మాననీయ ఉప రాష్ట్రపతి; లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గారు; గులాం నబీ గారు; ఈ నాటి కార్యక్రమాని కి ఒక విధం గా కేంద్ర బిందువు అయిన శ్రీ హరివంశ్ గారు, చంద్రశేఖర్ గారి యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆయన ఆలోచనల ను పంచుకొనే ఆయన సహచరులు అందరు..
ఈ కాలం లో రాజకీయ ముఖచిత్రం నుండి నిష్క్రమించిన తరువాత, కనీసం రెండు సంవత్సరాల పాటయినా మనుగడ సాగించడం అతి కష్టం గా ఉంటుంది. ప్రజలు మరచిపోతారు; అనుయాయులు కూడా మరచిపోతారు, మరి అటువంటి వ్యక్తిత్వం బహుశా చరిత్ర లో ఏదో ఒక మూలన మరుగునపడిపోతుంది.
మనం ఈ వాస్తవాన్ని గుర్తు పెట్టుకొని తీరాలి.. అదేమిటంటే చంద్రశేఖర్ గారు నిష్క్రమించి దాదాపుగా 12 సంవత్సరాలు గడచిపోయిన తరువాతా అదే రూపం లో ఈ రోజు కు కూడా మన మధ్య సజీవంగా వున్నారు అన్నది. ఈ పని ని పూర్తి చేసినందుకే కాక, ఈ కార్యభారాన్ని వహించే ‘ధైర్యాన్ని’ కూడా కలిగివున్నందుకు హరివంశ్ గారి ని నేను అభినందించ దలచుకొన్నాను. నేను ఇక్కడ ధైర్యం అనే మాట ను నేను ఎందుకు ఉపయోగించానంటే గడచిన కొన్ని సంవత్సరాల లో మన దేశం లో రాజకీయ క్రీడ తీవ్రతరం గా మారిపోయినటువంటి వాతావరణమొకటి సృష్టించబడింది. హరివంశ్ గారు పాత్రికేయ రచనా జగత్తు నుండి వచ్చినటువంటి తటస్థ వ్యక్తి. అంతేకాదు ఆయన రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ గానూ ఉన్నారు. ఏమైనా, ఈ గ్రంథావిష్కరణ జరిగాక ఒక ఫలానా ముద్ర ను ఆయన కు అంటగడతారన్న భయం నాలో ఉంది.
చంద్రశేఖర్ గారి తో పని చేసే అవకాశం నాకు చిక్కలేదు. ఒకసారి 1977వ సంవత్సరం లో ఆయన ను కలుసుకొనే అవకాశం నాకు దక్కింది. నేను కొన్ని ఘటనల ను మీకు వెల్లడి చేయాలనుకొంటున్నాను. ఒకసారి భైరాన్ సింహ్ షెఖావత్ గారు, నేను పార్టీ పని మీద వెళ్తూ ఢిల్లీ విమానాశ్రయం లో వేచివున్నాము. చంద్రశేఖర్ గారు కూడా ఏదో వ్యక్తిగత పని మీద వెళ్తున్నారు. చంద్రశేఖర్ గారు మా వైపు నడచి రావడాన్ని దూరం నుండి మేము చూశాము. వెంటన్ భైరాన్ సింహ్ గారు నన్ను పక్కకు తీసుకుపోయి ఆయన జేబు లో ఉన్న వస్తువులన్నీ నా జేబు లో వేసేశారు. అంతా ఎంత త్వరగా జరిగిపోయిందంటే ఆ వస్తువుల ను నా జేబు లో ఎందుకు పెట్టారంటూ నేను అడిగే లోపలే చంద్రశేఖర్ గారు మా దగ్గరకు వచ్చేశారు. చంద్రశేఖర్ గారు చేసిన మొట్టమొదటి పని భైరాన్ సింహ్ గారి జేబుల లోకి చేతులు పెట్టి వెదకడం. అప్పుడు నాకు అర్థమైంది. భైరాన్ సింహ్ గారు పాన్‌పరాగ్, ఇంకా పొగాకు ల వంటివి అట్టిపెట్టుకొనేవారు. చంద్రశేఖర్ గారికేమో అవంటే అసలు పడదు. భైరాన్ సింహ్ గారు చంద్రశేఖర్ గారి ని కలుసుకొన్నప్పుడల్లా ఆ వస్తువుల ను తీసి చెత్తబుట్ట లోకి విసరివేసే వారు. మరి ఇదే విధమైనటువంటి స్థితి ని తప్పించుకోవాలనే భైరాన్ సింహ్ గారు తన కు చెందిన వస్తువుల ను నా జేబు లోకి మార్చివేశారు అని గ్రహించాను.
ఒక పక్కన జన సంఘ్, భారతీయ జనతా పార్టీ మరియు ఆ పార్టీ సిద్ధాంతలు, మరొక పక్కన చంద్రశేఖర్ గారు, ఆయన సిద్ధాంతాలూను. అయినా సహచర భావం మరి, అలాగే దాపరికం లేని తనం ఉండేవి. చంద్రశేఖర్ గారు ఎల్లప్పుడూ భైరాన్ సింహ్ గారి ఆరోగ్యం విషయం లో తల్లడిల్లుతుండే వారు. ఇది ఒక గొప్ప విషయం. చంద్రశేఖర్ గారు వ్యక్తిగతం గా, ప్రజల మధ్య సైతం అటల్ గారి ని ‘‘గురువు గారు’’ అని సంబోధిస్తూ ఉండే వారు. సభ లో సైతం ఏదైనా చెప్పబోయే ముందు ఆయన అనే వారు, ‘‘గురువు గారు, దయచేసి నన్ను క్షమించండి; మిమ్మల్ని నేను విమర్శించబోతున్నాను’’ అని. మీరు పాత రికార్డుల ను చూశారంటే ఆయన యొక్క విలువ లు అటువంటివి అని, అవి ఆయన యొక్క గౌరవాన్ని ప్రతిబింబించేవి అని మీరు అర్థం చేసుకొంటారు.
కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభ వెలిగి పోతున్న కాలం లో తిరుగుబాటు పంథా ను ఎంచుకోవాలని, ఈ వ్యక్తి ని ప్రేరేపించినటువంటి అంశం లేదా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఏమిటంటారు ? బహుశా బాఘీ బలియా యొక్క విలువ లు, బాఘీ బలియా యొక్క గడ్డ ఆయన ను ప్రేరేపించి ఉండాలి. నేను రెండు ప్రధానమైన చారిత్రక ఘటనల ను అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటివి గా పరిగణిస్తున్నాను. అవి ఏమిటంటే, జయప్రకాశ్ నారాయణ్ గారు- బిహార్ ఇంకా మహాత్మ గాంధీ- గుజరాత్. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాని కి ప్రధాన మంత్రి ని ఎంచుకోవలసి వచ్చినప్పుడు ఒక గుజరాతీ ఒక గుజరాతీయేతరుడి ని ఎంపిక చేశారు. అదే విధం గా ప్రజాస్వామ్య పోరాటం లో గెలిచిన తరువాత ప్రధాన మంత్రి ని ఎంపిక చేయవలసి వస్తే ఆయన ఒక బిహారీ కి బదులు, ఒక గుజరాతీ ని ఎంపిక చేశారు.
ఆ కాలం లో, ఓ విచిత్ర పరిస్థితి ఉండింది. మరి, చంద్రశేఖర్ గారినో లేదా మొరార్జీ భాయి నో ఎంపిక చేసుకోవలసి వచ్చింది. చంద్రశేఖర్ గారి కి ఉన్నటువంటి కొద్ది మంది సహచరుల లో మోహన్ ధారియా గారు, జార్జ్ ఫెర్నాండెజ్ గారు లతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. వారి మాటలు సదా చంద్రశేఖర్ గారి ఆలోచనలను, ప్రవర్తన ను ప్రభావితం చేసేవి. అవి గౌరవ భరితం గా కూడా ఉండేవి. ఎంతో మంది ఇతరులు ఉంటే ఉండవచ్చు గాని వారి తో నాకు ఏ సంబంధం లేకపోయింది.
చంద్ర శేఖర్ గారు కొద్ది కాలం పాటు అస్వస్థులు అయ్యారు. వారు కాలం చేసే కన్నా కొద్ది నెలలు ముందు టెలిఫోన్ లో నన్ను పలకరించారు. ఆ కాలం లో నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నాను. ‘‘సోదరా, నువ్వు ఢిల్లీ కి ఎప్పుడు వస్తున్నావు?’’ అంటూ ఆయన అడిగారు. ఏమిటి విషయం అని నేను వాకబు చేశాను. దానికి ఆయన అన్నారు ‘‘నువ్వు నా ఇంటి కి వస్తావా అని ఆశ్చర్యపోతున్నాను. వస్తే మనం కలుసుకోవచ్చు. నేను ఆరోగ్యం గా ఉండి వుటే నా అంతట నేనే వచ్చే వాడిని’’ అని. దీనికి బదులు గా నేను అన్నాను.. ‘‘మీరు నన్ను తలవడమే ఒక గొప్ప మర్యాద. మరి మీరు నన్ను కుశలం అడిగారు’’ అని. ఈ కారణం గా, నేను వెళ్ళి ఆయన ను కలుసుకున్నాను. ఆయన కు ఒంట్లో బాగా లేకపోయినప్పటి కీ నాతో చాలాసేపు మాట్లాడారు. గుజరాత్ ను గురించి తెలుసుకొనే ప్రయత్నం కూడా చేశారు. గుజరాత్ లో ప్రభుత్వ స్థాయి లో జరుగుతున్నదంతా అర్థం చేసుకోవడాని కి ఆయన యత్నించారు. అటు తరువాత దేశం లోని సమస్యల పై తన ఆలోచనల ను గురించి, వాటి ని పరిష్కరించవలసిన మార్గాల ను గురించి ఆయన వివరించారు. ఆయన అన్నారు కదా, ‘‘నువ్వు యువకుడివి. వీటి ని నువ్వు పరిష్కరించాలి’’ అని. ఆయన అమిత భావోద్వేగాని కి లోనయ్యారు. అదే ఆయన తో నా కడపటి భేటీ. కానీ, ఈ రోజు కు కూడాను ఆయన యొక్క ముఖచిత్రం చెరిగిపోలేదు. ఆయన ఆలోచనల లోని స్పష్టత, సామాన్య ప్రజానీకం పట్ల ఆయన కు ఉన్న నిబద్ధత, ప్రజాస్వామిక వ్యవస్థ ల పట్ల ఆయన కు ఉన్న అంకిత భావం.. ఇవి ఆయన ఆడిన ప్రతి ఒక్క మాట లో సాక్షాత్కరిస్తున్నాయి.
హరివంశ్ గారు వ్రాసిన చంద్రశేఖర్ గారి పుస్తకం, చంద్రశేఖర్ గారి ని గురించి అర్థం చేసుకొనేందుకు మన కు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తుంది. అయితే, ఈ పుస్తకం లో చాలా విషయాలు- ఆ కాలాని కి సంబంధించి ఇంతవరకు మనకు చెప్పబడినటువంటి విషయాల కన్నా- విరుద్ధం గా ఉన్నాయి. అందువల్ల. ఒక వర్గం ఆ గ్రంథాన్ని బహుశా ఆ దృష్టి కోణం లో విశ్లేషించేందుకు ఆస్కారం ఉంది. మరి మన దేశం లో ఒక రివాజు అంటూ ఉంది. అది ఏమిటి అంటే విషయాల ను విశ్లేషించడాని కి కొంత మంది కొన్ని హక్కుల ను కలిగివుంటారు అనేదే.
ఈ రోజు న ముక్కు ముఖం లేనటువంటి ఒక నేత సైతం 10-12 కిలో మీటర్ల పాదయాత్ర ను నిర్వహిస్తే, టివి చానల్స్ ఆ విషయాన్ని 24 గంటల సేపు ప్రసారం చేస్తాయి. మరి ఆ వార్త వార్తా పత్రికల లో మొదటి పేజి లో పతాక శీర్షికల కు ఎక్కుతుంది. కానీ, చంద్రశేఖర్ గారు ఎన్నికల ను దృష్టి లో పెట్టుకొని పాదయాత్ర చేయలేదు. ఆయన పేద రైతులు, మరియు పల్లెల ను దృష్టి లో పెట్టుకొని పాదయాత్ర చేశారు. మనమేమో దేశ ప్రజలు ఆయన కు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడం లో విఫలం అయ్యాము. ఇది నిజం గా దురదృష్టకరమూ, బాధాకరమూను.
ఈ రోజు కు కూడా ఆయన ఆలోచనల విషయం లో అభిప్రాయ భేదం అంటూ ఉండవచ్చు. ప్రజాస్వామ్యం యొక్క ప్రత్యేక లక్షణమే అది. అయితే, ఉద్దేశపూర్వకం గా , ఒక ప్రణాళికాబద్ధ వ్యూహం తో చంద్రశేఖర్ గారి సందర్శన ను విరాళాల సేకరణ కు, పెట్టుబడిదారుల నుండి సొమ్ము వసూలు కు మరియు అవినీతి వగైరా ల కోసమే అంటూ అభివర్ణించడం జరిగింది. ప్రజా జీవనం లో అంతటి ఘోర అన్యాయం ఉంటుంది. హరివంశ్ గారు తన పుస్తకం లో ఈ విషయాన్ని తీసుకున్నారో, లేదో నాకు తెలియదు కానీ, నేను ఆ విషయాన్ని నిశితం గా అధ్యయనం చేసేందుకు ప్రయత్నం చేశాను.
మన దేశం లో మరొక్క విషయం కూడా ఉంది. మన దేశం లో ఇంత వరకు ప్రధాన మంత్రులు గా పని చేసిన వారు ఎంత మంది అని నూతన తరాన్ని గనుక అడిగితే, బహుశా ఏ ఒక్కరి కీ అది తెలియకపోవచ్చు. ప్రధాన మంత్రులు గా ఎవరెవరు ఉన్నారు? ఆ విషయం తెలిసిన వారు అతి కొద్ది మంది. వారిని మరచిపోయేటట్టు చేశారు. అటువంటి పరిస్థితుల లో హరివంశ్ గారు మీరు ధైర్యం చేసి ఒక పని ని పూర్తి చేశారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. దీని లో ప్రతి ఒక్కరి కి భాగం ఉంది కానయితే నన్ను క్షమించండి.. బాబాసాహబ్ ఆంబేడ్కర్ గారు మరియు సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు లకు ఒక వ్యతిరేక ప్రతిష్ట ను ఆపాదించడాని కి ప్రయత్నించిన ఒక ఫలానా బృందం అంటూ ఉండింది.. అది ఏమని అంటే వారు ఏ విషయాన్నీ ఎరుగరు అంటూ ప్రచారం చేయడం జరిగింది.
లాల్ బహాదుర్ శాస్త్రి గారు ఈ రోజు న సజీవం గా ఉండి ఉన్నట్లయితే ఈ బృందం ఆయన ను కూడా ఇదే మాదిరి గా చిత్రించేది. లాల్ బహాదుర్ శాస్త్రి గారు రక్షింపబడ్డారు ఎందుకని అంటే ఆయన ప్రాణ సమర్పణం చేయడమనేది సర్వోన్నతమైంది.
ఆ తరువాత మొరార్జీ భాయ్ ఏమి సేవించారనేది, లేక ఎవరో ఒక ప్రధాన మంత్రి సమావేశాల వేళ కునుకు తీశారని, లేకపోతే ఎవరో ఒక ప్రధాన మంత్రి వెన్నుపోటు పొడిచారని చర్చలు మొదలయ్యాయి. అంటే ప్రతి ఒక్కరి కి అటువంటి బిరుదుల ను ఇచ్చారు. తద్వారా ప్రపంచం వారిని మరచిపోయేటట్టు అన్న మాట.
కానీ, మీ యొక్క ఆశీర్వాదాల తో నేను పూర్వ ప్రధాన మంత్రులు అందరి కీ ఢిల్లీ లో ఒక అధునాతనమైన మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాను. పూర్వ ప్రధానులు అందరి కుటుంబ సభ్యుల కు మరియు స్నేహితుల కు నేను చేసే మనవి ఏమిటంటే, వారికి చెందిన వస్తువుల ను భద్రం గా సేకరించి, అట్టిపెట్టండి అని. అదే జరిగితే, వారిని గురించి భావి తరాలు తెలుసుకో గలుగుతాయి. చంద్రశేఖర్ గారు మనకు ప్రధాన మంత్రి గా ఉండే వారు. మరి ఆయన చేసిన సేవలు అవి, లేదా ఆయా వస్తువులు, చరణ్ సింహ్ గారి యొక్క ప్రత్యేకతలు అని గాని, లేదా దేవ గౌడ గారు, ఐ.కె. గుజ్రాల్ గారు లేదా డాక్టర్ మన్ మోహన్ సింహ్ గారి ల సేవలు ఇవి అని గాని. అయితే ప్రతిదీ రాజకీయాల తో అనుబంధం లేనిదై ఉండాలి సుమా.
దేశం లోపల ఒక కొత్త రాజకీయ సంస్కృతి మనకు అవసరం. మరి మేము అదే పని ని చేయాలని ప్రయత్నిస్తున్నాము. మనం గనుక చంద్రశేఖర్ గారి ని ప్రజల ఎదుట సరి అయిన దృష్టి కోణం లో ఆవిష్కరించ గలిగినప్పుడు చంద్రశేఖర్ గారు ఈ రోజు కు కూడా ప్రజల ను ప్రేరితుల ను చేయగలుగుతారు. ఈ రోజు న సైతం, ఆయన ఆలోచనల తో, యువజనుల యొక్క మస్తిష్కాల ను ప్రజాస్వామిక విలువల తో సుసంపన్నం చేయడం కుదిరే పనే. ఒక అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని అనుసరించవలసిన అగత్యమే ఉండదు.
ఆయన ప్రధాన మంత్రి పదవి కి రాజీనామా ఇవ్వవలసి వచ్చినప్పటి సంగతి నాకు స్పష్టం గా జ్ఞాపకం ఉంది. ఐబి కి చెందిన ఒక పోలీసు అధికారి ఢిల్లీ లో కలకలం రేపారు. ఒక పోలీసు అధికారి కారణం గా ఒక ప్రభుత్వం పతనం కావచ్చన్న సంగతి ని లోకం గమనించింది.
ఆ రోజు న నేను నాగ్‌పుర్ లో ఉన్నాను. అటల్ గారు, మరియు ఆడ్వాణీ గారు ల యొక్క కార్యక్రమమొకటి అక్కడ నిర్వహించబడుతోంది. అయితే, వారు అక్కడ కు ఆలస్యం గా చేరుకొంటారని భావించారు. అక్కడ కు నేను ముందుగానే వెళ్ళిపోయాను. అక్కడ నేను ఉన్న చోటు కు చంద్రశేఖర్ గారి వద్ద నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన అడిగారు.. ‘‘గురువుగారు ఎక్కడ?’’ అని. దానికి నేను బదులిచ్చాను.. ‘‘ఆయన విమానం ఇంకా రాలేదు, అందుకు బహుశా ఒక గంట సేపు పట్టవచ్చు’’ అని. ఆయన అన్నారు. ‘‘నేను ఎదురుచూస్తున్నాను. ఆయన తో నేను సాధ్యమైనంత త్వర గా మాట్లాడాలి అనుకొంటున్నాను. ఆయన కు చెప్పు ఏమని అంటే రాజీనామా చేయాలని నేను నిర్ణయించుకొన్నానన్న సంగతి ని. కానీ, ఆయన తో నేనే మాట్లాడాలని అనుకొంటున్నాను’’ అని. ఆ సమయం లో అటల్ గారు నాగ్‌పుర్ కు రావలసి వుండింది. మరి నేనేమో ఏర్పాట్లను పరిశీలించడం కోసం అక్కడ కు చేరుకొన్నాను. అయితే, చంద్రశేఖర్ గారు తాను గురువు గారూ అని పిలిచే ఆయన తో- తాను తుది నిర్ణయాన్ని తీసుకొనే కన్నా ముందు- ఎట్టి పరిస్థితుల లో మాట్లాడాలని అనుకొన్నారు.
ఆయన లో ఆ తరహా ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. ఆయన తన జీవితం లో 40 సంత్సరాలు ఒక ఎంపీ గా దేశ ప్రజల సంక్షేమం కోసం, అణచివేత కు లోనయిన, వంచన కు గురి అయిన వారి సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం పాటు పడిన స్థలం లో ఆయన ను మనం మరొక్క సారి తలచుకొంటున్నాము. ఆయన నుండి ప్రేరణ ను పొందుతూ, మనం దేశం లోని సామాన్య మానవుడి కోసం ఎంతో కొంత చేయగలిగామంటే, అదే ఆయన కు అర్పించేటటువంటి యథార్థ నివాళి అవుతుంది.
మరొక్క మారు చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యుల ను, మరియు హరివంశ్ గారిని అభినందిస్తూ, నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
మీ అందరికీ ధన్యవాదాలు.