అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు“ఎం.కె.1ఎ" సైన్యానికి అప్పగింత
ఈ ప్రాజెక్టులు సృజనాత్మకతకు, స్వదేశీ అభివృద్ధికి ప్రతీకలు. తమిళనాడు అభివృద్ధిని వేగిరపరుస్తాయి: ప్రధాని
పుల్వామా దాడిలో అమరులకు మోదీ నివాళులు
రక్షణరంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనపై దృష్టి
తీరప్రాంతాల అభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక ప్రాధాన్యం: ప్రధాని
శ్రీలంకలోని తమిళుల సంక్షేమం, వారి మనోభావాలపై ప్రభుత్వం ఎప్పడూ శ్రద్ధచూపుతోంది: ప్రధాని
తమిళనాడు సంస్కృతిని పరిరక్షించడం మాకు గౌరవం. తమిళనాడు సంస్కృతికి ప్రపంచ వ్యాప్త జనాదరణ ఉంది: ప్రధాని

వణక్కం చెన్నై!

వణక్కం తమిళనాడు!

తమిళనాడు గవర్నర్ శ్రీ బన్వర్ లాల్ పురోహిత్ గారు, తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ పళనిస్వామి గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పన్నీర్ సెల్వంగారు, తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ శ్రీ ధనపాల్ గారు, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ సంపత్ గారు, గౌరవనీయులైన ప్రముఖులు, లేడీస్ అండ్ జంటిల్మెన్,..నమస్కారం.

 

ప్రియమైన నా మిత్రులారా,

ఈ రోజు నేను చెన్నైలో ఉండటం నాకు ఆనందంగా ఉంది. ఈ రోజు నాకు ఎంతో సాదరంగా ఆహ్వానం పలికిన చెన్నై ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజ్ఞానానికి, సృజనాత్మకతకు పేరుగాంచిన నగరం చెన్నై. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మేం చెన్నైనుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ప్రాజెక్టులు సృజనాత్మకతకు, స్వదేశీ అభివృద్ధికి చిహ్నాలు. తమిళనాడు ప్రగతిని ఈ ప్రాజెక్టులు మరింత వేగవంతం చేస్తాయి.

మిత్రులారా,

ఈ నాటికి కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే,..ఆరువందలా ముప్పై ఆరు కిలోమీటర్ల పొడవైన గ్రాండ్ ఆనికట్ కెనాల్ వ్యవస్థ నిర్మాణానికి మనం పునాదిరాయి వేసుకుంటున్నాం. ఇది ఎంతో సుదీర్ఘకాలం ప్రభావం చూపగలిగే భారీ ప్రాజెక్టు. 2.27లక్షల ఎకకరాల భూమిలో సేద్యపునీటి సదుపాయాలను ఇది పూర్తిగా మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టుతో తంజావూరు, పుదుక్కోటై జిల్లాలకు ప్రత్యేకంగా ప్రయోజనం చేకూరుతుంది. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సాధించినందుకు, నీటి వనరులను సద్వినియోగం చేసుకున్నందుకు తమిళనాడు రైతులను నేను అభినందించ దలుచుకున్నాను. అన్నపూర్ణ, ధాన్యాగారం అయిన తమిళనాడు రాష్ట్రానికి, ఈ గ్రాండ్ ఆనికట్, కెనాల్ వ్యవస్థ కూడా వేలాది సంవత్సరాలుగా జీవనాడిగా ఉంటూ వస్తోంది. వైభవోపేతమైన మన గతచరిత్రకు గ్రాండ్ ఆనికట్ ఒక సజీవ సాక్ష్యం. మన దేశం నిర్దేశించుకున్న “ఆత్నిర్భర్ భారత్” లక్ష్యాలకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ప్రసిద్ధ తమిళ కవి అవ్వైయ్యార్ మాటల్లో చెప్పాలంటే,..

 

वरप्पु उयरा नीर उयरूम

नीर उयरा नेल उयरूम

नेल उयरा कुड़ी उयरूम

कुड़ी उयरा कोल उयरूम

कोल उयरा कोण उयरवान

నీటి మట్టం పెరిగినపుడు పంటల సాగు పెరుగుతుంది. ప్రజలు వర్ధిల్లుతారు, రాష్రమూ పురోగమిస్తుంది. నీటి పరిరక్షణకు మనం ఏం చేయగలిగితే అది చేయాల్సిఉంటుంది. ఇది కేవలం జాతీయ సమస్య మాత్రమే కాదు. ప్రపంచం యావత్తూకు సంబంధించిన అంశం. ప్రతి నీటి బొట్టుకూ మరింత పంట అన్న మంత్రాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

మిత్రులారా,

చెన్నై మెట్రో రైల్ వ్యవస్థలో 9కిలోమీటర్లతో కూడిన తొలి దశను మనం ప్రారంభించుకోవడం మనదంరికీ సంతోషదాయకమే. వాషర్మెన్ పేటనుంచి విమ్కో నగర్ వరకూ ఇది కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన మహమ్మారి వైరస్ సమస్య ఎదురైనా ఈ ప్రాజెక్టు నిర్దేశిత గడువులోనే పూర్తయింది. సివిల్ నిర్మాణ కార్యకలాపాలన్నీ భారతీయ కంట్రాక్టర్లే నిర్వహించారు. ఈ రైలు మార్గంకోసం వినియోగించే ప్రతిదీ స్థానికంగానే సేకరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, 119 కిలోమీటర్లతో కూడిన రెండవ దశకు 63వేల కోట్ల రూపాయలకుపైగా మొత్తం ఈ సంవత్సరపు బడ్జెట్లో కేటాయింపు జరిగింది. ఒక నగరానికి ఒకేసారిగా భారీ ఎత్తున మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. పట్టణ రవాణా వ్యవస్థపై ఇలా దృష్టిని కేంద్రీకరించడం ఇక్కడి పౌరుల ‘సులభతర జీవనశైలి’కి ఎంతగానో దోహదపడుతుంది.

 

మిత్రులారా,

మెరుగైన అనుసంధానంతో సౌకర్యాలు పెరుగుతాయి. వాణిజ్యానికీ ఇది దోహదపడుతుంది. స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో భాగంగా ఎన్నోర్-అత్తిపట్టు మధ్య చేపట్టిన మార్గం పూర్తిగా వాహనాల రాకపోకల రద్దీతో కూడుకున్నది. చెన్నై ఓడరేవు, కామరాజార్ పోర్టు మధ్య సరకు రవాణా కదలికలు మరింత వేగవంతంగా సాగేలా చూడవలసిన అవసరం ఉంది. చెన్నై బీచ్, అత్తిపట్టు మధ్య నాలుగవ మార్గం ఇందుకు ఎంతో దోహదపడుతుంది. విల్లుపురం-తంజావూరు-తిరువారూరు ప్రాజెక్టు విద్యుదీకరణ చేయడం డెల్టాప్రాంతపు జిల్లాలకు గొప్ప వరంగా పరిమణించే అవకాశం ఉంది. 228కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం, ఆహారధాన్యాలను మరింత వేగంగా రవాణా చేయడానికి ఉపయోగపడటం మరో గొప్ప విషయం. ప్రశంసనీయం.

మిత్రలారా,

ఈ రోజును ఏ భారతీయుడూ మరిచిపోలేడు. రెండేళ్ల కిందట,..ఇదే రోజునపుల్వామాలో దాడి జరిగింది. పుల్వామా దాడిలో ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ నివాళులర్పిస్తున్నాం. మన భద్రతా బలగాలు మనకెంతో గర్వకారణం. వారి ధైర్యసాహసాలు మనకు తరతరాలుగా స్ఫూర్తిదాయకంగా కొనసాగుతాయి.

 

మిత్రులారా,

ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళంలో

మహా కవి సుబ్రమణియ భారతి ఇలా రాశారు.:

आयुथम सेयवोम नल्ला काकीतम सेयवोम

आलेकल वाईप्पोम कल्वी सालाइकल वाईप्पोम

नडेयुम परप्पु मुनर वंडीकल सेयवोम

ग्न्यलम नडुनका वरुं कप्पलकल सेयवोम

అంటే అర్థం:-

మనం ఆయుధాలు తయారు చేద్దాం; కాగితం తయారు చేద్దాం.

ఫ్యాక్టరీలకు రూపకల్పన చేద్దాం; పాఠశాలలు తయారు చేద్దాం.

కదలడంతోపాటుగా, ఎగరగలిగే వాహనాలనూ మనం తయారు చేద్దాం.

ప్రపంచాన్ని కుదిపివేయగలిగే నౌకలనూ తయారు చేద్దాం.

ఈ దార్శనికతతో స్ఫూర్తిని పొందదడం ద్వారానే, రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారతదేశం భారీ స్థాయిలో కృషి చేస్తోంది.దేశంలోని రెండు రక్షణ కారిడార్లలో తమిళనాడు ఒకటి. ఈ కారిడార్.కు ఎనిమిదివేల వంద కోట్ల రూపాయలమేర పెట్టుబడులపై హామీ ఇప్పటికే లభించింది. మన సరిహద్దులను కాపుకాసి రక్షించే మరో యుద్ధవీరుడిలాంటి ట్యాంకును దేశానికి అంకితం చేస్తున్నందుకు ఈ రోజు నేను ఎంతో గర్విస్తున్నాను. స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి, స్వదేశీయంగా తయారు చేసిన “ప్రధాన యుద్ధ ట్యాంకు, అర్జున్ మార్క్ 1ఎ”ని సైన్యానికి అప్పగిస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. స్వదేశీ తయారీ మందుగుండు సామగ్రిని కూడా ఇది వినియోగిస్తుంది. ఇక, మోటారు వాహనాల తయారీలో దేశంలోనే అగ్రశ్రేణి కేంద్రంగా తమిళనాడు ఇప్పటికే పేరు గాంచింది.

ఇపుడు ట్యాంకు తయారీ కేంద్రంగా తమిళనాడు రూపుదాల్చడం నేను చూస్తున్నాను. తమిళనాడులో తయారైన యుద్ధ ట్యాంకును దేశ రక్షణకోసం ఉత్తర సరిహద్దు ప్రాంతంలో వినియోగించబోతున్నాం. భారతదేశంపు సమైక్య స్ఫూర్తి అయిన –భారత్ ఏక్తా దర్శన్.ను ఇది ప్రతిబింబిస్తోంది. ప్రపంచంలోనే మరింత అధునాతనమైన బలగాల్లో ఒకటిగా మన సాయుధబలగాన్నింటినీ తీర్చిదిద్దేందుకు మన కృషి కొనసాగుతూనే ఉంటుంది. అదే సమయంలో, రక్షణ రంగంలో భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా తయారు చేసేందుకు కృషి కూడా పూర్తి వేగంతో సాగుతుంది. భారతదేశానికి ప్రతీకలుగా నిలిచిన ధైర్యసాహసాలకు మారుపేరుగా మన సాయుధ బలగాలు ఉంటాయి. మన మాతృభూమిని పరిరక్షించే శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని సాయుధ బలగాలు ఎన్నోసార్లు రుజువుచేశాయి. భారతదేశానికి శాంతిపై విశ్వాసం ఉందని కూడా అవి పలుసార్లు నిరూపించాయి. అయితే, ఎట్టి పరిస్థితుల్లో అయినా తన సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకే భారతదేశం కృషి చేస్తుంది. ధీర్ భీ హై, వీర్ భీ హై,.. మన బలగాల సైన్యశక్తి, ధైర్య శక్తి ఎంతో ప్రశంసనీయమైనవి.

మిత్రులారా,

మద్రాసు ఐ.ఐ.టి.లో డిస్కవరీ క్యాంపస్ పేరిట ఏర్పాటు చేసే 2లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలోని మౌలిక సదుపాయాలు, ప్రపంచ శ్రేణి పరిశోధనా కేంద్రాలకు ఆలవాలం కాబోతున్నాయి. ఐ.ఐ.టి. మద్రాసులోని డిస్కవరీ క్యాంపస్ అతి త్వరలో ఆవిష్కరణలకు అగ్రశ్రేణి కేంద్రం కాగలదని నేను కచ్చితంగా చెప్పగలను. దేశన్యాప్తంగా ఉన్న అత్యున్నత ప్రతిభా పాటవాలను ఇది ఆకర్షిస్తుంది.

మిత్రులారా,

ఒక్క విషయమైతే నిశ్చితంగా చెప్పగలను. ప్రపంచం యావత్తూ భారతదేశంవైపు ఎంతో ఆసక్తితో, సానుకూల దృక్పథంతో చూస్తోందని. ఇది భారతదేశపు దశాబ్దం కాబోతోంది. దేశంలోని 130కోట్ల మంది భారతీయులు చేసిన కష్టం, చిందించిన స్వేదం ఫలితమిది. ఈ తరహా ఆకాంక్షలు, సృజనాత్మకతల పురోగమనానికి తగిన ఆసరా ఇచ్చేందుకు, ఎలాంటి శక్తివంచన లేకుండా కృషి చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంస్కరణలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని మరోసారి ఈ ఏడాది బడ్జెట్ కూడా ప్రతిబింబించింది. భారతదేశపు తీర ప్రాంతాల అభివృద్ధికి ఈ సారి బడ్జెట్ ప్రత్యేక ప్రాముఖ్యం ఇవ్వడం మీకు సంతోషం కలిగిస్తుంది.

మన మత్స్యకారులు భారతదేశానికి ఎంతో గర్వకారణం. చురుకుదనానికి, జాగరూకతకు, కరుణా హృదయానికి వారు ప్రతీకలు. వారికి అదనంగా రుణ సదుపాయం కల్పించే యంత్రాగం అందుబాటులో ఉండేలా బడ్జెట్లో ప్రతిపాదనలు పొందుపరిచి ఉన్నాయి. చేపలవేటకు సంబంధించిన మౌలిక సదుపాయాల నవీకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. చెన్నైతో పాటుగా ఐదు కేంద్రాల్లో అధునాతన సదుపాయాలతో కూడిన చేపల రేవులు అందుబాటులోకి రాబోతున్నాయి. సముద్ర వనరుల సాగు, శైవలాల పెంపకంపై మేం ఎంతో ఆశావహంగా ఉన్నాం. సముద్ర శైవలాల సాగుకోసం బహులార్థక ప్రయోజనాలతో కూడిన సీవీడ్ పార్కు కూడా తమిళనాడులో ఏర్పాటు కాబోతోంది.

మిత్రులారా,

భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను భారతదేశం ఎంతో వేగంగా పెంచుకుంటోంది. మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని భారత్ చేపట్టింది. ఇటీవలి కాలంలోనే అన్ని గ్రామాలను ఇంటర్నెట్ సదుపాయంతో అనుసంధానం చేసే ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతిపెద్దది చెప్పదగిన ఆరోగ్య రక్షణ కార్యక్రమాన్ని భారతదేశం చెపట్టింది. తక్షణం వినియోగించదగిన ఉత్పాదనలపై అధ్యయనం సాగించడానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ భారతదేశం విద్యారంగాన్ని కూడా పరివర్తన చెందిస్తూ వస్తోంది. ఈ పరిణామాలు యువతకు కూడా అసంఖ్యాకమైన అవకాశాలను కల్పిస్తాయి.

 

మిత్రులారా,

తమిళనాడు సంస్కృతిని గౌరవించడం, తమిళనాడు సాంస్కృతిక వైభవాన్ని అస్వాదించడం మనకు గౌరవప్రదంగా ఉంటుంది. తమిళనాడు సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉంది. తమిళనాడులోని దేవేంద్రకుల వెళలార్ సామాజిక వర్గానికి చెందిన సోదర, సోదరీమణులకు ఒక సంతోషదాయకమైన సందేశాన్ని నేను తీసుకువచ్చాను. తమకు దేవేంద్రకుల వెళలార్ సామాజిక వర్గంగానే గుర్తింపు ఉండాలంటూ వారు సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్.ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రాజ్యాంగంలోని షెడ్యూల్లో పేర్కొన్న ఆరేడు పేర్లు కాకుండా, తమకు వారసత్వపరంగా లభించిన గుర్తింపే ఇకపై కొనసాగుతుంది. వారి పేరును దేవేంద్రకుల వెళలార్ గా పేర్కొంటూ రాజ్యాంగంలోని షెడ్యూల్.ను సవరిస్తూ తయారైన గెజిట్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఈ ముసాయిదా,.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభ ముందుకు రానుంది. దేవేంద్రకుల వెళలార్ వర్గంవారి డిమాండ్.పై సవివరంగా అధ్యయనం జరిపిన తమిళనాడు ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

మిత్రులారా,

దేవేంద్రారుల ప్రతినిధులతో 2015వ సంవత్సరంలో ఢిల్లీలో జరిగిన నా సమావేశాన్ని నేను ఎన్నటికీ మరిచిపోలేను. ఆ సమావేశం సందర్భంగా వారిలో గూడుకట్టుకున్న విషాధాన్ని చూడగలగాను. వారి గౌరవాన్ని, ప్రతిష్టను వలస పాలకులు దెబ్బతీశారు. దశాబ్దాలు గడిచినా వారికోసం అంటూ ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. తమ గురించి ప్రభుత్వాలకు ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఏమీ మార్పులేదంటూ వారు నాకు చెప్పారు. నేను వారికి ఒకటే చెప్పాను. దేవేంద్ర అనే వారి పేరు,..ఉచ్ఛారణలో నరేంద్ర అన్న నాపేరును పోలి ఉందని అన్నాను. వారి భావోద్వేగాలను, మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇది కేవలం మార్పునకు మాత్రమే సంబంధించిన నిర్ణయం కాదు. ఇది న్యాయం, ఆత్మగౌరవం, అవకాశాలకు సంబంధించినది. దేవేంద్ర కుల సామాజిక వర్గం సంస్కృతినుంచి మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది. సామరస్యం, మైత్రి, సౌభాతృత్వం వంటి భావనలను వారు ఎంతగానో ఆస్వాదిస్తారు, గౌరవిస్తారు. వారిది నాగరకతతో కూడుకున్న ఉద్యమం. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని సూచిస్తోంది.

 

మిత్రులారా,

శ్రీలంకలోని తమిళ సోదర, సోదరీమణుల సంక్షేమం, మనోభావాలకోసం మా ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. శ్రీలంకలోని జాఫ్నాను సందర్శించిన ఏకైక భారతీయ ప్రధానమంత్రిని నేను కావడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా శ్రీలంక తమిళ వర్గాల సంక్షేమం కోసం మేం కృషి చేస్తూ ఉన్నాం. గతంలో కంటే ఎక్కువ వనరులను మా ప్రభుత్వం తమిళులకు కల్పించింది. వాటిలో కొన్నిప్రాజెక్టులు: శ్రీలంక ఈశాన్య ప్రాంతంలో నిరాశ్రయులైన తమిళులకోసం నలబై వేల ఇళ్లు. తోటల పెంపకం ప్రాంతాల్లో నాలుగువేల ఇళ్లు. ఇక ఆరోగ్య రంగంలో, మా ఆర్థిక సహాయంతో అందించిన అంబులెన్స్ సేవలను తమిళ వర్గాలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. డికోయా ప్రాంతంలో ఒక ఆసుపత్రి నిర్మాణం జరిగింది. రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు జాఫ్నాకు, మన్నార్ కు రైల్వే వ్యవస్థ పునర్నర్మాణం జరిగింది. చెన్నైనుంచి జాఫ్నాకు విమాన సర్వీసులు ఏర్పాటయ్యాయి. ఇక జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని భారతదేశం నిర్మించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అది త్వరలోనే ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాం. తమిళవర్గాల హక్కుల అంశంపై ఎప్పటికప్పుడు శ్రీలంక నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. వారు సమానత్వతం, న్యాయం, శాంతి, ఆత్మగౌరవంతో జీవించేలా చూసేందుకు మేం ఎల్లపుడూ కట్టుబడి ఉంటాం.

 

మిత్రులారా,

మన మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్య సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోంది. అయితే, ఈ సమస్య మూలాల్లోకి నెను వెళ్లదలుచుకోలేదు. వారి సమంజసమైన, న్యాయసమ్మతమైన ప్రయోజనాలను నా ప్రభుత్వం ఎల్లపుడూ రక్షించగలదని హామీ ఇస్తున్నాను. శ్రీలంకలో ఎక్కడైనా మత్స్యకారులు పట్టబడిన పక్షంలో వారిని సత్వరం విడుదల చేయించేందుకు మేం ప్రతిసారీ కృషి చేశాం. మా ప్రభుత్వ హయాంలో 16వందలకుపైగా జాలర్లు బంధవిమక్తి పొందారు. ప్రస్తుతం శ్రీలంక కస్టడీలో భారతీయ జాలర్లెవరూ బందీలుగా లేరు. అలాగే,..శ్రీలంక అధికారుల స్వాధీనంనుంచి 300బోట్లను కూడా విడుదల చేయించాం. మిగిలిన బోట్లను కూడా రప్పించేందుకు మేం కృషి చేస్తున్నాం.

 

మిత్రులారా,

కోవిడ్19 వైరస్ పై ప్రపంచవ్యాప్తంగా జరిగే పోరాటాన్ని మరింత బలోపేతంగా ఉండేలా భారతదేశం తీర్చిదిద్దుతోంది. మానవతా ప్రయోజనాలే స్ఫూర్తిగా భారత్ ఈ పోరును సాగిస్తోంది. మన జాతిని అభివృద్ధి చేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవలసి ఉంటుంది. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఇది అవసరం. మన రాజ్యాంగ సృష్టికర్తలు కూడా మననుంచి కోరుకునేది అదే. ఈ రోజు ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో తమిళనాడు ప్రజలకు నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మీ అందరికీ కృతజ్ఞతలు!

ధ్యాంక్యూ వెరీమచ్.

వణక్కం!

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage