గవర్నర్ శ్రీమాన్ విద్యాసాగర్‌రావుగారు, రాష్ట్ర పాపులర్ ముఖ్యమంత్రి శ్రీమాన్ దేవేంద్ర ఫడ్నవీస్‌గారు, కేంద్ర మంత్రి వర్గంలో నా సహచర మంత్రులు శ్రీమాన్ నితిన్‌గడ్కరిగారు, అశోక్ గజపతిరాజు గారు, రాష్ట్రప్రభుత్వంలో మంత్రులు శ్రీమాన్ రవీంద్ర చవాన్‌గారు,శాసనసభ్యులు శ్రీమాన్ ప్రశాంత్ ఠాకూర్‌గారు, ఇక్కడ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన సోదర, సోదరీమణులారా…. రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి.దానికి ఒక రోజుముందు రాయఘడ్ జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుండడం యాదృచ్ఛికం, ఎంతో ఆనందం కలిగించే సంఘటన.
ఈరోజు నాకు రెండు కార్యక్రమాలకు అవకాశం లభించింది. అందులో మొదటిది, మన నౌకారంగానికి సంబంధించినది. నౌకాశ్రయరంగం, జల మార్గాలు మన నితిన్ గడ్కరి గారి నాయకత్వంలో కొత్త స్ఫూర్తిని సంతరించుకున్నాయి.ఈరోజు అందులో భాగంగా ముంబాయిలో జెఎన్‌పిటి నాలుగవ టెర్మినల్‌ను జాతికి అంకితం చేయనున్నాం.
మనం గ్లోబలైజేషన్, ప్రపంచ వాణిజ్యం పదాలను చాలా ఏళ్లుగా వింటూ ఉన్నాం. అయితే మనం కేవలం ఇంట్లో కూర్చుని ప్రపంచ వాణిజ్యం శక్తిసామర్ధ్యాల గురించి చర్చించడం వల్ల దేశానికి ఒరిగిన ప్రయోజనమేదీ లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో చేరడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నప్పుడే ప్రపంచ వాణిజ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సముద్ర ఆధారిత వాణిజ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో ఇండియా ఎంత అదృష్టవంతమైన దేశం. దేశ సముద్ర శక్తినిగుర్తించిన మొట్టమొదటి జాతీయమహాపురుషుడు, మొట్టమొదటి మహారాజు ఛత్రపతి శివాజీ మహరాజ్. అందుకే, ఇవాళ ఎన్నోకోటలు సముద్ర మార్గంతో అనుసంధానమై ఉన్నాయి. దానివల్ల సముద్ర పరాక్రమ శక్తి మనకు అక్కడ కనిపిస్తుంది.
ఇవాళ, మనం ఎన్నో సంవత్సరాల తర్వాత ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను స్మరించుకుంటున్నాం. జె.ఎన్.పి.టి నాలుగవ టెర్మినల్‌ను మనం ప్రజలకు అంకితం చేస్తున్నాం. మన పూర్వీకులకు ఎంతటి దూరదృష్టి ఉండేదో, వారి భవిష్యత్ దార్శనికత, ఆలోచన ఎంత గొప్పవొ కదా……
సముద్ర వాణిజ్యంలో భారత దేశం తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలంటే ఇండియా తన సముద్ర శక్తిని ఎన్నోరెట్లు పెంచుకోవలసి ఉంది. మనం ఎంతగా మన పోర్టులను అభివృద్ధి చేసుకుంటే , అవి అంతగా ఆధునికం అవుతాయి. సరకులు చేరడానికి పట్టే సమయం తగ్గించడానికి వీలు కలుగుతుంది. వేగంగా ప్రయాణించే నౌకల సంఖ్యను పెంచాలి, లక్షల టన్నుల కొద్దీ మన సరుకు ప్రపంచ మార్కెట్లకు చేరాలి.కొన్నిసార్లు సకాలంలో సరకులను మార్కెట్లకు చేర్చడంలో పోటీ ఉంటుంది.ఒకసారి ఆర్డర్ ఖరారైన తర్వాత, ఒకసారి ఆర్ధిక ఒప్పందం కుదిరిన తర్వాత సరకును తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరిస్తే కొనుగోలుదారుడు లాభం పొందగలుగుతాడు. సరఫరాలో ఆలస్యం జరిగితే వారికి నష్టం వస్తుంది. అయితే మన నౌకా కేంద్రాలకు సత్వరం సరఫరా చేయగలిగిన సదుపాయాలుంటేనే ఇది సాధ్యం.
సాగరమాల ప్రాజెక్టుకింద మాత్రమే మనం పోర్టులను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నట్టు కాదు. మనం పోర్టు ఆధారిత అభివృద్ధిపై మనం మన దృష్టి పెడుతున్నాం.దాని వల్ల మనం సౌకర్యాల కల్పన ద్వారా అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చవచ్చు. ఇది మనకొక సవాలు. మనకు ఏడున్నర వేల కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీని ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందగలగుతామన్నది మన ముందున్న సవాలు.భౌగోళికంగా మనం కీలకప్రాంతంలో ఉన్నాం. సముద్రవాణిజ్య రంగంలో ప్రపంచశక్తిగా ఎదగడానికి మనకు అద్భుత అవకాశాలున్నాయి.
భారత ప్రభుత్వం ఈ బృహత్ లక్ష్యాన్ని తనంత తానుగా స్వీకరించింది. ప్రపంచం పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతుంటుంది. పర్యావరణానికి సంబంధించిన ప్రధాన సమస్యను పరిష్కరించగలిగిన సాధనం రవాణా రంగం. అందులోనూ రవాణా రంగంలో ముఖ్యమైనది జల మార్గ రవాణా రంగం. మేం వందకు పైగా జలమార్గాలను గుర్తించాం.మనం దేశవ్యాప్తంగా జలమార్గం ద్వారా సరకు రవాణాకు , మన నదులను , సముద్ర మార్గాలను ఉ పయోగిస్తే మనం ఎంతో తక్కువ ఖర్చుతో సరకు రవాణా చేపట్టవచ్చు. కనీస నష్టంతో పర్యావరణానికి మనవంతు మేలు చేసిన వాళ్లం , గ్లోబల్ వార్మింగ్‌కు వ్యతిరేకంగా మనవంతు కృషి చేసిన వాళ్లం అవుతాం.
ఈరోజు నవీ ముంబాయిలొ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం వస్తోంది. స్వాతంత్ర్యానంతరం విమానయాన రంగంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటుకాబోతున్న తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఇదే.దీని గురించి మీరు 20 సంవత్సరాలుగా వింటూవస్తున్నారంటే మీరు ఇక ఆలోచించవచ్చు.దీనికి సంబంధించి ఎన్నో ఎన్నికలలో హామీలు గుప్పించారు.ఎందరో ఎమ్మెల్యేలు ఎన్నికై ఉండవచ్చు. ఈ హామీ ఇచ్చి పలువురు పార్లమెంటు సభ్యులై ఉండవచ్చు. పలు ప్రభుత్వాలు ఏర్పడి ఉండవచ్చు. కానీ విమానాశ్రయ నిర్మాణం మాత్రం చేపట్టలేదు.మరి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న అతిపెద్ద అవరోధం గత ప్రభుత్వ పనితీరు సంస్కృతి.
1997లో,అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కల ఏర్పడింది. ఆ తర్వాత దానిని చేపట్టి ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. నేను ప్రధాన మంత్రిని అయిన తర్వాత నాకు ఇంతకు మించి వేరే పనేమీ లేనందున నాకు బాగా సమయం ఉంటుంది కనుక నేను ఈ పనుల గురించి ఆలోచిస్తుంటాను. ఆ క్రమంలో వెతకగా ఇది నాదృష్టికి వచ్చింది. నవీ ముంబాయి విమానాశ్రయ ప్రాజెక్టు ఒక్కటే కాదు, ముప్పై సంవత్సరాల క్రితం అనుమతి పొందిన ప్రధాన ప్రాజెక్టులు కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫైలులో మాత్రం అనుమతులు ఇచ్చారు. కొన్ని సందర్భాలలో ఇరవై సంవత్సరాల క్రితం ఇందుకు సంబంధించిన ప్రకటనలూ చేశారు,కొన్నింటి విషయంలో కొందరు రాజకీయ నాయకులు శిలాఫలకాలూ ఏర్పాటు చేశారు.వారు ఆ శిలాఫలకాలతోపాటు తమ ఫోటోలను పత్రికలలో ప్రచురింప చేసుకున్నారు.ఉపన్యాసాలూ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్టులు ఏనాడూ ఫైళ్లను . పేపర్లను దాటి రాలేదు. ఇది నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. ఆందోళన కలిగించింది.
దానితో నేను ప్రగతి పేరుతో నేను ఒక ప్రాజెక్టును ప్రారంభించాను. ఈ ప్రాజెక్టుల విషయమై నేను దేశంలోని ముఖ్యమంత్రులతో, భారత ప్రభుత్వ కార్యదర్శులతో స్వయంగా మాట్లాడతాను. ఇందుకు నేను సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాను.స్వయంగా నేను వాటి అమలు తీరును సమీక్షిస్తున్నాను. ఆ క్రమంలో, దేవేంద్రజీ కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు ఈ ప్రాజెక్టు నాముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి అంతకు ముందు ఏమీ జరగలేదు. ఇది కాగితాల మీదే ఉంది. రేపు మరొకరు రావచ్చు, రేపు మరొకరు వచ్చి అది తమ హయాంలో ఆమోదం పొందినదని ప్రకటించుకోవచ్చు.. అలాంటి మనుషులకు మనకు కొదువేమీ లేదు. అందుకే, సోదరా, ప్రగతి ద్వారా అన్ని విభాగాల ప్రమేయంతో దయచేసి సమస్యను పరిష్కరించండి. అప్పుడు విధానపరమైన నిర్ణయం జరిగి ఉంటే మరి మీరు ఎందుకు అలాంటి పొరపాటు చేశారు?మరి మీరు పొరపాటు చేయకపోతే మరి దానిని ఎందుకు అమలు చేయలేదు? ఈ ప్రశ్నలకు సమాధానాల సహాయంతో వీటిని దయచేసి ముందుకు తీసుకువెళ్లండి అని చెప్పాను. ప్రగతి సహాయంతో ప్రాజెక్టులను సమీక్షించడం ద్వారా 20-30 సంవత్సరాలుగా అడుగు ముందుకు పడని ఎన్నో ప్రాజెక్టులకు మోక్షం లభించిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వివిధ ప్రాజెక్టులు అడుగు ముందుకు పడకుండా ఉండేలా చేయడం గత ప్రభుత్వ పని సంస్కృతికి నిదర్శనం.ఏదో ఒక అడ్డుపుల్ల వేసి గందరగోళం సృష్టించడం వారి నైజం. ఇలా జరుగుతూ వచ్చింది. పది లక్షల కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడమో లేక, వదిలివేయడమో జరిగాయని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది.
మేం వాటిని అమలు చేశాం. వాటికి మేం నిధులు సమకూర్చాం. ఇవాళ ఆ ప్రాజెక్టుల పనులు శరవేగంతూ ముందుకు పోతున్నాయి. ఇవాళ నవీముంబాయి విమానాశ్రయ ప్రాజెక్టు కూడా అలాంటి వాటిలో ఒకటి.
మన విమానయాన రంగం శరవేగంతో వృద్ధి చెందుతోంది. కొద్దిసేపటి క్రితం మన గజపతి రాజుగారు వివరించినట్టు 20-25 సంవత్సరాల క్రితం దేశం మొత్తం మీద ఉన్న విమానాల ట్రాఫిక్‌ను మించిన ట్రాఫిక్ ఈ రోజు ఒక్క ముంబాయి విమానాశ్రయంలోనే ఉంటున్నది. గతంలో దేశం మొత్తం విమాన ట్రాఫిక్‌తో పోలిస్తే ఈ రోజు ఒక్క ముంబాయి విమానాశ్రయంలోనే అంత ట్రాఫిక్ ఉందంటే ఆలోచించండి. ఇవాళ , కాలం మారింది. మీరు ఏదైనా విమానాశ్రయానికి వెళ్లి చూడండి, అక్కడ బస్సు ఎక్కడానికి క్యూలో నిలుచున్నట్టుగా ఎంతోమంది ప్రయాణికులు విమాన ప్రయాణాలనికి క్యూలలో నిలబడి ఉంటున్నారు. దేశంలోని చాలా విమానాశ్రయాలలో ఇలాంటి పరిస్థితి రోజంతా కనిపిస్తుంటుంది. శరవేగంతో వృద్ధి చెందుతున్న విమానయాన రంగం అవసరాలను దృష్టిలో పెట్టుకునిచూసినపుడు ఈరంగంలో మౌలిక సదుపాయాల రంగంలో మనం ఎంతో వెనుకబడి ఉన్నాం . మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధిచేయాలన్నది మా సంకల్పం. ఈ రంగం అవసరాలను తీర్చాలన్నది మా సంకల్పం. 21వ శతాబ్దం సమీపిస్తున్నదని మేము, మీరు కొద్ది సంవత్సరాల క్రితమే విన్నాం. 80 దశకం నుంచే మీరు 21 వ శతాబ్దం సమీపిస్తున్నదని విని ఉంటారు. అప్పట్లో పత్రికలలోనూ రోజూ ఈ వార్తలు వచ్చాయి. అప్పటి ప్రధానమంత్రి రోజూ ఈ 21 వ శతాబ్దం గురించే మాట్లాడేవారు. అయితే 21 వ శతాబ్దం అన్న మాటకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
21 వ శతాబ్దంలో ఎలాంటి విమానయాన రంగం ఉండాలన్న దానిపై ఆనాడు 20-25 సంవత్సరాల క్రితం ఎవరైనా దృష్టిపెట్టి ఉంటే , ఇప్పుడు మేం చేస్తున్న తీరులో పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు.ఇది అత్యంత ప్రధానమైన రంగం. ఈ రంగం ప్రాధాన్యత విషయంలో మరో అభిప్రాయానికి తావవులేదు. దీని ప్రాధాన్యత ఎప్పుడూ పెరిగేదే. అయినా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ విమానయాన రంగ విధానాన్నిరూపొందించలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానయాన రంగ విధానాన్ని రూపొందించాం. గతంలో మహారాజ ఇమేజ్ ఉండేదని అంటే మళ్లీ మనం పొరపాటు చేసినట్టే. ఇవాళ విమానయాన రంగం సామాన్యుడికి చెందినది. అటల్ బిహారి వాజ్‌పేయిజీ పాలనలో మనకు ఒక విమానయాన మంత్రి ఉండే వారు. ఆరోజులలో నేను పార్టీలో ఒక పక్కన కూర్చుని పనిచేసుకుంటుండే వాణ్ణి. విమానాలమీద మహారాజ గుర్తును ఎందుకు ఉంచుతున్నారని నేను ఒకసారి ఆయనను అడిగాను.ఆరోజులలో మహారాజ స్థాయి వారు మాత్రమే విమానప్రయాణాలు చేసేవారు. అప్పుడు నేను, సామాన్యుడి బొమ్మ వాడమని వారికి సూచించాను. ఆర్.కె. లక్ష్మణ్ కార్టూన్‌లలోని సామాన్యుడి బొమ్మను వాడితే సామాన్యుడు కూడా విమానప్రయాణం చేస్తాడని సూచించేలా వాడమని చెప్పాను. ఆ తర్వాత అటల్‌జీ ప్రభుత్వ హయాంలో అది మొదలైంది.
ఈ దేశంలో స్లిప్పర్లు వేసుకునే వ్యక్తి విమానంలో ఎందుకు ప్రయాణించకూడదు? అందుకే మేం ఉదాన్ పథకాన్ని తీసుకువచ్చాం. వంద విమానాశ్రయాలను ఉపయోగం లోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. వాటిని కొత్తగా నిర్మించడమో లేక ఉన్న వాటిని మరింత మెరుగుపరచడమో చేయడం జరుగుతుంది.
విమానాలు స్వల్పదూరంలోని గమ్యస్థానాలకూ ప్రయాణికులను చేర్చేట్టు ఉండాలి. 20-30 మంది ని తీసుకువెళ్లే చిన్న విమానాలు ఉండాలి. అలాగేప్రజలు ఇవాళ వేగాన్నికోరుకుంటున్నారు.మేం ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల ప్రజల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించాం. ఈ పథకంకింద ప్రయాణ చార్జీ రూ2500 గా ఉంటుంది. మేం ఈశాన్య రాష్ట్రాల మీద ఎందుకు శ్రధ్ధ పెట్టామంటే ఈశాన్య రాష్ట్రాలలో ప్రయాణం చాలా కష్టతరం,. వారికి కనెక్టివిటీ చాల ముఖ్యం. సోదర సోదరీమణులారా, మన దేశంలో నడుస్తున్నవిమానాల సంఖ్య 450.ప్రభుత్వ, ప్రైవేటు రంగం మొత్తం కలిపితే మన దేశంలో ఇవాళ తిరుగుతున్నవిమానాల సంఖ్య 450. స్వాతంత్ర్యానంతరం నుంచి ఇప్పటి వరకు మనం 450 విమానాలు నడిపే దశకు చేరుకున్నాం.. అయితే, ఈ ఒక్క ఏడాదే విమానయాన రంగంలోని వారు 900 విమానాలకు ఆర్డర్లు ఇచ్చారని తెలిస్తే మీరు ఎంతో సంతోషిస్తారు. అంటే స్వాతంత్ర్యానంతరం నుంచి ఇప్పటి వరకు 450 విమానాలు మాత్రమే ఉన్నకాలం ఒక వైపు,మరో వైపు ఒక్క ఏడాదిలోనే 900 విమానాలు కొనుగోలు చే్స్తున్నకాలం ఒకవైపు , గమనించండి. దీనిని బట్టి విమానయాన రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదో గమనించండి.
విమానయాన రంగం ఉపాధి అవకాశాలకు కొత్త శక్తిని జోడిస్తుంది. అయితే దేవేంద్రజీ కొద్దిసేపటి క్రితం చెప్పినట్టు, మౌలికసదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. నీరు, గాలి,భూమి ఆర్ధిక వ్యవస్థకు ఎంత వైభవాన్ని జోడిస్తాయో.అంతర్జాతీయంగా జరిపిన ఒకానొక అధ్యయనం ప్రకారం విమానయాన రంగంలో వంద రూపాయలు పెట్టుబడి పెడితే దాని నుంచి 325 రూపాయల రాబడి వస్తుందని అంటారు. ఇదీ ఈరంగం బలం. ఈ రంగానికి అంతటి శక్తి ఉంది. ఉపాధికి ఎన్నో అవకాశాలున్నరంగం.ఇది భారతదేశపు పర్యాటక రంగ ప్రోత్సాహానికీ ఉపయోగపడుతుంది.
భారతదేశం వైవిధ్యంతో కూడుకున్నది. సరైన విమాన ప్రయాణ సౌకర్యాలుఉంటే తప్ప విదేశీ పర్యాటకులు ఒక నెలరోజులు ఒక జిల్లాలో మకాం వేసినా ఆ జిల్లాను పూర్తిగా దర్శించలేరు.మన దేశం ఎంతో వైవిధ్యం కలిగిన దేశం. విమానయాన రంగం, దాని బలం దేశ పర్యాటక రంగానికి కొత్త శక్తిని సమకూర్చగలదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి జీవనోపాధి కల్పించగల రంగం పర్యాటక రంగం. అందువల్ల పర్యాటక రంగం ద్వారా ప్రతి ఒక్కరూ , అంటే టాక్సీ డ్రైవర్ లేదా ఆటో రిక్షా డ్రైవర్, గెస్ట్‌హౌస్ యజమాని,లేదా పూలు , పండ్లు అమ్ముకునే వ్యక్తి లేదా పూజాది కార్యక్రమాలు నిర్వహించే పూజారులు ఇలా అన్ని వర్గాల వారూ ప్రయోజనం పొందగలుగుతారు.
పర్యాటక రంగంతోపాటు విమానయాన రంగాన్ని కలిపి ప్రోత్సహించడానికి మేం కృషి చేస్తున్నాం. అందుకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ నవీ ముంబాయి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. అంతే కాదు, నేను ప్రతి కార్యక్రమంలో ఒక ప్రశ్నఅడుగుతుంటాను, మీరెప్పుడు పూర్తి చేస్తారు? అని. ఎందుకంటే గతంలో మనకు అలాంటి అనుభవం ఉంది. మనం గతకాలపు పని సంస్కృతినుంచి బయటపడాలంటే బాగా కష్టపడి పనిచేయవలసి ఉంది. ఇది తప్పకుండా చేస్తాం. మీరు మాకు పని అప్పగిస్తే మేం దానిని తప్పకుండా ఎలాగైనా పూర్తి చేసి తీరుతాం. ఈ తరహా ప్రాజెక్టు ప్రస్తుత రోజులలో ముంబాయిలో, మహారాష్ట్రలో వస్తున్నదంటే, 2022లో, ఆ తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. మీరుకూడా అలా ఆలోచించి చూడండి. నిజానికి గత 20-25 సంవత్సరాలుగా మనం అలా ఆలోచించే పరిస్థితులే లేవు.2022, 2023, 2024, 2025 సంవత్సరాలో, నవీముంబాయి నూతన విమానాశ్రయం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్‌లు బయలుదేరి పోతుండడాన్ని మీరు గమనిస్తారు.
అదే సమయంలో మీ వాహనం 22 కిలోమీటర్ల పొడవున్న ట్రాన్స్ హార్బర్‌లింగ్ రోడ్‌లో పూర్తి వేగంతో దూసుకుపోతుంటుంది. అదే సమయానికి ముంబాయిలోని డబుల్ లైన్ సబర్బన్ కారిడార్ పనులు త్వరితగతిన పూర్తి అయి ఉంటాయి. అదే సమయానికి మీ ప్రాంతంలో జలరవాణాకు సంబంధిచిన ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు అన్నీ పూర్తయి మీ కళ్లముందే కనిపిస్తుంటాయి. మరో వైపు ఛత్రపతి శివాజీమహరాజ్ భారీ విగ్రహం కూడా సిద్ధమై ఉంటుంది. దృశ్యం ఎంత మారిపోయి ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి.
.ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ విమానాశ్రయం నుంచి త్వరలోనే ప్రయాణించే అవకాశం మీకు దక్కుతుందని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా శ్రీమాన్ దేవేంద్రజీకి , మా సహచరమంత్రులు గజపతిరాజుగారు, నితిన్ గడ్కరిగారు, మా కేబినెట్ సహచర బృందం అందరికీ అభినందనలు.
ధన్యవాదాలు.