ఇక్కడ ఉన్న స్వచ్ఛాగ్రహి సోదర, సోదరీ మణులారా,
ఈరోజు అక్టోబర్ 2 వ తేదీ; పూజ్య బాపూ జయంతి. అలాగే, లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి కూడాను. మనం గత మూడు సంవత్సరాలలో ఎంత దూరం పయనించా ? నాకు బాగా ఇంకా గుర్తు, మూడేళ్ల క్రితం నేను ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళాను. అక్టోబర్ 1 వ తేదీ రాత్రి బాగా పొద్దుపోయాక తిరిగి మన దేశానికి చేరుకొన్నాను. అక్టోబర్ 2 వ తేదీ ఉదయాన్నే పరిశుభ్రం చేయడానికి చీపురును చేతపట్టుకొని బయటకు వచ్చాను. ఆ సమయంలో అన్ని పత్రికలు, మీడియా, వివిధ పార్టీల లోని మా మిత్రులు అంటే అన్ని రాజకీయ పక్షాలకు చెందిన వారంతా నన్ను ఎంతగానో విమర్శించారు. అక్టోబర్ 2 సెలవు దినం; పిల్లలకు ఆ రోజును మేం సెలవు రోజు కాకుండా చేశామంటూ. పిల్లలు బడికి పోతారా, పోరా ? ఈ కార్యక్రమంలోకి పిల్లలను ఎందుకు తీసుకువస్తున్నారు ? అని అన్నారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి.
నేను ఎన్నింటినో నిశ్శబ్దంగా భరిస్తాను. అది నా స్వభావం. దీనికి కారణం, అలాగ భరించడమే నా యొక్క బాధ్యత. క్రమంగా, నేను కూడా నాలోని ఓర్చుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరచుకొంటున్నాను. అయితే, మూడు సంవత్సరాలు గడచిపోయిన ఈ రోజున, మేం ఎటువంటి ఊగిసలాటకు తావు ఇవ్వకుండా దీనిపై పని చేసుకుంటూ పోతున్నాం; ఎటువంటి వైముఖ్యం చూపకుండా దీనిని మేం పట్టుదలతో కొనసాగిస్తున్నాం. ఎలాగంటే, బాపూ బోధనల పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది; కారణం, బాపూ చూపిన మార్గం ఎన్నటికీ తప్పు కాదు.
నాకు ఇప్పటికీ అదే నమ్మకం. అయితే ఈ మార్గంలో సవాళ్లు ఏమీ లేవని కాదు. సవాళ్లు ఉన్నాయి. అయితే సవాళ్లున్నాయి కదా అని, ఈ దేశాన్ని ఇలాగే ఉండనిస్తామా ? సవాళ్లున్నాయి కదా అని, రోజూ మనకు పొగడ్తలు తెచ్చిపెట్టే వాటిని మాత్రమే చేపడతామా ? ఇలాంటి పనుల నుండి మనం పారిపోతామా ? మనం అలా చేస్తామా ? ఇవాళ ప్రజలంతా ముక్త కంఠంతో దీనిని గురించి మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అలా అని మన కళ్ల ముందు చెత్తా చెదారం లేదని కాదు. ఏదో ఒక రూపంలో ఈ అపరిశుభ్రత వ్యాప్తికీ మనకూ ఏమీ సంబంధం లేదని కాదు, అలా అని స్వచ్ఛతను మనం కోరుకోవడం లేదని కూడా కాదు. అసలు పరిశుభ్రతను కోరుకోని మానవుడే ఉండడు.
మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లారనుకోండి, అక్కడ నాలుగు బల్లలు ఉంటే అందులో రెండు బల్లలు అపరిశుభ్రంగా ఉంటే మీరు అక్కడ ఎంతమాత్రం కూర్చోరు. మంచి ప్రదేశం కోసం వెతుక్కుని అక్కడకు వెళ్లి కూర్చుంటారు. ఎందుకు ? మనం మౌలికంగా పరిశుభ్రతను కోరుకుంటాం. అయితే మన దేశంలో ఉన్న ముఖ్యమైన తేడా ఏమంటే, ఈ పనిని నేనే చేయాలన్న భావన లేకపోవడం. పరిశుభ్రత విషయంలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. కానీ, ఇది ఎవరు చేయాలన్నదే అసలు సమస్య. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలచుకున్నాను. ఈ మాటలు చెప్పడానికి నేనేమీ వెనకాడను కూడా. రేపు ఎవరైనా నన్ను ఇంకా ఎక్కువగా విమర్శించవచ్చుగాక, కానీ దేశ ప్రజల దగ్గర దాచిపెట్టాల్సింది ఏముంటుంది చెప్పండి ? వెయ్యి మంది మహాత్మ గాంధీలు వచ్చినా, లక్ష మంది నరేంద్ర మోదీలు వచ్చినా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వచ్చినా, అన్ని రాష్ట్రప్రభుత్వాలు చేతులు కలిపినా సరే.. స్వచ్చత కల ఎన్నటికీ సాకారం కాదు. ఎన్నటికీ సాకారం కానే కాదు. అయితే, 125 కోట్ల మంది భారతీయులు ముందుకు వస్తే మాత్రం ఈ కలను తప్పక వెంటనే నెరవేర్చడం సాధ్యమవుతుంది.
దురదృష్ట వశాత్తు, చాలా విషయాలను ప్రభుత్వ బాధ్యతగా వదిలేస్తున్నాం. వీటిని ప్రభుత్వ బాధ్యతగా పక్కన పెడుతున్నాం. వీటిని సామాన్యుడు తన బాధ్యతగా తీసుకుంటే సమస్యే ఉండదు. మీరు చూడండి.. కుంభమేళా జరుగుతుంటుంది. ప్రతి రోజూ యూరోప్ లోని ఒక చిన్న దేశంతో సమానమైనంతమంది జనాభా గంగా నది ఒడ్డున చేరి పుణ్యస్నానాలు చేస్తుంటారు. ప్రజలు తమంత తాముగా అక్కడి కార్యకలాపాలను జాగ్రత్తగా నిర్వహించుకుంటుండడం చూస్తూ ఉన్నాం. ఇలా శతాబ్దాలుగా జరుగుతూ వస్తోంది.
మనం సమాజం బలాన్ని గుర్తించి ముందుకు సాగితే, ప్రజల భాగస్వామ్యాన్ని ఆమోదించి ముందుకు సాగితే, ప్రభుత్వ పాత్రను తగ్గించి ముందుకు కదిలితే, సమాజం పాత్రను పెంచితే- ఎవరు ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా- ఈ స్వచ్ఛతా ఉద్యమం విజయవంతమౌతూ పోతుంది. ఈ విషయంలో నాకు గట్టి నమ్మకం ఉంది. ఇప్పటికీ దీనిపై కొంతమంది నిర్దయగా విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న వారు, ఏనాడూ పరిశుభ్రతా కార్యక్రమాలలో పాల్గొనడానికి ముందుకు రాని వారే. ఇది వాళ్ల విషయం. వాళ్లకు ఏవో అభిప్రాయాలు ఉండవచ్చు. అయితే నాకు గట్టి నమ్మకం ఏమంటే, ఈ ఐదేళ్లు పూర్తయ్యే నాటికి ఈ దేశ మీడియా స్వచ్ఛత కార్యక్రమాలలో ఎవరు పాల్గొంటున్నారో వారి ఫోటోలు కాదు ప్రచురించబోయేది, ఈస్వచ్ఛతా కార్యక్రమం నుండి పారిపోతున్న వారి, వ్యతిరేకిస్తున్న వారి ఫోటోలను ప్రచురించనుంది. వీరు ఫోటోలు ఎందుకు ప్రచురిస్తారంటే, ఏదైనా ఒక విషయాన్ని దేశమంతా ఆమోదించినపుడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు ప్రజలతో కలసి కదలాలి.
ఇవాళ, స్వచ్ఛతా ప్రచార కార్యక్రమం పూజ్య బాపూ జీ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు. లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కదానికో, పురపాలక సంఘానికో సంబంధించినది కాదు. ఇవాళ స్వచ్ఛత ప్రచారం అనేది ఈ దేశంలోని సామాన్యుడి స్వంత కల గా మారిపోయింది. ఇప్పటి వరకు సాధించిన విజయం ఏదైనా ఉంటే- అది ఏ కొంచెమైనా కానివ్వండి- అది ఈ ప్రభుత్వానిదని చెప్పడం లేదు; ఇది భారత ప్రభుత్వ విజయమో లేదా రాష్ట్రప్రభుత్వ విజయమో కాదు; ఈ విజయం పరిశుభ్రత కోసం పరితపిస్తున్న ఈ దేశ ప్రజలది.
మనం స్వయం పాలనను సాధించుకున్నాం. ఈ స్వయం పాలన సాధనకు ఆనాడు మన ఉపకరణం అహింసా మార్గంలో సహాయనిరాకరణ. ఇప్పుడు మహోన్నత భారతావని నిర్మాణానికి మనకు ఉపకరణం స్వచ్ఛత. ఆనాడు స్వయం పాలన సాధనకు కేంద్రంగా సత్యాగ్రహి ఉంటే ఇవాళ స్వచ్ఛాగ్రహి ( స్వచ్ఛత కోసం పట్టు పట్టే వారు ) మహోన్నత భారతావనికి కేంద్ర బిందువులు. మనం ఏదైనా దేశానికి వెళ్లినపుడు, అక్కడి పరిశుభ్రతను చూసి వచ్చిన తరువాత ఆ దేశం ఎంత పరిశుభ్రంగా ఉందో కదా, ఆ పరిశుభ్రత ఎంత ముచ్చటేసిందో అని చర్చించుకుంటుంటాం. ఈ విషయం మనందరికీ తెలుసు. నాకు ఎవరైనా ఇటువంటి విషయాలను చెప్పినపుడు, వాళ్లను నేను అడుగుతుంటాను.. ఆ దేశంలో పరిశుభ్రతను చూసి మీకు ఆనందమేసింది. నిజమే, అక్కడ ఎవరైనా చెత్తను బయట పారబోయడం చూశారా ? అని. దానికి వారు, మేం అలాటిదేమీ చూడలేదు అని జవాబు చెబుతారు. అప్పుడు నేనంటుంటాను.. మన సమస్య అదే అని.
And that is why we did not discuss the issue openly, I don’t know why were we afraid to discuss this thing. Politicians and governments did
మరి ఈ విషయాన్ని మనం బహిరంగంగా ఎందుకు చర్చించం ? మనం ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించడానికి ఎందుకు భయపడాలో నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఈ అంశాన్నిచర్చించవు; ఎందుకంటే, అది తమ బాధ్యత కిందికి వస్తుందేమోనని. సోదరులారా, అది మీ బాధ్యత అయితే కానివ్వండి. సమస్య ఏమిటి ? మనం జవాబుదారుతనం గల ప్రజలం. మన జవాబుదారుతనం అక్కడ ఉంది. ఇవాళ స్వచ్ఛత వల్ల పరిస్థితి ఏమిటో చూడండి. పరిశుభ్రతకు సంబంధించి ర్యాంకింగ్‌లు ఇస్తున్నారు. అన్ని నగరాల కన్నా పరిశుభ్రమైన నగరం ఏది ? రెండో స్థానంలో ఏది ఉంది ? మూడో స్థానంలో ఏది ఉంది ? ఈ ర్యాంకింగ్‌లు విడుదల కాగానే ప్రతి నగరంలో దీనిపై చర్చిస్తున్నారు. దీనితో రాజకీయ నాయకులపైన, ప్రభుత్వాలపైన కింది నుండి పై వరకు మళ్లీ తమ నగరానికి పరిశుభ్రతకు సంబంధించి మంచి మార్కులు వచ్చే వరకు ఒత్తిడి ఉంటుంది.
మీరేం చేస్తున్నారు ? పౌర సమాజం కూడా తెర మీదకు వస్తుంది. చూడండి, ఇదీ కారణం, స్వచ్ఛతలో మనల్ని వెనక్కునెట్టింది ఇదే, కాబట్టి మనం దీని కోసం ఏదైనా చేయాలి. ఇలా ఒక సానుకూల, సమష్టి అభిప్రాయం ఏర్పడుతుంది. దీని సకారాత్మకమైన ఫలితం మొత్తం వ్యవస్థపైన ప్రతిఫలిస్తుంది.
మరుగుదొడ్లను నిర్మించారన్నది నిజమే. అయితే, అవి ఉపయోగంలో లేవు. ఇటువంటి వార్తలు వచ్చినపుడు, అవి చెడ్డ వార్తలేం కావు. అవి మనల్ని మేల్కొలుపుతాయి, మనం అలాంటి వార్తలపై కోపం తెచ్చుకోకూడదు. అయితే, అందులోనే వారు మరుగుదొడ్ల వినియోగం విషయంలో సమాజం, కుటుంబం, వ్యక్తుల బాధ్యతల గురించి కూడా ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుంది.
నేను ఈ విషయమే చెబుతుంటాను. గతంలో నేను ఒక సామాజిక సంస్థతో కలసి పనిచేసే వాడిని. నేను రాజకీయాల లోకి చాలా ఆలస్యంగా వచ్చాను. నేను గుజరాత్‌లో పనిచేస్తున్నప్పుడు మోర్విలో మచ్చు డ్యామ్ ప్రమాదం జరిగింది. వేలాది ప్రజలు చనిపోయారు. నగరం అంతా నీటితో మునిగిపోయింది. అప్పుడు అక్కడ శుభ్రం చేయడానికి సేవా కార్యక్రమాలకు నన్ను పంపారు. అక్కడి చెత్తా చెదారం తొలగింపునకు నెల రోజులకు పైగా పట్టింది. ఆ తరువాత, మేము, పౌర సమాజంలోని కొంతమంది కలసి ఇళ్లు కోల్పోయిన వారికి ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం మేం ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. అది ఒక చిన్న గ్రామం. అక్కడ సుమారు 350 నుండి 400 వరకు ఇళ్ళు ఉంటాయి. మేం ఇంటికి ఆకృతిని రూపొందించేటప్పుడు నేను ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పకుండా ఉండాలని పట్టు పట్టాను. అప్పుడు గ్రామీణులు మాత్రం తమకు మరుగుదొడ్డి అక్కర లేదని, తమ గ్రామంలో కావలసినంత బహిరంగ ప్రదేశం అందుబాటులో ఉందని, దాని బదులు మరికాస్త పెద్ద గదులను నిర్మించి ఇవ్వాలని సూచించారు. కానీ నేను మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చే విషయంలో రాజీ లేదని చెప్పాను. మా వద్ద అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం ఇల్లు దానితో పాటు మరుగుదొడ్డిని కూడా నిర్మిస్తామని చెప్పాం. దానికి వారు ఎలాగూ ఉచితంగా ఇస్తున్న ఇల్లు కనుక ఇక వారు ఈ విషయంలో పెద్దగా పట్టు పట్టలేదు. మేం అనుకున్నట్టే ఇళ్లు నిర్మించి ఇచ్చాం.
ఆ తరువాత పది, పన్నెండు సంవత్సరాలకు నేను ఆ గ్రామానికి వెళ్లి పాత మిత్రులను కలుసుకోవాలనుకున్నాను. అక్కడ చాలా నెలలు పనిచేశాను. అందువల్ల నేను ఆ గ్రామాన్ని చూడడానికి వెళ్లాను. తీరా అక్కడకు వెళ్లి చూస్తే, బాధేసింది. మేం కట్టించి ఇచ్చిన ఇళ్ల మరుగుదొడ్లలో మేకలను కట్టేసి ఉంచారు. సమాజం పరిస్థతి ఇలా ఉంది. వీటిని నిర్మించి ఇచ్చిన వ్యక్తిది తప్పు కాదు; లేదా, మరుగుదొడ్లు ఉండాలని చెప్పే ప్రభుత్వానిదీ తప్పు కాదు. సమాజం తన మార్గంలో తాను వెళుతుంటుంది. మనం ఈ పరిమితులన్నింటినీ అర్థం చేసుకుంటూ సమాజంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నించాలి.
మీరెవరైనా చెప్పండి, భారతదేశంలోని పాఠశాలలన్నీ అవసరాన్ని బట్టి ఉంటున్నాయా లేదా ? అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను నియమిస్తున్నారా లేదా ? సౌకర్యాలు, పుస్తకాలు వంటి వాటిని సమకూరుస్తున్నారా లేదా ? నిజానికి ఇవన్నీ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కల్పిస్తున్న సౌకర్యాలకు అనుగుణంగా చూస్తే, అక్షరాస్యత తక్కువగా ఉంది. కనుక , ప్రభుత్వం ఈ సౌకర్యాలన్నీ కల్పించినా, ఇంత పెద్ద ఎత్తున ఖర్చుచేసినా, భవనాలు నిర్మించి ఇచ్చినా, ఉపాధ్యాయులను నియమించినా, సమాజం సహకారం కనుక ఉంటే దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించడానికి పెద్ద సమయమేమీ పట్టదు. ఇదే మౌలిక సదుపాయాలతో ఇదే ఉపాధ్యాయులు వంద శాతం అక్షరాస్యతను సాధించగలరు. సమాజం సహకారం లేకుండా మాత్రం ఇది ఎంతమాత్రం సాధ్యం కాదు.
ప్రభుత్వం భవనాలు కట్టి ఉంటే లక్ష్యం నెరవేరేదని గాని, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించి ఉంటే లక్ష్యం నెరవేరేదని గాని అనుకుంటే, నిజమే గతంలో ఇలా ఉండేది; ఇప్పుడు మనం ఎంతో చేశామని సంతృప్తి పొందవచ్చు. ప్రజల భాగస్వామ్యం లేదనుకోండి, ఎవరైనా పిల్లలు పాఠశాలలో చేరి ఆ మరుసటి రోజు నుండీ పాఠశాలకు వెళ్లకుంటే తల్లితండ్రులు కూడా వారిని బడికి వెళ్లండని చెప్పరు. మరుగుదొడ్ల విషయం కూడా ఇలాంటిదే. అందువల్ల పరిశుభ్రత అనేది సమాజం బాధ్యతగా ఉండాలి. మనం ఎంత ఎక్కువగా ఇలాంటి వాతావరణాన్ని కల్పిస్తే, అంతగా ప్రతి వారూ తప్పు చేయడానికి ముందు 50 సార్లు ఆలోచిస్తారు.
మీరు చూడండి.. మన పసి పిల్లలు, చిన్న పిల్లలు, ప్రతి ఇంట్లో ఉండే కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్ళు.. వీరంతా మా స్వచ్ఛతా కార్యక్రమానికి పెద్ద రాయబారులు. తాత గారు చెత్తను ఎక్కడైనా బయట పడవేస్తే, దీనిని తొలగించండని ఈ పిల్లలు సూచిస్తారు. అలా వేయకూడదు అని చెబుతారు. ప్రతి ఇంట్లో ఈ తరహా వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలే ఇటువంటి బాధ్యతను స్వీకరిస్తుంటే, మనం మాత్రం ఆ బాధ్యతను ఎందుకు చేపట్టకూడదు చెప్పండి.
అన్నం తినే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోనందువల్ల, సబ్బుతో కడుక్కోలేనందువల్ల ఎంత మంది పిల్లలు చనిపోతున్నారో చూడండి. మీరు ఈ అంశాన్నిప్రస్తావించగానే, మేం సబ్బు ఎలా కొనుక్కోగలం అని, నీళ్లు ఎలా అని అంటారు. మోదీ ఉపన్యాసం ఇస్తారు సరే.. జనం చేతులు ఎలా కడుక్కుంటారు అని అంటారు. సోదరులారా, మీరు చేతులు కడుక్కోకుంటే వదిలేయండి, కానీ చేతులు కడుక్కోగల వారిని- కనీసం వాళ్లనైనా- ఆ పనిని చేయనివ్వండి.
మోదీని విమర్శించడానికి వెయ్యి కారణాలు ఉంటాయి. ప్రతి రోజూ నేను మీకు ఏదో ఒక అవకాశం ఇస్తాను. దానిని మీరు ఉపయోగించుకోవచ్చు. కానీ సమాజంలో మార్పు తీసుకురావల్సిన వాటిని అపహాస్యం చేయకండి. వాటిమీద రాజకీయాలు చేయకండి. మనం సమష్టి బాధ్యతను అనుసరించాలి. అప్పుడు మీరు మార్పు రావడాన్ని గమనించగలుగుతారు.
మీరు చూడండి. ఈ పిల్లలు గొప్పపని చేశారు. రోజూ నేను ఈ పిల్లల ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ వచ్చాను. ఎంతో గర్వంగా వారి ఫోటోలను పోస్ట్ చేశాను. నిజంగా నాకు వ్యక్తిగతంగా ఈ పిల్లలు ఎవరూ తెలియదు. పరిశుభ్రతపై వీరి ఆసక్తిని గమనించి వారి ఫోటోలను పోస్ట్ చేసే వాడిని. ఇవి కోట్లాది ప్రజలకు చేరేవి. అవును నిజమే సోదరా, మరి అతనెందుకు ఇది చేస్తున్నాడు, ఈ వ్యాస రచన పోటీతో స్వచ్ఛత సాధ్యమౌతుందా ? దానికి వచ్చే తక్షణ సమాధానం.. వ్యాస రచన వల్ల పరిశుభ్రత రాదు. మరి డ్రాయింగ్ పోటీ వల్ల వస్తుందా ? రాదు.
పరిశుభ్రతపై , స్వచ్ఛతపై ఆలోచనాపరమైన ఉద్యమం రావాలి. అభివృద్ధి అనేది ఆలోచనలలో మార్పును తీసుకు వస్తే తప్ప కేవలం వ్యవస్థలను అభివృద్ధి చేసినంతనే రాదు. అందువల్ల ఈ ప్రయత్నం అంతా, అంటే లఘు చిత్రాలు తీయడం గాని, డ్రాయింగ్ పోటీలు, వ్యాస రచన.. ఇవన్నీ పరిశుభ్రత విషయంలో ఒక సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేస్తాయి. ఏదైనా మన మనస్సులో ఒక ఆలోచనగా మొదలైందీ అంటే, ఆ తరువాత దానిని అనుసరించడం తేలిక. అందుకే ఈ కార్యకలాపాలు, వీటితో మమేకం కావడం. ఇంకో విషయం కూడా. నేను చాలా బాధపడిన సందర్భాలూ ఉన్నాయి. అయితే అటువంటి పనులు చేస్తున్న వారిది కూడా తప్పు కాదు. అందుకే వారిని నేను నిందించను. అయినా, ఇది వ్యాపార ప్రపంచం. ఏదో కొంత సొమ్ము చేసుకోవడానికి అవకాశం ఉందేమో చూస్తుంటారు. డబ్బు చేసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు.
నాలుగైదు సంవత్సరాల క్రితం తయారైన టెలివిజన్ కార్యక్రమాలను చూడండి. ఈ కార్యక్రమాలలో ఏదైనా పాఠశాలలో విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేస్తూ కనిపించారంటే, అది ఆ సమయంలో ఒక వార్తా కథనం. పాఠశాలల్లో విద్యార్థులతో పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారని ఉపాధ్యాయులను విమర్శించే వారు. ఈ వార్తా కథనాన్ని టీవీలో చూడగానే తల్లితండ్రులు పాఠశాల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చే వారు. మీరు మా పిల్లలకు చదువులు చెబుతారా ? లేక వారిని పారిశుధ్య కార్మికులుగా మారుస్తారా ? అంటూ నిలదీసే వారు. కానీ, ఇప్పుడు అలా కాదు. అటువంటి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. పాఠశాలల్లో పిల్లలు పరిసరాలను శుభ్రం చేసుకుంటే టీవీలో ప్రధాన వార్త అవుతోంది. ఇది సాధారణమైన విషయం కాదు.
స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మన ప్రసార మాధ్యమాలు వాటి కార్యావళిగా భావించకపోతే ఏం జరిగి ఉండేది ? గత మూడు సంవత్సరాలుగా దేశంలో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు మమేకం అయ్యాయి. కొన్ని సందర్భాలలో మీడియా మా కన్నా రెండు అడుగులు ముందుంటోంది.
నేను ఈ పిల్లలను చూశాను. ఈ పిల్లల గురించిన చిత్రాలను కొన్ని టీవీ ఛానెళ్లు క్రమం తప్పకుండా ప్రసారం చేస్తున్నాయి. ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఎలా ? ఇదే ఇప్పుడు సమస్య. ప్రజలు అధిక సంఖ్యలో భాగస్వాములైతే 2022 కల్లా లక్ష్యాన్ని చేరుకొంటాం. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మనకు అవకాశం లభించింది. మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. ఈ పనిని చేయాలి అని అనుకొంటే, అది ఒక పెద్ద విజయమే.
మన ఇల్లు శుభ్రంగా లేనప్పుడు మన ఇంటికి అతిథులు వచ్చారనుకుందాం. పెళ్లి సంబంధం ప్రతిపాదనతో మన ఇంటికి వస్తే.. వారు మన ఇంట్లో అటూ ఇటూ చిందరవందరగా పడ్డ వస్తువులను చూసినప్పుడు వారు ఏమనుకుంటారు ? అంతా బాగానే ఉంది; అబ్బాయి బాగానే ఉన్నాడు; మంచి చదువు చదువుకున్నాడు. కానీ, ఇల్లు మాత్రం అపరిశుభ్రంగా ఉంది. ఇటువంటి కుటంబానికి మన అమ్మాయిని ఎందుకు ఇవ్వడం అనుకొని, వారు వెనుదిరిగి వెళ్లిపోతారు. అలాగే విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చి ఆగ్రాను సందర్శించి తాజ్ మహల్‌ను చూసినప్పుడు అబ్బ! ఎంత గొప్పగా ఉంది అని అనుకొంటారు. కానీ, వారు ఆ చరిత్రాత్మక కట్టడం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను చూసి ముక్కన వేలు వేసుకొంటారు. అటువంటి పరిస్థితిని మనం ఎలా భరించగలం ?
ఎవరిది తప్పు ? నేను చెప్పాలనుకొన్నది ఇది కాదు. మనం అందరమూ సమైక్యంగా పని చేసినప్పుడే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుంది. గత మూడు సంవత్సరాలుగా నా దేశ పౌరులు ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు. పౌర సమాజం, ప్రసార మాధ్యమాలు ఈ విషయాన్ని చాటుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో మద్దతు లభిస్తున్నప్పటికీ మనం ముందుకు సాగలేకపోతే భవిష్యత్తులో ఏదో ఒక రోజు మనల్ని మనం దీనంతటికీ బాధ్యులుగా భావించుకోవలసి వస్తుంది.
మనందరం ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. వీటిని ముందుకు తీసుకుపోవాలి. సమాచారం సాయంతో ఇంతవరకు సాధించిన ప్రగతిని మీకు వివరించడం జరిగింది. అయితే ఈ సందర్భలో కూడా స్వచ్ఛ ఉద్యమాన్ని నిర్మిస్తూనే క్రమం తప్పకుండా మనం ఈ పనిని చేయాలి. అప్పుడే మనం విజయం సాధించగలం.
గ్రామాలలో దేవాలయాలు ఉన్నాయి. కానీ, ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని సందర్శించరు. ఇది మానవ స్వభావం, కొంతమంది దేవాలయాలకు వెళ్లరు. ఊరిలో దేవాలయం ఉన్నప్పటికీ కొంత మంది దైవ దర్శనానికి పోరు. అలాగే మసీదుల, గురుద్వారాల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే ఒకటి రెండు కార్యక్రమాలకు ప్రజలు హాజరు అయితే అవ్వొచ్చు. ఇదీ సమాజంలోని ధోరణి, జీవితం కొనసాగుతూనే ఉంటుంది; అటువంటి ప్రజలు వారిదైన లోకంలో ముందుకు పోతుంటారు. వారిని కూడా మనం కలుపుకుపోవాలి; ఇందుకోసం మనం కొంత శ్రమించాలి. మనం ఇందుకోసం కృషి చేసినప్పుడు, కొన్ని పనులు పూర్తి అవుతాయి..
లభిస్తున్న సమాచారం ప్రకారం, కార్యక్రమం యొక్క వేగం, కార్యక్రమం యొక్క దిశ కూడా బాగానే ఉన్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మన ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లినప్పుడు, ఈ విషయాలను గమనించాలి. వారు ప్రశ్నలు అడిగి, (పాఠశాల లోని) సదుపాయాలను పరిశీలించి, ఆ తరువాతనే బడిలో చేరాలి. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. సదుపాయాలు లేకున్నా ఎలాగో నెట్టుకొద్దాం అని అనుకొనే వారు. ఎందుకు నెట్టుకు రావాలి ? మన ఆడపిల్లలు ఇటువంటి విషయాలను ఎందుకు సహించాలి ?
పరిశుభ్రతను అనే అంశాన్ని మహిళ దృష్టిలో చూడలేకపోతే, దాని యొక్క ప్రాధాన్యాన్ని మీరు ఏనాడూ అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులు వారి ఇష్టానుసారం వస్తువులను అక్కడో ఇక్కడో పడవేసి, ఇంటిని అపరిశుభ్రంగా చేయడం గురించి ఒక సారి ఆలోచించండి. ఆ ఇంట్లో తల్లి పడే కష్టాన్ని చూడండి. అందరూ ఇంటిని మురికిగా చేసి వారి వారి పనుల మీద బయటకు వెళ్లిపోతారు. ఆ సమయంలో ఆ తల్లి రెండు గంటల పాటు కష్టపడి ఇంటిని శుభ్రం చేస్తుంది. ఆమె వెన్ను విరిగిపోయేలా కష్టపడుతుంది. మేం ఇంటిని శుభ్రంగా ఉంచితే ఎలా ఉంటుంది? అని మీరు మీ తల్లిని ఒక సారి అడగండి. ఆమె వెంటనే తాను ప్రతిరోజూ నడుం పడిపోయేటట్టు పని చేయడం గురించి చెబుతుంది. మీరు మీ మీ వస్తువులను ఎక్కడివి అక్కడే పెట్టి ఇంటిని శుభ్రంగా ఉంచితే మిగతా పనంతా తనకు పది నిమిషాల్లో అయిపోతుందని చెబుతుంది. మధ్య తరగతి కి చెందిన కుటుంబంలోని తల్లి కావచ్చు, ఎగువ మధ్యతరగతి కి చెందిన కుటుంబంలోని తల్లి కావచ్చు, లేదా దిగువ మధ్య తరగతి కుటుంబంలోని మాతృమూర్తి కావచ్చు, లేదా పేద కుటుంబానికి చెందిన తల్లి కావచ్చు, ప్రతి రోజూ సగం రోజును ఇంటిని శుభ్రం చేసుకోవడానికే వినియోగిస్తే వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలసి తమ వస్తువులను సరైన ప్రదేశంలో పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా కేవలం తమ తమ వస్తువులను కుటుంబసభ్యులు ఎక్కడివి అక్కడ పెడితే తల్లులు ఎంతగానో సంతోషిస్తారు. మనం గతంలో ఈ పనిని ఎందుకు చేయలేకపోయాం ?
పరిశుభ్రత గురించి నా మదిలో ఒకే ఒక కొలమానం ఉంది. ఈ విషయాన్ని మీరు ఊహించండి. నేను మగవాళ్లను అడగాలని అనుకుంటున్నాను.. ఎక్కడైనా వీధి మలుపు దగ్గర మీరు బహిరంగ మూత్ర విసర్జన చేస్తారు. ఇలాంటి భాషను వాడుతున్నందుకు నన్ను క్షమించండి. వస్తువులను కొనడానికి బజారుకు వెళ్లిన మన తల్లుల, సోదరీమణుల పరిస్థితిని మీరు గమనించే ఉంటారు. వారికి కూడా మూత్ర విసర్జన అవసరపడుతుంది. కానీ వారు బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడరు. ఇంటికి వచ్చేంత వరకు అలాగే అణచిపెట్టుకుంటారు. ఏమిటి ఈ విలువలు ? ఒక కుటుంబంలో తల్లులు, సోదరీమణులు ఈ విలువలను పాటిస్తుంటే అదే కుటుంబంలో మగవారికి ఈ విలువలు ఎందుకు లేవు ? ఎందుకంటే ఒక మగవాడిగా అన్ని రకాల స్వేచ్ఛలు మనకు ఉన్నాయని నమ్ముతున్నాం. ఇటువంటి అంశాలలో మార్పు వస్తే తప్ప వాస్తవ పరిస్థితుల్లో స్వచ్ఛత గురించి అవగాహన కలగదు.
గ్రామాల్లో నివసిస్తున్న మహిళల్ని చూడండి. అలాగే నగరాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న మహిళల్ని తీసుకోండి. వారు వేకువ జామునే లేచి, చెట్ల చాటుకు వెళ్లి మలమూత్ర విసర్జన చేసి వస్తారు. చీకట్లో వెళ్లడానికి ప్రమాదం కాబట్టి ఐదారుగురు మహిళలు కలిసి వెళ్తుంటారు. పగటి పూట ఒంటివేలుకు వెళ్లవలసి వచ్చిందంటే వారు రాత్రి అయ్యేటంత వరకు ఆగుతారు. అలా ఆపుకోవడం వల్ల శరీరానికి ఎలా ఉంటుందో ఊహించండి. ఉదయం 9-10 గంటల సమయంలో ప్రకృతి పిలుపు వస్తే ఆ పని చేయకుండా రాత్రి 7 గంటల దాకా వేచి వుండి చీకటి పడిన తరువాత ఆ పని చేసే మహిళల ఆరోగ్యం ఏమవుతుంది ? మీరే చెప్పండి, ఆ తల్లి ఎటువంటి దీనావస్థను ఎదుర్కొంటోందో ? మీరు ఈ సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకుంటే, మీరు ఈ అంశం పైన టీవీ ఛానెళ్లను చూడవలసిన అవసరం లేదు. స్వచ్ఛతను గురించి దేశ ప్రధాన మంత్రే స్వయంగా మీకు చెప్పాల్సిన పని లేదు. అప్పుడు ఈ స్వచ్ఛత అనేది మీ బాధ్యతలలో ఒకటిగా మారుతుంది.
అందుకే నేను దేశ ప్రజలకు పిలుపునివ్వాలనుకుంటున్నాను. యూనిసెఫ్ ఈ మద్యనే ఒక నివేదిక విడుదల చేసింది. మరుగుదొడ్లను నిర్మించుకొన్న పది వేల గృహాలను తీసుకొని యూనిసెఫ్ ఒక సర్వేక్షణను నిర్వహించింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వుందో గతంలో ఎలా వుందో ఆ సంస్థ పోల్చింది. పారిశుధ్యం పైన అవగాహన లేకపోవడంవల్ల, మరుగుదొడ్డి లేకపోవడం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా ప్రతి ఏడాది ఒక కుటుంబం సరాసరి రూ. 50,000 దాకా నష్టపోతోందని ఆ నివేదిక తేల్చింది. కుటుంబ పెద్ద అనారోగ్యంపాలైతే అన్ని పనులు ఆగిపోతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే ఇక వారిని చూసుకోవడానికి ఇద్దరు కుటుంబ సభ్యులు అవసరమవుతారు. చికిత్స కోసం అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు ప్రతి కుటుంబంపైనా దాదాపు రూ.50,000 దాకా భారం పడుతుందని తేలింది.
కానీ మనం స్వచ్ఛతను మన మతంగా భావిస్తే, పరిశుభ్రత అనే దాన్ని మన స్వంత బాధ్యతగా పరిగణిస్తే, మనం ఒక కుటుంబం మీద పడే రూ.50,000 భారాన్ని తగ్గించగలం. అంతే కాదు వ్యాధుల కారణంగా కుటుంబానికి వచ్చే ఇబ్బందులు ఆగిపోతాయి. ఆ కుటుంబానికి మనం రూ.50,000 ఇవ్వొచ్చు, ఇవ్వలేకపోవచ్చు; కానీ ఈ మొత్తాన్ని ఆ కుటుంబం కాపాడుకోగలిగితే అది వారికి ఎంతో సహాయంగా ఉంటుంది. కాబట్టి ఈ నివేదికలను, వాటి ద్వారా అందే సమాచారాన్ని మనం అర్థం చేసుకొని మన సామాజిక బాధ్యతగా భావించి ఆచరణలో పెట్టాలి.
నేను ప్రధాన మంత్రిని అయ్యాక నన్ను చాలా మంది కలిశారు. రాజకీయ కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులు, సామాజిక రంగంలో పని చేసే వారు ఇలా ఎంతో మంది నన్ను కలుస్తున్నారు. వారు ఎంతో నమ్రతగా, ప్రేమపూర్వకంగా మాట్లాడుతారు. వారు వెళ్లిపోయే సమయంలో ఎంతో నమ్రతగా వారి బయోడాటాలను నాకు ఇచ్చి తమ సహాయం కావాలంటే సంప్రదించాలని నాకు చెబుతున్నారు. మీరు ఏ పని చెప్పినా మేం చేస్తామని వారు చెబుతున్నారు.. వారు ఎంతో వినయపూర్వకంగా ఉన్నారు. వారిని నేను అంతే వినయపూర్వకంగా అడుగుతున్నాను.. మీరు మీ జీవితంలో కొంత సమయాన్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయించండని. అయితే వారు తిరిగి నా దగ్గరకు రావడం లేదు.
మీరు దయచేసి చెప్పండి, వారు నా దగ్గరకు ఏదో పని కోసం వస్తున్నారు. చాలా మంచి బయోడాటాలను పట్టుకొని వస్తున్నారు. అయితే నేను పరిశుభ్రత గురించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని వారిని ఈ కార్యక్రమంలో భాగం కమ్మని అడిగితే, వారు తిరిగి నా ముఖం చూడడం లేదు. చూడండి, ఏ పని కూడా చిన్నది కాదు, అలాగని పెద్దది కాదు. ఏ పనినీ తక్కువ చేయకూడదు. మనం మన మద్దతిస్తే ఆ పని పెద్దది అవుతుంది. దానికి ఆ ప్రాధాన్యాన్ని మనం ఇవ్వాలి.
స్వచ్ఛ భారత్ ఉద్యమానికి మరోసారి ఊపునివ్వడానికి ఈ పదిహేను రోజుల పాటు శ్రమించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ, ఇన్ని పనుల తరువాత కూడా ఇది ఆరంభమే అని నేను చెప్పగలను. చేయాల్సింది చాలా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పని చేశారు. వారిని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. మీలో కొంత మంది కొత్త చిత్రాలు నిర్మించారు, వ్యాసాలు రాశారు, మరి కొంత మంది పరిశుభ్రతా కార్యక్రమంలో అంకిత భావంతో పని చేశారు. కొన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటకు వెళ్లి ఉదయం అరగంట పాటు పని చేసి పలు గ్రామాలలో సరైన వాతావరణం ఏర్పడడానికి కృషి చేశారు.
నేను ఆశ్చర్యపోయాను.. ప్రసిద్ధి చెందిన వ్యక్తులకు సంబంధించిన కొన్ని విగ్రహాలను చూస్తే ఆందోళన కలుగుతోంది. మహానుభావుల విగ్రహాలను నెలకొల్పడానికి రాజకీయ పార్టీలు ఎంతగానో కష్టపడతాయి. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తరువాత దానిని పరిశుభ్రంగా ఉంచడానికి ఎవరూ ప్రాధాన్యమివ్వడం లేదు. ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు తాము ఆ మహానుభావులను అనుసరిస్తున్నామని. వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే ఆ విగ్రహం కోసం అడిగిన వారే, ఆ మహానుభావుని కార్యకర్తలే, ఆ విగ్రహాన్ని శుభ్రం చేయడానికి ఇష్టపడడం లేదు. దాంతో నిత్యం పక్షులు ఆ విగ్రహాల మీద కూర్చొని తమ పని తాము కానిచ్చేస్తున్నాయి.
మన సమాజంలో నెలకొన్న సమస్యలివి. అందుకే ఇది మన అందరి బాధ్యత. ఒకరు మంచి, ఒకరు చెడు అని నేను చెప్పడం లేదు. ఈ విషయం గురించి మనందరం ఆలోచించాలి. మనందరం సమైక్యంగా దీనిపైన కదిలితే, తప్పక ఫలితాలు వస్తాయి. అందుకే నేను నా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, సత్యాగ్రహులకు, స్వచ్ఛగ్రాహులు అందరికీ నా శుభాకాంక్షలు. దేశం కోసం త్యాగాలు చేసిన ఆదరణీయ బాపూ మరియు లాల్ బహాదుర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా మనందరం మరొక్కమారు దేశం కోసం అంకితం కావాలి. మనం స్వచ్ఛ భారత్ కోసం ప్రాధాన్యమివ్వాలి. దేశం కోసం ఎటువంటి సేవను అందించని వారు, చేయగలిగే శక్తి లేని వారు కూడా పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఇది అంత సులభమైన పని. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గాంధీ గారు ఒకటి చెప్పారు.. ‘మీరు మరేమీ చేయలేకపోతే గనక అటువంటప్పుడు చరఖాను తిప్పండి. ఇదే స్వాతంత్ర్య పోరాటానికి మీరు చేసే సాయం’ అని.
ఒక గొప్ప భారతదేశం (శ్రేష్ఠ భారత్) కోసం ఏదో ఒకటి చేయడానికి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ప్రతి రోజూ 5, 10, 15 నిమిషాలు, అరగంట కేటాయించేటటువంటి చిన్న పని చేస్తానని అనుకోవాలి.. అప్పుడు దేశంలో ఒక స్వాభావికమైన మార్పు రావడాన్ని మీరే చూస్తారు; ఒక విషయం మాత్రం స్పష్టం . అదేమిటంటే, మనం మన దేశాన్ని ప్రపంచం దృష్టితో చూడాలి. ఆ పనిని మనం తప్పకుండా చేయాలి; అప్పుడు, దేనినైనా సరే మనం సాధించగలుగుతాం.
మీ అందరికీ ధన్యవాదాలు.