భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..
రెండు రోజుల క్రితం దేశం నలుమూలలా మకర సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పరిణామ క్రమ సారాంశం మకర సంక్రాంతితో ముడిపడి ఉంది. అభివృద్ధి అనేది మకర సంక్రాంతి లోని అంతర్గత అంశం. మకర సంక్రాంతి పర్వదినం తరువాత ఒక ప్రధానమైన కార్యక్రమం ఆరంభం అవుతోంది. మొత్తం దేశానికి ఇంధనాన్ని సరఫరా చేసే కార్యక్రమం రాజస్థాన్ గడ్డ మీద మొదలవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర గారికి, శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా ప్రభుత్వం గాని, రాజకీయ నేత గాని ఏదైనా పనికి సంబంధించి పునాది రాయిని వేయగానే.. నిర్మాణం పూర్తి అయ్యి ఆ పని ఎప్పుడు ప్రారంభం అవుతుందంటూ ప్రజలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమం తరువాత దీనిని గురించి దేశ వ్యాప్తంగా తగిన చైతన్యం ఏర్పడుతుంది. పునాది రాయి మాత్రమే వేసి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు. ఏదైనా పని వాస్తవ రూపం దాల్చినప్పుడు మాత్రమే సాధారణ పౌరులకు నమ్మకం కలుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అదృష్టం నాకు లభించడం ద్వారా ఈ అభివృద్ధిలో భాగం అయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు నాకు అందించారు. వారికి నమ్మకం కలిగిన తరువాతనే వారు ఆ వివరాలను నాకు అందించారు. నిర్మాణం పూర్తి అయిన అనంతరం ప్రారంభోత్సవం ఎప్పుడు ఉంటుందని అడిగాను. దానికి సంబంధించి నాకు గట్టి నమ్మకం కలిగించారు. 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు కృషి చేశారు స్వాతంత్ర్య సమరయోధులు. వారి యవ్వనాన్ని దేశం కోసం త్యాగం చేశారు. జైళ్లలో మగ్గారు. వందేమాతర గీతం పాడి, స్వేచ్ఛా భారతం కోసం కదం తొక్కారు. ఉన్నతమైన దేశంకోసం, భగవత్ కృప గల భారతదేశం కోసం వారు కలలు గన్నారు. భారతదేశం స్వతంత్రాన్ని సంపాదించుకొంది. 2022 నాటికి భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోనుంది. ఇప్పుడు మనందరి మీదా బాధ్యత ఉంది. స్వాతంత్ర్య సమరయోధులు ఊహించిన, కలలు గన్న భారతదేశం కోసం కృషి చేసి.. దానిని ఆ స్వాతంత్ర్య సమరయోధులకు అంకితం చేయవలసిన బాధ్యత ఇది. చేసిన తీర్మానాలను సాకారం చేయాల్సిన సమయం ఇది. ఈ శుద్ధి కర్మాగారాన్ని 2022 నాటికి పని చేయించాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం సాకారం అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు చేసుకొనేటప్పటికి ఇక్కడి నుండి నూతన ఇంధన సరఫరా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను రాజస్థాన్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ కృషికి, శ్రీ ధర్మేంద్ర గారి శాఖకు, రాజస్థాన్ లోని నా సోదరులు మరియు నా సోదరీమణులకు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.
శ్రీ రావల్ మల్లీనాథ్, సంత్ శ్రీ తులసీరామ్, మాతా రాణి ఫటియానీ, నాగ్ నేకీ మాత, సంత్ శ్రీ ఈశ్వర్‌దాస్, శ్రీ ధారూజీ మేగ్ ల వంటి లెక్కపెట్టలేనంత మంది సాధువుల ఆశీస్సులతో బాడే మేర్ నేల పునీతం అయింది. ఈ రోజున అటువంటి భూమికి నేను ప్రణమిల్లుతున్నాను.
పంచ్ పద్ రా లోని ఈ ధరణి స్వాధీనత సేనాని స్వర్గీయ గులాబ్ చంద్ సాలేచా గారి యొక్క కర్మ భూమిగా ఉండింది. వారు- గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేపట్టడాని కన్నా ముందే- ఇక్కడ ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
ఈ ప్రాంతానికి త్రాగు నీరు సౌకర్యాన్ని కల్పించడానికి, రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, మొదటి కళాశాల ప్రారంభించడానికి శ్రీ గులాబ్ చంద్ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటువంటి పంచ్ పద్ రా పుత్రునికి సైతం నేను ప్రణామం చేస్తున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా ,
నేను ఇవాళ ఈ గడ్డ మీద శ్రీ భైరో సింగ్ శెఖావత్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకొంటున్నాను. ఆయన చేసిన గొప్ప సేవలను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన ఆధునిక రాజస్థాన్ నిర్మాణం కోసం, రాజస్థాన్ లో సంక్షోభాల నుండి విముక్తమైన రాజస్థాన్ ను ఆవిష్కరించడం కోసం, మరి బాడ్ మేర్ లో ఇటువంటి శుద్ధి కర్మాగారాన్ని నెలకొల్పాలని అందరి కన్నా ముందుగా ఊహించింది శ్రీ భైరో సింగ్ శెఖావత్ గారే. అటువంటి వ్యక్తికి కూడా నేను ఈ రోజున స్మరించుకొంటున్నాను.
ఈ నేల కన్న బిడ్డ శ్రీ జస్వంత్ సింగ్ గారు త్వరగా అనారోగ్యం నుండి కోలుకోవాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థించండంటూ అందరినీ కోరుతున్నాను. ఆయన తిరిగి ఆరోగ్యవంతులైతే ఆయన అనుభవాన్ని ఈ దేశం ఉపయోగించుకోగలదు. మన ప్రార్థనల్ని ఈశ్వరుడు ఆలకిస్తాడని నేను నమ్ముతున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా ,
దురదృష్టంకొద్దీ.. చరిత్రను మరిచిపోయే ధోరణి మన దేశంలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తు తెచ్చుకోవడమనేది ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ స్ఫూర్తితో నూతన చరిత్రను సృష్టించవచ్చు. మనం నిత్యం అలాంటి స్ఫూర్తిని కోరుకొంటూనే ఉండాలి.
ఇజ్రాయల్ ప్రధాని భారతదేశంలో పర్యటించడం మీరు చూసే ఉంటారు. పధ్నాలుగు సంవత్సరాల అనంతరం ఆయన భారతదేశానికి వచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇజ్రాయల్ ను సందర్శించిన మొదటి ప్రధాన మంత్రిని నేను. నా దేశ పౌరులారా, రాజస్థాన్ హీరోల్లారా..మీకు ఈ విషయం చెబితే గర్వంగా భావిస్తారు. సమయాభావం వున్నప్పటికీ నేను ఇజ్రాయల్ లో ని హైఫాను సందర్శించి అక్కడ త్యాగమూర్తులైన సైనికులకు నా నివాళిని అర్పించాను. వారు వంద సంవత్సరాల క్రితం ఒకటో ప్రపంచ యుద్ధంలో తమ జీవితాలను త్యాగం చేసిన సైనికులు. ఆ సైనికులకు సారథ్యం వహించింది ఎవరో కాదు భరత మాత ముద్దు బిడ్డ మేజర్ దళ్ పత్ సింగ్ గారు. మేజర్ దళ్ పత్ సింగ్ శెఖావత్ శత్రువుల నుండి హైఫాను విముక్తం చేశారు. వంద సంవత్సరాల క్రితం ఆయన ఆక్కడ మన సైన్యానికి నేతృత్వం వహించారు.
ఢిల్లీలో తీన్ మూర్తి చౌక్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ముగ్గురు మహాపురుషుల, వీరుల విగ్రహాలు ఉన్నాయి. ఇజ్రాయల్ ప్రధాని భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే నేను ఆయన కలిసి తీన్ మూర్తి చౌక్ ను సందర్శించాం. మేజర్ దళ్ పత్ సింగ్ గారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన స్మారకార్థం తీన్ మూర్తి చౌక్ ను నిర్మించడం జరిగింది. ఆయనకు వందనం చేయడానికిగాను ఇజ్రాయల్ ప్రధాని అక్కడకు వెళ్లారు. మేం ఇరువురం కలిసి తీన్ మూర్తి చౌక్ ను సందర్శించాం. దాని పేరును తీన్ మూర్తి హైఫా చౌక్ గా మార్చడం జరిగింది. భవిష్యత్‌లో ఎవరూ శ్రీ మేజర్ దళ్ పత్ సింగ్ గారిని, చరిత్రను మరిచిపోవద్దనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. ఆ విధంగా రాజస్థాన్ సంప్రదాయాన్ని నిత్యం స్మరించుకుంటూనే వుంటాం. ఈ పని చేసే అదృష్టం నాకు రెండు రోజుల క్రితమే లభించింది.
సోదరులు మరియు సోదరీమణులారా ,
ఇది వీరుల జన్మభూమి. ఈ నేలలో అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారు. త్యాగాల చరిత్ర లోని ప్రతి సందర్భంలోను.. ఈ నేల మీద జన్మించిన వారికి పాత్ర ఉంది. ఆయా ఘటనల్లో వారు వారి రక్తాన్ని చిందించారు. అటువంటి త్యాగమూర్తులందరికీ నా ప్రణామాలు.
సోదరులు మరియు సోదరీమణులారా ,
రాజస్థాన్ ను అనేక సార్లు సందర్శించాను. నా సంస్థ తరఫున పని చేయడానికి కొన్ని సందర్భాల్లో నేను ఇక్కడకు వచ్చాను. అలాగే పొరుగు రాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడకు వచ్చాను. ఈ ప్రాంతానికి నేను అనేక సార్లు వచ్చాను. ఇక్కడకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాట ఏమిటంటే.. కాంగ్రెస్, కరువు కవలల పిల్లలని. కాంగ్రెస్ ఎక్కడకు పోయినా అక్కడకు కరవు వస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే వసుంధర గారు నాయకత్వంలో రాజస్థాన్ తగినంత నీటి వసతిని పొందుతూనే ఉంది.
సోదరులు మరియు సోదరీమణులారా ,
మనం మరింత ముందుకు వెళ్లవలసివుంది. రాజస్థాన్ ను ప్రగతి పథంలో నడిపించాలి. రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణమనేది దేశ అభివృద్ధికి నూతన జవసత్వాలను అందించాలి.
సోదరులు మరియు సోదరీమణులారా ,
ధర్మేంద్ర గారు, వసుంధర గారు ఫిర్యాదులు చేస్తున్నారు. వారి ఫిర్యాదుల విషయంలో వారు సరిగానే ఉన్నారు. ఈ పని కేవలం బాడ్ మేర్ రిఫైనరీ కోసమేనా ? రిఫైనరీ కోసం పునాది రాయిని వేసి, ఫోటోలు తీసుకోవడం ఇక్కడ మాత్రమే చేయాలా ? ఇది ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న పనా ? ఈ విషయాలన్నీ తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నాను. వీటి పైన పరిశోధన చేయండి. పెద్ద పెద్ద హామీలను ఇచ్చి, ప్రజలను తప్పుదోవ పట్టించే సంస్కృతి కాంగ్రెస్ ది అవునో కాదో మీ పరిశోధనలో తేల్చగలరు. ఈ విషయం బాడ్ మేర్ రిఫైనరీకి మాత్రమే సంబంధించింది కాదు. కాంగ్రెస్ వారి పని సంస్కృతి, అలవాటులో భాగం ఇది.
నేను ప్రధాన మంత్రిని అయిన తరువాత రైల్వే బడ్జెట్ ను పరిశీలించాను. రైల్వే బడ్జెట్ లో అనేక ప్రకటనలు చేశారు కదా.. ఆ ప్రకటనలు చేసిన తరువాత ఏమైంది ? అని నా అలవాటు కొద్దీ అడిగాను. సోదర సోదరమణులారా, ఈ విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంటు సాక్షిగా దేశాన్ని తప్పుదోవ పట్టించారు. ఇంతకు ముందు అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రైల్వే బడ్జెట్ లో దాదాపు 1500వరకు పథకాలను ప్రకటించడం జరిగింది. అవి వాస్తవ రూపం దాల్చలేదు. కేవలం కాగితాలలో ఉండిపోయాయి. తమ తమ ప్రాంతాలకు రైల్వే ప్రాజెక్టులను ప్రకటించినప్పుడు వెంటనే పార్లమెంటు లోని కొందరు చప్పట్లు కొడతారు. దాంతో రైల్వే మంత్రి సంతృప్తి చెందుతారు. కానీ ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తున్నాయా లేదా అని తెలుసుకునేవారు ఉండరు.
రైల్వే బడ్జెట్ ను ఉపయోగించుకొని ఆశలు కల్పించే సంప్రదాయానికి అడ్డుకట్ట వేయాలని మేం అధికారంలోకి రాగానే నిర్ణయించాం. వాస్తవ రూపం దాల్చగలిగే పథకాలను మాత్రమే ప్రకటించాలని నిర్ణయించాం. ప్రారంభంలో మాపై విమర్శలు రావచ్చు. కానీ క్రమక్రమంగా దేశ ప్రజలకు సరైనది ఏదో తెలుసుకునే సామర్థ్యం కలుగుతుంది. సరైన వాటిని మాత్రమ వారు ఆమోదిస్తారు. మేం ఈ దిశగానే పని చేయాలని అనుకుంటున్నాం.
ఒక ర్యాంకు, ఒక పింఛన్ ను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మన సైనికులు ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఏం జరిగిందో వాళ్లే చెబుతారు. ఒక ర్యాంకు, ఒక పింఛన్ ఇవ్వాలనే డిమాండ్ నలభై సంవత్సరాలుగా లేదా ? ప‌్రతి సారీ రక్షణ శాఖ సిబ్బందికి ఈ హామీని చేయలేదా ? దీనికి సంబంధించి ప్రతి ఎన్నికలలోను పెద్ద పెద్ద హామీలను ఇచ్చారు. ఇది వారికి అలవాటు. 2014 లోను మీరు చూసే ఉంటారు. ఒక ర్యాంకు, ఒక పింఛన్ ను గురించి మాట్లాడారు. విశ్రాంత సైనిక సిబ్బందితో కలిసి దిగిన ఫోటోలను ప్రచారంలో పెట్టారు.
2013, సెప్టెంబర్ 15న నేను రేవాడీ లో ప్రకటించాను. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక ర్యాంకు ఒక పింఛన్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పాను. దాంతో వారు భారీ ఒత్తిడికి లోనై తమ తాత్కాలిక బడ్జెట్ లో ఒక ర్యాంకు ఒక పింఛన్ కోసం రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఎలా చేశారో ఈ రిఫైనరీ కోసం కూడా వారు అలాగే పునాది రాయిని వేశారు.
చూడండి.. ఎన్నికలకు ముందు జరిగే మోసమిది. సేవలు మాటలకు మాత్రమే పరిమితం. మా బడ్జెట్ లో ఒక ర్యాంకు, ఒక పింఛన్ పథకం కోసం నిధులు కేటాయించాం. ఎన్నికలకు మందు హామీ ఇచ్చినట్టుగానే ఒక ర్యాంకు ఒక పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఏమైనా జాప్యాలు జరిగినప్పుడు కలగజేసుకొని పథకాన్ని అమలు చేస్తున్నాం. మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపడతారు. వారు బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ప్రకటించినప్పటికీ వాస్తవానికి ఆ పథకాన్ని అమలు చేయలేదు. ఒక ర్యాంకు, ఒక పింఛన్ కు అర్హతా విధానం ఏంటి ? ఆర్ధిక పరమైన భారం ఎంత ? మీరు ఆశ్చర్యపోతారు.. రిఫైనరీ విషయం కాగితాల మీద ఉంది.. కానీ ఒక ర్యాంకు, ఒక పింఛన్ పథకం అయితే పేపర్ల మీద కూడా లేదు. దీనికి సంబంధించిన ఎలా ప్రణాళిక లేదు. ఎటువంటి జాబితా లేదు. ఇది పూర్తిగా ఎన్నికల హామీ మాత్రమే.
సోదరులు మరియు సోదరీమణులారా ,
ఆ పనిని పూర్తి చేయడానికి నేను నిబద్ధతతో వ్యవహరించాను. అన్ని అంశాలను ఒక చోటుకు చేర్చి పేపర్ల మీదకు తీసుకురావడానికి నాకు ఒకటిన్నర సంవత్సరం పట్టింది. గతంలో మొత్తం గందరగోళంగా ఉండేది. మాజీ సైనికుల నివాసాల చిరునామాలు సక్రమంగా లేవు. సరైన సమాచారం అందుబాటులో లేదు. దేశ సైనికులు వారి జీవితాలను త్యాగం చేయడానికి సదా సిద్ధంగా ఉంటారు. వారికి సంబంధించిన అంశాలు గందరగోళంలో పడి ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సమాచారం మొత్తం సేకరించాం. లెక్కలు వేశాం. సోదర సోదరీమణులారా.. దీనికి సంబంధించి నిధుల మొత్తం రూ.500 కోట్లనుకున్నారు, ఆ తరువాత 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు…ఇలా పెరుగుతూ పోయి చివరికి 12000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లతో అమలు చేద్దామని అనుకుంది. అది నిజాయతీగా చేసిన ప్రయత్నమేనా ? వారు నిజంగానే సైనికులకు మేలు చేయాలని అనుకున్నారా ? మాజీ సైనికుల పట్ల వారు నిజాయతీతో వ్యవహరించారా ? ఆ సమయంలో పని చేసిన ఆర్ధిక శాఖ మంత్రి బలహీనుడని నేను అనుకోను. అయినా వారు 500 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించారు. అంతటితో ఆ విషయానికి ముగింపు పలికారు.. ఈ రిఫైనరీకి పునాది రాయి వేసినట్టుగానే చేశారు.
సోదరులు మరియు సోదరీమణులారా ,
నేను ముందే చెప్పినట్టు నిధుల మొత్తం 12000 కోట్ల రూపాయలకు చేరుకుంది. దాంతో నేను సైనిక సిబ్బంది ప్రతినిధులను ఆహ్వానించాను. వారికి విషయం ఉన్నది వున్నట్టు చెప్పాను. మీకు హామీ ఇచ్చినట్టుగానే నిధులు కేటాయించాలని అనుకుంటున్నాను. కానీ ప్రభుత్వ ఖజానాలో తగినంత మొత్తం లేదు. ఒకే సారి రూ.12000 కోట్లు ఇవ్వడం చాలా కష్టం. గతంలో కాంగ్రెస్ వారు రూ.500 కోట్లు ఇస్తామన్నారు. కానీ ఆ మొత్తం రూ.12000 కోట్లకు చేరుకుంది. ఈ విషయంలో నేను నిజాయతీ మార్గంలో డబ్బును ఇవ్వాలనుకుంటున్నాను. మీ సహాయం కావాలి అని నేను ఆ ప్రతినిధులను అభ్యర్థించాను.
అప్పుడు సైనికుల ప్రతినిధులు నాతో.. ప్రధాన మంత్రి సార్, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేం మీకు ఎలాంటి సాయం చేయాలో నేరుగా అడగండి అన్నారు. అప్పుడు నేను వారితో అన్నాను..నాకు ఏమీ వద్దు. మీరు ఇప్పటికే దేశం కోసం చాలా సేవ చేసి ఉన్నారు. అయితే దయచేసి ఈ విషయంలో నాకు సాయం చేయండి. 12000 కోట్ల రూపాయలను ఒకేసారి నేను అందించలేను. ఆ పని చేస్తే పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఆపాల్సివుంటుంది. అలా చేస్తే, వారికి తీవ్రమైన అన్యాయం చేసినట్టవుతుంది. నా ఒకే ఒక అభ్యర్థన ఏమంటే.. మీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని 4 వాయిదాలలో ఇవ్వడం మీకు సమ్మతమేనా ? అని అడిగాను. ఎంతో ధైర్య సాహసాలుగల సైనికులు గత 40 సంవత్సరాలుగా ఒక ర్యాంకు, ఒక పింఛన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. వారికి ఇప్పుడు నిబద్ధతతో పని చేసే ప్రధాన మంత్రి లభించారు. వారు చాలా సులువుగా.. మోదీ జీ గత ప్రభుత్వాలు మాకు మోసం చేశాయి. మేం ఇంకెంతమాత్రం ఎదురు చూడలేం. మీకు కుదిరితే మొత్తం చెల్లించండి. లేకపోతే మా దారి మేం చూసుకుంటామని అనవచ్చు. వాళ్లు అలా చెప్పొచ్చు. కానీ చెప్పలేదు.
నా దేశ జవాన్ లు యూనిఫారమ్ వేసుకొంటేనే కాదు..యూనిఫారమ్ లేకున్నా సరే వారు హృదయపూర్వకంగా సైనికుల వలెనే ఉన్నారు. వారి ఆఖరు శ్వాస వరకు వారు దేశ సంక్షేమం కోసమే ఆలోచిస్తారు. వారు వెంటనే.. ప్రధానమంత్రి సార్, మీ మాట మీద మాకు నమ్మకం ఉంది. మీరు నాలుగు లేదా ఆరు వాయిదాలలో ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించండి; మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అన్నారు.
సోదరులు మరియు సోదరీమణులారా ,
సైనికులు చూపిన సమర్థత కారణంగా నేను ఒక నిర్ణయానికి రాగలిగాను. ఇంతవరకూ 4 వాయిదాలలో చెల్లించడం జరిగింది. వారి ఖాతాలకు 10,700 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది. మిగతా వాయిదాలు త్వరలోనే వారి ఖాతాలలో జమ అవుతాయి. కానీ కాంగ్రెస్ వారు మాత్రం పునాది రాళ్లు వేసి.. వాళ్ల పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వహించారు.
మీరు నాతో చెప్పండి.. నాలుగు దశాబ్దాలుగా గరీబీ హటావో (పేదరికాన్ని పారదోలండి) నినాదాన్ని వింటూనే ఉన్నాం. ఎన్నికల సమయంలో ఈ ఆటను మీరు చూసే ఉంటారు.. ఇందులోకి పేదలను లాగుతారు. కానీ, పేదల సంక్షేమం కోసం ఏదైనా పథకాన్ని అమలు చేయడం మీరు చూశారా ? మీకు అలాంటిదేమీ కనిపించదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తరువాత .. పోయి గొయ్యి తవ్వుకొని..ఏదైనా తీసుకొని తినండని చెబుతున్నారు. గత ప్రభుత్వాల వారికి నిజమైన ఆవేదనే ఉండి ఉంటే మన దేశంలోని పేదలు వారి శక్తియుక్తులను ఉపయోగించుకొని ఈ పేదరికాన్ని జయించి ఉండే వారు.
పేదవారిలో సాధికారితను కల్పించాలని మేం సంకల్పించాం. బ్యాంకులు జాతీయకరణ అయ్యాయిగానీ అవి పేదవారికి దూరంగా ఉండేవి. మేం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతోంది.. దేశ అభివృద్ధి ప్రయాణంలో పేదవారిని భాగస్వాములను చేస్తూ వారిని ప్రధాన స్రవంతి లోకి తీసుకురావాలని నిశ్చయించాం. అందుకోసం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ప్రవేశపెట్టాం. ఈనాడు ఈ పథకం కింద 32 కోట్ల మంది ప్రజలకు ఖాతాలు ఉన్నాయి. సోదరులు మరియు సోదరీమణులారా, ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు నేను ఒక విషయం చెప్పాను. పేదవారు జీరో బ్యాలెన్స్ తో ఖాతాను ప్రారంభించవచ్చని చెప్పాను. దేశంలోని పేదవాళ్లు ఆర్ధికంగా బీదవారు అయి ఉండవచ్చు. కానీ, వారి మనస్సు మాత్రం చాలా గొప్పది. నాకు తెలిసిన కొంత మంది ధనవంతులు.. వారి మనస్సు ప్రకారం చూస్తే బీదవాళ్లే. పేదవారికి జీరో బ్యాలెన్స్ సదుపాయం వున్నప్పటికీ వారు మాత్రం తమ ఖాతాల్లో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూస్తున్నారు. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, ఈ విషయం చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను; గర్వపడుతున్నాను. జీరో బ్యాలెన్స్ అకౌంట్ లను ప్రారంభించిన పేదవారు నేడు తమ జన్ ధన్ ఖాతాలలో 72000 కోట్ల రూపాయలను కలిగివున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే, ధనవంతులు వారి ఖాతాల నుండి డబ్బును డ్రా చేయాలనుకొంటున్నారు. అయితే పేదవారు మాత్రం చాలా నిజాయితీగా తమ ఖాతాలలో డబ్బును దాచుకొంటున్నారు. పేదరికానికి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాట విధానం ఇది.
సోదరులు మరియు సోదరీమణులారా ,
మీకు బాగా తెలుసు గతంలో గ్యాస్ కనెక్షన్ ను సంపాదించాలంటే ఎవరైనా సరే ఎంపీల చుట్టూ ఆరు ఏడు నెలల పాటు తిరిగే వారు. ప్రతి ఎంపీ కి ప్రతి ఏడాది పాతిక కూపన్ లను ఇచ్చే వారు. వాటిని పాతిక ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ ను ఏర్పాటు చేయడానికి ఉపయోగించాలని చెప్పే వారు. ఒక్కొక్క సారి ఎంపీలు వారి గ్యాస్ కనెక్షన్ లను నల్లబజారులో అమ్మినట్టు వార్తలు వచ్చేవి.
సోదరులు మరియు సోదరీమణులారా ,
ఈ కాలంలో కూడా నా తల్లులు, సోదరీమణులు వంట చెరకు ఉపయోగిస్తూ, పొగ మధ్య ఇబ్బంది పడుతూ వంట చేయాలా ? పేదల సంక్షేమంకోసం మనం చేస్తున్నది ఇదేనా ? వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగను పీల్చుకుంటూ మన సోదరీమణులు, తల్లులు వంట చేయాల్సివుంటుంది. ఈ పొగ ఎంత ప్రమాదకరమంటే, ఇది నాలుగు వందల సిగరెట్ల వల్ల కలిగే నష్టానికి సమానం. ఆ ఇంట్లోని పిల్లలు కూడా దీని బారిన పడి అనారోగ్యం పాలవుతుంటారు.
సోదరులు మరియు సోదరీమణులారా ,
మేం బాధ్యత తీసుకున్నాం. నినాదాలు ఇచ్చినంత మాత్రాన పేదలకు సంక్షేమ పథకాలు అందవు. వారి జీవితాలను మార్చాల్సివుంది. మేం ఉజ్జ్వల యోజనను ప్రవేశపెట్టాం. దీనిలో భాగంగా దాదాపు మూడు కోట్ల ముప్ఫై లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. పొగ పొయ్యి ద్వారా వంట చేసే కష్టాన్నుండి కోట్లాది మంది తల్లులను రక్షించాం. ఇప్పుడు చెప్పండి.. ఈ కష్టాన్నుండి బైటపడిన ప్రతి మాతృమూర్తి తాను వంట చేసుకొనే సమయంలో నరేంద్ర మోదీ ని ఆశీర్వదిస్తుందా, లేదా ? మనల్ని కాపాడడానికి ఆమె ప్రతిజ్ఞ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు పేదరికంపైన పోరాటం చేయడానికి ఇదే మంచి పద్దతి అని.
సోదరులు మరియు సోదరీమణులారా ,
దేశానికి స్వాతంత్ర్యంవచ్చిన డెబ్బయి సంవత్సరాలయినప్పటికీ 18000 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. 21వ శతాబ్దంలో కూడా వారు 18వ శతాబ్దం కాలం నాటి పరిస్థితుల మధ్యన బతకాల్సి వచ్చింది. స్వాతంత్ర్య భారతంలోనే మనం ఉన్నామా ? ఇదేనా ప్రజాస్వామ్యం ? అని వారు తమలో తాము అనుకొనే ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు వోటు వేస్తాను. అయినా ఏం ప్రయోజనం?.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలయినా విద్యుత్తు సౌకర్యం కల్పించలేని ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాలేనా ? అని వారు ప్రశ్నించుకునే ఉంటారు. సోదరులు మరియు సోదరీమణులారా, ఈ 18000 గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించే బాధ్యతను నేను తీసుకున్నాను. ఇంకా 2000 గ్రామాలకు విద్యుత్తు సౌకర్యాన్ని అందించాల్సివుంది. దీనికి సంబంధించిన పని అత్యంత వేగంగా జరుగుతోంది. ఇప్పుడు వారికి 21వ శతాబ్దంలో జీవించే అవకాశం లభించింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలయినా నాలుగు కోట్ల కుటుంబాలకు ఇంకా విద్యుత్తు సౌకర్యం లేదు. మహాత్మ గాంధీ 150వ జయంతి నాటికి ఈ 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్తును అందించాలనే బాధ్యతను మేం తీసుకొన్నాం. ఈ సౌకర్యంతో ఆ కుటుంబాలలోని పిల్లలు చదువుల బాట పడతారు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ముందు పేదలకు సాధికారితను కల్పించాలి. ఇలాంటి సవాళ్లతో మేం ముందుకు వెళ్తున్నాం.
సోదరులు మరియు సోదరీమణులారా ,
ఈ రిఫైనరీ ఈ ప్రాంతం రూపురేఖలను, భవిష్యత్తు ను మార్చేస్తుంది. ఇది ఎంతో భారీ పరిశ్రమ. ఈ ఎడారి ప్రాంతంలో అనేక మంది స్థానికులకు ఉపాధిని కల్పించబోతోంది. ఈ పరిశ్రమ కారణంగా ఇందులో పనిచేసే వారికే కాదు దీనిపైన ఆధారపడే బయటి వారికి కూడా ఉపాధిని ఇస్తుంది. దీని కారణంగా చుట్టుపక్కల అనేక చిన్న పరిశ్రమలు తయారవుతాయి. ఎందుకంటే ఈ భారీ పరిశ్రమకు పలు మౌలిక సౌకర్యాలు అవసరమవుతాయి. నీరు, విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ మొదలైన సౌకర్యాలు కల్పించాల్సివుంటుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతం లోని ఆర్ధిక వ్యవస్థ సమూలంగా మారిపోతుంది.
ఈ రిఫైనరీ కోసం అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఇక్కడకు వచ్చి నివాసముంటారు. దాంతో వారి కుటుంబాల కోసం నూతన విద్యాసంస్థలు పుట్టుకొస్తాయి. ఇండియా లోని పలు ప్రాంతాల నుండి రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాలైన ఉదయ్ పుర్, బాన్స్ వాడా, భరత్ పుర్, కోటా, అల్ వర్, అజ్ మేర్ ల వంటి ప్రాంతాల నుండి అనేక మంది ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతారు. దాంతో వారి కోసం ఇక్కడ ఆరోగ్య సదుపాయాలు ఏర్పడుతాయి.
కాబట్టి సోదరులు మరియు సోదరీమణులారా ,
రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడ అసాధారణమైన మార్పులు రానున్నాయి. మీరు చాలా సులువుగా భవిష్యత్తు ను ఊహించవచ్చు. ఈ రోజు ఇక్కడ ప్రారంభించబోతున్న కార్యక్రమం వల్ల నాకు, భారత ప్రభుత్వానికి నష్టమే. దీనికి సంబంధించి గత ప్రభుత్వాలు కొంత పనయినా చేసి ఉంటే, నేటి ప్రభుత్వానికి 40000 కోట్ల రూపాయల దాకా ఆదా అయి ఉండేవి.
ముఖ్యమంత్రి వసుంధర గారికి రాచ కుటుంబపు విలువలు ఉన్నాయి. అంతే కాదు రాజస్థాన్ యొక్క నీరు త్రాగిన కారణంగా మార్వాడీల తరహా సంస్కారాలు కూడా ఉన్నాయి. ఆమె కేంద్ర ప్రభుత్వం నుండి వీలయినంత సహాయాన్ని తీసుకొంటున్నారు. ఇది ఒక్క భారతీయ జనతా పార్టీ లోనే సాధ్యపడుతుంది.. ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర హితం కోసం తాను తలచుకొన్నదల్లా నెరవేర్చుకోవడం కోసం – ఢిల్లీ లో ఉన్నది కూడా తమ పార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ- పట్టు పడుతున్నారు. రాజస్థాన్ నిధులను ఆదా చేయడంలో ఆమె చేస్తున్న కృషికి, సరైన పథకాన్ని రూపొందించడంలో భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చినందుకు వసుంధర గారిని నేను అభినందిస్తున్నాను. వసుంధర గారు, ధర్మేంద్ర గారు నిలచిపోయినటువంటి ఒక ప్రాజెక్టుకు వాస్తవరూపాన్ని ఇవ్వడం కోసం కలిసి పని చేశారు. మీ ఇద్దరికీ మరియు మీ అందరికీ నా అభినందనలు. భారత మాతకు జయం కలుగు గాక అంటూ నాతో పాటు బిగ్గరగా నినదించండి.
బాడ్ మేర్ గడ్డ మీద నుండి దేశం ఇంధనాన్ని పొందగలదు. ఈ శుద్ధి కర్మాగారం యావత్తు దేశ శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ శక్తి ఇక్కడ నుండి జనించి దేశంలోని మూల మూలలకూ చేరుకోగలదని నేను ఆశిస్తున్నాను. ఈ ఆకాంక్షలతో ఖమ్మా ఘణీ ( ఈ మాటలకు- మార్వాడీ భాషలో- శుభాభినందనలు అని భావం).