ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కంద్వారా 1.25 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుతుంది: ప్రధానమంత్రి
భార‌తీయ తేయాకు గొప్ప‌ద‌నాన్ని త‌క్కువ చేయ‌డానికి జ‌రుగుతున్న కుట్ర‌లు ఫ‌లించ‌వు: ప్రధానమంత్రి
అన్ని గ్రామాల్లో వెడ‌ల్పైన ర‌హ‌దారులు, క‌నెక్టివిటీ కావాల‌నే అస్సాం ప్ర‌జ‌ల‌ క‌ల‌లు అసోంమాలా ప్రాజెక్టుద్వారా సాకారం: ప్రధానమంత్రి

భారత్ మాతా కీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!

మంచి ప్రఖ్యాతి గడించిన ముఖ్యమంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ జీ, కేంద్ర కేబినెట్ లోని నా సహచరుడు శ్రీ రామేశ్వర్ తెలీజీ, అస్సాం ప్రభుత్వ మంత్రులు శ్రీ హిమంత బిశ్వ శర్మజీ, శ్రీ అతుల్ బోరాజీ, శ్రీ కేశబ్ మహంతాజీ, శ్రీ రంజిత్ దత్తాజీ, బోడోలాండ్ ప్రాంతీయ మండలి అధినేత శ్రీ ప్రమోద్ బోరోజీ, ఇతర పార్లమెంటేరియన్లు, ఎంఎల్ఏలు, నా ప్రియ సోదర సోదరీమణులారా.

సోదర సోదరీమణులారా, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని భావిస్తున్నాను. గత నెలలో సమాజంలో నిరాదరణకు గురవుతున్న పేదలు, దోపిడికి గురవుతున్న వారు, నిరాకరణకు గురవుతున్న ప్రజలకు భూ కౌలు పట్టాలు పంపిణీ చేసేందుకు అస్సాం సందర్శించే భాగ్యం నాకు కలిగింది. అస్సాం ప్రజలు చూపే ఆదరణ, ప్రేమ అసాధారణమైనవి కావడం వల్లనే నేను పదే పదే అస్సాం వస్తున్నాను. ఈ రోజు మీ అందరినీ కలిసి, శుభాభినందనలు తెలియచేసేందుకు నేను మరోసారి అస్సాం వచ్చాను. ధేకియాజులీని ఎంత అందంగా ముస్తాబు చేశారో నిన్ననే నేను సామాజిక మాధ్యమాల్లో చూసి దాన్ని ట్వీట్ కూడా చేశారు. మీరంతా ఎన్నోదీపాలు ప్రజ్వలనం చేశారు. ఈ ప్రేమాభిమానాలన్నింటికీ నేను మీ అందరికీ శిరసు వంచి అభివాదం చేస్తున్నాను. అస్సాం అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు, ఎంతో వేగంగా అస్సాంకు సేవలందిస్తున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ శర్బానందజీ, హిమంత జీ, రంజిత్ దత్తాజీ, ఇతర ప్రభుత్వాధికారులు, బిజెపి నాయకులందరినీ నేను ప్రశంసిస్తున్నాను. మీ అందరి కృషి వల్లనే నేను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడకు రాగలుగుతున్నాను. మరో కారణంగా కూడా ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకత గల రోజు. ఈ రోజు ఈ పవిత్ర ప్రదేశం సోనిత్ పూర్-ధెకియాజులీకి శిరసు వంచి అభివాదం చేసే అవకాశం కలిగింది. రుద్రపడ ఆలయం వద్ద శతాబ్దాల చరిత్ర గల అస్సాం గాథను ప్రపంచానికి పరిచయం చేసిన భూమి ఇది. ఇదే భూమిలో అస్సాం ప్రజలు దురాక్రమణదారులను పరాజయం పాలు చేసి ఐక్యత, శక్తి, సాహసం బలం ఏమిటో ప్రదర్శించి చూపారు. 1942లో ఈ భూమిలోనే దేశ స్వాతంత్ర్యం, త్రివర్ణ పతాక గౌరవం కోసం అస్సాంకు చెందిన స్వాతంత్ర్య యోధులు ప్రాణాలు త్యాగం చేశారు. ఈ వీరులందరి సాహసాన్ని పొగుడుతూ భూపేన్ హజారికా జీ ఇలా చెప్పేవారు.

మిత్రులారా,
గువాహటిలో ఎయిమ్స్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో అది పూర్తవుతుంది. ప్రస్తుతం ఎయిమ్స్ క్యాంపస్ లోనే ఎంబిబిఎస్ తొలి బ్యాచ్ అకాడమిక్ సెషన్ ప్రారంభం అయింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో కొత్త క్యాంపస్ పూర్తయిన తర్వాత గువాహటి ఆధునిక వైద్యసేవల కేంద్రంగా ఎదగడం మీరే చూస్తారు. గువాహటిలోని ఎయిమ్స్ అస్సాంలోనే కాకుండా మొత్తం ఈశాన్య భారతంలో ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొస్తుంది. ఈ రోజు ఎయిమ్స్ గురించి మాట్లాడుతున్న సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. గువాహటిలోనే ఒక ఎయిమ్స్ ఏర్పాటైతే మీరు ఎంత ప్రయోజనం పొందుతారో గతంలోని ప్రభుత్వాలు ఎందుకు అర్ధం చేసుకోలేదు? వారంతా ఈశాన్య ప్రాంతానికి దూరంగా ఉండడం వల్లనే మీ బాధలు గుర్తించలేకపోయారు.

మిత్రులారా,
ఈ రోజు కేంద్రప్రభుత్వం అస్సాం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో భుజం భుజం కలిపి అస్సాం ముందుకు సాగుతోంది. ఆయుష్మాన్ భారత్, జన ఔషధి కేంద్రాలు, ప్రధానమంత్రి జాతీయ డయాల్సిస్ కార్యక్రమం, వెల్ నెస్ కేంద్రాలతో సగటు మనిషి జీవితంలో అసాధారణమైన మార్పు వచ్చింది. అస్సాంలో కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున అస్సాంలో ఆయుష్మాన్ భారత్ పథకం 1.25 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తోంది. అస్సాంలో 350కి పైగా ఆస్పత్రులు ఈ స్కీమ్ లో భాగస్వాములయ్యాయని నాకు తెలిపారు. రాష్ట్రంలో లక్షన్నర మందికి ఈ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సా సదుపాయం కలిగింది. ఈ పథకాలన్నీ అస్సాంలోని పేదప్రజలకు కోట్లాది రూపాయలు వైద్యచికిత్సల ఖర్చు ఆదా చేశాయి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తో పాటు అస్సాం ప్రభుత్వం చేపట్టిన “అటల్ అమృత్ అభియాన్” కూడా ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంది. ఈ పథకం కింద సాధారణ వర్గీకరణలోని పౌరుల్లో పేదవారికి అతి తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా అందుబాటులో ఉంది. ఇదే సమయంలో అస్సాంలోని ప్రతీ మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య, వెల్ నెస్ కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రజల ముంగిటికి తీసుకువెళ్లాయి. ఈ సెంటర్లలో ఇప్పటివరకు అస్సాంలోని 55 లక్షల మందికి పైగా సోదరసోదరీమణులు ప్రాథమిక వైద్య చికిత్సలు పొందారని నా దృష్టికి తెచ్చారు.

మిత్రులారా,
కరోనా కష్టకాలంలో ఆధునిక వైద్య సేవల ప్రాధాన్యం ఏమిటో దేశానికి తెలిసింది. కరోనాపై భారతదేశం జరిపిన పోరాటాన్ని యావత్ ప్రపంచం ప్రశంసిస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రారంభమయింది. కరోనా నుంచి నేర్చుకున్న గుణపాఠంతో దేశ ప్రజల జీవితాలు సురక్షితం, సులభతరం చేసే దిశగా దేశం వేగవంతంగా కృషి చేస్తోంది. మీరంతా ఈ ఏడాది బడ్జెట్ ను వినే ఉంటారు. ఆరోగ్య సేవలపై వ్యయాలు ఈ బడ్జెట్ లో అసాధారణంగా పెంచడం జరిగింది. దేశంలోని 600కి పైగా జిల్లాల్లో సమీకృత లాబ్ లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య పరీక్షల కోసం సుదీర్ఘ ప్రయాణాలు చేసే చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలకు ఇది ఎంతో సహాయకారి అవుతుంది.

మిత్రులారా,
అస్సాంలోని తేయాకు తోటలు పురోగతి కేంద్రాలు. సోనిత్ పూర్ కి చెందిన రెడ్ టీ చక్కని సువాసనతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సోనిత్ పూర్ టీ ప్రత్యేక రుచి ఎవరికి తెలియదు? అందుకే తేయాకు పని వారి పురోగతిని మొత్తం అస్సాం పురోగతికి చిహ్నంగా నేను భావిస్తాను. అస్సాం ప్రభుత్వం ఈ దిశగా ఎన్నో సానుకూల చర్యలు తీసుకుంది. అస్సాం చా బాగీచార్ ధన పురస్కార్ మేళా పథకం కింద నిన్ననే కోట్లాది రూపాయలు 7.5 లక్షల మంది తేయాకు పనివారి బ్యాంక్ ఖాతాల్లో ప్రత్యక్షంగా జమ చేశారు. మరో ప్రత్యేక పథకం కింద తేయాకు తోటల్లో పని చేస్తున్న గర్భిణీలకు ప్రత్యక్ష సహాయం అందిస్తున్నారు. తేయాకు పని వారు, వారి కుంటుబాల ఆరోగ్య సంరక్షణ కోసం మొబైల్ మెడికల్ వ్యాన్లు పంపుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మద్దతుగా తేయాకు తోటల్లో పని చేసే సోదరసోదరీమణుల కోసం 1000 కోట్ల రూపాయల ప్రత్యేక పథకం కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. తేయాకు కార్మికుల కోసం వేయి కోట్ల రూపాయల పథకం! ఇది వారి కోసం సదుపాయాలు పెంచడమే కాకుండా వారి జీవితాలు సులభతరం చేస్తుంది.

మిత్రులారా,
అస్సాంలోని తేయాకు పని వారి గురించి మాట్లాడే సమయంలో నేను దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల గురించి కూడా వివరించాలనుకుంటున్నాను. దేశాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నంలో భాగంగా కుట్రదారులు భారతీయ తేయాకును కూడా వదలని స్థాయికి దిగజారిపోయారు. ప్రణాళికాబద్ధంగా భారతీయ తేయాకు ప్రతిష్ఠను దెబ్బ తీస్తామన్న కుట్రదారుల ప్రకటనల గురించి వార్తలు మీరు వినే ఉంటారు. భారతీయ తేయాకుకు ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ఠ తేవాలనుకుంటున్నారు. దేశం వెలుపల ఉన్న కొన్ని శక్తులు భారతీయ తేయాకు ప్రతిష్ఠను దిగజార్చే కుట్రలు పన్నాయని తెలిపే కొన్ని పత్రాలు కూడా దొరికాయి. ఈ దాడిని మీరు ఆమోదిస్తారా? ఈ దాడుల విషయంలో మౌనం వహిస్తున్న వారి వైఖరిని మీరు అంగీకరిస్తారా? ప్రతీ ఒక్కరూ దీనికి సమాధానం చెప్పాలి. భారతీయ తేయాకు ప్రతిష్ఠ దెబ్బ తీసే వారిరు, వారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్న ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ ఇందుకు సమాధానం చెప్పాల్సిందే. భారతీయ తేయాకు సేవించే ప్రతీ ఒక్కరూ వారి నుంచి జవాబు ఆశిస్తున్నారు. వారి కుట్రలు విజయం సాధించేందుకు అనుమతించబోమని అస్సాం భూభాగంలోని కుట్రదారులకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పోరాటంలో తేయాకు పని వారు విజయం సాధించాలి. తేయాకు తోటల్లో పని చేస్తున్న వారి దృఢ సంకల్పాన్ని దెబ్బ తీసే శక్తి ఈ దాడులకు ఏ మాత్రం లేదు. దేశం అభివృద్ధి, పురోగతి బాటలో పయనిస్తూనే ఉంటుంది. అలాగే అస్సాం అభివృద్ధిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తుంది.అస్సాం అభివృద్ధి చక్రం త్వరితగతిన పరిభ్రమిస్తూనే ఉంటుంది.

మిత్రులారా,
ఈ రోజు అస్సాంల ప్రతీ ఒక్క రంగం అభివృద్ధి పథంలో పయనిస్తున్న సమయంలో చాలా పనులు జరుగుతున్నాయి. అస్సాం మరింతగా పెరిగేందుకు ఇది చాలా అవసరం. ఆధునిక రోడ్లు, మౌలిక వసతులు అస్సాం సామర్థ్యాలు ఇనుమడింపచేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే “భారత్ మాల” ప్రాజెక్టు తరహాలోనే “అసోం మాల” ప్రారంభించడం జరిగింది. రాబోయే 15 సంవత్సరాల కాలంలో అసోం మాట ప్రాజెక్టు మీ కలలను సాకారం చేస్తుంది. విశాలమైన రహదారులు, ప్రధాన రోడ్లతో గ్రామాలన్నింటి అనుసంధానం, పెద్ద నగరాలకు దీటైన రోడ్లు మీ సామర్థ్యాలను ఎంతగానో పెంచుతాయి. గత కొన్ని సంవత్సరాల కాలంలో అస్సాంలో వేలాది కిలోమీటర్ల రోడ్లు, వంతెనల నిర్మాణం జరిగింది. ఈ రోజు భూపేన్ హజారికా వంతెన, సరైఘాట్ వంతెన ఆధునిక అస్సాం గుర్తింపులోభాగం కానున్నాయి. రానున్న కాలంలో ఈ పనులు మరింత వేగం అందుకుంటాయి. వృద్ధి, పురోగతిలో వేగం పెంచడం కోసం ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక వసతులకు అసాధారణ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. దానికి తోడు అసోం మాల వంటి ప్రాజెక్టుల ద్వారా అనుసంధానత పెంచడం జరుగుతోంది. రానున్న రోజుల్లో జరుగనున్న ఈ కృషితో ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయో ఊహించుకోండి. రహదారులు, కనెక్టివిటీ మెరుగుపడితే పరిశ్రమ కూడా పెరుగుతుంది. టూరిజం వృద్ధి చెందుతుంది. ఇది కూడా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చి అస్సాం అభివృద్ధికి కొత్త ఉత్తేజం కల్పిస్తుంది.

మిత్రులారా,
అస్సాం రచయిత రూప్ కన్వర్ జ్యోతి ప్రసాద్ అగర్వాలా రచనలోని
మేరీ నయా భారత్ కీ
నయా ఛివీ
జాగోరే
జాగోరే
పంక్తుల స్ఫూర్తితో నవ భారతం మేల్కొంటుంది. ఈ నవ భారతమే ఆత్మనిర్భర్ భారత్.ఈ నవ భారతం అస్సాం అభివృద్ధిని కూడా కొత్త శిఖరాలకు చేర్చుతుంది. ఈ శుభకామనతో మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ పికిడిలిని పూర్తి సామర్థ్యంతో తెరిచి నినదించండి. భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై. ధన్యవాదాలు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi