మీకు అందరికీ శుభాకాంక్షలు.
ఇక్కడకు పెద్ద సంఖ్య లో విచ్చేసిన ప్రియమైన నా రాజ్ గఢ్ సోదరులు మరియు సోదరీమణులారా,
సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఈ జూన్ నెల లో కూడా మీరందరూ పెద్ద సంఖ్య లో ఇక్కడకు రావడం నాకు, నా సహచరులకు లభించిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు నా అభినందనలు. మీ ఉత్సాహం, ఆశీర్వాదాలు భారతీయ జనతా పార్టీ సభ్యులను సదా ప్రోత్సహిస్తూ మీకు మరింత సమర్థంగా సేవలు అందించేలా చేస్తున్నాయి. ఈ రోజున 4000 కోట్ల రూపాయల విలువైన మోహన్ పురా నీటిపారుదల ప్రాజెక్టు తో పాటు మరో మూడు ప్రధాన నీటి సరఫరా పథకాలను ప్రారంభించే అవకాశం నాకు లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పథకాలలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ.. తలపై ఇటుకలు మోసుకువచ్చిన వారు, పార తో మట్టి ని తవ్విన వారు సహా చిన్న యంత్రాలను,పెద్ద యంత్రాలను నడిపించిన వారు, సోదరులు, సోదరీమణులు, మాతృమూర్తులు అందరికీ.. నమస్కరిస్తూ అభినందనలు తెలుపుతున్నాను. జాతి నిర్మాణం అనేటటువంటి ఈ పవిత్ర కార్యం లో వారి నిబద్ధత అసమానం.
ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,
ఓ మీట నొక్కి పథకాలను ప్రారంభించడం కేవలం లాంఛనప్రాయమే. వాస్తవానికి ఇవన్నీ మీ కఠోర శ్రమ, మీరు ధారపోసిన స్వేదంతో శ్రీకారం చుట్టుకున్నాయి. ప్రజా సంక్షేమ నిర్ణయాలను తీసుకొంటూ వచ్చిన కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ సేవ లో నాలుగు సంవత్సరాల పాలన కాలాన్ని మీ ఆశీస్సులతో, కృషితో విజయవంతంగా పూర్తి చేసింది. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరు కావడమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైనా, విధానాల మీదా మీకు అచంచల విశ్వాసం ఉందన్న వాస్తవానికి నిదర్శనం. అవాస్తవాల ప్రచారంతో అయోమయం సృష్టిస్తూ నిరాశావాదాన్ని వ్యాపింపజేసే వారికి ఈ క్షేత్ర స్థాయి వాస్తవాలు ఏ మాత్రం తెలియవు.
నేడు.. ఈ జూన్ 23న మహనీయుడైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కావడం యాదృచ్ఛికం. ఇదే రోజున నిగూఢ పరిస్థితుల నడుమ కశ్మీర్ లో ఆయన మరణించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన ను స్మరించుకొని, నమస్కరిస్తూ శ్రద్ధాంజలి ఘటించదలచాను.
సోదరులు మరియు సోదరీమణులారా,
“ఏ దేశమైనా తన సొంత శక్తియుక్తుల తోనే తనను తాను రక్షించుకోగలదు” అని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చెబుతూ ఉండే వారు. దేశ ప్రజల సామర్థ్యంపై, వనరులపై ఆయనకు అపార విశ్వాసం ఉండేది. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ప్రజలలో నెలకొన్న నిరాశను నిస్పృహను పారదోలడంలో ఆయన చూపిన దార్శనికత నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. స్వతంత్ర దేశ తొలి పరిశ్రమలు-సరఫరాల శాఖ మంత్రిగా మొట్టమొదటి జాతీయ పారిశ్రామిక విధానానికి ఆయన ఓ రూపాన్ని ఇచ్చారు. “ప్రభుత్వం, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కలసికట్టుగా పరిశ్రమలను ప్రోత్సహించగలిగితే మన దేశం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించగలదు” అని ఆయన తరచుగా చెప్పే వారు. విద్య, మహిళా సాధికారిత, అణు శక్తి తదితరాలకు సంబంధించి ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, కృషి కాలానికి ముందు ఉండేవి. దేశాభివృద్ధి లో ప్రజా భాగస్వామ్యానికి గల ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చూపిన బాట నేటికీ అనుసరణీయం.
మిత్రులారా,
“పేదల, నిరాశ్రయుల సేవతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం” అని కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చెబుతూ ఉండే వారు. అందుకే పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు బెంగాల్ ఆర్థిక శాఖ మంత్రి గా భూ సంస్కరణల అమలుకు ఆయన గణనీయంగా కృషి చేశారు. పరిపాలన అంటే పౌరుల కలలను పండించడమే తప్ప బ్రిటిష్ పాలకుల మాదిరిగా ఏలడం కాదు అన్నది ఆయన దృఢ విశ్వాసం.
విద్య, ఆరోగ్యం, భద్రత లకు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. “ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వం తగిన సదుపాయాలను కల్పించాలి. అలాగే యువతరం వారి యొక్క పల్లెలకు, పట్టణాలకు చురుకుగా సేవలను అందించగలిగేలా వారిలో నిగూఢంగా ఉన్న శక్తిసామర్థ్యాలను వెలికితీయగల వాతావరణాన్ని సృష్టించాలి” అని ఆయన చెప్పే వారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవిత కాలంలో విజ్ఞానం, సంపద, అభివృద్ధి పరస్పర ఆధారితాలై ఒకే రూపంలో ఇమిడిపోయాయి.
ఓ కుటుంబాన్ని ప్రత్యేకించి గొప్పగా చూపడం కోసం భరత మాత ముద్దుబిడ్డలైన మహనీయుల విజయాలను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టడం మన దేశం చేసుకున్న దురదృష్టం. అంతేకాకుండా ప్రజా సంక్షేమం కోసం వారు చేసిన వారి అవిరామ కృషి ని ప్రజల మనస్సులలో నుండి తుడిచిపెట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి.
మిత్రులారా,
కేంద్రం లోని, రాష్ట్రాల లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల దృక్పథం కూడా డాక్టర్ ముఖర్జీ దార్శనికత వంటిదే. స్కిల్ ఇండియా మిశన్, స్టార్ట్- అప్ ఇండియా మిశన్, స్వతంత్రోపాధి ని ప్రోత్సహించేందుకు పూచీకత్తు లేని బ్యాంకు రుణాలను అందించే ముద్ర యోజన లేదా మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలన్నింటిలో డాక్టర్ ముఖర్జీ దార్శనికత ను మీరు గమనించవచ్చు.
మీ రాజ్ గఢ్ ఇక ఎంతమాత్రం వెనుకబడిన జిల్లా కాదు. దీనిని ఆకాంక్షభరిత జిల్లాలలో ఒకటిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇక్కడ ఆరోగ్యం, విద్య, పరిశుభ్రత, పోషణ విజ్ఞానం, జల సంరక్షణ, ఇంకా వ్యవసాయం తదితర రంగాలలో కృషి ని వేగవంతం చేయడం జరుగుతుంది.
ఆకాంక్షభరిత జిల్లాల్లోని గ్రామాలకు రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించబడతాయి. ఈ జిల్లాల్లోని ప్రతి గ్రామంలో ఉజ్వల యోజన లో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ ల మంజూరు కు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు సౌభాగ్య యోజన లో భాగంగా విద్యుత్తు కనెక్షన్, జన్ ధన్ యోజన లో భాగంగా బ్యాంకు ఖాతా తో పాటు బీమా రక్షణ, మిశన్ ఇంద్రధనుష్ లో భాగంగా గర్భవతులు- పిల్లలకు టీకాలు వంటివన్నీ అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా,
మునుపటి ప్రభుత్వాలు కూడా ఇవన్నీ చేసి ఉండొచ్చు.. వారిని ఆపిన వారు ఎవరూ లేరు.. కానీ, అత్యధిక కాలం దేశాన్ని పాలించిన ఒక పార్టీ కి మీ మీద, మీ కఠోర శ్రమ మీద విశ్వాసం లేదు. ఈ దేశానికి గల సామర్థ్యాన్ని అది ఎంతమాత్రం విశ్వసించలేదు.
నాకు చెప్పండి.. ఈ కేంద్ర ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాలలో ఎన్నడైనా నైరాశ్యానికి గురిచేసే ఒక్కమాట మాట్లాడిన సందర్భం ఉందా ? ఇది సాధ్యం కాదన్న మాట మా నోట ఎన్నడైనా వినిపించిందా ? మా సంకల్ప సిద్ధి కి తగినట్లుగా మేం సదా చర్యలు తీసుకుంటూ మరింత మెరుగైన ఫలితాల కోసం శ్రమిస్తూ వున్నాము.
కాబట్టి… సోదరులు మరియు సోదరీమణులారా,
ఆశావాదంతో, దృఢ విశ్వాసం తో ముందడుగు వేయడాన్ని మేము నమ్ముకున్నాము.
మిత్రులారా,
దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వనరులపై విశ్వాసం తో ఈ 21వ శతాబ్దం లో దేశాన్ని అత్యున్నత ప్రగతి శిఖరాలకు చేర్చడానికి ఈ ప్రభుత్వం నిబద్ధతతో నిరంతరం కఠోరంగా శ్రమిస్తోంది. సమాజం లోని పేదలు, వెనుకబడిన- అణగారిన, అవకాశాలు అందని వర్గాలతో పాటు రైతుల సాధికారిత కోసం నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, 13 సంవత్సరాలుగా మధ్య ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తున్నాయి. గడచిన 5 సంవత్సరాలలో మధ్య ప్రదేశ్ లో వ్యవసాయ రంగంలో సరాసరి వార్షిక వృద్ధి దాదాపు 18 శాతంగా ఉంది. ఇది దేశంలోకెల్లా అత్యధిక స్థాయి వృద్ధి. పప్పు ధాన్యాలు, నూనెగింజలు, సెనగ, సోయ్ బీన్, టోమాటో, వెల్లుల్లి వంటి పంటల ఉత్పాదకత లో మధ్య ప్రదేశ్ రాష్ట్రం దేశంలోకెల్లా అగ్రగామి గా ఉంది. గోధుమ, కంది, ఆవాలు, ఉసిరి, కొత్తిమీర ఉత్పత్తి లో రెండో స్థానం లో ఉన్న మధ్య ప్రదేశ్ అగ్ర స్థానం దిశగా పరుగులు తీస్తోంది.
ముఖ్యమంత్రి శివరాజ్ గారి పాలనలో మధ్య ప్రదేశ్ అభివృద్ధిలో ఒక కొత్త గాథను లిఖించింది. మోహన్ పురా నీటిపారుదల పథకం ప్రారంభం తో పాటు మరో మూడు నీటి సరఫరా పథకాల పనులను మొదలుపెట్టడం ఈ అధ్యాయం లో ఓ ముఖ్యమైన భాగం. ఈ పథకం ఒక్క రాజ్ గఢ్ కే కాకుండా మొత్తం మధ్య ప్రదేశ్ లో కూడా గొప్ప ప్రాజెక్టు లలో ఒకటి.
మిత్రులారా,
రాష్ట్రం లోని సుమారు 725 గ్రామాల రైతు సోదరులు మరియు సోదరీమణులు ఈ ప్రాజెక్టు తో లబ్ధి ని పొందుతారు. ఈ గ్రామాల్లోని 1.25 లక్షల హెక్టార్ల సాగుభూములకు దీని నుండి నీరు సరఫరా అవుతుంది. అంతేకాదు.. మరో 400 గ్రామాలకు తాగునీటి సమస్య తీరిపోతుంది. అంటే.. ఈ గ్రామాల్లోని లక్షలాది మాతృమూర్తుల, సోదరీమణుల ఆశీర్వాదాలు మాపై అపారంగా వర్షిస్తాయి. నీటి ఎద్దడి ఎంత బాధకరమో మాతృమూర్తులు, సోదరీమణుల కన్నా బాగా తెలిసిన వారు మరెవరూ ఉండరు. ఈ దృష్టికోణం లో ఈ ప్రాజెక్టును మాతృమూర్తులకు, సోదరీమణులకు అత్యంత ఉన్నత స్థాయి సేవగా పేర్కొనవచ్చు.
ఇది వేగవంతమైన ప్రగతికి మాత్రమే కాక లక్ష్య సాధన లో ప్రభుత్వ పట్టుదలకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ ప్రాజెక్టు దాదాపు నాలుగు సంవత్సరాలలోనే పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు సూక్ష్మ నీటి పారుదల ప్రధానంగా నిర్మితమైంది. అందుకే భారీ కాలువ తవ్వకానికి బదులుగా గొట్టపు మార్గాలు వేయడానికి ప్రాధాన్యం ఇవ్వబడింది.
సోదరులు మరియు సోదరీమణులారా,
మాళవీ భాషలో ‘‘మాళవ్ ధర్తీ గగన్ గంభీర్.. డగ్-డగ్‌రోటీ .. పగ్-పగ్‌నీర్’’ అనే నానుడి ఉంది- దీని భావం ‘‘మాళవ భూమిలో ఒకనాడు ధాన్యానికి గాని, నీటికి గాని కొరత అన్న మాటే లేదు. అడుగడుగునా నీరు దొరికేది’’ అని. అయితే, మునుపటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నీటి కొరత వచ్చి పడింది. శివరాజ్ గారి నాయకత్వం లో గత కొన్ని సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ హయాములో మాళవ యొక్క, మధ్య ప్రదేశ్ యొక్క పాత గుర్తింపు పునరుద్ధరణకు గంభీరమైన కృషి చోటు చేసుకొంది.
మిత్రులారా,
మధ్య ప్రదేశ్ లో 2007 నాటికి నీటిపారుదల పథకాల కింద కేవలం 7.5 లక్షల హెక్టార్ల భూమి సాగు అయ్యేది. శివరాజ్ గారి పాలన లో అది 40 లక్షల హెక్టార్ల కు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 కల్లా దీనిని రెట్టింపు చేసే యోచనలో ఉందని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న టెలివిజన్ ప్రేక్షకులకు చెబుతున్నాను. సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ ను విస్తరించడం కోసం ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
అయితే, నిర్దేశిత లక్ష్యాన్ని మించి ప్రగతి సాధించే కృషిలో కేంద్ర ప్రభుత్వం మీతో చేయి కలిపి నడుస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాను. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎంకెఎస్ వై) ద్వారా కూడా మధ్య ప్రదేశ్ లబ్ధి ని పొందుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రం లో 14 ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. ఈ పథకం లో భాగంగా రాష్ట్రానికి 1400 కోట్ల రూపాయలను కేటాయించాము. అలాగే ఈ పథకంలో భాగంగా ‘ప్రతి చుక్క కు మరింత పంట’ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుపోతున్నాము. గత నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న ఈ నిర్విరామ కృషి ఫలితంగా దేశంలో సూక్ష్మ నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణం 25 లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఇందులో 1.5 లక్షల హెక్టార్ల భూమి మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందినదే.
మిత్రులారా,
ప్రభుత్వ పథకాల గురించి నమో యాప్, వీడియో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భిన్న వర్గాల ప్రజలతో నేను మాట్లాడుతుండడం మీరు చూసే వుంటారు. ఆ మేరకు మూడు రోజుల కిందటే నేను దేశం లోని రైతులతో మాట్లాడాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఝబువా లోని రైతు సోదరులు మరియు సోదరీమణులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. డ్రిప్ ఇరిగేశన్ విధానం తో తమ పొలంలో టొమాటో పంట దిగుబడి ఎలా పెరిగిందో ఒక రైతు సోదరి ఈ సందర్భంగా చాలా ఆనందంతో తెలిపింది.
మిత్రులారా,
దేశం లోని గ్రామాలు, వాటిలో నివసించే రైతులు న్యూ ఇండియా నిర్మాణ స్వప్న సాకారంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. అందుకే న్యూ ఇండియా ఆవిష్కృతం అయ్యే సరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం అవిరామంగా కృషి చేస్తున్నాము. ఈ దిశగా విత్తనాల నుండి పంటను మార్కెట్ చేర్చే దాకా వ్యవసాయ సంబంధిత అంశాలన్నింటా సౌకర్యాల కల్పన కు చర్యలు తీసుకుంటున్నాము.
మిత్రులారా,
దేశవ్యాప్తంగా నాలుగు సంవత్సరాల వ్యవధి లో 14 కోట్ల భూమి స్వస్థత కార్డులు పంపిణీ చేయగా అందులో 1.25 కోట్ల కార్డులు మధ్య ప్రదేశ్ రైతు సోదరులు మరియు సోదరీమణులకు ఇవ్వబడ్డాయి. ఈ కార్డుల తోడ్పాటు తో రైతు సోదరులు వారి భూమి లోని సారాన్ని బట్టి సరిపడినంత ఎరువులు మాత్రమే వాడుకునే వీలు కలిగింది. అదే విధంగా రాష్ట్రం లోని 35 లక్షల మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎం ఎఫ్ బివై)లో భాగంగా లబ్ధి ని పొందుతున్నారు. రైతులు వారు పండించిన పంట కు సముచిత ధర ను పొందగలిగేలా దేశం లోని మండీలన్నింటినీ ‘ఇ-ఎన్ఎమ్’ పేరిట ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ విపణితో అనుసంధానించాము. ఇప్పటి దాకా దాదాపు 600 మండీలు ఇ-ఎన్ఎఎమ్ వేదిక తో సంధానం కాగా, అందులో మధ్య ప్రదేశ్ కు చెందిన 58 మండీలు ఉన్నాయి. రైతులు వారి గ్రామాల నుండే సామూహిక సేవా కేంద్రాలు లేదా మొబైల్ ఫోన్ ల ద్వారా దేశంలో ఎక్కడైనా వారి పంటను విక్రయించుకోగల రోజు మరెంతో దూరంలో లేదు.
సోదరులు మరియు సోదరీమణులారా,
గ్రామసీమ లతో పాటు పేదల జీవన ప్రమాణాల మెరుగు కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేకించి దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల తల్లులు, అక్కచెల్లెళ్లను విషపూరిత పొగనుండి విముక్తులను చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది.
ఇంతవరకు 4 కోట్ల మందికిపైగా మాతృమూర్తులు, సోదరీమణులు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్ లను పొందారు. మధ్య ప్రదేశ్‌లోనూ 40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్ష్లన్ లు మంజూరు అయ్యాయి.
మిత్రులారా,
కఠోర శ్రమ పట్ల ఈ ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉంది. ఆ మేరకు ఇవాళ గరిష్ఠంగా ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యం గల నవ పారిశ్రామికులను ప్రోత్సహించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. శ్రమ పట్ల కొందరు వ్యతిరేక వైఖరిని కలిగివున్నప్పటికీ ఈ ప్రభుత్వం యొక్క కృషి సఫలీకృతం కావడాన్ని ప్రతి ఒక్కరూ చూడవచ్చు.
నేడు ‘ముద్ర’ యోజన లో భాగంగా చిన్న నవపారిశ్రామికులు బ్యాంకుల నుండి ఎలాంటి హామీ లేకుండా రుణాలను పొందగలుగుతున్నారు. మధ్య ప్రదేశ్ లో 85 లక్షల మందికిపైగా ఈ పథకం లో భాగంగా లబ్ధిని పొందారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఢిల్లీ, భోపాల్ నగరాల్లోని ఈ జంట ప్రగతి చోదకాలు సమష్టిగా మధ్య ప్రదేశ్ ను ముందుకు నడుపుతున్నాయి. నాకు గుర్తుంది.. ఒకనాడు రోగగ్రస్థ పరిస్థితిలో గల మధ్య ప్రదేశ్ ను అభివర్ణించడానికి ‘బీమారు’ (రోగిష్టి) అనే అవమానకర పదాన్ని ప్రయోగించే వారు. ఈ పదాన్ని వినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, దేశం లోని ‘రోగగ్రస్త’ రాష్ట్రాల జాబితా లో మధ్య ప్రదేశ్ కూడా చేర్చబడింది. మధ్య ప్రదేశ్ కు ఘోర అవమానం ఆపాదించబడిందని అప్పటికి సుదీర్ఘ కాలం నుండి రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గుర్తించలేదు.
నాటి పాలకులు సామాన్య జనాన్ని తమ సేవకులుగా పరిగణిస్తూ తమ గురించి పొగిడించుకునే వారు. మధ్య ప్రదేశ్ భవిష్యత్తు ను గురించి వారు ఎన్నడూ శ్రద్ధ చూపలేదు.
అయితే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మధ్య ప్రదేశ్ ను రోగగ్రస్త పరిస్థితి నుండి బయటకు తీసుకువచ్చి దేశాభివృద్ధిలో ఒక భాగస్వామిని చేసింది. మీరు శివరాజ్‌గారిని ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకోగా ఈ ప్రాంతం కోసం, ప్రజల ప్రగతి కోసం ఆయన ఓ సేవకుడిలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
విజయపథంలో ముందుకు సాగుతున్న మధ్య ప్రదేశ్ ప్రజలను, ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.
మరోసారి మీకందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇంత భారీ సంఖ్య లో ఇక్కడకు తరలి వచ్చినందుకు ధన్యవాదాలు.
మీ పిడికిళ్లు బిగించి మరి నాతో పాటు బిగ్గరగా పలకండి –
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
అనేకానేక ధన్యవాదాలు.