భూటాన్ ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్ గే గారు,
అసమ్ గవర్నరు ప్రొఫెసర్ జగదీశ్ ముఖి గారు,
అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారు,
పలు దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు, ముఖ్యంగా ఆసియాన్ నుండి వచ్చిన వారు,
దేశంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన వ్యాపారవేత్తలు, ఇతర అతిథులారా,
Aji Aei Hon-Milonat Uposthit Apona Lok Hokoloke Moi Antorik Hubhesa Gyapon Korinso.
Logote Okhomor Homuho Raijo-Loi Mor Gobheer Shordha Gyapon Koriso.
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సదస్సులో మీరు పాల్గొనడమనేది.. అభివృద్ధి బాటలో అసమ్ పయనాన్ని ప్రతిఫలిస్తోంది. భూటాన్ ప్రధాని శ్రీ తోబ్ గే గారు ఈ సదస్సు కు హాజరు కావడం భారతదేశం, భూటాన్ ల స్నేహానికి నిదర్శనంగా నిలుస్తోంది.
స్నేహితులారా,
మేం ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ ని అమలు చేస్తున్నాం. ఇందులో ఈశాన్య రాష్ట్రాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. భారతదేశానికి తూర్పున ఉన్న దేశాలు.. ముఖ్యంగా ఆసియాన్ దేశాల ప్రజలతో భారతదేశ ప్రజల సంబంధాలను బలోపేతం చేయడం, దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ లో ముఖ్యమైన అంశాలు. ఈ సదస్సు కోసం రూపొందించిన టాగ్ లైన్ చాలా సముచితంగా ఉంది. ఇది పెద్ద సందేశాన్ని ఇస్తోంది.
అడ్వాంటేజ్ అసమ్: ఇండియాస్ ఎక్స్ ప్రెస్ వే టు ఆసియాన్.. ఇది ఒక ప్రకటన మాత్రమే కాదు. ఇది ఒక సమగ్ర దృక్పథం. మన భాగస్వామ్యానికి పాతిక సంవత్సరాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మధ్యన ఆసియాన్ ఇండియా సదస్సు నిర్వహించుకున్నాం. ఆసియాన్ ఇండియా భాగస్వామ్యానికి పాతిక సంవత్సరాలు నిండివుండవచ్చు, కానీ ఈ దేశాలతో భారతదేశ సంబంధాలు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. మొన్నటి గణతంత్ర దిన ఉత్సవాల సందర్భంగా పది ఆసియాన్ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను.
ఈ మధ్యనే గువాహాటీ లో బాంగ్లాదేశ్ తన దౌత్య కార్యాలయాన్ని (కాన్సులేట్ ను) ప్రారంభించింది. ఈ పని చేసిన మొదటి దేశంగా నిలిచింది. నిన్ననే భూటాన్ ప్రభుత్వం కూడా తన దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించిందని తెలిసింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈశాన్య రాష్ట్రాల ప్రజల అభివృద్ధి అనేది ఎంతో సమతుల్యతతో, వేగంగా జరిగినప్పుడే భారతదేశ అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకొంటుంది. భారతదేశానికి సంబంధించిన తూర్పు ప్రాంతమంతా.. ఇంఫాల్ నుండి గువాహాటీ దాకా, కోల్ కతా నుండి పట్నా వరకు నూతనోత్సాహం నిండిన అభివృద్ధి కేంద్రంగా రూపొందాలి. ఇదే మా దృక్పథం, మా విధానం.
ఈ దార్శనికత కారణంగా గత మూడున్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలు గతంలో మునుపు ఎన్నడు లేని విధంగా కనిపిస్తున్నాయి. అలాగే అసమ్ ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాలుగా చేస్తున్న పని స్పష్టమైన ఫలితమిస్తోంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటువంటి పని ని చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచించే వారు కూడా కాదు. ఈ దేశంలో దేనినీ మార్చలేం అనే పాత అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఇది సాధ్యం అయింది. ఈ రోజు ప్రజలలో నిరాశ నిస్పృహల స్థానంలో ఆశావహ దృక్పథం కనిపిస్తోంది.
స్నేహితులారా,
నేడు గతంలో కంటే రెండింతలు వేగంతో రహదారులను నిర్మించడం జరుగుతోంది. గతంలో కంటే రెండింతల వేగంతో రైల్వే ట్రాకులను రెండు లేన్ ల ట్రాకులుగా మారుస్తున్నాం. గతంలో కంటే రెండింతలు వేగంతో రైల్వే ట్రాకులను విద్యుదీకరణ చేయడం జరుగుతోంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ప్రస్తుతం మేం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల కారణంగా పేదలు, దిగువ మధ్యతరతి, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో నాణ్యమైన మార్పు వస్తోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను అమలు చేయడం జరుగుతోంది. వీటి కారణంగా ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు గోచరిస్తున్నాయి. ఈ బడ్జెట్ లో మేం ‘ఆయుష్మాన్ భారత్ పథకా’న్ని ప్రకటించిన విషయాన్ని మీరు వినే ఉంటారు. ఇది ప్రపంచం లో అత్యంత భారీదైన పథకం.
స్నేహితులారా,
పేదరికంలో పుట్టి పెరిగిన వారు, పేదరికం లోని బాధలను అనుభవిస్తూ ఎలాగోలా జీవనయానం సాగిస్తున్న వారికి ఈ విషయం బాగా తెలుసు. వారి ముఖ్యమైన ఆందోళన రోగం వచ్చినప్పుడు చికిత్స ఎలాగనేది. ఒక కుటుంబ సభ్యునికి ఏదైనా అనారోగ్యం వచ్చి మంచానికి పరిమితమైతే, ఆ కుటుంబం మొత్తం చాలా కాలం పాటు ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతుంది. పేద ప్రజలను ఈ సమస్య నుండి గట్టెక్కించడానికి పది కోట్ల కుటుంబాలను ‘ఆయుష్మాన్ భారత్ పథకం’తో అనుసంధిస్తున్నాం. ఈ పథకంలో భాగంగా- ప్రతి పేద కుటుంబానికి గుర్తింపు పొందిన ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స- లభిస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో 45నుండి 50 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందగలుగుతారు. దీని కారణంగా రెండో అంచె, మూడో అంచె నగరాలలో ఆసుపత్రుల ఏర్పాటుకు అవకాశం పెరుగుతుంది. ఇవి యువతకు తప్పనిసరి ఆదాయ వనరుగా మారుతాయి. అంతే కాకుండా దేశంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆసుపత్రులను నెలకొల్పడానికిగాను విధానాలను రూపొందించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు, మరో రెండు పథకాల ద్వారా ప్రజల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి యోజన పథకాల ద్వారా 18 కోట్ల మందికి పైగా ప్రజలకు ప్రభుత్వ రక్షణ కల్పిస్తోంది. వీటి ద్వారా వారి లోని ఆందోళనలను తొలగిస్తోంది. వీటితో పాటు ప్రభుత్వం మరికొన్ని చర్యలను చేపట్టింది. 3 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రభుత్వమే 800 రకాల మందులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. స్టెంట్ ల ధరలను 85 శాతం దాకా తగ్గించడం జరిగింది. అలాగే మోకాలి శస్త్ర చికిత్సను నియంత్రించడం జరిగింది. వీటన్నిటి కారణంగా మధ్యతరగతి ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతోంది.
ఆసియాన్ దేశాలు కావచ్చు, బాంగ్లాదేశ్, భూటాన్ లేదా నేపాల్ కావచ్చు.. మన దేశాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశాలే. రైతుల ప్రగతి కారణంగానే ఈ ప్రాంతమంతా అభివృద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కుతుంది. అందుకే మా ప్రభుత్వం అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికిగాను కృషి చేస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికిగాను ప్రభుత్వం రెండు విధాలుగా కృషి చేస్తోంది. ఒకటి పంటలు పండించడానికి రైతులు పెట్టే పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తోంది; రెండో మార్గమేమిటంటే, రైతులు వారి వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధరలకు అమ్ముకోవడానికి వీలుగా చర్యలు చేపడుతోంది. ఈ సంవత్సరం ప్రభుత్వం 14 లక్షల కోట్ల రూపాయలను వ్యవసాయం, గ్రామీణ రంగాలపైన ఖర్చు చేస్తోంది. ధరల విషయంలో రైతులకు సరైన ఆదాయం లభించడానికి వీలుగా రెండు రోజుల క్రితమే ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పంట వ్యయాని కంటే యాభై శాతం అధికంగా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అంటే రైతుల పంట ధర వారు చేసే వ్యయం కంటే ఒకటిన్నర రెట్లు అధికంగా వుంటుంది. దీనితో పాటు ప్రభుత్వం 22 వేల గ్రామీణ విపణులను వ్యవసాయ విపణులుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. వీటిని ఎలక్ట్రానిక్ నేశనల్ అగ్రికల్చర్ మార్కెట్ (e-NAM) తో అనుసంధించడం జరుగుతుంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
కొన్ని రోజుల క్రితం మేం చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. నేను ప్రస్తుతం ఈశాన్య భారతంలో ఉన్నాను కాబట్టి దీనిని గురించి మాట్లాడడం సముచితంగా ఉంటుంది.
స్నేహితులారా,
శాస్త్రీయంగా చూసినప్పుడు వెదురు గడ్డి జాతికి చెందిన పంట. కానీ 90 ఏళ్ల క్రితం అప్పటి శాసన కర్తలు దీన్ని చెట్టుగా పరిగణించారు. దీని కారణంగా వెదురును పెంచి దాన్ని ఫర్నిచర్ లాగా ఉపయోగించుకోవాలనుకున్నా, ఇతర ప్రాంతాలకు తరలించాలన్నా అనుమతులు తప్పనిసరి. ఈ చట్టం కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల కంటే ఈశాన్య ప్రాంత భారతీయులే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి; పోయాయి. కానీ వెదురును చెట్ల విభాగం నుండి తప్పించి వేల మంది ఆదివాసీలకు, రైతులకు మేలు చేసే పని జరగలేదు. మా ప్రభుత్వం మాత్రమే ఈ పని ని పూర్తి చేసింది. ఇప్పుడు మేం జాతీయ వెదురు కార్యక్రమాన్ని 1,300 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిస్తున్నాం. ఈ బడ్జెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోని రైతులు మరో మేలును కూడా పొందబోతున్నారు.
సోదర సోదరీమణులారా
వ్యవసాయం కోసం రుణాలు పొందడం సులువే. కానీ వ్యవసాయ అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పశువుల పెంపకం వంటి పనుల కోసం రుణాలు పొందడం అంత సులభమైన పని కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మేం 10,000 కోట్ల రూపాయలతో ముఖ్యంగా చేపల పెంపకం, పశువుల పెంపకానికిగాను రెండు ప్రాథమిక సౌకర్యాల నిధులను ఏర్పాటు చేస్తున్నాం. అంతే కాదు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలను తీసుకోవడం సరళమైన ప్రక్రియగా మార్చడం జరిగింది. దేశంలో ప్రతి పేదకు ఇంటిని సమకూర్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గృహనిర్మాణ రంగంలో విధాన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. పలు సంస్కరణల్ని చేపట్టడం జరిగింది.
ప్రధాన మంత్రి ఆవాస యోజన లో భాగంగా గత మూడున్నర సంవత్సరాల్లో ఒక కోటికి పైగా ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం 51 లక్షల నూతన గృహాలను, వచ్చే సంవత్సరం మరో 51 లక్షల గృహాలను నిర్మించాలని ఈ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను మనసులో పెట్టుకొని ప్రభుత్వం అనేక సడలింపులను ఇవ్వడం జరుగుతోంది.
అంతే కాదు ఆర్ ఇ ఆర్ ఎ.. అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డివెలప్ మెంట్ యాక్ట్.. ను తీసుకురావడం ద్వారా ఈ రంగంలో పారదర్శకత నెలకొల్పాం. దాంతో మధ్య తరగతి వారికి సొంత ఇంటి కల సాకారం అవుతోంది. ఈ మధ్య కాలంలో అందుబాటు ధరలలో ఇళ్ల నిర్మాణం గణనీయంగా పెరిగి ఈ రంగంలో పెట్టుబడులు హెచ్చాయి. ఈ రంగంలో భారీ స్థాయిలో ప్రవేశించాలని విదేశీ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా,
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది ఉజాలా యోజన. ఇది దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి మధ్య తరగతి వారికి అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎల్ ఇడి బల్బు ధర రూ.350. కానీ మా ప్రభుత్వం దీనిని 40 రూపాయల నుండి 45 రూపాయలకు అందిస్తోంది. ఒక అంచనా ప్రకారం ఒక ఇంట్లో 5 ఎల్ ఇడి బల్బులను వినియోగిస్తుంటే ఆ కుటుంబం ప్రతి నెలా 400 రూపాయల నుండి 500 రూపాయలవరకు ఆదా చేస్తోంది. ఇంతవరకూ ఉజాలా పథకం కింద 28 కోట్ల కంటే ఎక్కువగా ఎల్ ఇడి బల్బులను పంపిణీ చేయడం జరిగింది. దీని కారణంగా దేశంలో మధ్య తరగతి ప్రజలు ప్రతి ఏడాది రూ.15 వేల కోట్లను ఆదా చేయడం జరుగుతోంది. అంతే కాదు ఆసియాన్ దేశాల్లో ఎల్ ఇడి బల్బుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇది భారతీయ వ్యాపారవేత్తలకు మంచి అవకాశం.
స్నేహితులారా,
నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే పని సంస్కృతిని ఈ ప్రభుత్వం అలవరచుకుంది. ప్రజలకు అంకితం చేసిన ధోలా సాదియా వంతెన విషయాన్ని తీసుకుందాం. అసమ్ ప్రజలకు ఈ విషయం తెలుసు. గతంలో లాగా ఈ వంతెన నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే, ఇది ఇప్పటికీ ఇంకా నిర్మాణంలోనే ఉండేది. ప్రభుత్వ పాలన తీరునంతా పూర్తిగా మార్చేశాం. దాంతో ఈ ప్రాజెక్టు సమయానికి పూర్తి కావ్వడంతో పాటు ఇతర పథకాలను కూడా నిర్ణీత సమయం లోపు అమలు చేసే పరిస్థితిని తీసుకువచ్చాం. అలాగే ఉజ్జ్వల పథకాన్ని పూర్తి చేసే దిశగా మేం అడుగులు వేస్తున్నాం. పేద మహిళల్ని పొగ పొయ్యిల బారి నుండి తప్పించే కార్యక్రమాన్ని నిర్ణీత సమయాని కంటే ముందే పూర్తి చేయబోతున్నాం.
2019 నాటికి 5 కోట్ల పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లను అందించాలనేది మా లక్ష్యం. ఇంతవరకూ ఈ పథకం ద్వారా 3.3 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. కానీ ఈ బడ్జెట్ లో 8 కోట్ల మంది పేద మహిళలకు ఉజ్జ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
స్నేహితులారా,
2014 కంటే ముందు పది సంవత్సరాల పాటు మన యువత ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ దేశ యువత తనను తాను నిరూపించుకోవాలని చూసింది. ఒక యువకుడు బ్యాంకు దగ్గరకు వెళ్లి రుణం కావాలని అడిగితే బ్యాంకు గ్యారంటీ కావాలని అడిగారు. కానీ మేం ముద్రా పథకం కింద ఈ నియమాన్ని తొలగించాం. బ్యాంకు గ్యారంటీ లేకుండా చేశాం. ఈ పథకం కింద గత మూడు సంవత్సరాల్లో మూడు కోట్ల మంది నూతన పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. వారు తమ సొంత ఉపాధి పనిని ప్రారంభించారు. వారు ఇప్పుడు సొంత వ్యాపారాలను చేసుకుంటున్నారు. ఈ బడ్జెట్ లో ముద్ర పథకం కింద స్వతంత్రోపాధి ని పొందాలనుకునే వారికి 3 లక్షల కోట్ల రూపాయల విలువైన రుణాలను అందించాలని నిర్ణయించాం. అంతే కాకుండా స్టాండ్- అప్ ఇండియా, స్టార్ట్- అప్ ఇండియా, స్కిల్ ఇండియా పథకాల కింద దేశ యువతను సాధికారిత దిశగా పయనింప చేస్తున్నాం. అంతే కాదు ప్రభుత్వం కార్మిక చట్టాలలో సంస్కరణలు తెస్తోంది. శ్రమయేవ జయతే నినాదాన్ని అనుసరించడం ద్వారా పనులను సులభతరం చేయడం జరుగుతోంది.
కార్మిక చట్టాల ప్రకారం గతంలో ప్రతి పరిశ్రమలోను యాభై రిజిస్టర్లను నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు ఐదు రిజిస్టర్లను నిర్వహిస్తే సరిపోతుంది. శ్రమ్ సువిధ పోర్టల్ ద్వారా ఇంటర్ నెట్ సౌకర్యాన్ని ఆధారం చేసుకొని విధి విధానాలను రూపకల్పన చేయడం జరుగుతోంది. ఇప్పుడు మన దేశంలో ఒక కంపెనీని స్థాపించాలంటే ఒక రోజులో ఆ పని చేయవచ్చు. గతంలో ఒక వారం పట్టేది. ఈ సంస్కరణలన్నీ దేశంలోని యువతీయువకులకు, చిన్న తరహా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తున్నాయి.
స్నేహితులారా,
ఎమ్ఎస్ఎమ్ఇ రంగం మన పరిశ్రమలకు వెన్నెముక వంటిది. అందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ బడ్జెట్ లో ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో భారీ స్థాయిలో ఉపశమన చర్యలు చేపట్టాం. 250 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీలకు ఆదాయపన్నులో 25 శాతం తగ్గింపును ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయం కారణంగా దాదాపు 99 శాతం కంపెనీలు లబ్ధి పొందుతాయి. జిఎస్ టిని ప్రవేశపెట్టిన తర్వాత ఎమ్ఎస్ఎమ్ఇ కంపెనీలను క్రమబద్దీకరించడం జరిగింది. దీని కారణంగా ఈ కంపెనీలకు రుణాలను అందించే కంపెనీల నుండి రుణాలు లభిస్తున్నాయి. అన్ని రంగాలలోని నూతన ఉద్యోగులకు మూడు సంవత్సరాలపాటు ప్రభుత్వం 12 శాతం ఇపిఎఫ్ చెల్లిస్తుంది. ఆదాయ పన్ను చట్టం కింద కొత్త ఉద్యోగులకు చెల్లించే వేతనాలలో 30 శాతం అదనపు మినహాయింపును ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో పారదర్శకత కోసం, అవినీతిని లేకుండా చేయడం కోసం దేశ వ్యాప్తంగా ఆదాయపు పన్ను కు ఎలక్ట్రానిక్ మదింపును ప్రవేశపెట్టడం జరుగుతోంది. మహిళా ఉద్యోగులు మొదటి మూడు సంవత్సరాలకుగాను ఇపిఎఫ్ కు చెల్లించే మొత్తాన్ని 8 శాతంగా నిర్ణయించడం జరిగింది. ఇది గతంలో 12 శాతంగా ఉండేది. మాతృత్వ సెలవుల్ని 12 వారాల నుండి 26 వారాలకు పెంచడం జరిగింది. అంతే కాదు కార్యాలయాలలో శిశు సంరక్షణ నిలయాల ఏర్పాటు, ఇంకా ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. ఇటువంటి అన్ని చర్యల కారణంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కు కూడా బలమైన మద్దతు లభించగలదు.
స్నేహితులారా,
మేం అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు సాధికారితను కల్పిస్తున్నాయి. అయితే నల్లధనం, అవినీతి ల కారణంగా పేదవారికి చాలా నష్టం జరుగుతోంది. నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
స్నేహితులారా,
ఈ రోజు, ఈ వేదిక మీది నుండి మన దేశ వ్యాపార వర్గాలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వారు దేశంలో ఆర్ధికపరమైన ఏకత్వానికి సంబంధించిన జిఎస్ టి కి ఆమోదం తెలిపారు. అంతే కాదు, దీనిని తమ వ్యాపార సంస్కృతిలో భాగం చేసుకున్నారు. దేశంలో ఆర్ధికపరమైన పారదర్శకతను తేవడానికిగాను ఇన్ సోల్వెన్సి అండ్ బ్యాంక్ రప్టసి కోడ్ ను రూపొందించి ఈ విషయంలో ఒక పెద్ద ముందడుగు వేశాం.
అంతర్జాతీయ ఒప్పందాల కారణంగా చాలా సంవత్సరాలుగా ఇలాంటి కోడ్ ను దేశంలో ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉండేది. ఈ సమస్యను మా ప్రభుత్వం పరిష్కరించగలిగింది.
స్నేహితులారా,
గత మూడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక అసాధారణమైన ఆర్ధిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. వీటి కారణంగా వ్యాపారం చేయడానికి వీలు కల్పించే విధానాలు సరళీకృతం అయ్యాయి. ప్రపంచ బ్యాంకు రూపొందించిన డూయింగ్ బిజినెస్ నివేదికలో పొందుపరచిన 190 దేశాల్లో భారతదేశం వందో స్థానాన్ని పొందడానికి ఈ సంస్కరణలే కారణం. 42 ర్యాంకులను దాటి వందో స్థానానికి చేరుకోవడం జరిగింది. మరెన్నో రేటింగుల విషయంలో భారతదేశం యొక్క స్థానం మెరుగైంది. ప్రపంచ ఆర్ధిక వేదిక ప్రచురించే ప్రపంచ స్పర్ధ సూచీ, మూడీ రేటింగు లలో భారతదేశం స్థానం మెరుగైంది. ‘స్థిరమైన’ స్థానం నుండి ‘ధనాత్మక’ స్థాయికి చేరినట్టుగా 2017 నవంబర్ నాటి మూడీజ్ రేటింగు పేర్కొంది. మేం చేపట్టిన విధానాల కారణంగా ద్రవ్యోల్బణం 5 శాతానికి తక్కువగానే నమోదవుతోంది. ఇప్పుడు మన దేశం దగ్గర 418 బిలియన్ అమెరికా డాలర్ల విదేశీ మారకద్రవ్యం నిలువ వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని తీసుకుంటే అనేక నూతన రంగాలు వంద శాతం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. ఆటోమొబైల్స్, వస్త్రాలు, పర్యాటకం, ఓడరేవులు, రోడ్లు మరియు హైవేల వంటి రంగాలలోకి ఈ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో చాలా మంది భారతదేశానికి ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2016-17లో భారతదేశం 60 బిలియన్ అమెరికా డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించగలిగింది. ఆర్ధిక వృద్ది విషయంలో ఉజ్వలమైన శక్తిగా భారతదేశాన్ని ప్రపంచం గుర్తించింది.
సులభతర వాణిజ్య నిర్వహణ నివేదికను తీసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో అసమ్ మొదటి స్థానంలో వుండడం సంతోషదాయకం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వ ప్రతిభ కారణంగా అసమ్ తన ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరుచుకొని పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో దేశంలోనే ఉత్తమమైన రాష్ట్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
స్నేహితులారా,
ఈ రోజున మన ప్రాధాన్యం అంతా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల పైనే. ఈ రంగంలో వచ్చే సంవత్సరం మనం 6 లక్షల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టబోతున్నాం. జాతీయ రహదారుల విషయంలో ఈ సంవత్సరం 9 వేల కిలోమీటర్ల పొడవును దాటబోతున్నాం. భారత్ మాలా ప్రాజెక్టు లో భాగంగా 5.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 35 వేల కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసుకుంటున్నాం. 2018-19 లో రైల్వే రంగంలో 1.48 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉండబోతున్నాయి. రాబోయే సంవత్సరాలలో 600 ప్రధానమైన రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ పెట్టుబడుల నిర్ణయాల కారణంగా అభివృద్ధి వేగవంతం అవుతుంది. అంతే కాదు, రాబోయే సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
స్నేహితులారా,
ఈ రోజు మరొక అంశాన్ని చర్చించాలని అనుకుంటున్నాను. ఈ నేల కన్నబిడ్డ భూపేన్ హజారికా గారు 13 ఏళ్ల ప్రాయంలోనే ఒక కవితను రచించారు. ఆయన ఈ కవిత లిఖించే కాలంలో మన దేశంలో బ్రిటిష్ పాలన నడుస్తోంది. ఈ ప్రాంతమంతా బానిసత్వంలో మగ్గుతుండేది. భూపేన్ గారు రాసింది ఇదీ:
‘Ognijugau Firingauti
Notun Aukhum Gaudheem
Har Bauharar Harbasva
Punaur Firai Aneem
Notun Aukham Gaudheem’
అగ్నిలా ఎగిసిపడుతున్న ఈ కాలంలో నేను ఒక నిప్పురవ్వను
నేను ఒక నూతన అసమ్ ను ఆవిష్కరిస్తాను
పీడనకు గురైన వారు, పక్కన పెట్టబడిన వారు
ఏమేమి కోల్పోయారో.. వాటిని తిరిగి తెస్తాను
ఒక నూతన అసమ్ ను ఆవిష్కరిస్తాను.. అని ఈ కవిత భావం.
దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన లక్షలాది సాహస స్వాతంత్ర్య పోరాట యోధులు కన్న కలల్ని సాకారం చేసే ఉమ్మడి బాధ్యత మన మీద వుంది. ఈ బాధ్యతను నెరవేర్చడానికిగాను, 2022 నాటికి నూతన భారతదేశ కలను సాకారం చేసుకోవడానికిగాను మనం ఒక ఘనమైన ప్రతిజ్ఞను చేశాం. ఘనమైన తీర్మానాలను చేసుకొని విజయాన్ని సాధించే ప్రయాణంలో పథకాలను తయారు చేసుకున్నాం. అమలు చేస్తున్నాం. ఈశాన్య భారతదేశ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వాటిని అవగాహన చేసుకొని ఈ పని చేస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాలైన 8 రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా భావిస్తాం. అందం, సౌభాగ్యానికి ప్రతీకలు అష్ట లక్ష్ములు. ఈ రాష్ట్రాలు ఎనిమిది మన దేశ అభివృద్ధిలో ప్రధానమైనవి. ఈ రాష్ట్రాలకు అవసరమైన మద్దతు ఇవ్వడమంటే దేశ అభివృద్ధికి మద్దతివ్వడమే. అందుకే మా ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా రంగం ద్వారా మార్పును సాధించే విధానానికి ప్రాధాన్యమిస్తోంది. ప్రాథమిక సౌకర్యాల రంగంలో పెడుతున్న పెట్టుబడుల కారణంగా ఈ ప్రాంత రూపురేఖలే మారబోతున్నాయి.
గత మూడు సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని రైల్వేల రంగంలో ప్రతి ఏడాది సగటున 3,500 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టడం జరిగింది. 47 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈశాన్య రాష్ట్రాల్లో 15 నూతన రైల్వే లైన్ లను నిర్మించడం జరుగుతోంది.
రాబోయే రోజుల్లో ఎప్పుడైతే అగర్తలా- అకావురా రైల్వే లైను నిర్మాణ పని పూర్తి అవుతుందో, త్రిపుర, బాంగ్లాదేశ్ ల మధ్య రైలుమార్గ అనుసంధానం ఏర్పాటవుతుందో అప్పుడు ఈ ప్రాంతమంతా లబ్ధి పొందుతుంది. 33 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 4 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి తోడుగా రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలలో రోడ్లను, ప్రధాన రహదారులను నిర్మించడానికిగాను 90 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయబోతున్నది.
సోదర సోదరీమణులారా,
అటల్ గారు ప్రధానిగా పని చేసిన సమయంలో ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం మొదలైంది. ఇది 2022 నాటికి పూర్తి కావాల్సిన పథకం. ఈ పథకం పూర్తి కావాల్సిన నిర్ణీత సమయాన్ని మేం తగ్గించాం. 2019 నాటికే పూర్తి చేయాలని గడువు పెట్టాం. ప్రధాని గ్రామీణ రహదారుల పథకం లో భాగంగా ఈ బడ్జెట్ లో కేవలం గ్రామాలను కలిపే రోడ్లను నిర్మించాలని నిర్ణయించలేదు. గ్రామాల్లోని పెద్ద పాఠశాలల్ని, ఆసుపత్రులను, విపణులను కలపడానికి వీలుగా కూడా రోడ్లను నిర్మించాలని సంకల్పించాం. ఇక విద్యుత్తు రంగాన్ని తీసుకుంటే ఈ రంగంలో రూ. 10 వేల కోట్ల రూపాయల విలువైన పథకాలను ప్రారంభించాం. వీటి ద్వారా విద్యుత్తు రంగాన్ని, రాష్ట్రాల మధ్య విద్యుత్తు సరఫరాను, విద్యుత్త ప్రసారాన్ని బలోపేతం చేస్తున్నాం. గువాహాటీ లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని త్వరలో నిర్మించబోతున్నాం. దీని ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ముఖ్యంగా అసమ్ కు, ఆసియాన్ దేశాలకు మధ్య రాకపోకలు బలపడతాయి. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యమివ్వడం జరుగుతోంది. ఈ ప్రాంతంలోని 19 విమానాశ్రయాలను, హెలిపాడ్ లను దేశంలోని ఇతర నగరాలతో అనుసంధించే పని పూర్తి అయింది. వీటిలో ఐదు అసమ్ లోనే ఉన్నాయి.
160 దేశాల పర్యాటకులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాన్ని కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.
స్నేహితులారా,
గువాహాటీ లో 1,100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధుల వ్యయంతో నూతన ఎఐఐఎమ్ఎస్ ను నిర్మించే పనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాదు ఈశాన్య రాష్ట్రాలతో జాతీయ గ్రిడ్‌ను అనుసంధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 3,000 కోట్ల రూపాయల వ్యయంతో గువాహాటీ వరకు గ్యాస్ గొట్టపు మార్గాన్ని వేసే ప్రాజెక్టు ను జిఎఐఎల్ మంజూరు చేసింది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఓ నూతన పథకానికి ఆమోదం తెలిపింది. దీని పేరు ఈశాన్య రాష్ట్రాల ప్రత్యే మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం. ఈ పథకం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పది శాతం నిధులను అందించి మౌలిక సదుపాయాలకు సంబంధించిన పథకాలను పూర్తి చేయడానికి సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్టే ఈ పెట్టుబడుల కారణంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. అంతే కాదు ఈ ప్రాంతం లోని యువతీయువకులకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయి.
స్నేహితులారా,
అసమ్ లో చాలా తక్కువ సమయంలో వ్యాపార వాణిజ్య వర్గాలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు అసమ్ ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోలోవాల్ కు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలను తీసుకొంది. రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పే వారికి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే వారికి పన్ను ప్రోత్సాహకాలను ఇస్తోంది అసమ్. రాష్ట్రంలో నూతన సమాచార సాంకేతిక విధానాన్ని, నూతన స్టార్ట్- అప్ విధానాన్ని, నూతన క్రీడా విధానాన్ని, నూతన చక్కెర విధానాన్ని, నూతన సౌర ఇంధన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. అంతే కాదు ఆసియాన్ దేశాలతో వాణిజ్యం కోసం గువాహాటీ ని వ్యాపార కూడలిగా అభివృద్ధి చేస్తున్నారు. అంతే కాదు గువాహాటీ ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం జరుగుతోంది.
ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసినందుకుగాను అసమ్ ప్రజలకు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు నా అభినందనలు. ఈ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైనందుకు ఆసియాన్ దేశాల, బిబిఐఎన్ దేశాల ప్రతినిధులకు నా కృతజ్ఞతలు. ఈ సదస్సు ఇప్పుడే మొదలవుతోంది. మీతో భారతదేశానికి గల వేల సంవత్సరాల సంబంధాలకు ఈ సదస్సు ఒక నూతన అధ్యాయాన్ని జోడిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు, అసమ్ ప్రజలకు మరోసారి నా శుభాభినందనలు.
Apuna Lokok Bahut Bahut Dhanyabad.
మీ కందరికీ అనేకానేక కృతజ్ఞతలు.