Quoteఎంఎస్ఎంఈలు దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తాయి.. ఈ రంగం అభివృద్ధి, బలోపేతానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని
Quoteసంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత వృద్ధిపై గత పదేళ్లలో భారత్ స్థిరమైన నిబద్ధతను కనబరిచింది: ప్రధాని
Quoteస్థిరమైన, కచ్చితమైన సంస్కరణల దిశగా చేసిన మార్పులే మన పరిశ్రమల్లో సరికొత్త విశ్వాసాన్ని నింపాయి: ప్రధాని
Quoteనేడు ప్రపంచంలో ప్రతీ దేశం భారత్ తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది: ప్రధాని
Quoteఈ భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మన తయారీ రంగం ముందుకు రావాలి: ప్రధాని
Quoteస్వావలంబన భారత్ లక్ష్యం దిశగా పురోగమించి, సంస్కరణలను మరింత వేగవంతం చేశాం: ప్రధాని
Quoteమనం తీసుకున్న చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం తగ్గింది.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడానికి అది దోహదపడింది: ప్రధాని
Quoteభారత తయారీ ప్రస్థానంలో పరిశోధన - అభివృద్ధి కీలక పాత్ర పోషించింది.. దీనిలో పురోగతి సాధించి వేగవంతం చేయాలి: ప్రధాని
Quoteపరిశోధన - అభివృద్ధి ద్వారా సృజనాత్మక ఉత్పత్తులపై దృష్టి పెట్టగలం... అలాగే ఉత్పత్తుల విలువను పెంచగలం: ప్రధాని
Quoteఈ బడ్జెట్ లో తయారీ, ఎగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

నమస్కారం!

క్యాబినెట్ సహచరులు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సోదర సోదరీమణులారా!

తయారీ, ఎగుమతుల రంగంపై నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో చర్చించే ప్రతి అంశం ఎంతో ముఖ్యమైనది. మీకు తెలుసు, మూడోసారి మా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. అంచనాలను మించిన ఫలితాలను అందించడం ఈ బడ్జెట్ ప్రత్యేకత. అనేక రంగాల్లో నిపుణుల అంచనాలను మించి ప్రభుత్వం చేపట్టిన పెద్ద చర్యలను ఈ బడ్జెట్లో చూడవచ్చు. తయారీ, ఎగుమతులకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలను ఈ బడ్జెట్లో తీసుకున్నాం.

స్నేహితులారా,

గడచిన దశాబ్దం నుంచి ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాల్లో స్థిరత్వాన్ని దేశం గమనిస్తోంది. సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సమ్మిళిత అభివృద్ధి దిశగా గత పదేళ్లలో దేశం నిలకడైన అంకితభావాన్ని కనబరుస్తోంది. స్థిరత్వం, సంస్కరణలు అందించిన భరోసా మన పరిశ్రమల్లో నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. భవిష్యత్తులోనూ ఈ స్థిరత్వం ఇదే విధంగా కొనసాగుతుందని తయారీ, ఎగుమతుల రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. కాబట్టి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉన్నత ఆశయాలతో ముందడుగు వేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేశంలో తయారీ, ఎగుమతుల రంగంలో కొత్త మార్గాలను మనం తెరవాలి. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ భాగస్వామ్యం నుంచి వీలైనంత మేర లబ్ధి పొందడానికి మన తయారీ రంగాలు ముందుకు రావాలి.

స్నేహితులారా,

ఏ దేశాభివృద్ధిలోనైనా స్థిరమైన విధానాలు, మెరుగైన వ్యాపార వాతావరణం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే కొన్నేళ్ల క్రితం జన విశ్వాస్ చట్టాన్ని తీసుకొచ్చి మేం నిబంధనలను సడలించాం. సులభతర వ్యాపార విధానాలను ప్రోత్సహించేందుకు ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో 40వేలకు పైగా కేసులను రద్దు చేశాం. ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని మా ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే సరళీకరించిన ఆదాయపు పన్ను విధానాన్ని మేం తీసుకొచ్చాం. జన్ విశ్వాస్ 2.0 బిల్లు రూపొందించేందుకు మేం కృషి చేస్తున్నాం. ఆర్థికేతర రంగాల్లో నిబంధనలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆధునికంగా, సరళంగా, ప్రజలకు అనుకూలంగా, నమ్మకంగా మార్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో పరిశ్రమ భాగస్వామ్యం కూడా అవసరం. పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతున్న సమస్యలను మీ అనుభవంతో గుర్తించవచ్చు. ప్రక్రియలను సులభతరం చేసేందుకు మీ సూచనలను అందించవచ్చు. మెరుగైన ఫలితాలను రాబట్టడానికి ఎక్కడ మనం సాంకేతికతను వినియోగించుకోవచ్చో మీరు మార్గనిర్దేశం చేయవచ్చు.

 

|

స్నేహితులారా,

ప్రస్తుతం అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి నెలకొన్న దశలో ఉంది. ఈ సమయంలో ప్రపంచమంతా భారత్‌ను వృద్ధి కేంద్రంగా చూస్తోంది. కొవిడ్ సంక్షోభ సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు భారత్ అంతర్జాతీయంగా తన వృద్ధిని వేగవంతం చేసింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువచ్చాం. సంస్కరణల్లో వేగాన్ని తీసుకొచ్చాం. మేం చేపట్టిన ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ ప్రభావాన్ని తగ్గించాయి. ఇవన్నీ భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సహకరించాయి. ఈ రోజు కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చోదక శక్తిగా భారత్ ఉంది. అంటే, క్లిష్ట పరిస్థితుల్లో సైతం భారత్ తన స్థిరత్వాన్ని ప్రదర్శించింది.

సరఫరా వ్యవస్థలో అంతరాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభావం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతుండటాన్ని గత కొన్నేళ్లుగా మనం గమనిస్తున్నాం. ఈ రోజు ప్రపంచానికి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేసే నమ్మకమైన భాగస్వామి ప్రపంచానికి అవసరం. దాన్ని మన దేశం చేయగలదు. మీరంతా చేసి చూపగలరు. ఇదే మనకు అతి పెద్ద అవకాశం. ప్రపంచానికి ఉన్న ఈ అంచనాలను మన పరిశ్రమలు ప్రేక్షకుల మాదిరిగా వీక్షించకూడదు. అందులో మనం పోషించగల పాత్ర ఏమిటో గుర్తించాలి. ముందుకు చొచ్చుకువెళ్లి మీ అవకాశాలను మీరే వెతుక్కోవాలి. పాత రోజులతో పోలిస్తే ఇది ఇప్పుడు సులభమే. ఈ అవకాశాల విషయంలో ప్రస్తుతం దేశం స్నేహపూర్వక విధానాలను అవలంబిస్తోంది. ఈ విషయంలో పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. దృఢ సంకల్పం, ఆశయం, సవాళ్లను అంగీకరించే మనస్తత్వంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అవకాశాలను అన్వేషించాలి. ఈ విధంగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ ఎన్నో మైళ్లను చేరుకోవచ్చు.

స్నేహితులారా,

పీఎల్ఐ పథకం ద్వారా ప్రస్తుతం 14 రంగాలు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ పథకం ద్వారా 750కి పైగా యూనిట్లు అనుమతులు పొందాయి. ఫలితంగా ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. రూ.13 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి, రూ. 5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం లభిస్తే ఏ రంగంలోనైనా రాణించగలరని ఇది తెలియజేస్తుంది. తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడానికి రెండు పథకాలను ప్రారభించాలని మేం నిర్ణయించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరగుపరచడం, నాణ్యమైన ఉత్పత్తులపై మేం దృష్టి సారించాం. అలాగే వ్యయాన్ని తగ్గించడానికి నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నాం. ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండి, మనం తయారు చేయగల కొత్త వస్తువులను గుర్తించాలని కోరుతున్నాను. ఆ తర్వాత మనం ఎగుమతులకు అవకాశం ఉన్న దేశాలకు ఒక వ్యూహంతో వెళదాం.

 

|

మిత్రులారా!

   భారత తయారీ రంగ పురోగమనంలో పరిశోధన-ఆవిష్కరణల పాత్ర కీలకం. అందువల్ల ఈ దిశగా మనం వేగం పెంచాలి. తద్వారా వినూత్న ఉత్పత్తుల సృష్టిపై దృష్టి సారించడంతోపాటు వాటికి మరింత విలువను కూడా జోడించగలం. మన బొమ్మలు, పాదరక్షలు, చర్మ పరిశ్రమల శక్తిసామర్థ్యాలేమిటో ప్రపంచానికి బాగా తెలుసు. మన సంప్రదాయ హస్తకళా ఉత్పత్తులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల మేళవింపుతో తిరుగులేని రీతిలో ఉన్నత శిఖరాలకు దూసుకెళ్లగలం. ఆ మేరకు మనమీ రంగాల్లో ప్రపంచ అగ్రగాములుగా నిలవగలం. మన ఎగుమతులు కూడా అనేక రెట్లు పెరుగుతాయి. అంతేగాక ఈ రంగాలన్నీ శ్రమశక్తి సమన్వితం కాబట్టి, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహంతోపాటు లక్షలాది ఉపాధి అవకాశాలు అందివస్తాయి. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా సంప్రదాయ చేతివృత్తులవారికి సంపూర్ణ చేయూత లభిస్తుంది. కాబట్టి, హస్తకళాకారులకు కొత్త అవకాశాల సంధానం దిశగా మనం కృషి చేయాలి. ఈ రంగాలలో ఎన్నో అవకాశాలు నిగూఢంగా ఉన్నాయి.. వాటన్నిటినీ అందిపుచ్చుకోవడానికి మీరంతా ముందుకు రావాలి.

మిత్రులారా!

   దేశంలో తయారీ రంగానికి, పారిశ్రామిక వృద్ధికి మన సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగమే వెన్నెముక. అందుకే 14 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ రంగం నిర్వచనం సవరణకు 2020లో మేం కీలక నిర్ణయం తీసుకున్నాం. దీంతో తాము ముందడుగేస్తే ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలకు గండిపడుతుందనే ‘ఎంఎస్‌ఎంఇ’ రంగం భయాలు తొలగిపోయాయి. ఈ రంగంలో పరిశ్రమల సంఖ్య ఇప్పుడు 6 కోట్లు దాటగా, కోట్లాది యువతకు ఉపాధి లభించింది. ఈ నేపథ్యంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ‘ఎంఎస్‌ఎంఇ’ నిర్వచనం పరిధిని మరోసారి విస్తరింపజేశాం. తద్వారా ఈ రంగం మరింత ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయడమే కాకుండా యువతరానికి ఉపాధి అవకాశాలు ఇనుమడిస్తాయి. రుణ సౌలభ్యం లేకపోవడమే మన ‘ఎంఎస్‌ఎంఇ’లకు అతిపెద్ద సమస్య. పదేళ్ల కిందట ఈ రంగంలోని పరిశ్రలకు లభించిన రుణాలు రమారమి రూ.12 లక్షల కోట్లకు పరిమితం. కానీ, ఇప్పుడిది రెండున్నర రెట్లు పెరిగి దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేరింది. ఇక తాజా బడ్జెట్‌లో ఈ పరిశ్రమలకు రుణ హామీ పరిమితిని రెట్టింపు పెంపుతో రూ.20 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక  నిర్వహణ మూలధనం అవసరాలు తీర్చేందుకు రూ.5 లక్షల నిర్దిష్ట పరిమితితో క్రెడిట్ కార్డులు జారీ అవుతాయి.

మిత్రులారా!

   మేమిప్పుడు రుణ సౌలభ్యం పెంచడంతోపాటు సరికొత్త రుణ మంజూరీ వ్యవస్థను కూడా సృష్టించాం. దీంతో ఎన్నడూ ఊహించని రీతిలో వ్యాపార యజమానులకు హామీరహిత రుణ పరపతి లభించింది. గడచిన 10 సంవత్సరాల్లో చిన్న పరిశ్రమలకూ హామీరహిత రుణాలిచ్చే ‘ముద్ర’ వంటి పథకాలతో ఎంతో మేలు కలిగింది. అంతేగాక రుణ సంబంధిత అనేక సమస్యలకు  ‘ట్రేడ్స్ పోర్టల్’ పరిష్కారాలు చూపుతోంది.

మిత్రులారా!

   రుణ ప్రదానం కోసం ఇప్పుడు మనం కొత్త పద్ధతులను రూపొందించాల్సి ఉంది. ఆ మేరకు ‘ఎంఎస్‌ఎంఇ’ రంగంలో ప్రతి పరిశ్రమకూ తక్కువ వ్యయంతో సకాలంలో రుణం అందేవిధంగా మేం కృషి చేస్తాం. మహిళలు, ఎస్సీ-ఎస్టీ వర్గాల నుంచి 5 లక్షల మంది తొలిసారి వ్యాపార-పరిశ్రమల వ్యవస్థాపకులకు రూ.2 కోట్లదాకా రుణం లభిస్తుంది. అయితే, వీరికి రుణ సౌలభ్యం కల్పిస్తే చాలదు... వారికి మార్గనిర్దేశం కూడా అవసరం. కాబట్టి, వారికి సహాయ సహకారాల దిశగా మార్గనిర్దేశక కార్యక్రమాన్ని పరిశ్రమ వర్గాలు రూపొందించాలన్నది నా ఆకాంక్ష.

 

|

మిత్రులారా!

   పెట్టుబడుల పెంపులో రాష్ట్రాల పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఈ వెబినార్‌లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రాలు వాణిజ్య సౌలభ్యాన్ని ఎంత ఎక్కువగా ప్రోత్సహిస్తే, అంత ఎక్కువ మంది పెట్టుబడిదారులు వారిని సంప్రదిస్తారు. తద్వారా ఆయా రాష్ట్రాలు అధిక ప్రయోజనం పొందగలవు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ గరిష్ఠంగా వినియోగంపై రాష్ట్రాలు పోటీపడాలి. ప్రగతిశీల విధానాలతో ముందుకొచ్చే రాష్ట్రాల్లో పెట్టుబడులకు కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి.

మిత్రులారా!

   నేను ప్రస్తావించిన ముఖ్యాంఖాలను మీరందరూ లోతుగా పరిశీలించగలరని విశ్వసిస్తున్నాను. ఈ వెబినార్ ద్వారా కార్యాచరణకు తగిన పరిష్కార మార్గాలను మనం నిర్ణయించుకోవాలి. విధానాలు, పథకాలు, మార్గదర్శకాల రూపకల్పనలో మీ సహకారం ఎంతో కీలకం. బడ్జెట్ అనంతర అమలు వ్యూహాల రూపకల్పనకు ఇదెంతో అవశ్యం. ఆ మేరకు మీ సహకారం ప్రయోజనకరం కాగలదని నా ప్రగాఢ నమ్మకం. ఇక ఈ రోజంతా సాగే మేధో మథనం నుంచి వెలువడే అమృతప్రాయ ఫలితాలు మన స్వప్న సాకారానికి తగిన శక్తిసామర్థ్యాలను సమకూర్చగలవు. ఈ ఆశాభావంతో మీకందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India Inc gets faster: Work-in-progress cycle drops to decade low at 14 days

Media Coverage

India Inc gets faster: Work-in-progress cycle drops to decade low at 14 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2025
July 23, 2025

Citizens Appreciate PM Modi’s Efforts Taken Towards Aatmanirbhar Bharat Fuelling Jobs, Exports, and Security