కేరళ కు చెందిన సోదరులు మరియు సోదరీమణులారా,
దేవ భూమి ని సందర్శిస్తున్నందుకు నన్ను నేను అదృష్టవంతుడి గా భావిస్తున్నాను. గత సంవత్సరం వచ్చిన వరదల బీభత్సం నుండి కోలుకున్నటువంటి అనుభూతి ని కొల్లమ్ అష్టముడి సరస్సు తీరాన నేను పొందుతున్నాను. అయితే కేరళ ను పునర్ నిర్మించడం కోసం మనం మరింత కష్టపడాల్సి వుంది.
ఈ బైపాస్ ను పూర్తి చేసినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఇది ప్రజల జీవనాన్ని సులభతరం చేయగలుగుతుంది. ప్రజా జీవనాన్ని సరళతరం చేయడం అనేది నా ప్రభుత్వ నిబద్ధత గా ఉంది. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ను మేం నమ్ముతున్నాం. ఈ వచనబద్ధత తోనే నా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కు 2015వ సంవత్సరం జనవరి లో తుది మంజూరు ను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు తో మరియు సహకారం తో ఈ ప్రాజెక్టు ను మేం సమర్ధవంతం గా పూర్తి చేశాం. 2014వ సంవత్సరం మే నెల లో మా ప్రభుత్వం పదవీబాధ్యతల ను స్వీకరించినప్పటి నుండి కేరళ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి మేం పెద్ద పీట వేశాం. భారత్ మాల లో భాగం గా ముంబయి-కన్యకుమారి కారిడోర్ కోసం ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన దశ లో ఉంది. ఆ తరహా ప్రాజెక్టు లు అనేకం అభివృద్ధి తాలూకు వివిధ దశల లో ఉన్నాయి.
మన దేశం లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు లు ప్రకటన వెలువడిన తరువాత వేరు వేరు కారణాల వల్ల నిలచిపోవటం మనం తరచుగా చూస్తున్నదే. వ్యయం పెరగడం వల్ల, నిర్దేశిత కాలం నిలచిపోవడం వల్ల బోలెడంత ప్రజా ధనం వ్యర్థమవుతోంది. ప్రజా ధనం వృథా అయ్యే ఈ సంస్కృతి ని కొనసాగించకూడదని మేం నిర్ణయించాం. పిఆర్ఎజిఎటిఐ (‘ప్రగతి’) ద్వారా ప్రాజెక్టుల ను మేం వేగవంతం చేస్తూ, ఈ సమస్య ను అధిమిస్తున్నాం.
ప్రతి నెలా ఆఖరు బుధవారం నాడు నేను భారత ప్రభుత్వ కార్యదర్శులందరి తో, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల తో కలసి, ఆలస్యం జరిగిన ప్రాజెక్టుల ను సమీక్షిస్తూ వస్తున్నాను.
కొన్ని ప్రాజెక్టులు 20 నుండి 30 సంవత్సరాల పాతవి కావటం, మరి ఆ ప్రాజెక్టు లు తీవ్రమైనటువంటి జాప్యానికి లోనవుతుండటాన్ని గమనించి నేను విస్మయానికి లోనయ్యాను. ఒక ప్రాజెక్టు యొక్క లేదా ఒక పథకం యొక్క ప్రయోజనాలను అంత దీర్ఘ కాలం పాటు సామాన్య మానవుడి కి అందకుండా చేయటమనేది ఒక నేరం. ఇంతవరకు మేం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల విలువైన 250కి పైగా ప్రాజెక్టుల ను పిఆర్ఎజిఎటిఐ (‘ప్రగతి’) సమావేశాల లో సమీక్షించాం.
మిత్రులారా,
సంధానాని కి ఉన్నటువంటి శక్తి ని అటల్ గారు నమ్మారు; మరి ఆయన యొక్క దార్శనికత ను మేం ముందుకు తీసుకుపోతున్నాం. జాతీయ రహదారుల మొదలు గ్రామీణ రహదారుల వరకు నిర్మాణ వేగ గతి ఇదివరకటి ప్రభుత్వం తో పోల్చి చూస్తే దాదాపు రెట్టింపయింది.
మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, కేవలం 56 శాతం గ్రామీణ ప్రాంతాల జనావాసాలు రోడ్డు తో సంధానమై ఉన్నాయి. ఇవాళ 90 శాతానికి పైగా గ్రామీణ ప్రాంత జనావాసాలు రోడ్డు తో జోడించబడ్డాయి. మేం త్వరలోనే 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమని నేను అనుకొంటున్నాను.
రహదారి రంగం లో మాదిరిగానే నా ప్రభుత్వం రైల్వే లకు, జల మార్గాల కు, ఇంకా వినువీధుల కు ప్రాధాన్యాన్ని కట్టబెట్టింది. వారాణసీ నుండి హాల్దియా దాకా జాతీయ జల మార్గం ఇప్పటికే ఆరంభమైంది. ఇది ఒక పరిశుభ్రమైన రవాణా సాధనం. అంతేకాదు, ఇది పర్యావరణాన్ని భావి తరాల వారి కోసం పరిరక్షిస్తుంది కూడాను. ప్రాంతీయ గగనతల సంధానం సైతం గడచిన నాలుగు సంవత్సరాల లో ఎంతగానో మెరుగు పడింది. పట్టాల విద్యుదీకరణ డబ్లింగ్ పనులు మరియు కొత్త పట్టాలను వేసే పనులు గణనీయం గా మెరుగుపడ్డాయి. ఇవన్నీ ఉద్యోగ కల్పన అధికం అయ్యేందుకు దారి తీస్తున్నాయి.
మనం రహదారుల ను మరియు సేతువుల ను నిర్మించుకొంటే దాని అర్థం- ఒక్క పట్టణాల ను మరియు పల్లెల ను మాత్రమే జోడిస్తున్నామని కాదు; మనం ఆకాంక్షల ను కార్యసాధనల తో, ఆశావాదాన్ని అవకాశాల తో, అలాగే ఆశను సంతోషం తో జోడిస్తున్నాం- అని కూడా.
నా దేశ వాసుల లో ప్రతి ఒక్కరూ పురోగమించాలి; ఇందుకు నేను కట్టుబడి ఉన్నాను. వరుస లోని ఆఖరు వ్యక్తే నా ప్రాథమ్యం. మత్య్స పరిశ్రమ కోసం నా ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయల నిధి ని సరికొత్త గా మంజూరు చేసింది.
‘ఆయుష్మాన్ భారత్’లో భాగం గా మేం పేద లలో ప్రతి ఒక్క కుటుంబాని కి సంవత్సరానికి 5 లక్షల రూపాయల మేర నగదు రహిత ఆరోగ్య హామీ ని అందిస్తున్నాం. ఇంత వరకు ఈ పథకం యొక్క లబ్ది ని 8 లక్షల మంది కి పైగా రోగులు పొందారు. ప్రభుత్వం ఇంతవరకు 1,100 కోట్ల రూపాయల కు పైగా మంజూరు చేసింది. ఈ పథకం అమలు ను వేగవంతం చేయవలసిందిగా కేరళ ప్రభుత్వాన్ని నేను అభ్యర్ధిస్తున్నాను. అలా చేస్తే దీని తాలూకు ప్రయోజనాన్ని కేరళ యొక్క ప్రజలు పొందగలుగుతారు.
పర్యటన రంగం కేరళ యొక్క ఆర్థికాభివృద్ధి లో ప్రముఖ పాత్రను పోషిస్తోంది.
అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కు ఈ రంగం ప్రధానమైనటువంటి మద్దతుదారుగా ఉంది. పర్యటన రంగం లో నా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. మరి ఫలితాలు కూడా అసాధారణమైన రీతి లో ఉన్నాయి. వరల్డ్ ట్రావెల్ & టూరిజమ్ కౌన్సిల్ యొక్క 2018వ సంవత్సర నివేదిక లో పేర్కొన్న నూతన పవర్ ర్యాంకింగ్ లో భారతదేశం మూడో స్థానాన్ని సంపాదించుకొంది. ఇది దేశం లో యావత్తు పర్యటన రంగానికి శుభ సూచకం అయినటువంటి ఒక ప్రధానమైన ముందంజ.
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ యొక్క ప్రయాణ మరియు పర్యటన సంబంధిత స్పర్ధాత్మక సూచిక లో భారతదేశ స్థానం 65 నుండి 40కి ఎగబాకింది.
భారతదేశాని కి తరలివచ్చిన విదేశీ యాత్రికుల సంఖ్య 2013వ సంవత్సరం లో దాదాపు 70 లక్షలు గా ఉండగా 2017వ సంవత్సరానికల్లా అది సుమారు ఒక కోటి కి చేరుకొంది. అంటే, ఈ సంఖ్య లో వృద్ధి 42 శాతం మేరకు ఉందన్న మాట. పర్యటన రంగం లో భారతదేశం ఆర్జించినటువంటి విదేశీ మారక ద్రవ్యం 2013వ సంవత్సరం లో 18 బిలియన్ డాలర్ల స్థాయి నుండి 2017వ సంవత్సరం లో 27 బిలియన్ డాలర్ల కు ఎగసింది. ఇది 50 శాతం వృద్ధి. నిజాని కి 2017వ సంవత్సరం లో ప్రపంచం లో కెల్లా అత్యంత వృద్ధి ని కనబరచిన పర్యటక గమ్యస్థానాల లో భారతదేశం కూడా ఒకటి గా ఉంది. భారతదేశం 2016వ సంవత్సరం తో పోలిస్తే 14 శాతానికి పైగా వృద్ధి ని సాధించింది. కాగా, ప్రపంచం అదే సంవత్సరం లో సగటు న 7 శాతం మేరకు వృద్ధి చెందింది.
ఇ-వీజా ను ప్రవేశపెట్టడం భారతదేశ పర్యటక రంగం లో ఒక మేలు మలుపు ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం గా 166 దేశాల పౌరుల కు ఈ సౌకర్యం అందుబాటు లో ఉంది.
నా ప్రభుత్వం యాత్రా స్థలాలు, వారసత్వ ప్రదేశాలు మరియు మత సంబంధ క్షేత్రాల చుట్టూరా కనీసమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించింది. వాటిలో ఒకటి ఇతివృత్తం ఆధారితం అయినటువంటి టూరిస్ట్ సర్క్యూట్ ల సమగ్ర అభివృద్ధి కి ఉద్దేశించిన స్వదేశ్ దర్శన్; రెండోది, పిఆర్ఎఎస్ఎడి.
కేరళ యొక్క పర్యటక రంగ సామర్ధ్యాన్ని గుర్తిస్తూ మేం స్వదేశ్ దర్శన్ మరియు పిఆర్ఎఎస్ఎడి పథకాల లో భాగం గా రాష్ట్రం లో 7 ప్రాజెక్టుల ను 550 కోట్ల రూపాయల ను మంజూరు చేశాం.
అటువంటి ఒక ప్రాజెక్టు ను తిరువనంతపురం లో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం వద్ద ఇవాళ నేను ప్రారంభించబోతున్నాను.
కేరళ ప్రజల తో పాటు, దేశం లోని ఇతర ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం భగవాన్ పద్మనాభస్వామి వద్ద నుండి ఆశీస్సుల ను నేను పొందగోరుతున్నాను.
‘‘కొల్లమ్ కందలిల్లామ్ వేండ’’ అనే పద బంధాన్ని గురించి నేను విన్నాను. దీనికి- ఎవరైనా కొల్లమ్ చేరుకొన్నారంటే ఇంటికి దూరం కారు అని భావం. నాలోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది.
కొల్లమ్ ప్రజల కు, మరి అలాగే కేరళ ప్రజల కు వారు చూపిన ప్రేమాదరణల కు గాను నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధియుతమైన మరియు బలమైన కేరళ ఆవిష్కారం కావాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.
నన్ని, నమస్కారం.