మనం రెండు-మూడు రోజుల తరువాత రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోనున్నాము. నా సోదరీమణులైన మీరంతా, నా కోసం ఒక ఘనమైన రాఖీ ని తీసుకొని ఇక్కడకు వచ్చారు; నేను మీ అందరికీ కృతజ్ఞుడినై వుంటాను. నా దేశం లోని మాతృమూర్తులకు మరియు సోదరీమణులకు అందరికీ తమ తమ ఆశీస్సులను నాపై వర్షించి వారి ఆశీర్వాదాలతో నన్ను కాపాడినందుకుగాను నా హృదయపూర్వక కృతజ్ఞతలను నేను వ్యక్తం చేయదలుస్తున్నాను.
రక్షాబంధన్ పండుగ సమీపించింది. గుజరాత్ లోని ఒక లక్ష కు పైగా కుటుంబాలు వారి సోదరీమణుల పేర్ల తో నమోదు అయినటువంటి సొంత ఇళ్ళ ను అందుకొంటున్నారు. రక్షాబంధన్ సందర్భం లో అందిన అత్యంత ఘనమైన బహుమతులలో ఇది ఒకటని నేను నమ్ముతాను.
ఇల్లు లేని బాధ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. జీవితమంతా కూడాను ఒక మురికివాడ లో గడచిపోతుంది. భవిష్యత్తు ను అంధకారం కమ్మివేస్తుంది. ప్రతి ఉదయం పూటా మనిషి ఒక కొత్త ఆశ తో నిదుర లేస్తాడు; ఆ రోజు సాయంత్రానికల్లా ఆ ఆశ కూడా ఆవిరయిపోతుంది.
అయితే, ఒకరికి అతడు లేదా ఆమె పేరు తో ఒక ఇల్లు గనక నమోదై ఉంటే, ఆ వ్యక్తి మళ్లీ కలలు కనడం మొదలుపెడతారు. అప్పుడు కుటుంబం లోని చిన్నా పెద్దా ఆ స్వప్నాన్ని నెరవేర్చుకోవడం కోసమని కష్టించి పని చేయడానికి నడుం కడుతారు. మరి వారి జీవితాలు పరివర్తన చెందడం ఆరంభం అవుతుంది.
రక్షాబంధన్ పండుగ కు కొద్ది రోజుల ముందు ఈ ఇళ్ళ ను లక్ష మంది కి పైగా కుటుంబాలకు చెందిన మాతృమూర్తులకు, సోదరీమణులకు ఒక సోదరుని మాదిగా నజరానా గా ఇస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా వుంది.
మరో పథకం- 600 కోట్ల రూపాయల విలువైంది- కూడా ఉంది; ఇది ఒక రకంగా చూస్తే మాతృమూర్తులకు మరియు సోదరీమణులకు ఒక కానుక వంటిది. ఒక కుటుంబం లో నీటి ఎద్దడి తాలూకు ప్రభావం ఆ కుటుంబం లోని తల్లి మీద, సోదరీమణుల మీద గరిష్ఠంగా ఉంటుంది. ఈ రోజుకు కూడాను నీటి ని ఒక కుటుంబం లోని తల్లి లేదా సోదరీమణులే సమకూర్చవలసి వస్తోంది. పరిశుభ్రమైన త్రాగునీటి లభ్యత కొరవడినందువల్ల ఆ ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది. శుభ్రమైన త్రాగునీరు ఒక కుటుంబాన్ని అనేకమైన వ్యాధుల బారిన పడకుండా అడ్డుకోగలుగుతుంది.
నేను నా జీవితం లో గణనీయమైనటువంటి భాగాన్ని ఆదివాసి ప్రాంతాలలోనే గడిపాను. నేను ధరంపుర్ సిదాంబాడి లో ఉంటున్నప్పుడు ఒక ప్రశ్న నా మనస్సు లో ఉదయించేది. ఆ ప్రాంతం భారీ వర్షపాతాన్ని అందుకొన్నా దీపావళి అనంతర కాలంలో రెండు నెలల పాటు ఆ ప్రాంతం నీటి కొరత తో సతమతం అయ్యేది. నాకు చాలా బాగా గుర్తుంది.. ఆ కాలం లో ధరంపుర్, సిదంబుర్, ఉమర్ గావ్ నుండి అంబాజీ వరకు విస్తరించిన యావత్తు ఆదివాసీ మండలం భారీ వర్షాలు కురిసినప్పటికీ నీరంతా కూడా సముద్రం లో కలసిపోయేది. పర్యవాసానంగా, ఆ ప్రాంతాలు ఎండిపోయేవి.
నేను గుజరాత్ ముఖ్యమంత్రి పదవి లో ఉండగా, గుజరాత్ కు మధ్య ఉమర్ గావ్, ఇంకా అంబాజీ ల మధ్య వ్యాపించిన తూర్పు గిరిజన ప్రాంతాల లోని ప్రతి పల్లె లో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు పంపు ల ద్వారా నీటిని అందుకొనే విధంగా చూడటానికి వేలాది కోట్ల రూపాయలను వినియోగించాను.
మీరు ఇప్పుడే తిలకించిన ఒక చిత్రం లో దాదాపు 10 పథకాలను గురించిన ప్రస్తావన ఉంది. వాటిలో నుండి పదో పథకం ఈ రోజున ఆరంభం కాబోతోంది. ఈ చిత్రాన్ని చూసిన వారు ఒక భవనం లోని 200వ అంతస్తు అంత ఎత్తు కు కూడా నీరు చేరుకోవడం చూసి అచ్చెరువు చెంది వుంటారు. నది నీటి ని అంత ఎత్తుకు తీసుకు పోవడం, మరి అక్కడ నుండి నీటిని దిగువ ప్రాంతాల లోని ప్రజలకు సరఫరా చేయడం జరుగుతుంది. సాంకేతిక విజ్ఞానం యొక్క విడ్డూరమిది.
మన దేశం లో గిర్ లోని సుదూర అటవీ ప్రాంతం లో ఒకే ఒక్క వోటరు కోసం సైతం మనం ఒక పోలింగు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొన్నాం. భారతదేశం లో ఎన్నికలకు సంబంధించిన మరియు ప్రపంచ వ్యాప్తంగా పోలింగ్ పరంగా అత్యంత జనాకర్షకమైన అంశం ఇది. వార్తాపత్రికలలో ఒక గడి కట్టి ఆ గడి లో ఈ వార్తను అచ్చు వేస్తూ వుంటారు.
ఈ సరికొత్త పరిణామం కూడా ఒక అద్భుతంగా మారుతుందని నేను నమ్ముతాను. 200-300 కుటుంబాలు ఉన్న ఒక గ్రామానికి నీటిని సరఫరా చేయడం కోసం ఒక స్పందించే శక్తి కలిగిన ప్రభుత్వం నీటి ని ఒక భవనం లోని 200వ అంతస్తు తో సమానమైన ఎత్తుకు తీసుకుపోతోంది. మన దేశం లోని ప్రతి ఒక్క పౌరుడి పట్ల మాకు ఉన్నటువంటి నిష్ఠ కు ఇది ఒక సజీవ నిదర్శనం.
ఇంతకు ముందు కూడా ఆదివాసీ ముఖ్యమంత్రుల తో ఏర్పాటైన ప్రభుత్వాలు పని చేశాయి. నేను ముఖ్యమంత్రి ని కాక పూర్వం ఒక ఆదివాసీ ముఖ్యమంత్రి అధికారం లో ఉండే వారు. నేను ముఖ్యమంత్రి ని అయిన తరువాత ఆయన గ్రామాన్ని సందర్శించాను. అక్కడ నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి; అయితే, వాటిలో ఒక్క నీటి చుక్క అయినా లేదు. ఆ గ్రామానికి నీటి ని అందించే అవకాశం దక్కిన భాగ్యశాలిని నేను.
ఎవరైనా దారిన పోయే వారికి ఒకటి లేదా రెండు కుండ లలో నీటిని అట్టిపెట్టి వుంచితే, ఏళ్ల తరబడి అటువంటి కుటుంబాన్ని ప్రజలు ఎంతో గౌరవం తోను, గర్వం గాను తలచుకొంటారు.
గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల లోని పల్లెలలో నీటిని అందించడం కోసం కృషి చేసిన లఖా బల్‌ధారా గురించి ప్రజలు ఈ రోజు కు కూడా కథలు కథలుగా వర్ణించి చెబుతారు. ఎందుకని? దీనికి కారణం ఏమిటంటే ప్రజలకు నీటిని అందించడం కోసం వారు పాటుపడ్డారు. పంపుల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి నీటిని అందజేసే ప్రచారోద్యమాన్ని గుజరాత్ ప్రభుత్వం నడుపుతోందని చాటుతున్నందుకు నేను గర్వపడుతున్నాను.
వీటిలో కొన్ని కీలకమైన ప్రశ్నలను పరిష్కరించడం కోసం మేం ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తు లో గుజరాత్ ఎలా ఉండాలి?, పేదల జీవితాలు ఎలా ఉండాలి?, మన స్వప్నాలు ఏమిటి?, ఆ స్వప్నాలను సాకారం చేయడానికి మనం తీసుకొంటున్నటువంటి చర్యలు ఏమేమిటి?
కేవలం అరగంట నుండి ముప్పావు గంట లోపల గుజరాత్ అంతటా ప్రయాణించే అవకాశం నాకు లభించడాన్ని మీరంతా చూసే వుంటారు. నేను ప్రతి జిల్లా లో పర్యటించి మాతృమూర్తులతో, సోదరీమణులతో మాట్లాడాను. వారు చెప్తున్న మాటలను నేను వింటున్నప్పటికీ, నా కళ్ళు వారి ఇళ్ళనే గమనిస్తూ వచ్చాయి. వారి గృహాలను నేను పరిశీలించ సాగాను. ఆఖరుకు మీరు కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా రూపుదిద్దుకొన్న ఇళ్ళు అంత సుందరంగా ఎలా ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు సుమా. ఇది- మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం వల్ల- ఇది సాధ్యపడింది.
ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఒక్క రూపాయి, అందులోని మొత్తం వంద పైసలు కూడాను పేదవాడి ఇంటికి చేరినందువల్ల ఇది సాధ్యపడింది. ఒక మాతృమూర్తి ని ప్రజల సమక్షంలో, పత్రికా విలేకరుల సమక్షంలో మీరు ఎటువంటి లంచాలనైనా సమర్పించుకోవలసి వచ్చిందా ? లేదా ? వారు మధ్యదళారులకు ఏమైనా చెల్లించాల్సివచ్చిందా? చెల్లించాల్సి రాలేదా? అని అడిగే ధైర్యం ఈ ప్రభుత్వానికి వుంది.
మేము మా వైపు నుండి ఒక సకారాత్మకమైన చిత్రాన్ని చిత్రిస్తున్నాం. ‘ఉహు! మేము ఎవ్వరికీ ఒక్క పైసా కూడా చెల్లించవలసిన అగత్యం రాలేదు. ఈ పథకం లో భాగంగా మేము మా హక్కులను న్యాయంగా పొందాము’ అంటూ ఎంతో విశ్వాసం తో, సంతృప్తి తో మాతృమూర్తులు, సోదరీమణులు ఆశ్చర్యపోతూ చెప్పినందుకు నేను ఆనందిస్తున్నాను.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగంగా నిర్మాణమైన ఇళ్ళను మీరు చూస్తూ వున్నప్పుడు ప్రభుత్వం కట్టిన గృహాలు అంత చక్కగా ఉంటాయా! అనే వాస్తవం తో మీరు ముగ్ధులయ్యుంటారు. నిర్మాణానికి నిధులను సమకూర్చింది ప్రభుత్వమే అనేది వాస్తవం. అయితే, అదే కాలంలో ఆ ఇంటి ని ఆయా కుటుంబాల కఠోర శ్రమ తో నిర్మించడం జరిగింది. గృహాకృతి, ఆ ఇంటిని ఏ విధమైన సామగ్రి తో నిర్మించాలి.. ఇలా ప్రతి ఒక్కటీ ఎంతో శ్రద్ధ తో వారు సమకూర్చుకొన్నారు.
నిర్మాణ పనులను మేము ప్రభుత్వ కాంట్రాక్టర్ల కు అప్పగించలేదు. ఆ పనిని మేము కుటుంబానికే ఇచ్చివేశాము. ఒక కుటుంబం తన ఇంటిని సొంతంగా నిర్మించుకొన్నప్పుడు ఆ సంతోషం మాటలకు అందదు. మరి గుజరాత్ లోని ప్రతి పల్లె లో ప్రతి ఒక్క కుటుంబమూ సుందరమైన ఇళ్ళను నిర్మించుకొంది.
మేము పేదలకు సాధికారిత ను కల్పించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించే ఒక పథకాన్ని ప్రారంభించాం. బ్యాంకులు ఉన్నప్పటికీ వాటి లోకి పేదలు అడుగుపెట్టలేక పోయే వారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ద్వారా మేము బ్యాంకులను పేదల ఇంటి వాకిటకు తీసుకువచ్చాం.
ధనికులు మాత్రమే వారి ఇళ్ళ లో విద్యుత్తు కనెక్షన్ ను కలిగి ఉండే కాలం ఒకప్పుడు ఉండేది. తమ ఇళ్ళు ఎప్పటికైనా చీకటి లో నుండి బయటకు వచ్చేవా! అని పేదలు అనుకొనే వారు. ఇవాళ.. ఉజాలా పథకం, సౌభాగ్య పథకం ల చలవ తో మేము ప్రతి ఒక్క కుటుంబానికి విద్యుత్తు కనెక్షన్ లను అందించే బాధ్యత ను స్వీకరించాము. రానున్న ఏడాది, ఏడాదిన్నర కాలంలో భారతదేశం లో ఏ ఇల్లూ విద్యుత్తు కనెక్షన్ లేకుండా ఉండి పోదు.
ఇది ఒక రకంగా స్నానాల గది, విద్యుత్తు, త్రాగు నీరు, ఇంకా గ్యాస్ స్టవ్ లను వారి ఇళ్ళకు అందజేసే హామీ తో వారి జీవనం లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వచ్చేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నం.
ప్రియమైన నా సోదరీమణులు మరియు సోదరులారా,
గుజరాత్ కు చెందిన మీరంతా నన్ను పెంచి పోషించారు. గుజరాత్ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది. మీ వద్ద నుండి నేను నేర్చుకున్నది ఏదయినా, దాని వల్లే నేను ఒక నిర్ణీత కాల వ్యవధి లో కలలను నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. స్వాంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయ్యే 2022వ సంవత్సరానికల్లా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండేటటువంటి ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలనే స్వప్నం మాకుంది.
రాజకీయవేత్తలకు ఉన్న బ్రహ్మాండమైన ఇళ్ళను గురించిన వార్తలు ప్రచురితమయ్యే కాలం ఒకప్పుడు ఉండేది; కానీ, ఇప్పుడు ప్రసార మాధ్యమాలు పేదల యొక్క భవ్యమైన గృహాలను గురించి చెప్తున్నాయి.
కుటుంబాల యొక్క ‘గృహప్రవేశ ఉత్సవం’ లో పాలుపంచుకొనే ఓ ప్రధాన మంత్రి ఇదుగో; ఈయన వల్‌సాడ్ కు విచ్చేసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించి వారి ఆనందోత్సాహాలను తాను పంచుకొంటారు.
సోదరీ సోదరులారా,
గడచిన వారం మనకు అత్యంత వేదనను మిగిల్చింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు అస్తమించారు. కానీ, ఆయన పేరు ను పెట్టిన పథకం.. అదే ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ ఏదైతే వుందో దాని ధ్యేయమల్లా పల్లె లను మెటల్ రోడ్డు లతో సంధానించాలనేదే. ఈ పనిని సకాలంలో పూర్తి చేయడం కోసం శర వేగంగా కృషి జరుగుతోంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే, విప్లవాత్మకమైన పరివర్తనను తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. సుదూర ప్రాంతాల లో మనుగడ సాగిస్తున్న కుమార్తెలు నైపుణ్యాలను ఆర్జించిన అనంతరం ఉద్యోగావకాశాలను చేజిక్కించుకొంటూ వుండడం మీరు చూసే వుంటారు. దీనికి రుజువు ను చూపెట్టే అవకాశం నాకు దక్కింది.
దేశ సమస్య లను సులభంగా నివారించవచ్చు, సామాన్య మానవుడి కలలను నెరవేర్చవచ్చు. మరి వాటిని సాధించడానికే మేము నిరంతరమూ యత్నిస్తున్నాము.
వల్‌సాడ్ లోని నా సోదరీమణులు మరియు సోదరులారా,
కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాంతాన్ని నేను సందర్శించవలసి ఉండింది. అయితే, వర్షపాతం కారణంగా దానిని నేను రద్దు చేసుకొన్నాను. ప్రస్తుతం వర్షాలు వచ్చినప్పుడల్లా కుండపోత గా ఉంటోంది; వర్షం లేనప్పుడేమో వారాల పాటు ఎండలు కాస్తున్నాయి. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు వాన నీటి వరద జలాల్లో చిక్కుకొన్నాయి. మరో పక్క ఇతర ప్రాంతాలు అసలు వర్షపాతాన్నే ఎరుగకుండా ఉన్నాయి. ఏమైనప్పటికీ, గుజరాత్ లో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది. రానున్న సంవత్సరం సైతం అద్భుతంగా ఉండబోతోంది. ఇది వ్యవసాయానికి బోలెడంత మేలు చేయగలదని నేను నమ్ముతాను.
వల్‌సాడ్ లోని ప్రియమైన నా సోదరీమణులు మరియు సోదరులారా,
ఈ సమావేశానికి హాజరు అయినందుకు, ఇంతసేపు ఓపికగా కూర్చున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇంత పెద్ద సంఖ్య లో ఈ కార్యక్రమానికి తరలివచ్చినందుకు మీకు తగినంత స్థాయి లో ధన్యవాదాలను నేను అందజేయలేకపోతున్నాను.
రక్షాబంధన్ సందర్భంగా మాతృమూర్తులకు మరియు సోదరీమణులకు అందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
।