ప్రముఖ మంత్రులు, సీనియర్ అధికారులు, ఆరోగ్య రంగ వృత్తి నిపుణులు, ప్రపంచవ్యాప్త మిత్రులారా,
నమస్కారం!
వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ కోసం మాతో కలసి వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మహమ్మారి వల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు
నేను మనఃపూర్వకం గా నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వంద సంవత్సరాల కాలం లో ఈ తరహా మహమ్మారి కి సమానమైన వ్యాధి అంటూ ఏదీ లేదు. ఏ దేశం అయినా, ఆ దేశం ఎంతటి శక్తివంతమైనటువంటి దేశం అయినా సరే, ఈ తరహా సవాలు ను ఒంటరి గా పరిష్కరించజాలదు అనే సంగతి ని అనుభవం చాటి చెప్తున్నది. కోవిడ్-19 మహమ్మారి నుంచి అందిన అతి ప్రధానమైన పాఠం ఏది అంటే మనం మానవ జాతి కోసం, మానవాళి కోసం కలసికట్టు గా కృషి చేయాలని, ఒక్కటై ముందుకు సాగాలి అనేదే. మనం ఒకరి నుంచి మరొకరం నేర్చుకొని, మన అత్యుత్తమ అభ్యాసాల ను గురించి పరస్పరం తెలియజేసుకొంటూ ముందుకు పోవలసి ఉంది. ఈ మహమ్మారి తలెత్తినప్పటి నుంచి, భారతదేశం మా అనుభవాలను, మా ప్రావీణ్యాన్ని, మా వనరుల ను ఈ యుద్ధం లో తలపడుతున్న ప్రపంచ దేశాలన్నిటి తోనూ పంచుకోవడానికి కంకణం కట్టుకొంది. మా నిర్బంధాలు మాకు ఉన్నప్పటికీ కూడాను, సాధ్యం అయినంత సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించాలి అనే మేం ప్రయత్నించాం. మరి, మేం ప్రపంచ అభ్యాసాల నుంచి నేర్చుకోవాలని తపించిపోతున్నాం.
మిత్రులారా,
కోవిడ్-19 కి వ్యతిరేకం గా మనం చేస్తున్న యుద్ధం లో సాంకేతిక విజ్ఞానం ఓ విడదీయలేనటువంటి భాగం గా ఉంది. అదృష్టవశాత్తు, సాఫ్ట్ వేర్ అనేది ఎటువంటి రంగం అంటే ఆ రంగం లో వనరుల కు కొరత అంటూ లేనే లేదు. ఈ కారణం గానే మేము మా కోవిడ్ ట్రాకింగ్ ఎండ్ ట్రేసింగ్ యాప్ ను సాంకేతికత పరం గా అది రూపు సంతరించుకొన్న తక్షణమే అందరి అందుబాటులోకి తీసుకు వచ్చాం. సుమారు 200 మిలియన్ వినియోగదారుల తో ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్ అనేది డెవలపర్ లకు సర్వసన్నద్ధమైనటువంటి ప్యాకేజీ మాదిరి గా లభ్యం అయింది. భారతదేశం లో దీని ని ఉపయోగించిన నేపథ్యం లో, మీరు దీని ని వేగవంతమైన ఫలితాల కోసం, భారీ స్థాయి లో ఫలితాల ను రాబట్టడం కోసం వాస్తవ ప్రపంచం లో నిగ్గుతేల్చినట్లు గా నమ్మకం పెట్టుకోవచ్చును.
మిత్రులారా,
టీకామందు ను వేయించుకోవడం అనేది మహమ్మారి బారి నుంచి విజయవంతం గా బయట కు రావడానికి మానవ జాతి కి ఒక అత్యుత్తమమైన ఆశ గా ఉందని చెప్పవచ్చు. ఆరంభం నుంచి చూసుకొంటే, భారతదేశం లో మేం మా టీకాకరణ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నప్పుడే పూర్తి స్థాయి లో డిజిటల్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించాం. నేటి ప్రపంచం లో మహమ్మారి అనంతర కాలం లో తిరిగి సాధారణ పరిస్థితి కి చేరుకోవాలి అంటే గనుక అటువంటి డిజిటల్ మాధ్యమాన్ని ఆశ్రయించక తప్పదు. మరి ప్రజలు వారు టీకా వేయించుకొన్నట్లుగా నిరూపణ చేసుకోగలిగిన స్థితి లో ఉండాలి కదా. అటువంటి నిదర్శనం సురక్షితమైంది గా, భద్రమైంది గా, నమ్మశక్యం గా ఉండాలి. ప్రజలు వారు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా టీకా వేయించుకొన్నదీ అనే వివరాల తో కూడిన ఒక ఆధారాన్ని వారి దగ్గర పెట్టుకోవాలి. టీకామందు తాలూకు ప్రతి ఒక్క డోసు ఎంత అమూల్యమైంది అంటే ప్రభుత్వాలు సైతం ప్రతి ఒక్క డోసు సద్వినియోగం అయ్యే విధం గా ఆరా తీస్తూ, మరి వృథా అనేది కనీస స్థాయి లో ఉండేటట్లుగా శ్రద్ధ వహించవలసి ఉంది. ఇదంతా జరగాలి అంటే ఎక్కడికి అక్కడ డిజిటల్ విధానాన్ని అవలంబించకుండా కుదరదు.
మిత్రులారా,
భారతదేశ నాగరికత యావత్తు ప్రపంచాన్ని ఒకే కుటుంబం గా ఎంచుతుంది. ఈ తత్వం లోని మౌలిక సత్యాన్ని చాలా మంది ప్రజలు గ్రహించేటట్లు ఈ మహమ్మారి చేసింది. ఈ కారణం గానే కోవిడ్ టీకాకరణ తాలూకు మా సాంకేతిక వేదిక అయినటువంటి కోవిన్ ను అందరికీ అందుబాటు లో ఉండే విధం గా దాని రూపురేఖల ను తీర్చిదిద్దే పని జరుగుతోంది. త్వరలోనే అది ఏ దేశాని కి అయినా గానీ, అలాగే అన్ని దేశాల కు కూడాను అందుబాటు లోకి రానున్నది. ఈ ప్లాట్ ఫార్మ్ ను అందరికీ పరిచయం చేయడం కోసం నేటి కాన్‌క్లేవ్ ప్రథమ ప్రయత్నం అని చెప్పాలి. ఈ ప్లాట్ ఫార్మ్ తో భారతదేశం కోవిడ్ టీకాల తాలూకు 350 మిలియన్ డోసుల ను ప్రజల కు ఇప్పించింది. కొద్ది రోజుల కిందట మేం ఒకే రోజు లో దాదాపుగా 9 మిలియన్ వ్యక్తుల కు టీకా వేయించాం. వారు దేనినైనా రుజువు చేయడం కోసం ఎలాంటి పత్రాల ను వారి వెంట తీసుకుపోనక్కర లేదు. ఆ సమాచారం అంతా కూడా డిజిటల్ మాధ్యమం లో లభ్యమవుతుంది. కానీ, అన్నింటి కంటే ఉత్తమం అయిన సంగతికి వద్దాం.. అది ఏమిటంటే ఈ సాఫ్ట్ వేర్ ను ఏ దేశం లో అయినా, వారి స్థానిక అవసరాల మేరకు దీనిలో మార్పు చేర్పులు చేసుకోవడానికి వీలవుతుంది అనేదే. నేటి కాన్‌క్లేవ్ లో దీనికి సంబంధించిన సాంకేతిక వివరాల ను గురించి మీరు అనేక విషయాల ను తెలుసుకోవచ్చును. ఆ పని ని మొదలు పెట్టడానికి మీరు త్వరపడుతున్నారని నాకు తెలుసు.
మరి మిమ్మల్ని మరింతగా వేచి ఉండేటట్లు చేయాలని నేను అనుకోవడం లేదు. అందుకని ఈ రోజు న ఒక అత్యంత ఫలప్రదమైన చర్చ లో పాలుపంచుకోబోతున్న మీకందరికీ శుభాకాంక్షల ను తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇక ముగించడానికి అనుమతి ని ఇవ్వండి. ‘వన్ అర్థ్, వన్ హెల్థ్’ (‘ఒక భూమి, ఒక ఆరోగ్యం’) విధానం బాట లో ముందుకు సాగుతూ, ఈ మహమ్మారి పై మానవాళి పై చేయి ని తప్పక సాధిస్తుంది.
మీకు ఇవే ధన్యవాదాలు.
మీకు చాలా చాలా ధన్యవాదాలు.