శ్రీ మెమన్ మేత్యూ, శ్రీ జాకబ్ మేత్యూ, శ్రీ జయంత్ జాకబ్ మేత్యూ, శ్రీ ప్రకాశ్ జావడేకర్ మరియు డాక్టర్ శశి థరూర్,
ప్రియమైన అతిథులారా,
నమస్కారం,
‘మలయాళ మనోరమ న్యూజ్ కాన్‌క్లేవ్ 2019’ కార్యక్రమం లో ప్రసంగించనుండడం నాకు అమిత సంతోషాన్ని ఇస్తోంది. నేను పవిత్రమైనటువంటి కేరళ సీమ కు మరియు ఆ సీమ యొక్క విశిష్ట సంస్కృతి కి వందనమాచరిస్తున్నాను. ఈ భూమి సాంఘిక జ్ఞానాని కి మరియు ఆధ్యాత్మిక జ్ఞానాని కి నిలయం గా ఉంటూ, భారతదేశాని కి ఆది శంకరులు, మహాత్మ అయ్యంకాళి, శ్రీ నారాయణ గురు, చట్టాంబి స్వామిగళ్, పండిత్ కరుప్పన్, సెంట్ కురియాకోస్ ఎలియాస్ చావరా, సెంట్ అల్ఫాన్సో తదితర గొప్ప పుత్రుల ను, గొప్ప పుత్రికల ను అందించింది. కేరళ వ్యక్తిగతం గా నాకు కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటిది. నేను కేరళ ను సందర్శించే అవకాశాల ను అనేకం గా దక్కించుకొన్నాను. ప్రజలు నన్ను మరొక్క మారు ఒక పెద్ద బాధ్యత తో దీవించినప్పుడు నేను చేసిన మొట్టమొదటి పనుల లో ఒకటి ఏమిటంటే అది గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శించడం.
మిత్రులారా,
నేను మలయాళ మనోరమ న్యూజ్ కాన్‌క్లేవ్ లో ప్రసంగించడం ఎక్కడ లేని కుతూహలాన్ని రేకెత్తించింది. మామూలు గా, ప్రముఖులు తమ స్వీయ ప్రపంచ దృష్టి కోణం తో తులతూగే భావ పరంపర ను కలిగివుండే వేదికల మీద ఉండడాని కి ఇష్ట పడటం పరిపాటి. ఎందుకు అంటే ఆ తరహా వ్యక్తుల నడుమ ఉండడమనేది బోలెడంత సౌకర్యవంతంగా ఉంటుంది. నేను కూడా అటువంటి పరిసరాల లో ఉండటాన్నే ఇష్టపడతాననుకోండి. అయితే అదే కాలం లో, వ్యక్తుల మధ్య మరియు సంస్థల మధ్య ఒకరి భావ పరంపర కు అతీతం గా నిలకడగాను, నిరంతరంగాను సంభాషణ జరుగుతూ ఉండాలని నేను నమ్ముతాను.
మనం ప్రతి ఒక్క అంశం పైన సమ్మతించనక్కర లేదు. కానీ, వేరు వేరు సందోహాలు ఒక సమూహం యొక్క అభిప్రాయ మాలిక ను మరొక సమూహం వినగలిగేటట్టు ప్రజా జీవనం లో తగినంత సభ్యమర్యాదలు ఉండి తీరాలి. ఇక్కడ నేను, ఒక వేదిక మీద- దేని మీద అయితే, బహుశా పలువురి భావ పరంపర నా భావ పరంపర ను సరిపోలి లేదో; అయినప్పటి కీ, ఎవరి నిర్మాణాత్మకమైన విమర్శ కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానో ఆ రకం గా ఆలోచించే వారి సంఖ్య చాలినంత గా ఉందో- అటువంటి వేదిక మీదకు వచ్చాను.
మిత్రులారా,
మలయాళ మనోరమ ఇప్పటి కి ఒక వంద సంవత్సరాల కు పైగా మలయాళీ ప్రజల ఆలోచన స్రవంతి లో ఒక భాగం గా ఉందన్న సంగతి ని నేను ఎరుగుదును. అది తన వార్తా కథనాల ద్వారా కేరళ పౌరుల ను మరింత తెలివిడి కలిగిన వారు గా తీర్చిదిద్దింది. అది భారతదేశం యొక్క స్వాతంత్య్ర సమరాన్ని సమర్ధించడం లో ఒక పాత్ర ను కూడా పోషించింది. ఎంతో మంది యువతీ యువకులు, ప్రత్యేకించి పోటీ పరీక్షల కు హాజరవుతున్న వారు, మీరు ప్రచురించే ఇయర్ బుక్ ను చదివే ఉంటారు. ఆ విధం గా కొన్ని తరాల వారి కి సైతం మీరు సుపరిచితులు. ఈ మహా ప్రస్థానం లో ఒక భాగం అయిన సంపాదకుల కు, విలేఖరుల కు మరియు సిబ్బంది కి ఇవే నా నమస్సులు.
మిత్రులారా,
ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్న వారు ఒక అత్యంత ఆసక్తిదాయకమైనటువంటి ఇతివృత్తాన్ని- ‘న్యూ ఇండియా’- ను ఎంపిక చేశారు. మీరు మోదీ గారి భాష ను మాట్లాడుతున్నారా ఏమిటి ? అని విమర్శకులు మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. మరి ఆ ప్రశ్న కు మీ వద్ద సమాధానాలు ఉన్నాయని నేను ఆశిస్తాను. అయితే మీరు నా మనస్సు కు అత్యంత సన్నిహితం గా ఉన్నటువంటి ఒక ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకొన్న కారణం గా న్యూ ఇండియా భావన ను గురించి నేను ఏమి అనుకొంటున్నానో ఆ విషయాన్ని మీకు వెల్లడించడం కోసం ఈ అవకాశాన్ని నన్ను వినియోగించుకోనివ్వండి.
మిత్రులారా,
నేను ఎప్పటి కీ చెప్తూ ఉన్నట్లుగానే, మనం ముందుకు కదలవచ్చు, లేదా కదల లేక పోవచ్చు. మనం మార్పు కోసం సిద్ధం గా ఉండవచ్చు, లేదా ఉండకపోవచ్చు.. భారతదేశం వేగం గా మార్పు చెందుతోంది. మరి ఈ మార్పు మంచి కోసం చోటు చేసుకొంటోంది. ‘న్యూ ఇండియా’ స్ఫూర్తి కి కేంద్ర బిందువు గా ఉన్నదల్లా వ్యక్తిగత ఆకాంక్షలు, ఉమ్మడి ప్రయత్నాలు, మరి అలాగే జాతీయ పురోగతి యొక్క యాజమాన్య భావన అనేవి. ‘న్యూ ఇండియా’ భాగస్వామ్య తరహా ప్రజాస్వామ్యం పౌరుల ను కేంద్ర స్థానం లో నిలబెట్టి నడిచే ప్రభుత్వం. అలాగే, పౌరుల పట్ల క్రియాశీలం గా ఉండే హయాం. ఇదిగో ఇది ‘న్యూ ఇండియా’ అనేది ప్రతిస్పందన తో ముందుకు వచ్చే ప్రజలు మరియు ప్రతిస్పందించేటటువంటి ప్రభుత్వం యొక్క శకం గా ఉంది.
ప్రముఖులైన అతిథులారా, ఎన్నో సంవత్సరాలు గా విలసిల్లిన ఒక సంస్కృతి, అది ఎటువంటిది అంటే- అందులో ఆకాంక్ష ను కలిగివుండటం అనేది ఒక చెడ్డ మాట అయింది. మీకు ఉన్నటువంటి పరిచయాల పై ఆధారపడి తలుపులు తెరచుకొనేవి. మీరు ఒక ఓల్డ్ బాయిస్ క్లబ్ కు చెందిన వారా, లేక చెందని వారా అన్న దాని మీద ఆధారపడి విజయం సిద్ధించేది. పెద్ద నగరాలు, ఎంపిక చేసిన బడా సంస్థలు, మరియు పెద్ద కుటుంబాలు – వీటికే ప్రాముఖ్యం లభించేది. లైసెన్స్ రాజ్, ఇంకా పర్మిట్ రాజ్ లతో కూడిన ఆర్థిక సంస్కృతి వ్యక్తిగత మహత్త్వాకాంక్షల కు కీలకం గా ఉండేవి. కానీ, ఈ రోజు న ప్రతిదీ ఉత్తమమైన దాని కోసమని మారుతూ వస్తోంది. హుషారైనటువంటి స్టార్ట్ – అప్ ఇకో సిస్టమ్ లో ‘న్యూ ఇండియా’ తాలూకు ఉత్సాహాన్ని మనము గమనిస్తున్నాము. వేలాది మంది ప్రతిభాన్విత యువతీ యువకులు చక్కటి వేదికల ను నిర్మిస్తున్నారు. ఆ వేదికల లో వారి యొక్క నవ పారిశ్రామికత్వ స్ఫూర్తి ని కళ్ళ కు కడుతున్నారు. ఇటువంటి స్ఫూర్తినే క్రీడా మైదానం లో కూడా మనము చూస్తున్నాము.
భారతదేశం ప్రస్తుతం క్రొత్త క్రీడాంగణాల లో రాణిస్తున్నది. ఇంతకు ముందు ఇటువంటివి మనకు ఎన్నడూ ఎదురు కాలేదు. అది స్టార్ట్- అప్ లు కావచ్చు లేదా క్రీడలు కావచ్చు. ఈ హుషారు కు కొమ్ము కాస్తున్నది ఎవరు? వారి లో చాలా మంది కని విని ఎరుగని చిన్న పల్లెలు, మరియు చిన్న పట్టణాల నుండి తల ఎత్తుకొని నిలబడుతున్న యువతీ యువకులే. వారు సుప్రతిష్టిత కుటుంబాల కు చెందిన వారు కాదు. అలాగని, వారి బ్యాంకు ఖాతాల లో బోలెడంత సొమ్ము కూడా లేదు. వారి వద్ద పుష్కలం గా ఉన్నవల్లా ఆకాంక్ష మరియు సమర్పణ భావం. వారు ఆ ఆకాంక్ష ను శ్రేష్టత్వం గా మలచి, భారతదేశాన్ని గర్వించేటట్లుగా తీర్చిదిద్దుతున్నారు. నా వరకు ఇదే ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి అని తలుస్తాను. ఇది ఎటువంటి భారతదేశం అంటే- ఆ దేశం లో యువత యొక్క ఇంటి పేర్లు పెద్ద లెక్క కు రావు. గణన కు వచ్చేదల్లా వారు వారి సొంత పేరు ను ప్రతిష్టాత్మకం గా మలచుకోవడం. ఇది ఎటువంటి భారతదేశం అంటే- ఆ దేశం లో అవినీతి ఎన్నటి కీ ఒక ఐచ్చికం కాదు. కేవలం దక్షతే ప్రమాణం గా ఉంటుంది.
మిత్రులారా,
‘న్యూ ఇండియా’ అనేది కొద్ది మంది ఎంపిక కాబడిన వ్యక్తుల యొక్క స్వరాని కి సంబంధించి కాదు. అది 130 కోట్ల మంది భారతీయుల లో ప్రతి ఒక్కరి కీ సంబంధించినటువంటి వాణి. మరి ప్రసార మాధ్యమ వేదిక లకు, ప్రజల యొక్క ఈ గళాన్ని వినడం మరీ ముఖ్యం గా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాము- ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క పౌరుడు దేశం కోసం ఏదైనా ఇవ్వడమో, లేదా ఏదైనా వదలి పెట్టడమో చేయాలని తలపోస్తున్నాడు. ఉదాహరణ కు తీసుకొంటే, ఈ మధ్య ఒకసారి వాడే ప్లాస్టిక్ ను తగ్గించాలని తలంచడం జరిగింది. ఇది ఒక్క నరేంద్ర మోదీ కి తట్టిన ఆలోచనో, లేదా ప్రయత్నమో కాదు. భారతదేశాన్ని ఒకసారి వాడే ప్లాస్టిక్ కు తావు ఇవ్వకూడని దేశం గా చేయాలని ప్రజలు వారంతట వారు ఒక మాట అనుకున్నారు. అది కూడా- మనం గాంధీ గారి 150వ జయంతి ని ఎప్పుడైతే జరుపుకొంటామో అప్పటి కి. ఇవి అసాధారణమైన రోజు లు; మరి మన దేశాన్ని పరివర్తన దిశ గా నడిపేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడాను మనము వదలి పెట్టనే వదలిపెట్ట కూడదు.
మిత్రులారా,
ఒక ప్రభుత్వం గా మేము వ్యక్తిగత ఆకాంక్షల ను మరియు సమష్టి యత్నాల ను భారతదేశం యొక్క ఉన్నతీకరణ కోసం మరింత గా పెంపొందించేందుకు చేయగలిగినదంతా చేశాము. జీవించడం లో సరళత్వాన్ని మెరుగు పరచడం కోసం చర్యలు.. అవి ధరల ను అదుపు లో ఉంచడం కావచ్చు, అయిదు సంవత్సరాల లో 1.25 కోట్ల ఇళ్ళ ను నిర్మించడం, అన్ని గ్రామాల ను విద్యుతీకరించడం, ప్రతి ఒక్క కుటుంబాని కి మంచినీటి ని అందించడం, ఆరోగ్యాన్ని మెరుగు పరచడం తో పాటు, విద్య కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన.. ఇవన్నీ కూడాను మన యువత కు సరి అయినటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడాని కి ఉద్దేశించిన చర్యలు. ఈ ప్రభుత్వం కృషి చేసినంత స్థాయి, మరియు పరిధి అతి క్లిష్టమైనటువంటివి. మనము ఇది వరకు ఎన్నడూ పయనించనంత వేగం తో మరియు పోల్చడాని కి సరిపోనంత పరిమాణం లో ప్రయాణం లోని ఆఖరు మైలు కు చేరుకొన్నాము. 36 కోట్ల బ్యాంకు ఖాతాల ను తెరవడమైంది. చిన్న సంస్థ లకు 20 కోట్ల రుణాలను ఇవ్వడం జరిగింది. 8 కోట్ల కు పైగా గ్యాస్ కనెక్షన్ లు పొగ కు తావు లేని వంట గదుల కు సమాధానం గా నిలచాయి. రహదారుల నిర్మాణ వేగం రెట్టింపయింది.
ఇవి కొన్ని ఉదాహరణ లు మాత్రమే. ఏమైనా నాకు అత్యంత ఉల్లాసాన్ని ఇస్తున్నది ఏదంటే, అది భారతదేశం యొక్క ప్రజలు ఏ విధంగానైతే స్వార్ధ ప్రయోజనాల కు మిన్న గా ఎదిగి, సమాజం తాలూకు ప్రయోజనాన్ని చూస్తున్నారో, అదే ‘న్యూ ఇండియా’ యొక్క సారం అని నేను తలుస్తాను. దీని కోసం కాకపోతే, పేదల లో కెల్లా నిరుపేదలైన వారు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అయిన జన్ ధన్ ఖాతాల లో ఒక లక్ష కోట్ల రూపాయల ను జమ చేస్తారు? మధ్యతరగతి ప్రజానీకం తమ సొంత సబ్సిడీ గ్యాస్ ను ఎందుకని వదలుకొంటారు? వయో వృద్ధు లు కేవలం ఒక మనవి ని ఆలకించి వారి యొక్క రైల్వే రాయితీ ని ఎందుకు విడచిపెడతారు?
బహుశా ఇది గాంధీ గారు ఒక శతాబ్ద కాలం కిందట ప్రబోధించినటువంటి ధర్మకర్తృత్వ సిద్ధాంతం మరో రూపం లో ముందుకు రావడమే కావచ్చు. ఈ రోజు న భారతదేశం యొక్క పరివర్తన ను చూసే ఒక ప్రేక్షకుని గా మిగలడం కాకుండా ఆ ప్రక్రియ లో వారి వంతు పాత్ర ను పోషించాలన్న ఒక చిత్తశుద్ది తో కూడిన అభిమతం వ్యక్తమవుతోంది. పన్ను చెల్లింపుదారుల సంఖ్య సైతం పెరగడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజలు భారతదేశాన్ని ముందుకు తీసుకు పోవాలని నిర్ణయించుకొన్నారు!
మిత్రులారా,
ఇంతకు ముందు పూర్తి గా అసాధ్యం అని భావించిన మార్పుల ను మీరు చూస్తూ ఉండి ఉంటారు. హరియాణా వంటి రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పారదర్శకం గా జరపవచ్చన్న సంగతి ఊహ కు అందనిది. కానీ, హరియాణా లో ఏ గ్రామానికైనా వెళ్ళినప్పుడు ఉద్యోగ భర్తీ లు చోటు చేసుకొంటున్న పారదర్శకమైన పద్ధతి ని గురించి ప్రజలు చర్చించుకొంటున్నారు. ఇవాళ, రైల్వే స్టేశన్ లలో వై-ఫై సౌకర్యాల ను ప్రజలు వినియోగించుకొంటూ ఉండటం అనేది సాధారణం గా మారిపోయింది.
ఇది అంతా వాస్తవ రూపం దాల్చుతుందని ఎవరు మాత్రం అనుకున్నారు. ఇది వరకు ప్లాట్ ఫార్మ్ లు అంటే అవి ప్రయాణికుల తో, సరకుల తో ముడిపడినటువంటివి. కానీ, ఇప్పుడో- రెండో అంచె నగరాలు మరియు మూడో అంచె నగరాల లో విద్యార్థులు ఉచిత వై-ఫై ని ఉపయోగించడం కోసం మరియు రాటుదేలడం కోసం పాఠశాల లేదా కళాశాల ముగిసిన తరువాత స్టేశన్ లకు పోతున్నారు. వ్యవస్థ అదే. ప్రజలు కూడా ఏమీ మారలేదు. అయితే, క్షేత్ర స్థాయి లో బ్రహ్మాండమైనటువంటి మార్పులు వచ్చాయి.
మిత్రులారా,
భారతదేశం లో స్ఫూర్తి ఏ విధం గా మారిందో రెండే రెండు మాటల లో ఇమడ్చవచ్చును. అయిదు సంవత్సరాల క్రితం ప్రజలు అడిగే వారు. మనం సాధించగలమా? అని. ధూళి బారి నుండి మనం ఎప్పటికైనా స్వేచ్ఛను పొందగలమా? విధానపరమైనటువంటి పక్షవాతాన్ని మనం ఎప్పటికైనా తొలగించగలమా? అవినీతి కి మనం ఎప్పటికైనా భరత వాక్యం పలకగలమా? ప్రజలు ఇవాళ అంటున్నారు – మనం సాధించగలము అని. మనము స్వచ్ఛ భారత్ ను ఆవిష్కరిస్తాము. మనము అవినీతి కి తావు లేనటువంటి ఒక దేశం గా మనుగడ ను సాగిస్తాము. మనము సుపరిపాలన ను ఒక ప్రజా ఆందోళన గా మార్చ గలము. గలము అనే మాట ఏదైతే ఇది వరకు ఒక నిరాశ భరితమైనటువంటి ప్రశ్న కు సంకేతం గా ఉందో ఇప్పుడు ఆ మాటే యువజనుల తో నిండినటువంటి ఒక దేశ ప్రజల యొక్క ఆశావాద స్ఫూర్తి కి అద్దం పడుతోంది.
మిత్రులారా,
మా ప్రభుత్వం ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్కరించడం కోసం సమగ్ర దృక్పథం తో ఏ విధం గా కృషి చేస్తోందో ఒక ఉదాహరణ ను మీకు నేను వెల్లడిస్తాను. మీకు అందరి కీ తెలిసిన విషయం ఏదంటే, మా ప్రభుత్వం పేదల కోసం 1.5 కోట్ల కు పైగా గృహాల ను శర వేగం గా నిర్మించింది అన్న సంగతి. ఇది మునుపటి ప్రభుత్వం కన్నా ఒక భారీ మెరుగుదల గా ఉంది. ఎంతో మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమని అంటే మునుపు కూడాను పథకాలు మరియు నిధులు ఉండేవి. మరి మీరు వ్యత్యాసం గా చేసింది ఏమిటి? అని. ఈ ప్రశ్న ను అడిగే హక్కు వారి కి ఉంది.
ముందుగా, మేము కడుతున్నది ఉత్తి ఇళ్ళ ను కాదు నివాసాల ను అనే సంగతి ని మేము గ్రహించాము. ఈ విధం గా కేవలం నాలుగు గోడల ను నిర్మించే భావన నుండి దూరం గా సాగిపోవలసిన అవసరం మనకు ఉందన్న మాట. మా దృక్పథం ఏమిటి అంటే, మరిన్ని సౌకర్యాల ను అందజేయడం, మరింత విలువ ను అందజేయడం, తక్కువ కాలం లో అందజేయడం, అంతేకాకుండా ఎటువంటి అదనపు వ్యయాని కి తావు ఇవ్వకుండా అందజేయడమూను.
మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళు ఒక దృఢమైన వాస్తు ను అన్వయించుకోలేదు. మేము ప్రజల యొక్క అభిలాషల కు మరియు స్థానిక అవసరాల కు తగినట్లు గా ఉండే ఇళ్ళ ను కట్టాము. అన్ని కనీస సదుపాయాల ను అందించడం కోసం మేము వివిధ ప్రభుత్వ పథకాల ను కలబోశాము. గృహాల లో విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్, స్నానాల గది, ఇంకా తదితర ఆవశ్యకతలు అన్నీ అమరాలి అని ఇలా చేస్తున్నాము.
మరింత విలువ ను అందజేయడం కోసం మేము ప్రజల అవసరాల ను అర్థం చేసుకొన్నాము. మరి ఇళ్ళ విస్తీర్ణాన్ని పెంచడం ఒక్కటే కాకుండా, నిర్మాణాని కి అయ్యే సొమ్ము ను కూడా పెంచడం జరిగింది. ఈ ప్రక్రియ లో మహిళల ను, స్థానిక చేతి వృత్తి పని వారి ని మరియు శ్రామికుల ను మేము జోడించాము. ఎటువంటి అదనపు వ్యయమూ లేకుండానే తక్కువ కాలం లో గృహాల ను అందించడం కోసం ఈ ప్రక్రియ లో సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ముఖ్యమైన భాగం గా మేము తీసుకొన్నాము. వివిధ దశల లో నిర్మాణం తాలూకు ఛాయాచిత్రాల ను ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేయడం ద్వారా పాలన యంత్రాగాని కి ఒక స్పష్టమైన ముఖచిత్రం లభ్యమవుతుంది. డబ్బు ను నేరు గా బదిలీ చేయడం తో ఎటువంటి అడ్డదారుల కు ఆస్కారం ఉండబోదు. పైపెచ్చు, పూర్తి సంతృప్తి దక్కుతుంది. గతం లోకి మీరు తొంగి చూస్తే, ఇటువంటి జోక్యాల లో ఏ ఒక్క దాని ప్రమేయం లేకుండా ఆ ప్రయత్నం విజయవంతం అయ్యేదే కాదు. సమస్యల ను ఒక్క సాంకేతిక విజ్ఞానం ద్వారానే పరిష్కరించలేము. పథకాల ను కలబోసినంత మాత్రాననే సమస్య లు పరిష్కరింపబడవు. అన్ని జోక్యాలు ఒక చోటు కు చేరినప్పుడు ఎటువంటి సమస్యకు అయినా పరిష్కార మార్గాలు దొరికి సంపూర్ణ ఫలితాలు చేజిక్కుతాయి. ఇది మా ప్రభుత్వం యొక్క మొహరు గా ఉంది.
మిత్రులారా,
దేశం లో నివసిస్తున్న వారి పట్ల శ్రద్ధ మాత్రమే కాకుండా దేశాని కి వెలుపల ఉన్న వారి పట్ల కూడా శ్రద్ధ అనేది ‘న్యూ ఇండియా’ పట్ల మా దార్శనికత లో ఒక భాగం గా ఉంది. విదేశాల లోని మన వారు మనకు గర్వ కారణం. వారు భారతదేశ ఆర్థిక వృద్ధి కి అండదండల ను అందిస్తున్నారు. విదేశాల లో ఉన్న ఏ ఒక్క భారతీయుడైనా ఏ సమస్య నైనా ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్య ను పరిష్కరించడం లో మేము ముందు ఉంటున్నాము. పశ్చిమ ఆసియా లో వేరు వేరు ప్రాంతాల లో భారతీయ నర్సులు బందీలు గా ఉన్నప్పుడు, వారి ని స్వదేశాని కి తిరిగి తోడ్కొని రావడం లో శాయశక్తులా ప్రయత్నించడం జరిగింది. ఈ నర్సుల లో ఎక్కువ మంది దక్షిణ భారతాని కి చెందిన వారు. కేరళ కు చెందిన మరో బిడ్డ- ఫాదర్ టామ్- ను నిర్భంధించినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి స్ఫూర్తి ని గమనించవచ్చు. ఎంతో మంది యెమన్ నుండి తిరిగి వచ్చారు.
నేను పశ్చిమ ఆసియా లో అనేక దేశాల ను సందర్శించాను. మరి భారతీయుల తో కాలాన్ని గడపటం అనేది నా యొక్క కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఉంటుంది. నేను ఇటీవలే బహ్రెయిన్ కు వెళ్ళి వచ్చాను. ఇది ఒక విలువైనటువంటి మిత్ర దేశం. ఎంతో మంది భారతీయుల కు ఆవాసం. కానీ, అక్కడ కు ఒక భారతీయ ప్రధాన మంత్రి ఎన్నడూ వెళ్ళింది లేదు. ఈ గౌరవం నాకు ఒక్కరికే వ్రాసి పెట్టి ఉంది! అక్కడ శిక్షల ను అనుభవిస్తున్నటువంటి 250 మంది భారతీయుల కు క్షమా భిక్ష ను ప్రసాదిస్తూ రాజ కుటుంబం తీసుకొన్నటువంటి దయార్ద్ర నిర్ణయం గమనించదగ్గది. ఓమాన్, ఇంకా సౌదీ అరేబియా లు కూడా ఇదే తీరున క్షమాభిక్ష లను ప్రసాదించాయి. భారతదేశం యొక్క హజ్ కోటా ను సౌదీ అరేబియా ఈ సంవత్సరం ఆరంభం లో పెంచింది.
మిత్రులారా,
నేను ఇటీవల యుఎఇ ని సందర్శించిన సందర్భం లో అక్కడ రూపే కార్డు ను ప్రారంభించడం జరిగింది. త్వరలో బహ్రెయిన్ లో కూడా రూపే కార్డు రంగ ప్రవేశం చేయనుంది. డిజిటల్ లావాదేవీల కు ఊతాన్ని అందించడం తో పాటు గల్ఫ్ లో పని చేస్తూ స్వదేశాని కి చెల్లింపులు జరిపే లక్షలాది ప్రజల కు ఇది సహాయకారి అవుతుంది. గల్ఫ్ తో భారతదేశం యొక్క సంబంధాలు ఇదివరకటి కన్నా ఉత్తమం గా ఉన్నాయని విన్నప్పుడు ఈ రోజు న నేను గర్వపడుతున్నాను. దీని సౌజన్యం తో ఎక్కువ గా లాభపడేది సామాన్య పౌరులే అని చెప్పవలసిన పని లేదు.
మిత్రులారా,
ప్రస్తుతం ప్రసార మాధ్యమాల లో ‘న్యూ ఇండియా’ యొక్క స్ఫూర్తి ని మనం చూస్తున్నాము. భారతదేశం లో అత్యంత వైవిధ్య భరితమైనటువంటి మరియు పురోగమిస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. వార్తా పత్రికల, మేగజీన్ ల, టివి చానల్ ల, వెబ్‌సైట్ ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ సందర్భం లో, వివిధ ఉద్యమాల.. స్వచ్ఛ్ భారత్ కావచ్చు, ఒక సారి వినియోగించిన అనంతరం ప్లాస్టిక్ ను నిర్మూలించడం కావచ్చు, జల సంరక్షణ కావచ్చు, ఫిట్ ఇండియా కావచ్చు.. సఫలత లో ప్రసార మాధ్యమాలు పోషించే పాత్ర ను గురించి కూడా నేను ప్రముఖం గా ప్రస్తావించవచ్చునా? అవి ఈ ఉద్యమాల ను వాటంతట అవే భుజాని కి ఎత్తుకొని, అసాధారణమైన ఆశయాల ను సాధించేటట్లు గా ప్రజల ను కార్యోన్ముఖులను చేశాయి.
మిత్రులారా, యుగాల తరబడి, అత్యంత ప్రజాదరణ కలిగిన ఆలోచనలు కాలాల కు, దూరాని కి ఎదురీదేందుకు భాష బహు శక్తివంతమైనటువంటి వాహకం గా ఉంటూ వస్తోంది. ప్రపంచం లో భారతదేశం ఇన్ని అధిక భాషల తో కూడిన ఒకే దేశం అయి ఉండవచ్చు. ఒక విధం గా ఇది ఒక శక్తి గుణకం గా ఉంది. అయితే, భాష ను దేశాన్ని విభజించడం కోసం కృత్రిమ కుడ్యాల ను ఏర్పరచేందుకు స్వార్ధపర శక్తులు దుర్వినియోగం చేశాయి కూడాను. ఈ రోజు న నేను వినమ్రం గా ఒక సూచన ను చేస్తున్నాను. మనం భారతదేశాన్ని ఏకం చేయడం కోసం భాష తాలూకు శక్తి ని వినియోగించలేమా?
ప్రసార మాధ్యమాలు ఒక సేతువు యొక్క పాత్ర ను పోషించగలవా? మరి వేరు వేరు భాషల ను మాట్లాడే ప్రజల ను అవి సన్నిహితం చేయగలవా? ఇది అనిపిస్తున్నంత కష్టమైనది ఏమీ కాదు. మనం దేశ వ్యాప్తం గా మాట్లాడేటటువంటి 10-12 వివిధ భాషల లో ఒక పదాన్ని ప్రచురించడం తో ఇట్టే ఒక ఆరంభించవచ్చు. ఒక సంవత్సర కాలం లోపల, ఒక వ్యక్తి వివిధ భాషల లో 300కు పైగా నూతన పదాల ను నేర్చుకోగలరు. ఒక వ్యక్తి మరొక భారతీయ భాష ను నేర్చుకొంటే, అతడు ఉమ్మడి పాశాల ను గురించి అతడు తెలుసుకో గలుగుతాడు; అలాగే, భారతీయ సంస్కృతి లో ఏకత్వాన్ని నిజం గానే ప్రశంసించ గలుగుతాడు. ఇది వివిధ భాషల ను నేర్చుకోవడం లో ఆసక్తి ని పలు బృందాల లో సైతం రేకెత్తించ గలుగుతుంది. హరియాణా లో ఒక బృందం మలయాళాన్ని నేర్చుకొంటూ ఉండటాన్ని, మరి కర్నాటక లో ఒక బృందం బెంగాలీ ని నేర్చుకోవడాన్ని గురించి ఊహించండి. తొలి అడుగు వేయడం మొదలుపెట్టిన తరువాతనే అన్ని సుదూరాల ను చుట్టి రావచ్చు; మరి మనం మొదటి అడుగు ను వేద్దామా?
మిత్రులారా,
ఈ గడ్డ మీద నడచిన మహా మునులు, మన పూర్వికులు- ఎవరైతే స్వాతంత్య్ర సమరం లో పాలుపంచుకొన్నారో- గొప్ప కలల ను కన్నారు వారు. 21వ శతాబ్దం లో, వాటి ని నెరవేర్చడం తో పాటు వారు గర్వపడేటటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించే బాధ్యత
మన మీద ఉంది.
దీని ని మనం సాధించగలమని, అంతేకాకుండా రానున్న కాలాల లో మర్నెన్నో కార్యాలు చేయగలమని నేను నమ్ముతున్నాను.
మరొక్క మారు, మలయాళ మనోరమ గ్రూపు కు నా శుభాకాంక్షలు మరియు నన్ను ఈ కార్యక్రమాని కి ఆహ్వానించినందుకు మీకు అందరి కీ ఇవే నా ధన్యవాదాలు.
మీకు ధన్యవాదాలు. మీకు అనేకానేక ధన్యవాదాలు.