అస‌మ్ లో మౌలిక స‌దుపాయాలు మెరుగైనందువ‌ల్ల ‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ కు ఒక ప్ర‌ధాన‌ కేంద్రం గా అస‌మ్ ఎదుగుతోంది: ప్ర‌ధాన మంత్రి

భారత్ మాతాకీ జయ్, భారత్ మాతాకీ జయ్

అస్సాంలో బహుళ జనాదరణ కలిగిన ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరుడు శ్రీ రామేశ్వర్ తేలీ జీ, అస్సాం ప్రభుత్వంలో మంత్రి డాక్టర్ హిమాంత బిశ్వ శర్మా జీ, సోదరులు అతుల్ బొరా గారూ , శ్రీ కేశవ్ మహంత జీ, శ్రీ సంజయ్ కిషన్ జీ, శ్రీ జగన్ మోహన్ జీ, హౌస్ ఫెడ్ చైర్మన్ శ్రీ రంజిత్ కుమార్ దాస్ గారూ , ఇతర లోకసభ సభ్యులు, శాసన సభ్యులు, అస్సాంకు చెందిన ప్రియమైన సోదర సోదరీమణులారా

నేను అస్సాం వాసులకు ఆంగ్ల నూతన సంవత్సర శుబాకాంక్షలు, భొగాలీ బిహు సందర్బంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రానున్న రోజులు అందరికీ శుభాలను చేకూర్చుగాక. ఆనందాన్ని ఇచ్చుగాక.

మిత్రులారా,

అస్సాం ప్రజల ఆశీర్వాదం, మీ ఆత్మీయత నాకు చాలా సౌభాగ్యకరం. మీరు చూపించే ఈ ప్రేమ, ఈ స్నేహం నన్ను పదేపదే అస్సాంకు రప్పిస్తోంది. గత పలు సంవత్సరాల్లో అనేక మార్లు అస్సాంలోని వివిధ ప్రాంతాలకు వచ్చి, అస్సాంలోని సోదర సోదరీమణులతో మాట్లాడి, వికాస కార్యంలో పాలుపంచుకునే అవకాశాలు లభించాయి. గతేడాది నేను కోక్రాఝార్ లో చరిత్రాత్మక బోడో ఒప్పందం తరువాత జరిగిన ఉత్సవంలో పాలుపంచుకున్నాను. ఈ సారి అస్సాం మూలనివాసుల స్వాభిమానం, సురక్షలతో ముడిపడ్డ ఇంత పెద్ద కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు, మీ సంతోషంలో భాగస్వామినయ్యేందుకు వచ్చాను. నేడు అస్సాం ప్రభుత్వం మీ జీవితాల్లోని అతిపెద్ద చింతాకరమైన విషయాన్ని తొలగించే పనిని చేసింది. లక్ష మందికి పైగా మూలనివాసుల కుటుంబాలకు భూ హక్కుల అధికారాన్ని ఇవ్వడం ద్వారా మీ జీవితాల్లోని అతి పెద్ద చింతను తొలగించింది.

సోదర సోదరీమణులారా,

ఈ రోజు స్వాభిమానం, స్వేచ్ఛ, సురక్షలకు  మూడు ప్రతీకల కలయిక కూడా నేడు జరుగుతోంది. మొదటగా, అస్సాం నేలను ప్రేమించే మూల నివాసులకు తమ భూమి పట్ల ఉన్న అనుబంధానికి రాజ్యాంగపరమైన సంరక్షణ లభించింది. రెండవ విషయం.. ఈ పని చరిత్రాత్మక శివసాగర్ లో , జెరెంగా పఠార్ లో జరుగుతోంది. ఈ భూమి అస్సాం భవిష్యత్తు కోసం సర్వోచ్చ బలిదానం చేసిన మహాసతి జాయమతి ప్రాణత్యాగ భూమి. నేను అమె అసమాన సాహసానికి, ఈ భూమికి ఆదరపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శివసాగర్ గొప్పదనాన్ని గుర్తించిన నేపథ్యంలో దేశంలోని అయిదు చరిత్రాత్మక పురాతత్వ ప్రదేశాల్లో దీనిని జోడించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది.

సోదర సోదరీ మణులారా,

నేడు మనం మనందరికీ శ్రద్ధాస్పదులైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125 వ జయంతిని దేశమంతటా జరుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి ఈ దినాన్ని పరాక్రమ్ దివస్ రూపంలో జరుపుకోవాలని దేశం ఇప్పుడు నిర్ణయించుకుంది. తల్లి భారతి స్వాభిమానం కోసం, స్వాతంత్ర్యం కొరకు నేతాజీ ని స్మరించుకుంటే నేటికీ ప్రేరణ లభిస్తూనే ఉంటుంది. నేడు పరాక్రమ దివస్ సందర్భంగా దేశమంతటా అనేక కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతోంది. కాబట్టి ఈ రోజు మన ఆకాంక్షలు నెరవేరడంతో పాటు జాతీయ సంకల్ప సిద్ధి కోసం ప్రేరణను పొందే రోజుగా కూడా గుర్తించాలి.

మిత్రులారా,

మనం మన మట్టిని ఇసుక, గడ్డి, రాళ్ల రూపంలోనే చూడం. అలాంటి సంస్కృతికి మనం ధ్వజవాహకులం. ఈ నేల మనకు తల్లి. అస్సాం కు చెందిన గొప్ప సుపుత్రుడు, భారత రత్న భూపేన్ హజారికా

ఓమూర్ ధరిత్రి ఆయి

చోరోనోటే డిబా థాయి

ఖేతీతియోకోర్ నిస్తార్ నాయి

మాటీబినే ఓహోహాయి

అన్నారు.  ఈ మాటలకు.. ఓ భూమాతా, నీచరణాల్లో స్థానం ఇవ్వు. నీవు లేకపోతే రైతు ఏం చేయగలడు. మట్టి లేకపోతే నిస్సహాయుడైపోతాడు.. అని అర్థం.

మిత్రులారా,

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా కూడా అస్సాంలో వివిధ కారణాల వల్ల తమ భూమిపై తమకు చట్టపరమైన అధికారాలు లేని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఇందువల్ల ఆదివాసీ క్షేత్రాల్లోని చాలా మంది భూమి లేని వారయ్యారు.  వారి ఆజీవిక నిరంతరం సంకటాలతో సావాసం చేస్తోంది. అస్సాంలో మా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అప్పటికి ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది మూల నివాసీ కుటుంబాల వద్ద తమ భూములకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేవు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు మీ గురించి ఆలోచించలేదు. దానికి ఎలాంటి ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. కానీ సర్బానంద సోనోవాల్ గారి నాయకత్వంలోని ఇక్కడి ప్రభుత్వం మీ బాధలను దూరం చేసేందుకు పనిచేసింది. నేడు అస్సాం మూలనివాసుల భాష, సంస్కృతుల  సంరక్షణతో పాటూ వారి భూ హక్కులను కూడా సంరక్షించే అంశం పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించడమైంది.  2019 లో కొత్త భూ విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వపు నిబద్ధతకు నిదర్శనం. ఈ ప్రయత్నాల ఫలితంగానే రెండు లక్షల మందికి పైగా మూల నివాసీ కుటుంబాలకు భూమి పట్టాలను ఇప్పటికే అందించడం జరిగింది. ఇప్పుడు ఈ జాబితాలో మరో లక్ష పై చిలుకు కుటుంబాలు వచ్చి చేరుతున్నాయి. అస్సాంలో ఇలాంటి మూలనివాసులకు చట్టబద్ధమైన భూహక్కులను వీలైనంత త్వరలో అందించడమే లక్ష్యం.

సోదర సోదరీమణులారా,

భూముల పట్టాలు లభించడంతో మూలనివాసుల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. దీనితో పాటు లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు మార్గం కూడా ఏర్పడింది. ఇప్పుడు వీరికి ఇప్పటివరకూ అందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర అనేక పథకాల లాభాలు కూడా లభించడం ఖాయమైపోయింది. నేడు వీరు అస్సాంలో ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన నిధి పథకం లో భాగంగా వేల రూపాయల సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలలో పొందుతున్న లక్షలాది కుటుంబాలలో కలిసిపోయారు.  ఇప్పుడు వీరికి కిసాన్ క్రెడిట్ కార్డు, పంట భీమా యోజన ఇంకా రైతుల కోసం ఉద్దేశించిన ఇతర పథకాలు అందుబాటులోకి వస్తాయి. అంతే కాదు. వారు తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఈ భూమి ని చూపించి బ్యాంకుల నుంచి రుణాన్ని సులువుగా పొందగలరు.

సోదర సోదరీమణులారా,

అస్సాంలోని దాదాపు 70 చిన్న, పెద్ద గిరిజన వర్గాలకు సామాజిక సంరక్షణ కల్పిస్తూ వారి అభివృద్ధి వేగంగా జరిగేలా చూసే బాధ్యత మా ప్రభుత్వానిదే. అటల్ జీ ప్రభుత్వమైనా, లేదా గత కొన్నేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ఎన్ డిఎ ప్రభుత్వాలు అస్సాం సంస్కృతి, స్వాభిమానం, సురక్షలకు పెద్ద పీట వేస్తున్నాయి. అస్సామియా భాష కు, సాహిత్యాలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు పలు చర్యలు తీసుకోవడం జరిగింది. శ్రీమంత శంకరదేవుల దర్శనం, వారి బోధనలు అస్సాంతో పాటు యావద్దేశానికి, మొతం మానవతకే ఒక అమూల్యైన సంపద వంటివి. ఇలాంటి సంపదను కాపాడుకుని, దీనికి ప్రచారం లభించేలా చూడటం ప్రతి ప్రభుత్వపు ప్రధాన కర్తవ్యం. కానీ బాటాద్రవా సత్రం తో పాటు ఇతర సత్రాల పట్ల ఎలా వ్యవహరించడం జరిగిందో అస్సాం ప్రజలకు బాగా తెలుసు. గత నాలుగున్నర ఏళ్లలో నమ్మకం, ఆధ్యాత్మికతలతో ముడిపడ్డ ఈ స్థానాలను భవ్యంగా తీర్చిదిద్దేందుకు, కళలతో ముడిపడ్డ చారిత్రాత్మక వస్తువులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించింది. ఇదే విధంగా అస్సాం కు, భారతదేశానికి పేరు తెచ్చిన కాజీరంగా నేశనల్ పార్కు ను కూడా ఆక్రమణల నుంచి విముక్తం చేసి, మరింత మెరుగుపరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టడం జరిగింది.

సోదర సోదరీమణులారా,

ఆత్మ నిర్భర భారత్ కోసం ఈశాన్య భారతదేశం, అస్సాంలు వేగవంతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భర అస్సాం ఇక్కడి ప్రజల ఆత్మవిశ్వాసం ద్వారానే సాధ్యమౌతుంది. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే కుటుంబాలకు సదుపాయాలు లభిస్తాయో, అప్పుడు రాష్ట్రాల్లో మౌలిక వసతులు కూడా మెరుగుపడతాయి. గత నాలుగేళ్లలో ఈ రెండు అంశాలపైనా అస్సాం మున్నెన్నడూ లేనంత చక్కగా పనిచేసింది. అస్సాంలో దాదాపు 1.75 కోట్ల మంది పేదలు జన్ ధన్ ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాల వల్లే కరోనా సమయంలో కూడా వేలాది మంది సోదరీ మణులకు, లక్షలాది మంది రైతులకు బ్యాంకు ఖాతాల లోకి నేరుగా సహాయాన్ని పంపించడం సాధ్యమైంది. నేడు అస్సాంలోని దాదాపు నలభై శాతం మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ నుంచి లబ్ది పొందగలిగారు. వీరిలో దాదాపు లక్షన్నర మందికి ఉచిత వైద్యం కూడా లభించింది. గత ఆరునెలల్లో అస్సాంలో మరో 38 శాతం టాయిలెట్ల నిర్మాణం జరిగి ఇప్పుడు నూటికి నూరు శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం అస్సాంలో యాభై శాతం కన్నా తక్కువ ఇళ్లకే విద్యుత్ కనెక్షన్ అందుబాటులో ఉండేది. ఇప్పుడది నూటికి నూరు శాతానికి చేరుకుంది. జల్ జీవన్ మిశన్ లో భాగంగా గత ఏడాదిన్నర కాలంలో అస్సాంలో రెండున్నర లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్ ను ఇవ్వడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ మూడు నాలుగేళ్లలోనే అస్సాంలోని ప్రతి ఇంటి వరకూ పైపు లైన్ల ద్వారా నీటిని అందించే దిశలో పనిచేస్తోంది.

సోదర సోదరీమణులారా,

ఈ సదుపాయాలన్నిటి వల్ల అందరికన్నా ఎక్కువగా లబ్ది పొందింది మన సోదరీమణులు, మన కుమార్తెలు. అస్సాంలోని సోదరీమణులు, అమ్మాయిలకు ఉజ్వల యోజన నుంచి కూడా చాలా లాభం చేకూరింది. నేడు అస్సాంలోని దాదాపు 35 లక్షల మంది పేద సోదరీమణుల వంటిళ్లలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇందులో దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు. 2014 లో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అస్సాంలో కేవలం నలభై శాతం ఎల్ పీ జీ కనెక్షన్లు ఉండేవి. ఇప్పుడు ఉజ్వల యోజన వల్ల అస్సాంలో దాదాపు 99 శాతం వరకూ ఎల్ పీ జీ కవరేజ్ పెరిగింది. అస్సాంలోని సుదూర ప్రాంతాలకు గ్యాస్ పంపిణీ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చేసేందుకు గాను ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. 2014 లో అస్సాంలో 330 మంది ఎల్ పీ జీ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి 575 కన్నా ఎక్కువ కు చేరుకుంది. కరోనా సమయంలోనూ ఉజ్వల యోజన ఎలా ప్రజలకు ఎలా మేలు చేసిందో మనం చూశాము. ఈ సమయంలో అస్సాంలో యాభై లక్షల కన్నా ఎక్కువ ఉచిత సిలిండర్లను ఉజ్వల లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది. అంటే ఉజ్వల యోజన ద్వారా అస్సాం లోని సోదరీమణుల బ్రతుకులు సులువయ్యాయి. దీని కోసం వందలాది కొత్త డిస్ట్రిబ్యూశన్ సెంటర్ లు ఏర్పాటయ్యాయి. దీని వల్ల చాలా మంది యువకులకు ఉపాధి లభించింది.

మిత్రులారా,

సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రం ఆధారంగా పనిచేస్తున్న మా ప్రభుత్వం అస్సాంలోని అన్ని భాగాలకు, అన్ని వర్గాలకు వికాస ఫలాలను వేగవంతంగా అందించే పనిలో నిమగ్నమైపోయింది. గతంలోని విధానాల వల్ల టీ తోటల్లో పనిచేసేవారి స్థితిగతులు ఎలా ఉండేవన్న విషయం నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఇప్పుడు టీ తోటల పనివారికి ఇళ్లు, శౌచాలయాల వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. టీ తోటల్లో పనిచేసే అనేక కుటుంబాలకు కూడా భూ హక్కులు లభించాయి. టీ తోటల్లో పనిచేసే వారి పిల్లలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి సదుపాయాలు అందించడం పై దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. తొలి సారి వారికి బ్యాంకు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ కుటుంబాలకు కూడా వేర్వేరు పథకాల లాభాలు నేరుగా ఖాతాలలో పడిపోతున్నాయి. కార్మికుల నేత సంతోష్ టోప్ ణో తో సహా పలువురు పెద్ద నాయకుల విగ్రహాలను స్థాపించి, టీ తోటల కార్మికుల పాత్రను గుర్తించి గౌరవించింది.

మిత్రులారా,

అన్ని ప్రాంతాల్లో ఉన్న అందరు గిరిజనులను వెంట తీసుకుని ముందుకు సాగే ఈ విధానం వల్ల అస్సాం నేడు శాంతి, పురోగతుల మార్గంలో ముందుకు సాగుతోంది. చారిత్రాత్మక బోడో ఒప్పందం వల్ల నేడు అస్సాంలో చాలా పెద్ద ప్రాంతం శాంతి, పురోగతుల బాటలోకి తిరిగి వచ్చాయి. ఒప్పందం తరువాత ఈ మధ్యే బోడో లాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ కి తొలి సారి ఎన్నికలు జరిగాయి. ప్రతినిధులు ఎన్నికయ్యారు. బోడో టెరిటోరియల్ కౌన్సిల్ అభివృద్ధి, విశ్వాసాల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందన్న విశ్వాసం నాకుంది.

సోదర సోదరీ మణులారా,

నేడు మా ప్రభుత్వం అస్సాం అవసరాలను గుర్తించి, అవసరమైన అన్ని ప్రాజెక్లులపై వేగవంతంగా పనిచేస్తోంది. గత ఆరేళ్లలో అస్సాం తో సహా ఈశాన్య భారతంలో కనెక్టివిటీతో, తదితర మౌలిక వసతులు మున్నెన్నడూ లేనంతగా విస్తరిస్తున్నాయి. వీటిని ఆధునీకరించడం కూడా జరుగుతోంది. నేడు అస్సాం, ఈశాన్య భారత్ లో ‘యాక్ట్ ఈస్ట్ పాలిసీ’ లో భాగంగా తూర్పు ఆసియా దేశాలలో కూడా మన సంబంధాలు మెరుగు పడుతున్నాయి. మెరుగైన మౌలిక వసతుల వల్లే అస్సాం ఆత్మ నిర్భ్ భారత్ లో ఒక ప్రధానమైన క్షేత్రంగా వికసిస్తోంది. గత కొన్నేళ్లలో అస్సాంలోని గ్రామాల్లో దాదాపు పదకొండు వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లను వేయడం జరిగింది. డాక్టర్ భూపేన్ హజారికా వారధి కావచ్చు, బొగీ బిల్ బ్రిడ్జి కావచ్చు, సరాయ్ ఘాట్ బ్రిడ్జి కావచ్చు ... ఇలాంటి పలు వంతనెలను నిర్మించడం జరిగింది. మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటి వల్ల కనెక్టివిటీ బలోపేతం అయింది. ఇప్పుడు ఈశాన్య భారతం, అస్సాం ప్రజలకు చాలా దూరపు మార్గాల్లో ప్రమాదభరితప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి నుంచి విముక్తి లభించింది. దీనితో పాటు జల మార్గాల ద్వారా బాంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మ్యాంమార్ లతో కనెక్టివిటీని పెంచే విషయంలోనూ దృష్టిని కేంద్రీకరించడం జరుగుతోంది.

మిత్రులారా,

అస్సాంలో ఎలాగైతే రైలు, విమాన కనెక్టివిటీ పరిధి విస్తృతమౌతోందో, లాజిస్టిక్స్ తో ముడిపడ్డ సదుపాయాలు మెరుగవుతున్నాయో అదే విధంగా పరిశ్రమలు, ఉపాధులకు సంబంధించి కొత్త సదుపాయాలు ఏర్పాటవుతున్నాయి. లోకప్రియ గోపినాథ్ బర్దొలోయి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఆధునిక టర్మినల్, కస్టమ్స్ క్లియరెన్స్ సెంటర్ నిర్మాణం, కోక్ రాఝార్ లో రూపసీ విమానాశ్రయం ఆధునీకరణ, బొంగై గావ్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ నిర్మాణం వంటి సదుపాయాల వల్లే అస్సాంలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త బలం చేకూరుతుంది.

సోదర సోదరీమణులారా,

నేడు దేశం గ్యాస్ ఆదారిత ఆర్ధిక వ్యవస్థ దిశగా వేగంగా ముందుకు వెళ్తుంది. ఈ ప్రయత్నంలో అస్సాం చాలా ముఖ్యమైన భాగస్వామి. అస్సాంలో చమురు, గ్యాస్ లతో ముడిపడ్డ మౌలిక వసతులపై గత కొన్నేల్లలో నలభై వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడిగా పెట్టడం జరిగింది. గువాహాటీ- బరౌనీ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఈశాన్య భారతం, తూర్పు భారతాల మధ్య గ్యాస్ కనెక్టివిటీ బలోపేతం కానుంది. దీని వల్ల అస్సాంలో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నుమాలీగఢ్ రిఫైనరీ ని విస్తృతీకరించడం తోపాటు, అక్కడ ఇప్పుడు బయో రిఫైనరీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. దీని వల్ల చమురు, గ్యాస్ తో పాటు ఇథెనాల్ వంటి బయో ఫ్యూయల్ ల ఉత్పాదన చేసే ప్రధాన రాష్ట్రంగా అస్సాం ఎదగబోతోంది.

సోదర సోదరీమణులారా

అస్సాం ఇప్పుడు ఆరోగ్యం, విద్యా రంగాల కేంద్రం గా కూడా వికసిస్తోంది. ఆలిండియా ఇన్స్ టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వంటి సంస్థల వల్ల అస్సాంలోని యువకులకు ఆధునిక విద్య లో కొంగొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అస్సాం కరోనా మహమ్మారి ని ఎదుర్కొన్న విధానం కూడా ప్రశంసనీయమైనది. నేను అస్సాం ప్రజలతో పాటు, సోనోవాల్ గారికి, హేమంత్ గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు అస్సాం టీకాల ఉద్యమంలోనూ సఫలతాపూర్వకంగా ముందుకు వెళ్తుందన్న నమ్మకం నాకుంది. కరోనా టీకాలు వేసేటప్పుడు తమ వంతు రాగానే తప్పని సరిగా టీకాలు వేయించుకోవాల్సిందిగా నేను అస్సాం ప్రజలను కోరుతున్నాను. టీకా ఒక్క డోస్ మాత్రమే సరిపోదు. రెండో డోసును కూడా వేసుకోవాలన్నది తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి.

మిత్రులారా,

యావత్ ప్రపంచంలో భారత్ లో తయారైన టీకాలకు డిమాండ్ పెరుగుతోంది. భారత దేశంలోనూ లక్షలాది మంది ఇప్పటికే టీకాలు వేయించుకున్నారు. మనం కూడా టీకాలు వేయించుకోవాలి. జాగ్రత్తలను కూడా పాటించాలి. చివరగా మరో సారి భూ హక్కులను పొందిన సహచరులందరికీ అనేనానేక ధన్యవాదాలను తెలియచేస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరందరూ పురోగతి సాధించాలని కోరుకుంటూ అనేకానేక కృతజ్ఞతలు. నా సహచరులారా నాతో పాటు గొంతు కలపండి – భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్.

అనేకానేక ధన్యవాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage