పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు, సోదర సోదరీమణులు.. అందరికీ నా నమస్కారాలు!
నేటి కార్యక్రమం స్వామి ప్రేమానంద్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటయ్యింది. వారికి సగౌరవ వందనాలు. గుజరాత్ బిడ్డగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మాతా శారదాదేవి, గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారి పాదాలకు వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను.
మిత్రులారా..
మహాత్ముల ప్రభావం కొన్ని శతాబ్దాల పాటు కొనసాగి వారి చైతన్య దీప్తిగా వెలుగూలీనుతూనే ఉంటుంది. నేడు మనం జరుపుకొంటున్న స్వామి ప్రేమానంద జీ మహరాజ్ జయంతి ఆ స్ఫూర్తినే ప్రతిఫలిస్తోంది! భారతదేశానికి చెందిన సాధువుల పరంపర నిరంతరాయంగా కొనసాగేందుకు కొత్తగా నిర్మితమైన ప్రార్థనా మందిరం, లేఖంబా లోని సాధువుల నివాస కేంద్రాలు సహాయపడగలవు. సేవకు, విద్యకూ సంబంధించి కొత్తగా మొదలయ్యే కార్యక్రమాలు రానున్న అనేక తరాలకు లబ్ధి చేకూరుస్తాయి. శ్రీరామకృష్ణ మందిరం, పేద విద్యార్థులకు బస కల్పించే హాస్టళ్లు, వృత్తివిద్యా కేంద్రాలు, ఆసుపత్రులు, విశ్రాంతి గృహాల వంటి సదుపాయాలు ఆధ్యాత్మికత వ్యాప్తికి, మానవసేవకూ దోహదపడగలవు. ఇదంతా చూస్తుంటే, నాకు గుజరాత్ లో రెండో సొంత ఇల్లు దొరికినట్టుగా అనిపిస్తోంది. ఈ ఆధ్యాత్మిక వాతావరణమూ, సాధు మహాత్ముల సామీప్యమూ నాకు గొప్ప శాంతిని ప్రసాదిస్తున్నాయి. కార్యక్రమంలో భాగమైన అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా..
సనంద్ ప్రాంతం నాలో ఎన్నో జ్ఞాపకాలను కదిలిస్తోంది. ఎందరో పాత స్నేహితులు, ఆధ్యాత్మిక మిత్రులు నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో నేను చాలా కాలం గడిపాను, పలువురి ఇళ్ళలో అతిథిగా, ఇక్కడి తల్లుల, సోదరీమణుల చేతి అమృతతుల్యమైన భోజనాన్ని ఆస్వాదించాను. మిత్రుల కష్టసుఖాలను పంచుకున్నాను. ఈ ప్రాంతం ఎన్ని కష్టాలను చవిచూసిందో నాడు నాతో ఉన్న మిత్రులకు తెలుసు. ఈ ప్రాంతానికి ఎంతో అవసరమైన ఆర్థికాభివృద్ధి ఈరోజున సాకారమవుతోంది. అప్పట్లో రెండే బస్సులు అందుబాటులో ఉండేవి.. ఉదయం ఒకటి, సాయంత్రం మరొకటి, దాంతో, బస్సు ప్రయాణం చేయవలసి వచ్చిన సందర్భాల్లో కూడా అనేకమంది సైకిళ్ళ పైనే ప్రయాణించేవారు. ఈ ప్రాంతం గురించి నాకు కరతలామలకమే. ఈ ప్రాంతం పరివర్తన చెందడంలో మనం చేసిన కృషితో పాటూ సాధు మహాత్ముల దీవెనలు కూడా ప్రభావం చూపాయని నేను విశ్వసిస్తాను. రోజులు మారాయి, ప్రజల అవసరాలూ మారాయి. ఈ ప్రాంతం అటు ఆర్థికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నది నా ఆకాంక్ష. చక్కని జీవితానికి బాహ్యపరమైన సంపద ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మిక సంపదా అంతే ముఖ్యమని నేను నమ్ముతాను. మన సాధు మహాత్ముల మార్గదర్శనంలో సనంద్, గుజరాత్ లు ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేయడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.
మిత్రులారా..
విత్తుని బట్టి మొక్క సత్తా అంచనా వేయవచ్చునంటారు.. స్వామి వివేకానంద వంటి మహాత్ముల తిరుగులేని ఆధ్యాత్మిక శక్తిని ఇముడ్చుకున్న విత్తనం నుంచీ ఉద్భవించిన వృక్షం, మన రామకృష్ణ మఠం. అందుకే అవధులు లేని విస్తరణతో ఈ వృక్షం మానవాళికి నీడనిస్తోంది. మఠం మౌలిక సారాన్ని అర్ధం చేసుకోవాలంటే స్వామి వివేకానంద తత్వాన్నీ, మరీ ముఖ్యంగా ఆయన బోధనలనూ అర్ధం చేసుకోవలసి ఉంటుంది. స్వామీజీ ఆలోచనలను అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, ఒక దివ్యమైన ప్రకాశం మన ఆలోచనలకు దారి చూపడం అనుభవంలోకి వస్తుంది. నేను స్వయంగా ఆ అనుభూతిని అనుభవించాను. రామకృష్ణ మిషన్, మఠానికి చెందిన సాధువులు, స్వామి వివేకానంద బోధనలు నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో, నాటి సాధువులకు తెలుసు. అందుకే, ఈ కుటుంబంతో మమేకమయ్యే అవకాశం కలిగినప్పుడల్లా నేను మీ సమక్షానికి హాజరవుతాను. సాధువుల ఆశీస్సులతో మిషన్ కార్యకలాపాల్లో పాలుపంచుకునే అవకాశాలు నాకు కలిగాయి. 2005లో వడోదర లోని దిలారామ్ బంగళాను మిషన్ కు అప్పగించే గౌరవం నాకు దక్కింది. స్వామి వివేకానంద కొంత కాలం అక్కడ గడిపారు. ఆ సమయంలో పూజ్య స్వామి ఆత్మస్థానందజీ అక్కడే ఉండటం నా అదృష్టం, వారి వద్ద నుంచీ ఎంతో నేర్చుకునే అవకాశం కలిగింది, నా ఆధ్యాత్మిక యాత్రకు వారి నుంచీ మార్గదర్శనం పొందే అవకాశమూ లభించింది. స్వామీజీకి స్వయంగా ఆ బంగళా దస్త్రాలు అందించే మహద్భాగ్యం నాకు దక్కింది. చివరి క్షణాల వరకూ వారు నాకు అమూల్యమైన ప్రేమను పంచారు, దీవెనలను అందించారు.
మిత్రులారా..
మిషన్ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ప్రపంచవ్యాప్తంగా 280 కేంద్రాలు గల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో 1200 ఆశ్రమాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్రాలు మానవసేవలో నిమగ్నమై ఉన్నాయి. రామకృష్ణ మిషన్ సేవలకు గుజరాత్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. రాష్టానికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా, తానున్నానంటూ మిషన్ ఇక్కడి ప్రజలకు బాసటగా నిలిచింది. ఆ సందర్భాలనన్నింటినీ గుర్తు చేసుకుంటే సమయం సరిపోదు.. సూరత్ వరదలు, మోర్బీ వంతెన దుర్ఘటన, భుజ్ భూకంపానంతర అల్లకల్లోల పరిస్థితులు, కరువు కాలం, భారీ వర్షాలు కొన్ని ఉదాహరణలుగా గుర్తు చేసుకుందాం.. ఎటువంటి విషమ పరిస్థితి ఎదురైనా, రామకృష్ణ మిషన్ బాధితులకు చేయూతనందించింది. భూకంపంలో దెబ్బతిన్న 80 పాఠశాలల పునర్నిర్మాణంలో మిషన్ ముఖ్య పాత్ర పోషించింది. ఆ సహాయాన్ని గుజరాత్ ప్రజలు ఎన్నటికీ మరువలేరు, మిషన్ సేవాభావాన్నించీ స్ఫూర్తి పొందుతూనే ఉంటారు.
మిత్రులారా..
స్వామి వివేకానంద కు గుజరాత్ తో ప్రత్యేక అనుబంధం ఉంది, ఆయన జీవనయానంలో ఈ రాష్ట్రం ముఖ్య పాత్ర పోషించింది. స్వామీజీ గుజరాత్ లోని అనేక ప్రాంతాలని సందర్శించారు. చికాగో అంతర్జాతీయ మత సమ్మేళనం (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్) గురించి మొదటిసారి ఆయన ఇక్కడే తెలుసుకున్నారు. వేదాంత సూత్రాల వ్యాప్తి కోసం అనేక గ్రంధాలను ఆయన ఇక్కడే అధ్యయనం చేశారు. 1891 లో పోర్బందర్ లోని భోజేశ్వర్ భవన్ లో స్వామీజీ కొన్ని నెలల పాటు బస చేశారు. ఈ ఉదంతం చారిత్రక ప్రాముఖ్యాన్ని గ్రహించిన గుజరాత్ ప్రభుత్వం భవంతిని స్వామీజీ స్మారక మందిరంగా అభివృద్ధి పరిచేందుకు రామకృష్ణా మిషన్ కు అప్పగించింది. 2012 నుంచీ 2014 వరకూ, రెండేళ్ళ పాటు స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిందన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. గాంధీనగర్ మహాత్మా మందిర్ లో ఘనంగా జరిగిన ముగింపు ఉత్సవాల్లో దేశవిదేశాల వారు వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్న విషయం మీకు తెలుసు. స్వామీజీకి గుజరాత్ తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని సంస్మరించుకునే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం స్వామి వివేకానంద పర్యాటక కేంద్రాలని అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలని రూపొందిస్తోంది. ఈ విషయం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది.
సోదర సోదరీమణులారా..
స్వామి వివేకానంద ఆధునిక విజ్ఞానశాస్త్రానికి మద్దతునిచ్చేవారు. విజ్ఞానశాస్త్రం కేవలం వివరణలకు పరిమితం కాదని, మన పురోగతికి స్ఫూర్తిగా నిలిచే ప్రాముఖ్యాన్ని కలిగి ఉందని ఆయన నమ్మేవారు. అత్యాధునిక సాంకేతికత రంగంలో పెరుగుతున్న భారత్ ప్రాభవం, ప్రపంచ మూడో అతిపెద్ద అంకుర పరిశ్రమల ప్రోత్సాహక వాతావరణం, ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దేశం వేస్తున్న అడుగులు, అధునాతన మౌలిక సదుపాయాలూ.. ఇవన్నీ భారత్ శరవేగ ఎదుగుదలకు సూచికలే. కాగా, మన ఎదుగుదలకు మన ప్రాచీన పద్ధతులు, విజ్ఞానం దోహదం చేశాయన్నది నిర్వివాదాంశం. దేశానికి యువశక్తి వెన్నెముక వంటిదని స్వామీజీ భావించేవారు. “స్వశక్తి మీద నమ్మకం కలిగిన 100 మంది ధీరులను నాకివ్వండి.. నేను దేశం మొత్తంలో పరివర్తన తెస్తాను..” అని స్వామి వివేకానంద ఒక సందర్భంలో అన్నారు. ఆ బాధ్యతను మనమిప్పుడు నెత్తికెత్తుకోవాలి. వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) పరమ లక్ష్యంగా మనం ‘అమృత్ కాల్’ లోకి నూతన ప్రయాణం మొదలుపెట్టాం. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకోవాలి. నేడు మనదేశం యువశక్తిని అత్యధికంగా కలిగిన దేశం.. ప్రపంచ వేదికపై మన యువత తన సత్తాను ఇప్పటికే చాటింది.
నేడు భారత యువత ప్రపంచ అగ్రగామి కంపెనీలకు నేతృత్వం వహిస్తున్నది. ఇక దేశ అభివృద్ధిని ముందుకు నడిపేదీ మన యువశక్తే. ఈరోజున మనకు అవకాశం ఉంది, సమయం కలిసొస్తోంది, పట్టుదల ఉంది, కలలున్నాయి, వీటన్నిటి తోడూ, విజయ తీరాలకు చేర్చే కృషి ఉంది. అందువల్ల దేశ నిర్మాణానికి సంబంధించిన ప్రతి విభాగంలో యువతకు నాయకత్వ శిక్షణను అందించవలసిన అవసరం ఉంది. సాంకేతిక, ఇతర రంగాలలో నాయకత్వాన్ని చేపట్టినట్లే రాజకీయాల్లో కూడా నాయకత్వం స్వీకరించేందుకు యువత సన్నద్ధమవ్వాలి. ఇకపై రాజకీయాలను వారసత్వంగా అనుభవించే కుటుంబాలకు, సొంత ఆస్తిగా పరిగణించే వారికీ ఆ అవకాశాలని ఇవ్వరాదు. రాబోయే సంవత్సరం, అంటే 2025లో కొత్త ప్రారంభానికి నాంది పలికేందుకు సిద్ధమవుదాం. 2025 జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవాల సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటయ్యే “యంగ్ లీడర్స్ డైలాగ్” కార్యక్రమానికి, దేశం నలుమూలల నుంచీ ఎంపిక చేసిన 2000 మందికి ఆహ్వానాలు అందుతాయి. లక్షలాది ఇతర యువత ఈ కార్యక్రమంలో అంతర్జాల వేదికల ద్వారా పాల్గొంటారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యం గురించి జరిగే చర్చలో యువత తన దృక్పథాన్ని వెల్లడిస్తుంది. రాజకీయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించే దిశగా ఈ సందర్భంగా ప్రణాళికలు తయారవుతాయి. ఉత్సాహవంతులైన లక్షమంది యువతకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 21వ శతాబ్దపు నవీన భారతదేశ రాజకీయ ముఖచిత్రానికి, దేశ భావిష్యత్తుకూ వీరు ప్రతినిధులుగా ఉంటారు.
మిత్రులారా..
ఈ శుభ సందర్భంలో మన భూమండలాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మలుచుకునేందుకు అవసరమైన రెండు అంశాల గురించి చెబుతాను: అవే.. ఆధ్యాత్మికత, అనుకూల పద్ధతుల్లో అభివృద్ధి. ఈ రెండిటి సమన్వయం ద్వారా మెరుగైన భవిష్యత్తు నిర్మాణం సుసాధ్యమవుతుంది. స్వామి వివేకానంద ఆధ్యాత్మికతను క్రియాశీల దృష్టితో చూసేవారు, సమాజ అవసరాలను ఆధ్యాత్మికత దృష్టిలో ఉంచుకోవాలని భావించేవారు. పవిత్రమైన భావనలతో పాటూ పరిశుభ్రమైన వాతావరణం కూడా ముఖ్యమని చెప్పేవారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య సమతౌల్యం పాటిస్తే, సరైన పద్ధతుల్లో అభివృద్ధి సాధించినట్లే. స్వామి వివేకానంద బోధనలు ఈ విషయంలో మనకు మార్గాన్ని చూపగలవు. ఆధ్యాత్మికం కానివ్వండి, అనుకూల పద్ధతుల్లో అభివృద్ధి కానివ్వండి, సమతౌల్యం ముఖ్యం. మొదటిది మనసులో సమస్థితికి కారణమైతే, రెండోది ప్రకృతిలో సమతౌల్యాన్ని బోధిస్తుంది. రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు మన ఆశయాలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించగలవని భావిస్తున్నాను. ‘మిషన్ లైఫ్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్', వంటి ప్రచారోద్యమాలను మరింత పెద్దయెత్తున చేపట్టేందుకు రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు సహాయకారిగా ఉంటాయి.
మిత్రులారా..
భారతదేశం స్వావలంబన కలిగిన బలమైన దేశంగా ఎదగాలని స్వామి వివేకానంద ఆశించేవారు. ఆయన కలలను నిజం చేసే దిశగా దేశం పురోగమిస్తోంది. స్వామీజీ స్వప్నం శీఘ్రంగా నెరవేరాలని, బలమైన స్వావలంబన గల దేశంగా అవతరించి, ప్రపంచ మానవాళికి భారత్ ఆదర్శంగా నిలవగలదని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆశయ సాకారం కోసం ప్రతి పౌరుడూ గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద బోధనలను ఆచరించాలి. ఇటువంటి కార్యక్రమాలు, సాధువుల కృషి ఈ ఆశయానికి దన్నుగా నిలుస్తున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికీ పాల్గొంటున్న వారికీ మరోమారు అభినందనలు తెలుపుతున్నాను. సాధు, మహాత్ములకి శిరస్సు వంచి ప్రణామాలర్పిస్తున్నాను. స్వామి వివేకానంద కలలను నిజం చేయడంలో నేటి నూతన ప్రారంభం, కొత్త ఉత్సాహం పునాదిగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు.