పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేసిన యువతీ యువకుల్లారా,
ఇలా ఒక కార్యక్రమం కోసం పట్నా విశ్వవిద్యాలయాన్నిసందర్శించిన మొట్టమొదటి ప్రధాన మంత్రిని నేనేనన్న సంగతిని మన ముఖ్యమంత్రి ద్వారా ఇప్పుడే తెలుసుకున్నాను. నా కన్నా ముందు ప్రధాన మంత్రి పదవిని వహించిన వారు ఇక్కడ నేను పూర్తి చేసేందుకుగాను కొన్ని మంచి పనులను వదలివేయడాన్ని నాకు దక్కిన విశేష అధికారంగా భావిస్తున్నాను. ఈ కారణంగదా, ఈ మంచి పనిని చేసే అవకాశం నాకు లభించింది.
మొదటగా నేను ఈ పవిత్ర భూమికి నేను నా వందనమాచరించాలనుకొంటున్నాను; ఎందుకంటే పట్నా విశ్వవిద్యాలయ ప్రాంగణం దేశాభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం. ఈ సందర్భంగా నాకు ఒక చైనా సామెత గుర్తుకువస్తోంది. అది ఏమిటంటే.. మీ దూరదృష్టి ఒక ఏడాదికి పరిమితమైతే మీరు ధాన్యం గింజలను నాటండి. మీ దూరదృష్టి 10-20 ఏళ్లకు పరిమితమైతే పండ్ల మొక్కలను నాటండి. అయితే మీ దూరదృష్టి తరువాతి తరాలకు సంబంధించిందైతే మీరు మంచి మనుషులను తయారు చేయండి.. అనేదే. ఈ సామెతకు నిదర్శనంగా నిలుస్తోంది పట్నా విశ్వవిద్యాలయం. వంద సంవత్సరాల క్రితం ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నూరేళ్లలోనూ ఈ విశ్వవిద్యాలయంలో అనేక తరాలు విద్యార్జన చేశాయి. వారిలో కొందరు రాజకీయ నాయకులు అయ్యారు. విశ్వవిద్యాలయ ఆవరణ నుండి బయలకు వెళ్లగానే సమాజ సేవలో చేరారు. దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా, అక్కడ అగ్రగామి అయిదు స్థానాలలో నిలచే ప్రభుత్వ అధికారులు బిహార్ లోని పట్నా విశ్వవిద్యాలయానికి చెందని వారు ఉండరేమోనన్న విషయాన్ని నేను ఈ రోజున గ్రహించాను.
సాధారణంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులను నేను కలుసుకుంటూ ఉంటాను. ప్రతి రోజూ దాదాపు 80 లేదా 100 మంది అధికారులతో దాదాపు రెండు గంటల సేపు నేను మాట్లాడుతుంటాను. ఆ అధికారులలో అధిక భాగం బిహార్ నుండి వచ్చిన వారే. సరస్వతీ దేవి కృప ఉండడంతో వారు ఆ స్థాయికి చేరుకున్నారు. రోజులు మారాయి. బిహార్ కు సరస్వతీ దేవి ఆశీస్సులు ఉన్నాయి. అయితే బిహార్‌కు లక్ష్మీ దేవత ఆశీస్సులు కూడా కావాలి. ఈ ఉభయ దేవతల దీవెనల సాయంతో బిహార్ ను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
బిహార్ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ గారు నిబద్ధులయ్యారు. మరి, భారత ప్రభుత్వం కూడా తూర్పు భారతదేశం ప్రగతి కోసం నిబద్ధురాలైంది. 2022 కల్లా భారతదేశం తన 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను జరుపుకోనుంది. అప్పటికి మన సంకల్పం ఏ విధంగా ఉండాలంటే, బిహార్ ను కూడా దేశంలోని ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసకు చేర్చగలిగేలా ఉండాలి.
తల్లి లాంటి గంగా నది తీరంలో పట్నా నగరం ఏర్పడింది. గంగా నది ఎంత పురాతనమైనదో, అంతే పురాతనమైనవి బిహార్ యొక్క వారసత్వమూ, విజ్ఞానమూను. భారతదేశ విద్యా చరిత్రను ప్రస్తావించినప్పుడల్లా నాలందా లేదా విక్రమశిల విద్యాలయాలను ఎవరూ మరచిపోరు.
మానవ విలువల్లో సంస్కరణలు తేవడానికి ఈ పుణ్యభూమి చేసిన కృషి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను తడిమింది. మనకు దక్కిన ఈ మహోన్నత వారసత్వ సంపద దీనికి ఇదే ఒక గొప్ప స్ఫూర్తిగా నిలచింది. ఎంతో విలువైన చరిత్రను స్మరణకు తెచ్చుకొనే వారికి దానిని తరువాతి తరాలకు తెలియజేసే సామర్థ్యం ఉంటుంది. ఈ విలువైన చరిత్రను మరచిపోయే వారు జవజీవాలు లేని వారుగా మిగిలిపోతారు. కాబట్టి దీని సృజన ఎంతో శక్తివంతమైంది. దీని భావన ఈ గడ్డ మీద సాధ్యపడుతుంది. అది ఈ ప్రపంచాన్ని వెలిగిస్తుంది. ఎందుకంటే, ఇది ఉన్నతమైన చరిత్రాత్మక వారసత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, సజీవమైన ఉదాహరణను కలిగివుంది. అటువంటి శక్తి లేదా సామర్థ్యం మరో చోటు లేదని నేను నమ్ముతున్నాను.
నేర్చుకోవడానికి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే రోజులు ఒకప్పుడు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ రోజులు గతించాయి. ఈ రోజుల్లో ప్రపంచం పెనుమార్పుకు గురైంది. ఆలోచనలు మారుతున్నాయి. సాంకేతిక రంగం కారణంగా జీవన గమనం మారుతోంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే విద్యార్థులు అనేక గొప్ప సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లు ఎలాంటివంటే, ఇవి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సంబంధించినవి కావు. పాత చింతకాయ పచ్చడి వంటి విషయాలను వదలించుకొని ఆ తరువాత కొత్త విషయాలను తిరిగి నేర్చుకోవడానికి సంబంధించినవి ఈ విషయాలు.
ఒకసారి ఫోర్బ్స్ మ్యాగజైన్ కు చెందిన శ్రీ ఫోర్బ్స్ ఒక ఆసక్తికరమైన నిర్వచనాన్ని అందించారు. విజ్ఞానం ఉద్దేశం మెదడును ఖాళీ చేయడమని ఆయన అన్నారు. తద్వారా మన మస్తిష్కాలను నూతన ఆలోచనలతో నింపవచ్చని ఆయన తెలిపారు. అంతే కాదు, కొత్త పనులను చేయవచ్చని కూడా ఆయన వివరించారు. విజ్ఞానం అనేది మస్తిష్కాన్ని ఖాళీ చేయించి, ఆలోచనలను విస్తృతం చేయాలని ఆయన అంటారు. మన ఆలోచన ఎలా సాగుతున్నదంటే, అది మెదడుకు భారంగా మారుతోంది. అనేక అంశాలను ఒకే చోటులో నింపుతోంది. వాస్తవిక దృష్టితో చూసి మార్పును తీసుకురావాలంటే, అందరమూ కలిసి దృక్పథాన్ని విస్తృతపరచడానికి ఉద్యమాన్ని ఆరంభించాలి. తద్వారా మన మేధస్తసుల లోకి నూతన ఆలోచనలు తొంగి చూస్తాయి. కాబట్టి విశ్వవిద్యాలయాలు వాటి విద్యార్థులకు బోధనను కాకుండా నేర్చుకోవడాన్ని నేర్పించాలి. ఆ దిశగా మన విద్యాసంస్థలను పయనింపచేయడం ఎలా ? వేల సంవత్సరాలుగా కొనసాగిన మానవ సంస్కృతి పరిణామాన్ని చూసినప్పుడు ఒక అంశంలో సుస్థిరత కొనసాగుతోంది. అదే అన్వేషణ. ప్రతి యుగంలో మానవులు వారి జీవన విధానానికి అన్వేషణను జోడించారు. ఇప్పుడు అన్వేషణ అనేది పోటీని ఎదుర్కొంటోంది. అన్వేషణకు, అటువంటి సంస్థలకు ప్రాధాన్యమిచ్చే దేశం మాత్రమే ఈ ప్రపంచంలో ప్రగతిని సాధిస్తుంది. సంస్థకు కేవలం పైపై మెరుగులు దిద్దితే దానిని మార్పుగా పరిగణించకూడదు. ఈ కాలానికి కావలసింది పాతను, పనికిరాని ఆలోచనలను త్యజించడం. భవిష్యత్తును భద్రంగా ఉంచడానికి నూతన విధానాలను కనుగొనాలి. శాస్త్ర సాంకేతిక నియమాల సహాయంతో జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికిగాను వనరులను ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం సాంకేతికత సాయంతో ప్రతి రంగాన్ని సంస్కరించవలసివుంది. సమాజం పురోగతి పథాన పయనించాలంటే వైవిధ్యభరితమైన మార్గాలు కావాలి. స్పర్ధ కూడా ప్రపంచీకరణ అయిన ఈ సమయంలో, రాబోయే తరాల వారి అవసరాలకు అనుగణంగా ప్రపంచం తయారు అవ్వాలంటే విశ్వవిద్యాలయాలు చెప్పుకోదగ్గ పాత్రను పోషించవలసివుంది. ఈ రోజు మనం మన దేశంలో మాత్రమే పోటీ పడడం లేదు. ఇరుగు పొరుగు దేశాలతో మాత్రమే పోటీ పడడం లేదు. పోటీ కూడా ప్రపంచీకరణ అయింది. కాబట్టి స్పర్ధను సవాల్‌గా మనం అంగీకరించాలి. దేశం ప్రగతి పథంలో పయనించాలంటే, నూతన శిఖరాలకు పయనించాలంటే, ప్రపంచ పటంలో మన స్థానాన్ని పదిలపరచుకోవాంటే మన యువత అన్వేషణకు పెద్ద పీట వేయవలసివుంది.
సమాచార సాంకేతిక విజ్ఞాన రంగ విప్లవం దేశంలో విస్తరించగానే ప్రపంచానికి భారతదేశమంటే ఏర్పడివున్న భావనలో మార్పు రావడం మొదలైంది. అంతక్రితం ప్రపంచానికి భారతదేశమంటే పాములు పట్టే వాళ్లనే అభిప్రాయం ఉండేది. భారతీయులను చూడగానే ప్రపంచానికి మంత్రాలు, దెయ్యాలు, మూఢ నమ్మకాలు గుర్తుకువచ్చేవి. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగ విప్లవం వచ్చిన తరువాత మన దేశ యువ తరానికి గల సాంకేతిక విజ్ఞాన శక్తిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. 18-20 ఏళ్ల యువతీయువకులు వారి సమాచార సాంకేతిక విజ్ఞాన సామర్థ్యాన్ని చాటడం మొదలు పెట్టడంతోనే ప్రపంచం తుళ్లిపడింది. భారతదేశం పట్ల వారికి ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చింది.
చాలా కాలం క్రితం తైవాన్‌లో నేను పర్యటించినప్పటి సంగతి నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకముంది. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రిని కూడా కాదు. ఎన్నికలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తైవాన్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు నేను ఆ దేశానికి వెళ్లాను. అది పది రోజుల పర్యటన. అక్కడి ప్రజలతో సంభాషించడానికిగాను నాకు సహాయం చేసేందుకు దుబాసీలను ఇచ్చారు. ఆ పది రోజుల్లో మా మధ్య చిరు స్నేహం ఏర్పడింది. ఆరేడు రోజుల తరువాత ఆయన నా ముందు ఒక సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నారు. ఏమీ అనుకోను.. ప్రశ్న అడగండంటూ బదులిచ్చాను. అయితే ప్రశ్న అడగడానికి ఆయన చాలా సందేహించాడు. ఆ తరువాత కొంత సమయానికి నేనే కలగజేసుకొని ఆయన అడగాలనుకున్నది ఏమిటో చెప్పమన్నాను. అయినా ఆయన సందేహించాడు. ఏమీ పర్వాలేదు, అడగాల్సిందేదో ఎటువంటి శషభిషలు లేకుండా అడగండని కోరాను. ఆయన కంప్యూటర్ ఇంజినీయర్. భారతదేశం ఇంకా పురాతన కాలంలో ఉన్నట్టుగానే ఉందా, భారతీయులంటే పాములు పట్టే వాళ్లు మాత్రమేనా, మంత్రాలు, మూఢ నమ్మకాలు ఇంకా దేశంలో ఉన్నాయా ? అంటూ అడిగాడు. ఆ తరువాత ఆయన నా సమాధానం కోపం నా వైపు తదేకంగా చూశాడు. నన్ను చూసిన తరువాత తనకు ఏ భావం కలిగిందో చెప్పాలంటూ అడిగాను. అతడు పశ్చాత్తాపంతో నాకు క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టాడు. మీ సందేహం తప్పు సోదరా, ఇప్పుడు భారతదేశం పూర్వంలా లేదు. నిజానికి భారతదేశం పట్ల అంచనాలు పెరిగిపోతున్నాయి అని జవాబిచ్చాను. ఎలా సాధ్యమైంది ? అని ఆయన అడిగాడు. మా పూర్వికులు పాములతో ఆడుకొనే వారు. కానీ ప్రస్తుత భారతీయ తరం ‘మౌస్’ తో ఆడుకొంటోంది అని మళ్లీ బదులిచ్చాను. నేను చెప్పిన ‘మౌస్’ అంటే జంతువు కాదు, కంప్యూటర్‌తో పాటు ఉపయోగించే పరికరం అనే విషయం ఆయనకు అర్థమైంది.
ఇంతకు నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, ఇటువంటి విషయాలు దేశం యొక్క శక్తిని పెంపొందిస్తాయి. ఒకటి లేదా రెండు పూర్తి ప్రాజెక్టులను ముగించడం వల్ల కొన్ని సార్లు మనం పురస్కారాలు సాధిస్తాం. కానీ, ప్రస్తుతం మనకు కావాలసిందేమిటంటే భారీ స్థాయిలో నూతన ఆవిష్కారాలు. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన గడ్డ మీద నుండి, వంద ఏళ్ల పట్నా విశ్వవిద్యాలయానికి నిలయమైనటువంటి ఈ నేల మీద నుండి యువతకు, విద్యార్థులకు, అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు వినూత్నమైన పరిష్కారాలతో ముందుకు రండి అంటూ. అందరూ వినియోగించడానికి వీలుగా, సులువుగా, అందరికీ అందుబాటు ధరలలో ఉండే సాంకేతికతల్ని మనం కనుక్కోలేమా ? చిన్న ప్రాజెక్టులకు ప్రోత్సాహాన్ని అందిస్తే అవే ఆ తరువాత స్టార్ట్- అప్ కంపెనీలుగా అవతరిస్తాయి. బ్యాంకులు ‘ముద్ర యోజన’లో భాగంగా ఇచ్చే నిధులను ఉపయోగించుకొని సృజనాత్మక విశ్వవిద్యాలయ విద్యలో భాగంగా విద్యార్థులు స్టార్ట్- అప్ కంపెనీలను అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్టార్ట్- అప్ హబ్ గా భారతదేశం అవతరించిందనే విషయం మీకు తెలుసా ? భవిష్యత్తు లో భారతదేశం ఒకటో స్థానాన్ని కూడా పొందగలుగుతుంది. భారతదేశంలో ప్రతి యువకుడూ, ప్రతి యువతీ ఒక నూతన ఆలోచనతో ముందుకువచ్చి స్టార్ట్- అప్ కోసం కృషి చేస్తే, అది విప్లవాత్మక మార్పుకు శ్రీకారం అవుతుంది. అందుకే నేను భారతదేశంలోని విశ్వవిద్యాలయాలకు స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా పట్నా విశ్వవిద్యాలయానికి. నూతన ఆవిష్కారాలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయంగా ముందుకు దూసుకుపోవలసివుంది.
భారతదేశంలో ప్రతిభకేమీ లోటు లేదు. భారతదేశ జనాభాలో 800 మిలియన్ మంది అంటే 65 శాతం మంది 35 ఏళ్ల వయస్సు లోపు వారే. మనది యువ భారతం. భారతదేశం కలలు కూడా యవ్వనోత్సాహంతో నిండి ఉన్నాయి. ఇంతటి మహత్తరమైన శక్తి సామర్థ్యాలు కలిగిన దేశం దేన్నయినా సాధించగలదని, తన కలలన్నింటినీ నెరవేర్చుకోగలదని నేను నమ్ముతున్నాను.
నీతీశ్ గారు ఇప్పుడే తన ప్రసంగంలో ఒక అంశాన్ని చాలా వివరంగా చెప్పారు. దానికి మీరు కరతాళ ధ్వనులతో మద్దతిచ్చారు. కానీ, నేను కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది గతానికి సంబంధించిందని భావిస్తున్నాను. దానిని నేను ఒక అడుగు ముందుకు తీసుకుపోవాలని అనుకొంటున్నాను. అందుకోసం మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రోజు ఈ విశ్వవిద్యాలయ కార్యక్రమానికి వచ్చాను. మన దేశంలో విద్యారంగ సంస్కరణలు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. విద్యాసంస్థల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంతో ప్రతి దశలో సంస్కరణలకు బదులు అనేక సమస్యలు పుట్టుకువస్తున్నాయి. ప్రస్తుతం మన విద్యావ్యవస్థకు నూతన ఆవిష్కారాలు, సంస్కరణలు కావాలి. ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో. అప్పుడు మాత్రమే ప్రపంచ స్థాయికి మనం చేరుకోగలుగుతాం. కానీ అవే మనకు లేకుండా పోయాయి. ఈ ప్రభుత్వం కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఐఐఎం లకు స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చే విషయంలో కొంత కాలంగా ఒక చర్చ కొనసాగింది. ఈ విద్యాసంస్థలకు అధిక మొత్తంలో నిధులను అందిస్తున్నామని ప్రభుత్వం భావిస్తోంది.. కానీ ఈ సంస్థలు తన నుండి మార్గదర్శకాలను తీసుకోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే ఈ ఈ చర్చ సారాంశం. ఈ చర్చ అనంతరం కొన్ని సంవత్సరాలకు జరిగిన ఈ మార్పు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మొట్ట మొదటి సారిగా ఐఐఎం లకు స్వేచ్ఛ వచ్చింది. అవి చక్కటి కార్యదక్షతతో మొదలయ్యాయ. అయితే ఈ విషయాన్ని గురించి వార్తా పత్రికలు విస్తృతంగా రాయలేదు. దీనికి సంబంధించి కొన్ని వ్యాసాలను మాత్రం కచ్చితంగా రాసే ఉంటారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ ఎస్ లను తయారు చేయడంలో పట్నా విశ్వవిద్యాలయానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నట్లే సిఇఒ లను తయారు చేయడంలో దేశవ్యాప్తంగా ఐఐఎం లకు మంచి పేరు ఉంది. కాబట్టే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ప్రభుత్వ నియమ నిబంధనల నుండి విముక్తి కలిగించాలని మేం నిర్ణయించుకున్నాం. ఇదే ఉద్దేశంతో ఐఐఎం లకు ఈ అవకాశాన్ని కల్పించామని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ విద్యాసంస్థలు దేశ ప్రజల ఆకాంక్షలను, అంచనాలను అందుకోవడానికి కృషి చేయగలుగుతాయి. ఐఐఎంల నిర్వహణలో వాటి పూర్వ విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలని ఐఐఎం లకు నేను విజ్ఞప్తి చేశాను కూడా. పట్నా విశ్వవిద్యాలయం కూడా తన అభివృద్ధిలో తన పూర్వ విద్యార్థులను భాగస్తులను చేస్తోందని నేను తెలుసుకున్నాను. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థులు ఆయా విశ్వవిద్యాలయాల ప్రగతిలో గణనీయమైన పాత్రను పోషిస్తున్నారనే విషయం మీకు తెలిసే ఉంటుంది. వారు ఆయా విశ్వవిద్యాలయాలకు కావలసిన ఆర్ధిక వనరులనే కాదు విజ్ఞానం, అనుభవాలు, స్థాయి, దశ మొదలైన అంశాల్లో కూడా సాయం అందిస్తున్నారు. సాధారణంగా మనం ఏవో కార్యక్రమాల కోసం పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారికి పూల దండలు వేసి గౌరవించి, వారి నుండి విరాళాలు తీసుకొని, అంతటితో వారిని మరచిపోతాం. నిజానికి పూర్వ విద్యార్థుల సామర్థ్యం చాలా గొప్పది. కాబట్టి వారిని మాట వరుసకు విశ్వవిద్యాలయానికి ఆహ్వానించడం, పంపేయడం మంచిది కాదు. వారితో విశ్వవిద్యాలయం సరైన అనుబంధాన్ని కొనసాగించాలి.
పట్నా విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్చడం కాదు; అంతకంటే ఒక అడుగు ముందుకు పోదామని కొంత సేపటి క్రితం నేను అన్నాను. అందుకోసమే నేను పట్నా విశ్వవిద్యాలయానికి వచ్చానని వివరించాను. దేశంలోని విశ్వవిద్యాలయాల ముందు భారత ప్రభుత్వం ఒక కలను నిలిపింది. ప్రపంచం లోని 500 ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల జాబితాను తీసుకుంటే, వాటిలో భారతీయ విశ్వవిద్యాలయాలకు స్థానం లేదు. 1300 లేదా 1500 సంవత్సరాల క్రితం భారతదేశంలోని నాలందా, విక్రమశిల, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనేక దేశాల విద్యార్థులు తరలివచ్చే వారు. అటువంటి గొప్ప విశ్వవిద్యాలయాలను కలిగిన మన దేశం ప్రస్తుతం అగ్రగామి 500 ప్రపంచ విశ్వవిద్యాలయాల జాబితా లోకి చేరుకోలేకపోవడం దయనీయంగా అనిపించడం లేదా ? ఈ అపసవ్యతను తొలగించి పరిస్థితిలో మార్పు తేలేమా ? మనం ప్రస్తుత పరిస్థితిలో మాత్రమే మార్పు తేవాలి. బయట వాళ్లలో కాదు. ఈ సంకల్పం చెప్పుకొని విజయం సాధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.
ఈ విజయాన్ని సాధించడానికిగాను భారత ప్రభుత్వం తన విధానం ప్రకారం పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అంటే మొత్తం 20 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ నియమ నిబంధనలనుండి విముక్తి కల్పిస్తోంది. తద్వారా వాటిని ప్రపంచ శ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దాలనుకుంటోంది. ఈ విశ్వవిద్యాలయాలకు రాబోయే ఐదు సంవత్సరాలలో 10,000 కోట్ల రూపాయల నిధులను అందించడం జరుగుతుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం, ఒక విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయంగా ప్రకటించడం కంటే గొప్పది. ఈ ఇరవై విశ్వవిద్యాలయాల ఎంపిక ఏ రాజకీయ నేత లేదా ప్రధాన మంత్రి లేదా మరే ముఖ్యమంత్రి ఇష్టానిష్టాల ప్రకారం ఉండదు. పూర్తిగా పారదర్శకమైన పోటీ పద్ధతిలో ఈ ఎంపిక ఉంటుంది. ఈ సవాల్ ను స్వీకరించాలని అన్ని విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం వెళ్లింది. ఈ సవాల్‌ను ఎదుర్కోవడం ద్వారా విశ్వవిద్యాలయాలు వాటి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. ఈ పద్ధతి లోనే పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అంతిమ ఎంపిక మాత్రం ఎవరికీ సంబంధం లేని ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ సవాల్ గ్రూపులో పాల్గొనడానికి గాను రాష్ట్రప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు బాధ్యత తీసుకోవాలి. పోటీలో వాటి సామర్థ్యాన్ని మదింపు చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ వేదికపైన వారు సాధించబోయే మార్గ పటాలను కూడా అంచనా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ నియమ నిబంధనల నుండి విముక్తిని కలిగించి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వడం జరుగుతుంది. ఆ తరువాత అవి తమ మార్గ పటాలను తామే నిర్ణయించుకొంటాయి. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ విశ్వవిద్యాలయాలకు 10,000 కోట్ల రూపాయల నిధులను అందించడం జరుగుతుంది. ఈ విధానం కేంద్రీయ విద్యాలయ హోదా కంటే అనేక విధాలుగా మెరుగైంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ సవాల్‌ను ఎదుర్కొని నిలవడంలో పట్నా వెనకబడి పోకూడదు. అందుకే పట్నా విశ్వవిద్యాలయాన్ని ఆహ్వానించడానికే నేను ఇక్కడకు వచ్చాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనాలని పట్నా విశ్వవిద్యాలయ నిర్వాహకులకు ఆహ్వానం పలుకుతున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకమైన పట్నా విశ్వవిద్యాలయం ప్రపంచ పటంలో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. పట్నా విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మీరు చెప్పుకొన్న సంకల్పాలన్నింటినీ మీరు ఆచరించాలి. ఈ భావాలతో, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.