Few people are attempting to weaken the honesty of our social structures; Govt is working towards cleansing the system of such elements: PM
As a result of the efforts of the Government, the economy is functioning with less cash: PM Modi
The cash to GDP ratio has come down to 9 per cent, from 12 per cent before demonetisation: Prime Minister
There was a time when India was among Fragile Five economies, but now steps taken by Govt will ensure a new league of development: PM
Premium would be placed on honesty, and the interests of the honest would be protected: PM Modi
87 reforms have been carried out in 21 sectors in last three years: PM Modi
In the policy and planning of the Government, care is being taken to ensure that lives of poor and middle class change for the better: PM

 

నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడు, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌ మంత్రి శ్రీ పిపి చౌద‌రి గారు,

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా అధ్య‌క్షుడు డాక్ట‌ర్ శ్యామ్ అగ‌ర్వాల్ గారు మరియు స‌మావేశానికి హాజ‌రైన ప్ర‌ముఖులారా,

ఐసిఎస్ఐ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లను ఈ రోజు జరుపుకొంటోంది. ఈ సంస్థ‌తో అనుబంధం ఉన్న వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా నా హృద‌య‌పూర్వ‌క శుభాభినంద‌న‌లు.

గ‌త 49 సంవ‌త్స‌రాలుగా ఐసిఎస్ఐ ప్ర‌యాణంలో భాగం పంచుకున్న వారంద‌రి మ‌ధ్య‌ ఉండి వారికి స‌త్కారం చేయ‌డం నాకు ప్ర‌త్యేక గౌర‌వం.

దేశం లోని ప్ర‌తి ఒక్క‌ కంపెనీ దేశీయ చ‌ట్టాల‌ను తు.చ. త‌ప్ప‌కుండా పాటించేలా, పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ప‌ని చేసేలా, త‌ప్పుడు మార్గం ప‌ట్ట‌కుండా ఉండేలా చూస్తున్న నిపుణుల‌తో భేటీ కావడాన్ని నేను గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నాను. దేశంలో కార్పొరేట్ సంస్కృతి ఎలా ఉండాలి అనేది నిర్ణ‌యించ‌వ‌ల‌సిన గురుత‌ర బాధ్య‌త మీ అంద‌రి మీద ఉంది.

 

మీ సంస్థ ‘స‌త్యం వ‌ద‌, ధ‌ర్మం చ‌ర’ అనే సూత్రాన్ని పాటిస్తుంది. ప్ర‌తి ఒక్క‌రూ నిజ‌మే ప‌ల‌కాలి, దేశీయ నిబంధ‌న‌లు, నియంత్ర‌ణ‌లు పాటించాల‌ని ఆ సిద్ధాంతం చెబుతుంది. మీ స‌ల‌హా మంచిదైనా, చెడుదైనా దాని ప్ర‌భావం దేశంలో కార్పొరేట్ పాల‌న‌పై ఉంటుంది.

మిత్రులారా, చాలా సంద‌ర్భాలలో ప్ర‌జ‌లు తాము ఏ దారిలో న‌డ‌వాలో ఆ దారిలో న‌డ‌వ‌రు. ఉదాహ‌ర‌ణ‌కి యుధిష్ఠిరుడు, దుర్యోధ‌నుల‌నే తీసుకుంటే ఇద్దరికీ ఒకే గురువు విద్యాబోధ చేశారు. కాని వారి చ‌ర్య‌లు మాత్రం భిన్న ధ్రువాలుగా ఉంటాయి.

మ‌హాభార‌తంలో దుర్యోధ‌నుడు “జానామి ధ‌ర్మం న‌ చ‌ మేం ప్రవృత్తి:, జానామి ధ‌ర్మం న‌ చ‌ మేం నివృత్తి:” అని చెబుతూ ఉంటాడు.

అంటే, “మంచి మార్గం ఏదో నాకు తెలుసు, కానీ ఆ బాట‌లో న‌డ‌వాల‌నే ఆకాంక్ష లేదు; ఏది క్రూర‌త్వ‌మో నాకు తెలుసు, కానీ ఆ బాట వీడే ఆలోచ‌న లేదు” అని దీని భావం.

ఇటువంటి ఆలోచ‌న‌లు ఉన్న వారికి ‘స‌త్యం వ‌ద‌, ధ‌ర్మం చ‌ర’ అనే సిద్ధాంతం విలువ‌ల గురించి మీ సంస్థ బోధిస్తుంది. దేశంలో పార‌ద‌ర్శ‌క‌త‌, గౌర‌వ‌నీయ‌త లను తీసుకురావ‌డంలో మీ సంస్థ కీల‌క పాత్ర పోషిస్తుంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, ఆచార్య చాణ‌క్యుడు ఈ విధంగా చెప్పాడు..

‘‘ఏకేన శుష్క వృక్షేణ ద‌హ్యామాననే వ‌హ్నిన‌

ద‌హ్యాతే త ద్వనమ్ స‌ర్వం కుపుత్రేణ కులం య‌థా’’

అంటే, “అడ‌విలో ఎండిపోయిన చెట్టు ఒక దానికి నిప్పు అంటుకున్నా మొత్తం అడ‌వి ద‌గ్ధం అయిపోతుంది, అలాగే కుటుంబంలో ఒక స‌భ్యుడు త‌ప్పు చేసినా మొత్తం కుటుంబ ప్ర‌తిష్ఠ దెబ్బ తింటుంది” అని దీని భావం.

మిత్రులారా, ఇది జాతికి కూడా వ‌ర్తిస్తుంది. ఎవ‌రో కొద్ది మంది మాత్రం దేశ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసేలా, సామాజిక గౌర‌వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం అధికార బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుండి వ్య‌వ‌స్థ‌ను శుద్ధి చేసే కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున చేప‌ట్టింది.

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే తొలి కేబినెట్ స‌మావేశంలోనే న‌ల్ల‌ధ‌నంపై పోరాటానికి ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో సంవ‌త్స‌రాల క్రిత‌మే ఈ సూచ‌న చేసింది.

– విదేశాల్లో దాచిన న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసేందుకు న‌ల్ల‌ధ‌నం చ‌ట్టం చేయ‌డం జ‌రిగింది.

– అనేక కొత్త దేశాల‌తో ప‌న్ను చ‌ట్టాలు చేసుకోవ‌డం, గ‌తంలోని ప‌న్ను చ‌ట్టాల‌ను స‌వ‌రించుకోవ‌డం జ‌రిగింది. వారితో నిరంత‌రాయంగా సంప్ర‌దింపులు జ‌రిపేందుకు కొత్త మార్గాలు క‌నుగొన‌డం జ‌రిగింది.

– ఇన్ సాల్వెన్సీ, బాంక్ రప్ట‌సీ చ‌ట్టాన్ని (దివాలా) రూపొందించ‌డం జ‌రిగింది.

– 28 సంవ‌త్స‌రాలుగా మూల‌న ప‌డి ఉన్న బేనామీ ఆస్తుల చ‌ట్టాన్ని అమ‌లులోకి తేవ‌డం జ‌రిగింది.

– ఎన్నో సంవ‌త్స‌రాలుగా ఊగిస‌లాడుతున్న జిఎస్ టిని అమ‌లులోకి తేవ‌డం జ‌రిగింది.

– నోట్ల చట్టబద్ధత రద్దు నిర్ణ‌యాన్ని తీసుకొనే సాహ‌సం కూడా ఈ ప్ర‌భుత్వ‌మే చేయ‌గ‌లిగింది.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా,

వివిధ సంస్థ‌లలో నిజాయ‌తీని కాపాడి శ‌క్తిమంతం చేసేందుకు ప్ర‌భుత్వం కృషి చేసింది. ఈ ప్ర‌భుత్వం ఒక్క‌టే నిరంత‌రాయంగా, అవిశ్రాంతంగా చేసిన కృషి వ‌ల్ల తక్కువ న‌గ‌దు చ‌లామ‌ణి వ్య‌వ‌స్థ ఆచ‌ర‌ణీయం అయింది. 2016 న‌వంబ‌ర్ తొమ్మిదో తేదీని భార‌త చ‌రిత్ర‌లో అవినీతి నిర్మూల‌నకు ఉద్య‌మం ప్రారంభ‌మైన రోజుగా అంద‌రి మ‌దిలో గుర్తుండిపోతుంది. డీమానిటైజేష‌న్నంత‌రం జిడిపిలో న‌గ‌దు చ‌లామ‌ణి 9 శాతానికి దిగి వ‌చ్చింది. 2016 న‌వంబ‌ర్ ఎనిమిదో తేదీకి ముందు ఇది 12 శాతం క‌న్నా పైనే ఉండేది. దేశంలో, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌రిస్థితి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం జ‌రిగిఉండ‌క‌పోతే ఇది సాధ్య‌మ‌య్యేదా ? గ‌తంలో న‌ల్ల‌ధ‌నం ఎంత తేలిగ్గా చేతులు మారేదో మీక‌న్నా బాగా తెలిసిన వారెవ‌రున్నారు ?

మిత్రులారా,

మ‌హాభార‌తంలో మ‌రో పాత్ర ఉంది. అది శ‌ల్య‌ పాత్ర‌. శ‌ల్యుడు క‌ర్ణునికి ర‌థ‌సార‌థి. మ‌రో ప‌క్క అర్జునికి శ్రీ‌కృష్ణుడు సార‌థి. ఈ శ‌ల్యుడు ఎప్పుడూ యుద్ధ‌ రంగంలో పోరాడుతున్న‌వారిని నిరుత్సాహ‌ప‌రుస్తూ వారి న‌మ్మ‌కం దెబ్బ తీసేలా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటాడు. నీకు సాహ‌సం లేదు, నీ అశ్వాలు, ర‌థం బ‌ల‌హీనం, నువ్వు ఎలా పోరాడ‌గ‌ల‌వు అని యుద్ధ‌ రంగంలో పోరాడుతున్న క‌ర్ణుడితో వాదిస్తూ ఉంటాడు. శ‌ల్య పాత్ర మ‌హాభార‌త కాలానికి చెందిన‌ది. అదే త‌ర‌హాలో శ‌ల్యుని ఆలోచ‌నా ధోర‌ణులు ఉన్న వారు మ‌న మ‌ధ్య కూడా ఉన్నారు. దేశంలో అప‌న‌మ్మ‌కం వ్యాప్తి చేయండంలో వారు ఆనందం పొందుతూ ఉంటారు. అలాంటి వారికి ఒక్క త్రైమాసికంలో జిడిపి మంద‌గించింద‌న్న‌ది పెద్ద వార్త‌. మీరేం సాధించ‌గ‌ల‌రు, త‌దుప‌రి జ‌ర‌గ‌బోయేది ఏమిటి అంటూ నిరాశావాదాన్ని వ్యాపింప‌చేయ‌డం వారికి ఆనందం.

డోక్లాం వివాదం వెలుప‌లికి వ‌చ్చిన స‌మ‌యంలో కూడా వారు అదే త‌ర‌హా నిరాశావాదాన్ని వ్యాపింప‌చేస్తూ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్న‌ద‌ని ప్ర‌చారం చేశారు. ఇలాంటి నిరాశావాదాన్ని వ్యాపింప‌చేయ‌డం కొంద‌రికి ఆనందం. అలాంటి ప్ర‌చారం వ‌ల్ల‌నే వారికి మంచిగా నిద్ర‌ప‌డుతుంది. వారికి ఒక త్రైమాసికంలో జిడిపి మంద‌గించ‌డం ఒక మంచి డోసుగా ప‌నిచేస్తుంది. అలాంటి వారిని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

మిత్రులారా,

వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా గ‌ణాంకాలున్న‌ట్ట‌యితే వ్య‌వ‌స్థ‌లు, విధానాలు చ‌క్క‌గాప‌ని చేస్తున్న‌ట్టుగానే వారు భావిస్తారు. అదే గ‌ణాంకాలు వారి ఆలోచ‌నా ధోర‌ణుల‌కు భిన్నంగా ఉంటే మాత్రం ఆయా సంస్థ‌లు లేదా వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరును, విధానాల‌ను ప్ర‌శ్నిస్తూ ఉంటారు. ఏదైనా అంశంపై ఒక నిశ్చ‌యానికి వ‌చ్చే ముందు మ‌నం అలాంటి వారిని గుర్తించాలి. అప్పుడే మ‌నం స‌రైన బాట‌లో న‌డ‌వ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

ఒక త్రైమాసికంలో జిడిపి 5.7 శాతానికి దిగ‌జార‌డం ఇదే తొలిసార‌ని మీరు నిజంగా భావిస్తున్నారా ? కాదు, కానే కాదు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జిడిపి రేటు 5.7 శాతం అంత‌ క‌న్నా దిగువ‌కు వ‌చ్చిన సంద‌ర్భాలు ఎనిమిది ఉన్నాయి. వృద్ధి రేటు 0.2 శాతానికి, 1.5 శాతానికి కూడా దిగ‌జారిన త్రైమాసికాలు కూడా చ‌రిత్ర‌లో ఉన్నాయి. అధిక ద్రవ్యోల్బ‌ణం, అధిక క‌రెంట్ ఖాతా లోటు, అధిక విత్త‌ లోటుతో ఆర్థిక వ్య‌వ‌స్థ అల్లాడుతున్న సంద‌ర్భాల్లో ఈ త‌ర‌హా వృద్ధి రేటు మ‌రింత హానిక‌రం.

2014 సంవ‌త్స‌రానికి ముందు 2012-13, 2013-14 సంవ‌త్స‌రాల్లో స‌గ‌టు వృద్ధి రేటు 6 శాతం స్థాయిలో నిలిచింది. ఆ రెండు సంవ‌త్స‌రాల‌నే నేను ఎందుకు ఎంచుకున్నాన‌ని కొంద‌రు ప్ర‌శ్నించ‌వ‌చ్చు. శ‌ల్యుని త‌ర‌హా ఆలోచ‌నా ధోర‌ణులు ఉన్న వారు ఇలాంటి ప్ర‌శ్న‌వేయ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు.

మిత్రులారా,

గ‌త ప్ర‌భుత్వం చివ‌రి రెండు సంవ‌త్స‌రాల్లోను, మా ప్ర‌భుత్వం మూడు సంవ‌త్స‌రాల్లోను జిడిపి ని మ‌దింపు చేయ‌డానికి తీసుకున్న విధానం ఒక‌టే. అందుకే నేను ఆ రెండు సంవ‌త్స‌రాల‌ను ప్ర‌స్తావించారు. మా ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్ర గ‌ణాంకాల సంస్థ 7.4 శాతం జిడిపి వృద్ధి రేటును ప్ర‌క‌టించిన‌ప్పుడు కొంద‌రు అదంగా త‌ప్పుడు లెక్క‌లంటూ కొట్టి వేశారు. వాస్త‌విక ప‌రిస్థితుల‌పై వారి అవ‌గాహ‌న‌తో జిడిపి గ‌ణాంకాలు స‌రితూగ‌న‌ప్పుడు వారు అలాంటి అభిప్రాయ‌మే ప్ర‌క‌టిస్తారు. ఇలాంటి వారే ఆర్థిక వ్య‌వ‌స్థ వాస్త‌వంగా అంత వృద్ధిని సాధిస్తోంద‌ని తాము భావించ‌డంలేద‌ని చెబుతూ ఉంటారు. అది శ‌ల్యుని మాన‌సిక స్థితిని ప్ర‌తిబింబించ‌డం లేదా ?

మంచి వృద్ధిని ప్ర‌క‌టించిన‌ప్ప‌డు ఆ సంస్థ‌లే వారికి అయిష్టంగా మారిపోతాయి. కానీ, వృద్ధి రేటు 5.7 శాతం ప్ర‌క‌టించిన‌ప్పుడు మాత్రం వారి లోని శ‌క్తులు ఉత్తేజితం అవుతాయి. అప్పుడు వారికి ఆ సంస్థ‌లు చెబుతున్న‌ది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. ఆర్థిక వ్య‌వ‌స్థ అంత వృద్ధిని సాధిస్తున్న‌ద‌నే వాదంతో తాము ఏకీభ‌వించ‌లేమ‌నే వారే ఇప్పుడు ఆ సంస్థ‌లు చెప్పింది నిజ‌మే అనేందుకు వెనుకాడ‌రు.

ఈ కొద్ది మంది వ్య‌క్తులే జిడిపి మ‌దింపున‌కు ఉప‌యోగిస్తున్న కొత్త విధానంలో ఏదో లోపం ఉన్న‌ద‌ని వాదిస్తూ ఉంటారు. వారు గ‌ణాంకాల ఆధారంగా కాకుండా త‌మ‌లోని భావాల‌కు అనుగుణంగా మాట్లాడుతూ ఉండ‌డం వ‌ల్ల‌నే వారికి ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోని వృద్ధి గోచ‌రం కాదు.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, శ‌ల్యుని త‌ర‌హా ఆలోచ‌నాధోర‌ణులు ఉన్న ఆర్థిక‌వేత్త‌ల‌కు కూడా రెండు త్రైమాసికాల్లో వ‌రుస‌గా జిడిపి వృద్ధిరేటు 6.1 శాతానికి, 5.7 శాతానికి జారిన‌ప్పుడు ఆ గ‌ణాంకాల్లో వాస్త‌వం క‌నిపిస్తుంది.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, నేను ఆర్థిక‌వేత్త‌ను కాను, నేనెప్పుడూ అలా అని చెప్పుకోలేదు. కానీ, ఆర్థిక రంగంపై ఇప్పుడు ఇంత‌గా చ‌ర్చ జ‌రుగుతున్నందుకే నేను ఒక సారి మిమ్మ‌ల్ని గ‌తంలోకి తీసుకువెళ్లాను.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, శక్తిమంతమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల కూట‌మి జి-7, జి-8, జి-20 ల‌లో ప్ర‌స్తుతం భార‌తదేశం సభ్య‌త్వ దేశంగా ఉన్నరోజులే కాదు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత్యంత ఊగిస‌లాట‌లో ఉన్న ఐదు దేశాల కూట‌మిలో కూడా భార‌తదేశం స‌భ్య‌త్వ దేశంగా ఉన్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఈ బ‌ల‌హీన దేశాలు ఆ బృందానికే కాదు, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ పున‌రుజ్జీవానికి కూడా ఒక పెను అవ‌రోధంగా భావించారు. అలాంటి బృందంలో స‌భ్య‌త్వ దేశంగా భార‌తదేశాన్ని ప్ర‌క‌టించారు.. అంటే, మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను న‌డుపుకోగ‌ల సామ‌ర్థ్యం మ‌న‌కు లేద‌న్న‌ మాట‌. అంతే కాదు, ఇత‌రుల వృద్ధికి కూడా భార‌తదేశాన్ని అవ‌రోధంగా భావించారు.

అత్యుత్త‌మ ఆర్థిక‌వేత్త‌లు ఉన్న ఆ రోజుల్లో ఇటువంటి సంఘ‌ట‌న ఎందుకు జ‌రిగింద‌న్న‌ది ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై అతి త‌క్కువ ప‌రిజ్ఞానం ఉన్న నా వంటి వానికి అర్ధం కాని విష‌యం. జిడిపి వృద్ధి క‌న్నా ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుద‌ల అధికంగా ఉండ‌డం, మితి మీరిన క‌రెంట్ ఖాతా లోటు, విత్త‌ లోటు లు ప్ర‌ముఖంగా వార్త‌ల్లో ఉండ‌డం వంటి ఆ రోజుల నాటి వాస్త‌వాలు మీ అంద‌రికీ తెలిసిందే. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ‌, వ‌డ్డీ రేట్ల గురించిన వార్త‌లు కూడా ప్ర‌ముఖంగా వ‌స్తూ ఉండేవి. ఆ రోజుల్లో జాతీయ వృద్ధి రేటును దెబ్బ తీసిన ఈ అంశాలు నేను ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన కొద్ది మందికి మాత్రం అభిమాన పాత్రంగా ఉన్నాయి. కానీ, ఈ రోజు అవే సూచిక‌లు ఎంతో మెరుగుప‌డ్డాయి. వృద్ధి రేటు స‌రైన బాట‌లో ఉంది. అయినా వారు ఆ రంగుట‌ద్గాల్లోంచే ప‌రిస్థితుల‌ను చూస్తారు. వారికి వాస్త‌వాలు క‌నిపించ‌వు. అందుకే వాటిని మీ దృష్టికి తీసుకువ‌స్తున్నాను. అలాంటి వివ‌రాల‌తో కూడిన స్లైడ్ల‌ను కూడా చూపిస్తున్నాను.

ఒక‌ప్పుడు 10 శాతం క‌న్నా పైనే ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం స‌గ‌టున 2.5 శాతానికి దిగివ‌చ్చింది. ఆ 10 శాతాన్ని ఇప్ప‌టి 2.5 శాతంతో మీరు స‌రిపోల్చ‌గ‌ల‌రా ? ఒక‌ప్పుడు 4 శాతం ఉన్న‌ క‌రెంట్ ఖాతా లోటు ఈ రోజు 1 శాతానికి దిగివ‌చ్చింది. అది మీరు చూస్తున్నారు. మా ప్ర‌భుత్వం విత్త‌ లోటును గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న 4.5 శాతం నుండి 3.5 శాతానికి తీసుకురాగ‌లిగింది.

ఈ రోజు విదేశీ పెట్టుబ‌డిదారులు భార‌తదేశంలో భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు. భార‌త విదేశీ మార‌కం నిల్వ‌లు 25 శాతం మేర‌కు పెరిగి 30,000 కోట్ల డాల‌ర్ల నుంచి 40,000 కోట్ల డాల‌ర్ల‌కు చేరాయి.

దేశంలో అమ‌లుజ‌రుగుతున్న సంస్క‌ర‌ణ‌లు గాని, ప్ర‌భుత్వం సాధిస్తున్న విజ‌యాలు గాని ఆ కొద్ది మంది దృష్టికి క‌నిపించ‌వు. దీన్ని బ‌ట్టే వారు దేశ ప్ర‌యోజ‌నాల కోసం పాటుప‌డుతున్నారా లేక కొద్ది మంది ప్ర‌యోజ‌నాల‌నే చూస్తున్నారా అనేది జాతి అర్ధం చేసుకోవ‌చ్చు.



మిత్రులారా, వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాల పాటు 7.5 శాతం స‌గ‌టు వృద్ధిని సాధించిన ఆర్థిక వ్య‌వ‌స్థ ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో 5.7 శాతానికి దిగ‌జారిన మాట వాస్త‌వం. దాంతో మేం విభేదించ‌డంలేదు. కానీ ఈ ధోర‌ణిని తిప్పి కొట్టేందుకు ప్ర‌భుత్వం పూర్తి క‌ట్టుబాటుతో ఉంద‌ని నేను గ‌ట్టిగా చెబుతున్నాను. అది సాధించ‌గ‌ల స‌త్తా మాకుంది. అందుకు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటాం.

ఆర్థిక వ్య‌వ‌స్థ మూలాలు ప‌టిష్ఠంగా ఉన్న‌ట్టు చాలా మంది నిపుణులు అంగీక‌రిస్తున్నారు. మేం ఎన్నో నిర్ణ‌యాలు తీసుకున్నాం. దేశ ఆర్థిక స్థిర‌త్వాన్ని కాపాడి తీరుతాం. మ‌రిన్ని పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం. వృద్ధి రేటును పురోగ‌మింప‌చేస్తాం.

ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు చ‌ర్య‌లు భార‌తదేశాన్ని రానున్న సంవ‌త్స‌రాల్లో కొత్త కూట‌మిలో నిల‌బెడుతుంద‌ని నేను మీకు హామీ ఇస్తున్నాను. రిజ‌ర్వు బ్యాంకు అంచ‌నాల ప్ర‌కారం కూడా వ‌చ్చే త్రైమాసికం నుండి వృద్ధి రేటు పుంజుకుంటుంది. 7.7 శాతం వృద్ధి రేటు సాధించే దిశ‌గా దేశం అడుగేస్తుంది.

ఇటీవ‌ల తీసుకున్న వ్య‌వ‌స్థాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల కొంద‌రు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం మాకు తెలుసు. వాటి ప్ర‌భావానికి గురైన ఏ రంగానికైనా ఎలాంటి స‌హాయం కావాల‌న్నా అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్ఎస్ ఎమ్ఇ కావ‌చ్చు, ఎగుమ‌తుల రంగం కావచ్చు లేదా అవ్య‌వ‌స్థీకృత రంగం కావ‌చ్చు. నిజాయ‌తీ తోనే దేశ ప్ర‌తిష్ఠ ఇనుమ‌డిస్తుంది, నిజ‌య‌తీప‌రుల‌ను ప్ర‌భుత్వం కాపాడుతుంది అని ఈ వేదిక‌గా నేను ఎలుగెత్తి చాటుతున్నాను.

మారిన కొత్త వ్యాపార వాతావ‌ర‌ణంలో త‌మ పాత రికార్డుల‌న్నీ తిర‌గ‌తోడ‌తారేమోన‌న్న భ‌యాలు కొంద‌రు వ్యాపార‌వేత్త‌ల్లో ఉన్నాయి. అటువంటిదేమీ జ‌ర‌గ‌ద‌ని నేను భ‌రోసా ఇస్తున్నాను. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో అప్ప‌టి నిబంధ‌న‌లు, వారి ధోర‌ణి, ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా అలా జ‌రిగి ఉండ‌వ‌చ్చు. మీరు జాతీయ స్ర‌వంతిలో చేర‌కుండా నిరోధించ‌డాన్ని మించిన పాపం మ‌రొక‌టి ఉండ‌దు. ప్ర‌ధాన‌ జీవ‌న స్ర‌వంతిలో భాగ‌స్వాములు కావాల‌నుకునే వారంద‌రికీ మా ప్ర‌భుత్వం స్వాగ‌తం ప‌లుకుతోంది. ఏం క‌ల‌త చెంద‌వ‌ద్దు, మేమెప్పుడూ మీతోనే ఉంటాం.

మీకు జిఎస్ టిని గురించి కూడా చెప్పాల‌నుకుంటున్నాను. దాని అమ‌లు ప్రారంభ‌మై మూడే నెల‌ల‌యింది. ఏది ప‌ని చేస్తోంది, ఏది చేయ‌డం లేద‌న్న‌ది మేం సునిశితంగా ప‌రిశీలిస్తున్నాం. అతి చిన్న అంశాల‌పై కూడా అంద‌రి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. సాంకేతిక ప‌రిజ్ఞానం కావ‌చ్చు, ఫారాల దాఖ‌లు కావ‌చ్చు.. ఎలాంటి స‌మ‌స్య‌లు, లోపాలు ఉన్నామో స‌మీక్షించాల‌ని జిఎస్ టి కౌన్సిల్ ను కోర‌డం జ‌రిగింది. అన్ని రాజ‌కీయ పక్షాలు, రాష్ర్ట‌ ప్ర‌భుత్వాల‌ను సంప్ర‌దించి త‌గు ప‌రిష్కారాలు సాధించే ప్ర‌య‌త్నం చేస్తాం. మేం ఛాంద‌స‌వాదులం గాని, సంప్ర‌దాయ‌వాదులం గాని కాద‌ని వ్యాపార‌ వ‌ర్గాల‌కు నేను భ‌రోసా ఇస్తున్నాను. మాకు అన్నీ తెలుసున‌ని భావించ‌డం లేదు. ఏదైనా చేయాల్సింది ఉన్నదంటే అది చేయ‌డానికి వెనుకాడేది లేదు.

మాకు అన్నీ తెలుసున‌ని మేం చెప్ప‌డం లేదు. అయితే, స‌రైన దిశ‌గా ప‌య‌నంలో ఇదొక ప్ర‌య‌త్నం. ఎక్క‌డ అవ‌రోధాలు ఎదురైనా మా మూడు సంవత్సరాల అనుభ‌వం ఆధారంగా వాటిని అధిగ‌మిస్తూ అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా సంస్క‌ర‌ణ‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాం.

మిత్రులారా.. ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌స్తుత స్థితిని గురించి మీతో చ‌ర్చిస్తున్న సంద‌ర్భంగా కింది వివ‌రాల‌ను మీతో పంచుకోవాల‌నుకుంటున్నాను. వీటి అంత‌రార్థ‌మేమిటో మీ నిర్ణ‌యానికే వ‌దిలేస్తున్నాను.

మిత్రులారా.. మీరు ఎప్పుడైనా కొత్త‌ కారును కొనుగోలు చేస్తే మీరు ఒత్తిడి వ‌ల్ల కొని ఉండ‌ర‌న్న‌ది నా ప్ర‌గాఢ న‌మ్మ‌కం. మీరు మీ కుటుంబ జ‌మాఖ‌ర్చుల‌ను చూసుకునే ఉంటారు.. మీ పిల్ల‌ల చ‌దువు ఖర్చు, కుటుంబం లోని పెద్ద‌ల వైద్య చికిత్స‌ల ఖ‌ర్చు… ఇవ‌న్నీ చూసుకున్న త‌రువాత మీ ద‌గ్గ‌ర పొదుపు చేసిన సొమ్ము మిగిలి ఉంటేనే మీరు కుటుంబం కోసం ఓ కారును కొని ఉంటారు. ప్రాథ‌మికంగా మ‌న స‌మాజం ఆలోచ‌న విధానం ఇదే.. ఇటువంటి ప‌రిస్థితుల మ‌ధ్య :

– దేశంలో జూన్ తరువాత ప్రయాణికుల కార్ల అమ్మకం దాదాపు 12 శాతం పెరిగిందంటే మీరేమంటారు ?

– వాణిజ్య వాహనాల అమ్మకాల్లో కూడా జూన్ తరువాత 23 శాతం వృద్ధి నమోదైందని తెలిస్తే మీరేం చెబుతారు ?

– దేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వృద్ధి 14 శాతానికి పైగా నమోదైందంటే మీరేమంటారు ?

– గడచిన రెండు నెలల్లోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 14 శాతం పెరిగిందంటే మీరేమంటారు ?

– అంతర్జాతీయ వైమానిక సరుకుల రవాణా రమారమి 16 శాతం పెరిగిందంటే మీరేమంటారు ?

– టెలిఫోన్ చందాదారుల సంఖ్యలో 14 శాతం వృద్ధి నమోదైందంటే మీరు ఏమంటారు ?

– సోదర సోదరీమణులారా.. ప్రజలు వాహనాలు కొంటున్నారని, కొత్త ఫోన్ కనెక్షన్లు తీసుకుంటున్నారని, విమాన ప్రయాణాలు చేస్తున్నారని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల గిరాకీలో వృద్ధిని ఈ సూచీలు ప్రతిబింబిస్తున్నాయి.

• ఇదే క్రమంలో గ్రామీణ గిరాకీ సంబంధిత సూచీలను పరికిస్తే.. ఇటీవలి నెలల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 34 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి.

• అలాగే ఎఫ్ఎమ్ సిజి రంగం లోనూ గిరాకీలో వృద్ధి సెప్టెంబరు నెలలో ఊర్ధ్వముఖ ధోరణిలో సాగింది.

– మిత్రులారా.. దేశ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే ఇలాంటివన్నీ సంభవిస్తాయి. దేశ ప్రజలు ఆ భావనలో ఉన్నారంటే, నిజం.. ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉంది.

– దేశంలో వస్తు తయారీ రంగం విస్తరణ ధోరణిలో సాగుతోందని ఇటీవల విడుదలైన కొనుగోళ్ల నిర్వహణదారుల సూచీ (పిఎమ్ఐ) స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. భవిష్యత్ ఉత్పత్తి సూచీ (ఎఫ్ఒఐ) కూడా 60 సంఖ్యను దాటింది.

•- ఇటీవల విడుదలైన గణాంకాలను చూస్తే- బొగ్గు, విద్యుత్తు, ఉక్కు, సహజ వాయువుల ఉత్పత్తిలో ఉత్తేజకర వృద్ధి నమోదైందని అర్థమవుతుంది.

•- మిత్రులారా.. చివరకు వ్యక్తిగత రుణాల వితరణ కూడా వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది.

• గృహనిర్మాణ ఆర్థిక సహాయ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.

-• ఇదొక్కటే కాదు.. మూలధన విపణి లోని మ్యూచువల్ ఫండ్స్, బీమా రంగాలలో పెట్టుబడులు మరింత పెరిగాయి.

• ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)లో భాగంగా 25,000 కోట్ల రూపాయలకు పైగా సేకరించాయి. గత సంవత్సరం మొత్తం కలిపి ఇది 29,000 కోట్ల రూపాయలు మాత్రమే.

• నాలుగు నెలలకన్నా తక్కువ కాలంలో కార్పొరేట్ బాండ్లు, ప్రైవేటు పెట్టుబడుల కింద ఆర్థికేతర సంస్థల్లోకి 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి.

– దేశంలో ద్రవ్య పోషక పునాది ఎంత విస్తృతంగా ఉందో ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. అంటే… ఆర్థిక సహాయమన్నది ఇకపై బ్యాంకులకు మాత్రమే పరిమితమైనది కాదని స్పష్టమవుతోంది.
– మిత్రులారా.. సమయం, వనరులు- రెండింటినీ సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రభుత్వం నిరంతరం నొక్కిచెబుతూనే ఉంది. మూడేళ్ల కాలవ్యవధిలో మునుపటి, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు మధ్యగల ఈ వ్యత్యాసాన్ని ఎవరైనా చూడవచ్చు.

• మునుపటి ప్రభుత్వం తన చివరి మూడేళ్ల వ్యవధిలో 80,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించింది… మా ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 1 లక్షా 20,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించింది. దీన్నిబట్టి గ్రామీణ రహదారుల నిర్మాణంలో 50 శాతం వృద్ధి నమోదైందని స్పష్టమవుతుంది.

– మునుపటి ప్రభుత్వం చివరి మూడేళ్ల వ్యవధిలో 15,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణ పనులను మంజూరు చేసింది. మా ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 34,000 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మణా పనులను మంజూరుచేసింది.

• ఈ రంగంలో పెట్టుబడుల గురించి మాట్లాడితే- మునుపటి ప్రభుత్వం తన చివరి మూడేళ్లలో భూ సేకరణ, రహదారుల నిర్మాణం కోసం 93,000 కోట్ల రూపాయలు వెచ్చించింది. మా ప్రభుత్వ హయాంలో ఈ మొత్తం 1.83 లక్షల కోట్ల రూపాయలకు దూసుకుపోయింది. అంటే ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులను దాదాపు రెట్టింపు చేసింద‌న్న మాట‌.

జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఎన్నిరకాల పాలనపరమైన, ఆర్థికపరమైన చర్యలు తీసుకోవాలో మీకూ తెలిసే ఉంటుంది. దీన్ని బట్టి విధాన పక్షవాతం నుంచి పాలనను బయటపడేసిన తరువాత ప్రస్తుత ప్రభుత్వం విధాన నిర్ణేతగా, విధాన ఆచరణదారుగా ఎలా పని చేస్తున్నదీ అర్థమవుతుంది.

అదేవిధంగా మనం రైల్వే రంగం గురించి చర్చిస్తే:

• మునుపటి ప్రభుత్వం చివరి మూడేళ్లలో దాదాపు 1,100 కిలోమీటర్ల పొడవైన రైలుమార్గాలను వేసింది. ప్రస్తుత ప్రభుత్వం గడచిన మూడేళ్లలో వేసిన రైలు మార్గాల పొడవు 2,100 కిలోమీటర్ల స్థాయిని దాటింది. అంటే.. దాదాపు రెట్టింపు వేగంగా మేం రైలుమార్గాలు వేశామని అర్థం చేసుకోవచ్చు.

• మునుపటి ప్రభుత్వం చివరి మూడేళ్లలో దాదాపు 1,300 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాలను ద్విముఖ మార్గాలుగా మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం గడచిన మూడేళ్లలో 2,600 కిలోమీటర్ల మార్గాలను ద్విముఖ మార్గాలుగా మార్చింది. దీన్ని బట్టి రైలుమార్గాల ద్విముఖీకరణను మేం రెండు రెట్లు అధిక వేగంతో పూర్తి చేశామని స్పష్టమవుతుంది.

మిత్రులారా.. మునుపటి ప్రభుత్వం చివరి మూడేళ్లలో మూలధన వ్యయం కింద 1.49 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గడచిన మూడేళ్ల మూలధన వ్యయం 2.64 లక్షల కోట్ల రూపాయలకు దూసుకెళ్లింది. అంటే.. మూలధన వ్యయంలో వృద్ధి 75 శాతంగా నమోదైందన్న మాట !

ఇప్పుడు పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం:

• మునుపటి ప్రభుత్వ చివరి మూడేళ్ల పాలనలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 12,000 మెగా వాట్ల మేర పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వ మూడేళ్ల పాలన విషయానికివస్తే పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 22,000 మెగావాట్లకు పైగా పెరిగి, విద్యుత్ సరఫరా వ్యవస్థకు సంధానమైంది. అంటే ఈ రంగంలో ప్రస్తుత ప్రభుత్వ పనితీరు రెండు రెట్లు అధికంగా మెరుగుపడిందన్న మాట.

• మునుపటి ప్రభుత్వం తన చివరి మూడేళ్ల పాలనలో పునరుత్పాదక ఇంధనంపై 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మా ప్రభుత్వం గడచిన మూడేళ్లలో ఈ రంగంకోసం 10,600 కోట్ల రూపాయలకుపైగా వెచ్చించింది.

• నౌకారంగం పరిశ్రమలో వృద్ధి గురించి మాట్లాడితే… మునుపటి ప్రభుత్వ హయాంలో సరుకుల రవాణాలో వృద్ధి అధోముఖం పట్టింది. కానీ, గడచిన మూడేళ్ల ప్రస్తుత ప్రభుత్వ పాలనలో వృద్ధి 11 శాతం పెరుగుదల నమోదు చేసింది.



మిత్రులారా.. రైలు- రోడ్డు, విద్యుత్ వంటి ముఖ్యమైన రంగాల్లో భౌతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు దేశ సామాజిక మౌలిక వసతులను దృఢం చేయడంపై ప్రభుత్వం పూర్తి శ్రద్ధ చూపుతోంది. ఇందులో భాగంగా అందుబాటు గృహవసతి కల్పన రంగంలో ఎన్నడూ ఎరుగని విధంగా కీలక విధాన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆర్థిక సంస్కరణలను మేము అమలు చేశాం.

మిత్రులారా.. మునుపటి ప్రభుత్వం చివరి మూడేళ్లలో 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే, తొలి మూడేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం 1.53 లక్షల కోట్ల రూపాయల విలువైన పథకాలను ఆమోదించింది. పేద, మధ్యతరగతి ప్రజలకు గృహ వసతి కల్పనపై మా నిబద్ధతను ప్రతిబింబించే వాస్తవమిది.

సోదర సోదరీమణులారా.. దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రగతి కార్యక్రమాల కోసం మరింత మూలధన పెట్టుబడులు అవసరం. అందుకే విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.

– బీమా రంగంలో సంస్కరణలను గురించి చర్చ ప్రారంభమైన సమయంలో- అటువంటి పరిణామం సంభవిస్తే అదొక ప్రధాన ఆర్థిక నిర్ణయం కాగలదని అప్పట్లో వార్తాపత్రికలు ప్రధాన శీర్షికా కథనాలు ప్రచురించడం మీకు గుర్తుండే ఉంటుంది. అది మునుపటి ప్రభుత్వ పాలన కాలం నాటి మాట.. బీమా రంగంలో ఎలాంటి సంస్కరణలూ తీసుకురాకుండానే అది కుర్చీ దిగిపోయింది. అయితే, బీమా రంగంలో మేము సంస్కరణలను ప్రవేశపెట్టాం. మా ప్రభుత్వం వచ్చిన తరువాతే ఆ పరిణామం సంభవించింది. అయితే, ఇది అప్పట్లో సాధ్యం కాలేదు గనుక, తమకు ఇష్టమైన ప్రభుత్వం ఈ పని చేయలేక పోయిందిగనుక.. శల్య సారథ్య మనస్తత్వం ఉన్నవాళ్లకు మేం తెచ్చిన ఈ సంస్కరణ గొప్పదిగా కనిపించడం లేదు.

– ‘సంస్కరణ’ను తమ పాటకు ఇతివృత్తంగా ఎంచుకున్నవాళ్లకు నేనొకటి చెప్పదలచుకున్నాను. దేశంలోని 21 రంగాల్లో మేం 87 చిన్నాపెద్దా సంస్కరణలు తీసుకొచ్చాం. నిర్మాణ, రక్షణ, ఆర్థిక సేవలు, ఆహార తయారీ లేదా మీరు అనుకుంటున్న ఏ రంగమైనా సరే.. వాటికి పెట్టుబడి విధానాల్లో పెనుమార్పులు తెచ్చాం.

సరళీకరణ తరువాత దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు, గడచిన మూడేళ్ల కాలంలో ప్రవహించిన మొత్తం పెట్టుబడులను మీరు పోల్చిచూస్తే.. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ప్రభావం ఎలా ఉందో మీకు అవగతమవుతుంది.

సోదర సోదరీమణులారా.. మీరంతా ఈ రంగానికి చెందిన వారే. కానీ, నేను మీ ముందుంచుతున్న గణాంకాలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుతాయి. సరళీకరణ ప్రక్రియ 1992 తరువాత మొదలైంది. దీన్ని ప్రాతిపదికగా తీసుకుంటే 2014 దాకా సరళీకరణ ప్రభావం, 2014 నుండి 2017దాకా గల ప్రభావాన్ని పోల్చిచూద్దాం:

• నిర్మాణ రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 75 శాతం కేవలం గడచిన మూడేళ్లలో వచ్చినదే.

• చివరకు పౌర విమానయాన రంగంలోనూ మొత్తం విదేశీ పెట్టుబడులలో 69 శాతం కేవలం ఈ మూడేళ్లలో వచ్చినదే.

• గనుల రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 56 శాతం కేవలం గడచిన మూడేళ్లలో వచ్చినదే.

• కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్ రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 53 శాతం కేవలం ఈ మూడేళ్లలో వచ్చినదే.

• విద్యుత్ ఉపకరణాల రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 52 శాతం మా ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో వచ్చినదే.

• పునరుత్పాదక ఇంధన రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 49 శాతం మా ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో వచ్చినదే.

• జౌళి రంగంలోని మొత్తం విదేశీ పెట్టుబడులలో 45 శాతం కేవలం గడచిన మూడేళ్లలో వచ్చినదే.

• దేశంలోని ఆటోమొబైల్ రంగం ఇప్పటికే భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించినప్పటికీ చివరకు ఈ రంగంలోనూ మొత్తం విదేశీ పెట్టుడులలో 44 శాతం గడచిన మూడేళ్లలో వచ్చినదేనంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.

దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడమే మన దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ పెట్టుబడిదారులలో విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నదీ స్పష్టం చేస్తోంది.

మా విధానాలు, వాటి అమలు, మా దృక్పథాలే భరోసా స్థాయిని మరింత పెంచాయి. దేశ ప్రగతి వృద్ధిరేటును పెంచడంలో, ఉద్యోగావకాశాల సృష్టిలో ఈ పెట్టుబడులన్నీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. రహదారుల నిర్మాణం పెరుగుదల, రైలు మార్గాల విస్తరణవంటి వాటికోసం ఉద్యోగ సృష్టి అవసరం లేదా ? మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది.. కానీ, శల్య మనస్తత్వం దీన్నంతటినీ గుర్తించదంతే.

మిత్రులారా.. మీ అందరి కష్టార్జితమైన ప్రతి పైసా విలువేమిటో ఈ ప్రభుత్వానికి బహుచక్కగా తెలుసు. అందుకే పేద, మధ్యతరగతి జీవితాలను మరింత సౌకర్యవంతం చేయడంతోపాటు వారు డబ్బు పొదుపు చేయగల విధంగా ఈ ప్రభుత్వ విధానాలు, పథకాలు రూపొందించడతాయి.

మిత్రులారా, గ‌త‌ ప్ర‌భుత్వ హ‌యాంలో 350 రూపాయ‌లు ఉన్న ఎల్ ఇడి బ‌ల్బును ఉజాలా ప‌థ‌కం కింద 40- 45 రూపాయ‌ల ధ‌ర‌కు ఈ ప్ర‌భుత్వం నిరంత‌ర కృషి ఫ‌లితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద ప్ర‌జ‌ల‌కు పొదుపు చేస్తుందా చేయ‌దా. ఆ రోజుల్లో ఎల్ఇడి బ‌ల్బు ధ‌ర 350 రూపాయ‌ల వ‌ర‌కు ఎందుకు ఉండేదో నాకు అర్థం కావ‌డంలేదు. నిజానికి ఇది ప‌రిశోధ‌న చేయాల్సిన అంశం.

ఇప్ప‌టివ‌ర‌కు 26 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బులను దేశ‌వ్యాప్తంగా పంపిణీ చేశారు. బ‌ల్బుకు 250 రూపాయ‌ల త‌గ్గింపు లెక్క‌న లెక్క‌ వేసినా ఈ దేశంలోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు 6500 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఈ ఖాతాలో ఆదా చేసిన‌ట్టు లెక్క‌. ఈ బ‌ల్బులు ప్ర‌తి ఇంట్లో విద్యుత్‌ వినియోగ బిల్లును కూడా త‌గ్గించాయి. ఇలా మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఏడాది వ్య‌వ‌ధిలో 14 000 కోట్ల రూపాయ‌లు ఆదా చేసుకున్నాయి. ఇప్పుడు చూడండి, ఎల్ఇడి బ‌ల్బుల‌ కొనుగోలు, విద్యుత్‌ వాడ‌కం పై మొత్తం పొదుపు 20,000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు సాధికార‌త క‌ల్పిస్తోంది.

… ప్ర‌భుత్వ కృషి ఫ‌లితంగా స్థానిక సంస్థ‌లు కూడా ప్ర‌యోజ‌నం పొందుతున్నాయి. అవి తమ వీధి దీపాల స్థానంలో ఎల్ఇడి బ‌ల్బులు వాడుతున్నాయి. ఒక అంచ‌నా ప్ర‌కారం, టైర్ 2 ప‌ట్ట‌ణాల‌ లోని మ్యునిసిపాలిటీలు స‌గ‌టున‌ 10-15 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఆదా చేస్తున్నాయి. ఈ డ‌బ్బు న‌గ‌రాల అభివృద్ధికి ఆర్థిక ప్ర‌గ‌తిని వేగ‌వంతం చేయ‌డానికి ఖ‌ర్చుచేయ‌బ‌డుతోంది.

.. తొలిసారిగా, ఇళ్ళు నిర్మించుకోవ‌డానికి మ‌ధ్య‌త‌ర‌గ‌తికి వ‌డ్డీ రేట్ల‌పై రాయితీని ఈ ప్ర‌భుత్వం ఇచ్చింది. మీరు ఒక‌సారి గుర్తు చేసుకోండి, గ‌తంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఇళ్లు క‌ట్టుకోవ‌డానికి ప్ర భుత్వం రాయితీలు ఇవ్వ‌ లేదు.

మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల భారం త‌గ్గించ‌డానికి ఈ ప్ర‌భుత్వం ఎప్పుడూ చ‌ర్య‌లు తీసుకుంటూ వ‌స్తోంది. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి. పేద‌ల‌కు సాధికార‌త క‌ల్పించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతోంది. ఇందుకు త‌గిన విధానాలు రూపొందించి నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంది. ఈ దిశ‌గా మేం సానుకూల‌త‌తో ముందుకు సాగిపోతున్నాం.

ప్ర‌జ‌ల‌కు ఏదో సాయం చేయ‌డం కాక వారికి సాధికార‌త క‌ల్పించ‌డం పైన నేను విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌వ‌ల‌సి రావ‌చ్చున‌న్న‌విష‌యం నాకు తెలుసు, అయినా వ‌ర్త‌మానాన్ని ర‌క్షించ‌డం కోసం నేను భ‌విష్య‌త్తు విష‌యంలో ఎంత‌మాత్రం రాజీ ప‌డ‌ను. అధికారం గురించి, వోట్ల గురించి మాత్ర‌మే మ‌నం భ‌య‌ప‌డాలా ? మేం క్లిష్ట‌మైన మార్గాన్ని ఎంచుకున్నాం. అయినా మేం ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని స‌రైన మార్గంలోనే ప‌య‌నిస్తున్నాం.

ఈ విష‌యంలోనే త‌ర‌చూ నేను విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంటాను. మీరు ప్ర‌జ‌ల‌కు తాయిలాలు ఇస్తే వారు మిమ్మ‌ల్ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతారు. నేను విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటుంటాను. ఎందుకంటే, స్వ‌ప్ర‌యోజ‌న‌ప‌రుల‌కు మేం చేసేది మింగుడు ప‌డ‌దు. మా ప్ర‌భుత్వం డ‌బ్బును ప్ర‌త్య‌క్ష బ‌దిలీ ప‌ద్ద‌తి ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల‌లోకి నేరుగా బ‌దిలీ చేస్తున్న‌ది. దీనితో దొంగ ఖాతాలు మ‌టుమాయం అయ్యాయి. అందువ‌ల్ల అలాంటి వ్య‌క్తుల‌కు ప్రధాన మంత్రి మోదీ న‌చ్చ‌రు.

ఈ కారంణంగానే మా ప్ర‌త్యేక శ్ర‌ధ్ద అంతా సామాన్యుడికి సాధికారితను క‌ల్పించ‌డంపైనే. వ‌ర్త‌మానాన్ని ర‌క్షించ‌డం కోసం భ‌విష్య‌త్తుపై రాజీప‌డ‌బోన‌ని నేను నా దేశప్ర‌జ‌ల‌కు విన‌మ్రంగా తెలియ‌జేయ‌ద‌ల‌చుకుంటున్నాను.

మిత్రులారా, ప్రైవేటు రంగం, ప్ర‌భుత్వ‌ రంగంతో పాటు వ్య‌క్తిగ‌త రంగంపై కూడా ఈ ప్ర‌భుత్వం త‌గ‌న శ్ర‌ద్ధ పెట్టింది. లేకుంటే చ‌ర్చ అంతా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. వ్య‌క్తిగ‌త రంగం ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌తో ముడిప‌డింది. ఇది కూడా అంతే స‌మానప్రాధాన్య‌త క‌లిగిన‌ది. అందుకే ఈ ప్ర‌భుత్వం స్వంతంగా త‌మంత‌ తాముగా ఏదైనా చేయాల‌నుకునే, త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకునే ఈ దేశ యువ‌త‌కు అవ‌కాశ‌మున్న ప్ర‌తి సాయాన్నీ ప్ర‌భుత్వం అందిస్తోంది.

– 3.75 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు రుణాల‌ను 9 కోట్ల మంది ఖాతాదారుల‌కు ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా ముద్రా ప‌థ‌కం కింద ఇవ్వ‌డం జ‌రిగింది.

– ఈ 9 కోట్ల మందిలో 2.63 కోట్ల మంది యువ‌త తొలిసారి రుణం అందుకుంటున్న‌వారు, అంటే ముద్ర ప‌థ‌కం కింద వ్యాపారం ప్రారంభించ‌డానికి తొలిసారి వీరు రుణం అందుకున్నారన్న‌ మాట‌.

ప్ర‌భుత్వం స్కిల్ ఇండియా మిష‌న్‌, స్టాండ‌ప్ ఇండియా, స్టార్ట‌ప్ ఇండియా కార్య‌క్ర‌మాల ద్వారా స్వ‌తంత్రోపాధిని ప్రోత్స‌హిస్తోంది. సాంప్రదాయక ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి ఎక్కువ‌ మందిని తీసుకువ‌చ్చే కంపెనీల‌కు ఆర్థిక ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌డం జ‌రిగింది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, మ‌నం ఒక సారి ఫార్మ‌ల్ రంగం సూచిక‌ల‌ను చూసిన‌ట్ట‌యితే మార్చి 2014 నాటికి ఉద్యోగుల భ‌విష్య‌త్ నిధి సంస్థ కు ప్ర‌తి నెలా 3.26 కోట్ల‌ మంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్నిజ‌మ‌చేస్తూ వ‌చ్చారు. గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో ఈ సంఖ్య 4.80 కోట్ల‌కు చేరింది. చాలా మంది మ‌రచిపోతున్న విష‌యం ఏమంటే, ఉపాధిలో పెరుగుద‌ల లేకుండా ఈ సంఖ్య పెర‌గ‌దు క‌దా.

మిత్రులారా, ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా పేద‌ ప్ర‌జ‌లు, దిగువ‌ మ‌ధ్య‌త‌ర‌గ‌తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ జీవితాల‌లో గుణాత్మ‌క మార్పును తీసుకువ‌చ్చేందుకు మేం చ‌ర్య‌లు తీసుకున్నాం. జ‌న్ ధ‌న్ ప‌థ‌కం లో భాగంగా 30 కోట్ల మందికి పైగా పేద ప్ర‌జ‌లకు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం. ఉజ్జ్వ‌ల ప‌థ‌కం కింద సుమారు 3 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఉచితంగా గ్యాస్ కనెక్ష‌న్ మంజూరు చేశాం. సుమారు 15 కోట్ల మందిని ప్ర‌భుత్వ బీమా ప‌థకాల కిందికి తీసుకువ‌చ్చాం. పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత విద్యుత్ కనెక్ష‌న్ లను ఇచ్చేందుకు కొద్ది రోజుల క్రితం సౌభాగ్య ప‌థ‌కాన్ని ప్రారంభించాం. ఈ ప‌థ‌కాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు సాధికారితను క‌ల్పిస్తున్నాయి.

అయినా, అవినీతి, న‌ల్ల‌ధ‌నం ఈ దేశానికి శాపంగా ప‌రిణ‌మించాయి. మీ సంస్థ‌కు, దేశంలోని కంపెనీ సెక్ర‌ట‌రీలకు న‌ల్ల‌ధ‌నాన్ని, అవినీతిని రూపుమాప‌డంలో కీల‌క పాత్ర ఉంది. 3 ల‌క్ష‌ల డొల్ల కంపెనీల‌ (shell companies)లో 2.1 ల‌క్ష‌ల కంపెనీల రిజిస్ట్రేష‌న్‌ను ర‌ద్దు చేశాం. నోట్ల చట్టబద్ధత ర‌ద్దు అనంత‌రం ఈ కంపెనీలు న‌ల్ల‌ధ‌నాన్ని దారి మ‌ళ్లిస్తున్న‌ట్టు అనుమానాలు రావ‌డంతో వీటిని ర‌ద్దు చేశారు. ప్ర‌భుత్వంతీసుకున్న చ‌ర్య‌తో డైర‌క్ట‌ర్ల‌లో మ‌రింత చైత‌న్యం వ‌స్తుంద‌ని, షెల్ కంపెనీల‌పై చ‌ర్య‌ల ద్వారా కంపెనీలు మ‌రింత పార‌దర్శ‌క‌త‌ను పాటిస్తాయ‌ని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా, ఈ కాలం ఎన్నో మార్పులతో కూడుకున్న‌ది, దేశ చ‌రిత్ర‌లో ఇవి ప‌రివ‌ర్త‌నాత్మ‌క మార్పులు.

పార‌దర్శ‌కత ప్రాధాన్య‌త‌, నిజాయితీతో కూడిన పాల‌న‌ను దేశ ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్నారు. కార్పొరేట్ గ‌వ‌ర్నెన్స్ ఫ్రేమ్‌వ‌ర్క్ రూప‌క‌ల్ప‌న‌లో ఐసిఎస్ఐ సిఫారసులు సానుకూల పాత్ర‌ను పోషించాయి.

ఇక ఇప్పుడు మీరంతా కొత్త వ్యాపార సంస్కృతిని తీసుకు వ‌చ్చేందుకు క్రియాశీల‌ పాత్ర పోషించాలి. జి ఎస్‌ టి అమ‌లుతో దేశంలో సుమారు 19 ల‌క్ష‌ల మంది పౌరులు నూత‌నంగా ప‌రోక్ష‌ ప‌న్నుల ప‌రిధి కిందకు వ‌చ్చారు. చిన్న వ‌ర్త‌కుడు గాని, పెద్ద వ‌ర్త‌కుడు గాని జిఎస్‌టిలో పొందుప‌రచిన నిజాయతీతో కూడిన‌ ప‌న్ను విధానాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది.

ఈ దిశ‌గా మీరు వ్యాపార‌ వ‌ర్గాల‌ను ప్రోత్స‌హించాలి. ల‌క్ష‌లాది మంది విద్యార్థులు మీ సంస్థ‌లో పేర్లు న‌మోదు చేసుకున్నారు. జిఎస్‌టికి సంబంధించిన చిన్న చిన్న విష‌యాల‌లో ల‌క్ష‌మంది యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చే బాధ్య‌త‌ను మీ సంస్థ తీసుకోగ‌ల‌దా ?

వారం లేదా ప‌ది రోజుల శిక్ష‌ణ అనంత‌రం రిట‌ర్న్‌లు ఫైల్ చేయ‌డంలో స‌హ‌క‌రించ‌డానికి, వ్యాపారులు, వ‌ర్త‌కులు వారి వ్యాపారాల‌ను జిఎస్‌టిఎన్‌ తో అనుసంధానం చేసుకోవ‌డానికి వీరు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు. ఇవి కొత్త ర‌కం ఉపాధికి ద్వారాలు తెరుస్తాయి. దీనిని ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం చేసిన‌ట్ట‌యితే ల‌క్ష మందికి శిక్ష‌ణ కూడా త‌క్కువ సంఖ్య కిందే లెక్క‌.

మిత్రులారా, 2022 సంవత్సరం కల్లా దేశం 75 సంవ‌త్స‌రాల స్వాతంత్య్ర వేడుకలను జ‌రుపుకోనుంది. మ‌న స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధులు వారి జీవితంలో కీల‌క భాగాన్ని దేశ స్వాతంత్ర్యం కోసం జ‌రిగిన పోరాటంలో జైళ్ల‌లో గ‌డిపారు. జీవిత పర్యంతం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం త‌మ జీవితాల‌ను త్యాగం చేశారు. అటువంటి స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుల ఆశ‌ల‌ను, ఆకాంక్ష‌ల‌ను సాకారం చేయాల‌న్నసంక‌ల్పం మ‌న ముందుండాలి. 1942 క్విట్ ఇండియా ఉద్య‌మ స‌మ‌యంలో, ఈ దేశం నుండి బ్రిటిషు వారు వ‌దలి వెళ్లే వ‌ర‌కు వెన‌క‌డుగు వేసేది లేద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా ప్ర‌తి భారతీయుడు సంక‌ల్పం చెప్పుకోవాలి. అలాగే మ‌నం 2022 సంవత్సరంలో జ‌రుపుకోబోయే 75వ స్వాతంత్ర్య‌ దినోత్స‌వానికి గ‌ట్టి సంక‌ల్పంతో కూడిన క‌ల‌ల‌తో ముందుకు క‌ద‌లాలి.

మిత్రులారా, దేశం 2022 సంవత్సరంలో జ‌రుపుకోనున్న 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఐసిఎస్ఐ నుండి నాకు కొన్ని హామీలు కావాలి. ఈ హామీలు మీ ప్ర‌తిజ్ఞ‌ కావాలి. వాటిని మీరు నెర‌వేర్చాలి.

2022 నాటికి ప‌న్ను బాధ్య‌త‌లు గ‌రిష్ఠంగా నెర‌వేర్చే స‌మాజంగా దేశాన్ని తీర్చిదిద్దే బాధ్య‌త‌ను తీసుకుంటారా ?

2022 నాటికి ఒక్క షెల్ కంపెనీ కూడా లేకుండా చూడ‌గ‌ల‌రా ?

2022 నాటికి ప్ర‌తి కంపెనీ నిజాయతీగా ప్ర‌భుత్వానికి ప‌న్నులు చెల్లించేలా చూడ‌గ‌ల‌రా ?

2022 నాటికి దేశంలో నిజాయతీతో కూడిన వ్యాపార సంస్కృతిని నెల‌కొల్పేందుకు మీ సాయం ప‌రిధిని విస్తృత ప‌ర‌చ‌గ‌ల‌రా ?

ఐసిఎస్ఐ స్వ‌ర్ణోత్స‌వ సంవత్సరం ప్రారంభ సంద‌ర్భంగా ఈ ల‌క్ష్యాలను సాకారం చేసే దిశ‌గా త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించాల‌ని, దీనిని త‌న ప ని సంస్కృతిలో భాగం చేసుకొంటుంద‌ని నేను ఆశిస్తున్నాను.

మ‌రో మారు, మీ అంద‌రికీ స్వ‌ర్ణోత్స‌వ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు.

ఆర్థిక రంగానికి సంబంధించి ఇటీవ‌ల ప్ర‌భుత్వంపై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఎదురుదాడిగా మేం భావించ‌బోమ‌ని ప్రియమైన నా దేశ వాసుల‌కు నేను హామీని ఇస్తున్నాను. ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ల విష‌యంలో ప్ర‌భుత్వం సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తుంది. మేం మా ప్ర‌యాణంలో ఇంకా క‌ఠిన‌మైన విమ‌ర్శ‌ల‌ను కూడా త‌ట్టుకుంటాం. ఈ దేశంలోని 125 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను ప్ర‌గ‌తి, అభివృద్ధి ప‌థంలోకి విన‌మ్రంగా తీసుకువెళ్లేందుకు మేం క‌ట్టుబ‌డి ఉన్నాం. ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలను మ‌న‌సులో ఉంచుకుని త్వ‌రితగ‌తిన అభివృద్ధి దిశ‌గా సాగిపోయేందుకు కృషి చేస్తున్నాం.

అంతే కాదు, మ‌రో విష‌యం కూడా నేను మాపై విమ‌ర్శ‌లు చేసే వారికి విన‌మ్రంగా ఒక విష‌యం చెప్ప‌ద‌ల‌చుకున్నాను. విమ‌ర్శ‌కులంద‌రిదీ త‌ప్ప‌నే ధోర‌ణి కూడా మాది కాదు. కానీ, దేశంలో ఒక ర‌క‌మైన నిరాశామ‌య వాతావ‌ర‌ణాన్ని వ్యాప్తి చేయ‌డాన్ని మ‌నం అడ్డుకోవాలి.

మ‌న దేశ ఆర్థిక‌ వ్య‌వ‌స్థ బ‌లాన్ని ప్ర‌తిబింబించే సూచిక‌ల‌ను మీకు నేను చూపించాను. మ‌న దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ ఎంత బ‌లంగా ఉందో సూచించ‌డానికి ఇంకా ఎన్నో ప్రామాణిక‌త‌లు ఉన్నాయి. అవి ఈ ప్ర‌భుత్వ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తికి ప్ర‌తిబింబాలుగా నిలుస్తున్నాయి.

ఇది ప్ర‌భుత్వ దిశ‌కు, అది క‌దులుతున్న వేగానికి నిద‌ర్శ‌నం. దేశం లోప‌ల, వెలుప‌ల దేశంపై పెరుగుతున్న విశ్వాసానికి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ద‌ర్ప‌ణం ప‌డుతోంది. మ‌నం దీనిని మ‌రచిపోకూడదు. మ‌రింత తేజోవంత‌మైన‌, ఉత్సాహ‌వంత‌మైన‌, విశ్వాసం క‌లిగిన గొప్ప సంస్కృతి క‌లిగిన న‌వ భార‌త నిర్మాణానికి మ‌న మంద‌రం ముందుకు క‌దులుదాం.

ఈ స్వ‌ర్ణోత్స‌వ సంవ‌త్స‌రం స‌మ‌యంలో మీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు.

మీరు ఈ రంగానికి చెందిన వారు క‌నుక‌, ఈ అంశంపై నా ఆలోచ‌ల‌ను మీతో పంచుకోవాలని అనుకున్నాను. 
ఈ వేదిక ద్వారా నేను సోద‌ర భార‌తీయులంద‌రికీ ఈ సందేశం చేరుతుంద‌ని నేను ఎంతో ఆశాభావంతో ఉన్నాను.

మ‌రొక్క సారి అనేకానేక శుభాకాంక్ష‌లు.

ధ‌న్య‌వాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”