దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులకు నమస్కారాలు!
సామాజిక సాధికారతకోసం బాధ్యతాయుతమైన ఏఐ (కృత్రమి మేధస్సు) ( రెయిజ్) పేరిట ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా సుస్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంపైన చర్చలను ప్రోత్సహించడానికి చేసిన గొప్ప ప్రయత్నం ఈ సమావేశం. సాంకేతికత, మానన సాధికారతపై మీరందరూ సరైన రీతిలో పలు అంశాలను ముందుకు తీసుకువచ్చారు. సాంకేతికత అనేది మన పని ప్రదేశాల్లో చాలా మార్పులు తెచ్చింది. సాంకేతికత అనేది కనెక్టివిటీని పెంచింది. కాలక్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కోవడంలో సాంకేతికత అనేది కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. సామాజిక బాధ్యత , ఏఐ అని రెండు అంశాల కలయిక అనేది ఏఐ రంగాన్ని ఉన్నతీకరించడంలో దానికి మానవ స్పర్శను అద్దుతుందని ఖచ్చితంగా చెప్పగలను.
స్నేహితులారా,
మానవ మేధా శక్తి యొక్క గొప్పదనాన్ని చాటేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషిలోని ఆలోచింగలిగే శక్తి ద్వారా మనం పలు పని ముట్లను, సాంకేతికతలను తయారు చేసుకున్నాం. ఈ రోజున ఈ పనిముట్లు, ఈ సాంకేతికతలు కూడా ఆలోచనా శక్తిని సంపాదించుకుంటున్నాయి. తద్వారా అందరి ముందుకు వచ్చిన ముఖ్యమైన సాంకేతికతే ఏఐ. మనిషితో కలిసి ఏఐ చేపట్టే కార్యక్రమాలు ప్రపంచంకోసం అనేక ఘనకార్యాలు చేస్తాయి.
స్నేహితులారా,
చరిత్రను పరికిస్తే, ప్రతి దశలో విజ్ఞానం, బోధన విషయంలో ప్రపంచానికి భారతదేశం సారధ్యంవహించింది. ఇప్పుడు ఈ నాటి ఐటీ ప్రపంచంలో కూడా భారతదేశం ప్రతిష్టాత్మకరీతిలో తన సేవలను అందిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోని ఉత్తమమైన టెక్నాలజీ సారథులు భారతదేశానికి చెందినవారే. ప్రపంచ ఐటీ సేవల పరిశ్రమల విషయంలో భారతదేశం బలమైన కేంద్రంగా రూపుదాల్చింది. డిజిటల్ రంగంలో మన ప్రతిభ కొనసాగుతోంది. ప్రపంచానికి మేలు చేస్తూనే వుంటుంది.
స్నేహితులారా,
భారతదేశంలో మనం చూస్తూనే వున్నాం. సాంకేతికత కారణంగా పారదర్శకత వచ్చింది. సేవల అందుబాటు పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద యూనిక్ ఐడెంటిటీ సిస్టమ్ – ఆధార్ వ్యవస్థను మన దేశం కలిగి వుంది. ఇక ప్రపంచంలోనే విశిష్టమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యుపిఐని మనం కలిగి వున్నాం. దీని కారణంగా డిజిటల్ సేవలందించగలుగుతున్నాం. సమాజంలోని పేద బడుగు బలహీనవర్గాలకు నేరుగా నగదు చెల్లించేలాంటి ఆర్ధిక సేవల్ని అందిస్తున్నాం. డిజిటల్ పరంగా దేశం సర్వ సిద్ధంగా వుండడంవల్ల ఈ మహమ్మారి కాలంలో అది బాగా ఉపయోగపడుతున్న విషయాన్ని మనం చూస్తూనే వున్నాం. తద్వారా మనం సమయానికి ప్రజలకు సాయం చేయగలిగాం. అంతే కాదు అత్యుత్తమమైన పద్ధతిలో ఆ సేవలు అందిస్తున్నాం. ఇక ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను భారతదేశం చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ప్రతి గ్రామానికి వేగవంతమైన ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
స్నేహితులారా,
ఏఐ విషయంలో భారతదేశం అంతర్జాతీయ కేంద్రంగా రూపొందాలనేది ఇప్పుడు మన ముందున్న ఆశయం. ఇందుకోసం అనేక మంది భారతీయ నిపుణులు పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఐకమత్యంతో పనిచేయడం, నమ్మకం, భాగస్వామ్యాలు, బాధ్యత, అందరినీ కలుపుకొని పని చేయడం ..ఈ ముఖ్యమైన విలువలతో మన విధానం రూపొందింది.
స్నేహితులారా,
ఈ మధ్యనే జాతీయ విద్యావిధానం 2020కి భారతదేశం ఆమోదం తెలిపింది. దేశ విద్యారంగంలో సాంకేతికత ఆధారిత బోధన, నైపుణ్యాల బోధన అనేవాటిపైన నూతన విధానం దృష్టి పెట్టింది. పలు ప్రాంతీయ భాషల్లో ఎలక్ట్రానిక్ కోర్సులను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఏఐ వేదికలకు సంబంధించిన నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ( ఎన్ ఎల్ పి) సామర్థ్యాలనుంచి ఈ మొత్తం ప్రయత్నం ప్రయోజనం పొందుతుంది. యువతకు సంబంధించిన కార్యక్రమంలో బాధ్యతాయుత ఏఐని ప్రవేశపెట్టాం. పాఠశాలలకు చెందిన 11 వేల మందికిపైగా విద్యార్థులు ఈ కార్యక్రమం కిందగల ప్రాధమిక కోర్సును పూర్తి చేశారు. వారు ఇప్పుడు వారికి సంబంధించిన ఏఐ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.
స్నేహితులారా,
జాతీయ విద్యా రంగ సాంకేతికతా వేదిక ( ఎన్ ఇ టిఎఫ్) రూపొందుతోంది. ఇది రానున్న రోజుల్లో దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ కాంటెంట్, సామర్థ్యాలను ప్రోత్సహించే ఎలక్ట్రానిక్ విద్యా కేంద్రాన్ని తయారు చేస్తుంది. విర్చువల్ ల్యాబులను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా విద్యార్థులకు వాస్తవపూరిత అనుభవం కలిగేలా చేస్తారు. ఆవిష్కరణ, ఎంట్రప్రెన్యూర్ షిప్ సంస్కృతిని ప్రోత్సహించడం కోసం మనం ఇప్పటికే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రారంభించాం. ఇలాంటి అనేక నిర్ణయాలద్వారా ప్రజా ప్రయోజనం కోసం, నూతన సాంకేతికతలకోసం కృషి చేస్తున్నాం.
స్నేహితులారా,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తయారైన జాతీయ కార్యక్రమం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికిగాను సరైన పద్ధతిలో ఏఐని వినియోగించడంకోసం ఈ జాతీయ కార్యక్రమాన్ని అంకింతం చేస్తాం. ఈ రంగంలోని భాగస్తులందరి మద్దతుతో ఈ జాతీయ కార్యక్రమం అమలవుతుంది. దీనికి సంబంధించి మేధోపరమైన చర్చలు చేయడానికి రైజ్ వేదిక ఉపయోగపడుతుంది. ఈ కృషిలో మీరందరూ చురుకుగా పాల్గొనాలని ఆహ్వానం పలుకుతున్నాను.
స్నేహితులారా,
ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరైన నిపుణులందరి ముందు నేను కొన్ని సవాళ్లను ఉంచబోతున్నాను. మన ఆస్తులు, వనరులను ఉత్తమమైన పద్ధతిలో నిర్వహించడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించవచ్చా? కొన్ని ప్రాంతాల్లో వనరులు ఎందుకు పనికిరాకుండా అలాగే వున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వనరుల కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చా? ప్రజల ముంగిటకే సేవలందేలా చేసి వారిని సంతోషపెట్టగలమా?
స్నేహితులారా,
భవిష్యత్ యువతదే. ఈ దేశంలోని యువతలో ప్రతి ఒక్కరు మనకు ముఖ్యమే. ప్రతి చిన్నారికి ప్రత్యేకమైన ప్రతిభ, సామర్థ్యాలు, అవగాహనశక్తి వుంటుంది. కొన్నిసార్లు సరైన వ్యక్తులు …తాము వుండకూడని చోట వుంటారు. ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి ఒక మార్గం వుంది. ప్రతి చిన్నారి తాను పెరుగుతున్న క్రమంలో తనను తాను పరిశీలించుకుంటూ వుంటే ఎలా వుంటుంది? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు పిల్లల్ని జాగ్రత్తగా పరిశీలిస్తారా? బాల్యదశను, యవ్వనదశ వరకు చిన్నారులను గమనించండి. వారికి సంబంధించిన రికార్డును నిర్వహించండి. ఇది ఆ చిన్నారులు తమ సహజ సిద్ధ ప్రతిభను తెలుసుకోవడానికి దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. ఈ పరిశీలనలు యువతకు సమర్థవంతమైన మార్గదర్శక శక్తులుగా పని కొస్తాయి. ప్రతి చిన్నారి అవగాహన శక్తిని తెలియజేసే విశ్లేషణాత్మక నివేదికను రూపొందించే వ్యవస్థను మనం తయారు చేసుకోవచ్చా? ఇది యువతకు అనేక అవకాశాలను కల్పిస్తుంది. మానవ వనరుల మ్యాపింగ్ అనేది ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలకు దీర్ఘకాల ప్రయోజనాలను ఇస్తుంది.
స్నేహితులారా,
వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు సాధికారత కలిగించడంలో ఏఐ ముఖ్య పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాను. ఇది రాబోయే తరాలకు కావలసిన పట్టణ నగరాల మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఇక పట్టణాలు, నగరాల్లో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. మురుగునీటి పారుదల వ్యవస్థలను, విద్యుత్ శక్తి గ్రిడ్డులను మెరుగుపరుస్తుంది. మన విపత్తు నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పులద్వారా వస్తున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్నేహితులారా,
ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలున్నాయి. భారతదేశంలో అనేక భాషలు, మాండలికాలు వాడుకలో వున్నాయి. ఈ వైవిధ్యం కారణంగానే మనం మెరుగైన సమాజంగా జీవిస్తున్నాం. ఇప్పుడే రాజ్ రెడ్డి సూచించినట్టుగా భాషాపరమైన అంతరాలను తొలగించడానికిగాను మనం ఏఐని ఎందుకు ఉపయోగించకూడదు? దివ్యాంగులైన సోదర సోదరీమణులను సాధికారులను చేయడానికిగాను ఏఐని సులువుగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
స్నేహితులారా, విజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఏఐని ఎందుకు ఉపయోగించకూడదు? విజ్ఞానాన్ని, సమాచారాన్ని, నైపుణ్యాలను చాలా సులువుగా అందుబాటులో వుండేలా చేస్తే అవి ప్రజలను సాధికారులను చేస్తాయి.
స్నేహితులారా,
ఏఐ ఉపయోగపడుతున్న తీరుపట్ల నమ్మకం ఏర్పడేలా చూడడమనేది మనందరి ఉమ్మడి బాధ్యత. ఈ నమ్మకం ఏర్పడడానికిగాను అల్గారిథమ్ పారదర్శకత అనేది చాలా ముఖ్యం. అంతే ప్రాధాన్యతను సంతరించుకున్నది బాధ్యత. అసాంఘిక శక్తుల చేతుల్లో పడి ఇది ప్రపంచానికి కీడు చేయకుండా మనం ప్రపంచాన్ని కాపాడుకోవాలి.
స్నేహితులారా,
ఒక పక్క కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) గురంచి మనం మాట్లాడుకుంటున్నప్పటికీ, మనిషి సృజనాత్మకత, మనిషి భావోద్వేగాలు అనేవి మన అత్యుత్తమ బలాలుగా వుంటాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. యంత్రాలకు మనిషికి మధ్యన తేడా అనేది… వాటిద్వారానే అని మరిచిపోవద్దు. మనిషి తన మేధస్సును, దయార్ద్ర హృదయాన్ని కలపకపోతే ఏఐ అనేది మానవాళి సమస్యలను పరిష్కరించలేదు. యంత్రాలపై మన పై చేయికి కారణమయ్యే ఈ మేధోపరమైనప్రత్యేకతను కాపాడుకోవడం గురించి మనం తప్పక ఆలోచించాలి. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడే మనం ఏఐ కంటే కొన్ని అడుగులు ముందు వుంటాం. ప్రజలు తమ సామర్థ్యాలను పెంచుకోవడానికిగాను ఏఐని ఎలా ఉపయోగించుకోవాలనేదాని గురించి ఆలోచించాలి. నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ప్రతి మనిషిలోని వినూత్నమైన సామర్థ్యాన్ని ఏఐ బైటకు తీసుకువస్తోంది. మనుషులను సాధికారులను చేసి వారు సమాజానికి మరింత సమర్థవంతమైన సేవలను అందించేలా చేస్తుంది.
స్నేహితులారా,
ఈ రంగానికి సంబంధించి అంతర్జాతీయంగా ముందువరసలో వున్న భాగస్వాములందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడానికిగాను ఈ అంతర్జాతీయ వేదికను రైజ్ – 2020 పేరు మీద తయారు చేసుకున్నాం. కృత్రిమ మేధస్సును అమలు చేయడానికిగాను ఉమ్మడి విధానాన్ని తయారు చేసుకోవడానికి వీలుగా మనం మన ఆలోచనల్ని పంచుకుందాం. మనందరం భాగస్వాములుగా ఐకమత్యంగా పని చేయడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ అసలైన అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు. ఈ అంతర్జాతీయ సమావేశం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. రాబోయే నాలుగు రోజుల్లో చేయబోయే చర్చలు బాధ్యతాయుతమైన ఏఐకోసం ఒక కార్యాచరణతో కూడిన రోడ్ మ్యాపును తయారు చేసుకోవడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఈ రోడ్ మ్యాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చడానికి నిజంగా ఉపయోగపడి, ఉపాధి కల్పిస్తుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు,
థ్యాంక్ యూ.