మహిళలు మరియు సజ్జనులారా,
సెల్వి జయలలిత గారి జయంతి సందర్భంగా ఆమెకు ఇదే నా నివాళి. మీ అందరికీ నా అభినందనలు మరియు శుభాకాంక్షలూను. ఆవిడ ఎక్కడ ఉన్నప్పటికీ మీ ముఖాల్లో ప్రసన్నతను చూసి, తాను తప్పక చాలా ఆనందపడుతూ ఉంటారని నాకనిపిస్తోంది.
ఆమె కలల ప్రాజెక్టులలో ఒకటైనటువంటి అమ్మ టూ వీలర్ పథకాన్ని ఈ రోజు నేను ప్రారంభించగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అమ్మ 70వ జయంతి నాడు తమిళ నాడు అంతటా 70 లక్షల మొక్కలను నాటబోతున్నారని నా దృష్టికి వచ్చింది. ఈ రెండు కార్యక్రమాలు మహిళా సాధికారితలోను మరియు ప్రకృతి పరిరక్షణలోను అమిత ప్రభావాన్ని ప్రసరించగలవు.
మిత్రులారా,
మనం ఒక కుటుంబంలో ఒక మహిళకు సాధికారితను అందించామంటే మనం మొత్తం కుటుంబాన్ని సాధికారపరచామన్న మాటే. ఒక మహిళను విద్యావంతురాలిని చేసినట్టయితే, మొత్తం కుటుంబం విద్యావంతం అవుతుంది. ఒక మహిళను ఆరోగ్యవంతురాలిగా చేయగలిగితే, మొత్తం పరివారం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక మహిళకు భద్రతను కల్పించగలిగితే, మొత్తం ఇంటి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ఈ దిశగా మేం కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
సగటు పౌరునికి అతడు “సరళంగా జీవించే”టట్టు వసతులను మెరుగుపరచడం పైన కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది. మా కార్యక్రమాలు, పథకాలన్నింటి ప్రధాన లక్ష్యం ఇదే. అందరికీ చేరువగా ఆర్థిక సేవలు కానివ్వండి, లేదా రైతులకు మరియు చిన్న వ్యాపారస్తులకు సులభంగా రుణ లభ్యత కానివ్వండి, లేదా ఆరోగ్య రక్షణ కానివ్వండి, లేదా పారిశుధ్యం కానివ్వండి.. ఇదే మూల మంత్రంగా కేంద్రం లోని ఎన్ డిఎ ప్రభుత్వం పని చేస్తోంది.
ప్రధాన మంత్రి ముద్ర యోజన లో భాగంగా 11 కోట్ల కు పైగా రుణాలను మంజూరు చేయడమైంది. నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలను ఎలాంటి బ్యాంకు పూచీకత్తు లేకుండా ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, లబ్ధిదారులలో 70 శాతం మంది మహిళలున్నారు.
మహిళలు పాతకాలం నాటి బంధనాలు తెంచుకొని వెలుపలకు వచ్చి స్వతంత్రోపాధిని కల్పించాలని కోరుతున్నారనేందుకు ఈ పథకం సాధించిన విజయమే తార్కాణం. మహిళా సాధికారిత దిశగా మేం ఇంకా ఎన్నో చర్యలు తీసుకున్నాం. కొత్తగా ఉద్యోగాల్లో చేరే మహిళలు వారి వేతనం నుండి ఇపిఎఫ్ కు జమ చేయాల్సిన వాటా మూడేళ్ల కాలపరిమితికి లోబడి 12 శాతం నుండి 8 శాతానికి తగ్గించినట్టు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించాం. అదే సమయంలో యజమాని ఇపిఎఫ్ కు ఉద్యోగి ఒక్కొక్కరిపై చెల్లించాల్సిన వాటా మాత్రం 12 శాతంగానే కొనసాగుతుంది.
స్టాండ్- అప్ ఇండియా పథకం లో భాగంగా మహిళా నవ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల నుండి ఒక కోటి రూపాయల విలువైన రుణాలను ఇవ్వడం జరుగుతోంది. ఫ్యాక్టరీల చట్టంలోనూ మేం మార్పులు చేశాం; మహిళలు రాత్రి పూట షిఫ్టు లో కూడా పని చేసే అవకాశం కల్పించవలసిందిగా రాష్ట్రాలకు సూచన చేశాం. మేం మాతృత్వపు సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పొడిగించాం కూడాను.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా ఇంటి రిజిస్ట్రేశన్ మహిళ పేరు మీద జరుగుతోంది.
జన్ ధన్ యోజన కూడా పెద్ద ఎత్తున లాభాలను మహిళలకు అందించింది. 31 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాలలో 16 కోట్ల ఖాతాలు మహిళలకు చెందినవే ఉన్నాయి.
మహిళల కు చెందిన మొత్తం బ్యాంకు ఖాతాల శాతం 2014 సంవత్సరంలో 28 శాతం గా ఉండగా, ప్రస్తుతం 40 శాతానికి వృద్ధి చెందింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం మహిళలకు గౌరవాన్ని మరియు దర్జాను ఇచ్చింది. గౌరవం మరియు దర్జా అనేవి మహిళల హక్కులు కూడాను. దేశంలో గ్రామీణ పారిశుధ్య వసతుల పరిమాణం 40 శాతం నుండి 78 శాతానికి విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో బాలికలకు మరుగుదొడ్లను నిర్మించేందుకు మేము ఒక ఉద్యమ స్ఫూర్తితో కృషి చేశాం.
మిత్రులారా,
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సాధికారిత పైన కూడా దృష్టి పెడుతూనే, ప్రకృతిని పరిరక్షిస్తున్నాయి కూడాను. ఉజాలా పథకంలో భాగంగా ఇంతవరకు 29 కోట్ల ఎల్ ఇడి బల్బులను పంపిణీ చేయడమైంది. ఇది కరెంటు బిల్లులలో 15 వేల కోట్ల రూపాయల ఆదాకు దారితీసింది. ఇవి వాతావరణంలో బొగ్గుపులుసు వాయువుల ను గణనీయ స్థాయికి తగ్గించాయి.
ఉజ్జ్వల యోజన లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 3.4 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్ లను ఇచ్చింది. మహిళలు పొగకు తావు లేని వాతావరణం నుండి లబ్ధిని పొందగా, కిరోసిన్ వినియోగంలో తగ్గుదల సైతం పర్యావరణానికి మేలు చేస్తోంది. ఈ పథకం ద్వారా తమిళ నాడు లో 9.5 లక్షల మంది మహిళలు ప్రయోజనాన్ని పొందారు.
గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ సరఫరా, పారిశుధ్యం అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం గోబర్- ధన్ పథకంతో ముందుకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా లభించే పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్, బయో-గ్యాస్, బయో-సిఎన్ జిగా మార్చడం ఈ పథకం ఉద్దేశం. ఇది ఆదాయాలను పెంచడంతో పాటు గ్యాస్ పైన పెట్టే ఖర్చును తగ్గిస్తుంది.
మిత్రులారా,
ప్రస్తుతం తమిళ నాడు లో కేంద్రం 24 వేల కోట్ల రూపాయల విలువ గల ప్రాజెక్టులు అమలుపరుస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ ఎన్ డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినవే. వీటిలో సౌర విద్యుత్తు కర్మాగారాలు, ముడి చమురు గొట్టపుమార్గాలు, జాతీయ రహదారులు, నౌకాశ్రయ సంబంధిత పనులు ఉన్నాయి. చెన్నై మెట్రో రైల్ కు 3700 కోట్ల రూపాయలకు పైగా మంజూరు చేయడమైంది.
గతంలో కాంగ్రెస్ నాయకత్వం లోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా, 13వ ఆర్థిక సంఘం ద్వారా తమిళనాడు 81 వేల కోట్ల రూపాయలు అందుకొంది. ఎన్ డిఎ అధికారంలోకి వచ్చిన అనంతరం, 14వ ఆర్థిక సంఘం ద్వారా తమిళ నాడు 1 లక్ష 80 వేల కోట్ల రూపాయలను అందుకొంది. ఇది 120 శాతం అధికంగా ఉంది.
ప్రతి పేద వ్యక్తికి 2022 కల్లా ఒక ఇంటిని సమకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గడచిన మూడు సంవత్సరాలలో దాదాపు ఒక కోటి గృహాలను నిర్మించడమైంది.
గ్రామీణ గృహ నిర్మాణం కోసం, తమిళ నాడుకు 2016-17 లో సుమారు 700 కోట్ల రూపాయలు, 2017-18 లో సుమారు 200 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పట్టణ గృహ నిర్మాణం కోసం రాష్ట్రానికి ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడమైంది.
మిత్రులారా,
తమిళ నాడు కు చెందిన రైతులు కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుండి లాభపడ్డారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు తమిళ నాడు లో 2600 కోట్ల రూపాయలకు పైగా విలువైన క్లెయిము సొమ్మును వ్యవసాయదారులకు ఇచ్చినట్లు నా దృష్టికి తీసుకువచ్చారు.
నీలి విప్లవం పథకంలో భాగంగా తమిళ నాడు లో చేపల వేటను ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. లాంగ్ లైనర్ ట్రాలర్ ల కొనుగోలుకై మత్స్యకారులకు మేం ఆర్థిక సహాయాన్ని సమకూర్చుతున్నాం. గత సంవత్సరంలో, 750 పడవలను లాంగ్ లైనర్ ట్రాలర్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేం 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆ తరహా ట్రాలర్లు మత్స్యకారుల జీవితాలను మరింత సరళతరం చేయడంతో పాటు వారు మరింతగా ఆర్జించేందుకు కూడా తోడ్పడుతాయి.
భారతదేశానికి విస్తారంగా ఉన్నటువంటి సముద్ర వనరులు, సుదీర్ఘమైన కోస్తా తీరం అపార అవకాశాలను ప్రసాదిస్తోంది. మన లాజిస్టిక్స్ రంగాన్ని ప్రక్షాళనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సాగర్ మాల కార్యక్రమంపై కృషి చేస్తోంది. ఇది దేశీ, విదేశీ వాణిజ్యం యొక్క ఖర్చులను తగ్గించగలుగుతుంది. ఇది భారతదేశంలో కోస్తా తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలకు కూడా లాభం చేకూర్చుతుంది.
మేము ఇటీవలి కేంద్ర బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించాం. దీని లో భాగంగా ప్రతి ఒక్క పేద కుంటుంబానికి ఏడాదికి ఐదు లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్య చికిత్సల సదుపాయాన్ని గుర్తించిన ఆస్పత్రులలో అందించడం జరుగుతుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా 45 నుండి 50 కోట్ల మంది ప్రజలకు మేలు చేస్తుంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన మరియు జీవన్ జ్యోతి యోజన లు దేశంలో 18 కోట్ల మందికి పైగా ప్రజలకు బీమా రక్షణను అందించాయి. మేము 800కు పైగా జన్ ఔషధి కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు మందులను అందించేటటువంటి చర్యలను కూడా తీసుకొన్నాం.
ప్రజల జీవితాలలో ఒక సకారాత్మకమైన పరివర్తనను తీసుకు వచ్చేందుకు తీవ్ర కృషి చేయాలని మేం నిబద్ధులమై ఉంటాం.
సెల్వి జయలలిత గారికి మరో సారి నేను వందనాలు తెలియచేసుకొంటున్నాను. మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
మీకు ధన్యవాదాలు.
బహుథా ధన్యవాదాలు.