నమస్తే,
మెలిందా, బిల్ గేట్స్, నా కేబినెట్ సహచరుడు డాక్టర్ హర్షవర్థన్, ప్రపంచదేశాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, విద్యార్థులు, మిత్రులారా,
ఈ 16వ గ్రాండ్ చాలెంజెస్ వార్షక సమావేశంలో మీ అందరితో కలిసి ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది.
వాస్తవానికి ఈ సమావేశం భారతదేశంలో ప్రత్యక్షంగా జరగాల్సి ఉంది. కాని మారిన కల్లోలిత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది వర్చువల్ గా జరుగుతోంది. అంతర్జాతీయ మహమ్మారి అయినా మనని వేరు చేయలేనంత శక్తివంతమైనది టెక్నాలజీ. అందుకే అనుకున్న సమయంలోనే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది గ్రాండ్ చాలెంజెస్ సమాజం కట్టుబాటుకు దర్పణం పడుతోంది. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మనని మనం మలుచుకోవడం, నవ్యపథంలో అడుగేయడానికి ఇది దర్పణం.
మిత్రులారా,
సైన్స్, ఇన్నోవేషన్ లో పెట్టుబడి పెట్టే సమాజాలే భవిష్యత్తును తీర్చి దిద్దుతాయి. కాని హ్రస్వదృష్టితో ఇది సాగదు. చాలా ముందు నుంచే ఎవరైనా సైన్స్, ఇన్నోవేషన్ లో పెట్టుబడులు పెట్టాలి. అలా చేసినప్పుడే సరైన సమయంలో మనం దాని ప్రయోజనాలు పొందగలుగుతాం. అలాగే ఇన్నోవేషన్ల ప్రయాణం సంస్థాగత సహకార ఒప్పందాలు, ప్రజా భాగస్వామ్యంతో ముందుకు సాగాలి. కోటగోడల వంటి అవరోధాల మధ్య సైన్స్ ఎప్పుడూ పురోగమించదు. ఈ గ్రాండ్ చాలెంజెస్ కార్యక్రమం ఆ విలువలను బాగా అవగాహన చేసుకుంది. ఈ కార్యక్రమం విస్తరించిన పరిధి అత్యంత ప్రశంసనీయమైనది.
15 సంవత్సరాల ప్రయాణంలో మీరు ప్రపంచంలోని పలు దేశాలను భాగస్వాములుగా చేయగలిగారు. భిన్న స్వభావం గల అంశాలను పరిశీలనకు తీసుకుంది. యాంటి మైక్రోబియల్ నిరోధం, మాతృత్వ, శిశు ఆరోగ్యం, వ్యవసాయం, పౌష్టికాహారం, వాష్ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) వంటి భిన్న రంగాల్లో అంతర్జాతీయ ప్రతిభ అంతటినీ ఒక్కటి చేశారు. ఇంకా ఎన్నో హర్షణీయమైన చొరవలు చేపట్టారు.
మిత్రులారా,
ఒక బృందంగా పని చేయవలసిన ప్రాధాన్యతను మనందరం గుర్తించేలా ఈ అంతర్జాతీయ మహమ్మారి చేసింది. వాస్తవానికి వ్యాధులకు అంతర్జాతీయ హద్దులేవీ ఉండవు. నమ్మకాలు, జాతులు, లింగభేదం, వర్ణ వివక్ష వంటివేవీ వ్యాధులకు ఉండవు. నేను ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపివేస్తున్న మహమ్మారిని ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాధులు అనే అంశం ప్రస్తావించడంలేదు. ప్రజలను ప్రత్యేకించి ఎంతో ఉజ్వల భవిష్యత్తు గల యువతరాన్ని ఎన్నో అంటువ్యాధులు, ఇతర వ్యాధులు ప్రభావితం చేస్తున్నాయి.
మిత్రులారా,
భారతదేశంలో శక్తివంతమైన, చలనశీలమైన శాస్త్రవేత్తల సమాజం ఉంది. అద్భుతమైన శాస్త్రపరిశోధన, అధ్యయన సంస్థలు కూడా ఉన్నాయి. సర్వకాల సర్వావస్థల్లోను ప్రత్యేకించి కోవిడ్-19 మహమ్మారితో పోరాటం చేస్తున్న గత కొద్ది నెలల కాలంలోను వారే భారతదేశానికి ఎనలేని శక్తిగా నిలిచారు. కట్టడి నుంచి సామర్థ్యాల నిర్మాణం వరకు వారు ఎన్నో అద్భుతాలు చేశారు.
మిత్రులారా,
భారతదేశం విస్తీర్ణం, పరిధి, వైవిధ్యం అంతర్జాతీయ సమాజానికి ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తూనే ఉంటుంది. అమెరికా జనాభా కన్నా మా జాతి నాలుగు రెట్లు పెద్దది. మా రాష్ర్టాలు ఒక్కో యూరోపియన్ దేశం జనాభా అంత జనసంఖ్య కలిగి ఉన్నాయి. అయినా ప్రజల శక్తి, ప్రజలే కేంద్రంగా అనుసరించిన వ్యూహంతో కోవిడ్-19 మరణాల రేటును మేం అత్యంత కనిష్ఠ స్థాయికి నిలువరించగలిగాం. ఈ రోజున రోజువారీ కేసుల సంఖ్య, కేసుల వృద్ధిరేటు కూడా తగ్గడాన్ని మనం వీక్షిస్తున్నాం. రికవరీ రేటు 88 శాతం వరకు ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. కేసుల సంఖ్య వందల్లో ఉండగానే ప్రజలకు అసౌకర్యం లేని రీతిలో లాక్ డౌన్ అమలుపరిచిన తొలి దేశాల్లో భారత్ ఒకటి కావడం వల్లనే మేం ఇది సాధించగలిగాం. మాస్కులు ధరించడాన్ని ప్రోత్సహించిన తొలి దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. అలాగే వ్యాధిగ్రస్తులతో సన్నిహితంగా సంచరించిన వారిని వేగంగా గుర్తించే పని కూడా క్రియాశీలంగా చేపట్టింది. వేగవంతమైన రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు తొలి దశలోనే ప్రవేశపెట్టిన తొలి దేశాల్లో భారత్ కూడా ఒకటి. అలాగే క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో ప్రయోగాలు చేసిన తొలి దేశం కూడా భారత్.
మిత్రులారా,
కోవిడ్ మహమ్మారికి టీకా మందు కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్న దేశాల్లో కూడా భారత్ ముందు వరుసలో ఉంది. భారత్ లో 30కి పైగా వ్యాక్సిన్లు అభివృద్ధిలో ఉన్నాయి. వాటిలో మూడు ప్రయోగాల దశలో అగ్రస్థానంలో ఉన్నాయి. మేం ఇక్కడితో ఆగాలనుకోవడంలేదు. అత్యంత విస్తారమైన, శక్తివంతమైన డెలివరీ వ్యవస్థ అభివృద్ధి చేయడంపై ఇప్పటికే కృషి ప్రారంభం అయింది. పౌరులకు టీకాలు వేయడానికి డిజిటల్ హెల్త్ ఐడిలతో పాటు పూర్తి స్థాయి డిజిటల్ నెట్ వర్క్ ను కూడా వినియోగించబోతున్నాం.
మిత్రులారా,
ఒక్క కోవిడ్ మాత్రమే కాదు, ఇతర వ్యాధులకు కూడా తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు, వ్యాక్సిన్లు అందిస్తున్న దేశంగా కూడా భారతదేశం సామర్థ్యం ఎంతటిదో అందరికీ తెలుసు. అంతర్జాతీయంగా రోగనిరోధక శక్తికి పంపిణీ అవుతున్న వ్యాక్సిన్లలో 60 శాతానికి పైగా భారత్ లోనే తయారవుతున్నాయి. టీకాల పంపిణీకి చేపట్టిన ఇంద్రధనుష్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేసిన రోటావైరస్ వ్యాక్సిన్ కూడా మేం ప్రవేశపెట్టాం. శక్తివంతమైన భాగస్వామ్యాలు/ దీర్ఘకాలిక ఫలితాల కోణంలో కూడా భారతదేశం విజయవంతమైన నమూనాగా నిలిచింది. ఈ కృషిలో గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామి. మా అనుభవం, పరిశోధన ప్రతిభతో మేం ప్రపంచస్థాయిలో ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాల్లో కేంద్రీయంగా నిలుస్తున్నాం. ఈ రంగాలన్నింటిలోనూ సామర్థ్యాల విస్తరణకు ఇతర దేశాలకు సహాయం అందించాలని కూడా మేం భావిస్తున్నాం.
మిత్రులారా,
గత 6 సంవత్సరాల్లో మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సహాయకారిగా నిలిచిన ఎన్నో కార్యక్రమాలు మేం చేపట్టాం. పారిశుధ్యం, పరిశుభ్రత మెరుగుదల, మరిన్ని మరుగుదొడ్ల ఏర్పాటు వంటివే ఇందుకు ఉదాహరణలు. ఇవన్నీ ఎవరికి ఎక్కువ సహాయకారిగా ఉంటాయి? పేదలు, నిరాకరణకు గురవుతున్న వర్గాలకు ప్రయోజనకరం అయిన చర్యలే ఇవి. ఫలితంగా వ్యాధుల సంఖ్య తగ్గుతుంది. మహిళలు ఎంతో ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా,
ప్రతీ ఒక్క ఇంటికీ పైప్ లతో మంచినీరు సరఫరా చేసేందుకు ఇప్పుడు మేం కృషి చేస్తున్నాం. ఇది వ్యాధులను మరింతగా తగ్గిస్తుంది. దేశంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. యువతకు దీని వల్ల మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. గ్రామాలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆరోగ్య బీమా పథకం మేం నిర్వహిస్తూ ప్రతీ ఒక్కరికీ దాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.
మిత్రులారా,
వ్యక్తిగత సాధికారత, సామూహిక సంక్షేమానికి దోహదకారి అయ్యేలా మా సహకార స్ఫూర్తి నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను. గేట్స్ ఫౌండేషన్. ఇంకా ఎన్నో సంస్థలు అద్భుతమైన కృషి చేస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉత్పాదకమైన, సత్ ఫలితాలనందించగల చర్చలు జరగాలని నేనే ఆకాంక్షిస్తున్నాను. ఈ గ్రాండ్ చాలెంజ్ వేదిక నుంచి మరింత ఆసక్తికరమైన, ప్రోత్సాహకమైన సరికొత్త పరిష్కారాలు వస్తాయని నేను ఆశఙస్తున్నాను. ఈ చర్యలన్నీ అభివృద్ధికి మానవతా కోణం మరింతగా పెంచుతాయి. మా యువత చక్కని ఆలోచనాపరులుగా మారేందుకు, వారి ఉజ్వల భవిష్యత్తుకు ఇవి దోహదపడాలని కోరుతున్నాను. నన్ను ఇక్కడకి ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
ధన్యవాదాలు