Quoteఆరోగ్య‌వంత‌మైన భార‌త‌దేశం ఆవిష్కార దిశ లో ప్ర‌భుత్వం చ‌తుర్ముఖ వ్యూహం తో ప‌ని చేస్తోంది: ప్ర‌ధాన మంత్రి
Quoteభార‌త‌దేశ ఆరోగ్య రంగం చూపిన బ‌లాన్ని, ప్ర‌తిఘాతుక‌త్వాన్ని ప్ర‌పంచం ప్ర‌స్తుతం పూర్తి గా ప్ర‌శంసిస్తోంది: ప్ర‌ధాన మంత్రి
Quoteమందులు, వైద్య పరికరాల ఉత్ప‌త్తి కి అవ‌స‌ర‌మైన ముడి ప‌దార్థాల దిగుమ‌తుల ను త‌గ్గించుకొనేందుకు భార‌త‌దేశం కృషి చేయాలి: ప్ర‌ధాన మంత్రి

నమస్కారము,
ఈ కార్యక్రమం మీకు ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఈసారి బడ్జెట్ అనంతరం బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలపై వివిధ రంగాలకు వారికోసం ఇందులో పేర్కొన్న అంశాలను విస్తారంగా చర్చించేందుకు ఈ వెబినార్‌ను ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో.. అమలయ్యే పథకాలతోపాటు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వీటికోసం జరిగే సంసిద్ధత తదితర అంశాలపై ఈ వెబినార్లో చర్చిస్తున్నాం.
గతంతో పోలిస్తే బడ్జెట్‌ను కనీసం ఒకనెల ముందుకు తీసుకెళ్లాం. తద్వారా మన వద్ద రెండు నెలల సమయం ఉంటుంది. ఈ సమయాన్ని గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడం కోసం వివిధ రంగాల వారితో విస్తృతంగా చర్చిస్తున్నాం. మౌలిక వసతుల రంగం, రక్షణ రంగం ఇలా ప్రతి ఒక్క రంగానికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇవాళ వైద్యరంగంలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడే అవకాశం నాకు లభించింది.
ఈసారి బడ్జెట్‌లో వైద్యరంగానికి కేటాయించిన బడ్జెట్ గతంలో ఎప్పుడూ చూడలేదు, వినలేదు. ప్రతి భారతీయుడికి చక్కటి ఆరోగ్య సేవలందించాలన్న మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. గతేడాది దేశానికి, ప్రపంచానికి ఓ రకంగా చెప్పాలంటే సమస్త మానవాళికి మరీ ముఖ్యంగా వైద్యరంగానికి ఓ రకమైన అగ్నిపరీక్షగా నిలిచింది.
మీ అందరితోపాటు, యావద్భారతం ఈ అగ్నిపరీక్షలో విజయం సాధించినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా మంది ప్రాణాలు కాపాడటంలో మనం విజయం సాధించాం. కొద్ది నెలల్లోనే దేశంలో రెండున్నరవేల ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసకున్నాం. కొన్ని డజన్ల టెస్టులు జరిగే స్థానంలో 21కోట్ల టెస్టులను పూర్తిచేసుకున్నాం. ఇదంతా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తే వచ్చిన ఫలితం.
మిత్రులారా,
కరోనా మహమ్మారి మనకు కొత్త గుణపాఠాన్ని నేర్పింది. కేవలం ఈ మహమ్మారితో మాత్రమే పోరాడితే సరిపోదు. ఇలాంటి ఏ పరిస్థితి ఎదురైనా దేశం దాన్ని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని బోధించింది. ఇందుకోసం వైద్యరంగంతో అనుబంధంగా ఉన్న అన్ని క్షేత్రాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య పరికరాలనుంచి మొదలుకుని మందుల వరకు, వెంటిలేటర్ల నుంచి టీకాల వరకు, శాస్త్ర పరిశోధనలనుంచి నిఘా వసతుల వరకు, వైద్యులనుంచి ఎపిడమయోలాజిస్టిక్స్ వరకు ప్రతి అంశంపై మనమంతా దృష్టిసారించాల్సిన అవసరముంది. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా దేశం సర్వసన్నద్ధతతో ఎదుర్కునేందుకు వీలవుతుంది.
‘ప్రధానమంత్రి ఆత్మనిర్భర ఆరోగ్య భారత్’ పథకం వెనక మూలం కూడా ఈ ప్రేరణే. ఈ పథకం ద్వారా పరిశోధన నుంచి పరీక్ష, చికిత్స వరకు.. మన దేశంలోనే ఓ చక్కటి వ్యవస్థకు రూపకల్పన జరగాలనే నిర్ణయం తీసుకున్నాం. పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య భారతం పథకం.. ప్రతి రంగంలో మన సామర్థ్యాన్ని మరింత పెంచనుంది.15వ ఆర్థిక సంఘం సిఫారసులను స్వీకరించిన తర్వాత మన స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు రూ.70వేల కోట్లకు పైగా నిధులను కేటాయించబోతున్నాం. కేవలం వైద్యరంగంలోనే పెట్టుబడులు పెట్టడం కాకుండా.. దేశలోని మారుమూల ప్రాంతాల్లోనూ వైద్యవసతులను మెరుగుపరచడం కూడా మా లక్ష్యం. వైద్యరంగంలో పెడుతున్న పెట్టుబడులు కేవలం వైద్యం కోసం మాత్రమే కాకుండా.. ఉపాధి అవకాశాలను కూడా విస్తృతం చేయనున్నాయనే విషయాన్నీ మనం అర్థం చేసుకోవాలి.

|

మిత్రులారా,
కరోనా సందర్భంగా భారత వైద్యరంగం చూపిన కౌశల్యం, మీరు చూపిన అనుభవం, శక్తి ప్రదర్శనను యావత్ ప్రపంచం చాలా సునిశితంగా గమనించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వైద్యరంగ సామర్థ్యం, గొప్పదనం, మన వ్యవస్థపై నమ్మకం బాగా పెరిగింది. వారి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత సన్నద్ధతతో ఉండాలి. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారతీయ వైద్యులకు డిమాండ్ మరింత పెరగనుంది. దానికి కారణం మన వైద్యవ్యవస్థపై ఉన్న విశ్వాసమే. రానున్న రోజుల్లో భారతీయ నర్సులు, భారతీయ పారామెడికల్ సిబ్బందికి కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగనుంది. కావాలంటే నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు రాసిపెట్టుకోండి. ఈ సమయంలో భారతీయ మందులు, భారతీయ టీకాలు కొత్త విశ్వాసాన్ని ప్రోదిచేసుకున్నాయి. వీటికి పెరుగుతున్న డిమాండ్ కోసమైనా మనం సర్వసన్నద్ధతతో ముందుకెళ్లాలి. ఈ పరిస్థితుల్లో మన వైద్య విద్యపై కూడా ఇతరుల ఆసక్తి పెరగడం స్వాభావికమే. రానున్న రోజుల్లో భారతదేశం వైద్య విద్య విషయంలోనూ గణనీయమైన ప్రగతిని అందుకోనుంది. అందుకే మనం ఈ రంగాన్ని కూడా మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
కరోనా సమయంలో మనం వాలంటీర్లతోపాటు ఇతర వస్తువులను తయారుచేసుకోవడంలోనూ చక్కటి అనుభవాన్ని సంపాదించుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆ వైద్య వస్తువులకు ఉన్న డిమాండ్‌ను పూర్తిచేసేందుకైనా మనం పనిచేయాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వైద్య పరికరాల ఆవశ్యకతను తక్కువ ఖర్చుతో ఎలా పూర్తి చేయాలనేది భారతదేశం కల. భారతదేశం ప్రపంచానికి సరఫరాదారుగా ఎలా మారాలి? మరింత అందుబాటు ధరల్లో, మరింత సుస్థిరమైన వ్యవస్థతో వినియోగానుకూల సాంకేతికతను రూపొందించేందుకు కంకణబద్ధులం కావాలి. వైద్యరంగానికి సంబంధించి ప్రపంచమంతా భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నదనేది ప్రతిఒక్కరూ అంగీకరించాల్సిన సత్యం.
మిత్రులారా,
ప్రభుత్వ బడ్జెట్ ఓ ఉత్ప్రేరకంగానే ఉంటుంది. కానీ మనమంతా కలిసి పనిచేసినపుడే ఈ ప్రయత్నం ముందుకు పోతుంది
మిత్రులారా,
వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి మా ప్రభుత్వం ఆలోచన.. గత ప్రభుత్వాలకంటే భిన్నంగా ఉంది. ఈ బడ్జెట్ తర్వాత.. ఈ బడ్జెట్‌లో పేర్కొన్న స్వచ్ఛత, పౌష్టికాహారం, వెల్‌నెస్, ఆయురారోగ్యానికి సంబంధించిన హెల్త్ ప్లానింగ్ వంటి వాటిపై ప్రశ్నలు లెవనెత్తడాన్ని మీరు గమనించే ఉంటారు. కానీ ఓ పరిపూర్ణమైన ఆరోగ్యకర భారత నిర్మాణ విధానంతో మేం ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వైద్యరంగాన్ని సాధారణంగా వేర్వేరు రకాలుగా అందరూ చూస్తూ ఉంటారు. అలా వేర్వేరు రకాలుగానే దీన్ని అమలుచేసేవారు. కానీ మా ప్రభుత్వం వీటన్నిటినీ వేర్వేరుగా కాకుండా.. ఒకే రకంగా.. సంపూర్ణ విధానంతో ముందుకు తీసుకెళ్తుంది. ఓ సమగ్రమైన విధానంతో, ప్రత్యేకమైన దృష్టితో చూసేందుకు ప్రయత్నం జరుగుతోంది. అందుకే దేశమంతా కేవలం చికిత్సతోపాటు వెల్‌నెస్ (సంక్షేమం) పైనా ప్రత్యేకమైన దృష్టిపెట్టింది. మేం నివారణ నుంచి పూర్తిగా తగ్గిపోవడం వరకు.. ఓ సమగ్రమైన విధానాన్ని రూపొందించాం. భారతదేశాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నాలుగు విధానాలతో మనమంతా కలిసి పనిచేస్తున్నాం.
మొదటిది.. వ్యాధులు రాకుండా నివారించడం. అంటే వ్యాధుల నివారణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహిచడం. స్వచ్ఛభారత్ అయినా యోగ అయినా పౌష్టికాహారం మొదలుకుని బాలింతలు, గర్భవతులు, శిశువులకు సంబంధించి సరైన జాగ్రత్తలతో కూడిన ట్రీట్ మెంట్ అయినా, స్వచ్ఛమైన తాగునీరు, ఆ నీటిని అందించే ప్రయత్నమైనా.. ప్రతి ప్రయత్నం ఇందులో భాగమే.

|

రెండోది.. పేదలకు కూడా తక్కువ ధరలోనే ప్రభావవంతమైన చికిత్సను అందించడం. ఆయుష్మాన్ భారత్ పథకం, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు కూడా ఈ పనిలోనే ఉన్నాయి.
మూడోది.. వైద్యరంగంలో మౌలికవసతులను, వైద్య నిపుణుల సంఖ్యను, వారి నాణ్యతను పెంచడం. గత ఆరేళ్లుగా ఏయిమ్స్, ఇతర ప్రఖ్యాత వైద్య కేంద్రాలను దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటుచేస్తున్నాం. దేశంలో వీలైనంత ఎక్కువ మెడికల్ కాలేజీలను స్థాపించడం కూడా ఇందులో భాగమే.
నాలుగోది.. సమస్యలను పరిష్కరించుకునేందుకు మిషన్ మోడ్‌లో పనిచేయడంపై సమయాన్ని నిర్దేశించుకుని పనిచేయడంపై దృష్టిపెట్టాలి. మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం దేశంలోని ఆదీవాసీ క్షేత్రాలతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ చేపట్టాం.
దేశంలో క్షయవ్యాధి నిర్మూలన కోసం ప్రయత్నం.. ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధిని నిర్మూలించేందుకు 2030 వరకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. కానీ భారతదేశం మాత్రం 2025 వరకు ఈ లక్ష్యాన్ని చేరాలని సంకల్పించింది. టీబీ (క్షయ)పై ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టామంటే.. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి ఉమిసినా.. ఆ తుంపర్లు రోగకారకం అవుతాయి. టీబీని నిరోధించేందుకు కూడా మాస్కు ధరించడం తప్పనిసరి. ప్రారంభదశలోనే గుర్తించి సరైన చికిత్సనందించడం చాలా కీలకం.
దీంతోపాటు కరోనా సమయంలో వచ్చిన అనుభవాలు.. ప్రతి భారతీయుడికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం కొనసాగిస్తున్న అలవాట్లే టీబీని తరిమేసేందుకు ఉపయుక్తం అవుతాయి. టీబీ పై మనం గెలవడాన్ని మరింత సులభతరం చేస్తాయి. వ్యాధులనుంచి కాపాడుకునేందుకు సామాన్య భారతీయులు చేసిన త్యాగాలను, ఉత్తమ పద్ధతులను అలవర్చుకుని, ఆచరించడం ద్వారా 2025 వరకు భారతదేశం నుంచి క్షయవ్యాధిని నిర్మూలించగలం అని నేను విశ్వసిస్తున్నాను.
మన దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంతంలో ప్రతి ఏడాదీ వేల సంఖ్యలో చిన్నారులు కారణం తెలియని మెదడువాపు వ్యాధితో చనిపోతున్న విషయం మనకు గుర్తుండే ఉంటుంది. పార్లమెంటులోనూ దీనిపై చర్చ జరుగుతుండేది. ఓసారి ఈ విషయంపై చర్చ సందర్భంగా ఆ పిల్లల పరిస్థితిని గుర్తుచేసుకుంటూ ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగిజీ ఏడ్చేశారు. ఒకసారి వారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ ఆంశంపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు. పూర్తి శక్తిసామర్థ్యాలను ఉపయోగించి సానుకూలమైన ఫలితాలను సాధించారు. ఈ రకమైన వ్యాధిని ఆపడంలో దృష్టిపెట్టి.. చికిత్స సౌకర్యాలను పెంచిన దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది.
మిత్రులారా,
కరోనా సమయంలో భారతదేశ ఆయుష్‌కు సంబంధించిన మన నెట్‌వర్క్‌కూడా చాలా గొప్పగా పనిచేసింది. మానవ వనరులతో మాత్రమే కాకుండా.. వ్యాధినిరోధకత, శాస్త్రీయమైన పరిశోధన, మన ఆయుష్ మౌలికవసతులు చాలా కీలకంగా మారాయి. భారతీయ మందులు, మన టీకాలతోపాటు మన మసాలాలు, కషాయాలు పోషించిన పాత్రను కూడా ప్రపంచం గుర్తుంచుకుంటుంది. మన సంప్రదాయ వైద్యం కూడా ప్రపంచ వైద్య యవనికపై తన స్థానాన్ని ప్రత్యేకం చేసుకుంది. ఈ సంప్రదాయ వైద్యంతో అనుసంధానమైన వారు, ఆ ఉత్పత్తులను తయారూ చేస్తున్న వారు, ఆయుర్వేద సంప్రదాయంతో పరిచయం ఉన్నవారి దృష్టి కూడా ఇక అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన అవసరం, అవకాశం వచ్చాయి.
ప్రపంచం ఎలాగైతే యోగను సులభంగా స్వీకరించిందో.. అదే ప్రపంచం సంపూర్ణ ఆరోగ్యరక్షణను కోరుకుంటోంది. సైడ్ ఎఫెక్ట్ లు లేని ఆరోగ్య రక్షణవైపు ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఈ దిశగా భారతదేశ సంప్రదాయ వైద్యం చాలా కీలకం కానుంది. మన సంప్రదాయ వైద్యం మొక్కలు, ఆయుర్వేద మూలికల ఆధారంగా పనిచేస్తుంది. అందుకే ప్రపంచం దీనిపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. వీటి వల్ల నష్టం ఉండదు కాబట్టి ప్రపంచం నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దిశగా కూడా మనం మరింత దృష్టి పెట్టగలమా? మన వైద్య బడ్జెట్‌లో సంప్రదాయ వైద్యంపై పనిచేస్తున్న వారంతా కలిసి మరింకేమైనా చేయవచ్చా? అనే అంశాన్ని కూడా మనం ఆలోచించాలి.
కరోనా సందర్భంగా మన సంప్రదాయ వైద్య శక్తిని చూసిన తర్వాత భారతదేశంలో ‘గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్’ను ఏర్పాటు చేయాలని డబ్ల్యూహెచ్‌వో నిర్ణయించింది. ఆయుర్వేదంపై, సంప్రదాయ వైద్యం విశ్వాసం ఉన్నవారికి.. మన వైద్య వృత్తితో అనుసంధానమై ఉన్నవారందరికీ ఇదెంతో గర్వకారణం. ఈ దిశగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటన కూడా చేసింది. భారత ప్రభుత్వం దీనికి సంబంధించిన పక్రియను కూడా ప్రారంభించింది. మనకు దక్కిన ఈ గౌరవానికి అనుగుణంగా ప్రపంచానికి అవసరమైన సేవలను అందించడం కూడా మన బాధ్యత అవుతుంది.
మిత్రులారా,
అందుబాటులో ఉండటంతోపాటు ధరకూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా మన వ్యవస్థను తర్వాతి దశకు తీసుకెళ్లాల్సిన సరైన సమయమిది. అందుకే మన వైద్యరంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగం పెరుగుతోంది. డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా.. దేశంలోని సామాన్య పౌరులకు సరైన సమయంలో, సౌకర్యవంతమైన, ప్రభావవంతమైన చికిత్సను అందించేందుకు బాటలు వేస్తున్నాం.
మిత్రులారా,
గతంలో చేసి మరో విధానాన్ని మార్చేందుకు కూడా వేగంగా పనిచేస్తున్నాం. ఈ మార్పు ఆత్మనిర్భర భారత నిర్మాణానికి చాలా అవసరం. ప్రపంచ ఫార్మసీగా మనకున్న పేరు గర్వకారణమే. కానీ ఇవాళ కూడా కొన్ని అంశాలకోసం మనం ముడిసరుకును విదేశాలనుంచి తెచ్చుకుంటున్నాం.
మందులు, వైద్య పరికరాల కోసం ముడిసరుకును విదేశాలనుంచి తెచ్చుకోవడం ద్వారా మన పరిశ్రమలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. మనం కూడా ఈ పరిస్థితులను గమనించే ఉంటాం. ఇది సరైన పద్ధతి కాదు. అందుకే పేదలకు తక్కువ ధరలోనే మందులు, వైద్య పరికరాలను అందించడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో భారతదేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఇటీవలే నాలుగు ప్రత్యేకమైన పథకాలను ప్రారంభించడం జరిగింది. బడ్జెట్ లోనూ దీనికి సంబంధించిన విషయాల ప్రస్తావన ఉంది. మీరు కూడా వీటిని అధ్యయనం చేసే ఉంటారు. దీని ద్వారా మన దేశంలోనే మందులతోపాటు వైద్యపరికరాల ఉత్పత్తికోసం.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాకాలు) ఇస్తున్నాం. ఇదే విధంగా మందులు, వైద్య పరికరాల తయారీకి మెగా పార్కుల నిర్మాణానికి కూడా మంచి స్పందన కనబడుతోంది.
మిత్రులారా,
ఎన్నికల సందర్భంగా ఒక్క ఓటరున్న ప్రాంతానికి కూడా చేరుకుని ఎలాగైతే అక్కడ ఏర్పాట్లు చేస్తుంటామో.. అలాగే చిట్టచివరి ఊరికి, మారుమూల ప్రాంతానికి వైద్యం అందించడం మాత్రమే కాకుండా.. విద్య, వైద్య రంగాల్లో ఆ చివరి వ్యక్తికి కూడా వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేదే మా ప్రయత్నం. ఈ దిశగా మనం మరింతగా ప్రయత్నించాలి. అన్ని ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో ఉంచే విషయంపైనా దృష్టిపెట్టాలి. దేశానికి వెల్‌నెస్ సెంటర్లు కావాలి, దేశానికి జిల్లా ఆసుపత్రులు కావాలి, దేశానికి అత్యవసర సేవల యూనిట్లు కావాలి, దేశానికి ఆరోగ్య సంరక్షణ వసతులు కావాలి, దేశానికి ఆధుదనిక సాంకేతికతతో కూడిన ప్రయోగ, పరిశోధన శాలలు కావాలి, దేశానికి టెలి మెడిసిన్ కావాలి. ఇలా ప్రతి అంశంపైనా మనం పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
పేదలైనా, మారుమూల ప్రాంతాల్లో ఉండేవారైనా వారికి సరైన సమయంలో.. ఉత్తమ, సాధ్యమైన చికిత్సను అందించాలని మేం నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, దేశంలోని ప్రైవేటు రంగం కలిసి పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమే.
ప్రైవేటు రంగం.. పీఎం-జేఏవైలో భాగస్వామ్యం అవడంతోపాటు పబ్లిక్-ప్రేవేటు భాగస్వామ్యంలో ‘పబ్లిక్ హెల్త్ లేబరీటరీస్ నెట్‌వర్క్‌’ నిర్మించడంలో పనిచేయవచ్చు. జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్, పౌరులకు డిజిటల్ హెల్త్ రికార్డు, ఇతర అధునాతన సాంకేతికత విషయంలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు వీలుంటుంది.
మనమంతా కలిసి బలమైన భాగస్వామ్యంతో సరైన మార్గాన్ని అన్వేషించి ఆరోగ్యకరమైన, సమర్థమైన భారత నిర్మాణం తద్వారా ఆత్మనిర్భర భారత నిర్మాణానికి పరిష్కారం వెతుకుతామని నాకు విశ్వాసం ఉంది. భాగస్వామ్య పక్షాలందరూ.. విషయ నిపుణులతోనూ ఈ విషయంపై చర్చించండి. బడ్జెట్ వచ్చేసింది. మీ ఆకాంక్షలకు ఇందులో చోటు దక్కకపోయి ఉండొచ్చు. కానీ వాటికోసం ఇదేమీ చివరి బడ్జెట్ కాదు. వచ్చే బడ్జెట్ లో వాటికి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఈ బడ్జెట్ ను వేగంగా ముందుకు తీసుకెళ్తూ.. వీలైనంత త్వరగా వాటిని అమలు చేయడంపై దృష్టిపెడదాం. కొత్త వ్యవస్థలను సృష్టిద్దాం. సామాన్యుడికి కూడా సరైన వైద్యం అందించే దిశగా సమిష్టిగా కృషిచేద్దాం. మీ అందని అనుభవం, మీ మాటలను బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో చర్చిస్తాం. తొలిసారి బడ్జెట్ గురించి సంబంధిత వ్యక్తులతో చర్చిస్తున్నాం. బడ్జెట్ కంటే ముందే చర్చించి ఉంటే మరిన్ని పరిష్కారాలు లభించేవి. తర్వాత చర్చించినా చాలావాటికి సమాధానాలు లభిస్తున్నాయి. ఇందుకోసం మనమంతా కలిసి పనిచేద్దాం, రండి.
ప్రభుత్వాలు, మీరు వేర్వేరు కాదు. మీరే ప్రభుత్వం.. మీరే దేశం కోసం కూడా. దేశంలోని పేదలు, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వైద్య రంగాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భవ్యమైన, ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో మనమంతా కలిసి పనిచేద్దాం. మీరందరూ మీ విలువైన సమయాన్ని ఈ చర్చకోసం వెచ్చించారు. మీ మార్గదర్శనం చాలా పనికొస్తుంది. మీ క్రియాశీలకమైన భాగస్వామ్యం కూడా ఎంతో కీలకం.
మరోసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మీ సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. మీరు సూచనలు ఇచ్చారు. భాగస్వాములు కూడా కానున్నారు. మీ ఆకాంక్షలు నెరవేర్చుకోవచ్చు. దేశం పట్ల మీ బాధ్యతను కూడా నిర్వర్తించవచ్చు. ఈ నమ్మకంతోనే మీ అందరికీ
అనేకానేక ధన్యవాదములు!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Indian telecom: A global leader in the making

Media Coverage

Indian telecom: A global leader in the making
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi goes on Lion Safari at Gir National Park
March 03, 2025
QuoteThis morning, on #WorldWildlifeDay, I went on a Safari in Gir, which, as we all know, is home to the majestic Asiatic Lion: PM Modi
QuoteComing to Gir also brings back many memories of the work we collectively did when I was serving as Gujarat CM: PM Modi
QuoteIn the last many years, collective efforts have ensured that the population of Asiatic Lions is rising steadily: PM Modi

The Prime Minister Shri Narendra Modi today went on a safari in Gir, well known as home to the majestic Asiatic Lion.

In separate posts on X, he wrote:

“This morning, on #WorldWildlifeDay, I went on a Safari in Gir, which, as we all know, is home to the majestic Asiatic Lion. Coming to Gir also brings back many memories of the work we collectively did when I was serving as Gujarat CM. In the last many years, collective efforts have ensured that the population of Asiatic Lions is rising steadily. Equally commendable is the role of tribal communities and women from surrounding areas in preserving the habitat of the Asiatic Lion.”

“Here are some more glimpses from Gir. I urge you all to come and visit Gir in the future.”

“Lions and lionesses in Gir! Tried my hand at some photography this morning.”