నమస్కార్, ఖులుమఖా!
త్రిపుర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్ జీ, జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ విప్లవ్ దేవ్ జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ జిష్ణఉ దేవ్ వర్మ జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియమైన త్రిపుర సోదర, సోదరీమణులారా.. త్రిపుర అభివృద్ధికి మూడేళ్లు పూర్తవుతుండటంతోపాటు పరిస్థితుల్లో స్పష్టమైన సానుకూల మార్పు కనిపిస్తున్న సందర్భంగా మీ అందరికీ హార్దిక శుభాకాంక్షలు, అభినందనలు.
సోదర, సోదరీమణులారా,
నేటికి మూడేళ్ల పూర్వం త్రిపుర ప్రజలు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తద్వారా యావద్భారతదేశానికి ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దశాబ్దాలుగా రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా నిలిచిన శక్తులను అధికారం గద్దెదించి త్రిపుర ప్రజలు ఓ కొత్త శకాన్ని ప్రారంభించారు. వారు త్రిపురను, త్రిపుర సామర్థ్యాన్ని సంకెళ్లతో బంధించి పెడితే.. మీరు ఆ సంకెళ్లను తెంచేశారు. తల్లి త్రిపురాసుందరీ దేవి ఆశీర్వాదంతో.. విప్లవ్ దేవ్ జీ నాయకత్వంలోని ప్రభుత్వం సంకల్పించిన దానికంటే వేగంగా పనులు పూర్తిచేస్తోంది.
మిత్రులారా,
2017లో మీరు త్రిపుర అభివృద్ధికి డబుల్ ఇంజన్ తగిలించాలని నిర్ణయించారు. ఓ ఇంజన్ త్రిపురలో, మరో ఇంజన్ ఢిల్లీలో. ఈ డబుల్ ఇంజన్ నిర్ణయం కారణంగానే.. అభివృద్ధి మార్గం జోరందుకుంది. మీ ముందు దీనికి సంబంధించిన ఆధారాలున్నాయి. గతంలో త్రిపురలో 30 ఏళ్లపాటున్న డబుల్ ఇంజన్ అభివృద్ధికి, ఈ మూడేళ్ల డబుల్ ఇంజన్ అభివృద్ధికి తేడాను మీరు స్పష్టంగా గమనించవచ్చు. కమిషన్లు, అవినీతి లేకుండా పనులు జరగడం కష్టమైన చోట.. ప్రభుత్వం ద్వారా అందే లబ్ధి ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా చేరుతోంది. ఉద్యోగులు సమయానికి వేతనం పొందేందుకు కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి వారికి ఏడవ వేతన సవరణ సంఘం ద్వారా వేతనాలు లభిస్తున్నాయి. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అష్టకష్టాలు పడేవారు. ఇప్పుడు ఎమ్మెస్పీ (కనీస మద్దతు ధర)పై రైతుల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజుకు రూ.135 లభించే కూలీలకు ఇవాళ రూ.205 అందుతున్నాయి. కొన్నేళ్లుగా ఆందోళనల సంస్కృతికి కేంద్రంగా ఉన్న త్రిపురలో ఇప్పుడు వ్యాపారానుకూల వాతావరణం నిర్మితమైంది. పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నుంచి.. ఇప్పుడు అవే సంస్థలు ఎందరోమంది యువకులకు ఉపాధికల్పన కేంద్రాలుగా మారాయి. త్రిపుర వ్యాపార పరిణామం పెరుగుతూ వస్తోంది. ఈ రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల్లోనూ 5రెట్లు వృద్ధి కనిపిస్తోంది.
మిత్రులారా,
త్రిపుర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రతి అవకాశంపైనా దృష్టిపెట్టింది. గత ఆరేళ్లలో త్రిపురకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే నిధుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2009 నుంచి 2014 వరకు త్రిపుర అభివృద్ధికి వివిధ పథకాల రూపంలో కేంద్రం నుంచి రూ.3500 కోట్లు అందాయి. కానీ 2014 నుంచి 2019 మధ్య మా ప్రభుత్వం రూ. 12వేల కోట్లకు పైగా నిధులను అందించింది. ఇవాళ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలకు నేడు త్రిపుర ఓ ఉదాహరణగా మారింది. ఆయా రాష్ట్రాలు కూడా డబుల్ ఇంజన్ అభివృద్ధిని కోరుకుంటున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఢిల్లీ ప్రభుత్వంతో ఘర్షణకు సిద్ధపడుతు తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాయనే విషయం ప్రజలకు అర్థమవుతోంది. త్రిపుర కూడా విద్యుత్ లోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉండేది. నేడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కారణంగా.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా వృద్ధి చెందింది. 2017కు ముందు త్రిపురలో కేవలం 19వేల గ్రామీణ ఇళ్లకు మాత్రమే నల్లా ద్వారా మంచినీరు అందే పరిస్థితి ఉండేది. నేడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కారణంగా 2లక్షల గ్రామీణ ఇళ్లకు నల్లా ద్వారా తాగునీరు అందుతోంది.
2017కు ముందు త్రిపురలో 5లక్సల 80వేల ఇళ్లలో గ్యాస్ కనెక్షన్లు ఉండేవి. అంటే ఆరులక్షల కన్నా తక్కువే. నేడు రాష్ట్రంలోని 8.5 లక్షల ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ ఉంది. మా డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ముందు త్రిపురలో కేవలం 50శాతం గ్రామాలే బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా ఉండేవి. నేడు దాదాపు ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా నిలుస్తోంది. సౌభాగ్య పథకం ద్వారా త్రిపుర 100శాతం విద్యుదీకరణను పూర్తిచేసుకుంది. ఉజ్వల పథకం ద్వారా రెండున్నర లక్షలకు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. దీంతోపాటు 50వేలకు పైగా గర్భిణులకు మాతృవందన పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ఢిల్లీ, త్రిపుర ప్రభుత్వం డబుల్ ఇంజన్ అభివృద్ధి కారణంగా రాష్ట్రంలోని సోదరీమణులు, చెల్లెల్లకు సాధికారత కల్పించేందుకు కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా త్రిపుర రైతులు, పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల్లో, మీ పక్క రాష్ట్రాల్లో, అక్కడి రైతులకు, పేదలకు, మహిళలకు, చెల్లెల్లకు సాధికారత కల్పించే పథకాలు అమలు జరగడం లేదు. కొన్నిచోట్ల ఈ పథకాలు అనుకున్నంత త్వరితంగా ప్రజలకు అందడం లేదు.
మిత్రులారా,
డబుల్ ఇంజన్ ప్రభుత్వం కారణంగా పేదలకు పక్కా ఇళ్లు ఇచ్చే పని వేగం పుంజుకుంది. ఇవాళ త్రిపుర ప్రభుత్వం నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో రాష్ట్రంలోని 40వేల పేద కుటుంబాలకు సొంతింటి స్వప్నం సాకారం అవుతోంది. ఆ లబ్ధి దారులందరూ తమ ఓటు ఎంత శక్తివంతమైనదో, దాని ద్వారా తమ స్వప్నాన్ని, లక్షాలను ఎలా సాకారం చేసుకోవచ్చునో అర్థం చేసుకుంటున్నారు. సొంతిల్లు ఉంటే ఖర్చు మిగిలి దాన్ని తమ పిల్లల ఆకాంక్షలను పూర్తి చేసేందుకు సద్వినియోగం చేసుకోవచ్చు.
సోదర, సోదరీమణులారా,
డబుల్ ఇంజన్ ప్రభుత్వం శక్తిసామర్థ్యాల కారణంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలులో.. అది గ్రామీణమైనా.. పట్టనాల్లో అయినా.. త్రిపుర చాలా వేగంగా ముందుకెళ్తోంది. త్రిపురలోని చిన్న-పెద్ద పట్టణాల్లో పేదలకోసం దాదాపు 80వేలకు పైగా పక్కా ఇళ్లు లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆధునిక సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ఆరు రాష్ట్రాల్లో త్రిపుర కూడా ఒక రాష్ట్రంగా నిలవడం సంతోషకరం.
సోదర, సోదరీమణులారా,
త్రిపురలో HIRA అభివృద్ధి చేస్తామని మేం మీకు వాగ్దానం చేశాం. ఇందుకోసం డబుల్ ఇంజన్ శక్తితో పనిచేస్తామని చెప్పాం. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో చూస్తున్నప్పుడు ఆ వివరాలను నాకు తెలియజేశారు. HIRA అంటే హైవేలు, ఐవేలు, రైల్వేలు, ఎయిర్ వే. త్రిపురకు ఓ స్పష్టమైన అనుసంధానతను కల్పించేందుకు అవసరమైన మౌలికవసతుల కల్పన కార్యక్రమం మూడేళ్లుగా వేగంగా జరుగుతోంది. ఎయిర్ పోర్టుల నిర్మాణమైనా లేదా.. సముద్రమార్గంతో త్రిపురను అనుసంధానం చేయడమైనా, ఇంటర్నెట్ కనెక్షన్లు అయినా.. రైల్వే లింక్ అయినా.. ప్రతి పని వేగంగా జరుగుతోంది. ఇవాళ రూ.3వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసుకుంటున్నామో.. అవన్నీ HIRA మోడల్ అభివృద్ధిలో భాగమే. దీంతోపాటు జలరవాణా, పోర్టు ఆధారిత మౌలికవసతులను కూడా ఇందులో చేర్చడం జరిగింది.
మిత్రులారా,
ఇదే విధంగా ఇవాళ గ్రామాలకోసం రోడ్లు, హైవేల విస్తరణ పనులు, వంతెనలు, పార్కింగ్, ఎగుమతులకు అనుకూలమైన మౌలికవసతుల కల్పన, స్మార్ట్ సిటీ సంబంధిత ప్రాజెక్టుల లబ్ధి నేడు త్రిపుర రాష్ట్రానికి సంపూర్ణంగా అందుతోంది. నేడు అనుసంధానతకు సంబంధించిన ప్రాజెక్టులు మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల జీవనాన్ని కూడా సౌకర్యవంతం మారుస్తాయి. తద్వారా ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అనుసంధానత కార్యక్రమం బంగ్లాదేశ్ తో మన మైత్రిని, మన వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఎంతగానో ఉపయుక్తం అవుతుంది.
మిత్రులారా,
ఈ ప్రాంతాన్ని యావత్ ఈశాన్య భారతం, బంగ్లాదేశ్ మధ్య ఒక రకమైన వ్యాపార కారిడార్ రూపంలో అభివృద్ధి చేస్తున్నాం. నేను బంగ్లాదేశ్ లో పర్యటించినపుడు.. వారి ప్రధాని శ్రీమతి షేక్ హసీనా గారితో కలిసి బంగ్లాదేశ్, త్రిపురలను అనుసంధానం చేసే ఈ వంతెనకు శంకుస్థాపన చేశాం. దాన్ని ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. ఇవాళ భారత్-బంగ్లాదేశ్ స్నేహ బంధం, అనుసంధానత పెరుగుతున్న విషయాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారి మాటల్లోనూ విన్నాం. సబ్రూమ్-రామ్‌గఢ్ మధ్య నిర్మితమైన ఈ వంతెన.. ఇరుదేశాల మధ్య బంధాలను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య ఉపరితల రవాణా, రైలు, జల అనుసంధానతకు సంబంధించిన ప్రణాళికలు అమలులో ఉన్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఈ ప్రయత్నం మరో అడుగు ముందుకు పడింది. దీని ద్వారా త్రిపురతోపాటు దక్షిణ అసోం, మిజోరం, మణిపూర్ (బంగ్లాదేశ్ వైపు)తోపాటు ఆగ్నేయాసియాలోని దేశాలను అనుసంధానత మెరుగుపడుతుంది. భారత్ తోపాటు బంగ్లాదేశ్ లోనూ ఈ బ్రిడ్జి నిర్మాణంతో తదనంతర ప్రాజెక్టులు జోరందుకుంటాయి. తద్వారా ఆర్థిక అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇరుదేశాల సంబంధాల బలోపేతంపాటు పర్యాటకం, వ్యాపారం, పోర్టు ఆధారిత అభివృద్ధికి సంబంధించి సరికొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. సబ్రూమ్ తోపాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు పోర్టు ఆధారిత అనుసంధానత, అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి.
మిత్రులారా,
మైత్రి సేతుతోపాటు ఇతర సౌకర్యాలను ఇలాగే మెరుగుపరిచినపుడు ఈశాన్యభారతంలో పంపిణీకి సంబంధించి రోడ్డు రవాణాపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. సముద్ర మార్గం, నదుల ద్వారా జలరవాణా.. మొదలైనవి మరింత విస్తృతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి వస్తాయి. దక్షిణ త్రిపుర గొప్పదనాన్ని చూస్తూ సబ్రూమ్ లోనూ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు నిర్మాణం ఇవాళ్టినుంచి ప్రారంభమైంది. ఇది ఐసీపీ అంటే ఓ పరిపూర్ణమైన లాజిస్టిక్ హబ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ పార్కింగ్ లాట్స్ సిద్ధమవుతాయి, వేర్ హౌజెస్ వస్తాయి, కంటైనర్ ట్రాన్స్ షిప్‌మెంట్ సౌకర్యం వంటివి తయారవుతాయి.
మిత్రులారా,
ఫెనీ బ్రిడ్జి తెరుచుకుంటే.. అగర్తాలా, అంతర్జాతీయ సముద్ర పోర్టుతో చాలా దగ్గరగా అనుసంధానం అవుతుంది. 8వ నెంబరు జాతీయ రహదారి, 208వ నెంబరు జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవాళ జాతికి అంకితం అవడం, శంకుస్థాపన చేసుకున్నాం. దీని ద్వారా ఈశాన్య రాష్ట్రాల అనుసంధాన మరింత బలోపేతం అవుతుంది. దీని ద్వారా అగర్తాలా యావత్ ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైన లాజిస్టిక్స్ కేంద్రంగా మారుతుంది. ఈ మార్గం ద్వారా రవాణా ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఈశాన్య రాష్ట్రాలకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయి. త్రిపుర రైతులు తమ పళ్లు, కూరగాయలు, పాలు, చేపలు, ఇతర వస్తువులను విక్రయించేందుకు దేశ, విదేశాల్లోని మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్న పరిశ్రమలకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్తగా వస్తున్న పరిశ్రమలకు కూడా మేలు జరుగుతుంది. ఇక్కడి వస్తువులు, ఉత్పత్తులు విదేశీ మార్కెట్లోనూ పోటీగా నిలుస్తాయి. గత కొన్నేళ్లలో ఇక్కడి వెదురు ఉత్పత్తులు, అగరొత్తుల పరిశ్రమల వారికి, పైనాపిల్ (అనాసపండు) ఉత్పత్తిదారులకు ఎంతో లబ్ధి జరిగింది. వారికోసం సరికొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి కూడా.
సోదర, సోదరీమణులారా,
అగర్తాలా వంటి పట్టణాలు ‘ఆత్మనిర్భర భారత్’ కేంద్రాలుగా మారే సామర్థ్యం ఉంది. ఇవాళ అగర్తాలా కంటే మంచి నగరాన్ని నిర్మించేందుకు అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, జాతికి అంకితం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్.. నగరంలోని వ్యవస్థలను, సౌకర్యాలను సాంకేతికత ఆధారంగా సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయుక్తం అవుతుంది. ట్రాఫిక్ సంబంధిత సమస్యలను తగ్గించడం, నేరాలను అదుపులోకి తీసుకురావడం తదితర లాభాలుంటాయి. దీంతోపాటు మల్టీలెవల్ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్సులు, ఎయిర్ పోర్టును అనుసంధానిచే రోడ్డు విస్తరణ ద్వారా అగర్తాలాలో వ్యాపారానుకూల, జీవనానుకూల వాతావరణంలో చక్కటి మార్పులు కనిపిస్తాయి.
సోదర, సోదరీమణులారా,
ఇలాంటి కార్యక్రమాలు, పనులు జరుగుతున్నప్పుడు ఏళ్లుగా విస్మరించబడిన వారందరికీ ఎక్కువ లబ్ధి జరుగుతుంది. మరీ ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాల్లోని సోదర, సోదరీమణులకు, బ్రూ శరణార్థులకు మేలు జరుగుతుంది. త్రిపురలోని బ్రూ శరణార్థులకు దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు ఈ ప్రభుత్వ ప్రయత్నాల ద్వారా పరిష్కారం లభించింది. వేల మంది బ్రూ మిత్రుల అభివృద్ధికోసం ఇచ్చిన రూ.600కోట్ల ప్రత్యేకమైన ప్యాకేజీతో వారి జీవితాల్లో సానకూలమైన మార్పు స్పష్టంగా గోచరిస్తోంది.
మిత్రులారా,
ఇంటింటికీ మంచినీరు అందినపుడు, ప్రతి ఇంట్లో విద్యుత్ ఉన్నప్పుడు, ఆరోగ్య సంబంధిత సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినపుడు.. ప్రజలకు మరీ ముఖ్యంగా మన గిరిజన ప్రాంతాలవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పనినే కేంద్రంతోపాటు త్రిపుర ప్రభుత్వం సంయుక్తంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ‘ఆగినీ హాఫంగ్, త్రిపుర హాస్తేనీ, హుకుమ్ నో సీమీ యా, కరూంగ్ బోరోక్-రోకనో బో, సోయీ బోరోమ్ యాఫారఖా’ (బెంగాలీ). అగర్తాలా విమానాశ్రయానికి మహారాజా వీర్ విక్రమ్ కిశోర్ మాణిక్య గారి పేరు పెట్టడం.. ఈ రాష్ట్ర అభివృద్ధికోసం వారి కృషిని గౌరవించుకోవడమే. త్రిపురలోని సమృద్ధమైన సంస్కృతి, సాహిత్య సేవ చేసిన శ్రీ థంగా డార్లాంగ్ జీ, శ్రీ సత్యరామ్ రియాంగ్ జీ, శ్రీ బేణీచంద్ర జమాతియా జీ వంటి వారికి పద్మశ్రీ అవార్డులతో సత్కరించుకునే అవకాశం మాకు దక్కింది. ఈ సంస్కృతి, సాహిత్య సాధకులు చేసిన కృషికి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. బేణిచంద్ర జమాతియా గారు మన మధ్య భౌతికంగా లేనప్పటికీ.. వారు చేసిన కార్యక్రమాలు మమ్మల్ని ఎప్పుడూ చైతన్య పరుస్తూ ఉంటాయి.
మిత్రులారా,
జనజాతీయ హస్తకళ, వెదురు ఆధారిత కళకు, ప్రధానమంత్రి వన్-ధన్ పథకం ద్వారా ప్రోత్సాహం కల్పించేందుకు.. గిరిజన సోదర, సోదరీమణులకోసం ఆదాయమార్గాలెన్నో అందుబాటులోకి వస్తున్నాయి. ‘వెదురు బిస్కట్ల’ను తొలిసారి ప్యాకేజ్డ్ ఉత్పత్తుల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారని ఇప్పుడే చెప్పారు. ఇది ప్రశంసనీయమైన పని. ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించడం ప్రజలకు ఎంతగానో ఉపయుక్తం అవుతుంది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో గిరిజనులకోసం ఏకలవ్య మోడల్ పాఠశాలలు, ఇతర ఆధునిక సౌకర్యాలకోసం ప్రత్యేకమైన కేటాయింపులు జరిగాయి. రానున్న రోజుల్లో త్రిపుర ప్రజలకోసం రాష్ట్ర ప్రభుత్వం మరింత సేవ చేస్తుందనే విశ్వాసం నాకుంది. త్రిపుర ప్రజలకు సేవ చేసేసేందుకు విప్లవ్ జీ, వారి మొత్తం బృందం, అధికారులు మూడేళ్లుగా చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత శ్రమించి మరింత ఎక్కువ సేవ చేస్తారు. త్రిపుర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఈ విశ్వాసంతో మరోసారి మీ అందరికీ అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ధన్యవాదములు.