నమస్తే…
నా మంత్రిమండలి సహచరులు శ్రీ రవిశంకర్ ప్రసాద్‌గారు, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడ్యూరప్పగారు, సాంకేతిక ప్రపంచంలోని నా ప్రియ మిత్రులారా… సాంకేతిక విజ్ఞానంపై ఈ ముఖ్యమైన సదస్సును అదే సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో నిర్వహిస్తుండటం ఎంతయినా సముచితం.
మిత్రులారా,
ఐదేళ్ల కిందట మేం ‘డిజిటల్ ఇండియా మిషన్’ ప్రారంభించాం. ఇవాళ డిజిటల్ ఇండియాను ఇకపై ఏదో ఒక ప్రభుత్వ సాధారణ చర్యగా చూడటంలేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. డిజిటల్ ఇండియా ఇప్పడు… ప్రత్యేకించి పేదలకు, అట్టడుగు వర్గాలకు, ప్రభుత్వంలోనివారికీ ఒక జీవన విధానంగా పరిణామం చెందింది. మానవ కేంద్రక ప్రగతికి మన దేశాన్ని సాక్ష్యంగా నిలిపిన డిజిటల్ ఇండియాకు ధన్యవాదాలు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత భారీగా వాడుకోవడం ద్వారా మన పౌరుల జీవితాల్లో అనేక ఆశావహ మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రయోజనాలేమిటో ఇప్పడు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశంలో డిజిటల్, సాంకేతిక పరిష్కారాలకు తగిన విపణిని మా ప్రభుత్వం విజయవంతంగా సృష్టించింది. అంతేగాక తన పథకాలన్నిటిలో సాంకేతికతను ఓ కీలక భాగం చేసింది. మా పాలన నమూనాలో సాంకేతిక పరిజ్ఞానానికే పెద్దపీట. సాంకేతికత ద్వారానే మనం మానవాళి గౌరవాన్ని పెంపొందించాం. లక్షలాది రైతులు ఇప్పడు ఒక్క క్లిక్‌తో నగదు లబ్ధిని పొందుతున్నారు. కోవిడ్-19 దిగ్బంధం తీవ్ర దశలో ఉన్న పరిస్థితుల్లో భారతదేశపు పేదలకు సముచిత, సత్వర సాయం అందించడంలో సాంకేతిక పరిజ్ఞానమే మనకు భరోసాగా నిలిచింది. ఆ మేరకు అందిన భారీ సహాయం అనుపమానమైనది. ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య సంరక్షణ పథకం ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని భారతదేశం విజయవంతంగా నిర్వహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషించడమే ఇందుకు కారణం. ఈ పథకం ప్రత్యేకించి దేశంలోని పేదలకు ఎంతగానో తోడ్పడింది. ఇప్పుడిక దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అత్యంత నాణ్యమైన, అందుబాటు ఆరోగ్య సంరక్షణ సేవల లభ్యతపై చింత లేదు.
మా ప్రభుత్వం సమాచార విశ్లేషణ పరిజ్ఞాన వినియోగం ద్వారా మరింత సామర్థ్యంతో, మెరుగైన సేవలకు భరోసానిస్తోంది. భారతదేశానికి 25 ఏళ్లకిందట ఇంటర్నెట్ పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఇటీవలి నివేదిక ఒకటి పేర్కొన్న మేరకు నేడు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్షన్లు 750 మిలియన్ మైలురాయిని దాటాయి. అయితే, కేవలం గత నాలుగేళ్లలోనే ఇందులో దాదాపు సగానికిపైగా జత కలిశాయని మీకు తెలుసా? మా పథకాలు ఫైళ్ల గడపదాటి అమిత వేగంతో భారీస్థాయిలో ప్రజల ముంగిటకు చేరాయంటే ప్రధాన కారణం సాంకేతిక పరిజ్ఞానమే. నేడు పేదలు తమ ఇళ్లు నిర్మించుకోవడానికి అనూహ్య సంఖ్యలో, అమిత వేగంతో, పారదర్శకంగా సహాయం చేయగలిగామంటే ఆ ఘనత పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానానిదే. అలాగే ఇవాళ దేశంలోని దాదాపు అన్ని ఇళ్లకూ విద్యుత్ సదుపాయం కల్పించడంలో కీలక పాత్ర సాంకేతిక పరిజ్ఞానానిదే. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నేడు టోల్ బూత్‌లను శరవేగంగా దాటి వెళ్తున్నామంటే కారణం సాంకేతిక పరిజ్ఞానమే. అలాగే సాంకేతిక పరిజ్ఞానం అండగా ఉండబట్టే స్వల్ప వ్యవధిలోనే భారీ జనాభాకు టీకాలు ఇవ్వగలమనే ఆత్మవిశ్వాసం ఇవాళ మనలో ఉట్టిపడుతోంది.
మిత్రులారా,
సాంకేతిక పరిజ్ఞానం విషయానికొస్తే నిత్యం నేర్చుకోవడం, కలసి ఎదగడమే మనముందున్న మార్గం. ఈ విధానం స్ఫూర్తితోనే దేశంలో అనేక పరిపక్వత కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. కొన్నేళ్లుగా భారత్‌లో విశేష హ్యాకథాన్‌ల సంస్కృతి అభివృద్ధి చెందింది. వీటిలో కొన్నింటికి నేను కూడా హాజరయ్యాను. మన యువ మేధావులు ఒక్కటై మన దేశం, ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే మార్గాలపై మేధోమథనం చేస్తున్నారు. సింగపూర్, ఆసియాన్ దేశాలతో సహకారంలో ఇలాంటి హ్యాకథాన్‌లు ఎంతగానో తోడ్పడ్డాయి. తిరుగులేని నైపుణ్యం, విజయాలతో నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మన శక్తిమంతమైన అంకుర సంస్థల సమాజానికి భారత ప్రభుత్వం పూర్తి చేయూతనిస్తోంది.
మిత్రులారా,
మనం తరచూ వింటున్నట్లుగా- “ప్రతికూల పరిస్థితులే మనలోని అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాయి.” ఆ మేరకు మనకెదురైన సవాళ్లు ప్రజల్లోని పట్టుదలను ప్రేరేపించాయి. బహుశా ఈ నానుడి మన భారతీయ సాంకేతిక నిపుణులకు అతికినట్లుగా సరిపోతుంది. ఒక వినియోగదారు నుంచి బలమైన డిమాండ్, ఒత్తిడికి గురిచేసే గడువులు… ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఫలితంగా మీకే తెలియని మీలోని ప్రతిభాపాటవాలు వెలుగు చూడటం మొదలైంది. అంతర్జాతీయంగా దిగ్బంధాలు, ప్రయాణ ఆంక్షల ఫలితంగా అందరూ కార్యాలయాలక వెళ్లే వీలులేక ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మన సాంకేతిక రంగం తన పునరుత్తేజక శక్తిని చాటడం మనం చూశాం. ఫలితంగా మన సాంకేతిక రంగం కార్యచరణకు దిగి, ఇళ్లనుంచే కాకుండా దేశంలో ఎక్కడినుంచయినా పని కొనసాగించింది. అందర్నీ ఏకం చేసేదిశగా ఇదొక గొప్ప ఆవిష్కరణల అవకాశమని సాంకేతిక పరిశ్రమ రంగం గుర్తించింది.
ఈ ప్రగతి మార్గంలో కోవిడ్-19 మహమ్మారి ఎంతమాత్రం గడ్డు కాదు… అడ్డు మాత్రమే. ఈ అవరోధాన్ని అధిగమించడంలో మనం చూపిన వేగం ఫలితంగా దశాబ్ద కాలంలో సాధించలేని పురోగమనం కేవలం కొన్ని నెలల్లోనే సాధ్యమైంది. ఆ మేరకు ఇళ్లనుంచే పని నేడు ఒక విధానం కావడమేగాక భవిష్యత్తులోనూ కొనసాగనుంది. అంతేకాదు… విద్య, ఆరోగ్యం, షాపింగ్ వగైరా మరిన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞాన అనుసరణ పరిమాణం భారీగా పెరగడం మనం చూడబోతున్నాం. సాంకేతిక ప్రపంచలో అత్యంత గొప్ప మేధావులతో ప్రత్యక్ష చర్చ అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా నేనెంతో ఆత్మవిశ్వాసంతో చెప్పదలచాను… మీ ఎనలేని కృషికి ధన్యవాదాలు… భౌతిక-డిజిటల్ సమ్మేళనం నిరంతరాయంగా కొనసాగేందుకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వినియోగదారు అనుభవాన్ని మనం కచ్చితంగా మెరుగుపరచగలం. సాంకేతిక ఉపకరణాలను మరింత వాడకందారు సన్నిహితంగా మార్చగలం.
మిత్రులారా!
పారిశ్రామిక యుగం సాధించిన విజయాలు నేడు వెనుకకు వెళ్లి, మనమిప్పుడు సమాచార సాంకేతిక శకం మధ్యలో పయనిస్తున్నాం. భవిష్యత్ ప్రగతి ఊహించినదానికన్నా ముందే సాకారం కాగలదు. కాబట్టి మనమంతా వెంటనే పూర్వయుగపు ఆలోచనా ధోరణిని వదిలించుకోవాల్సి ఉంది. పారిశ్రామిక యుగంలో మార్పు సరళరేఖ వంటిది… కానీ, ఈ సమాచార సాంకేతిక శకంలో మార్పు భారీగా, పాతను తుడిచిపెట్టేదిగా ఉంటుంది. పారిశ్రామిక యుగంలో ప్రతిదీ తొలి అడుగువేసిన వారికే ప్రయోజనంగా ఉండేది. ఈ సమాచార సాంకేతిక శకంలో తొలి అడుగుతో నిమిత్తం లేదు… అత్యుత్తమం ఎవరన్నదే ప్రధానం. ప్రస్తుత మార్కెట్ సమీకరణాలను తుత్తునియలు చేస్తూ ఎవరైనా, ఏదో ఒక వినూత్న ఉత్పత్తితో ఇప్పుడున్నవాటిని పక్కకు నెట్టగల పరిస్థితులున్నాయి. పారిశ్రామిక యుగంలో సరిహద్దులకు ప్రాధాన్యం. కానీ, సమాచార శకమంటేనే హద్దులు దాటి దూసుకెళ్లడం. పారిశ్రామిక యుగంలో ముడిపదార్థాలు సమకూర్చుకోవడమే పెను సవాలు కావడంతో కొందరికి మాత్రమే అది సాధ్యమైంది. ఈ సమాచార శకంలో ముడిసరుకు కేవలం సమాచారమే… ఇది మన కళ్లముందు, ప్రతిచోటా లభ్యం.. ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ సమాచార సాంకేతిక శకంలో భారత్ ఒక్కటే నేడు ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లగల సముచిత స్థానంలో ఉంది. మనకు అత్యుత్తమ మేధావులున్నారు… అతిపెద్ద విపణి అందుబాటులో ఉంది. మన స్థానిక సాంకేతిక పరిష్కారాలకు అంతర్జాతీయ స్థాయికి చేరగల సామర్థ్యముంది. భారత్ ఇప్పుడు చోదక స్థానంలో ఉంది… ప్రపంచం కోసం భారతదేశంల సాంకేతిక పరిష్కారాలు రూపొందించాల్సిన తరుణం ఆసన్నమైంది.
మిత్రులారా!
మా విధాన నిర్ణయాలు సదా సాంకేతిక పరిజ్ఞాన, ఆవిష్కరణ పరిశ్రమల సరళీకరణ లక్ష్యంగానే ఉంటాయి. ఇది మీకందరికీ తెలిసే ఉంటుంది… చట్టాలకు కట్టుబాటుపై సమాచార సాంకేతిక పరిశ్రమకుగల భారాన్ని మేం వివిధ రకాలుగా తొలగించాం. అంతేకాకుండా మన దేశంలో భవిష్యత్ ఆధారిత విధాన చట్రాల దిశగా సాంకేతిక పరిశ్రమ భాగస్వాములతో చర్చలకు ప్రయత్నించాం. మీరంతా ఈ పరిశ్రమకు చోదకులు. మన ఉత్పాదక స్థాయి ఆవిష్కరణలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనమంతా చిత్తశుద్ధితో కృషి చేద్దామా? ఒక చట్రం స్థాయి ఆలోచన ధోరణితోనే అనేక విజయవంతమైన ఉత్పత్తుల పర్యావరణాన్ని నిర్మించగలం. ఒక చట్రాన్ని నిర్మించడమంటే చేపలు పట్టడం ఎలాగో అనేకమందికి నేర్పడంమేగాక వారికో వల, నిండుగా చేపలుగల ఒక సరస్సును కూడా సిద్ధం చేయడమే!
అటువంటి చట్రం-స్థాయి ఆలోచనా ధోరణికి ‘యూపీఐ’ (ఏకీకృత చెల్లింపు వ్యవస్థ) ఒక ఉదాహరణ. సంప్రదాయ ఉత్పత్తుల స్థాయిలో ఆలోచించి ఉంటే మనం కేవలం డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తికి పరితమ్యేవాళ్లమేమో. కానీ, మనం దేశానికి ఒక సంపూర్ణ ఛత్రం స్థాయిలో యూపీఐని అందుబాటులోకి తెచ్చాం. దీనికింద ప్రతి ఒక్కరూ చెల్లింపు వ్యవహారాలు, ఉత్పత్తుల నిర్వహణ సమర్థులు కాగల అవకాశం లభించింది. ఇది అనేక ఉత్పత్తులకు సాధికారతనిచ్చింది. తదనుగుణంగా గతనెలలో దేశవ్యాప్తంగా 2 బిలియన్ల స్థాయిలో డిజిటల్ చెల్లింపు లావాదేవీలు నమోదయ్యాయి. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ విషయంలోనూ ఇదే పంథాను అనుసరిస్తున్నాం. మీలో కొందరు ‘స్వామిత్వ’ (SVAMITVA) పథకం గురించి వినే ఉంటారు. మన గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి భూమి హక్కును దఖలుపరిచే ప్రతిష్టాత్మక పథకమిది. దీన్ని డ్రోన్ల వంటి సాంకేతిక పరిజ్ఞాన ఉపకరణాల వినియోగంతో విజయంతం చేయవచ్చు. ఇది అనేక వివాదాలకు స్వస్తిపలికి ప్రజలకు సాధికారత ప్రసాదించగలదు. ఆస్తి హక్కు ఒకసారి దఖలుపడితే సాంకేతిక పరిష్కారాలతో సౌభాగ్యానికి మనం హామీ ఇవ్వగలం.
మిత్రులారా!
రక్షణ రంగంలో పరివర్తనాత్మకత దిశగానూ సాంకేతిక పరిజ్ఞానం వేగాన్ని పెంచుతోంది. ఇంతకుముందు గుర్రాలు, ఏనుగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నవారే యుద్ధాల్లో విజయ నిర్ణేతలుగా ఉండేవారు. ఆ తర్వాత తుపాకీ శక్తి యుగం రాగా, నేడు ప్రపంచ వైరుధ్యాలలో సాంకేతికత చాలా ముఖ్యపాత్ర పోషిస్తోంది. సాఫ్ట్‌వేర్ నుంచి డ్రోన్లు, యూఏవీలుదాకా రక్షణ రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగాన్ని పునర్నిర్వచిస్తోంది. మిత్రులారా… సాంకేతికత విస్తృత వినియోగం, సమాచార రక్షణసహా సైబర్ భద్రత ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో శక్తిమంతమైన సైబర్ భద్రత పరిష్కారాల రూపకల్పనలో మన యువత ప్రధాన పాత్ర వహించాల్సి ఉంది. ఈ పరిష్కారాలు సైబర్ దాడులు, వైరస్‌ల బారినుంచి సమర్థంగా రక్షించగల డిజిటల్ ఉత్పత్తులను రూపొందించేవిగా ఉండొచ్చు. నేడు మన ఆర్థిక-సాంకేతిక రంగం కూడా చక్కగా పరిఢవిల్లుతోంది. ఆ మేరకు లక్షలాది ప్రజలు ఎలాంటి జంకూగొంకూ లేకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రజావిశ్వాసమే కారణం… దీన్ని పరిరక్షించుకోవడం, మరింత బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. శక్తిమంతమైన గణాంక పాలన చట్రం కూడా మన ప్రాథమ్యాల్లో ఒకటి.
మిత్రులారా!
నేను ఇవాళ ప్రధానంగా సమాచార సాంకేతికతపై దృష్టి సారించినప్పటికీ శాస్త్ర-విజ్ఞాన రంగాల్లో కూడా ఆవిష్కరణల అవసరం, పరిధికీ ఎంతో ఔచిత్యం ఉంది. అది జీవ-విజ్ఞానశాస్త్రాలు, ఇంజనీరింగ్, ఆవిష్కరణలు వగైరా కూడా ప్రగతికి అత్యంత కీలకం. ఆవిష్కరణల విషయానికొస్తే మన యువత ప్రతిభ, ఆవిష్కరణలపై వారి ఉత్సాహంరీత్యా భారత్‌కు స్పష్టమైన సానుకూలత ఉంది. మిత్రులారా… మన యువత సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞాన అవకాశాలు అపారం. వాటిని సద్వినియోగం చేసుకుంటూ మనం అత్యుత్తమ పనితీరు కనబరచాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితుల నడుమ మన సమాచార సాంకేతిక రంగం మనం మరింత గర్వపడేలా చేయగలదన్న విశ్వాసం నాకుంది.
మీకు చాలా కృతజ్ఞతలు!