నెట్ వర్క్ 18 ప్రధాన సంపాదకుడు శ్రీ రాహుల్ జోశీ, మన దేశంతో పాటు విదేశాల నుండి విచ్చేసిన అతిథులు, ఇతర ప్రసార మాధ్యమాల మిత్రులు, మహిళలు మరియు సజ్జనులారా,
రైజింగ్ ఇండియా సమిట్ లో పాల్గొనేందుకు నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, రైజింగ్ అంటే.. ఉదయించడం. ఈ మాట అనగానే, చీకటి నుండి వెలుతురు వైపు ప్రయాణం అనే భావన కలుగుతుంది. బంగారు భవిష్యత్తు వైపు వెళ్తున్న భావన.. ప్రస్తుతం మనం ఉన్న స్థితి నుండి పురోగతి వైపు అడుగులు వేస్తున్న భావన. ఉదయించడం అన్న మాట దేశం విషయంలో పూర్తి అర్థవంతంగా ఉంటుంది. మరి ఈ రైజింగ్ ఇండియా (ఉదయిస్తున్న భారతదేశం) అంటే ఏమిటి ? ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేసుకోవడంమేనా ? లేక స్టాక్ మార్కెటు లో సెన్సెక్స్ రికార్డు స్థాయి లో పెరగడమా ? లేక విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయిలో ఉండటమా ? లేక విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున దేశంలోకి రావడమా ?
మిత్రులారా, ఉదయిస్తున్న భారతదేశం అంటే నా దృష్టి లో 125 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం పెరగడం; దేశ గౌరవం పెరగడం. ఈ 125 కోట్ల మంది ప్రజల ఆత్మ శక్తి తో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. సాధించడం కుదరనే కుదరదు అనుకున్న వాటిని కూడా సాధించగలగడమే.
ఈ రోజు అందరిలో ఆత్మస్థైర్యం పెరుగుతూ అది న్యూ ఇండియా ను ఆవిష్కరించేందుకు ఒక ప్రతినగా మారుతోంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ప్రభుత్వమే అభివృద్ధికి నాయకత్వం వహించాలని, దాని ద్వారానే మార్పు సాధ్యమని, ప్రజలు దానిని అనుసరించాలన్న ఒక భావన ఉంది. దానినే చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. అయితే, గత నాలుగు సంవత్సరాల్లో మనం ఈ భావన సరి కాదని నిరూపించాం. ఇపుడు ఈ దేశ పౌరుడే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆ పౌరుడి ని ప్రభుత్వం అనుసరిస్తోంది. భారతదేశం యొక్క ప్రక్షాళన కార్యక్రమం ఎంత తక్కువ సమయంలో ప్రజా ఉద్యమంగా మారిపోయిందో స్వయంగా మీరు చూశారు. ఇందులో ప్రసార మాధ్యమాలు గణనీయమైన పాత్రను పోషించాయి.
నల్లధనంపై, అవినీతిపై పోరాటంలో డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ ను ఒక బలమైన ఆయుధంగా చేసింది ఈ దేశ పౌరులే. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారతదేశం గణనీయమైన పురోగతి ని సాధిస్తున్న వాటిలో ఒకటిగా మారింది.
దేశంలో అవినీతిని అంతమొందించేందుకు ప్రభుత్వం తీసుకొన్న ప్రతి చర్యనూ ప్రజలు ఆమోదించడాన్ని బట్టి చూస్తే ఈ దేశపు అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలన్న తపన వారిలో బలంగా ఉందన్నది స్పష్టం అయింది.
ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయన్నది పక్కన పెడితే, ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రభుత్వం పెద్ద నిర్ణయాలను తీసుకోవడమే కాకుండా, వాటిని విజయవంతంగా అమలు చేయగలిగింది. అలాంటి నిర్ణయాలను దశాబ్దాల కిందటే తీసుకున్నా, చట్టాలు చేసినా, అవినీతి పాలకుల ఒత్తిడి కారణంగా వాటిని అమలు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం ఆయా నిర్ణయాలనూ, చట్టాలను అమల్లోకి తెచ్చింది.
ఈ చట్టాల ప్రాతిపదిక గానే పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నాం.
మిత్రులారా,
భారతదేశంలో చోటు చేసుకొంటున్న ఈ మార్పుకు కారణం ఈ దేశ పౌరులు, వారికి ఉన్న ఆత్మస్థైర్యం. ఇదే ఆత్మస్థైర్యం.. ప్రజలలో ఉన్న అసమానత్వాన్ని తగ్గిస్తూ వస్తోంది. వివిధ ప్రాంతాల మధ్య ఉన్న అసమానత్వాన్ని అది పోగొడుతోంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఉదయిస్తున్న భారతం కావచ్చు, సమాజం కావచ్చు, వ్యక్తి కావచ్చు… సమానత్వ భావన లేకపోతే, ఎలాంటి నిర్ణయాలనూ అమలు చేయలేం సరికదా సమాజం కూడా ముందుకు పోలేదు. జాతీయ స్థాయిలో సమానత్వ భావనలను పాదుకొల్పడాన్ని ఈ ప్రభుత్వం ఒక దూర దృష్టి తో తీసుకొన్న నిర్ణయంగా భావిస్తోంది. ఈ నిర్ణయం అందించిన ఫలితాలను నెట్ వర్క్ 18 ప్రేక్షకులకు ఒక వీడియో ద్వారా చెప్పదలచుకొన్నాను.
మిత్రులారా,
ఉజ్జ్వల కేవలం వంట ఇళ్ల ముఖచిత్రాన్నే కాక లక్షలాది కుటుంబాల ముఖచిత్రాన్ని సైతం మార్చివేస్తోంది. మన సామాజిక వ్యవస్థలోని అసమానత్వాన్ని రూపుమాపుతోంది.
మిత్రులారా,
మీరు ఉన్న ఈ చోటుకు రాక ముందు నేను మణిపుర్ లో ఉన్నాను. ఈశాన్య రాష్ట్రాలకు మేలు జరిగే అనేక కార్యక్రమాలను ప్రారంభించాం. సైన్స్ కాంగ్రెస్, క్రీడా విశ్వవిద్యాలయ శంకుస్థాపన వంటివి అందులో ఉన్నాయి. ప్రధాన మంత్రి గా అక్కడకు నేను వెళ్లడం 28 వ సారి లేదా 29 వ సారి అనుకుంటాను.
చూడండి, ఎందుకని ఇలాగ జరుగుతోంది ? తూర్పు భారతంపైనా, ఈశాన్య భారతంపై మా ప్రభుత్వం ఎందుకని అంత ఎక్కువగా శ్రద్ధ తీసుకొంటోంది ? మేం చేస్తోందంతా వోట్ల కోసమే అని అనుకొనే వారు దేశం యొక్క క్షేత్ర స్థాయి వాస్తవాల నుండి దూరంగా పోవడమే కాదు, వారికి ప్రజా హృదయాలలో ఎలాంటి స్థానం లేకుండా పోయింది.
మిత్రులారా,
తూర్పు భారతాన్ని భావోద్వేగపరంగా కలుపుకోవడం, వారికి ఇవ్వవలసిన వాటా ను ఇవ్వడం చాలా ముఖ్యం.
అందుకే.. తూర్పు భారతం కోసం ‘‘యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్’’ అన్న సూత్రాన్ని మా ప్రభుత్వం అనుసరిస్తోంది. తూర్పు భారతం అంటే ఒక్క ఈశాన్య రాష్ట్రాలే అని కాదు, అందులో ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలు కూడా ఉన్నాయి.
దేశ అభివృద్ధి ప్రయాణం లో తూర్పు భారతం పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. ఈ ప్రాంత అభివృద్ధి కి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే దీనికి కారణం. ఈ ప్రాతంలో అనేక వందల ప్రోజెక్టు లు ప్రారంభానికి నోచుకోలేదు. లేదా దశాబ్దాలుగా కాగితాల్లోనే ఉండిపోయాయి. ఈ అసమానత్వాన్ని రూపుమాపేందుకు మా ప్రభుత్వం కంకణం కట్టుకొంది. అసంపూర్తిగా ఉన్న ప్రోజెక్టు లను, ఆగిపోయిన ప్రోజెక్టు లను మళ్లీ ఈ ప్రభుత్వం ప్రారంభిస్తోంది.
అసమ్ లో గ్యాస్ క్రాకర్ ప్రోజెక్టు గత 31 సంవత్సరాలుగా అమలుకు నోచుకోలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం, ఈ ప్రోజెక్టు ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్, బిహార్ లోని బరౌనీ, ఝార్ ఖండ్ లోని సిందరీ లలో ఎరువుల కర్మాగారాలు అనేక ఏళ్లుగా మూతబడ్డాయి. వీటిని మళ్లీ నడిపించేందుకు అవసరమైన పనులు ఇపుడు వేగంగా జరుగుతున్నాయి.
జగదీశ్ పుర్ నుండి హల్దియా వరకూ ఉన్న గొట్టపు మార్గం ద్వారా ఈ ఎరువుల కర్మాగారాలకు గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ గొట్టపు మార్గం కారణంగా.. తూర్పు భారతం లోని అనేక నగరాలు సరికొత్త రూపును సంతరించుకొంటాయి. ఒడిశా లోని పరదీప్ చమురు శుద్ధి కర్మాగారానికి సంబంధించిన పనులను మా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇపుడు పారాదీప్.. అభివృద్ధి కేంద్రంగా మారనుంది.
వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమై ఢోలా-సదియా సేతువు పనులను మా ప్రభుత్వం వేగంగా పూర్తి చేసింది. ఈ వంతెన అసమ్- అరుణాచల్ ప్రదేశ్ లను కలుపుతోంది.
రహదారి మార్గాలు గాని, రైలు మార్గాలు గాని తూర్పు భారతం లో మౌలిక సదుపాయాలను పూర్తిగా బలోపేతం చేస్తున్నాం. జల రవాణా మార్గాల అభివృద్ధి పైనా దృష్టి పెడుతున్నాం. వారాణసీ, హల్దియా ల మధ్య ఏర్పాటు చేస్తున్న జల రవాణా మార్గం ఆ ప్రాంతం లోని పారిశ్రామిక రవాణాలో కీలక పాత్రను పోషించనుంది.
ఉడాన్ పథకం లో భాగంగా అనుసంధానం కోసం తూర్పు భారతంలో మరో డజను విమానాశ్రయాలు రాబోతున్నాయి. ఇందులో ఆరు విమానాశ్రయాలు ఈశాన్య రాష్ట్రాలలో ఉంటాయి. కొద్ది రోజుల కిందటే తొలి వాణిజ్య విమానం సిక్కిమ్ లో దిగింది.
తూర్పు భారతంలో అఖిల భారత వైద్య విద్య సంస్థ లు, వ్యవసాయ పరిశోధన సంస్థ లు, మహాత్మ గాంధీ పని చేసిన తూర్పు చంపారణ్ లోని మోతీహారీ లో కేంద్రీయ విశ్వ విద్యాలయం.. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలే.
మిత్రులారా,
ఈ ప్రాంతాలలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలను కూడా కల్పించింది. ‘‘ఢిల్లీ చాలా దూరం’’ అన్న భావన ను తోసిరాజని, ఢిల్లీ నే తూర్పు భారతానికి దగ్గర చేశాం. ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’’ (అందరి తోడ్పాటుతో అందరి అభివృద్ధి) సూత్రంలో భాగంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథం లోకి తీసుకు వస్తున్నాం.
మిత్రులారా,
మీకు ఒక పటాన్ని చూపిస్తాను. ఈ దేశంలో ఎంత భారీగా ఉన్న అసమానత్వాన్ని గత నాలుగేళ్లుగా మేం ఎదుర్కొందీ ఈ మ్యాప్ ను చూస్తే తెలుస్తుంది. కాంతిమంతంగా ఉన్న తూర్పు భారతంలోని గ్రామాలను ఇందులో చూడవచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా 18,000 గ్రామాలు నేటికీ విద్యుత్తు సౌకర్యానికి నోచుకోని విషయాన్ని నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇందులో 13,000 గ్రామాలు తూర్పు భారతంలోనే ఉన్నాయి. ఈ 13,000 గ్రామాలలో 5,000 గ్రామాలు ఒక్క ఈశాన్య భారతం లోనే ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటికీ విద్యుత్తు సౌకర్యాన్ని అందించే పనులు పూర్తి కావస్తున్నాయి.
ఇళ్లకు కరెంటు ను సరఫరా చేసేందుకు సౌభాగ్య అనే పథకాన్ని ప్రారంభించాం. దీనికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. తూర్పు భారతం లోని ఇళ్లకు వెలుగును ప్రసాదించడం ద్వారా వ్యష్ఠి నుండి సమష్టి దిశగా కదలడంతో పాటు ‘ఉదయిస్తున్న భారతం’ మరింత సాకారం అవుతుంది.
మిత్రులారా,
అంచనాలు లేకపోతే నిర్వహణ కష్టమని కార్పొరేట్ ప్రపంచంలో ఒక మాట చెబుతారు. మా పని విధానంలో దీనిని చేర్చడమే కాకుండా, నిర్వహణను కూడా అంచనా వేసుతున్నాం. ప్రజా చైతన్యం దిశగా చర్యలు తీసుకొంటున్నాం. ఒక వైపు ప్రజా చైతన్యం ఉంటే ప్రజలు, ప్రభుత్వం కలసి పని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించడం సాధ్యపడుతుంది. ఆరోగ్య రంగానికి చెందిన ఉదాహరణ ను మీ దృష్టికి తెస్తాను.
ఆరోగ్య రంగానికి చెందిన నాలుగు స్తంభాలు- వ్యాధులు రాకుండా చూడడం, చౌక ధరలకే వైద్యం, సరఫరా వ్యవస్థల మెరుగుదల, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం- వంటి వాటిపై దృష్టి సారించడం ద్వారా బహుముఖ రంగాలలో దీనిని ముందుకు తీసుకు పోతున్నాం.
ఈ నాలుగు వ్యవస్థలపై ఏక కాలంలో దృష్టి పెడుతున్నాం. దేశంలో ఆరోగ్య రంగానికి ఒకే మంత్రిత్వ శాఖ ఉండటం, అది ఒక్కటే పని చేయడం వల్ల వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి గానీ పరిష్కారాలు కనిపించడం లేదు. దీంతో ఇపుడు వ్యవస్థల కంటే పరిష్కారాలే ముఖ్యమన్న అంచనా కు వచ్చాం.
ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల మంత్రిత్వ శాఖ, మహిళా, బాల వికాస మంత్రిత్వ శాఖ లను అదనంగా సృష్టించాం. అందరినీ కలుపుకొని పోవడంలో భాగంగా ఈ విధంగా ముందుకు వెళ్లడం సాధ్యమవుతోంది.
వ్యాధుల నివారణ ను గురించి మాట్లాడవలసి వస్తే వ్యాధుల నివారణ అన్నది తేలికగా సాధించేదే; అదీ చౌకగానే కుదురుతుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి రక్షిత మంచినీరు చాలా ముఖ్యం. ఈ లక్ష్య సాధన కోసం తాగునీరు, పారిశుధ్యం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం. ఇపుడు ఫలితాలను ఒకసారి చూద్దాం. 2014 నాటికి దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల ఇళ్లకు మరుగుదొడ్డి సౌకర్యం ఉండగా, నేడు 13 కోట్ల ఇళ్లకు ఈ సౌకర్యం సమకూరింది. ఇది 100 శాతం విజయం.
38 శాతంగా ఉన్న పారిశుధ్యం నేడు 80 శాతం మందికి అందుబాటులో ఉంది. ఇది కూడా 100 శాతానికి మించిన విజయమే. పారిశుధ్యం లేకపోవడం వల్ల వ్యాధులు వస్తాయి. కానీ ఇపుడు పారిశుధ్యం ప్రతి ఇంటికీ అందుబాటులో ఉండడం ద్వారా వ్యాధులను వారికి దూరం చేస్తుంది.
వ్యాధుల నివారణలో భాగంగా యోగ సరికొత్త గుర్తింపు ను సంతరించుకొంది. యోగ ప్రపంచ వ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మారింది. కారణం ఆయుష్ మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేయడమే.
వెల్ నెస్ కేంద్రాల భావన ను ఈ సంవత్సరం బడ్జెటు లో చేర్చాం. దేశం లో ప్రతి ప్రధాన పంచాయతీ లో కూడా వెల్ నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఊతం ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెరుగుదల రేటు మా ప్రభుత్వం రాక ముందు కేవలం ఒక శాతం గా ఉండగా, ప్రస్తుతం అది 6.7 శాతానికి చేరుకొంది.
మిత్రులారా,
వ్యాధుల నిరోధం ఒక్కటే కాకుండా తక్కువ ఖర్చులో వైద్యం లభించడం కూడా ముఖ్యమే. వైద్యం అందుబాటులో ఉండడం, దాంతో పాటు అది భరించగలిగే స్థాయిలో లభించడం రెండూ ముఖ్యమే. సామాన్యుడికి ఈ రెండింటినీ చేరువ చేసేందుకు అన్ని చర్యలూ తీసుకొంటున్నాం.
కొత్తగా ఏర్పాటు చేసిన ఎరువులు మరియు రసాయనాల మంత్రిత్వ శాఖ ఈ దిశగా పని చేస్తోంది. దేశ వ్యాప్తంగా 3,000 పైగా జన్ ఔషధి దుకాణాలను అందుబాటు లోకి తెచ్చింది. చౌక ధరలకే ఈ దుకాణాలలో 800 రకాల మందులు ప్రజలకు అందిస్తున్నారు.
వినియోగదారుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా, హృద్రోగులకు స్టెంట్ లు సరసమైన ధరలకే లభిస్తున్నాయి. మంత్రిత్వ శాఖ తీసుకొన్న ప్రత్యేక చర్యల కారణంగా, స్టెంట్ ల ధరలు 85 శాతం దిగివచ్చాయి. మోకాలి మార్పిడి లో వాడే ఇంప్లాంట్ ల ధరలు కూడా నియంత్రణ లోకి వచ్చాయి. వీటి ధరలు 50 శాతం నుండి 70 శాతం తగ్గాయి.
ఈ బడ్జెటు లోనే ఆయుష్మాన్ భారత్ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల దేశంలో పేదలకు లబ్ది చేకూరనుంది. 10 కోట్ల కుటుంబాలు అంటే.. 45 కోట్ల నుండి 50 కోట్ల మంది పౌరులకు వైద్య చికిత్స భారం గణనీయంగా తగ్గుతుంది. పేదలు జబ్బుల బారిన పడ్డపుడు వారికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా లభిస్తుంది. ఈ ఖర్చు ను బీమా కంపెనీ, కేంద్ర ప్రభుత్వం భరిస్తాయి.
మిత్రులారా,
మూడో స్తంభం.. సరఫరా వ్యవస్థ లో మెరుగుదల. ఆరోగ్య రంగానికి చెందిన ఇతర తప్పనిసరి సేవలను ఆరోగ్య రంగానికి అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్య కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది.
మిత్రులారా,
2014 వ సంవత్సరంలో మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి దేశంలో 52 వేల అండర్ గ్రాడ్యుయేట్, 30 వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య 85 వేల అండర్ గ్రాడ్యుయేట్, 46 వేల పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లకు పెరిగింది.
వీటికి తోడు కొత్త ఎఐఐఎమ్ ఎస్, ఆయుర్వేద సైన్స్ సంస్థ లు దేశ వ్యాప్తంగా ఏర్పాటవుతున్నాయి. పైపెచ్చు, ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒకటి వంతున వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి.
ఈ ప్రయత్నాల వల్ల దేశం లోని యువతకు సహాయపడడంతో పాటు పేదలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. పారా మెడికల్, నర్సింగ్ విభాగాలలో కూడా మానవ వనరులను బలోపేతం చేసేందుకు కృషి జరిగింది. వైద్య వృత్తి నిపుణుల సంఖ్య పెరిగిన కొద్ది వైద్య సంరక్షణ వసతులు పెరగడంతో పాటు అందరికీ అందుబాటు ధరల్లోకి కూడా వస్తాయి.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఆరోగ్య రంగంలో తీసుకొంటున్న చొరవ నాలుగోదీ, అత్యంత కీలకమైందీ అయినటువంటి మైలురాయి. ఒక ఉద్యమ స్ఫూర్తితో పని చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ఆ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించగలిగినప్పుడే ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి.
మేము మహిళలు, బాల వికాస మంత్రిత్వ శాఖ ను మరింత చైతన్యవంతం చేశాం. ఫలితంగా మాతృమూర్తుల, పిల్లల ఆరోగ్యం మెరుగుపడి వారు వ్యాధుల నుండి రక్షణ పొందుతారు. ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా మారుతారు.
ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన లలో భాగంగా తల్లులకు, పిల్లలకు తగినంత పోషకాహారం అందడానికి గట్టి చర్యలు తీసుకొన్నాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత వారంలో జాతీయ పోషకాహార ప్రచారోద్యమాన్ని ప్రారంభించాం. దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చి దిద్దే క్రమంలో తాజాగా వేసిన అతి పెద్ద అడుగు ఇది. తల్లులకు, పిల్లలకు పోషకాహారం తగినంతగా లభించినప్పుడు వారికి ఆరోగ్యవంతమైన జీవన భరోసా లభిస్తుంది. ప్రతి ఒక్క రంగానికి ప్రత్యేకమైన అభివృద్ధి నమూనా ను సిద్ధం చేయడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మిత్రులారా,
ఒక వీడియో ద్వారా దేశం లోని ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ ప్రజల ముఖాల్లో మీరందరూ చూస్తున్న ఆనందమే నా వరకు నిజమైన రైజింగ్ ఇండియా.
ఈ మార్పు ఎలా వచ్చింది ?
ఆరు సంవత్సరాల క్రితం నాటి మాట.. పవర్ గ్రిడ్ విచ్ఛిన్నత కారణంగా ప్రతి ఏటా జూలై లో యావత్తు దేశానికి కరెంటు ఉండేది కాదు. ఇందుకు వ్యవస్థ లో వైఫల్యం, పాలన లో వైఫల్యం కారణాలు.
బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రణాళికలు ఏమిటో విద్యుత్తు మంత్రిత్వ శాఖ కు తెలియని రీతిలో ప్రభుత్వంలో అడ్డుగోడలు ఉండేవి. నవీన, నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖతో విద్యుత్ మంత్రిత్వ శాఖకు సమన్వయం ఉండేది కాదు.
దేశంలోని విద్యుత్తు రంగంలో ఈ అడ్డుగోడలను తొలగించి ఈ విచ్ఛిన్నత లకు సమగ్ర పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం జరిగింది.
ఈ రోజు విద్యుత్తు, నవీకరణ యోగ్య శక్తి, బొగ్గు మంత్రిత్వ శాఖలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. దేశానికి శక్తిపరమైన భద్రతను అందించేందుకు అత్యుత్తమ పరిష్కారాలను సాధించే దిశగా కృషి చేస్తున్నాయి.
బొగ్గును దేశంలో ఇంధన భద్రత కోసం వినియోగిస్తుంటే ఈ రోజున నవీకరణ యోగ్య శక్తి భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన భవిష్యత్తును అందించగలుగుతోంది. ఒకప్పటి విద్యుత్తు లోటు స్థాయి నుండి మనం మిగులు విద్యుత్తు స్థితికి చేరుకోవడానికి, నెట్ వర్క్ ఫెయిల్యూర్ స్థాయి నుండి విద్యుత్తు నికర ఎగుమతి దేశం గా మారడానికి కారణం ఇదే. ప్రభుత్వం చేస్తున్న కృషి కారణంగా ఒక జాతి- ఒక గ్రిడ్ కల సాకారం అవుతోంది.
మిత్రులారా,
వైఫల్య భావం, నిరాశ, భవిష్యత్తు పై ఆశారహిత వైఖరితో దేశం పురోగమించదు. మీరే స్వయంగా చూశారు.. గత నాలుగేళ్ల కాలంలో దేశంలో పాలన వ్యవస్థ పైన ప్రజలలో ఒక రకమైన విశ్వాసం ఏర్పడింది. తమ కళ్ల ముందే చోటు చేసుకొంటున్న మార్పులు చూస్తుంటే బలహీనతలన్నింటినీ వదలి దేశం 21వ శతాబ్ది లోకి పురోగమిస్తోందన్న నమ్మకం ప్రతి భారతీయునిలో కలిగింది. 21వ శతాబ్ది లోకి పురోగమిస్తున్న భారతదేశం అన్ని రకాల బంధనాలను తెంచుకొని ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కల ను పండించేది గా ఉంటుదని నమ్ముతున్నారు. ప్రజలలోని ఈ బలమైన విశ్వాసమే రైజింగ్ ఇండియాకు మూలం.
సోదరులు మరియు సోదరీమణులారా,
నేటి పురోగమన భారతదేశాన్ని ప్రపంచం లోని ప్రతి ఒక్క దేశం గౌరవించడానికి కారణం అదే. ఈ నాలుగేళ్లలో వచ్చిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సంఖ్యను గత ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో భారతదేశ సందర్శనకు వచ్చిన ప్రపంచ దేశాల దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సంఖ్య తో పోల్చితే ఆ తేడా ఏమిటో అర్ధం అవుతుంది. ఒక ఏడాది కాలంలో గత ప్రభుత్వ హయాంలో భారతదేశ సందర్శనకు వచ్చిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సంఖ్యతో పోల్చితే సగటున మా ప్రభుత్వ హయాంలో వచ్చిన దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సంఖ్య రెట్టింపు అయింది. రైజింగ్ ఇండియాకు ప్రపంచ వ్యాప్తంగా లభించిన ఈ గుర్తింపు మీ అందరికీ గర్వ కారణం.
మిత్రులారా,
భారతదేశం అభివృద్ధి లో తనకు తాను మాత్రమే కొత్త దిశ కల్పించడం లేదు, ప్రపంచ అభివృద్ధికి కూడా కొత్త దిశ కల్పిస్తోంది. యావత్ ప్రపంచంలో సౌర విప్లవానికి భారతదేశం నాయకత్వం వహిస్తోంది. ఐదు రోజుల క్రితం అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) సభలను ఎంత విజయవంతంగా నిర్వహించిందీ మీరంతా చూశారు. సమావేశంలో ఆవిష్కరించిన ఢిల్లీ సోలార్ అజెండా ను అమలుపరచడానికి 60 కి పైగా దేశాలు అంగీకరించాయి. 21వ శతాబ్ది లో జల వాయు పరివర్తన కు సంబంధించిన అంశంలో భారతదేశం తీసుకొన్న ఈ చొరవ యావత్ మానవాళి సేవ లో ఒక మహోన్నత అధ్యాయం.
మిత్రులారా,
గత నాలుగేళ్లలో ప్రపంచంపై భారతదేశం ప్రభావం ఎంతగానో పెరిగింది. ఒక పటిష్ఠమైన వ్యూహం ప్రకారం నిరంతర ప్రక్రియగా ఈ కృషి జరిగింది. ప్రపంచానికి భారతదేశం శాంతి, అభివృద్ధి, సుస్థిరమైన అభివృద్ధి లతో కూడినటువంటి సందేశాన్ని అందించింది. ఐక్య రాజ్య సమితి కావచ్చు, జి-20 కావచ్చు.. ప్రపంచ వేదిక ఏదైనప్పటికీ ప్రపంచాన్ని కుదిపివేస్తున్న సమస్యలను భారతదేశం ప్రస్తావించింది. ఉగ్రవాదం అనేది ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో చెందిన సమస్య కాదు, ప్రపంచం లోని ప్రతి దేశం యొక్క సమస్య ఇది అనే అంశాన్ని అంతర్జాతీయ వేదికలన్నింటి పైనా భారతదేశం నిర్ధారించింది.
నల్లధనం, అవినీతి భిన్న దేశాల అభివృద్ధి ని ఎలా నిరోధిస్తున్నాయి, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణకు అది ఎలా సవాలుగా మారింది అనే అంశాలను కూడా బలవంతంగా అయినా భారతదేశం అన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించింది.
మిత్రులారా,
ప్రపంచం నుండి క్షయవ్యాధి నిర్మూలనకు పెట్టిన గడువు 2030 వ సంవత్సరం కంటే ఐదేళ్ల ముందే అంటే, 2025 కల్లా దేశంలో ఆ మహమ్మారిని నిర్మూలించాలని తీర్మానించడానికి భారతదేశం లో గల ఆత్మ విశ్వాసమే కారణం. 2025 కల్లా ఆ లక్ష్యాన్ని సాధించడం ద్వారా ప్రపంచ దేశాలకు భారతదేశం మార్గాన్ని చూపుతుందని నేను విశ్వసిస్తున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ రోజు పురోగమన భారతదేశం అంటే ప్రపంచానికి రెండే పదాల కూర్పు కాదు. 125 కోట్ల మంది భారతదేశ వాసుల సంకల్పానికి చిహ్నంగా ఈ రోజు యావత్ ప్రపంచం దానిని గుర్తించింది. ఈ కారణంగానే ఎన్నో సంవత్సరాలుగా భారతదేశం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పలు అంతర్జాతీయ వ్యవస్థల సభ్యత్వ సాధన సాకారం కాగలిగింది.
క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం అదుపు యంత్రాంగం లో చేరిన అనంతరం వాసెనార్ ఒడంబడిక, ఆస్ట్రేలియా గ్రూపు లో కూడా భారతదేశం చేరింది. ఇంటర్ నేశనల్ మేరిటైమ్ ఆర్గనైజేశన్ కు చెందిన ఇంటర్ నేశనల్ ట్రైబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ, ఐక్య రాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి ఎన్నికలలో భారతదేశం విజేతగా నిలచింది. ఇంటర్ నేశనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎన్నికల్లో భారతదేశం గెలిచిన తీరును ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.
మిత్రులారా,
యమన్ లో సంక్షోభం తలెత్తిన సమయంలో భారతదేశం తీసుకొన్న చొరవ పెరుగుతున్న భారతదేశం యొక్క ప్రాబల్యానికి నిదర్శనం. ఆ దేశం నుండి మన పౌరులను సురక్షితంగా వెలుపలికి తీసుకు వచ్చిన తీరు చూసి పలు దేశాలు భారతదేశాన్ని అభ్యర్థించాయి. మొత్తం 48 దేశాల ప్రజలను ఆ సంక్షోభ సమయంలో యమన్ నుండి భారతదేశం వెలుపలికి తీసురావడం మీ అందరికీ గర్వకారణం. దౌత్యంలో మానవ విలువల జోడింపు ను గమనించిన ప్రపంచ దేశాలు భారతదేశం తన స్వీయ ప్రయోజనాల కోసమే కాదు, మొత్తం ప్రపంచ ప్రయోజనాల కోసం పని చేస్తుందని గుర్తించాయి. మనం అనుసరించే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ సిద్ధాంతం మన హద్దులకే పరిమితం కాదు.
ఈ రోజు మనం ఆయుష్మాన్ భారత్ కోసం ఒక్కటే కాదు, ఆయుష్మాన్ ప్రపంచం ఆకాంక్షిస్తున్నాం. యోగ, ఆయుర్వేదంలపై ప్రపంచ దేశాలలో కనిపిస్తున్న ఆసక్తి రైజింగ్ ఇండియా కు ప్రతిబింబం.
మిత్రులారా,
ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కు వద్దాం. గత మూడు సంవత్సరాలుగా భారతదేశం తన ఆర్థిక వ్యవస్థ ను పటిష్ఠం చేసుకోవడమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను కూడా పటిష్ఠం చేసింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు ఏడు శాతానికి పై బడి వృద్ధిని భారతదేశం జోడిస్తోంది. ద్రవ్యోల్బణం, విత్త లోటు, ఆర్థిక లోటు, జిడిపి వృద్ధి, ఎఫ్ డిఐ ల రాక వంటి అన్ని స్థూల ఆర్థిక సూచికలలో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంది.
ఈ రోజు ప్రపంచంలో భారతదేశాన్ని గురించి ఏ చర్చ జరిగినా అది ఆశ, విశ్వాసాల ప్రాతిపదికన జరుగుతోంది. ప్రపంచం లోని పలు రేటింగ్ ఏజెన్సీలు భారతదేశం యొక్క రేటింగు ను పెంచడానికి కారణం ఇదే.
• ఇవాళ భారతదేశం ప్రపంచం లోని మూడు అగ్రశ్రేణి ఔత్సాహిక ఆతిథ్య ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది.
• ఎఫ్ డిఐ విశ్వాస సూచిలో రెండు అగ్రగామి మార్కెట్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది.
• అంక్టాడ్ కు చెందిన ప్రపంచ పెట్టుబడుల నివేదిక భారతదేశానికి అత్యంత ఆకర్షణీయమైన ఎఫ్ డిఐ గమ్యం గా అగ్ర స్థాయి రేటింగు ను ఇచ్చింది.
• ప్రపంచ బ్యాంకు వ్యాపారానుకూల సూచి లో మూడేళ్ల కాలంలో మనం 42 స్థానాలు పైకి ఎదిగాం.
• 2017-18 మూడో త్రైమాసికంలో భారతదేశం 7.2 శాతం వృద్ధి రేటు ను సాధించింది. ఈ వృద్ధి రేటు మరింతగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
• 2014 సంవత్సరానికి ముందు భారత పన్ను వ్యవస్థ ఇన్వెస్టర్ లకు ఏ మాత్రం స్నేహపూర్వకం కానిది, ఊహాతీతమైంది, పారదర్శక రహితమైందని భావించే వారు. ఈ రోజు ఆ అభిప్రాయం మారింది. జిఎస్ టి తో ప్రపంచం లో అతి పెద్ద ఆర్థిక విపణులలో ఒకటి గా భారతదేశం స్థానం స్థిరం అయింది.
మిత్రులారా,
పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను పరిగణన లోకి తీసుకొని సమగ్ర దృక్పథం తో ప్రభుత్వం పని చేస్తోంది.
రైజ్ – విద్యారంగంలో మౌలిక వసతలు, వ్యవస్థ పునరుజ్జీవం- పేరిట ఒక కొత్త పథకాన్ని ఈ బడ్జెటు లో ప్రవేశపెట్టాం. ఈ పథకంలో భాగంగా దేశంలో విద్యావ్యవస్థ మెరుగుదలకు వచ్చే నాలుగు సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనుంది.
దేశంలో 20 ప్రపంచ శ్రేణి ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉన్నత విద్య రంగం లోని ప్రభుత్వ సంస్థ లతో, ప్రైవేటు సంస్థ లతో కలిసి మేం కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రంగం లోని ఎంపిక చేసిన 10 సంస్థలకు 10 వేల కోట్ల రూపాయలు గ్రాంటుగా అందిస్తున్నాం.
స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా ల వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశ యువతీయువకులలో స్వతంత్రోపాధి ధోరణులను, ప్రత్యేకించి ఎమ్ఎస్ ఎమ్ఇ రంగంలో ఆంత్రప్రెన్యోర్ శిప్ ను ప్రోత్సహిస్తున్నాం.
మహిళల, యువతీయువకుల సాధికారిత కు ప్రధాన మంత్రి ముద్రా యోజన బలమైన మాధ్యమంగా నిలచింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మా ప్రభుత్వం 11 కోట్ల కు పైగా రుణాలకు ఆమోదం తెలిపింది. ఎలాంటి బ్యాంకు పూచీకత్తు తో పని లేకుండానే 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలను వితరణ చేశాం. ఈ సంవత్సర బడ్జెటు లో మరో 3 లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించాం.
ఒక పుష్ప గుచ్ఛాన్ని చూసినట్టుగా ఈ చర్యలన్నింటినీ ఒక చోట చేర్చి చూసినట్టయితే మధ్యతరగతి, పట్టణ యువత ఆకాంక్షలను నెరవేర్చడం, కొత్త ఉపాధి అవకాశాలు అందించడం కోసం జరిగిన కృషిగా గుర్తించవచ్చు.
అభివృద్ధిలో ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న ప్రాంతానికి లేదా ప్రాంతానికి చెందిన వాడుగా సరైన ప్రోత్సాహం లభించి వేగంగా ముందుకు కదలి, న్యాయబద్ధమైన వాటా ను పొందగలిగినట్టయితే రైజింగ్ ఇండియా కథ వాస్తవం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేయగలుగుతున్నాను.
చివరలో, మీ అందరికీ మరో సారి 2022 నాటి లక్ష్యాలను గుర్తు చేస్తున్నాను. సంకల్ప బలంతో లక్ష్యాలను నిర్దేశించుకుని పయనం సాగించమని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలు కొత్త సంకల్పాన్ని దేనినైనా తీసుకొన్నాయా ? మీరు ఏదైనా మార్గ సూచిని సిద్ధం చేశారా ? 2022 కల్లా న్యూ ఇండియా కల ను సాకారం చేయడానికి సహాయపడేలా మీరేమైనా ఆలోచించారా ?
ప్రసార మాధ్యమాల లోని మిత్రులారా, మీరంతా కూడా సవాళ్లను అంగీకరించి వాటి పరిష్కారానికి సంకల్పం తీసుకొని దానిని మీ చానల్స్ లో ప్రసారం చేసినట్టయితే నేను ఎంతో ఆనందిస్తాను.
మిత్రులారా,
125 కోట్ల మంది భారతీయులు దేవతల వంటి వారే. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క విభాగం దేశ సంక్షేమం, జాతి నిర్మాణం, నిర్దిష్ట కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేయడం లక్ష్యాలుగా ముందుకు సాగాలి.
మీలో ఏ సంకల్పాలు ఉన్నప్పటికీ- మిత్రులారా- అవి నెరవేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మరో మారు మీ అందరికీ నేను అనేకానేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.
Read Full Presentation Here