మాననీయురాలైన సుమిత్ర తాయి గారు, మంత్రివర్గంలో నా సహచరులైనటువంటి శ్రీ ఆనంద్ కుమార్, ఉప సభాపతి శ్రీ తంబిదురై, దేశవ్యాప్తంగా ఉన్న విధాన సభల కు చెందిన గౌరవనీయ సభాపతులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, అన్ని రాజకీయ పక్షాలకు చెందిన సీనియర్ నాయకులారా,
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సుమిత్ర గారికి తొలుత నేను ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. మనమంతా తీర్థయాత్రలకు వీళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాం, మన తల్లితండ్రులను కూడా మన తో తీసుకు వెళ్తాం. తీర్థయాత్ర కు వెళ్లిన తరువాత మన జీవితం కోసమో లేదా కుటుంబం కోసమో వివిధ పనులను పూర్తి చేయాలని మనం తీర్మానాలు చేసుకొంటాం.
ఈ రోజు మీరంతా కేవలం ఒక కార్యక్రమంలో మాత్రమే పాల్గొనలేదు. ఒకసారి ఊహించుకోండి- మీరు ఎక్కడ కూర్చున్నారు ? 2014 మే నెలలో, నా జీవితం లో మొదటి సారి, ఈ సభ లోకి నేను అడుగుపెట్టాను. అంతకు ముందు ఈ సెంట్రల్ హాలు ను నేను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రులను ఇక్కడకు అనుమతిస్తారు. వారికి ఎటువంటి అడ్డంకులు లేవు, అయినా నాకు ఎప్పుడూ అటువంటి అవకాశం రాలేదు. నా దేశ ప్రజలు మా పార్టీ ని ఎన్నుకొన్న అనంతరం నాయకుని ఎంపిక ఇక్కడే చేయవలసివచ్చింది; ఆ సమయంలో నేను ఈ సెంట్రల్ హాల్ కు వచ్చాను. ఇది సెంట్రల్ హాల్; మొదట్లో ఇక్కడే చాలా సంవత్సరాల పాటు రాజ్యాంగ పరిషత్తు సమావేశాలు జరిగాయి. గతంలో పండిత్ నెహ్రూ, బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, రాజగోపాలాచారి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మరియు కె.ఎమ్. మున్షీ గారుల వంటి వారు అలంకరించినటువంటి స్థానాలలో మీరు ఆసీనులయ్యారు.
దేశానికి ఎంతో స్ఫూర్తి ని ఇచ్చిన మహానుభావులైన వారు ఇక్కడకు వచ్చే వారు. వారు ఇక్కడే కూర్చొనే వారు, చర్చలు, సంప్రదింపులు జరిపే వారు. ఆ రోజులను తలచుకోవడమనేది ఒక మధుర భావన.
మన రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ మన రాజ్యాంగాన్ని ఒక సామాజిక పత్రంగా అభివర్ణించారు. ఇది అక్షర సత్యం. ప్రపంచం లోనే మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కేవలం వివిధ విభాగాలు, హక్కులు లేదా పని విభజన వల్ల కాదు; అది, దేశంలో నెలకొన్న సాంఘిక దురాచారాల బారి నుండి పొందిన విముక్తి నుండి లభించిన అమృతం లో నుండి వచ్చినటువంటిది. దానికే మన రాజ్యాంగంలో స్థానం లభించింది. అదే సామాజిక న్యాయం. ఇప్పుడు మనం సామాజిక న్యాయాన్ని గురించి ఎప్పుడు చర్చించినా, ప్రస్తుత సమాజ స్థాయి కి పరిమితమై ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కొన్ని సార్లు ఈ సామాజిక న్యాయానికి మరింత గొప్ప పరిధి ఉందని అనిపిస్తుంది.
దయచేసి నాకు చెప్పండి.. ఒక ఇంట్లో విద్యుత్తు సరఫరా ఉండి పక్క ఇంట్లో లేకపోతే, సామాజిక న్యాయంలో భాగంగా ఆ ఇంట్లో కూడా విద్యుత్తు సరఫరా ఉండే విధంగా చూడడం మన బాధ్యత కాదా ? ఒక గ్రామంలో విద్యుత్తు ససరఫరా ఉండి పక్క గ్రామంలో లేకపోతే, ఆ గ్రామంలో కూడా విద్యుత్తు సరఫరా ఉండేటట్టు చూడాలన్న సందేశాన్ని సామాజిక న్యాయం మనకు చెప్పటం లేదా? ఒక జిల్లా బాగా అభివృద్ధి చెంది, మరొక జిల్లా వెనుకబడి ఉంటే, ఆ జిల్లా కూడా కనీసం మొదటి జిల్లా స్థాయికి చేరుకునే విధంగా అభివృద్ధి చెందాలని చూసే బాధ్యత మనమీద లేదా ? అంటే, సామాజిక న్యాయం అనే సూత్రం ఈ బాధ్యత ను నెరవేర్చే విధంగా మన అందరినీ చైతన్య పరుస్తుందన్న మాట.
బహుశా, దేశం ఆశించిన స్థాయి కి చేరలేకపోవచ్చు. కానీ ఒక రాష్ట్రంలో ఐదు జిల్లాలు పురోగతిని సాధించే పరిస్థితిలో ఉంటే, మరో మూడు వెనుకబడిన జిల్లాలు ఆ ఐదు జిల్లాల స్థాయి కి చేరుకొనే అవకాశం ఉంది. ఒక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు చక్కటి పురోగతి ని సాధించగలిగితే దాని అర్ధం, ఆ రాష్ట్రానికి ఆ సామర్ధ్యం ఉన్నట్లే కదా.
మన దేశంలో ప్రజల స్వభావం ఏమిటి ? పాఠశాల పరీక్షల సమయంలో, మనం ఒక వేళ భూగోళ శాస్త్రంలో వెనుకబడి ఉంటే, మనకు ఇష్టమైన గణిత శాస్త్రంపై దృష్టిని కేంద్రీకరిస్తాం. అందువల్ల గణితంలో సాధించిన ఎక్కువ మార్కులు, భూగోళ శాస్త్రం లో వచ్చిన తక్కువ మార్కులను భర్తీ చేసి, ప్రథమ శ్రేణి ని తెచ్చిపెడతాయి. మనం మానసికంగా ఎదిగాం కాబట్టి, ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించాలి. భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్రాలకు ఇదే విధమైన లక్ష్యాలను నిర్దేశిస్తే, వారు ఏమి చేస్తారు ? ఎవరైతే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తారో, వారిని మరింత ముందుకు నడిపించాలి. ఫలితంగా, ఎవరైతే నిరంతరాయంగా మంచి ఫలితాలను తీసుకు వస్తారో, వారి వల్ల సరాసరి గణాంకాలు మెరుగుపడతాయి. లక్ష్యాన్ని సాధించినందుకు మనకు సంతోషంగా ఉంటుంది. అయితే, వెనుకబడిన వారు నిరంతరంగా వెనుకబడే ఉంటారు. అందువల్ల, వ్యూహాత్మకంగా అభివృద్ధి నమూనాపై మనం మరింత శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. రాష్ట్రాల వైపు మనం ఒకసారి దృష్టిని సారిస్తే, సహకార సమాఖ్య విధానం ద్వారా ఒక విధమైన స్పర్ధాత్మక వాతావరణం ఏర్పడింది; మరి ఈ అభిప్రాయాన్ని నేను కూడా ఆమోదిస్తాను. ఈ అభిప్రాయాలు లెజిస్లేటర్ తో పార్లమెంట్ సభ్యులు కలసి కూర్చొని తమ ప్రాంతానికి, తమ రాష్ట్రానికి, తమ దేశానికి చెందిన సమస్యలను చర్చించే సమాఖ్య విధానాని కి సజీవ ఉదాహరణలు గా నిలుస్తాయి. దీని ద్వారా సమాఖ్య విధానం ఒక కొత్త పార్శ్వాన్ని ఆవిష్కరించుకొంది.
రాష్ట్రాల మధ్య పోలికలు తీసుకోవడమైంది; వెనుకబడుతున్న రాష్ట్రాలను సహకార సమాఖ్య విధానంలో విమర్శించడం జరిగింది. కచ్చితంగా, పోటీ మరియు ప్రగతి తో కూడిన వాతావరణాన్ని ఏర్పరచడమైంది. అయితే, ప్రజల అంచనాలను నేరవేర్చాలని దేశం అనుకొన్న పక్షంలో, ఇవే పరామితులతో గనక మనం ముందుకు పోయామంటే, బహుశా మనం ఫలితాలను పొందలేం.
స్వచ్ఛత ప్రచారోద్యమం విషయానికి వస్తే, స్వచ్ఛత స్థానాల కోసం పట్టణాల, నగరాల మధ్య ఒక పోటీని పెట్టడమైంది. ఏదైనా ఒక మహా నగరం లేదా ఏదైనా పట్టణం వెనుకబడిపోతే, అలా వెనుకబడటానికి గల కారణాలపై గ్రామాల ప్రజలు వారి స్వరాలను ఎలుగెత్తి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక ఉద్యమం మరియు ఒక స్పర్ధ ఆరంభమయ్యాయి.
ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచించినప్పుడు, దేశం మంచి ప్రగతిని సాధిస్తున్నప్పటికీ, ఈ దేశం ఎందుకు పురోగతిని సాధించటం లేదని మీరు ఆశ్చర్యపోతారు. పరిస్థితులలో ఎందుకు మార్పు రావడం లేదు ? అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, దేశం లోని జిల్లాలను ఒక క్రమంలో, ఆధికారికంగా ప్రచురించిన కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేయాలని అనుకున్నాం. 2011 సంవత్సరం ఆధారంగా కొన్ని గణాంకాలు పరిగణన లోకి తీసుకోవడం జరిగింది. ఆ తరువాత సర్వేక్షణలను నిర్వహించలేదు. అయినప్పటికీ, ఆ జిల్లాలకు దగ్గరగా, అందుబాటులో ఉన్న 48 ప్రమాణాలను మేం లెక్క లోకి తీసుకోవడం జరిగింది. అనుభవం ప్రకారం, ఏ జిల్లాలు ఐదు నుండి పది ప్రమాణాలలో వెనుకబడి ఉన్నాయని మేం గుర్తించామో, అవి ఇతర ప్రమాణాలలో కూడా వెనుకబడి వున్నాయి.
ఒక్కొక్క సమయంలో 10 జిల్లాలు పురోగమనంలో ఉండగా, ఐదు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. అయితే ఈ వెనుకబడిన జిల్లాలు పురోగతి చెందుతున్న జిల్లాలను కూడా వెనక్కి లాగుతున్నాయి. ఈ కారణంగా, అన్ని జిల్లాలను అభివృద్ధి పథం లోకి తీసుకు రావడానికి కృషి చేయడం ఎంతో అవసరం. ప్రత్యేక ప్రమాణాలపై పనిచేయవలసిన కొన్ని జిల్లాలను గుర్తించవలసిన అవసరం ఉంది. దాదాపు ఒక ఏడాది నుండి ఈ విషయమై కృషి జరుగుతూనే ఉంది. చర్చలను, సమావేశాలను నిర్వహించి, వివిధ స్థాయిలలో గుర్తింపు కార్యక్రమం జరిగింది. ఆ తరువాత, గుర్తింపు పొందిన ఆ 115 జిల్లాలకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్ లను ఇక్కడకు పిలిచి రెండు రోజుల పాటు కార్యశాల నిర్వహించి, సమస్యలపై చర్చించడం జరిగింది.
ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడుకొంటే, మేం మీ కంటే భిన్నంగా ఏమీ లేము. మనమంతా సమానమే. ప్రజల స్వభావం ఏమిటి ? సరే, బడ్జెట్ ను గురించి నాకు చెప్పండి; నిధులు ఎక్కడివి ? మీరు జాగ్రత్తగా గమనిస్తే, అందుబాటులో ఉన్న వనరులతో ఒక జిల్లా పురోగతి ని సాధిస్తూ ఉంటే, అవే వనరులతో మరో జిల్లా వెనుకబడి ఉండటం మీరు గ్రహిస్తారు. అంటే, వనరుల లభ్యత ఒక సమస్యే కాదు; బహుశా పరిపాలన సమస్య కావచ్చు; నాయకత్వం సమస్య, సమన్వయం సమస్య, సమర్ధవంతమైన అమలు సమస్య. అందువల్ల ఈ విషయాలను మనం ఎలా మార్చగలం ? కలెక్టర్ లు అందరూ ఈ సమస్యలను ప్రభుత్వ సీనియర్ అధికారులందరితో చర్చించారు.
ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది; నేను ఎవరినీ విమర్శించండని కోరడం లేదు, కానీ, ఒకానొక ఇంట్లో, నేను ఏదైనా విషయాన్ని బహిరంగంగా మాట్లాడితే, అదేమీ ఒక చెడు ఆలోచన కాదు. సాధారణంగా జిల్లా కలెక్టర్ ల సరాసరి వయస్సు 27, 28, 30 సంవత్సరాలుగా ఉండడం గమనించి, నేను ఆశ్చర్యపోయాను. మూడు నాలుగేళ్లలో అక్కడకు వెళ్లే అవకాశం ఐఎఎస్ యువ అధికారులకు లభించింది. కానీ ఈ 115 జిల్లాలలో నేను కలిసిన జిల్లా కలెక్టర్ లలో 80 శాతానికి పైగా కలెక్టర్ లు 40 ఏళ్ల కంటే ఎక్కువగా, కొంతమంది 45 ఏళ్ల వారు ఉన్న సంగతిని నేను గమనించాను.
ఇప్పుడు నాకు చెప్పండి.. 40- 45 ఏళ్ల వయస్సు లో ఉన్న ఒక అధికారి, జిల్లా ఇంచార్జ్ గా ఉంటే, ఏమవుతుంది ? వారి పిల్లలు పెరిగారు, దాంతో వారి ప్రవేశం గురించి విచారిస్తారు; వారి పిల్లలకు మంచి పాఠశాలలో ప్రవేశం కోసం పెద్ద నగరానికి ఎప్పుడు బదిలీ అవుతామా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి తోడు, చాలా ఎక్కువ సందర్భాల్లో, రాష్ట్ర స్థాయి అధికారులు పదోన్నతి పై ఇక్కడ నియమించబడుతూ ఉంటారు. ఇప్పుడు, ఆ జిల్లా వెనుకబడి వుందని నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. అక్కడ నుండి సమస్య ప్రారంభమౌతుంది. యువకులు, కొత్త అధికారులను ఈ జిల్లాల్లో నియమిస్తే, వచ్చే ఐదేళ్లకు పరిస్థితుల్లో మార్పు ప్రారంభమౌతుంది.
వారికి ఇదొక సవాల్ అని- వారిలో నమ్మకాన్ని కలిగించండని, ముఖ్యమంత్రులతో నేను మాట్లాడుతున్నపుడు చెబుతూ ఉంటాను. అధికారులు వారిలో వారు చర్చించుకోవడం ప్రారంభిస్తారు- మిమ్మల్ని అక్కడకు పంపిస్తే మీరు విచారిస్తారు ! ఏమి చేయాలి ? అక్కడ రాజకీయ సంబంధం ఏమీ లేదు, ఏమి జరిగింది ? మిమ్మల్ని అక్కడకు ఎందుకు పంపారు ? వారి మనస్తత్వం అలా ఉంటుంది.
ఇప్పుడు నాకు చెప్పండి.. టీకాల కార్యక్రమం ఒక జిల్లాలో చక్కగా అమలవుతూ ఉండగా, పక్కనే ఉన్న ప్రాంతంలో అమలు జరగడం లేదు. ఏమిటి లోపం ? వనరుల కొరత అంటే నేను నమ్మను. ఎవరికైనా ప్రేరణ, ఒక కచ్చితమైన ప్రణాళిక మరియు ప్రజల భాగస్వామ్యం అవసరం. అక్కడ టీకాల కార్యక్రమం అమలు కాలేదని మనం ఫిర్యాదు చేస్తాం, రోగాలు ప్రవేశించడానికి ద్వారం తెరుస్తాం, ఆ తరువాత వ్యాధులు సంక్రమిస్తాయి.
అక్కడ పాఠశాలలు, ఉపాధ్యాయులు, భవనాలు కూడా ఉన్నాయి. అయినా పిల్లలు మధ్యలో బడి మానివేస్తున్నారు. అక్కడ అన్నీ ఉన్నాయి. నిధుల కేటాయింపు కూడా ఉంది. అయినా పిల్లలు మధ్యలో బడి మానివేస్తున్నారు. అక్కడ రెండు అభిప్రాయాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, విషయం వనరుల గురించి కాదు.
ఇక రెండో విషయానికి వస్తే, ఎక్కడైతే అధికారులు, స్థానిక నాయకులు, ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఒక ఉద్యమ స్పూర్తితో ఒక పని ని ప్రారంభిస్తారో, దాని ఫలితాలు తక్షణమే కనబడతాయన్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ప్రజలు, పంచాయతీల అధిపతులు, పంచాయతీల సభ్యులు, పురపాలక సంఘం సభ్యులు, పురపాలక సంఘం అధిపతి, జిల్లా పంచాయతీలు, తహశీల్ పంచాయతీలు, ఇంకా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో పాటు వారి సమాజంలో ప్రజా జీవితంలో పాల్గొనే అవకాశం ఉన్న వారందరూ ఒకే దిశగా ఆయా జిల్లాల కోసం పని చేయడానికి ముందుకు రావాలి. ఎక్కువ మంది ప్రజలను కలుపుకొని ముందుకు పోవడానికి పూర్తి శక్తి యుక్తులను ఉపయోగించి మనం పనిచేయాలి. అప్పుడు మీరు మార్పులను గమనించడం ప్రారంభిస్తారు.
ఒక్కొక్క సారి సన్నిహిత సంబంధం కలిగి వుండడం వల్ల కూడా మార్పు వస్తుంది. ఒక రోజు ఆరోగ్యంగా, శారీరికంగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి, సక్రమంగా భుజిస్తున్నాడు, మంచి కుటుంబ జీవితం ఉంది, మరే సమస్యా లేదు, అయినా క్రమంగా బరువు తగ్గుతున్నట్లు గమనించాడు. ఆహార నియమాలను పాటిస్తున్నానని, తక్కువ భుజిస్తున్నానని, ఇంతకు ముందు కంటే ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నానని చెప్తూ- ప్రారంభంలో దానిని అతడు పట్టించుకోలేదు. అయినప్పటికీ, అతని శరీర బరువు క్రమంగా తగ్గుతోంది. ఇలా ఎందుకు అవుతోందని అప్పుడు అతడు ఆశ్చర్యపోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత నీరసంగా ఉన్నట్లు భావించాడు. అయినప్పటికీ తన సమస్యను గురించిన అవగాహన లేక, తన జీవితాన్ని ఆనందిస్తూనే ఉన్నాడు. అయితే ఒక సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఒక అనుభజ్ఞుడైన వైద్యుడు సూచించాడు. అప్పుడు తాను మధుమేహంతో బాధపడుతున్నట్లు ఆయన తెలుసుకొన్నాడు. వెంటనే మధుమేహం అదుపు కోసం మందులు వేసుకోవడం ప్రారంభించాడు. మధుమేహం నయం కాకపోయినప్పటికీ, అన్ని పరిస్థితులూ మెరుగుపడ్డాయి.
మన జిల్లాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ జిల్లాలు ఈ రకంగా వెనుకబడి ఉండటానికి మూల కారణాన్ని గుర్తించి, దాన్ని నివారించి, దానిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏ జిల్లా కూడా వెనుకబడి ఉండదు.
మొత్తం 115 జిల్లాలలో 30- 35 జిల్లాలు వామపక్ష తీవ్రవాద ప్రభావానికి లోనై ఉన్నాయి. ఆ జిల్లాల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిందిగా నేను హోమ్ మంత్రిత్వ శాఖకు ప్రత్యేకంగా చెప్పాను. ఈ సమస్యలను మనం ఎలా పరిష్కరించగలం ? అయితే, మిగిలిన 80- 90 జిల్లాల సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఈ జిల్లాల కోసం ఎలాంటి ప్రణాళిక ను రూపొందించాలి ? ఒక జిల్లాలో ఉన్న ఒక తహశీల్ బహుశా టీకాల కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉండవచ్చు, మరో తహశీల్ పాఠశాలల్లో మధ్యలో బడి మానివేసే విద్యార్ధులపై శ్రద్ధ పెట్టి, వారిని తిరిగి పాఠశాలలకు తీసుకురావడంలో సానుకూల ఫలితాలను సాధించవచ్చు. ప్రతి చోట ఎంతో కొంత సానుకూల పరిస్థితి ఉంటుంది. అయితే మనం ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి; ఒక గ్రామంలో మూడు సానుకూల పరిస్థితులు, రెండు ప్రతికూల పరిస్థితులూ ఉంటే, మనం ఆ ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవాలి.
ఈ పని ఏమంత కష్టమైంది కాదు. నీతి ఆయోగ్ కు చెందిన వ్యక్తులు మీ ముందు ఒక నివేదిక ప్రదర్శిస్తారు. రెండు రోజుల క్రితం నేను, నా మంత్రివర్గ సహచరులతో ఆ ప్రజంటేషన్ ను చూశాను. గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వం రూపొందిస్తున్న నివేదికలను నేను పరిశీలస్తూనే ఉన్నాను. కానీ, ఇది చాలా కచ్చితంగా, స్పష్టంగా ఉంది. దీనిని చదువు రాని వారు సైతం అర్ధం చేసుకోవచ్చు. అమితాబ్ కాంత్ గారు ఒక అద్భుతమైన ప్రజెంటేషన్ ను ఇచ్చారు. అదే నీతి ఆయోగ్ ప్రజెంటేషన్. నాకు చాలా నచ్చింది. వారు దానిని మీకు కూడా చూపిస్తారు.
ముఖ్యంగా ఒక జిల్లా ఎంతవరకు వెనుకబడి ఉందో మనం అర్ధం చేసుకోడానికి ఒక పద్దతి ఉంది. అందుకోసం ఆ జిల్లా రాష్ట్ర సరాసరి కంటే, అలాగే ఆ రాష్ట్రంలో, దేశంలో అత్యుత్తమంగా ఉన్న జిల్లా కంటే ఏ మేరకు వెనుకబడి ఉందనేది తెలుసుకోవాలి. దీనికి కొలత గా నాలుగు ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశం లోని రెండు వందల జిల్లాలు అభివృద్ధి చెందినప్పుడు, మీ జిల్లా కూడా ఎందుకు పురోగతి సాధించలేదూ అని మీరు కూడా విచారిస్తారు. మన దేశం లోని వేలాది తహశీల్ దారులు ముందంజ వేస్తూ ఉంటే, మీ తహశీల్ కూడా పురోగమించగలుగుతుంది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. దేశంలో ఒకానొకప్పుడు కరుడు గట్టిన రాజకీయాలు, ఉద్యమ రాజకీయాలు, ప్రకటన రాజకీయాలు, వివాదాలతో కూడిన రాజకీయాలు పనిచేశాయి. కానీ ఇప్పుడు కాలం మారింది; మీరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలు వారి సంక్షేమం కోసం మీరు చేసిన పని ని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
మీ ఘర్షణలు, మీ యాత్రలు, మీ జైలు పర్యటనలు మొదలైనవి 20 సంవత్సరాల క్రితం మీ రాజకీయ ప్రస్థానంలో ప్రభావాన్ని చూపి వుండవచ్చు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కొంత మంది ప్రతినిధులు మళ్ళీ మళ్ళీ ఎన్నిక అవుతూ ఉండడాన్ని మీరు తప్పక గమనించే వుంటారు. దానికి గల కారణాన్ని మీరు విశ్లేషిస్తే, అది రాజకీయ పోరాటం వల్ల కాదని మీరు గుర్తిస్తారు. రాజకీయ పోరాటాల వల్ల కాక రాజకీయాలకు లేదా అధికార పోరాటానికి ఎంతమత్రం సంబంధం లేని కొన్ని అంశాలు దీనికి కారణం; ఇవి ప్రజా సంక్షేమంతో సంబంధం ఉన్నటువంటి అంశాలు. ఒక సమస్యకు సంబంధించి ప్రతి సారీ అతడు లేదా ఆమె ఏదో ఒక కొత్త పరిష్కారం చేస్తూ ఉంటారు; బహుశా వారు తరచుగా ఆసుపత్రులకు వెళ్లడం, ప్రజలను కలవడం వంటివి చేస్తుంటారు. ఈ గౌరవమే అతడికి లేదా ఆమె కు రాజకీయాలలో సహాయపడుతుంది.
కరుడు గట్టిన రాజకీయాల నుండి మీరు పూర్తిగా బయటకు రావాలని నేను కోరటం లేదు. అయితే దానిని వదులుకోవాలని సమాజమే మనల్ని ఒత్తిడి చేస్తోంది. సమాజంలో కలిగిన అవగాహనే దానిని వదులుకోవాలని ఒత్తిడి చేస్తోంది. ఎల్లవేళలా వారి కోసమే ఉండాలని వారు కోరుకుంటున్నారు. వారి జీవితాల్లో మార్పు తీసుకు రావడానికి వారితో ఎవరు ఉంటారా అని వారు ఎదురుచూస్తున్నారు. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మన ప్రాంతంలో బాలికల విద్య కోసం 100 శాతం కృషి చేయాలని మనం నిర్ణయించుకోవాలి. నేను నా కృషితో కనీసం ఒక్క మార్పు నైనా చేస్తాను అని మనం నిర్ణయించుకోవాలి. అప్పుడు వ్యవస్థ దానంతట అదే మార్పు చెందడం ప్రారంభిస్తుంది.
ఇంద్రధనుష్ పథకం లో భాగంగా టీకాల కార్యక్రమం రోజున అక్కడ ఉండి, కార్యకర్తలను సమీకరించి, టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఎవరో ఒకరు నిర్ణయించుకోవచ్చు. గతంలో టీకాలు వేసే కార్యక్రమంలో 30 శాతమో, 40 శాతమో లేదా 50 శాతం మందికో టీకాలను వేసే వాళ్లం. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని కాదు దీని అర్థం. బడ్జెట్ వెలుపల సైతం ప్రభుత్వం ఖర్చు చేసేది. గులాం నబీ గారు ఆరోగ్య మంత్రి గా ఉన్నప్పుడు ఇది జరిగింది. అయితే, ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో, అటువంటి పనులను నిలిపివేయడమైంది.
ఇంద్రధనుష్ పథకంలో భాగంగా ఒక ప్రత్యేక ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం టీకాల కార్యక్రమం 70- 75 శాతం ప్రజలకు చేరుకొంది. అయితే, దీనిని మనం 90 శాతానికి చేర్చగలమా ? ఒకసారి మనం 90 శాతానికి చేరుకొంటే, అప్పుడు 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు. చిన్న పిల్లలు, గర్భవతులకు టీకాలు వేసినట్లయితే, అప్పుడు తీవ్రమైన రోగాలన్నింటినీ కూడా వాటంతట అవే అరికట్టబడతాయి.
ఇందుకోసం ఒక విధానం, ఒక ప్రణాళిక ఉన్నాయి. కొత్త బడ్జెట్ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్, అందుబాటులో ఉన్న వనరులు, మానవ శక్తి తోనే, ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ పనిని చేపట్టినట్లయితే, మనం తప్పకుండా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. మనం ఆశించిన జిల్లాలకు ఈ విధానాన్ని అమలుచేయవచ్చు. ‘‘వెనుకబడిన’’ అనే పదాన్ని వాడవద్దని నేను ప్రతి ఒక్కరికీ చెప్పాను. లేకపోతే ప్రజల ఆలోచనల సరళి మరోమారు ప్రతికూలంగా మారిపోతుంది.
గతంలో రైలులో మూడు తరగతులు ఉండేవన్న సంగతి మీ అందరికీ బాగా తెలుసు – ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి ఇంకా తృతీయ శ్రేణి అని. ఆ తరువాత, 20- 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం తృతీయ శ్రేణి ని రద్దు చేసింది. రైలు బోగీల్లో తేడా ఏమీ లేదు, అయితే ప్రజల మానసిక ఆలోచన మారింది. తృతీయ శ్రేణి లో ప్రయాణించే వ్యక్తిని గతంలో చాలా హేళనగా చూసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆ రైలు పెట్టెలో మార్పు లేదు. అదేవిధంగా, ‘‘వెనుకబడిన’’ అనే పదాన్ని మనం వాడితే, వారి ఆలోచనల సరళి ప్రతికూలంగా మారుతుంది. ఓ.. మీరు ఆ వెనుకబడిన జిల్లాకు చెందిన శాసనసభ్యులా ! అంటే, మీరు కూడా వెనుకబడిన వారా ? అంటారు. ప్రతి విషయం అక్కడ నుండే ప్రారంభం అవుతుంది. మనం దేశంలో అభివృద్ధితో పోటీ పడాలి కానీ, వెనుకబడినతనంతో పోటీ పడకూడదు. ఈ జిల్లాలు అభివృద్ధి చెందితే, అప్పుడు సామాజిక న్యాయం అనే లక్ష్యం దానంతట అదే నెరవేరుతుంది.
మన ప్రాంతం లోని పిల్లలను విద్యావంతులను చేయడం అంటే సామాజిక న్యాయానికి ఒక అడుగు దగ్గరలో ఉన్నట్లే. అన్ని గృహాలకూ విద్యుత్తు సరఫరా సౌకర్యాన్ని కల్పిస్తే, దాని అర్ధం, సామాజిక న్యాయానికి ఒక అడుగు దగ్గరలో ఉన్నట్లే. ఈ సభలో, ఈ హాలు లో మన గొప్ప మహా పురుషులు మన ముందు ఉంచినటువంటి సామాజిక న్యాయాన్ని నూతన పంథా లో ముందుకు తీసుకు పోతే, మనం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. తద్వారా ఘర్షణ అవకాశాలను తగ్గించవచ్చు.
అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఇక్కడ ఉన్నారని నేను భావిస్తున్నాను. అదే ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇక్కడ ఉన్నారు. నిర్ణయం తీసుకోండి. ఎంపిక చేసిన జిల్లాల నుండి రెండు నెలల క్రితం బదిలీ అయిన కొంతమంది అధికారులతో ఇప్పుడే నేను భేటీ అయ్యాను. వారిని నేను పిలిచి పరిస్థితి ఏమిటి అని అడిగాను. ఇటీవల నేను రాజస్థాన్ లోని ఝున్ ఝును జిల్లా ను సందర్శించాను. ఎంపిక చేసిన రాజస్థాన్ జిల్లాలు అయిదు, హరియాణా నుండి ఒక జిల్లా కు చెందిన అధికారులను పిలిపించాను. వారితో ఒక అర గంట గడిపాను. పరిస్థితి పై తాజా సమాచారాన్ని అందించాలని వారిని కోరాను. వారికి చేయూతను ఇచ్చి, వారితో కలసి మనం పని చేయాలని నేను భావిస్తున్నాను. ‘‘అది ఎందుకు పూర్తి కాలేదు ? కారణం ఏమిటి ?’’ అంటూ పని గురించి వారిని ఎడతెరపి లేకుండా ప్రశ్నిస్తే, వారు అలసిపోతారు. అది సరే, రాజకీయాల్లో ఇది సహజమైనప్పటికీ, మనం వారికి చేయూతను ఇచ్చి ‘‘ఆందోళన చెందవద్దు; మీతో నేనున్నాను, ముందుకు పదండి’’ అని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి విశ్వాసాన్ని పెంచుతుంది.
ప్రజల భాగస్వామ్యాన్ని మనం పెంచాలి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వేతర సంస్థలను, యువతను మనం ఎందుకు చేరదీయకూడదు ? మనం ఈ పరిస్థితిని మార్చాలి. మనకు వనరులు ఉన్నాయి, కానీ, ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నాం. లొసుగులను మనం పూరించాలి. మరి, పూరించగలం కూడాను! పరిపాలన విధానం దానంతట అదే మెరుగుపడుతుంది, ఎలాగంటే, ఫలితాలు రావడం ప్రారంభమైతే చాలు, వారిలో విశ్వాసం దానంతట అదే బలపడుతుంది. ఈ 115 జిల్లాలలో కొన్ని జిల్లాలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ జిల్లాలు ఎందువల్ల వెనుకబడి ఉన్నాయి ? అని మీరు ఆశ్చర్యపోతారు. అది పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ, వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా ఉంది. కేవలం మధుమేహ వ్యాధి సోకిన రోగి లాగా. ఈ జిల్లాలు ఒక ప్రమాణంలో అభివృద్ధి చెంది ఉంటాయి, కానీ ఇతర ప్రమాణాలలో వెనుకబడి ఉంటాయి. ఆ ఒక్క ప్రమాణం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ‘‘వావ్, అది చాలా గొప్ప’’ అన్నట్లు. అయితే మిగిలిన ప్రమాణాలలో జిల్లా గందరగోళంగా ఉంటుంది.
తమ జిల్లాలను వదలివేశారని కొంత మంది భావిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు, 2011 గణాంకాల ప్రకారం కొన్ని జిల్లాలను ఎంపిక చేయగా, మరి కొన్ని జిల్లాలను తదనంతర సమాచారం ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రాలు కొన్ని జిల్లాలను ఎంపిక చేశాయి, మీరు మార్చాలని భావిస్తే, వాటిని మార్చవచ్చు. దాదాపు అయిదారు రాష్ట్రాలు తమ జిల్లాలను మార్చాయి.
ఎటువంటి రాజకీయ రంగూ, మనసులో ఎటువంటి వ్యతిరేకతా లేకుండా, మనమందరం కలసి ఒక ఏడాది పనిచేద్దాం, నేను ఎక్కువ సమయం అడగడం లేదు, కేవలం ఒక ఏడాది మాత్రమే. ఒకే ఒక ఏడాది కష్టపడి పనిచేస్తే, రాష్ట్ర ప్రమాణాలు ఎలా మారుతాయో చూడండి; మొత్తం దేశ ముఖచిత్రమే మారిపోతుంది. మానవ పురోగతి సూచికలో మన దేశం ప్రపంచంలో 131వ స్థానంలో ఉంది.
ఇవాళ భారతదేశం పైన ప్రపంచం ఆశను, అంచనాలను పెట్టుకొంది. మానవ పురోగతి సూచిక విషయంలో మనని మనం మెరుగుపరచుకొన్నామా అంటే- ఈ 115 జిల్లాలను అభివృద్ధి చేశామా అంటే- అప్పుడు, దేశం దానంతట అదే మెరుగుపడుతుంది. మనం అదనంగా ఏదీ చేయాల్సిన పని ఉండదు.
ఈ రకంగా ఈ పథకాల ప్రయోజనాలను పొందవచ్చు. చూడండి, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ జిఎన్ ఆర్ఇజిఎ) వంటి పథకాలు ఉపాధి లేని పేదల కోసమే. ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. అయితే అనుభవంతో చెబుతున్నాను, సాధారణంగా, ఎక్కడైతే ఎక్కువ మంది పేదరికంతో బాధ పడుతున్నారో, అక్కడ ఎమ్ జిఎన్ ఆర్ఇజిఎ అతి తక్కువగా అమలవుతోంది. అదే ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న ప్రాంతాలలో ఎమ్ జిఎన్ ఆర్ఇజిఎ అతి ఎక్కువగా అమలవుతోంది. దీనికి కారణం ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రాలలో సుపరిపాలన కొనసాగడం, దీంతో సహజంగానే ఆయా రాష్ట్రాలు ఎమ్ జిఎన్ ఆర్ఇజిఎ ప్రయోజనాలను పొందుతున్నాయి. కాగా, అత్యంత పేదరికంలో ఉంటూ, వేతనాల అవసరం ఉన్న రాష్ట్రాలకు, ఎమ్ జిఎన్ ఆర్ఇజిఎ అమలు కోసం నిధులు అందుబాటులో ఉన్నా కూడా, సుపరిపాలన లేకపోవడం కారణంగా, ఆ నిధులు పేదవారికి అందడం లేదు.
వాస్తవానికి, ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రాలకు కనీస నిధులను సమకూర్చాలి. అదే ఆర్ధికంగా వెనుకబడి వున్న పేద రాష్ట్రాలకు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా ఎక్కువ నిధులను కేటాయించాలి. అయితే అసలు సమస్య వనరులు లేకపోవడం కాదు. సుపరిపాలన లేకపోవడం ఒక సమస్య. అలాగే సమన్వయము లేకపోవడం మరొక సమస్య. వాటిపైన దృష్టి సారించకపోవడం ఇంకొక సమస్య. వీటిపై మరింత శ్రద్ధ పెడితే, మనం మంచి ఫలితాలను సాధించవచ్చు.
గతంలో రాజ్యాంగ పరిషత్తు ఎక్కడైతే సమావేశమైందో, ఎక్కడైతే మన గొప్ప గొప్ప మేధావులు, వారు కలలు గన్న దేశం కోసం సుదీర్ఘ చర్చలను, వాదోపవాదాలను జరిపారో ఆ ప్రదేశంలో రెండు రోజుల పాటు సుదీర్ఘమైన చర్చలు మేధోమధనం ద్వారా ఈ 115 జిల్లాల భవిష్యత్తులో మార్పు ను తీసుకు వస్తున్నందుకు మరొక్క సారి సుమిత్ర గారి కి నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకొంటున్నాను. ఈ రోజు అదే సభలో ఆసీనులమై మనం ఒక కొత్త దిశగా ముందుకు పోతున్నాం. మీ అందరికీ శుభం జరగాలని నేను కోరుకొంటున్నాను. ఇక్కడకు వచ్చినందుకు మరో సారి మీకు నేను నా హృదయాంతరాళం లోపలి నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మీకు ధన్యవాదాలు.