భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్న ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ నిర్వహణలోని 14వ సిఒపి సమావేశానికి మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశం భారత్ లో నిర్వహిస్తున్నందుకు ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఇబ్రహీం జియోకు ధన్యవాదాలు. సారవంతమైన భూములను నిర్మూలించడాన్ని తగ్గించడం లక్ష్యంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరాటానికి పలువురు ఎంతగా కట్టుబడ్డారో తెలిపేందుకు ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో జరిగిన రిజిస్ట్రేషన్లే తార్కాణం.
రెండు సంవత్సరాల కాలానికి సహాధ్యక్ష పదవి చేపడుతున్నందుకు ఈ కార్యక్రమానికి తన వంతు కృషి చేయడానికి భారత్ ఆతృతగా ఎదురుచూస్తోంది.
మిత్రులారా,
ఎన్నో తరాలుగా భారతదేశంలో భూమికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతీయ సంస్కృతిలో భూమిని పవిత్రమైనదిగా భావిస్తారు. భూమాతగా ఆరాధిస్తారు.
ఉదయం లేస్తూనే నేలపై కాలు పెట్టే ముందు
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే
విష్ణుపత్నీనమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
అని ప్రార్థన చేసి క్షమాపణ కోరతాం.
మిత్రులారా,
వాతావరణం, పర్యావరణం రెండూ జీవవైవిధ్యం పైన, భూమి పైన ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచం వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావానికి లోనయిందని అందరూ అంగీకరించే విషయమే. భూమి, మొక్కలు, జంతుజాలం వంటివి నష్టపోవడంలోనే ఇది కనిపిస్తుంది. అవన్నీ అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పుల వల్ల సముద్రమట్టాలు పెరిగిపోయి భూములు తరిగిపోతున్నాయి. ఉష్ణతాపం వల్ల అలలు ఎగిసిపడి, సమతూకం లేని వర్షపాతం, తుపానుల, ఇసుక తుపానుల వంటి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి.
సోదర సోదరీమణులారా,
వాతావరణానికి చెందిన మూడు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల సిఓపిలకు భారత్ ఆతిథ్యం వహించింది. రియో ఒడంబడికకు కట్టుబడాలన్న మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, భూములు ఎడారులుగా మార్చడం వంటి అంశాలను దీటుగా ఎదుర్కొనే విషయంలో దక్షిణ-దక్షిణ సహకారం మరింతగా విస్తరించేందుకు కార్యక్రమాలను భారత్ చేపట్టబోతున్నదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
మిత్రులారా,
ప్రపంచంలో మూడింట రెండు వంతుల దేశాలు భూములు ఎడారులుగా మారిపోయే సమస్యను ఎదుర్కొంటున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. భూమికి సంబంధించిన ఈ సంక్షోభంతో పాటుగా జల సంక్షోభాన్ని కూడా నివారించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఇది చాటి చెబుతోంది. మనం భూసారం అంతరించిపోవడంపై పోరాటం చేస్తున్నామంటే జల సంక్షోభం సమస్యను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని అర్ధం.
భూములు, జలనవరుల సంరక్షణ వ్యూహంలో నీటి రీచార్జి సామర్థ్యాలను పెంచడం ద్వారా నీటి సరఫరాను మెరుగుపరచడం, జలవనరులు అంతరించిపోవడాన్ని తగ్గించడం, భూమిలో తేమను పరిరక్షించడం అన్నీ భాగంగానే ఉంటాయి. భూముల క్షీణతను తటస్థ స్థాయికి చేర్చే వ్యూహానికి కేంద్రంగా అంతర్జాతీయ జలవనరుల కార్యాచరణ ప్రణాళిక అజెండాను రూపొందించాలని యుఎన్ సిసిడి నాయకులకు నేను సూచిస్తున్నాను.
మిత్రులారా,
ప్రపంచం స్థిర అభివృద్ధి దిశగా అడుగేయాలంటో భూమి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం అత్యంత కీలకం. యుఎన్ ఎఫ్ సిసిసికి చెందిన పారిస్ సిఓపికి భారత్ సమర్పించిన సూచికలను ఈ రోజున నాకు గుర్తు చేశారు.
భూమి, నీరు, వాయువు, చెట్లు, అన్ని జీవజాతుల మధ్యన ఆరోగ్యవంతమైన సమతూకం పాటించడం భారత సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన అంశం. భారతదేశం వృక్షసంపదను పెంచిందని తెలియడం మీ అందరికీ ఎంతో ఆనందదాయకం. 2015-2017 సంవత్సరాల మధ్య కాలంలో భారత్ లో వృక్షసంపద, అడవుల విస్తీర్ణం 0.8 మిలియన్ హెక్టార్ల మేరకు పెరిగింది.
భారతదేశంలో అటవీ భూమిని అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించుకునే పక్షంలో అంతే విస్తీర్ణం గల భూమిలో అడవులు పెంచి ఆ నష్టాన్ని భర్తీ చేయడం తప్పనిసరి. అలాగే ఆ భూమిలోని కలపకు సరిపోయే విలువ గల సొమ్ము కూడా చెల్లించి తీరాలి.
అటవీ భూములను అభివృద్ధి కార్యకలాపాలకు వినియోగించుకున్నందుకు గత వారంలోనే కేంద్రప్రభుత్వం 600 కోట్ల డాలర్లు లేదా 40 వేల నుంచి 50 వేల కోట్ల రూపాయలు రాష్ట్రప్రభుత్వాలకు చెల్లించింది.
పలు చర్యల ద్వారా రైతుల వ్యవసాయాదాయాన్ని రెట్టింపు చేయడానికి మా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది. భూముల పునరుద్ధరణ, మైక్రో ఇరిగేషన్ వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. ఒక్కో నీటి చుక్కకు అధిక పంట సిద్ధాంతంతో మేం పని చేస్తున్నాం. అలాగే ప్రకృతిసిద్ధమైన జీరో బడ్జెట్ వ్యవసాయానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతీ ఒక్క రైతు భూసారాన్ని పరీక్షించి సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేసే కార్యక్రమం చేపట్టాం. దీని వల్ల వారు సరైన పంటలు, సరిపడ ఎరువులు వాడడం ద్వారా పంటలు పండించడంతో పాటు సరైన పరిమాణంలోనే నీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పటి వరకు దేశంలో 217 మిలియన్ సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశాం.బయో ఎరువుల వినియోగాన్ని, పురుగుల మందులు, రసాయనిక ఎరువులు తగ్గించడాన్ని మేం ప్రోత్సహిస్తున్నాం.
నీటికి సంబంధించిన కీలకమైన అంశాలను పరిష్కరించడం లక్ష్యంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశాం. నీటి విలువను గుర్తించి పలు పారిశ్రామిక కార్యకలాపాల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జి విధానం అమలుపరిచాం. ఒక నియంత్రణ వ్యవస్థ ద్వారా జలప్రాణుల అస్తిత్వాన్ని దెబ్బ తీయకుండానే వృధా నీటిని శుద్ధి చేసి తిరిగి నదుల్లోకే వదిలడాన్ని ప్రోత్సహిస్తున్నాం. మిత్రులారా సరైన చర్యలు చేపట్టకపోతే భూమిని మరింతగా అంతరించిపోయేలా చేసే మరో ముప్పును కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాం. అదే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతికూల ప్రభావంతో పాటు ఈ సమస్య భూములను నిరుత్పాదకంగా మార్చి వ్యవసాయానికి పనికిరాకుండా చేస్తుంది.
ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ ను కూడా రానున్న సంవత్సరాల్లో పూర్తిగా నిర్మూలించేందుకు మా ప్రభుత్వం ఒక కార్యక్రమం ప్రకటించింది. పర్యావరణమిత్రమైన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసేందుకు, మొత్తం ప్లాస్టిక్ అంతటినీ సేకరించి ధ్వంసం చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ప్రపంచం యావత్తు కూడా ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
మానవాభివృద్ధి నీటి వనరుల సంరక్షణ కావచ్చు లేదా ఒకేసారి వాడి వదిలివేసే ప్లాస్టిక్ విసర్జించడం కావచ్చు వివిధ రకాలైన పర్యావరణ సంబంధిత అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంది. ప్రవర్తనలో మార్పు అవసరం. సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నట్టయితే మనం ఆశించిన ఫలితాలు సాధించగలుగుతాం.
మనం ఎన్నో రకాలైన చర్యలు సిద్ధం చేయగలం, కాని వాస్తవమైన మార్పు క్షేత్ర స్థాయిలో టీమ్ వర్క్ తోనే సాధ్యం అవుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఈ మార్పును భారత్ తీసుకురాగలిగింది. అన్ని జీవనశైలులకు చెందిన ప్రజలు ఇందులో భాగస్వాములై స్వచ్ఛతా ఉద్యమం చేపట్టారు. దీని వల్ల పారిశుధ్యం కవరేజి 2014లోని 38 శాతం నుంచి ఇప్పుడు 99 శాతానికి పెరిగింది.
ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ విషయంలో కూడా అదే మార్పును నేను చూడగలుగుతున్నాను. యువత దానికి మరింత మద్దతుగా నిలుస్తున్నారు, సమాజంలో సానుకూల మార్పునకు దోహదకారులవుతున్నారు. మీడియా కూడా విలువైన పాత్ర పోషిస్తోంది.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా చేపట్టే భూపరిరక్షణ అజెండాకు భారతదేశం మరింత కట్టుబాటును ప్రకటిస్తోంది. భూముల క్షీణతను తటస్థం చేసే వ్యూహాల్లో సాధించిన విజయం స్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దేశాలకు అండగా ఉండాలని కూడా నిర్ణయించింది. 2030 నాటికి భూసారం అంతరించిపోయిన భూముల విస్తీర్ణాన్ని 21 మిలియన్ నుంచి 26 మిలియన్ హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తామన్న కట్టుబాటును ఈ వేదికగా ప్రకటిస్తున్నాను.
దీని ద్వారా వృక్షసంపదను 2.5 బిలియన్ ఎంటి నుంచి 3 బిలియన్ ఎంటిలకు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలకు అదనంగా తగ్గించేందుకు భారత్ కట్టుబడి ఉంది. భూముల పునరుద్ధరణ సహా పలు కార్యక్రమాల కోసం రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష టెక్నాలజీని భారతదేశం సమర్థవంతంగా వినియోగించుకుంటోందని తెలియచేయడం గర్వకారణంగా ఉంది. భూముల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టే ఇతర మిత్ర దేశాలకు సమర్థవంతమైన ఉపగ్రహ, అంతరిక్ష టెక్నాలజీలను తక్కువ స్థాయికి అందించడం ద్వారా సహాయపడగలదని ప్రకటించడానికి నేను ఆనందిస్తున్నాను.
భూసార క్షీణత సమస్యలన్నింటినీ శాస్ర్తీయ దృక్పథంతో పరిష్కరించడానికి, సరైన టెక్నాలజీలు అందుబాటులో ఉంచడానికి కృషి చేయడం కోసం భారత అటవీ పరిశోధన, విద్యా మండలి నిర్వహణలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాలని మేం నిర్ణయించాం.అన్ని రకాల పరిజ్ఞానాలను, టెక్నాలజీలను అందుబాటులోకి తేవడం, భూసార క్షీణతకు సంబంధించిన సమస్యల నిర్మూలనకు కృషి చేసే మానవవనరులకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యకలాపాలు చేపట్టడం ద్వారా దక్షిణ ప్రాంత దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడానికి ఇది కృషి చేస్తుంది.
మిత్రులారా,
ఎంతో ఉత్సాహవంతమైన న్యూఢిల్లీ డిక్లరేషన్ పరిశీలనలో ఉన్నదన్న విషయం నాకు తెలుసు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాదించడంలో ఎల్ డిఎన్ సాధించడం కూడా ఒక భాగమే. భూక్షీణత తటస్థ వైఖరికి ప్రపంచ వ్యూహాన్ని ప్రతిపాదించే కృషిలో మీరంతా ఉపయోగకరమైన చర్చలు చేపట్టాలని నేను కోరుతున్నాను.
ओम् द्यौः शान्तिः, अन्तरिक्षं शान्तिः
అనే ప్రాచీన పదాలతో నేను ఈ ప్రసంగం ముగించాలనుకుంటున్నాను.
శాంతి అనేది దౌర్జన్యకాండకు వ్యతిరేక భావన లేదా శాంతి స్థాపన మాత్రమే కాదు, సుసంపన్నతకు కూడా చిహ్నం. ప్రతీ ఒక్కదానికి ఒక చట్టం ఉంది, ప్రతీ ఒక్కరూ దాన్ని పాటించాలి. దాని సారమే
ओम् द्यौः शान्तिः, अन्तरिक्षं शान्तिः
అంటే గగనతలం, స్వర్గం, అంతరిక్షం అన్నీ శాంతితో వర్థిల్లాలి.
पृथिवी शान्तिः,
आपः शान्तिः,
ओषधयः शान्तिः, वनस्पतयः शान्तिः, विश्वेदेवाः शान्तिः,
ब्रह्म शान्तिः
నా తల్లి భూమాత వర్థిల్లుగాక.
భూమిపై ఉన్న అన్ని రకాల ప్రాణులు వర్థిల్లుగాక.
ప్రతీ ఒక్క నీటి చుక్క వర్థిల్లుగాక.
పవిత్ర దేవతలు వర్థిల్లు గాక
सर्वं शान्तिः,
शान्तिरेव शान्तिः,
सा मे शान्तिरेधि।।
ప్రతీ ఒక్కరూ వర్థిల్లుగాక.
నేను కూడా వర్థిల్లేలా ఆశీస్సులు లభించుగాక.
ओम् शान्तिः शान्तिः शान्तिः।।
ఓం వర్థిల్లుగాక, వర్థిల్లుగాక, వర్థిల్లుగాక
మా ప్రాచీనుల సిద్ధాంతం అందరినీ ఉద్దేశించినది. నేను, మనం మధ్య గల బంధం వాస్తవికత వారికి తెలుసు. అందరూ బాగుంటే నేను కూడా బాగుంటాను అన్నదే వారి విశ్వాసం.
మా పూర్వీకులు మేము అన్నారంటే కేవలం వారి కుటుంబం లేదా సమాజం లేదా మానవాళి మొత్తం కాదు, గగనతలం, నీరు, మొక్కలు, వృక్షాలు అన్నీ అందులో ఉన్నాయి.
శాంతి, సుసంపన్నతలకు వారు చేసిన ప్రార్థన ప్రాధాన్యం గుర్తించడం కూడా చాలా అవసరం.
మనందరి జీవనానికి కీలకమైన గగనతలం కోసం, భూమి కోసం, నీటి కోసం, మొక్కల కోసం వారు ప్రార్థించారు. దాన్నే మనం పర్యావరణంగా వ్యవహరిస్తాం. అన్నీ సుసంపన్నంగా ఉంటే నేను కూడా బాగుంటాను అనేదే వారి మంత్రం. నేటి కాలమాన పరిస్థితులకు కూడా అది చక్కగా సరిపోతుంది.
ఈ స్ఫూర్తితో నేను మరోసారి ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు అందరినీ అభినందిస్తున్నాను.
అభినందనలు
ధన్యవాదాలు.