గౌరవనీయ మంత్రులు, వివిధ దేశాల ప్రముఖులు, భాగస్వామ్య దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు, కార్పొరేట్ ప్రముఖులు, ఆహ్వానితులు, ఈ సదస్సు లో పాల్గొంటున్న ప్రతినిధులు, వేదిక ను అలంకరించిన యువ మిత్రులు, మహిళలు మరియు సజ్జనులారా,
మీ అందరికీ వైబ్రంట్ గుజరాత్ 9 వ చాప్టర్ లో పాలుపంచుకొనేందుకు స్వాగతం పలుకుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
మీరు చూసినట్టయితే, ఇది ఇప్పుడు నిజమైన గ్లోబల్ ఈ వెంట్. ఇక్కడ అందరికీ అవకాశం ఉంది. సీనియర్ రాజకీయ నాయకులు ఇక్కడ మనకు దర్శనమిస్తుండడం ఎంతో గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సి.ఇ.ఒలు కార్పొరేట్ నాయకుల శక్తి కనిపిస్తోంది. ఆయా సంస్థలు, ఒపీనియన్ మేకర్లు, అలాగే యువ వాణిజ్యవేత్తలు,స్టార్టప్ ల శక్తి కనిపిస్తోంది.
మన వాణిజ్య సంస్థ ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు వైబ్రంట్ గుజరాత్ దోహదపడింది. సామర్ధ్యాల నిర్మాణాని కి, ప్రభుత్వ ఏజెన్సీలు అంతర్జాతీయం గా అనుసరించే అత్యుత్తమ విధానాల ను పాటించేలా చేయడానికీ ఇది ఉపకరించింది.
ఈ సదస్సు నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన , ఆనందకరమైన సదస్సు కాగలదని ఆకాంక్షిస్తున్నాను. గుజరాత్ లో ఇది ఉత్తరాయణ పుణ్యకాలం, గాలిపటాలు ఎగురవేసే కాలం. ఈ సదస్సు యొక్క బిజీ షెడ్యూలు మధ్య లో మీరు కొంత సమయాన్ని కేటాయించి గుజరాత్ లో ఆనందోత్సాహల తో జరుపుకొనే పండుగల లో పాల్గొనాలని, దర్శనీయ ప్రాంతాల ను సందర్శించాలని కోరుకొంటున్నాను.
వైబ్రంట్ గుజరాత్ తాజా సంచిక లో పాలుపంచుకొంటున్న 15 భాగస్వామ్య దేశాల కు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కి నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను.
నేను, 11 భాగస్వామ్య సంస్థల కు , ఆయా దేశాల కు, ఈ వేదిక పై సదస్సుల ను నిర్వహిస్తున్న సంస్థల కు , వ్యవస్థల కు ఇవే నా ధన్యవాదాలు. మరో సంతృప్తి కరమైన విషయం ఏమిటంటే , తమ తమ రాష్ట్రాల లో పెట్టుబడి అవకాశాల ను గురించి తెలియజేయడానికి మన దేశాని కి చెందిన 8 రాష్ట్రాలు ఈ వేదిక ను ఉపయోగించుకొంటున్నాయి.
ప్రపంచ శ్రేణి ఉత్పత్తులు, సాంకేతిక విజ్ఞానం, ప్రక్రియ లు కలిగిన , అత్యున్నత స్థాయి గ్లోబల్ ట్రేడ్ శో ను కూడా సందర్శించడానికి మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తారని భావిస్తున్నాను. భారతదేశం లోని అత్యున్నత వ్యాపార స్ఫూర్తి కి ప్రతిబింబం గా నిలచే రాష్ట్రం గుజరాత్ . వైబ్రంట్ గుజరాత్ సమ్మేళనం ఇప్పటి వరకు 8 విజయవంతమైన సమ్మేళనాలను నిర్వహించింది.
. వివిధ అంశాలపై ఎన్నో సమ్మేళనాల ను, సదస్సుల ను నిర్వహించడం జరిగింది. ఇవి భారతీయ సమాజానికి, ఆర్థిక వ్యవస్థ కే కాకుండా అంతర్జాతీయ సమాజాని కి కూడాను ఎంతో ఉపయోగపడేవి. ఉదాహరణ కు రేపు జరిగే ఆఫ్రికా డే ఉత్సవాలు, 20న జరిగే ఇంటర్ నేశనల్ చాంబర్స్ గ్లోబల్ సదస్సు ను చెప్పుకోవచ్చు.
మిత్రులారా,
ఈ రోజు ఇక్కడ అత్యున్నత స్థాయి వ్యక్తులు సమావేశమయ్యారు. ఎన్నోదేశాల అధిపతులు, ప్రభుత్వాధినేతలు, ఆయా దేశాల ప్రతినిధులు ఇక్కడికి విచ్చేశారు. అంతర్జాతీయ ద్వైపాక్షిక సహకారం ఇక ఎంత మాత్రం దేశ రాజధానులకు మాత్రమే పరిమితం కాదని రాష్ట్రాల రాజధానులకూ విస్తరిస్తుందని ఇది చాటిచెప్తోంది.
ఆర్థికం గా శరవేగం తో ఎదుగుతున్న దేశాలలో లాగే భారతదేశం లో మన ముందు ఉన్న సవాలు, నిటారు అభివృద్ధి తో పాటు సమాంతర అభివృద్ధి ని కూడా సాధించడం అనేదే. సమాంతరం గా మనం అభివృద్ధి ఫలాల ను ఆయా వెనుకబడిన ప్రాంతాలు, సమాజాల కు విస్తరింప చేయవలసి ఉంది. అలాగే నిటారు గా, జీవన నాణ్యత పెంపు ఆకాంక్షలు, నాణ్యమైన సేవలు, నాణ్యమైన మౌలిక సదుపాయాల కు సంబంధించిన సవాళ్ల ను మనం ఎదుర్కొనవలసి ఉంటుంది. మనం ఇక్కడ భారతదేశం లో సాధించే విజయాలు, ప్రపంచ మానవాళి లో ఆరో వంతు ప్రజానీకాన్ని నేరు గా ప్రభావితం చేస్తాయి.
మిత్రులారా,
భారతదేశాని కి క్రమం తప్పకుండా వచ్చే వారు ఇక్కడి వాతావరణం లో వచ్చిన మార్పును గమనించారు. ఈ మార్పు దేశం పయనిస్తున్న దిశ, తీవ్రత కు సంబంధించింది. గడచిన నాలుగు సంవత్సరాల లో తక్కువ ప్రభుత్వం, గరిష్ఠ పాలనపై ప్రధానం గా దృష్టిపెట్టింది. మా ప్రభుత్వ మంత్రం రిఫార్మ్,పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫామ్ అండ్ పెర్ఫార్మ్.
ఇందుకు సంబంధించి మేం ఎన్నో కీలక చర్యలను చేప్టటాం. ఇందుకు సంబంధించి మేం లోతైన వ్యవస్థాగత సంస్కరణల ను తీసుకువచ్చాం. మేం దేశానికి, ఆర్థిక వ్యవస్థ కు బలాన్నిచేకూర్చాం.
మేం అలా చేయడం వల్ల ప్రపంచం లో అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా కొనసాగుతున్నాం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), మూడీ జ్ ల వంటి ప్రధాన సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతున్న తీరు పై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి.
మా పూర్తి శక్తి సామర్ధ్యాల కు అనుగుణం గా లక్ష్యాల కు చేరుకోవడానికి అడ్డంకి గా ఉన్న వాటిని తొలగించడంపై మేం దృష్టిపెట్టాం. మేం సంస్కరణల ప్రక్రియను, డీ రెగ్యులేశన్ వేగాన్ని కొనసాగిస్తాం.
మిత్రులారా,
భారతదేశం ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో బిజినెస్ కు సిద్ధం గా ఉంది. వ్యాపారం చేయడాన్ని మేం మరింత సులభతరం చేశాం.
గడచిన నాలుగు సంవత్సరాలలో, వ్యాపార నిర్వహణ కు సంబంధించి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌ల లో మేం 65 స్థానాలు ముందుకు వచ్చాం. 2014 లో 142 వ స్థానంలో ఉన్న మేము ఇప్పుడు 77 వ స్థానానికి చేరుకున్నాం. అయినా మేం దానితో సంతృప్తి చెందడం లేదు. నేను మా బృంద సభ్యులను మరింత కష్టపడి పనిచేసి దేశాన్ని రాగల సంవత్సరాల లో తొలి 50 లలో ఉంచేలా చూడాల్సిందిగా కోరాను. ప్రపంచం లోని అత్యుత్తమ విధానాలతో మన నియంత్రణలు, ప్రక్రియల ను పోల్చి చూడాల్సింది గా కోరాను. అంతేకాదు వ్యాపార నిర్వహణ ను మేం మరింత చౌకగా ఉండేలా చేశాం.
వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) చరిత్రాత్మక అమలు, ఇతర సులభతర చర్యలు, పన్నులను సంఘటితం చేయడం వంటివి లావాదేవీల ఖర్చుల ను తగ్గించివేశాయి. అలాగే వివిధ వ్యాపార ప్రక్రియలను సమర్ధంగా తీర్చిదిద్దాయి.
+
. డిజిటల్ ప్రక్రియలు, ఆన్‌లైన్ లావాదేవీలు, సింగిల్ పాయింట్ ఇంటర్‌ఫేస్ ల ద్వారా మేం వ్యాపారాన్ని వేగంగా జరిగేలా చూశాం.
ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) ల విషయంలో మేం అత్యంత బహిరంగ దేశాల జాబితా లో ఒకటి గా ఉన్నాం. మా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఎన్నో రంగాలు ఇప్పుడు ఎఫ్ డిఐ కి బాహాటం గా స్వాగతం పలుకుతున్నాయి. 90 శాతం పైగా అనుమతుల ను ఆటోమేటిక్ రూట్ లో పెట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు మా ఆర్థిక వ్యవస్థ ను ఉన్నత అభివృద్ధి దిశ గా సాగేలా చేశాయి. గడచిన నాలుగు సంవత్సరాల లో మన దేశం లోకి 263 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. గత 18 సంవత్సరాల లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లో ఇది 45 శాతం.
మిత్రులారా,
మేం వ్యాపార నిర్వహణ ను మరింత స్మార్ట్ అయ్యేలా చేశాం. ప్రభుత్వ కొనుగోళ్లు, సేకరణల కు ఐటి ఆధారిత లావాదేవీలను నిర్వహించాలని మేం పట్టు పడుతున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ తో సహా ప్రభుత్వ ప్రయోజనాలను డిజిటల్ చెల్లింపులు చేయడాన్ని పూర్తి స్థాయి లో అమలు చేస్తున్నాం. ప్రపంచం లోనే అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ లు కలిగిన దేశాల లో ఒకటిగా ఉన్నాం. ఇందులో చాలావరకు టెక్నాలజీ రంగం లో వచ్చినవే. అందువల్ల మాతో వ్యాపారం చేయడం అంటే అత్యంత సురక్షితమైన, అద్భుతమైన గొప్ప అవకాశం గా నేను నిస్సందేహం గా చెప్పగలను.
యుఎన్ సిటిఎడి జాబితా లోని మొదటి పది ఎఫ్ డిఎ గమ్యస్థానాలలో మేం ఒకరుగా ఉండడమే ఇందుకు కారణం. మాది అంతర్జాతీయం గా తయారీ రంగం లో ఖర్చు విషయం లో పోటీ వాతావరణం కలిగిన దేశం. మా వద్ద నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు, జ్ఞానం, ఉత్సాహం సమృద్ధం గా ఉన్నాయి. మా వద్ద ప్రపంచ శ్రేణి ఇంజినీరింగ్ విద్య ఉంది. బలమైన పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలు ఉన్నాయి. జిడిపి పెరుగుదల, మధ్యతరగతి ఆదాయాల పెరుగుదల, వారి కొనుగోలు శక్తి లో పెరుగుదల ఉన్నాయి. ఇది మా దేశీయ విపణి లో మరింత వృద్ధి ని సాధించనుంది. గడచిన రెండు సంవత్సరాల లో కార్పొరేట్ రంగం లో మేం తక్కువ పన్నుల వ్యవస్థ దిశ గా ముందుకు పోతున్నాం. మేం కొత్త పెట్టుబడులకు , చిన్న మధ్యతరహా వెంచర్ లకు పన్నుల ను 30 శాతం నుండి 25 శాతాని కి తగ్గించాం. ఇక ఐపిఆర్ అంశాల విషయం లో మేం బెంచ్ మార్కింగ్ విధానాల ను రూపొందించాం. ఇప్పుడు మేం వేగవంతమైన ట్రేడ్‌మార్క్ శకం లో ఒకరు గా ఉన్నాం. వ్యాపారాన్నుండి బయటపడాలనుకునే వారికి సుదీర్ఘ న్యాయపరమైన,ఆర్థిక పోరాటాలతో పనిలేకుండా సులభంగా ఎలాంటి భారం లేకుండా బయటకు రావడానికి ఇన్‌సాల్వన్సి అండ్ బాంక్‌రప్టసి కోడ్ వీలు కల్పిస్తోంది.
ఆ రకం గా వ్యాపారం ప్రారంభం నుండి దాని మూసివేత వరకు మేం దృష్టి సారించాం. ఇందుకు అనువైన కొత్త వ్యవస్థ లు, ప్రక్రియ లపై శ్రద్ధ వహించాం. ఇవన్నీ ఎంతో ప్రధానమైనవి. ఇవి కేవలం వ్యాపారం చేయడం కోసం కాక ప్రజల జీవనాన్ని సులభతరం చేయడాని కి సంబంధించినవి. ఒక యువ దేశం గా, యువత కు ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని, మంచి మౌలిక సదుపాయాలను కల్పించవలసిన అవసరాన్ని మేం గుర్తించాం. ఇవి పెట్టుబడుల తో ముడిపడినటువంటివి. అందువల్ల ఇటీవలి సంవత్సరాలలో, తయారీ, మౌలిక సదుపాయాల రంగాల పై మున్నెన్నడూ లేనంతటి దృష్టి పెట్టడం జరిగింది.
యువత కు ఉపాధి అవకాశాల ను కల్పించడానికి తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు మేం ఎంతో కష్టపడి పనిచేశాం. మా మేక్ ఇన్ ఇండియా ద్వారా పెట్టుబడుల కు డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా ల ద్వారా మద్దతివ్వడం జరిగింది. మా పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విధానాలు, ప్రక్రియ లు అన్నీ అంతర్జాతీయ ప్రమాణాల కు అనుగుణం గా ఉండేలా తీర్చి దిద్దడంపై మేం ప్రధానం గా దృష్టి పెట్టాం. ఆ విధం గా భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించాం.
పరిశుభ్రమైన శక్తి, హరిత అభివృద్ధి మా లక్ష్యాలు. లోప రహితమైన, ఎలాంటి దుష్ప్రభావాలకు తావు ఉండనటువంటి తయారీ విధానం మా గమ్యం. జల వాయు పరివర్తన ప్రభావాల ను వీలైనంత తగ్గించే లక్ష్యం దిశ గా పనిచేయాలన్నది మా సంకల్పం. శక్తి రంగం లో చూసుకున్నట్టయితే, నవీకరణ యోగ్య శక్తి ఉత్పత్తి విషయం లో ప్రపంచంలోనే మేం ఐదో అతి పెద్ద ఉత్పత్తిదారులం. పవన విద్యుత్తు ఉత్పత్తి లో మేం నాలుగో అతిపెద్ద దేశం గా సౌర విద్యుత్తు లో ఐదో పెద్ద దేశం గా ఉన్నాం.
రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, టెలికం, డిజిటల్ నెట్‌వర్క్, శక్తి వంటి తదుపరి తరం మౌలిక సదుపాయాల విషయం లో పెట్టుబడులను పెద్ద ఎత్తున పెంచాలని మేం ఆసక్తితో ఉన్నాం. అలాగే మేం ప్రజల కు మెరుగైన జీవనాన్ని, మెరుగైన రాబడి కల్పించేందుకు సామాజిక, పారిశ్రామిక వ్యవసాయ మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. ఇందుకు కొన్ని ఉదాహరణ లను ప్రస్తావిస్తాను. గడచిన నాలుగు సంవత్సరాల లో గరిష్ఠ స్థాయి లో విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. అదనపు విద్యుత్తు సామర్ధ్యాన్ని జోడించాం. మొట్ట మొదటి సారి గా భారతదేశం విద్యుత్తు నికర ఎగుమతి దారు స్థాయి కి ఎదిగింది. మేం పెద్ద ఎత్తున ఎల్ ఇడి బల్బులు పంచాం. దీనివల్ల ఇంధన వినియోగం లో పెద్ద ఎత్తున పొదుపు చేయగలిగాం. ముందెన్నడూ లేని రీతి లో ట్రాన్స్‌మిశన్ లైన్ లను ఏర్పాటు చేశాం. రోడ్ల నిర్మాణ వేగం దాదాపు రెట్టింపు అయింది. ప్రధాన నౌకా కేంద్రాల సామర్ధ్యాన్ని దాదాపు రెట్టింపు చేశాం. గ్రామీణ రహదారుల సంధానం ఇప్పుడు దాదాపు 90 శాతం గా ఉంది. కొత్త రైల్వే లైన్ ల ఏర్పాటు, గేజ్ మార్పిడి, డబ్లింగ్, రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణ ల వంటివి కూడా రెట్టింపు అయ్యాయి. ప్రధాన ప్రాజెక్టు ల అమలు కు అడ్డంకులు గా నిలచిన అంశాలను క్రమం తప్పకుండా గుర్తించి వాటిని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నాం.
మౌలిక సదుపాయాల రంగం లో మేం అనుసరిస్తున్న పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం పెట్టుబడిదారుల కు స్నేహపూర్వకం గా ఉంది. మా ప్రభుత్వ పాలన కాలం మొత్తం 7.3 శాతం సగటు జిడిపి వృద్ధి తో ముందుకు సాగుతున్నాం. 1991 నుండి ఏ భారతీయ ప్రభుత్వ పాలన కాలాని కన్నా అధిక వృద్ధి రేటు ఇది. అదే విధం గా మా ద్రవ్యోల్బణ రేటు 4.6 శాతం తో అత్యల్పంగా ఉంది. భారతదేశం సరళీకరణ మార్గం లో పయనించడం ప్రారంభించిన 1991 నుండి ఏ ఇతర ప్రభుత్వ పాలన కాలం లోని ద్రవ్యోల్బణం కన్నా ఇది తక్కువ.
అభివృద్ధి ఫలాలు ప్రజల కు సులభం గా సమర్ధం గా చేరాలన్న దానిని మేం విశ్వసిస్తాం.
ఇందుకు కొన్ని ఉదాహరణలిస్తాను. మేం ఇప్పుడు ప్రతి కుటుంబాని కి బ్యాంకు ఖాతా ను సమకూర్చాం. చిన్న వ్యాపారుల కు మేం ఎలాంటి పూచీ లేకుండా రుణాలను ఇస్తున్నాం. ఇప్పుడు ప్రతి గ్రామానికీ విద్యుత్తు ఉంది. దాదాపు ప్రతి ఇంటికీ ఇవాళ విద్యుత్తు సదుపాయం లభ్యమవుతోంది. వంట గ్యాస్ సౌకర్యాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకోలేని స్థితి లోని ప్రజలకు పెద్ద సంఖ్య లో వంట గ్యాస్ సదుపాయం కల్పించాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అన్నింటి లో పారిశుధ్యం ఉండేలా చూశాం. ప్రతి ఇంటికీ టాయిలెట్ లు ఉండేలా, అవి సక్రమ నిర్వహణ లో ఉండేలా మేం చర్యలు తీసుకుంటున్నాం.
సోదర, సోదరీమణులారా,
2017లో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చిన గమ్యస్థానాలలో మేం ఉన్నాం. 2016లో పర్యాటకుల కంటె 14 శాతం ఎక్కువ వృద్ధి కనిపించింది.ఇదే సంవత్సరంలో ప్రపంచంలో సగటున 7 శాతం పెరిగింది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్‌లలో మేం ఉన్నాం. పాసింజర్ టికెటింగ్ టరమ్‌లలో గత నాలుగు సంవత్సరాలలో రెండంకెల వృద్ధి సాధించాం.
ఆ రకం గా న్యూ ఇండియా వృద్ధి చెందుతోంది. ఆధునికత తో, పోటీతత్వం తో, ఇతరుల పట్ల కరుణ తో, దయ తో కూడిన న్యూ ఇండియా రూపుదిద్దుకొంటోంది. ఇందుకు సరైన ఉదాహరణ మన వైద్య హామీ పథకం ‘ఆయుష్మాన్ భారత్’. ఇది దేశం లోని 50 కోట్ల మంది ప్రజలకు అంటే సుమారు అమెరికా, కెనడా, మెక్సికో ల లోని మొత్తం జనాభా కంటె ఎక్కువ మంది కి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సంరక్షణ కు సంబంధించిన మౌలిక సదుపాయాల రంగం లో, వైద్య పరికరాల తయారీ, ఆరోగ్య సంరక్షణ సేవ ల రంగం లో అద్భుతమైన పెట్టుబడి అవకాశాల ను కల్పిస్తుంది.
నేను మీకు మరికొన్ని ఉదాహరణలను కూడా చెప్తాను. భారతదేశం లోని 50 నగరాలు మెట్రో రైల్ వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నాయి. మేం 50 మిలియన్ ఇళ్లను నిర్మించాలి. రోడ్డుమార్గాల, రైలు మార్గాల, జల మార్గాల ఏర్పాటు అవకాశాలు అపారం. మేం మా లక్ష్యాల ను స్వచ్ఛమైన పరిసరాల తో, వేగం గా సాధించడాని కి ప్రపంచ శ్రేణి ప్రమాణాలను కలిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుకొంటున్నాం.
మిత్రులారా,
భారతదేశం అవకాశాల గని. ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్ కలిగిన ప్రాంతం. ఇప్పటికే భారతదేశం లో తమ కార్యకలాపాలు సాగిస్తున్న వారికి నేను ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను. మా ప్రజాస్వామిక వ్యవస్థ, ఇక్కడి మానవీయ విలువలు, బలమైన న్యాయ వ్యవస్థ.. ఇవి అన్నీ మీ పెట్టుబడి కి రక్షణ ను , భద్రత ను కల్పిస్తాయని మీకు నేను హామీనిస్తున్నాను. మేం దేశం లో పెట్టుబడుల వాతావరణాన్ని పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. అంతేకాదు, మమ్మల్ని మేం మరింత పోటీ కి సిద్ధం చేసుకొంటున్నాం.
ఇక ఇప్పటి వరకు దేశం లో తమ కార్యకలాపాలను ప్రారంభించని వారి కి నేను స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడి అవకాశాల ను అందిపుచ్చుకోవలసిందిగా వారి కి ఇదే నా ఆహ్వానం. మీకు తగిన విధం గా ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని వెల్లడిస్తున్నాను. ఇన్వెస్టర్ లకు సహాయపడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. వీటన్నింటికీ మించి, మీ ప్రయాణం లో మీ చేతి ని పట్టుకొని ముందుకు తీసుకువెళ్లడానికి నేను ఎల్లవేళలా అందుబాటు లో ఉంటానని మీకు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు. అనేకానేక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎ లాట్.