భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి వేలాది సంవత్సరాలుగా దీపస్తంభం లాగా మార్గాన్ని చూపించిన గడ్డ రామేశ్వరం. అంతేకాదు.. ఈ శతాబ్దంలో రామేశ్వరం మరో కారణం వల్ల కూడా - ఒక చురుకైన శాస్త్రవేత్తను, స్ఫూర్తిప్రదాయక బోధకుడిని, మేధావిని, తత్త్వవేత్తను, అబ్దుల్ కలామ్ గారి రూపంలో ఒక గొప్ప రాష్ట్రపతిని మనకు అందించినందుకు - ప్రసిద్ధం కానుంది.
అటువంటి పవిత్ర భూమి అయిన రామేశ్వరం నేలను ముద్దాడే భాగ్యం లభించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. దేశం లోని 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగానికి నెలవైన రామేశ్వరం మత సంబంధి కేంద్రమొక్కటే కాదు.. గంభీరమైన ఆధ్యాత్మిక జ్ఞానానికీ కేంద్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ‘ జ్ఞాన పుంజం. ’ స్వామి వివేకానంద 1897 లో అమెరికా నుండి తిరిగి వస్తూ సందర్శించిన ప్రాంతం ఇది. భరత మాత అత్యంత ప్రసిద్ధ పుత్రులలో ఒకరైన డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ను అందించిన పవిత్ర భూమి. రామేశ్వరానికి సహజమైన నిరాడంబరత్వం, ప్రశాంతత, గంభీరతలు డాక్టర్ కలామ్ మాటలలో, చేతలలో సదా ప్రతిబింబించేవి.
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి సందర్భంగా రామేశ్వరానికి రావడం నాకో తీవ్ర భావోద్వేగ క్షణం. రామేశ్వరంలో డాక్టర్ కలామ్ స్మృతిచిహ్నం నిర్మాణం చేపట్టాలని నిరుడు మేము నిర్ణయించి, వాగ్దానం చేశాము. ఆ వాగ్దానం ఇవాళ నెరవేరినందుకు నాకు సంతోషంగా ఉంది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఒ) అతి తక్కువ సమయంలో ఈ స్మారక చిహ్నాన్ని సిద్ధం చేసింది. దేశ వర్తమాన తరానికి, భవిష్యత్తు తరాలకు ఈ స్మృతిచిహ్నం సదా ప్రేరణనిస్తుంది. గత సంవత్సరం వెంకయ్య నాయుడు అధ్యక్షుడుగా నేనొక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఈ బాధ్యతను అప్పగించాను. దేశ యువతరానికి నిత్య నూతనోత్తేజాన్ని అందించే విధంగా ఈ ప్రదేశంలో స్మారకచిహ్నాన్ని రూపుదిద్దే కర్తవ్యాన్ని డిఆర్ డిఒ తో పాటు తమిళ నాడు ప్రభుత్వం నిర్వర్తించింది. ఇప్పుడు ఈ కట్టడాన్ని చూశాక ఇంత తక్కువ సమయంలోనే, వినూత్నమైనటువంటి ఆలోచనలతో, ఇంత సృజనాత్మకంగా, ఇంతటి గొప్ప స్మృతిచిహ్నాన్ని నిర్మించినందుకు నాకెంతో గర్వంగా ఉంది; అది కూడా డాక్టర్ అబ్దుల్ కలామ్ జీవితాన్ని, ఆలోచనలను, ఆదర్శాలను, కృషిని కచ్చితంగా ప్రతిబింబిస్తూ ఇది రూపొందడం హర్షణీయం. ఇంత చక్కటి స్మారకాన్ని రూపుదిద్దినందుకుగాను వెంకయ్య గారు, మరియు ఆయన బృందమూ, తమిళ నాడు ప్రభుత్వం సహా భారత ప్రభుత్వంలోని వివిధ శాఖలను, డిఆర్ డిఒను అభినందిస్తున్నాను.
మన ఊహలకు రూపమిస్తూ ఇంత తక్కువ సమయంలో ఇలాంటి పని ఏదైనా దేశంలో జరిగిందా ! అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. అందునా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇలాంటి అద్భుతం సాకారం కావడమా ? అన్న ఆశ్చర్యం పౌరుల లో కనిపిస్తోంది.
కానీ, దేశ ప్రజలు అప్పగించే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించే ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నందు వల్ల ఈ ఘన కార్యం సాధ్యమైంది. మొత్తం పని సంస్కృతిలో పరివర్తన ద్వారా సకాలంలో విజయవంతంగా పని పూర్తి చేసే సంస్కృతిని ప్రభుత్వం నేడు ప్రోత్సహిస్తోంది.
అయితే, కేవలం ప్రభుత్వం, నిధులు, ప్రణాళికలు, అధికార యంత్రాంగంతో మాత్రమే ఈ మొత్తం పని పూర్తి కాలేదన్న వాస్తవాన్ని మనం మరువకూడదు. ఈ స్మారక నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడం వెనుక దేశం లోని 125 కోట్ల మంది ప్రజానీకం గర్వంతో ఉప్పొంగే రహస్యాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ప్రభుత్వం, నిధులు, ప్రణాళికలకు తోడు దేశం నలుమూలల నుండి వచ్చిన హస్తకళాకారులు, కార్మికులు, చిత్రకారులు, నిర్మాణ శిల్పులంతా అకుంఠిత దీక్షతో కృషి చేయడమే ఆ రహస్యం. దేశంలోని ప్రతి ప్రాంతం వారూ ఈ పనిలో పాలు పంచుకొన్నారు. ఈ పనిలో ఉన్న కార్మికులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటల నుండి సాయంత్ర 5 గంటల దాకా పనిచేసే వారు. ఆ తరువాత ఓ గంట సేపు విశ్రాంతి తీసుకొని, తేనీరు సేవించి ఆ తరువాత మళ్లీ 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసే వారు. కానీ, ఈ అదనపు సమయపు పనికి వేతనం తీసుకోబోమని వారు స్పష్టంగా చెప్పడం విశేషం. స్వేదం చిందిస్తూ వారు పడిన శ్రమ అబ్దుల్ కలామ్ గారికి నిజమైన నివాళి. ‘‘ మేం ఈ విధంగా ఆయనకు నివాళి అర్పిస్తాం ’’ అని వారు ముందే చెప్పారు. ఇంత అంకిత భావంతో పవిత్ర కార్యానికి సహకరించిన నా పేద కార్మికులందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో గొప్ప కార్యసాధకులైన ఈ కార్మికులు, కళాకారులకు మీరందరూ మిన్నుముట్టే కరతాళ ధ్వనులతో అభినందనలు తెలపాలని కోరుతున్నాను.
దేశంలోని కార్మికుల హృదయాలు దేశ భక్తి స్ఫూర్తితో నిండి ఉన్నట్లయితే గొప్ప విజయాలు సాధ్యమనేందుకు రామేశ్వరంలో అబ్దుల్ కలామ్ గారి ఈ స్మారక చిహ్నం నిర్మాణమే నిదర్శనం. ఈ సందర్భంగా ‘అమ్మ’ (జయలలిత) లేని లోటు, ఆ శూన్యం నాకు బాగా తెలుస్తోంది. ‘అమ్మ’ గనుక ఇవాళ మన మధ్య ఉండి ఉంటే ఈ కార్మికులు చేసిన కృషి చూసి ఎంతో ఆనందించి, వారందరినీ మనసారా, నిండుగా ఆశీర్వదించి ఉండే వారు. మనమంతా ఎప్పటికీ స్మరించుకోవలసిన నాయకురాలు ఆవిడ. తమిళ నాడు ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఆమె ఆత్మ సదా తపిస్తూ ఆశీర్వాదాలు కురిపిస్తూనే ఉంటుందని నా నమ్మకం.
రామేశ్వరంలోని ఈ పవిత్ర భూమి నుండి దేశ ప్రజలందరికీ ఇవాళ నాదొక విన్నపం. భారతదేశంలోని ప్రతి మూల నుండి ప్రజలు రామేశ్వరాన్ని సందర్శించాలి. దేశం లోని యువతరం సహా పర్యాటక నిర్వాహకులు, రామేశ్వరం సందర్శకులందరికీ నాదొక విజ్ఞప్తి. మీరెప్పుడు రామేశ్వరం వచ్చినా అబ్దుల్ కలామ్ గారి ఈ స్మారక చిహ్నాన్ని దయచేసి తప్పక చూసి, కొత్త తరాన్ని ఉత్తేజితం చేయండి. ఈ స్ఫూర్తిదాయక యాత్రకు మీరంతా తప్పక రావాలి సుమా !
ఈ రోజు కార్యక్రమం ఒక విధంగా పంచామృతం (ఐదు రకాల మధురం)తో సమానమైనటువంటిది. ఎందుకంటే.. అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి సందర్భంగా.. కలామ్ గారి స్మృతిచిహ్నం, రైలు, రోడ్డు, భూమి, సముద్రం సంబంధిత ఐదు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. నేడు మన మత్స్యకారులు చిన్న పడవలతో సముద్రంలో చేపల వేటకు వెళ్తున్నారు. వారు భారత సరిహద్దు లోని జలాల్లో ఉన్నారో లేక అతిక్రమించారో వారికి తరచూ తెలియడం లేదు. ఫలితంగా నానా అగచాట్లూ పడాల్సి వస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి యొక్క నీలి విప్లవ పథకంలో భాగంగా వారికి సహాయం అందిస్తాం. ఈ పథకంలో భాగంగా మన గ్రామస్థులందరికీ ప్రభుత్వం నుండి రుణం, సహాయం, రాయితీ అందుతాయి. తద్వారా వారికి పెద్ద ట్రాలర్లు లభిస్తాయి. వాటి సహాయంతో వారు సముద్రంలో మరింత లోతుకు వెళ్లి వేటాడగలుగుతారు. ఈ కార్యక్రమం ఈ రోజే మొదలైంది; కొంత మంది మత్స్యకారులకు నేను చెక్కులు కూడా అందజేశాను.
రామేశ్వరం శ్రీరామచంద్రుని తోనూ ముడిపడి ఉంది. ఇలాంటి రామేశ్వరాన్ని రాముడి జన్మస్థలమైన అయోధ్యను అనుసంధానం చేసే రామేశ్వరం- అయోధ్య రైలు ‘శ్రద్ధా సేతు’ ఎక్స్‌ప్రెస్‌ను నేను ఈ రోజు ప్రారంభించడం నాకెంతో సంతోషాన్నిస్తోంది. అదే విధంగా ధనుష్కోటికి వెళ్లే రహదారి.. సముద్ర మార్గంలో వెళ్లి రామసేతును చూడాలనుకునే వారి కోసం ముఖ్యమైన రహదారి పనులను పూర్తి చేశారు. దీనిని దేశ వాసులకు అంకితం చేసే అవకాశం నాకివాళ లభించింది.
ఇక భారతదేశం గురించి 1897లో పాశ్చాత్యులకు కనువిప్పు కలిగించి విదేశాలలో మన్ననలు అందుకున్న తరువాత స్వామి వివేకానంద అడుగిడిన నేల రామేశ్వరం. ప్రసిద్ధ వివేకానంద స్మారకం కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. అలాగే ‘హరిత రామేశ్వరం’ దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సహకారంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొంటున్నాయని నాకు తెలిసింది. రామేశ్వరం భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఆయా సంస్థలన్నిటికీ, ప్రత్యేకించి వివేకానంద కేంద్రానికి ఇవే నా అభినందనలు.
హిందూ మహాసముద్రం.. 7,500 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం గల భారతదేశం పెట్టుబడులకు అత్యంత అనుకూలం. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకాన్ని ప్రారంభించింది. ఈ తీరప్రాంత సౌలభ్యం ఆధారంగా భారత రవాణా రంగాన్ని పరివర్తన బాట పట్టించడమే ఈ పథకం లక్ష్యం. సాగరమాల పథకం లో భాగంగా వాణిజ్యం, ఎగుమతి- దిగుమతుల రవాణా సంబంధిత వ్యయాన్ని తగ్గించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా తీరప్రాంత ప్రజల జీవితాల్లో పెనుమార్పును తీసుకు రావడానికి మేము కృషి చేస్తున్నాము.
అబ్దుల్ కలామ్ గారికి నివాళిగా డిఆర్ డిఒ ఈ స్మారకాన్ని నిర్మించడంపై మీరంతా సంతోషిస్తుంటారు. అదే విధంగా మన సైనిక పాటవ రంగంలోనూ డిఆర్ డిఒ పోషించాల్సిన పాత్ర అత్యంత కీలకం. ఇవాళ ఈ రైలు ఇక్కడి నుండి ప్రయాణం ప్రారంభించిన రీతిలోనే ఈ సంస్థ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతుంది. రామేశ్వరం నుండి అయోధ్య కు వెళ్లే ఈ శ్రద్ధా సేతు రైలులో ఏర్పాటు చేసినవన్నీ పర్యావరణహిత జీవవైవిధ్య మరుగుదొడ్లే కావడం విశేషం. మనం చేపట్టిన ‘పరిశుభ్ర భారతం’ ఉద్యమానికి ఈ రైలు కొత్త ఉత్తేజాన్నిస్తోంది.
మిత్రులారా, డాక్టర్ కలామ్ వల్ల ప్రభావితమైన వారిలో ప్రధానంగా ఉన్నది దేశ యువతరమే. నేడు వారు తమ సొంత బలంతో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా వారి కలలు సాకారం చేసుకొనేందుకు ఉద్దేశించినవే కేంద్ర ప్రభుత్వ ‘స్టార్ట్- అప్ ఇండియా’, ‘స్టాండప్ ఇండియా’ కార్యక్రమాలు. దేశంలోని ప్రతి జిల్లాలో యువతలో నైపుణ్యం పెంపుదల కోసం శిక్షణ కేంద్రాలతో పాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించాము. యువతీయువకులు వారి సొంత పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించేందుకు మూలధనం సమస్య లేకుండా చూసేందుకు ‘ముద్ర’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద తమ జీవన ప్రగతికి తమదైన మార్గంలో పయనించే వీలుకల్పిస్తూ 8 కోట్ల మంది ఖాతాదారులకు 4 కోట్ల రూపాయలకు పైగా రుణాలను అందించాము. ఈ లబ్ధిదారులలో ఒక్క తమిళ నాడుకు చెందిన యువతరమే కోటి మందికి పైగా ఉండడం నాకు సంతోషాన్నిస్తోంది. ఈ సంఖ్య స్వతంత్రోపాధి దిశగా తమిళ నాడు యువత లో ఉన్న ఉత్సాహాన్ని, సంకల్పాన్ని చాటుతోంది.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా కేంద్రం దృష్టి సారిస్తోంది. సరికొత్త తమిళ నాడు లేకుండా ‘నవ భారతం’ అన్నది సాధ్యం కాదు. అందుకే కనీస వసతుల కల్పన కోసం అవసరమైన ప్రతి సాయాన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నాము. తమిళ నాడు ప్రజలకు లబ్ధిని చేకూర్చే కేంద్ర పథకాలను బాహాటంగా స్వాగతించి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడమే గాక అన్ని విధాలా మాకు సహకరించిన తమిళ నాడు ముఖ్యమంత్రికి నేను కృతజ్ఞుడినై ఉంటాను.
స్మార్ట్ సిటీ పథకం కింద రాష్ట్రంలో ఎంపిక చేసిన 10 నగరాల్లో చెన్నై, కోయంబత్తూర్, మదురై, తంజావూర్ తదితర పెద్ద నగరాలన్నీ ఉన్నాయి. ఈ నగరాల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్రం 900 కోట్ల రూపాయలకు పైగా... దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేసింది. తమిళ నాడులోని మరో 33 నగరాలను అమృత్ కార్యక్రమంలో చేర్చాం. దీనికి తోడు తమిళ నాడుకు 4,700 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిధులను 33 నగరాల్లో విద్యుత్తు, మంచినీరు, మురుగునీటి పారుదల, పరిశుభ్రత, తోటల పెంపకం తదితర సదుపాయాల బలోపేతానికి ఉపయోగిస్తారు.
ఈ పథకం రామేశ్వరానికి మాత్రమేగాక మదురై, ట్యుటికోరిన్, తిరునెల్ వేలి, నాగర్ కోయిల్ తదితర 33 నగరాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక 4,000 కోట్ల రూపాయలతో చెన్నై మెట్రో తొలి దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో పాటు తమిళ నాడులో గ్రామీణ రహదారుల కోసం, స్వయంసహాయ బృందాల విస్తరణకు, గ్రామీణ యువత నైపుణ్యాభివృద్ధికి గడచిన మూడేళ్లలో కేంద్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
ఈ సందర్భంగా తమిళ నాడు ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి నేనొక విజ్ఞప్తి చేయదలిచాను. పరిశుభ్ర భారతం కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నగరాల మధ్య పోటీని నిర్వహిస్తున్నాము. ఇతర నగరాల కన్నా ముందే తమ నగరాన్ని పూర్తి బహిరంగ విసర్జనరహితం చేసినట్లు ప్రకటించుకోగలగాలి. ఈ పందెంలో తమిళ నాడు వెనుకబడ బోదని, ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తుందని నేను ఆశాభావంతో ఉన్నాను. అదే విధంగా 8 లక్షలమందికి పైగా పేద కుటుంబాలకు ఇళ్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన మంత్రి పట్టణ గృహనిర్మాణ పథకం లో ఈ ఇళ్లను నిర్మించే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపవలసిందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ దీని కింద ఆమోదం లభించే ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలన్న కల సాకారం చేసుకునేందుకు డాక్టర్ అబ్దుల్ కలామ్ తన జీవితాంతం శ్రమించారు. ఈ లక్ష్యసాధన దిశగా 125 కోట్ల మంది పౌరులను సదా ఉత్తేజితులను చేస్తూనే వచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్లు నిండబోయే 2022 సంవత్సరం నాటికి ‘నవ భారతం’ రూపుదిద్దుకోవాలన్న కల సాకారం కావడంలో ఈ స్ఫూర్తి మనకెంతగానో తోడ్పడుతుంది.
మనం 2022లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన నాటి సమర యోధుల కలల సాకారం కోసం మనం చేసే ప్రతి పనీ డాక్టర్ అబ్దుల్ కలామ్‌కూ నివాళి కాగలదు.
ఈ నేపథ్యంలో ఇవాళ రామేశ్వరంలో ఉండి, ఇక్కడి ప్రజల కృషి గురించి తెలుసుకున్నాను. రామాయణంలో ఓ చిట్టి ఉడుత కథ ఉంది. రామేశ్వరంలోనే ఓ చిన్ని ఉడుత రామ సేతు నిర్మాణంలో సాయపడింది. ఆ ఉడుతను కలామ్ చేతి లోని చిన్న గొడుగుతో పోల్చవచ్చు. రామాయణంలో ఉడుత వలె 125 కోట్ల మంది భారతీయులు ఒక్క అడుగు ముందుకు వేస్తే భారతదేశం 125 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది.
దేశం ఒక చివర నుండి మరో చివరి వరకు.. రామేశ్వరం నుండే ఈ ప్రజా సంద్రం మొదలవుతుంది; ఇంతటి భారీ ప్రజా సమూహం ఇక్కడ చేరడం డాక్టర్ అబ్దుల్ కలామ్ పట్ల మీకు గల గౌరవానికి, దేశ ఉజ్జ్వల భవిత పట్ల మీ అంకితభావానికి నిదర్శనం. ఇది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈ ప్రజా సమూహానికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సగౌరవంగా అబ్దుల్ కలామ్ గారికి, దివంగత ‘అమ్మ’కు నివాళి అర్పిస్తున్నాను.
మీకందరికీ నా అనేకానేక ధన్యవాదాలు.