-
ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈనాటి తొలి ప్రవాసీ పార్లమెంటేరియన్ కాన్ఫరెన్స్.. ప్రవాసీ దివస్ సంప్రదాయంలో ఒక కొత్త అధ్యాయాన్ని జోడిస్తోంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, పసిఫిక్ ప్రాంతం మరియు ప్రపంచం లో అన్ని వైపుల నుండి తరలివచ్చిన మిత్రులు అందరికీ సాదరంగా నేను స్వాగతం పలుకుతున్నాను.
భారతదేశంలోకి మీకు ఇదే స్వాగతం! మాతృదేశానికి దయచేయండి!
మీ పూర్వులు, మీ గత స్మృతులు దేశం లో వేరు వేరు ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. మీ పూర్వులలో కొంత మంది వ్యాపారం కోసం, మరికొంత మంది విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్ళారు. వారిలో కొందరిని బలవంతంగా భారతదేశం నుండి బయటకు తీసుకుపోవడం జరగగా, మరికొందరిని ప్రలోభపెట్టి దేశాన్ని వీడిపోయే పరిస్థితులను కల్పించడమైంది. వారు శారీరికంగా ఈ దేశాన్ని వదలి వెళ్ళి ఉండవచ్చు కానీ, వారి ఆత్మలో ఒక భాగాన్ని, వారి మనస్సు ను ఈ భూమి మీదనే అట్టేపెట్టి వెళ్ళారు. మరి ఈ కారణంగానే భారతదేశంలోని ఏ విమానాశ్రయంలోనైనా మీరు అడుగుపెట్టిన వెంటనే మీ యొక్క ఆత్మల లోని సదరు భాగాలు మిమ్మల్ని ఈ గడ్డ మీద అడుగు పెట్టడం చూడడంతోనే ఆనందపడతాయి.
ఆ సమయంలో మీ గొంతుక ఆవేశం వల్ల మాట్లాడలేకపోతుంది. కొన్ని భావాలు అశ్రువుల రూపంలో వెలువడతాయి. ఈ భావోద్వేగాలు పెల్లుబుకకుండా నియంత్రించాలని మీరు మీ శక్తి మేరకు ప్రయత్నిస్తారు కానీ, మీరు కృతకృత్యులు కాలేకపోతారు. మీ కళ్ళు కన్నీటితో ఆర్ద్రం అవుతాయి. అయితే, అదే సమయంలో భారతదేశానికి మీరు వచ్చారన్న కారణంగా మీ నేత్రాలు తేజోవంతం అవుతాయి కూడాను. మీ మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. ఈ ఆప్యాయత, ఈ ఆత్మీయత, ఈ సమ్మానం, ఈ ప్రదేశంలోని పరిమళం.. ఇక్కడ కమ్ముకున్న వీటన్నింటికి నేను శిరసా ప్రణామాలు చేస్తున్నాను. మిమ్మల్ని ఇక్కడ చూసుకొని మీ పూర్వులు ఎంత సంతోషిస్తారో మనమందరం ఊహించుకోగలం. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ భూమి మీద మిమ్మల్ని చూసి అమిత సంతోష భరితులు అవుతారు.
మిత్రులారా,
గత కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశం నుండి బయటకు వెళ్ళిన వారి పట్ల భారతదేశం తన ప్రేమను ఎన్నటికీ చంపుకోలేకపోయింది. వారు ప్రపంచంలోని ఏ భాగంలో స్థిరపడినా సరే, భారతీయ నాగరకతను మరియు విలువలను సజీవంగానే ఉంచారు. భారతీయ మూలాలకు చెందిన వారు ఎక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొన్నా, వారు ఆ ప్రదేశంతో పూర్తిగా మిళితం కావడం ద్వారా ఆ ప్రదేశాన్ని వారి ఇల్లుగా మార్చుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
వారు ఒక పక్క తమ అంతరంగాలలో భారతీయ విలువలను సచేతనంగా ఉంచుతూనే మరో పక్క ఆ దేశం యొక్క భాషను, ఆహారాన్ని, వస్త్రధారణను తమలో ఓ భాగంగా చేసుకొన్నారు.
భారతీయ మూలాలకు చెందిన వారు ప్రపంచ రంగస్థలం మీద క్రీడలు, కళలు మరియు చలనచిత్రాలలో తమదైన ముద్రను వేశారు. నేను రాజకీయాలను గురించి మాట్లాడవలసివస్తే, నా కళ్ళెదుట భారతీయ మూలాలకు చెందిన వారితో కూడిన ఒక మినీ-వరల్డ్ పార్లమెంట్ ను చూస్తున్నానని చెప్తాను. భారతీయ సంతతికి చెందిన వారు ఇవాళ మారిషస్, పోర్చుగల్, మరియు ఐర్లండ్ ల ప్రధానులుగా ఉన్నారు. భారతీయ మూలాలకు చెందిన వారు అనేక దేశాలలో ప్రభుత్వ అధినేతలుగా, దేశాధినేతలుగా వ్యవహరిస్తున్నారు. గుయాన పూర్వ అధ్యక్షులుగా పని చేసిన శ్రీ భారత్ జగదేవ్ గారు ఇవాళ ఇక్కడ మన మధ్య ఉండడం మనకు గొప్ప గర్వకారణమైన అంశం. మరి మీలో ప్రఖ్యాత వ్యక్తులు కూడా మీ మీ దేశాల రాజకీయ రంగంలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నటువంటి వారే.
మిత్రులారా,
మీ పూర్వుల మాతృ దేశమైన భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. మీరు సాధించిన విజయాలు మరియు ఘన కార్యాలు మాకు అతిశయాన్ని కలిగించేవే కాకుండా, మాకు గౌరవాన్ని అందించేవి కూడాను. మీరు ఏదైనా పదవీ బాధ్యతలను స్వీకరించినప్పుడు గాని, లేదా ఏదైనా ఉన్నత స్థానం కోసం నామినేషన్‌ను దాఖలు చేశారని గాని వార్తలు ప్రసార మాధ్యమాలలో వెల్లడి అయిన సందర్భాలలో, ఆ వార్తలకు భారతదేశంలో గొప్ప ఆదరణ లభిస్తుంది. మీరు మీ ప్రాంతం లోని రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తీరు, మీరు మీ దేశాలలో విధాన రూపకల్పనలో పాలుపంచుకొంటున్న తీరు.. ఈ గాథలు భారతదేశంలో ప్రజలకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వారు ‘‘చూశారా, మనలో ఒకరు ఆ ఉన్నత పదవిని స్వీకరించారు’’ అంటూ ఈ పరిణామాలను గురించి చర్చిస్తూ ఉంటారు. మాకు ఈ విధమైన ఆనందాన్ని ఇచ్చినందుకు, మేం గర్వించే అవకాశాన్ని ప్రసాదించినందుకు మీరు ప్రశంసాపాత్రులు.
సోదరులు మరియు సోదరీమణులారా,
మీరు వివిధ దేశాలలో చాలా కాలంగా మనుగడ సాగిస్తూ వచ్చారు. గత మూడు- నాలుగు సంవత్సరాలుగా భారతదేశం పట్ల వ్యక్తం అవుతున్న వైఖరిలో మార్పు చోటుచేసుకొన్న సంగతిని మీరు గమనించే ఉంటారు. భారతదేశం విషయంలో గొప్ప శ్రద్ధ కనపడుతోంది. మనలను ప్రపంచం చూస్తున్న ధోరణిలో పరివర్తన వచ్చింది. దీనికి ప్రధాన కారణం భారతదేశం స్వయంగా మార్పునకు లోనవుతూ ఉండడమే. ఆర్థిక, సామాజిక స్థాయిలలో మార్పులకు తోడు ఆలోచనల స్థాయిలో కూడా ఈ పరివర్తన సంభవించింది. ‘ఏదీ మారదు; అది ఇదివరకటి మాదిరిగానే ఉండిపోతుంది; జరిగేదంటూ ఏమీ ఉండదు’ అనేటటువంటి ఆలోచనల నుండి భారతదేశం చాలా దూరం ప్రయాణించింది. ఈ పర్యాయం భారతీయ ఆశలు మరియు ఆకాంక్షలు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాయి. వ్యవస్థలలో సంపూర్ణమైన పరివర్తనను మీరు చూస్తారు; ప్రతి రంగంలో తిప్పివేయడానికి వీలుగాని మార్పు యొక్క ప్రభావాన్ని మీరు గమనిస్తారు.
• వీటి ఫలితంగా, 2016-17లో భారతదేశం మునుపెన్నడూ లేనంతగా 60 బిలియన్ యుఎస్ డాలర్ల ఎఫ్‌డిఐని అందుకొంది.
• గత 3 సంవత్సరాలలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ ర్యాంకింగ్ 42 అంచెల మేరకు మెరుగుపడింది.
• గత రెండు సంవత్సరాలలో మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క గ్లోబల్ కాపెటేటివ్‌నెస్ ఇండెక్స్ లో 32 అంచెలు అధిరోహించాము.
• గత రెండేళ్ళలో మన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 21 అంచెల మేర మెరుగుపడింది.
• లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 19 పాయింట్ల మేర మెరుగు పడింది. ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు, ఇంకా మూడీజ్ వంటి సంస్థలు చాలా సకారాత్మకమైన రీతిలో భారతదేశానికేసి చూస్తున్నాయి.
• నిర్మాణ రంగం, గగన తల రవాణా, గనులలో తవ్వకాలు, కంప్యూటర్- సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్, విద్యుత్తు సామగ్రి వంటి రంగాలలోకి వచ్చిన మొత్తం పెట్టుబడులలో సగాని కన్నా ఎక్కువ పెట్టుబడులు.. కేవలం గత 3 సంవత్సరాల కాలంలో.. వచ్చాయి.
ఈ విషయాలన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోని ప్రతి రంగంలో చాలా కాలం పాటు ప్రభావాన్ని ప్రసరించగలిగే సంస్కరణలను మేం తీసుకు వచ్చిన కారణంగానే సాధ్యపడ్డాయి. ‘పరివర్తన కోసం సంస్కరణ’ అనేది మాకు మార్గాన్ని చూపే సిద్ధాంతంగా ఉంది. యావత్తు వ్యవస్థను పారదర్శకమైందిగా, జవాబుదారుతనంతో కూడుకొన్నదిగా మలచడమే మా ధ్యేయం. అవినీతిని సంపూర్ణంగా నిర్మూలించడమే మా ధ్యేయం.
మిత్రులారా,
మేము వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్‌టి) ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో వందలాది పన్నుల పద్ధతిని రద్దు చేసి ఆర్ధికంగా దేశాన్ని సమీకృతపరచాం. గనుల తవ్వకాలు, ఎరువులు, వస్త్రాలు, విమాన యానం, ఆరోగ్యం, రక్షణ, నిర్మాణం, స్థిరాస్తి, ఇంకా ఫూడ్ ప్రాసెసింగ్ ల వంటి ఏ ఒక్క రంగాన్ని కూడా మేం సంస్కరణలను ప్రవేశపెట్టకుండా వదలివేయలేదు.
మిత్రులారా,
ఇవాళ భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న వయస్సు కలిగినటువంటి దేశంగా ఉంది. యువతకు అపరిమితమైన స్వప్నాలు మరియు అంచనాలు ఉన్నాయి. వారు వారి యొక్క శక్తిని సరైన రంగంలోకి మళ్ళించి, తద్వారా వారంతట వారు వ్యాపారం చేయగలిగేటట్టు ప్రభుత్వం అదేపనిగా కృషి చేస్తోంది.
ఈ కారణంతోనే స్కిల్ ఇండియా మిశన్, స్టార్ట్-అప్ స్కీమ్, స్టాండ్‌ప్ స్కీమ్ ఇంకా ముద్రా స్కీము ల వంటి పథకాలను ప్రారంభించడమైంది. స్వతంత్రోపాధి కోసం ముద్రా స్కీమ్ లో భాగంగా 10 కోట్లకు పైగా రుణాలను మంజూరు చేయడమైంది. ఎటువంటి బ్యాంకు పూచీకత్తు లేకుండా ప్రజలకు 4 లక్షల కోట్లకు పైగా వితరణ చేయడమైంది. ఈ పథకం ఒక్కటే దేశంలో 3 కోట్ల మంది నవ పారిశ్రామికవేత్తలను తెర మీదకు తీసుకు వచ్చింది. 21వ శతాబ్దం తాలూకు భారతదేశం అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాల కల్పన మరియు రవాణా రంగాలలో పెట్టుబడులను ప్రభుత్వం పెంచుతోంది. భవిష్యత్తులో భారతదేశ లాజిస్టిక్స్ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అన్న అంశానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఇవ్వడమైంది. రైలు మార్గాలను, విమానాలు పయనించే రూట్లను, జల మార్గాలను మరియు ఓడ రేవులను ఒకదానితో మరొకటి అనుసంధానించి, పరస్పరం మద్దతు ఇచ్చుకొనే విధంగా అభివృద్ధిపరచడం జరుగుతోంది.
మిత్రులారా,
ప్రస్తుత కాలంలో భారతదేశంలో కొత్త రైల్వే ట్రాకులను రెట్టింపు వేగంతో నిర్మించడం జరుగుతోంది. ట్రాకుల డబ్లింగ్ పనులు ఇదివరకటి కన్నా రెట్టింపు స్థాయిలో జరుగుతున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణం రెండింతల వేగంతో సాగుతోంది. రెట్టింపునకు మించిన స్థాయిలో నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యాన్ని గ్రిడ్డుకు నూతనంగా జతపరచడమైంది.
ఇదివరకు షిప్పింగ్ పరిశ్రమలో కార్గో హ్యాండ్లింగ్ వృద్ధి రుణాత్మకంగా ఉండగా, ఈ ప్రభుత్వంలో ఇది 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్రయత్నాలు అన్నింటి వల్ల నూతన ఉపాధి అవకాశాలు జనిస్తున్నాయి. చిన్న తరహా పరిశ్రమలు కొత్త కొత్త పనులను దక్కించుకొంటున్నాయి. ఉదాహరణకు మనం ‘ఉజ్జ్వల స్కీమ్’ ను గురించి మాట్లాడుకొంటే, అది పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందించడానికి మాత్రమే పరిమితమైపోలేదు. ఈ పథకం 3 కోట్లకు పైగా మహిళలకు వంట ఇంట్లో పొగ బారి నుండి ఊరటను ఇచ్చింది. ఇది రాష్ట్రాలను కిరోసిన్ తో అవసరం లేకుండా మార్చడానికి తోడ్పడమే కాకుండా, మరొక ప్రయోజనాన్ని కూడా అందించింది. ‘ఉజ్జ్వల పథకం’ ఆచరణ రూపం దాల్చాక కొత్తగా వంట గ్యాస్ డీలర్లను మరియు గ్యాస్ సిలిండర్లను బట్వాడా చేసే మనుషులను అనేక మందిని నియమించడం జరిగింది. అంటే, సామాజిక సంస్కరణలకు తోడు సమాజంలో ఆర్థికంగా సశక్తీకరణ సైతం చోటుచేసుకొంటోందని గ్రహించవచ్చును.
సోదరులు మరియు సోదరీమణులారా,
మన సంస్కృతి ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని నమ్మే సంస్కృతి. ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చినటువంటి సంస్కృతి మనది. నేను మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితికి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ యోగా దినం ఒకటి ఉండాలంటూ ప్రపంచం ఎదుట ఒక ప్రతిపాదనను ఉంచాను. ఈ ప్రతిపాదనకు 75 రోజుల లోపల ఏకగ్రీవ ఆమోదం లభించడమే కాకుండా, 177 దేశాలు దీనికి సహ ప్రాయోజకత్వాన్ని అందించడానికి ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ ఎరుకే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ ల కొద్దీ ప్రజలు జూన్ 21వ తేదీని యోగా దినంగా జరుపుకోవడం మీకు మరియు మాకు గర్వకారణమైన విషయం.
అవిభాజ్య తత్వంతో మనుగడ సాగించే తీరు భారతదేశం యొక్క సంపన్న సంప్రదాయాలు అందించినటువంటి ఒక బహుమతి.
మిత్రులారా,
జల, వాయు పరివర్తన అంశం పారిస్ ఒప్పందం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుల వారితో కలసి నేను ఒక ఇంటర్ నేశనల్ సోలార్ అలయన్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాను. ప్రస్తుతం అది వాస్తవ రూపం దాల్చింది. సౌర శక్తి రీత్యా సంపన్నమైన దేశాల సహాయం తీసుకొంటూ సౌర సంబంధిత సాంకేతిక విజ్ఞానం మరియు ఫైనాన్సింగ్ లకు ఒక ప్రపంచ వేదికను మనం నిర్మిస్తూ వస్తున్నాం.
ప్రకృతితో సమతౌల్యాన్ని పరిరక్షించుకొంటూ మనుగడ సాగించే పద్ధతి కూడా కొన్ని యుగాలుగా భారతదేశం అందించినటువంటి తోడ్పాటే.
సోదరులు మరియు సోదరీమణులారా,
నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు, లేదా శ్రీ లంక లో వరదలు విరుచుకుపడినప్పుడు, లేదా మాల్దీవులలో నీటి ఎద్దడి తలెత్తినప్పుడు భారతదేశం అక్కడికి ప్రప్రథమంగా చేరుకొని సహాయాన్ని అందజేసింది.
ఎమెన్ లో సంక్షోభం ఏర్పడినప్పుడు మనం మన 4,500 మంది పౌరులను సురక్షితంగా తరలించాం. అంతేకాకుండా, 48 ఇతర దేశాలకు చెందిన 2,000 మంది పౌరులను కూడా అక్కడి నుండి తరలించాం.
భీషణ సంక్షోభ పరిస్థితులలో సైతం మానవీయ విలువలను పరిరక్షించడమనేది యావత్ ప్రపంచాన్ని ఒకే ఒక కుటుంబంగా భావించే భారతీయ సంప్రదాయంలో ఒక భాగం.
మిత్రులారా,
2018 కి ఒకటో ప్రపంచ యుద్ధం జరిగి వందో ఏడాది. ఒకటో మరియు రెండో ప్రపంచ యుద్ధాలలో 1.5 లక్షల మందికి పైగా భారతీయ సైనికులు వారి ప్రాణాలను అర్పించారు. ఆ యుద్ధాలలో భారతదేశానికి ప్రత్యక్ష ప్రమేయం ఏదీ లేదు. రెండు ప్రపంచ యుద్ధాలలో ఏ దేశపు అంగుళం భూమి పైన అయినా భారతదేశం కన్ను వేయలేదు. భారతదేశం ఒనర్చిన గొప్ప త్యాగాన్ని ప్రపంచం గుర్తించి తీరాలి. స్వాతంత్య్రం లభించిన తరువాత కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలకు గరిష్ఠ సంఖ్యలో తోడ్పాటును అందిస్తున్న దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది. మానవీయ విలువల పరిరక్షణ కోసం, శాంతి పరిరక్షణ కోసం ప్రపంచానికి భారతదేశం ఇస్తున్న త్యాగ పూరితమైన సందేశం ఇది.
స్వప్రయోజనాల పరిత్యాగం, సేవా భావం.. ఇదే మన గుర్తింపు. ఈ మానవీయ విలువ కారణంగా ప్రపంచంలో భారతదేశమంటే ఒక ప్రత్యేకమైన ఆమోదం ఉంది.
భారతదేశంతో పాటు భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల సమాజానికి కూడా ఒక ప్రత్యేక ఆమోదయోగ్యత ఉన్నది.
మిత్రులారా,
నేను సాధారణంగా ఏ దేశాన్ని సందర్శించినా అక్కడ నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన ప్రజలను కలిసేందుకు ప్రయత్నిస్తాను. అటువంటి పర్యటనలలో మీలో కొందరిని కలుసుకొనే భాగ్యం నాకు లభించింది. భారతదేశంతో సంబంధాలను ప్రచారం చేసే వారు ఎవరైనా ఉన్నారంటే వారు భారతీయ సంతతి ప్రజలే అని నేను ప్రగాఢంగా విశ్వసించడమే అందుకు కారణం. ప్రవాస భారతీయులతో నిరంతర సంబంధాలు కలిగి ఉంటూ వారి సమస్యలను తీరుస్తూ ఉండడం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది.
గతంలో ప్రవాసీ భారతీయుల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండేది. కానీ విదేశాంగ శాఖతో సంప్రదింపులు, సమన్వయం ఒక సమస్యగా ఉన్నట్లు పలువురు ప్రవాసీ భారతీయుల వద్ద నుండి సమాచారం అందింది. వారి నుండి అందిన సమాచారం ఆధారంగా మేం ఆ రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేశాం. అలాగే గతంలో పిఐఒ, ఒసిఐ అని రెండు స్కీమ్‌లు ఉండేవి. అయితే ఆ రెండింటి మధ్య తేడా ఏమిటో చాలా మందికి అర్ధం కాలేదు. అందుకే ఆ విధివిధానాలను సరళీకరించి ఒక్కటిగా స్కీము ను తయారుచేశాం.
మా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారు భారతీయ పౌరుల సమస్యలపై దృష్టి పెట్టడం మాత్రమే కాదు, భారతీయ సంతతి ప్రజల సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆమె ఎంత చురుగ్గా ఉన్నారో మీరందరూ చూసే ఉంటారు. రాయబార కార్యాలయాల ద్వారా వచ్చే సమస్యలను నిరంతరం పర్యవేక్షించి వాస్తవిక దృక్పథంతో పరిష్కరించేందుకు ఆమె నాయకత్వంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ మదద్ పోర్టల్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఏడాది విడచి ఏడాది ప్రవాసీ భారతీయ దివస్ ను నిర్వహిస్తున్నాం. వాటికి అదనంగా ప్రాంతీయ ప్రవాసీ భారతీయ దినోత్సవాలను కూడా నిర్వహిస్తున్నాం. సింగపూర్ లో జరిగిన అటువంటి ఒక సదస్సు లో పాల్గొని సుష్మ గారు ఇప్పుడే తిరిగి వచ్చారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ రోజు మనందరం సమావేశమైన ఈ భవనాన్ని 2016 ఆక్టోబర్ రెండో తేదీన మీ అందరికీ, అంటే ప్రవాస భారతీయులందరికీ అంకితం చేశాం. ఇంత తక్కువ కాలంలో ఆ భవనం ప్రవాసీ భారతీయులందరి కలయికకు కూడలిగా మారడం చాలా ఆనందదాయకమైన అంశం. ఇక్కడ నిర్వహిస్తున్న మహాత్మ గాంధీ జీవన ప్రదర్శనను కూడా మీరందరూ చూడాలని నేను కోరుతున్నాను.
భారత్ ను తెలుసుకోండి (Know India) పేరిట ప్రవాసీ భారతీయులందరికీ సంఘటితపరిచేందుకు నిర్వహించిన క్విజ్ పోటీ ఫలితం మీ అందరికీ తెలిసిందే. భారతదేశం పట్ల వారందరూ ప్రదర్శించిన ఉత్సుకత, వారికి గల ఆకర్షణ మా అందరికీ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. వారందరూ ఇచ్చిన స్ఫూర్తితో ఈ ఏడాది మేం మరింత విస్తృతంగా ఆ క్విజ్ ను నిర్వహిస్తున్నాం.
మిత్రులారా,
మీరు నివసిస్తున్న దేశాల్లో అభివృద్ధికి మీరందరూ అందించిన వాటా కూడా భారతదేశానికి గౌరవం లభిస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు పొందే గౌరవాన్ని బట్టి కూడా భారతదేశం పురోగమనం మరియు అభివృద్ధి ఆధారపడి ఉంటాయి. భారతదేశం అభివృద్ధిలో ప్రవాస భారతీయులను భాగస్వాములుగా మేం పరిగణిస్తాం. 2020 సంవత్సరం వరకు అమలులో ఉండేలా నీతి ఆయోగ్ రచించిన అభివృద్ధి అజెండా లో ప్రవాస భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
భారతదేశ అభివృద్ధి ప్రస్థఆనంలో ప్రవాసీ భారతీయులు ఎన్నో రకాలుగా వారి తోడ్పాటును అందజేయవచ్చును. ప్రపంచంలో విదేశాల నుండి చెల్లింపులను అత్యంత భారీ స్థాయిలో అందుకొంటున్న దేశం భారతదేశమే.
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వారి వంతు తోడ్పాటును అందిస్తున్న ప్రవాసీ భారతీయులందరికీ మేం ఎంతో రుణపడి ఉన్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడికి మరో మార్గం కూడా ఉంది. ఈ రోజు భారతదేశం ఎఫ్‌డిఐ లకు ఆకర్షణీయ గమ్యంగా ఉందంటే భారతదేశానికి ప్రచారం చేయడంలో ప్రవాసీ భారతీయులు చూపిన చొరవే కారణం. ఈ విభాగంలో మీరు క్రియాశీల పాత్ర పోషించేందుకు ఎంతో అవకాశం ఉంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన ప్రజలు భారతదేశంలో పర్యాటక రంగానికి కూడా వారి వంతు చేయూతను అందించవచ్చు.
మిత్రులారా,
ప్రపంచంలోని కొన్ని అగ్రగామి కంపెనీల సిఇఒ లు ప్రవాసీ భారతీయులే. భారత ఆర్థిక వ్యవస్థపై వారికి సంపూర్ణ అవగాహన ఉంది. భారతదేశ అభివృద్ధి యాత్ర పైన వారికి గల బలమైన విశ్వాసానికి మేం సదా కృతజ్ఞులం. ఈ రోజు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశ వృద్ధిలో తాను కూడా భాగస్వామిననే అభిప్రాయాన్ని కలిగివున్నాడు. వారందరూ ప్రస్తుత పరివర్తనలో భాగస్వాములు కావాలనుకొంటున్నారు. ఆ బాధ్యతను వారి భుజస్కంధాలపై మోసేందుకు సిద్ధంగా ఉన్నారు. భారతదేశం ప్రపంచ యవనికపై మరింతగా ఎదగడాన్ని కళ్లారా చూడాలని వారు కోరుతున్నారు. దేశంలో సామాజిక, ఆర్థిక మార్పులు తెచ్చే క్రమంలో మీ అందరి అనుభవాలకు మేం ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. మీలోని జ్ఞానాన్ని భారతదేశానికి పంచి ఇచ్చేందుకు మేం ‘వజ్ర’ [ Visiting Adjunct Joint Research Faculty ] పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించాం.
ఈ పథకంలో భాగంగా భారతీయ సంస్థల్లో మూడు నెలల వరకు మీరు పని చేయవచ్చు.
మీరందరూ ఈ పథకంలో భాగస్వాములు కావాలని, మీరు నివసిస్తున్న దేశాల్లోని ఇతర భారతీయులను కూడా దీనితో కలిసి పని చేసేలా ప్రోత్సహించాలని నేను ఈ వేదికగా మిమ్మల్ని కోరుతున్నాను. భారతీయ యువతకు మీ అనుభవం ఉపయోగంలోకి రావడం మీ అందరికీ ఆనందదాయకమే. ప్రపంచానికి భారతదేశం అవసరాలు, బలాలు, ప్రత్యేకతలు వివరించడంలో మిమ్మల్ని మించిన వారెవరూ ఉండరు.
ప్రస్తుత కల్లోలిత ప్రపంచంలో భారత నాగరకత విలువలు మొత్తం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆందోళనలు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయి. సంపూర్ణ జీవనానికి సంబంధించిన ప్రాచీన సిద్ధాంతాన్ని మీరందరూ ప్రపంచానికి తెలియచేయవచ్చు. ప్రపంచ సమాజం అంతా భిన్న ధోరణులు, భిన్న సిద్ధాంతాల నడుమ చీలిపోయి ఉన్న వాతావరణంలో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ (అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి) సిద్ధాంతాన్ని మీరు ప్రచారం చేయవచ్చు. అలాగే తీవ్రవాదం, ఉగ్రవాదంలో అల్లాడిపోతున్న ప్రపంచంలో సర్వ మత సమానత సిద్ధాంతాన్ని గురించి తెలియచేయవచ్చు.
మిత్రులారా,
ప్రయాగ- అలహాబాద్ లో 2019 లో కుంభ మేళా జరగబోతున్న విషయం మీకు తెలుసు. యునెస్కో కు చెందిన ఇన్ టాంజిబల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్ లో కుంభ మేళా కు స్థానం లభించడం మనందరికీ గర్వకారణం. ఆ ఉత్సవానికి సమగ్ర సన్నాహాలు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. వచ్చే సంవత్సరంలో భారతదేశ సందర్శనకు మీరు వచ్చినపుడు ప్రయాగ సందర్శనను కూడా మీ పర్యటనలో ఒక భాగంగా చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఈ మహోత్సవాన్ని గురించి ఇతర దేశాల వారికి మీరు తెలియచేస్తే వారు కూడా ప్రయాగ సందర్శించి భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ఆస్వాదించగలుగుతారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
ప్రపంచం నేడు పెను సవాళ్లను ఎన్నింటినో ఎదుర్కొంటోంది. వాటన్నింటికీ గాంధీ గారి ఆదర్శాలే సరైన పరిష్కారాన్ని చూపగలుగుతాయి. అహింస, మౌన నిరసన ద్వారా ఎలాంటి సవాలునైనా పరిష్కరించవచ్చు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిరోధించ గలిగిన సిద్ధాంతం ఏదైనా ఉంటే అది గాంధీ గారి సిద్దాంతం. భారతీయ విలువలకు గల గుర్తింపు అది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారతదేశ ఆవిర్భావం కోసం సాగే పయనంలో మీ అందరితో కలిసి ముందడుగు వేయాలని మేం కోరుతున్నాం. మీ అందరి అనుభవాల ద్వారా ప్రయోజనం పొందాలని ఈ సదస్సు నుండి మేం ఆశిస్తున్నాం. సరికొత్త భారతావని అభివృద్ధి గురించి మీ అందరికీ తెలియజేసి మీ అందరితో కలిసి పని చేయాలని వాంఛిస్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో నివసిస్తున్నా అభివృద్ధి యానంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం.
మిత్రులారా,
21వ శతాబ్ది ఆసియా శతాబ్ది. అందులో భారతదేశానికి ప్రముఖ స్థానం ఉంది. మీరంతా ఎక్కడ నివసిస్తున్నప్పటికీ ఈ పాత్రను అనుభవంలోకి తెచ్చుకోగలరు. భారతదేశ ఆర్థిక శక్తి, ప్రాబల్యంతో మీ అందరి శిరస్సులు మరింత గర్వంగా పైకి లేవనెత్తగలిగితే మాకు ఎంతో ఆనందదాయకం.
సోదరులు మరియు సోదరీమణులారా,
అంతర్జాతీయ వేదికపై సకారాత్మకమైన పాత్ర ను పోషించిన దేశం భారతదేశం. ఏ దేశంతో అయినా లాభనష్టాల బేరీజు ద్వారా కాకుండా మానవతా విలువలే గీటురాయిగా భాగస్వామి కావలని భారతదేశం కోరుతోంది.
అభివృద్ధికి సహాయం అందించడం అంటే ఇచ్చి పుచ్చుకోవడం కాదు. సహాయం పొందాలనుకునే దేశాల అవసరాలే అందుకు కొలమానం. ఎవరి వనరులు దోచుకోవాలని గాని, ఎవరి భూభాగాన్ని అయినా ఆక్రమించుకోవాలని గాని భారదేశం ఎప్పుడు ఆశించదు. సామర్థ్యాల విస్తరణ, వనరుల అభివృద్ధే భారతదేశానికి ప్రధానం. కామన్ వెల్త్ కావచ్చు లేదా ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ సమిట్ లేదా ఫోరమ్ ఫర్ ఇండియా– పసిఫిక్ ఐలండ్స్ కోఆపరేషన్ కావచ్చు .. ద్వైపాక్షిక వేదిక లేదా బహుముఖీన వేదిక ఏదయినా అందరినీ కలుపుకుని పోవడమే భారతదేశం లక్ష్యం.
ఆసియాన్ దేశాలతో ఇప్పటికే నెలకొన్న బలమైన బంధానికి మరింత శక్తిని సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. రానున్న గణతంత్ర దినం నాడు ఇండియా- ఆసియాన్ బంధం ఎంత బలమైందో ప్రపంచం యావత్తు చూడగలుగుతుంది.
మిత్రులారా,
ప్రపంచంలో ఆనందం, శాంతి, సుసంపన్నత, ప్రజాస్వామ్య విలువలు, సమ్మిళితత్వం, సహకారం, సౌభ్రాతృత్వం వ్యాపించాలనే భావానికి బలమైన మద్దతుదారు భారతదేశం. ప్రజాప్రతినిధులుగా ప్రజలతో మమేకం కావడానికి ఈ విలువలే సహాయకారిగా నిలుస్తాయి. ప్రపంచంలో శాంతి, పురోగతి, సమృద్ధి వర్థిల్లడానికి కృషి చేయడమే భారతదేశం నిబద్ధత.
మిత్రులారా,
తీవ్రమైన పనుల ఒత్తిడిలో ఉండి కూడా ఈ సమావేశానికి మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ అందరి భాగస్వామ్యంతో ఈ సదస్సు విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది జరిగే ప్రవాసీ భారతీయ దివస్ లో మీ అందరినీ కలిసే అవకాశం మరోసారి వస్తుందని నేను ఆశిస్తున్నాను.
మీ అందరికీ అనేక ధన్యవాదాలు.
జయ్ హింద్