ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యజి, బ్రజేష్ పాఠక్ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.
మిత్రులారా,
అద్భుతమైన సాంస్కృతిక వైభవానికి, వైభవోపేత చరిత్రకు, గొప్పచారిత్రక వారసత్వానికి ఉత్తరప్రదేశ్ దర్పణం పడుతుంది. ఎంతో గొప్ప సామర్ధ్యం ఉన్నప్పటికీ, కొన్ని అననుకూల అంశాలు ఉత్తరప్రదేశ్‌తో ముడిపడి
ఉన్నాయి. అందువల్ల ప్రజలు, ఉత్తరప్రదేశ్ అభివృద్ధిచెందడం ఇక కష్టం అని అంటూఉండేవారు. ఇక్కడ శాంతి భద్రతలను మెరుగుపరచడం అసాధ్యం అని అనే వారు. ఉత్తరప్రదేశ్‌ను బిమారు రాష్ట్రంగా పిలిచేవారు. ఇక్కడ వేల కోట్ల రూపాయల విలువగల కుంభకోణాలు రెగ్యులర్ ప్రాతిపదికన జరుగుతూ ఉండేవి.ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి ప్రతివారూ తమ ఆశలు వదులుకున్న పరిస్థితి. అయితే కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల వ్యవధిలో ఉత్తర ప్రదేశ్ తనకుతానుగా తనదైన కొత్త గుర్తింపును ఏర్పరచుకునింది. అది కూడా తిరుగులేని విధంగా ఏర్పరచుకుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ సుపరిపాలనకు గుర్తింపు పొందింది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మెరుగైన శాంతిభద్రతలు , సుస్థిరతకు ఉదాహరణగా నిలిచింది. సంపద సృష్టికర్తలకు ఇప్పుడు ఇక్కడ కొత్త అవకాశాలు సృష్టించడం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లో ఆధునిక మౌలికసదుపాయాలకు సంబంధించి చేపట్టిన చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ నుంచి అనుసంధానతవరకు ప్రతి రంగంలో పరిస్థితులు మెరగుపడడం స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే ఉత్తరప్రదేశ్ , దేశంలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకోనుంది. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సరకు రవాణా కారిడార్ ద్వారా, ఉత్తరప్రదేశ్‌ను సముద్ర మార్గంతో, గుజరాత్ , మహారాష్ట్ర పోర్టులతో నేరుగా అనుసంధానం కల్పించడం జరుగుతోంది. మౌలికసదుపాయాలతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిలో ఆలోచనా విధానంలో సులభతర వ్యాపారానికి సంబంధించి చెప్పుకోదగిన మార్పు వచ్చింది.
మిత్రులారా,
ఇవాళ ఉత్తరప్రదేశ్ ఆశాపూరిత పరిస్థితులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. భారతదేశం, ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాంతంగా వెలుగొందుతుంటే, ఉత్తరప్రదేశ్ , భారతదేశ పురోగతికి చోదకశక్తిగా ఉంది.
మిత్రులారా,
పరిశ్రమరంగానికి చెందిన ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. మీలో చాలామందికి ఎంతో అనుభవం ఉంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మీకు తెలియనివేమీ కాదు. భారతదేశ ఆర్థిక శక్తిని, సూక్ష్మ, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మౌలిక అంశాలను మీరు చాలా దగ్గరనుంచి గమనిస్తున్నవారు. ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి ,యుద్ధ పరిస్థితుల వంటి వాటివల్ల ఏర్పడిన పరిస్థితులను తట్టుకుని ఇండియా శరవేగంతో ముందుకు పోతున్న ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదగగలిగింది? ఇవాళ ప్రపంచంలోని ప్రతి విశ్వసనీయ గొంతుక, ఇండియా ఆర్థిక వ్యవస్థ ఇదే వేగంతో ముందుకు సాగిపోతుందని విశ్వసిస్తున్నది. అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులనుంచి ఇండియా నిలదొక్కుకోవడమే కాక, శరవేగంతో కోలుకున్నది.
మిత్రులారా,
దీనికంతకూ కారణం, భారతీయులలో ఇలా ఆత్మవిశ్వాసం పెరుగుతూ వస్తుండడం. ఇవాళ భారతీయ సమాజం ఆకాంక్షలలో ,ఆలోచనలలో భారతీయ యువత ఆలోచనలో పెద్ద మార్పు కనిపిస్తోంది. ఇవాళ ప్రతి భారతీయ పౌరుడు, మరింత సత్వర అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఇండియా వీలైనంత త్వరగా అభివృద్ధి చెందిన దేశం కావాలని వారు కోరుకుంటున్నారు. భారతీయ సమాజం ఆకాంక్షలు ప్రభుత్వాలను అభివృద్ధివైపు నెడుతున్నాయి.ఆ ఆకాంక్షలు అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి.
మిత్రులారా,
మీరు ప్రస్తుతం ఉన్న రాష్ట్రం జనాభా 25 కోట్లు అని మరువకండి. ప్రపంచంలోని పలు ప్రధాన దేశాలకంటే ఉత్తరప్రదేశ్‌కు మరింత సామర్ధ్యం ఉంది. భారతదేశం మొత్తం లాగనే, ఉత్తరప్రదేశ్ సమాజం ఒక పెద్ద ఆకాంక్షిత సమాజం.
మిత్రులారా,
ఇవాళ భారతదేశంలో అభివృద్ధిచేసిన సామాజిక, భౌతిక, డిజిటల్, మౌలికసదుపాయాల నుంచి ఉత్తరప్రదేశ్ ఎంతో లాభపడిరది. ఫలితంగా ఇవాళ ఇక్కడి సమాజం సామాజికంగా, ఆర్థికంగా అత్యంత సమ్మిళితంగా తయారైంది. ఒక మార్కెట్ గా ఇండియా, ఎలాంటి అడ్డంకులు లేనిదిగా రూపుదిద్దుకుంది. ప్రభుత్వ ప్రక్రియలు కూడా ఎంతో సులభతరం అయ్యాయి. నేను ఎప్పుడూ చెబుతుంటాను, ఇండియా ఒత్తిడుల నుంచి సంస్కరణలు చేపట్టదని, కానీ ఒక పట్టుదలతో వాటిని చేపడుతుంది. ఇందువల్లే ఇండియా 40 వేలకుపైగా అమలుచేయవలసిన పద్ధతులను తొలగించి సులభతరం చేయడం జరిగింది. అలాగే కాలం చెల్లిన డజన్లకొద్ది చట్టాలను రద్దుచేయడం జరిగింది.
మిత్రులారా,
ఇవాళ ఇండియా అత్యంత వేగంగా , పెద్దఎత్తున అభివృద్ధిపథంలో ముందుకు సాగిపోతున్నది. పెద్ద సంఖ్యలో ప్రజల కనీస అవసరాలను మనం నెరవేర్చడం జరిగింది. దీనితో వారు మరింత దూరదృష్టితో ఆలోచనచేస్తున్నారు. భారతదేశంపై ఉన్న అపరిమిత విశ్వాసానికి ఇది నిదర్శనం.
మిత్రులారా,
కొద్దిరోజుల క్రితం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఇదే కట్టుబాటు కనిపించింది. ఇవాళ ప్రభుత్వం మౌలికసదుపాయాల కల్పనపై రికార్డు స్థాయిలో ఖర్చుచేస్తోంది. మనం దీనిని ప్రతిసంవత్సరం పెంచుకుంటూ పోతున్నాం. మౌలికసదుపాయాల రంగంలో మీరు పెట్టుబడులు పెట్టేందుకు కొత్త అవకాశాలు కల్పించడం జరుగుతోంది. విద్య,ఆరోగ్యం, సామాజిక మౌలికసదుపాయాల రంగంలో మీరు పెట్టుబడులు పెట్టేందుకు కొత్త అవకాశాలు కల్పించడం జరుగుతోంది. హరిత వృద్ధి మార్గాన్ని అనుసరించాల్సిందిగా నేను మిమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇది మన ఆలోచనలను ప్రతిబింబిస్తున్నది. ఇందుకు సంబంధించి తగిన వాతావరణం కల్పనకు పలు చర్యలను ఈ సంవత్సరం బడ్జెట్‌లో తీసుకోవడం జరిగింది. విద్యుత్ మొబిలిటీకి సంబంధించి సరఫరా , వాల్యూ చెయిన్‌ను మనం అభివృద్ధిచేస్తున్నాం.
మిత్రులారా,
కొత్త వాల్యూచెయిన్, సప్లయ్ చెయిన్‌కు అభివృద్ధిచేయడంలో ఉత్తరప్రదేశ్ ఒక ఛాంపియన్‌గా ఎదుగుతుండడం నాకు ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. ఎం.ఎస్.ఎం.ఇలకు సంబంధించి బలమైన నెట్‌వర్క్, సంప్రదాయంతో అనుసంధానమైన పరిశ్రమలు, ఆధునికత, ఉత్తరప్రదేశ్‌లో అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ భడోహి కార్పెట్లు, బనారసీ సిల్క్ ఉంది. ఉత్తరప్రదేశ్ బడోహి కార్పెట్ క్లస్టర్, వారణాసి సిల్క్ క్లస్టర్ కారణంగా భారతదేశపు టెక్స్‌టైల్ హబ్‌గా ఉంది. ఇవాళ ఇండియాలో జరుగుతున్న మొబైల్ ఫోన్ల తయారీ ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే జరుగుతోంది. గరిష్ఠస్థాయిలో మొబైల్ ఉపకరణాలు ఉత్తరప్రదేశ్‌లోనే తయారవుతున్నాయి. అలాగే, దేశంలోని డిఫెన్స్ పరికరాల కారిడార్ లలో ఒకటి ఉత్తరప్రదేశ్‌లోనే నిర్మితమవుతోంది. ఇండియాలోనే తయారైన డిఫెన్స్ సిస్టంలు, ప్లాట్‌ఫారంలను గరిష్ఠ స్థాయిలో ఇండియన్ ఆర్మీకి అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ గొప్ప ప్రాజెక్టుకు మన లక్నో కర్మవీర్ రాజ్‌నాథ్‌సింగ్‌జీ నాయకత్వం వహిస్తున్నారు. ఇండియా ఒక అద్భుతమైన రక్షణ పరిశ్రమను అభివృద్ధిచేస్తున్నపుడు, అందులో తొలి అడుగు వల్లపొందే ప్రయోజనాన్ని మీరు అందిపుచ్చుకోవాలి.
మిత్రులారా,
ఉత్తరప్రదేశ్‌లో పాలు, చేపలు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయల విషయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎంతో వైవిధ్యత ఉంది. ఈరంగంలో ఇప్పటికీ ప్రైవేటు రంగం పాత్ర పరిమితంగానే ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి మనం ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని (పిఎల్‌ఐ) తీసుకువచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుంది. మీరు ఈ పథకం ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.
మిత్రులారా,
రైతులకు ప్రతి దశలోనూ ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇన్‌పుట్ సదుపాయం నుంచి పంట పండిన అనంతరం కార్యకలాపాల వరకు వీటిని అందుబాటులో ఉంచడ ం జరుగుతోంది. చిన్న ఇన్వెస్టర్లు ఆగ్రిఇన్‌ఫ్రా నిధులను ఉపయోగించుకోవచ్చు. అలాగే, దేశవ్యాప్తంగా మనంపెద్దఎత్తున నిల్వ సామర్ధ్యాన్ని పెంచేందుకు బడ్జెట్‌లో తగిన ఏర్పాటు చేయడం జరిగింది.చిన్న ఇన్వెస్టర్లకు ఇది గొప్ప అవకాశం.
మిత్రులారా,
ఇవాళ మన ఇండియాలో ప్రధానంగా పంటల వైవిధ్యతపైన,సన్నకారు రైతులకు వనరులు అందుబాటులో ఉంచడంపైన, వారి ఇన్‌పుట్ ఖర్చులు తగ్గించడంపైన ప్రధానంగా దృష్టిపెట్టడం జరుగుతోంది. అందుకే మనం సత్వరం ప్రకృతి వ్యవసాయం దిశగా శరవేగంతో ముందుకు సాగుతున్నాం.ఉత్తరప్రదేశ్‌లో గంగ ఒడ్డున ఇరువైపులా 5 కిలోమీటర్ల పరిధిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు సహాయపడేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో 10,000 బయో ఇన్‌పుట్ రిసోర్సుసెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది.ఇందుకు సంబంధించి ప్రైవేటు ఎంటర్‌ప్రెన్యుయర్లు పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
మిత్రులారా,
చిరుధాన్యాలకు సంబంధించి ఇండియాలో కొత్త ప్రచారం మొదలైంది. ఈ చిరుధాన్యాలను ఇండియాలో సాధారణంగా ముతక ధాన్యాలని అంటాం. ఇందులో ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి.ఈ ఏడాది బడ్జెట్‌లో మేము దీనికి కొత్త పేరు పెట్టిన విషయాన్ని మీరు వినే ఉంటారు . అంతర్జాతీయ మార్కెట్‌లో దీనికి ఒక గుర్తింపు నివ్వడానికి దీనికి శ్రీ అన్న అని పేరుపెట్టడం జరిగింది. శ్రీ అన్న లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఒక సూపర్ పుడ్. శ్రీఫాల్ లాగా శ్రీ అన్న కూడా వినూత్నమైనది. ఇండియాకు చెందిన శ్రీ అన్న ప్రపంచ పౌష్టికాహార భద్రత సమస్యను తీర్చేలా చేయాలన్నది మా ప్రయత్నం. ప్రపంచం ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటోంది. అందువల్ల ఒక వైపు రైతులను శ్రీ అన్నను పండిరచేందుకు ప్రోత్సహిస్తున్నాం. మరో వైపు ఇందుకోసం అంతర్జాతీయ మార్కెట్‌ను విస్తృత పరుస్తున్నాం.ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో ముడిపడిన మిత్రులు, అప్పటికప్పుడే తినడాని లేదా వండడానికి సిద్దమైన , శ్రీ అన్న ఉత్పత్తులకు గల అవకాశాలను పరిశీలించాలి. ఆ రకంగా మానవాళికి పెద్ద ఎత్తున సేవ చేయాలి.
మిత్రులారా,
ఉత్తరప్రదేశ్‌లో మరో అంశానికి సంబంధించి గొప్ప పనిని చేపట్టడం జరిగింది. అది విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించినది. మహాయోగి గురు గోరఖ్‌నాథ్ ఆయుష్ యూనివర్సిటీ, అటల్ బిహారీ వాజ్‌పేయి హెల్త్ యూనివర్సిటీ, రాజ మహేంద్ర ప్రతాప్‌సింగ్ యూనివర్సిటీ, మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్‌యూనివర్సిటీ,ఇకా ఎన్నో ఇలాంటి సంస్థలు యువతకు వివిధ నైపుణ్యాలకు సిద్దంచేస్తున్నాయి.నైపుణ్యాభివృద్ధి మిషన్ కింద ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 16 లక్షల మందికి వివిధ రకాల శిక్షణ అందించినట్టు నా దృష్టికి వచ్చింది. పిజిఐ లక్నో, ఐఐటి కాన్పూర్‌లలో కృత్రిమ మేధకు సంబంధించిన కోర్సులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.
విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గ విద్యా విషయాలకు ఇంచార్జి అయిన ఉత్తరప్రదేశ్ గవర్నర్, ఇప్పుడు మార్గమధ్యంలో నాతో మాట్లాడుతూ,భారత దేశంలో నెట్ అక్రిడిటేషన్‌లో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాలుగు విశ్వవిద్యాలయాలు ఉండడం గర్వకారణమని చెప్పారు. విద్యారంగంతో సంబంధం ఉన్న వారిని ఛాన్సలర్ మేడమ్‌ను ఈ విజయం సాధించినందుకు అభినందిస్తున్నాను.దేశ స్టార్టప్ విప్లవంలో ఉత్తరప్రదేశ్ పాత్ర కూడా నానాటికీ పెరుగుతున్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వంద ఇంక్యుబేటర్లను , మూడు అధునాతన కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నది. అంటే ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్లు నైపుణ్యం కలిగిన యువత, పెద్ద సంఖ్యలో గల ప్రతిభ కల వారి సేవలను వినియోగించుకోనున్నారు.
మిత్రులారా,
ఈ విషయంలో ఇంతకుమించి మెరుగైన భాగస్వామ్యం ఉండబోదు. ఒకవైపు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఉద్దేశం ఒకవైపు. అద్భుత అవకాశాలతో ఉత్తరప్రదేశ్ మరోవైపు వెలిగిపోతున్నాయి. మనం ఇక ఎంత మాత్రం సమయం వృధా చేయరాదు. ప్రపంచ ఉజ్వల భవిష్యత్తు , భారత ఉజ్వల భవిష్యత్తుపై ఆధారపడి ఉంది. ఈ సుసంపన్నతా ప్రయాణంలో మీరు భాగస్వాములు కావడం ఎంతో కీలకం. ఈ పెట్టుబడులు పవిత్రమైనవి అయి ప్రతి ఒక్కరికీ అదృష్టాన్ని తీసుకురావాలి. దీనితో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రపంచ, దేశ ఇన్వెస్టర్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడి అధికార యంత్రాంగం మీరు కన్న కలలను సాకారం చేసేందుకు అభివృద్ధి పథంలో పయనించేందుకు గట్టి సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఈ విశ్వాసంతో నేను దేశ, విదేశాలకు చెందిన ఇన్వెస్టర్లను ఉత్తరప్రదేశ్ గడ్డకు మరోసారి స్వాగతం పలుకుతున్నాను.
ధన్యవాదాలు.