Quote· “ప్రపంచంలోని ప్రధాన దేశాలు లేదా అంతర్జాతీయ వేదికలన్నిటా నేడు భారత్‌పై విశ్వాసం మునుపటికన్నా బలపడింది”
Quote· “వికసిత భారత్‌ పురోగమన వేగం అత్యద్భుతం”
Quote· “దేశంలోని అనేక ఆకాంక్షాత్మక జిల్లాలు ఇప్పుడు స్ఫూర్తిదాయక జిల్లాలుగా రూపాంతరం చెందాయి”
Quote· “బ్యాంకింగ్ సౌలభ్యం లేనివారికి బ్యాంకింగ్ సేవలు... అభద్రతలో ఉన్నవారికి భద్రత... నిధులందని వారికి నిధుల లభ్యత మా వ్యూహంలో భాగం”
Quote· “వ్యాపార నిర్వహణ భయాన్ని వాణిజ్య సౌలభ్యంగా మార్చాం”
Quote· “భారత్‌ తొలి 3 పారిశ్రామిక విప్లవాలను కోల్పోయినా... నాలుగో విప్లవంలో ప్రపంచంతో ముందడుగుకు సిద్ధంగా ఉంది”
Quote· “వికసిత భారత్‌ దిశగా దేశ పురోగమనంలో ప్రైవేట్ రంగాన్ని ఓ కీలక భాగస్వామిగా మా ప్రభుత్వం పరిగణిస్తుంది”
Quote· “కేవలం పదేళ్లలోనే 25 కోట్ల మంది భారతీయులు పేదరిక విముక్తులయ్యారు”

శ్రీ వినీత్ జైన్, పరిశ్రమల నేతలు, సీఈఓలు, ఇతర గౌరవనీయ ప్రతినిధులు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను!

క్రితం సారి ఈటీ సమిట్ ఎన్నికలు బాగా దగ్గర పడిన సమయంలో ఏర్పాటయ్యింది. మేం పాలన చేపట్టిన మూడోసారి భారత్ మరింత వేగంతో పనిచేస్తుందని అప్పుడు మీకు  సవినయంగా మనవి చేశాను. గుర్తుంది కదా! అప్పుడు ప్రస్తావించిన వేగాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలగడం, దేశం నా ఆశయానికి మద్దతుగా నిలవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీ- ఎన్డీఏకు తమ దీవెనలను అందిస్తున్నారు. వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) ఆశయానికి ఒడిశా ప్రజలు గత జూన్ లో మద్దతునివ్వగా, అటు తరువాత హర్యానా ప్రజలు, ఇప్పుడు ఢిల్లీ పౌరులూ భారీ మద్దతును తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడుతున్నారు అనేందుకు ఇదో తార్కాణం!
 

|

మిత్రులారా,

అమెరికా ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగించుకుని నేను నిన్న రాత్రే దేశానికి తిరిగి వచ్చానని మీకు తెలుసు! అటు అగ్రదేశాలు కానివ్వండి, ఇటు వివిధ అంతర్జాతీయ వేదికలు కానివ్వండి, వీరంతా భారత్ పట్ల మునుపెన్నడూ లేని విధంగా గొప్ప విశ్వాసం చూపుతున్నారు. ప్యారిస్ లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్ చర్చల్లో ఈ విషయం స్పష్టమయ్యింది. భవిష్యత్తుకు సంబంధించిన అనేక చర్చల్లో ఇప్పుడు భారత్ కేంద్రంగా ఉంది. నిజానికి కొన్ని చర్చలకు మనమే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అప్పుడప్పుడూ నాకో ఆలోచన వస్తూ ఉంటుంది.. 2014లో ఈ దేశ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోకపోయి ఉంటే, కొత్త సంస్కరణల వెల్లువ మొదలయ్యేదా? ఈ మార్పును మనం చూడగలిగేవారమా? ఊహూ, అది సాధ్యపడేదని నేను నమ్మడం లేదు, మీ మాటా అంతేననుకుంటాను. అసలు ఇంత పెద్దఎత్తున మార్పులు జరిగేవా? మీలో హిందీ భాషను అర్ధం చేసుకునే వారికి నేను చెప్పేది వెంట‌నే అర్ధమై ఉంటుంది. మేం అధికారంలోకి రాక ముందు కూడా దేశంలో పరిపాలన సాగింది. అయితే ఇక్కడ రెండు అంశాలు గమనించదగ్గవి. ఒకటి, కాంగ్రెస్ హయాంలో నత్తనడకన సాగిన అభివృద్ధి, రెండు, ఆ ప్రభుత్వంలో వేళ్ళూనిన అవినీతి.  ఇవి కొనసాగి ఉంటే ఏమై ఉండేది? దేశానికి కీలకమైన సమయం వృధా అయ్యుండేది! 2014లో కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యం - 2044 కల్లా దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. అంటే వారి ఆలోచనలు, ప్రణాళికలు 30 ఏళ్ళ సుదీర్ఘ కాలానికి సంబంధించినవన్న మాట! అదీ, కాంగ్రెస్ వారి వేగవంతమైన వృద్ధి నమూనా.. ఇక మా ‘వికసిత్ భారత్’ వృద్ధి వేగాన్ని మీరే గమనిస్తున్నారు..  కేవలం ఒక దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచ అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు దక్కించుకుంది. రానున్న మరి కొద్ది సంవత్సరాల్లో మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువగలమని నేను పూర్తి బాధ్యతతో, నమ్మకంతో చెబుతున్నాను.  మీరే పోల్చి చూడండి.. మనకి కావలసింది 2044 నమూనానా లేక నేటి శరవేగమైన‌ అభివృద్ధా? మనవంటి యువ దేశానికి గట్టి వేగం అవసరం. మనం సరిగ్గా అటువంటి వేగంతోనే ముందుకి పరుగు పెడుతున్నాం.  

మిత్రులారా..

గత ప్రభుత్వాలు సంస్కరణల పట్ల ఉదాసీనత చూపాయన్న విషయాన్ని మనం మరువకూడదు. ఈటీ యాజమాన్యం ఈ విషయాన్ని మరిచిపోయి ఉండవచ్చు... కాబట్టి నేను గుర్తు చేస్తున్నాను. వారు ప్రవేశపెట్టిన అరకొర సంస్కరణలు నమ్మి చేసినవికాక, కేవలం తప్పక చేపట్టినవే! అయితే ఈ రోజున దేశంలో అమలవుతున్న  సంస్కరణలను మేం పూర్తి విశ్వాసంతో ప్రవేశపెట్టాం. సంస్కరణలు అవసరమా, వాటి కోసం అంత శ్రమ దేనికి అన్న ధోరణిని గత ప్రభుత్వాలు చూపేవి. మనల్ని ఎన్నుకున్నారు... అయిదేళ్ళపాటు హాయిగా అనుభవిద్దాం. అయిదేళ్ళు పూర్తయ్యాక ఎన్నికల సమయం వచ్చాక అప్పుడు చూసుకోవచ్చన్న రీతిలో వారి ఆలోచనలు సాగేవి.  పెను సంస్కరణలు దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి మార్పుకు శ్రీకారం చుడతాయ‌న్న చర్చ జరిగినట్లే కనపడదు. మీరంతా వ్యాపార సామ్రాజ్యానికి చెందినవారు. మీరు కేవలం అంకెలతో సరిపెట్టుకోక మీ వ్యూహాలను సమీక్షించుకుంటారు. ఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన పద్ధతులైనప్పటికీ, కాలం చెల్లినవిగా గుర్తిస్తే వాటిని విడిచిపెట్టేందుకు వెనుకాడరు. పనికిరాని పద్ధతుల బరువుతో ఏ పరిశ్రమా ముందుకు సాగలేదు. అటువంటి వాటిని వదిలించుకుంటుంది. అయితే, కొన్ని ప్రభుత్వాలు స్వాతంత్ర్యానంతరం కూడా సామ్రాజ్యవాద పద్ధతుల బరువుని మోస్తూ, సొంత ఆలోచనకు తావివ్వక బ్రిటీషు పాలన నాటి విధానాలని కొనసాగించాయి. సకాలంలో అందని న్యాయం వ్యర్థం అన్న నానుడిని మీరు వినే ఉంటారు. పరిపాలనలో అదొక తారకమంత్రం వంటిది. ఎంతోకాలంగా వింటున్న మాటే అయినా సత్వర న్యాయాన్ని అందించేందుకు, వ్యవస్థని సంస్కరించేందుకు ఎవరైనా గట్టి ప్రయత్నం చేశారా? లేదే!  అసమర్థత అలవాటుగా మారి, మార్పు ఆవశ్యకతనే మర్చిపోయాం. ఇకపోతే, సకారాత్మక చర్యల గురించిన చర్చలకి అడ్డుపడే ఒక సంస్కృతి నాడు ఉన్నంత కాకపోయినా, నేడూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. ప్రగతిని అడ్డుకోవడమే ఇటువంటి వారి పని. అందుకోసమే తమ శక్తియుక్తులని వెచ్చిస్తారు వీరు. అయితే ప్రజాస్వామ్యంలో చెడుని విమర్శించడం ఎంత ముఖ్యమో, మంచి పనుల గురించి చర్చించుకోవడమూ అంతే ముఖ్యం. ప్రతికూల వాతావరణాన్ని వ్యాప్తి చేయడమే ప్రజాస్వామ్యం అన్న ధోరణి పెరుగుతూ, జరిగిన ప్రగతి గురించి మాట్లాడడం బలహీన ప్రజాస్వామ్యానికి సంకేతంగా మారే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ధోరణికి స్వస్తి పలకడం అత్యంత అవసరం. ఈ విషయంలో కొన్ని ఉదాహరణలు చెబుతాను..
 

|

మిత్రులారా,

ఇటీవలి కాలం వరకూ భారత్ లో అమలైన నేర చట్టాలు 1890 నాటివి. మీరు విన్నది సరైనదే. 1890 నాటి చట్టాలవి!  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నాటి బూజుపట్టిన చట్టాలని మార్చాలని అప్పటి ప్రభుత్వాలకి తట్టలేదు. బ్రిటీష్ కాలం నాటి బానిస భావాలతో జీవించడం అలవాటుగా మారిపోయింది. 1890 చట్టాల పరమార్థం ఏమిటి? దేశంలో బ్రిటీషు పాలనని బలపరచడం, భారత పౌరులని శిక్షించడం.. అంతే కదూ! శిక్షలే పరమావధిగా తయారైన వ్యవస్థ... న్యాయం గురించి ఆలోచిస్తుందా? అందుకనే ఆ పద్ధతిలో న్యాయం కోసం ఏళ్ళపాటు నిరీక్షించవలసి వచ్చేది. అందుకనే మేం భారీ మార్పులను ప్రవేశపెట్టాం – ఈ పని అంత సులభంగా ముడిపడలేదు. కొన్ని లక్షల గంటలు వెచ్చించి భగీరథ ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఎట్టకేలకు జాతికి భారతీయ న్యాయ సంహితను (బీఎన్ఎస్) అందించగలిగాం. భారత పార్లమెంటు కొత్త న్యాయ చట్టాలకు ఆమోదం తెలిపింది. నూతన చట్టాలు అమలు మొదలై 7-8 నెలలే అయినప్పటికీ ఇప్పటికే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దినపత్రికల్లో ఈ మార్పుల గురించి మీకు ఎక్కువగా కనపడకపోవచ్చు కానీ ప్రజల మధ్యకు వెళ్ళండి. మార్పును మీరే గమనిస్తారు. న్యాయ సంహిత అమలు ప్రారంభమయ్యాక న్యాయాన్ని అందించే తీరులో వచ్చిన మార్పులని మీకు ఉదాహరణాల ద్వారా తెలియజేస్తాను. మూడు హత్యలకు సంబంధించిన ఒక  కేసులో ఎఫ్ఐఆర్ నమోదు నుంచీ తుది తీర్పు వెలువడేందుకు పట్టిన సమయం కేవలం 14 రోజులు. మిత్రులారా! నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్షను విధించారు. ఇక ఒక మైనర్ హత్యకు సంబంధించిన కేసును న్యాయస్థానాలు 20 రోజుల్లో పరిష్కరించాయి. గుజరాత్ లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎఫ్ఏఆర్ అక్టోబర్ 9న నమోదవగా, అక్టోబర్ 26న చార్జిషీటు దాఖలు చేశారు. ఇక ఈరోజు, అంటే ఫిబ్రవరి 15న కోర్టు నిందితులకు జైలుశిక్ష విధించింది. ఆంధ్ర‌ప్రదేశ్ లో 5-నెలల శిశువు పట్ల జరిగిన అకృత్యం విషయంలో కోర్టు నిందితుడికి 25 ఏళ్ళ కారాగారాన్ని విధించింది. ఈ కేసులో డిజిటల్ సాక్ష్యాధారాలు కీలకమయ్యాయి. మరో అత్యాచారం, హత్య కేసులో నిందితుడిని ‘ఈ-ప్రిజన్’ వ్యవస్థ ద్వారా పట్టుకున్నారు. ఇక ఇలాంటిదే మరో అత్యాచారం హత్య కేసులో నిందితుడి నేర నమోదు ఒక రాష్ట్రంలో జరిగినట్లు, అప్పటికే ఆ నిందితుడు మరో రాష్ట్రంలో మరో నేరం చేసినందుకు జైల్లో ఉన్నట్లూ వెల్లడయ్యింది. ఎటువంటి జాప్యం లేకుండా అతడిని అరెస్టు చేశారు. సత్వర న్యాయం అందిస్తున్న ఇటువంటి కేసులు అనేకం.  

 

స్నేహితులారా,

ఆస్తి హక్కుల విషయంలో సంస్కసరణలను సైతం తీసుకువచ్చాం. అనేక దేశాల్లో ప్రజలకు ఆస్తి హక్కులు లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి చేపట్టిన అధ్యయనం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వద్ద వారి ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేవు. ఆస్తి హక్కులు పేదరికాన్ని తగ్గించడంలో దోహదపడతాయి. గతంలో ప్రభుత్వాలు దీన్ని గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా, ఆ తలనొప్పిని ఎవరు భరిస్తారు? దీనికోసం ఎవరు శ్రమిస్తారు? ఈ పనికి ప్రధాన వార్తల్లో చోటు దక్కదు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇబ్బంది పడాలి? అని భావించి ఉంటారు. దేశాలను నిర్వహించాల్సిన లేదా నిర్మించాల్సిన పద్ధతి ఇది కాదు! అందుకే మేము స్వామిత్వ యోజన ప్రారంభించాం. ఈ పథకం ద్వారా దేశంలో 3 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వేలు చేపట్టాం. 2.25 కోట్లకు పైగా ప్రజలు వారి ఆస్తులకు సంబంధించిన యాజమాన్య పత్రాలు అందుకున్నారు. ఈ రోజు నేను ఈటీకి ఒక ముఖ్యమైన వార్తను ఇస్తున్నాను. స్వామిత్వ గురించి రాయడం ఈటీకి అంత సులభం కాదని నాకు తెలుసు. కాలం గడిచే కొద్దీ అలవాట్లు మారిపోతాయి!

స్వామిత్వ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 100 లక్షల కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అంటే గ్రామాల్లో పేదలకు చెందిన ఈ రూ.100 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఆర్థికాభివృద్ధి దిశగా వినియోగించుకోలేదు. తమ ఆస్తులపై గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆస్తి హక్కులు లేకపోవడంతో వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోయేవారు. ఇప్పుడు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. స్వామిత్వ కార్డుల ద్వారా ప్రజలు పొందుతున్న ప్రయోజనాల గురించి నివేదికలు తెలియజేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం, ఈ పథకం ద్వారా యాజమాన్య హక్కులు పొందిన రాజస్థాన్‌కు చెందిన ఓ సోదరితో నేను మాట్లాడాను. ఆమె కుటుంబం 20 ఏళ్లుగా ఓ చిన్న ఇంట్లో నివసిస్తోంది. ఆస్తి కార్డు వచ్చిన వెంటనే బ్యాంకు నుంచి రూ.8 లక్షల రుణాన్ని ఆమె తీసుకుంది. ఆ సొమ్ముతో ఓ దుకాణాన్ని ప్రారంభించింది. తద్వారా వస్తున్న ఆదాయంతో తన కుటుంబానికి, పిల్లల ఉన్నత విద్యకు సాయపడుతోంది. మార్పు ఇలాగే వస్తుంది! మరో రాష్ట్రంలో తన ఆస్తి కార్డుతో ఓ వ్యక్తి రూ. 4.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. ఈ సొమ్ముతో ఓ వాహనాన్ని కొని రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారు. మరో గ్రామంలో ఓ రైతు తన ఆస్తి కార్డు ఉపయోగించి రుణం తీసుకున్నారు. దానితో తన పొలంలో ఆధునిక నీటిపారుదల యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామీణులకు, పేదవారికి కొత్త ఆదాయ మార్గాలను అందిస్తున్న ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ సంస్కరణలు, ఆచరణ, పరివర్తనలకు సంబంధించిన వాస్తవ కథలు. ఇవి వార్తాపత్రికల్లో ప్రచురితం కాని, టీవీల్లో ప్రసారమవని కథనాలు.

 

|

స్నేహితులారా,

స్వాతంత్ర్యం తర్వాత మనదేశంలో అనేక జిల్లాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీనికి కారణం బడ్జెట్ లేకపోవడం కాదు. పరిపాలనా వైఫల్యమే. నిధులు కేటాయించారు, ప్రకటనలు చేశారు. స్టాక్ మార్కెట్లలో పెరుగుతున్న, తగ్గుతున్న సూచీల గురించి నివేదికలు కూడా ప్రచురించారు. వీటికి బదులుగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి ఉండాల్సింది. అలా చేయకపోగా, వాటిని వెనబడిన జిల్లాలు అని ముద్ర వేసి వదిలేశారు. వాటిని అభివ‌ృద్ధి చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఆ జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని ఓ శిక్షగా భావించేవారు.

స్నేహితులారా,

ఈ ప్రతికూల అంశాన్ని సవాలుగా పరిగణించి మొత్తం విధానాన్నే నేను మార్చాను. దేశంలో ఒకప్పుడు వెనకబడినవిగా ముద్రపడిన 100 జిల్లాలను గుర్తించాం. నేను వాటిని వెనకబడిన జిల్లాలు అని కాకుండా ఆకాంక్షాత్మక జిల్లాలు అని పిలవడం ప్రారంభించాను. ఈ జిల్లాలకు యువ అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో పరిపాలనను మెరుగుపరిచాం. ఈ జిల్లాలు ఏ అంశాల్లో వెనకబడ్డాయో గుర్తించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన పథకాలను ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేసి వేగంగా అమలు చేశాం. ఇప్పుడు ఈ ఆకాంక్షాత్మక జిల్లాలో చాలా వరకు స్ఫూర్తిదాయక జిల్లాలుగా రూపాంతరం చెందాయి.

అస్సాంలో ఆకాంక్షాత్మక జిల్లాల గురించి నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. వాటిని మునపటి ప్రభుత్వాలు వెనకబడ్డ జిల్లాలుగా ముద్ర వేశాయి. ఇప్పుడు అవి సాధించిన అభివృద్ధిని మీ ముందుంచుతున్నాను. అస్సాంలోని బార్పేట జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ 2018లో 26శాతం పాఠశాలల్లో మాత్రమే విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేది. కేవలం 26 శాతం పాఠశాలల్లో. ఇప్పుడు ఈ జిల్లాలో ఆ నిష్పత్తి నూరు శాతానికి చేరుకుంది. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి మధ్య సమతౌల్యం ఏర్పడింది. అదే విధంగా నిధులు, వనరులు అందుబాటులోనే ఉన్నప్పటికీ బీహార్‌లోని బేగుసరాయిలో 21 శాతం మంది గర్భిణీలకు మాత్రమే పోషకాహారం లభించేది. ఉత్తర ప్రదేశ్‌లోని చందౌలీలో ఇది మరింత తక్కువగా 14 శాతం మాత్రమే ఉండేది. ఈ అంశంలో ఈ రెండు జిల్లాలు 100 శాతానికి చేరుకున్నాయి. చిన్నారులకు టీకాలు వేయడంలోనూ మేము పురోగతిని సాధించాం. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో టీకాలు వేయించుకున్నవారి శాతం 49 నుంచి 86 శాతానికి పెరిగింది. తమిళనాడులోని రామంతపురంలో 67 నుంచి 93 శాతానికి పెరిగింది. ఈ విజయాల అనంతరం క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకొచ్చే పద్ధతి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని మేం గుర్తించాం. అందుకే, 100 ఆకాంక్షాత్మక జిల్లాలను విజయవంతంగా గుర్తించి, ఈ కార్యక్రమాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లాం. 500 ఆకాంక్షాత్మక బ్లాకులను గుర్తించి వాటిని వేగంగా అభివృద్ధి చేసేలా దృష్టి సారించాం. ఈ 500 బ్లాకులు ప్రాథమికంగా అభివృద్ధి సాధిస్తే మొత్తం దేశాభివృద్ధి సూచీలే మారిపోతాయి.

స్నేహితులారా,

ఇక్కడ పెద్ద సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. మీరు అనేక దశాబ్దాల పాలనను చూశారు. సుదీర్ఘకాలంగా వ్యాపార రంగంలో ఉన్నారు. భారత్‌లో వ్యాపార విధానం ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు ఊహించుకుని ఉండి ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి.. పదేళ్ల క్రితం మన ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు ఎక్కడకి చేరుకున్నాం? దశాబ్దం క్రితం భారత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. అది చాలా సున్నితంగా ఉండేది. మిలియన్ల మంది భారతీయులు బ్యాంకింగ్ సేవల వ్యవస్థకు వెలుపల ఉన్నారు. వినీత్ జీ మాట్లాడుతూ జన్ ధన్ ఖాతాల గురించి ప్రస్తావించారు. ఒకప్పుడు రుణం పొందడం కష్టతరంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉండేది.

 

|

మిత్రులారా,

బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టపరచడానికి మేం ఒకే సమయంలో అనేక స్థాయిలలో మా కృషిని కొనసాగించాం. బ్యాంకింగ్ సేవలను అందుకోకుండా మిగిలిపోయిన సామాజిక వర్గాల వారికి ఆ సేవలను చేరువ చేయడం, పూచీకత్తు లేని రుణాలను ఇవ్వడం ద్వారా అవసరార్థులకు భద్రతను కల్పించడం, నిధుల అండ ఇన్నేళ్లుగా లభించని వారికి ఆ లోటును తీర్చడం.. ఇదీ మేం అనుసరించిన వ్యూహం. పదేళ్ల కిందట, ఆర్థిక సేవలను సమాజంలో అన్ని వర్గాల వారి చెంతకు చేర్చడం సాధ్యమయ్యే పని కాదని, బ్యాంకుల శాఖలు తగినన్ని లేకపోవడం దీనికి కారణమన్న వాదన ఉండింది. కానీ ప్రస్తుతం, భారత్‌లో ప్రతి గ్రామంలో ఒక బ్యాంకు శాఖనో, లేదా 5 కిలోమీటర్ల లోపు బ్యాంకింగ్ కరెస్పాండెంట్ సేవలు అందుతూ ఉండడాన్నో గమనించవచ్చు. రుణాల అందుబాటు మెరుగుపడిందనడానికి ఒక ఉదాహరణ ‘ముద్ర’ (MUDRA) యోజనే. పాత బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలకు ఎన్నడూ నోచుకోని వర్గాలకు, రూ.32 లక్షల కోట్లను ఈ పథకంలో భాగంగా సమకూర్చారు. ఇదొక భారీ మార్పు. ఎంఎస్ఎంఈ రుణాలు చాలా సులభతరంగా మారాయి. ప్రస్తుతం, వీధుల్లో తిరుగుతూ సరుకులను అమ్మే వ్యాపారస్తులు కూడా పూచీకత్తు అక్కర లేని రుణాలను అందుకొంటున్నారు. రైతులకు ఇస్తున్న రుణాలు రెండింతలకు మించాయి. మనం పెద్ద పెద్ద మొత్తాలలో రుణాలను ఇస్తుండడం ఒక్కటే కాకుండా మన బ్యాంకులు లాభాల్లో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ఒక దశాబ్ద కాలం కిందట, ‘ఎకనామిక్ టైమ్స్’ కూడా బ్యాంకింగ్ స్కాములను గురించి, వసూలయ్యే అవకాశం లేని రుణాలు (ఎన్‌పీఏలు) ఎంత మేరకుందీ తన శీర్షికల్లో తెలియజేస్తూ ఉండేది. మన బ్యాంకింగ్ రంగం ఎంతటి దుర్బలత్వంతో ఉన్నదీ సూచిస్తూ సంపాదకీయాల్లో ఆందోళనను వ్యక్తం చేసేవారు. మరి ఇవాళ ఎలాంటి కథనాల్ని ప్రచురిస్తున్నారు? ఏప్రిల్, డిసెంబరుల మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.25 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయని తెలిపారు. మిత్రులారా, ఇది ఒక్క శీర్షికల్లో చోటుచేసుకున్న మార్పు కాదు. ఇది వ్యవస్థలో వచ్చిన మార్పు. దీనికి కారణం మన బ్యాంకింగ్ సంస్కరణలే. ఇది మన ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఎరుగనంత బలంగా ఉన్నాయని నిరూపిస్తోంది.

మిత్రులారా,

వ్యాపారం చేయడానికి భయపడడాన్ని మేం గత దశాబ్దంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యంగా మార్చేశాం. జీఎస్‌టీ తో, భారత్‌లో ఇప్పుడు ఒకే భారీ మార్కెట్‌ ఏర్పడింది. ఇది పరిశ్రమలకు ఎంతో మేలు చేసింది. ఇదివరకు ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు సామర్థ్యాన్ని కూడా పెంచింది. అనవసరంగా వందల నియమాలను పాటించవలసి రావడాన్ని మేం తప్పించాం. అంతేకాకుండా ఇప్పుడు ‘జన్ విశ్వాస్ 2.0’ ద్వారా వాటిని మరింత తగ్గించాం. ప్రభుత్వ జోక్యం చాలావరకు తగ్గి కనీస స్థాయికి చేరాలని నేను దృఢంగా నమ్ముతాను.  దీనిని సాధించడానికి, మేం నియంత్రణలను మరింత సువ్యవస్థీకరించడానికి ఒక డీరెగ్యులేషన్ కమిషనును కూడా ఏర్పాటుచేస్తున్నాం.

మిత్రులారా,

ప్రస్తుతం, భారత్ మరో పెద్ద మార్పును చూస్తోంది. ఇది మనను రాబోయే కాలానికి సన్నద్ధం చేస్తోంది. తొలి పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడు, భారత్ వలస పాలనలో మగ్గిపోతూ ఉండింది.

రెండో పారిశ్రామిక విప్లవం కాలంలో, ప్రపంచం కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నప్పుడు, భారత్‌లో స్థానిక పరిశ్రమలను ధ్వంసం చేస్తూ పోయారు. ముడిపదార్థాలను భారత్ నుంచి బయటకు ఎగుమతి చేశారు. దీంతో మనం వెనుకబడ్డాం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా, స్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ప్రపంచం కంప్యూటర్ విప్లవం దిశగా కదులుతున్న వేళ, భారతీయులు ఒక కంప్యూటర్‌ను కొనాలన్నా అందుకోసం లైసెన్సును తీసుకోవాల్సి వచ్చేది.  మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల లాభాలను భారత్ అందుకోలేకపోయింది. అయితే నాలుగో పారిశ్రామిక విప్లవంలో, మనం ప్రపంచంతో భుజం భుజం కలిపి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.

 

|

మిత్రులారా,

‘వికసిత్ భారత్’ గమ్యం వైపు దూసుకుపోతున్న క్రమంలో, ప్రైవేటు రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా చేసుకోవాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేటు ప్రాతినిధ్యం కోసం అంతరిక్ష రంగం సహా అనేక కొత్త రంగాల తలుపులను తెరచి ఉంచింది. ఇవాళ, అనేక మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు అంకుర సంస్థలు (స్టార్ట్-అప్స్) కూడా అంతరిక్ష రంగంలో గొప్ప గొప్ప తోడ్పాటులను అందిస్తున్నాయి. ఇదే మాదిరిగా, ఒకప్పుడు ప్రజల భాగస్వామ్యానికి ఆమడ దూరంలో ఉండిపోయిన డ్రోన్ రంగం ప్రస్తుతం యువతీయువకులకు భారీ అవకాశాల్ని కల్పిస్తోంది. మేం వాణిజ్య సరళిలో బొగ్గు గనుల తవ్వకం రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు అందిస్తున్నాం. వేలంపాట విధానాన్ని మరింత సరళం చేశాం. దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విజయాల్లో ప్రైవేట్ రంగానిది పెద్ద పాత్ర. ఇప్పుడిక మేం సమర్ధతను పెంచడానికి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో సైతం ప్రైవేటు రంగం ప్రాతినిధ్యాన్ని విస్తరిస్తున్నాం. ఈ సంవత్సరం బడ్జెటులో అతి ప్రధాన సంస్కరణల్లో ఒకటి ఏమిటంటే.. అది ఇదివరకు ఎవ్వరూ చేయడానికి సాహసించనిది.. పరమాణు రంగాన్ని కూడా ప్రైవేటు ప్రాతినిధ్యానికి వీలున్న రంగంగా మేం మార్చాం.

మిత్రులారా,

ప్రస్తుతం, మన రాజకీయాలు కూడా పనితీరు ప్రధానమైనవిగా మారిపోయాయి. క్షేత్ర స్థాయిలో సంబంధాలను విడనాడకుండా, సిసలైన ఫలితాలను అందించేవారే మనుగడ సాగించగలుగుతారు.. ఈ విషయాన్ని భారత్ ప్రజలు తేటతెల్లం చేశారు. ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలను అర్థం చేసుకొనేదిగా ఉండాలి. సుపరిపాలనకు మొట్టమొదటి యోగ్యత ఇదే. దురదృష్టవశాత్తు, మా కన్నా ముందు విధాన రూపకల్పన బాధ్యత వహించిన వారిలో ఇటు సూక్ష్మగ్రాహ్యత గాని, అటు వాస్తవిక మార్పును తీసుకొచ్చే సంకల్ప శక్తి గాని.. ఈ రెండూ లోపించాయి. మా ప్రభుత్వం ప్రజల సమస్యలను సహానుభూతితో ఆలకించి, వాటిని ఉద్వేగంతోను, నిబద్ధతతోను పరిష్కరించడానికి ధైర్యం గల, తిరుగులేని చర్యలను తీసుకొంది. పౌరులకు గత పదేళ్లలో ప్రాథమిక సౌకర్యాలను కల్పించినందువల్ల 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చిచెప్పాయి. ఈ భారీ మార్పు ఒక సరికొత్త నవ్య మధ్య తరగతిని తెర మీదకు తెచ్చింది. ఈ వర్గం వారు ప్రస్తుతం వారి తొలి ద్విచక్ర వాహనాన్ని, తొలి కారును, తొలి ఇంటిని కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. మధ్య తరగతికి అండగా నిలబడడానికి మేం ఈ సంవత్సరం బడ్జెటులో ఒక ప్రధాన మార్పును తీసుకు వచ్చాం.. మేం సున్నా పన్ను పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచివేశాం. ఈ నిర్ణయం మధ్య తరగతిని బలపరుస్తుంది. అంతేకాక, దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతిస్తుంది కూడా. ఒక ప్రభుత్వం క్రియాశీలంగా ఉంటూ, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వాటిని తీర్చేదయితేనే ఇది సాధ్యపడుతుంది.

మిత్రులారా,

‘వికసిత్ భారత్’ పక్కా విశ్వాసం పునాది మీదే నిలబడుతుంది. ఆ విశ్వాసం ప్రజల్లో, ప్రభుత్వంలో, వ్యాపార రంగ ప్రముఖుల్లో ఏర్పడాలి. పురోగమించడానికి ఈ విశ్వాసమనే మూలకం ఎంతో ముఖ్యం. ప్రజల్లో ఈ తరహా విశ్వాసాన్ని బలపరచడానికి మా ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తోంది. మేం ఆవిష్కర్త (ఇన్నొవేటర్)లలో నమ్మకం, ధైర్యంలతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తున్నాం. దాంతో, వారు తమ ఆలోచనలకు ఊపిరి పోయగలుగుతారన్నమాట. వ్యాపారాలు స్థిర వృద్ధిని సాధిస్తూ పోవడానికి వాటికి నిలకడతనంతో కూడి ఉండే, సమర్థనను అందించగలిగే విధానాల అండదండలు లభించేటట్లు మేం చూస్తున్నాం. ఈ ‘ఈటీ సమ్మిట్’ ఈ విశ్వాసాన్ని మరింత పటిష్టపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ మాటలతో, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీకందరికీ శుభాకాంక్షలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Independence Day and Kashmir

Media Coverage

Independence Day and Kashmir
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM hails India’s 100 GW Solar PV manufacturing milestone & push for clean energy
August 13, 2025

The Prime Minister Shri Narendra Modi today hailed the milestone towards self-reliance in achieving 100 GW Solar PV Module Manufacturing Capacity and efforts towards popularising clean energy.

Responding to a post by Union Minister Shri Pralhad Joshi on X, the Prime Minister said:

“This is yet another milestone towards self-reliance! It depicts the success of India's manufacturing capabilities and our efforts towards popularising clean energy.”