మంత్రివర్గంలో నా సహచరులైన శ్రీ థావర్ చంద్ గెహ్ లోత్ గారు,
శ్రీ విజయ్ సాంప్లా గారు,
శ్రీ రాందాస్ అఠావలే గారు,
శ్రీ క్రిషన్ పాల్ గారు,
శ్రీ విజయ్ గోయల్ గారు,
సామాజిక న్యాయం- సాధికారిత శాఖ కార్యదర్శి లతా కృష్ణారావ్ గారు;
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు;
సోదరులు మరియు సోదరీమణులారా,
డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశ ప్రజలకు అంకితం చేయడం నాకు దక్కిన అదృష్టం. ఈ అంతర్జాతీయ కేంద్రం కోసం 2015 ఏప్రిల్ లో నా చేతుల మీదుగానే పునాదిరాయి వేయడం నా సంతోషాన్ని రెట్టింపు చేస్తోంది. ఇంత గొప్ప అంతర్జాతీయ కేంద్రం అత్యంత స్వల్ప సమయంలోనే గాక నిర్దేశిత వ్యవధి కన్నా ముందుగానే పూర్తి అయింది. ఈ కేంద్రం నిర్మాణంలో పాలుపంచుకొన్న ప్రతి శాఖకూ నా అభినందనలు.
బాబాసాహెబ్ ప్రబోధాలను విస్తరింపజేయడంలో ఈ కేంద్రం గొప్ప స్ఫూర్తిని అందిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.
ఇక్కడి సామాజిక- ఆర్థిక పరివర్తన కేంద్రం కూడా డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో భాగంగా ఉంటుంది. అలాగే సామాజిక, ఆర్థిక అంశాల పరిశోధన లోనూ ఈ కేంద్రం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
‘అందరి ఉన్నతి కోసం అందరి తోడ్పాటుతో కృషి’ లేదా సమ్మిళిత అభివృద్ధి మంత్రాన్ని జోడించడం ద్వారా ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టి సారించడం ఎలాగన్నది నేర్పే వేదిక గానూ ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఈ కేంద్రం మేధోనిలయంగా సైతం తోడ్పడుతుంది.
మిత్రులారా,
బాబాసాహెబ్ దార్శనికతను అవగాహన చేసుకోవడం కోసం ఇక్కడకు వచ్చే కొత్త తరానికి ఓ వరం అవుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మన దేశంలో ఆయా కాలాల్లో అనేక మంది మహానుభావులు జన్మించారు. సామాజిక సంస్కరణలకు ప్రతీకలు గానే కాక దేశ భవిష్యత్తు నిర్మాతలు గానూ, జాతి ఆలోచన ధోరణిని మలచడం లోనూ ప్రధాన పాత్రను పోషించారు. బాబాసాహెబ్ ఆలోచలను, జాతి నిర్మాణంలో ఆయన అందించిన సేవలను తుడిచిపెట్టేసేందుకు అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు జరిగినా ఏ ఒక్కరూ ఆ ఘనతను ప్రజల హృదయాలలో నుండి చెరిపివేయలేకపోయారన్న వాస్తవమే ఆయన సిద్ధాంతం యొక్క శక్తికి నిదర్శనం.
ఈ కుట్ర వెనుక గల ఓ కుటుంబం కన్నా బాబాసాహెబ్ ఆలోచనలతోనే నేటి తరం ప్రభావితులు అవుతారని నేను చెబుతున్న మాట అవాస్తవం కాదని భావిస్తాను. దేశ నిర్మాణానికి బాబాసాహెబ్ అందించిన సేవలకుగాను ఆయనకు మనం ఎంతగానో రుణపడి ఉన్నాం. దేశంలో మరింత మందికి.. ప్రత్యేకించి యువతరానికి, బాబాసాహెబ్ ఆలోచనలను విస్తరింపజేయడానికి, వాటిపై అధ్యయనం దిశగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఆ మేరకు బాబాసాహెబ్ జీవితంతో ముడిపడిన ప్రదేశాలను సందర్శనీయ స్థలాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఢిల్లీ లోని అలీపూర్ ప్రాంతంలో బాబాసాహెబ్ కన్నుమూసిన భవనంలో డాక్టర్ ఆంబేడ్కర్ జాతీయ స్మారకం నిర్మాణాన్ని చేపట్టాం. అలాగే ఆ మహనీయుడు జన్మించిన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని మహూ గ్రామాన్ని యాత్రా స్థలంగా తీర్చిదిద్దుతున్నాం. లండన్ నగరంలో బాబాసాహెబ్ నివసించిన భవనాన్ని మహారాష్ట్ర లోని బిజెపి ప్రభుత్వం కొనుగోలు చేసి, దానిని ఓ స్మారకంగా రూపుదిద్దింది. అంతేకాక ముంబయి లోని ఇందు మిల్లు లో ఆంబేడ్కర్ స్మారకాన్ని నిర్మిస్తోంది. నాగ్ పుర్ లోని దీక్షాభూమి ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ ‘పంచతీర్థాలు’ లేదా ఐదు దర్శనీయ కేంద్రాలు ఒక విధంగా నేటి తరం తరఫున బాబాసాహెబ్‌కు నివాళి వంటివి. అంతేకాదు.. ఆరో దర్శనీయ స్థలంగా ఒక వర్చువల్ వరల్డ్ ను కూడా అభివృద్ధి చేశాం. ఈ కేంద్రం దేశానికి సాధికారితను సిద్ధింపజేస్తూ డిజిటల్ విధానాన్ని ముందుకు తీసుకుపోతోంది. అదే ‘భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ’ అంటే.. ‘భీమ్’ (BHIM)ను యాప్ రూపంలో బాబాసాహెబ్ ఆర్థిక దార్శనికతకు నివాళిగా ప్రభుత్వం నిరుడు ప్రారంభించిన యాప్. పేదలు, దళితులు, వెనుకబడిన, అణగారినవర్గాల ప్రజల పాలిట భీమ్ యాప్ ఓ వరంగా రుజువైంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
బాబాసాహెబ్ తన జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలను, ఘర్షణలను ఎదుర్కొన్నారో మనందరికీ తెలుసు. కానీ, వీటితో పాటు ఆయన జీవితంలో స్ఫూర్తిదాయక అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. నిరాశ నిస్పృహల మధ్య కూడా వాటన్నింటికీ అతీతంగా సకల దురాచారాలకు దూరంగా, సార్వజనీనంగా ఉండే భారతీయ సమాజం కోసం ఆయన కలగన్నారు. రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946 డిసెంబరు 17న జరిగిన కొద్ది రోజులకు ఆయన ఇలా చెప్పారు
‘‘ఈ గొప్ప దేశపు భవిష్యత్తు వికాసం, సామాజిక-రాజకీయ-ఆర్థిక రంగాల అత్యుత్మ నిర్మాణంపై నాకెలాంటి సందేహాలూ లేవు. ఇవాళ మనలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విభజన ఉండవచ్చు. కానీ, అనతికాలంలోనే అన్ని పరిస్థితుల నడుమ మనమంతా ఏకం కాకుండా ప్రపంచంలో ఏ శక్తీ మనలను ఆపలేదన్నది నా ప్రగాఢ విశ్వాసం. మన కులాలు, తెగలు అన్నిటితో కలిపి ఏదో ఒక రూపంలో మనమంతా ఏకత్వానికి ప్రతీకలు కాగలమని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకాడటం లేదు. అన్ని సమ్మేళనాల సహితంగా మనమంతా భిన్నత్వంలో ఏకత్వంవైపు నడవగల సామర్థ్యం మనకుందని మన నిర్వాహక శైలి స్పష్టం చేస్తోంది.’’ ఇవన్నీ బాబాసాహెబ్ ఆంబేడ్కర్ మాటలే. ఆ మాటల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం. ఆ మాటల్లో లేశమైనా నిరాశ నిస్పృహల ఛాయలు లేవు! ఈ దేశపు సామాజిక దురాచారాలకు గురైన వ్యక్తిలో సంపూర్ణ ఆశాభావం ఎంత అద్భుతం.
సోదరులు మరియు సోదరీమణులారా,
స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్నేళ్లయినా, రాజ్యాంగ నిర్మాణం పూర్తి అయిన నాటి నుండి నేటికీ బాబాసాహెబ్ కలలను నిజం చేయలేకపోయామన్న వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. కొందరు వ్యక్తులు వారి జన్మభూమి కన్నా వారు జన్మించిన కులానికే ప్రాముఖ్యం ఇస్తారు. అయితే, ఇటువంటి సామాజిక దురాచారాలను నిర్మూలించగల సామర్థ్యం నేటి తరానికి ఉందని నేను విశ్వసిస్తున్నాను. ప్రధానంగా 15, 20 ఏళ్ల నుండీ చోటు చేసుకొంటున్న మార్పులు కేవలం కొత్త తరం కృషి ఫలితం. కులం ప్రాతిపదికన దేశం విచ్ఛిన్నం అవుతోందని, ఇటువంటి విభజనల వల్ల ప్రగతి ఆశించిన వేగంతో ముందుకు సాగదని వారు అర్థం చేసుకున్నారు. అందుకే ‘న్యూ ఇండియా’ కులదాస్యం నుండి విముక్తం కావడం గురించి నేను మాట్లాడినపుడల్లా యువతపై అపార నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాను. బాబాసాహెబ్ స్వప్నాన్ని సాకారం చేయగల శక్తి నేటి యువతరంలో ఉంది.
మిత్రులారా,
మన దేశం గణతంత్రంగా రూపుదిద్దుకొన్న 1950 లో బాబాసాహెబ్ ఇలా అన్నారు-
‘‘మనం రాజకీయ ప్రజాస్వామ్యంతో మాత్రమే సంతృప్తి పడిపోకూడదు. ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చుకోవాలి. సామాజిక ప్రజాస్వామ్య పునాది లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదు.’’
సామాజిక ప్రజాస్వామ్యం అంటే, భారతదేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం సిద్ధింపజేసే మంత్రమే. ఈ సమానత్వమన్నది కేవలం హక్కులకు పరిమితం కాదు.. జీవన విధానానికి కూడా వర్తిస్తుంది. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన చాలా సంవత్సరాల తరువాత కూడా లక్షలాది ప్రజల జీవితాలలో సమానత్వం కానరావడం లేదు. చివరకు విద్యుత్తు సదుపాయం, మంచినీటి సౌకర్యం, ఓ చిన్న ఇల్లు, జీవితానికి బీమా ల వంటి కనీస వసతులు అయినా అందుబాటులో లేవు.
ఈ నేపథ్యంలో మూడు, మూడున్నర సంవత్సరాలుగా మా ప్రభుత్వ పని సంస్కృతిని మీరు నిశితంగా పరిశీలించినట్లయితే.. బాబాసాహెబ్ కలగన్నటువంటి సామాజిక ప్రజాస్వామ్య సాకారానికి మేం చేస్తున్న ప్రయత్నాలు మీకు అర్థం అవుతాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రవేశపెడుతున్న పథకాలు సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాయని అవగతమవుతుంది. ‘జన్ ధన్ యోజన’ను గమనిస్తే- దేశం లోని లక్షలాది పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థతో సంధాన హక్కును అది కల్పించింది. బ్యాంకు ఖాతాలు, డెబిట్ కార్డులు ఉన్న వారితో పేదలను సమానులను చేసింది.
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం 30 కోట్ల మందికి పైగా పేదలకు బ్యాంకు ఖాతాలను తెరిచే వీలు కల్పించింది. వీరిలో 23 కోట్ల మందికిపైగా ‘రూపే’ కార్డులను అందజేసింది. ఈ రూపే డెబిట్ కార్డులతో ఏటీఎంల నుండి సొమ్ము తీసుకోవడం కోసం ఇతరులతో పాటు వరుసలో నిలుచునే అవకాశం వారికి లభించడాన్ని కూడా ఒక విధమైన సమానత్వ సాధనగా భావించవచ్చు. అంతకు ముందు ఇటువంటి దృశ్యాన్ని ఊహించడానికైనా వారు వెనుకాడే వారు.
ప్రతి 4 నెలలకో, లేదా 5 నెలలకో సొంత వూరికి వెళ్లి వచ్చే అవకాశం మీలో ఎంతమందికి లభించింది ? చాలా కాలం నుండీ గ్రామానికి వెళ్లని వారు ఇప్పుడు ఒకసారి వెళ్లి రావాలని నేను సూచిస్తున్నాను. మీ ఊరికి వెళ్లి గ్రామస్తులలో ఎవరినైనా ‘ఉజ్జ్వల’ పథకాన్ని గురించి అడిగి చూడండి. కట్టెల పొయ్యిలు, గ్యాస్ కనెక్షన్ లు ఉన్న కుటుంబాల మధ్య అంతరాన్ని ఈ పథకం ఎలా నిర్మూలించిందో మీకు స్పష్టమవుతుంది. సామాజిక వివక్షను అంతం చేయడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదో ప్రధాన నిదర్శనం. ఇప్పుడు పేద కుటుంబాలు కూడా గ్యాస్ పొయ్యిలమీద తమ ఆహారాన్ని తయారుచేసుకోగలుగుతున్నాయి. నేడు పేద మహిళలు కట్టెల పొయ్యి పొగతో జీవనం గడపాల్సిన అవసరం లేదు.
తమ గ్రామాలతో మరింతగా సంబంధాలు కలిగివున్నవారికి ఈ వ్యత్యాసం చక్కగా అర్థమవుతుంది. అలాగే మీరు స్వగ్రామానికి వెళ్లినప్పుడు మరో తేడాను కూడా గమనించవచ్చు. అదేమిటంటే… ‘స్వచ్ఛ భారత్ కార్యక్రమం’ గ్రామం లోని మహిళలందరి మధ్య సమానత్వాన్ని సృష్టించిన సంగతి. కొన్ని ఇళ్లలో మరుగుదొడ్లు ఉండడం, కొన్ని గృహాలలో లేకపోవడం అనేది ఒక విభజనకు కారణమవుతుంది. ఇది గ్రామంలోని మహిళల ఆరోగ్యానికే కాక భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తుంది. ఇంతకుముందు గ్రామీణ పారిశుధ్యం 40 శాతానికి మాత్రమే పరిమితం కాగా, ఇప్పుడు స్వచ్ఛ భారత్ వల్ల 70 శాతానికి పెరిగింది.
సామాజిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కొన్ని బీమా పథకాలను ముందుకు తెచ్చింది. దీంతో ఇప్పటివరకూ 18 కోట్ల మందికి పైగా పేదలు ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా’ పథకం, ‘జీవన్ జ్యోతి’ బీమా పథకాలలో చేరారు. ఈ పథకాల ద్వారా నెలకు కేవలం రూపాయి రుసుముతో ప్రమాద బీమా, రోజుకు 90 పైసలతో జీవిత బీమా సదుపాయాలను పొందవచ్చు.
ఈ పథకాలలో చేరిన పేదలకు నేటి వరకు దాదాపు రూ.1800 కోట్ల మేర బీమా ప్రయోజనం లభించిందని తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. గ్రామీణ పేదలు నేడు ఆందోళనరహిత జీవనం గడపడాన్ని ఇప్పుడొకసారి ఊహించి చూడండి.
సోదరులు మరియు సోదరీమణులారా, బాబాసాహెబ్ ఆశయ సారాంశం మనకు వివిధ రూపాల్లో కనిపిస్తుంది:
అందరికీ సమాన గౌరవం;
అందరికీ సమాన చట్టం;
అందరికీ సమాన హక్కులు;
అందరికీ సమాన మానవీయ గౌరవం, సమానావకాశాలు.
ఇటువంటి చాలా అంశాలను బాబాసాహెబ్ వారి జీవిత కాలంలో లేవనెత్తారు. భారతదేశంలో ప్రభుత్వాలు భిన్న కులాల మధ్య ఎలాంటి వివక్షను చూపకుండా రాజ్యాంగాన్ని అనుసరిస్తాయని ఆయన సదా ఆశించారు. తదనుగుణంగా ఎటువంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి స్వరూపాన్ని ప్రతి పథకంలోనూ మీరు సంగ్రహించవచ్చు. ఇటీవలే ‘ప్రధాన మంత్రి సహజ్ హర్ ఘర్ బిజ్లీ యోజన’ లేదా సౌభాగ్య యోజన పేరిట ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు దాటుతున్నా నేటికీ 18వ శతాబ్దం నాటి అంధకారంలో మగ్గాల్సి వస్తున్న 4 కోట్ల కుటుంబాలకు ఈ పథకంలో భాగంగా ఉచిత విద్యుత్ కనెక్షన్ కల్పించబడుతుంది. ఏడు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న ఈ అసమానతకు ‘సౌభాగ్య యోజన’ స్వస్తి పలకడం ఖాయం.
ఇక అసమానతను అంతం చేసే దిశగా ప్రవేశపెట్టిన ఇటువంటి మరో పథకం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’. చిన్నదో, పెద్దదో ఒక ఇల్లు ఉండాలన్నది అత్యంత ప్రధానం. కానీ, దేశంలో నేటికీ లక్షలాది ప్రజలు సొంత ఇంటికి నోచుకోలేదు. అందుకే ప్రభుత్వం ప్రతి గ్రామీణ, పట్టణ పేదకూ 2022 కల్లా ఓ సొంత గూడును అందించాలని తలపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఈ పథకంలో భాగంగా స్వల్పాదాయ, మధ్యాదాయ వర్గాలవారు వడ్డీ రాయితీతో కూడినటువంటి రుణాలను పొందుతున్నారు. ఏ ఒక్కరూ ఇల్లు లేని వారుగా మిగిలిపోకూడదన్న లక్ష్యంతో నివాస సమానత్వం కల్పన దిశగా కృషి చేస్తున్నాం. సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ పథకాలు, కార్యక్రమాలన్నీ నిర్ణీత వేగంతో ముందుకు సాగుతున్నందున నిర్దేశిత గడువులోగా ఇవి పూర్తి అవుతాయి.
ఇవాళ డాక్టర్ ఆంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం ప్రారంభోత్సవమే ప్రభుత్వ పథకాలు అర్ధంతరంగా ఆగిపోవన్న వాస్తవానికి తిరుగులేని నిదర్శనం. నిర్దేశించుకొన్న లక్ష్యాల సాధన కోసం ఈ ప్రభుత్వం తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తోంది. ఇదీ మా పని విధానం.
మేం మా లక్ష్యాలను కేవలం ప్రణాళికలతో అనుసంధానించడంతోనే సరిపెట్టక ఆ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ముందుకు పోతున్నాం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు.. మా పాలన ప్రారంభమైన కొన్ని నెలలకే ఈ దిశగా ప్రస్థానాన్ని మొదలుపెట్టాం. నేను 2014లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ప్రసంగిస్తూ- ఏడాది లోగా దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఇంటి ఆడబిడ్డలకు ప్రత్యేక మరుగుదొడ్లు సిద్ధమవుతాయని ప్రకటించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ మేరకు ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. అంతకుముందు మరుగుదొడ్లు లేని కారణంగా చదువు మానుకొనే బాలికల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఆ పరిస్థితి నుండి మన జీవితాలలో నేడు ఎంత గొప్ప మార్పు చోటుచేసుకొందో అర్థం చేసుకోవచ్చు.
మిత్రులారా,
అలాగే 2015లోనూ ఎర్ర కోట బురుజుల మీద నుండి నేను మరొక ప్రకటన చేశాను. స్వాతంత్ర్యం అనంతరం 70 సంవత్సరాలుగా విద్యుత్తుకు నోచుకోని 18 వేల గ్రామాలను 1000 రోజుల లోపల వెలుగులతో నింపుతామని ఆ సందర్భంగా హామీ ఇచ్చాను. సదరు 1000 రోజులు పూర్తి కావడానికి ఇంకా చాలా నెలలు మిగిలి ఉండగానే, 16 వేల గ్రామాలకు విద్యుత్తు సదుపాయం విస్తరించింది. ఇక మిగిలింది కేవలం 2వేల గ్రామాలే.
ఇక ఇతర పథకాలను పరిశీలిస్తే, రైతులకు ‘భూమి స్వస్థత కార్డుల’ను జారీ చేసే కార్యక్రమాన్ని 2015 ఫిబ్రవరిలో ప్రారంభించాం. దీనిలో భాగంగా 2018 కల్లా దేశంలోని 14 కోట్ల మంది రైతులకు కార్డులను అందజేయాలన్నది మా లక్ష్యం. అయితే, ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా రైతులకు కార్డులు అందజేశాం. అంటే.. లక్ష్యం చేరుకోవడానికి ఇంకెంతో దూరం లేదన్న మాట. అదే విధంగా ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (పిఎమ్ కె ఎస్ వై) కూడా 2015 జూలై లో ప్రారంభమైంది. అర్ధంతరంగా ఆగిపోయి ఎన్నో సంవత్సరాలుగా కునారిల్లుతున్న 99 సేద్యపు నీటిపారుదల ప్రాజెక్టులను ఈ పథకం లో భాగంగా 2019 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించుకొన్నాం. ఆ మేరకు ఇప్పటి దాకా 21 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. వచ్చే సంవత్సరం కల్లా మరో 50కి పైగా పూర్తి అవుతాయి. మిగిలిన వాటి పనుల పురోగతి కూడా లక్ష్యం పరిధిలోనే సాగుతోంది.
దేశంలోని రైతులు వారి పంటలను సులభంగా విక్రయించుకోవడంతో పాటు గిట్టుబాటు ధరను పొందడానికి వీలు కల్పించేలా ‘ఇ- నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ స్కీమ్’ (జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ విపణి పథకం.. e-NAM) ను 2016 ఏప్రిల్ నెలలో ప్రారంభించాం. దేశవ్యాప్తంగా గల 580కిపైగా వ్యవసాయ మార్కెట్ల ఆన్‌లైన్ అనుసంధానం ఈ పథకం లక్ష్యం. కాగా, ఇప్పటి దాకా 470 విపణులు సంధానమయ్యాయి.
ఇంతకుముందు నేను ప్రస్తావించిన ‘ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన’ను గత సంవత్సరం మే నెలలో ప్రారంభించాం. ఈ పథకంలో భాగంగా 2019 కల్లా పేద మహిళలకు 5 కోట్ల గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కేవలం 19 నెలల్లో 3.12 కోట్ల మందికి పైగా మహిళలకు గ్యాస్ కనెక్షన్ లను ఇవ్వగలిగాం.
సోదరులు మరియు సోదరీమణులారా, ఇదీ మా పని విధానం. ఈ క్రమంలోనే బాబాసాహెబ్ దార్శనికతకు అనుగుణంగా పేదలకు సమాన హక్కులను కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ పథకాలన్నిటి అమలులో జాప్యం జరిగితే దాన్ని ‘నేరపూరిత నిర్లక్ష్యం’గా ప్రభుత్వం పరిగణిస్తుంది.
ఇక ఈ కేంద్రం విషయానికి వస్తే.. దీనిని 1992 లో నిర్మించాలని నిర్ణయించారు. కానీ, 23 సంవత్సరాల పాటు ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. మా ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తరువాత దీనికి పునాదిరాయి వేయడంతో పాటు నేడు ప్రారంభోత్సవం కూడా చేశాం. బాబాసాహెబ్ పేరిట ఓట్లు అడిగే రాజకీయ పక్షా లకు బహుశా దీనిని గురించి తెలిసి ఉండకపోవచ్చు కూడా.
మరి, ఇవాళ వాళ్లు బాబాసాహెబ్ బదులు బాబా భోలే (ఈశ్వరుడు)ను గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నట్లుంది. అది చాలునని వాళ్లు బహుశా భావిస్తున్నట్లుంది.
మిత్రులారా, ఈ కేంద్రం నిర్దేశిత వ్యవధి కన్నా ముందే పూర్తి కాగా, అనేక పథకాల గడువును ముందుకు జరిపాం. ఎందుకంటే ప్రణాళికలు వేగం పుంజుకోవడం వల్ల అన్ని పథకాలూ గాడిలోపడ్డాయి. అందుకే పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి అవుతాయన్న భావనతో గడువును తగ్గించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ‘మిషన్ ఇంద్రధనుష్’ గడువును ఇటీవలే రెండు సంవత్సరాల మేర తగ్గించాం. ప్రస్తుతం నడుస్తున్న టీకాల కార్యక్రమంలో చోటు దక్కని ప్రాంతాల్లో లక్షలాది పిల్లలు, గర్భిణులకు ఈ పథకం కింద టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆ మేరకు ఇప్పటిదాకా 2.5 కోట్ల మంది పిల్లలు, 70 లక్షల మంది గర్భిణులకు టీకాలు వేయడం పూర్తి అయింది.
ఈ పథకం లో భాగంగా సంపూర్ణ రోగనిరోధకత కల్పనను 2020 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా మరింత త్వరగా సాధించగల వీలుండటంతో ఆ గడువును 2018కి తగ్గించాం. ఈ లక్ష్యసాధనకు అనువుగా ఇంద్రధనుస్సుతో పాటు ‘సాంద్రీకృత ఇంద్రధనుస్సు’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా 2022 నాటికి ప్రతి గ్రామానికీ రహదారి సంధానం లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఈ పథకం వేగం అందుకొని, పనులు జోరుగా సాగుతున్నందున దీనిని 2019 నాటికే సాకారం చేయాలని ప్రణాళికను సిద్ధం చేశాం.
మిత్రులారా,
ప్రధాన మంత్రి సడక్ యోజనను అటల్ గారు ప్రారంభించారు. కానీ, ఆ తరువాత అనేక సంవత్సరాలు గడచినా అన్ని గ్రామాలూ రహదారులతో సంధానం కాలేదు. ఇదీ 2014 సెప్టెంబరు దాకా కొనసాగిన దు:స్థితి. మేం అధికారంలోకి వచ్చే నాటికి గల పరిస్థితేమిటో ఇప్పుడు చూద్దాం.. ఈ పథకంపై 2014 మే నెలలో నేను సమీక్షించే నాటికి కేవలం 57 శాతం గ్రామాలకు రహదారి సంధానం ఉంది. అయితే, మా నిరంతర కృషి ఫలితంగా మూడు సంవత్సరాల లోపే 80 శాతం గ్రామాలు రహదారులతో అనుసంధానించబడ్డాయి. ఈ ఉత్సాహంతో 100 శాతం లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అత్యంత వేగంగా దూసుకుపోతోంది.
దేశం లోని మారుమూల ప్రాంతాలలో నివసించే దళిత, వెనుకబడిన సోదరులు సోదరీమణులను స్వతంత్రోపాధి దిశగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఆ మేరకు మేం ‘స్టాండప్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రతి బ్యాంకు శాఖ కనీసం ఒక షెడ్యూల్డు కులం లేదా షెడ్యూల్డు తెగ అభ్యర్థికి ఈ పథకం కింద తప్పనిసరిగా సహాయం అందించాలని నిర్ణయించాం.
సోదరులు మరియు సోదరీమణులారా..
ఉపాధికి అర్థం మార్చేసిన ‘ముద్ర పథకం’ లో భాగంగా లబ్ధిదారులలో 60 శాతం దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారేనని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ పథకంలో ఇప్పటిదాకా దాదాపు రూ.9.75 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు కాగా, ఇందులో రూ.4 లక్షల కోట్ల దాకా బ్యాంకు గ్యారంటీ లేనివి కావడం ఈ సందర్భంగా గమనార్హం.
మిత్రులారా,
సామాజిక హక్కులంటే కేవలం మాటలతో సరిపుచ్చేవి కావు.. అది ప్రభుత్వ నిబద్ధత. నేను మాట్లాడుతున్న ‘న్యూ ఇండియా’ కూడా ‘అందరికీ సమానావకాశాలు, సమాన హక్కులు, కులవ్యవస్థ విముక్త భారతం’ లక్ష్యంగా బాబాసాహెబ్ స్వప్నించిన భారతదేశమే. అందుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞాన శక్తితో, ‘అందరి ఉన్నతి కోసం అందరి తోడ్పాటుతో కృషి’ (సబ్ కా సాథ్ సబ్ కా వికాస్) భావనను అందిపుచ్చుకొని సమ్మిళిత అభివృద్ధి వైపు దేశం పురోగమిస్తోంది.
రండి.. బాబాసాహెబ్ కలలను సాకారం చేయడం కోసం ప్రతినబూనుదాం. ఈ సంకల్పాలన్నిటినీ 2022 కల్లానెరవేర్చుకొనేటట్టు తగిన శక్తిని, ప్రేరణను బాబాసాహెబ్ మనకు అందించాలని ఆకాంక్షిద్దాం. ఈ శుభకామనతో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు!!
జయ్ భీమ్!
జయ్ భీమ్!
జయ్ భీమ్!