వేదికను అలంకరించిన గవర్నర్ ద్రౌపది ముర్ముగారు, ముఖ్యమంత్రి, కేంద్ర-రాష్ట్ర మంత్రులు, నా ప్రియమైన ఝార్ఖండ్ సోదరీసోదరులారా! అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవాసులకు, ప్రపంచంతోపాటు మీ కందరికీ నా శుభాశీస్సులు… శుభాభినందనలు. ఈ ‘ప్రభాత్ తారా మైదానం’ నుంచి దేశ ప్రజలందరికీ అత్యంత శుభోదయం చెబుతున్నాను. నేడు ఈ ‘ప్రభాత్ తారా మైదానం’ ప్రపంచ పటంలో వెలుగులీనుతోంది. ఈ మేరకు ఇవాళ ఝార్ఖండ్ రాష్ట్రానికి ఈ గౌరవం దక్కింది. యోగా దినోత్సవం నిర్వహించుకునేందుకు ప్రపంచంలోనేగాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం తేవడానికి ప్రచురణ-ప్రసార మాధ్యమాల మిత్రులు, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నవారు అత్యావశ్యక… కీలకపాత్ర పోషించారు. వారికి కూడా నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా!
యోగా దినోత్సవ నిర్వహణ కోసం ఝార్ఖండ్ రావడం నాకొక ఆహ్లాదకర అనుభవం. దూరప్రాంతాల్లోగల నివాసాల నుంచి పెద్ద సంఖ్యలో తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకున్న మీకందరికీ కృతజ్ఞుడినై ఉంటాను. అయితే, ఐదో యోగా దినోత్సవం చేసుకునేందుకు ప్రత్యేకించి నేను రాంచీకి ఎందుకొచ్చానన్న ప్రశ్న మీ అందరి మదిలో మెదులుతున్నదని నాకు తెలుసు. సోదరీసోదరులారా… రాంచీతో నాకు లోతైన అనుబంధం ఉన్నప్పటికీ ఇవాళ నేనిక్కడికి రావడం వెనుక మూడు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది… ‘ఝార్ఖండ్’ అంటే ‘అడవి నేల’ అని అర్థం. ఇది ప్రకృతికి చాలా చేరువ… అంతేగాక మానవులు-ప్రకృతి మధ్య సామరస్యం మానవాళికి భిన్న అనుభూతినిచ్చే అంశం. నేను రాంచీ రావడానికి రెండో ప్రధాన కారణం… ఆరోగ్య సంరక్షణతో రాంచీ నగరానికిగల అనుబంధం చరిత్ర పుటలకెక్కిన అంశం. ఎందుకంటే… నిరుడు సెప్టెంబరు 23న పండిట్ దీన్‘దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా రాంచీ వేదికగా ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి శ్రీకారం చుట్టాం. నేడు అది ప్రపంచంలోనే అత్యంత భారీ ఆరోగ్య సంరక్షణ పథకంగా రూపుదాల్చింది. ఆ మేరకు ‘ప్రధానమంత్రి జనారోగ్య పథకం’ స్వల్పకాలంలోనే నిరుపేదల మన్ననలు అందుకుంది. భారతీయులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో యోగాభ్యాసానికగల పాత్రను మేం అవగాహన చేసుకున్నాం. కాబట్టే ఇవాళ నేను రాంచీకి రావడంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. సోదరీసోదరులారా… ఇక మనమంతా కలసి యోగా ఉద్యమాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది. ఇదే నేను రాంచీకి రావడంలోని మూడో, అత్యంత ప్రధాన కారణం.
మిత్రులారా!
అనాదిగా మన దేశం యోగాభ్యాసానికి నిలయం మాత్రమేగాక మన సంస్కృతిలో అదొక విడదీయలేని భాగం. ఝార్ఖండ్‘కు ప్రత్యేకమైన ‘‘ఛౌ నృత్యం’’ విభిన్న ఆసనాలను, భంగిమలను ప్రతిబింబిస్తుంది. అయితే, దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ఆధునిక యోగా చొచ్చుకుపోలేదన్నది వాస్తవం. అందువల్ల ఆధునిక యోగాభ్యాస ప్రక్రియను గ్రామాలకు, అడవుల్లోకి, మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు మనందరిమీదా ఉంది. అనారోగ్యానికి గురైతే తీవ్రంగా బాధపడేది పేదలు, గిరిజనులే గనుక యోగాను వారి జీవితాల్లో విడదీయరాని భాగం చేయాలని నేను సంకల్పించాను. అనారోగ్యం పేదలను మరింత పేదలుగా మారుస్తుంది. దేశంలో పేదరికం వేగంగా తగ్గుతున్న నేపథ్యంలో దాని బారినుంచి బయటపడేవారికి యోగా ఒక కీలక మాధ్యమం అవుతుంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవడమంటే- అనారోగ్యం, పేదరికం కోరలనుంచి విముక్తి పొందడమే అవుతుంది.
మిత్రులారా!
అన్ని సదుపాయాలూ కల్పించడంద్వారా జీవితాలను సుఖమయం చేయడమొక్కటే చాలదు. అలాగే మందులు, శస్త్రచికిత్సల రూపంలో లభించే పరిష్కారాలూ చాలవు. కాలం మారుతున్న నేటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధంతోపాటు ఆరోగ్య శ్రేయస్సుపైనా మనమంతా దృష్టి సారించడం చాలా ముఖ్యం. యోగా మనకు అటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. యోగాతోపాటు ప్రాచీన భారతీయ తత్త్వశాస్త్రం కూడా అదే స్ఫూర్తినిస్తాయి. మైదానంలోనో, నేలపైనో, చాపమీదనో ఓ అరగంటపాటు యోగాసనాలు వేసినంతమాత్రాన సరిపోదు; యోగా ఒక క్రమశిక్షణ, ఓ అంకితభావం… దాన్ని జీవితాంతం క్రమం తప్పకుండా అనుసరిస్తూ అభ్యసించాలి. వయసు, రంగు, కులం, జాతి, సంపద, పేదరికం, రాష్ట్రం లేదా సరిహద్దులపరమైన విచక్షణకు యోగా అతీతమైనది. ‘‘యోగా అందరి కోసం… అందరూ యోగా కోసం’’ అన్నది మన నినాదం కావాలి.
మిత్రులారా!
ఆరోగ్యం, శ్రేయస్సుతో అనుసంధానం ద్వారా యోగాను వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణకు బలమైన స్తంభంగా రూపుదిద్దడానికి గడచిన ఐదేళ్లుగా మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఫలితంగా ఇవాళ అతిథుల గదినుంచి పడగ్గదిదాకా, పార్కుల నుంచి నగరాల్లోని క్రీడా ప్రాంగణాలవరకూ, వీధుల నుంచి ఆరోగ్య శ్రేయో కేంద్రాలదాకా దేశంలోని దాదాపు ప్రతిచోటా యోగాపై అవగాహన పెరగడమే కాదు; నేడు యోగా అంతటా అనుభవంలోకి వచ్చింది.
సోదరీసోదరులారా!
నేటి యువతరం సంప్రదాయ యోగా పద్ధతులతో అనుసంధానమై దానికి కొత్త మెరుగులద్దుతూ ప్రాచుర్యం కల్పిస్తుండటం చూస్తుంటే నాకెంతో సంతోషం, సంతృప్తి కలుగుతోంది. యువతరం వినూత్న, సృజనాత్మక ఆలోచనల తోడ్పాటుతో యోగా మునుపటికన్నా ప్రజాదరణ పొందడంతోపాటు మరింతగా జీవం పోసుకుంటోంది. మిత్రులారా… ఇవాళ, ఈ సందర్భంగా ‘యోగాకు ప్రోత్సాహం-అభివృద్ధికిగాను ప్రధానమంత్రి పురస్కారం’ గురించి మా మంత్రి ప్రకటన చేశారు. ఇందుకు అర్హులైనవారిని ప్రత్యేక నిర్ణేతల సంఘం ఎంపిక చేసింది. ఆ మేరకు కఠోర శ్రమ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాచుర్యానికి కృషిచేసినవారి పేర్లను ప్రకటించింది. యోగాపట్ల ఈ పురస్కార విజేతల అంకితభావాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా!
ఈ ఏడాది ‘‘గుండె సంరక్షణకు యోగా’’ ఇతివృత్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. గుండె సంరక్షణ ప్రపంచవ్యాప్తంగా నేడొక సవాలుగా మారింది. భారతదేశంలో గడచిన రెండు-రెండున్నర దశాబ్దాలుగా గుండె జబ్బుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోయింది. అందునా యువతరంలో గుండె సంబంధిత సమస్యలు పెరుగుతుండటం మరింత ఆందోళనకరం. ఇటువంటి పరిస్థితుల నడుమ గుండె సంరక్షణపై అవగాహన పెంచడంతోపాటు గుండెజబ్బుల నివారణ-చికిత్సలో యోగాను ఒక భాగం చేయడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో యోగాను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు పెద్దపెద్ద యోగాశ్రమాలు కృషి చేయాలని కోరుతున్నాను. ఆ మేరకు రాంచీలోని ‘రిఖ్యాపీఠ్ యోగాశ్రమం, యోగ్దా సత్సంగ సఖాశ్రమం’ వంటివాటితోపాటు ఇతర సంస్థలు కూడా ‘గుండె సంరక్షణపై అవగాహన పెంపు’ ప్రధానంగా యోగాభ్యాసానికి ఏర్పాట్లు చేయాలని నా విజ్ఞప్తి.
మిత్రులారా!
జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఆకాంక్షను నెరవేర్చుకోవాలంటే చక్కని ఆరోగ్యం అవశ్యం. అలసిన శరీరం, సొలసిన మనసు ఎన్నడూ కొత్త స్వప్నాలను ఆవిష్కరించనూ లేవు… ఆకాంక్షలను నెరవేర్చుకోలేవు. చక్కని ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం నాలుగు ‘ప’… పానీ (నీరు), పోషణ్ (పౌష్టికాహారం), పర్యావరణం, పరిశ్రమ (కష్టించి పనిచేయడం)లను గుర్తుంచుకోవాలి. నిర్మలమైన నీరు, పౌష్టికాహార సమృద్ధి, శుభ్రమైన గాలిసహా పరిశుభ్ర పరిసరాలు మాత్రమేగాక కష్టించి పనిచేయడాన్ని కూడా జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. మిత్రులారా… ‘ప’… కచ్చితంగా ఫలితమిస్తుంది.
మిత్రులారా!
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాలుపంచుకున్న ప్రపంచ దేశాల ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా అంకితభావంగల యోగాభ్యాసకులు సూర్యుని తొలి కిరణాలకు స్వాగతం పలికే దృశ్యం అద్భుతం. యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోవడమేగాక జీవితంలో విడదీయరాని భాగస్వామిగా చేసుకోవాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. యోగా ప్రాచీనమేగాక ఆధునికం కూడా… అది నిరంతర పరిణామం చెందుతోంది. శతాబ్దాలుగా యోగా సారాంశం ఒక్కటే: ఆరోగ్యవంతమైన శరీరం, నిశ్చలమైన మనస్సు, ఐక్యతా స్ఫూర్తి ఇందులో అంతర్భాగం.అంతేగాక జ్ఞాన, కర్మ లేదా పని, భక్తి లేదా అంకితభావాల పరిపూర్ణ సమ్మేళనాన్ని యోగా అందిస్తుంది. ఆలోచనల్లో, కార్యాచరణలో, స్ఫూర్తిలో ప్రతి వ్యక్తినీ యోగా మెరుగుపరుస్తుంది. మిత్రులారా… యోగాభ్యాసానికి బహుశా మునుపటికన్నాఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఒత్తిడి, జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్న పరిస్థితుల్లో నేడు మనం జీవిస్తున్నాం. దైనందిన కార్యకలపాల్లో వేగం, పని ప్రదేశంలో ఒత్తిడుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిభగల యువతీయువకులు మాదక ద్రవ్యాలకు, మద్యపానానికి బానిసలై మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని చదివినపుడు నాకెంతో ఆవేదన కలుగుతుంది. ఈ సమస్యలన్నిటికీ యోగా అద్భుత పరిష్కారం చూపుతుంది. అంతేకాకుండా సమాజంలో అందరి మధ్యా ఐక్యతా భావాన్ని యోగా ప్రోదిచేస్తుంది. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను రూపుమాపడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది. మిత్రులారా… శాంతిసామరస్యాలు యోగాతో ముడిపడి ఉన్న నేపథ్యంలో 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ‘‘శాంతి, సామరస్యం, ప్రగతికి యోగాభ్యాసమే తారకమంత్రం’’ అన్నది మన నినాదం కావాలని ఆకాంక్షిద్దాం.
సోదరీసోదరులారా!
అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు మేం అనేక ప్రభావవంతమైన చర్యలు తీసుకున్నాం. వాటివల్ల కలిగిన ప్రయోజనాలను కూడా మనమిప్పుడు చూస్తున్నాం. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరి జీవితంలో, అలవాట్లలో యోగాభ్యాసం ఒక భాగమయ్యేలా మనం అలుపెరుగని కృషి చేయాల్సి ఉంది. ఈ దిశగా యోగా బోధకులు, అభ్యాసకులు, సంస్థల పాత్ర మరింత విస్తరించనుంది. కోట్లాది ప్రజల జీవితాల్లో యోగాను భాగం చేయడానికి మానవశక్తిని సిద్ధం చేయడం, వనరుల అభివృద్ధి అవసరం. యోగాభ్యాసం, యోగా సంస్థలతో ముడిపడిన ప్రమాణాలను అభివృద్ధి చేయగలిగినప్పుడే ఇది సాధ్యం. అందుకే ఈ ఆలోచనను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.
మిత్రులారా!
ప్రపంచం నేడు యోగాను అనుసరిస్తోంది. అందువల్ల యోగా సంబంధిత పరిశోధనలపైన కూడా మనం దృష్టి సారించాల్సి ఉంది. మన మొబైల్ ఫోన్ల సాఫ్ట్‘వేర్‘ను నిత్యనూతనం చేసుకుంటున్న విధంగానే యోగాపై సమాచారం పరంగానూ ప్రపంచాన్ని మనం నిత్యనూతనం చేయాల్సి ఉంది. అంటే- యోగా ఒక స్థాయికి పరిమితం కాకుండా చూడటం అత్యావశ్యకం. ఔషధ, భౌతికచికిత్స, కృత్రిమ మేధస్సులతో యోగాను జోడించడం అవసరం. అంతేకాకుండా యోగాతో ముడిపడిన ప్రైవేటు స్ఫూర్తిని కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంది. అలా చేయగలిగినప్పుడు మాత్రమే యోగా విస్తరణ సాధ్యమవుతుంది. ఈ అవసరాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం వివిధ రంగాల్లో కృషి చేస్తోంది. మీకందరికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మరోసారి ఆకాంక్షిస్తూ- ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇవాళ ఇక్కడ ప్రదర్శించిన అన్ని యోగాసనాల అభ్యసన సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోగలరని ఆశిస్తున్నాను; అలాగని అవసరాన్ని మించి ఆసనాలు వేయరాదు. క్రమం తప్పని యోగాభ్యాసంతో మీ జీవితాల్లో అద్భుత ఫలితాలు ఒనగూడటం ఖాయం. చక్కని ఆరోగ్యం, మనశ్శాంతి, సామరస్యం, చక్కని సమన్వయంగల జీవితం మీ సొంతం కావాలని ఆశిస్తూ మీకు మరొకసారి నా శుభాకాంక్షలు.
రండి… ఇక మనం యోగాసనాలు ప్రారంభిద్దాం!
అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం స్వల్ప సమయంలోనే భారీ ఏర్పాట్లు చేసిన ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. దీన్ని గురించి వారికి ముందస్తు సమాచారమేదీ లేదు… కేంద్రంలో రెండోసారి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాంచీలో ఈ బృహత్ కార్యక్రమం నిర్వహించాలన్న ఆలోచన కేవలం రెండు వారాల కిందట నాకు కలిగింది. అయినప్పటికీ తక్కువ వ్యవధిలోనే దీన్ని విజయవంతం చేయడంలో ఝార్ఖండ్ కృతకృత్యురాలైంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ప్రదర్శించిన దీక్షాదక్షతలను అభినందిస్తున్నాను.
కృతజ్ఞతలు!