ది నెలల్లో సిద్ధం కానుంది. ఈ విమానాశ్రయాన్ని, జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ రూ.12,000 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల అత్యాధునిక హైవే కూడా నిర్మించబోతున్నారు. ఒక జాతీయ రహదారుల నిర్మాణానికే గత కొన్ని సంవత్సరాల కాలంలో గోవాలో వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.
ఉత్తర గోవా, దక్షిణ గోవాలను అనుసంధానం చేసే జువారీ వంతెన కూడా రాబోయే కొద్ది నెలల్లో ప్రారంభం కానుండడం ఆనందకరమైన అంశం. మీ అందరికీ తెలిసినట్టుగానే ఈ వంతెన పనాజీ, మార్గోవాలను కలుపుతుంది. గోవా విముక్తి పోరాటానికి మూలస్థానం అయిన అగౌడా కోట కూడా త్వరలో తెరవనున్నట్టు నా దృష్టికి తెచ్చారు.
సోదర సోదరీమణులారా,
మనోహర్ పారికర్ ఒదిలి వెళ్లిన గోవా అభివృద్ధిని డాక్టర్ ప్రమోద్ జీ, ఆయన బృందం పూర్తి అంకిత భావంతో ముందుకు నడుపుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వెలుగుల్లో దేశం సరికొత్త స్వయం సమృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతున్న సమయంలో గోవా స్వయంపూర్ణ గోవా ప్రతిన చేసింది. ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా సంకల్పం కింద 50కి పైగా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నట్టు నాకు చెప్పారు. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించి జాతీయ లక్ష్యాలు సాధించేందుకు గోవా ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తోందో ఇది తెలియచేస్తుంది.
మిత్రులారా,
ఈ రోజు వ్యాక్సినేషన్ లోనే కాదు, అభివృద్ధి కొలమానాల్లో కూడా దేశంలోని అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా గోవా నిలిచింది. గోవాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నీ సంపూర్ణంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రదేశాలు కానున్నాయి. విద్యుత్తు, నీరు వంటి కనీస వసతుల విషయంలో కూడా సంతృప్తికరంగా కృషి జరిగింది. దేశంలో 100% విద్యుదీకరణ జరిగిన ఏకైక రాష్ట్రం గోవా. ఇళ్లకు టాప్ వాటర్ విషయంలో కూడా గోవా అద్భుతాలు సాధించింది. గ్రామీణ గోవాలో ప్రతీ ఇంటికీ టాప్ వాటర్ అందించేందుకు జరిగిన కృషి అమోఘం. జల్ జీవన్ మిషన్ కింద గత రెండేళ్ల కాలంలో దేశంలో 5 కోట్ల కుటుంబాలకు పైప్ వాటర్ సదుపాయం కల్పించడం జరిగింది. గోవా సాధిస్తున్న పురోగతి చూస్తుంటే “సత్పరిపాలన”, “జీవన సరళత” గోవా ప్రభుత్వ ప్రాధాన్యతలు కావాలన్న విషయం స్పష్టం అవుతోంది.
సోదర సోదరీమణులారా,
కరోనా కష్టకాలంలో గోవా ప్రభుత్వం సత్పరిపాలనకు కట్టుబాటును ప్రదర్శించింది. ఎన్నో సవాళ్లు ఎదురవుతుననా గోవా బృందం కేంద్రప్రభుత్వం పంపిన సహాయాన్ని ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికీ అందచేసింది. నిరుపేదలు, రైతులు, మత్స్యకారులకు సహాయం అందించడంలో వెనుకాడలేదు. నెలల తరబడి సంపూర్ణ చిత్తశుద్ధితో పేద కుటుంబాలకు ఉచిత రేషన్ అందించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుకుని గోవా సోదరీమణులు కష్టకాలంలో ఎంతో ఊరట పొందారు.
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి గోవా రైతులు కోట్లాది రూపాయల సహాయం తమ బ్యాంకు ఖాతాల ద్వారానే పొందారు. కరోనా సమయంలో కూడా చిన్నతరహా రైతులందరూ ఉద్యమ స్ఫూర్తితో కిసాన్ క్రెడిట్ కార్డులు పొందారు. అధిక సంఖ్యలో రైతులు, మత్స్యకారులు తొలిసారి కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయం పొందారు. పిఎం స్వనిధి యోజన కింద గోవాలోని వీధి వ్యాపారులందరికీ రుణాలందాయి. ఈ ప్రయత్నాలన్నీ వరదల సమయంలో కూడా గోవా ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉన్నాయి.
సోదర సోదరీమణులారా,
గోవా అపరిమిత అవకాశాల గని. గోవా ఒక రాష్ట్రమే కాదు, బ్రాండ్ ఇండియాకు బలమైన గుర్తింపు. గోవా పోషిస్తున్న ఈ పాత్రను మరింతగా విస్తరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. గోవాలో ఈ రోజు జరిగిన మంచి కృషి కొనసాగడం ఎంతో అవసరం. దీర్ఘ విరామం తర్వాత గోవా రాజకీయ స్థిరత్వం, సత్పరిపాలన ప్రయోజనాలు పొందుతోంది.
గోవా ప్రజలు ఇదే స్ఫూర్తితో కృషిని కొనసాగిస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. ప్రమోద్ జీ, ఆయన బృందానికి కూడా అభినందనలు.
ధన్యవాదాలు.