India is working to become a $5 trillion economy: PM Modi in Houston #HowdyModi
Be it the 9/11 or 26/11 attacks, the brainchild is is always found at the same place: PM #HowdyModi
With abrogation of Article 370, Jammu, Kashmir and Ladakh have got equal rights as rest of India: PM Modi #HowdyModi
Data is the new gold: PM Modi #HowdyModi
Answer to Howdy Modi is 'Everything is fine in India': PM #HowdyModi
We are challenging ourselves; we are changing ourselves: PM Modi in Houston #HowdyModi
We are aiming high; we are achieving higher: PM Modi #HowdyModi

మిత్రులారా.. ఎలా ఉన్నారు,

ఈ దృశ్యం, ఇక్క‌డి వాతావ‌ర‌ణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విష‌యానికొస్తే ఇక్క‌డంతా భారీ గా, గొప్ప‌గా ఉండాల్సిందే. టెక్సాస్ స్వ‌భావంలోనే ఇదొక విడ‌దీయ‌లేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.

ఇది 130 కోట్లమంది భారతీయులకు దక్కిన గౌరవం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాకుండా అనేకమంది ఇతర అమెరికన్ మిత్రులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి భారతీయుడి తరఫున నేను వారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులకు కూడా నా అభినందనలు. దీనికి హాజరు కావడం కోసం చాలామంది తమ పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ స్థలాభావం కారణంగా వేలాదిమంది రాలేకపోయారని నాకు సమాచారం అందింది. ఈ పరిస్థితి ఏర్పడటంపై నేను వారందరినీ వ్యక్తిగతంగా మన్నింపు కోరుతున్నాను. ఇక హ్యూస్టన్, టెక్సాస్ పాలకమండళ్లకు నా ప్రశంసలు తెలియజేస్తున్నాను. రెండు రోజుల కిందట వాతావరణంలో హఠాత్తుగా పెనుమార్పులు చోటుచేసుకున్నప్పటికీ స్వల్ప వ్యవధిలోనే వారు ఆ పరిస్థితిని ఎదుర్కొన్న తీరు, ఏర్పాట్లకు భంగం కలగకుండా చూపిన చొరవ అభినందనీయం. హ్యూస్టన్ చాలా శక్తిమంతమైనదన్న అధ్యక్షుడు శ్రీ ట్రంప్ మాట ను వారు నిజం చేసి చూపారు.

మిత్రులారా,

ఈ కార్యక్రమానికి ‘హౌడీ మోదీ’ అని పేరు పెట్టారు. కానీ, వ్యక్తిగా మోదీ కి ఎటువంటి ప్రత్యేకతా లేదు. నేను 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు తగినట్లు పనిచేసే ఒక సామాన్యుడిని మాత్రమే. కాబట్టి, ఎలా ఉన్నారు మోదీ గారూ! అన్న మీ కుశల ప్రశ్న కు ‘భారతదేశం లో అంతా బాగుంది’ (ఇదే మాట ను వివిధ భారతీయ భాషల్లో ప్రధాన మంత్రి పలికారు) అన్నదే నా హృదయం ఇచ్చే సమాధానం.

మిత్రులారా,

నేను ఒకే జవాబు ను పలు రకాలు గా చెప్పడం విని నా అమెరికా మిత్రులు ఆశ్చర్యపోతూండి ఉంటారు. అయితే, అధ్యక్షుడు శ్రీ ట్రంప్ తో పాటు ఇతర మిత్రులారా… మా దేశం లో ‘‘అంతా బాగుంద’’ని నేను వివిధ భారతీయ భాషల లో వివరించాను. అంతే సుమా. మా భాష లు స్వేచ్ఛాయుతమైనటువంటి, ప్రజాతంత్రయుతమైనటువంటి సమాజానికి ప్రతీక లు. వందలాది భాష లు, మాండలికాలు కొన్ని శతాబ్దాలు గా సహజీవనం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. అందుకే నేటికీ లక్షలాది ప్రజల మాతృభాషగా వర్ధిల్లుతున్నాయి. భాషలు మాత్రమే కాదు… మా దేశంలో విభిన్న తెగలు, డజన్ల కొద్దీ సంప్రదాయాలు, వేర్వేరు ప్రార్థనా పద్ధతులు, వందలాది వైవిధ్య ప్రాంతీయ వంటకాలు, విభిన్న వస్త్రధారణలు, పలు రుతువులు.

వంటివి మాదొక అద్భుత భూభూగమని చాటుతుంటాయి. భిన్నత్వంలో ఏకత్వం మా వారసత్వం… అదే మా ప్రత్యేకత. మా శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి మూలం ఈ భిన్నత్వమే. మా శక్తి కి, స్ఫూర్తి కి మూలం ఇదే. మేమెక్కడికి వెళ్లినా భిన్నత్వంతో కూడిన మా పద్ధతులను, ప్రజాస్వామ్యాన్ని కూడా మా వెంటబెట్టుకు వెళ్తాం. ఇవాళ మా విశిష్ట సంప్రదాయానికి ప్రతినిధులుగా ఇక్కడ ఈ స్టేడియంలో 50వేల మందికిపైగా భారతీయులు హాజరై ఉన్నారు. మీలో చాలామంది భారత ప్రజాస్వామ్య అతిభారీ వేడుకవంటి 2019 సార్వత్రిక ఎన్నికలలో మీ వంతుగా చురుకైన పాత్రను పోషించారు. ఈ ఎన్నికలు నిజంగానే భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటాయి. మొత్తం 61 కోట్లకుపైగా ఓటర్లు ఈ ఎన్నికలలో తమ హక్కును వినియోగించుకున్నారు. ఒకవిధంగా చూస్తే అమెరికా మొత్తం జనాభాకు ఇది దాదాపు రెట్టింపని చెప్పవచ్చు. వీరిలో 8 కోట్లమంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువజనులు కావడం విశేషం. అలాగే భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఓటు హక్కు వినియోగించుకోవడమేగాక అత్యధిక సంఖ్యలో మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు.

మిత్రులారా,

ఈ 2019 ఎన్నికలు మరో కొత్త రికార్డును సృష్టించాయి. ఐదేళ్లపాటు అధికారంలోగల ప్రభుత్వం అప్పటికన్నా ఎక్కువ స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఆరు దశాబ్దాల తర్వాత ఈ ఎన్నికలలో మాత్రమే సాధ్యమైంది. ఇదంతా ఎలా జరిగింది… ఇందుకు కారణమేమిటి? ఇందులో మోదీవల్ల జరిగింది కాదు… ఇది కేవలం భారతీయులవల్ల మాత్రమే సాధ్యమైంది. మిత్రులారా… సహనశీలతకు భారతీయులు మారుపేరు. కానీ, మేమిప్పుడు దేశ ప్రగతి విషయంలో అంత ఓర్పు చూపించే పరిస్థితిలో లేము… ఈ 21వ శతాబ్దంలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చాలన్న ఆదుర్దాతో ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఎక్కువగా అందరి నోటా నానుతున్న పదం అభివృద్ధి. భారత్ నేడు పఠిస్తున్న ప్రధాన మంత్రం ‘‘అందరి తోడ్పాటుతో అందరి ప్రగతి.’’ ప్రజా భాగస్వామ్యమే భారత్ ఇవాళ అనుసరిస్తున్న అత్యంత కీలక విధానం. కృతనిశ్చయంతో భారతదేశ విజయాన్ని కళ్లజూడాలన్నదే నేడు అత్యంత ప్రజాదరణగల నినాదం… మాకు అతి ముఖ్యమైన దృఢ సంకల్పం ‘న్యూ ఇండియా’ ఆవిష్కరణే. 

ఆ మేరకు న్యూ ఇండియా స్వప్న సాకారం దిశ గా దేశవాసులు నేడు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ కృషిలో అత్యంత ప్రధానాంశమేమిటంటే ఎవరితోనో పోటీపడటం కాకుండా మాలో మేమే పోటీపడుతుండటం. మాలో మేమే సవాలు చేసుకుంటూ… మమ్మల్ని మేం మార్చుకుంటున్నాం. మిత్రులారా… ఇవాళ మునుపటికన్నా వేగంగా ముందుకు వెళ్లాలని ఇవాళ భారత్ ఆకాంక్షిస్తోంది. ఆ మేరకు కొందరి… అంటే- మార్పు అసాధ్యం అని భావించే వారి ఆలోచనా ధోరణి ని సవాలు చేస్తోంది. గడచిన ఐదేళ్ల లో 130 కోట్ల మంది భారతీయులు సమష్టి గా సాధించిన ఫలితాలు ఎలాంటివంటే- అంతకుముందు కాలంలో ఎవరూ ఊహించలేనంతటి గొప్పవన్న మాట! అయితే, మేం అంతకన్నా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటూ అంతకుమించిన విజయాలను సాధిస్తున్నాం.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఏడు దశాబ్దాలు గా దేశం లో గ్రామీణ పారిశుధ్యం కేవలం 38 శాతం ప్రజలకు మాత్రమే చేరువైంది. కానీ, ఐదేళ్ల కాలంలోనే మేం 110 మిలియన్ల మరుగుదొడ్లను నిర్మించాం. తద్వారా ఇవాళ గ్రామీణ పారిశుధ్యం 99 శాతానికి అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఒకనాడు వంటగ్యాస్ కనెక్షన్లు సుమారు 55 శాతం మాత్రమే కాగా, ఐదేళ్లలోనే అది 95 శాతానికి చేరింది. కేవలం ఐదు సంవత్సరాల్లోనే మేం 150 మిలియన్ ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. భారతదేశంలో అంతకుముందు గ్రామీణ అనుసంధానం కూడా కేవలం 55 శాతంగానే ఉండేది. మేం దాన్ని 97 శాతానికి తీసుకెళ్లాం. గ్రామీణ ప్రాంతాల్లో ఐదంటే ఐదేళ్లలోనే 2 లక్షల కిలోమీటర్లు… అమెరికా పద్ధతి లో చెబితే- 200 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించాం. ఇక భారత ప్రజానీకంలో 50 శాతంకన్నా తక్కువమందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవి. ఐదేళ్లలో దాదాపు 100 శాతం కుటుంబాలు ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థ లో భాగస్వాములయ్యాయి. ఐదు సంవత్సరాల వ్యవధిలో మేం 370 మిలియన్ ప్రజలతో బ్యాంకు ఖాతాలు తెరిపించాం. మిత్రులారా… ఇవాళ ప్రాథమిక అవసరాల కోసం ప్రజలు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు గనుక- వారు అంతకుమించిన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాధించే దిశగా తమ శక్తియుక్తులను కేంద్రీకరిస్తున్నారు.

మిత్రులారా,

వాణిజ్య సౌలభ్యం మనకు ఎంత అవసరమో.. జీవన సౌలభ్యం అంతే అవసరం. అది సాధికారతకు మార్గం. దేశంలోని సామాన్యపౌరుడికి సాధికారత సిద్ధిస్తే, దేశ సామాజిక-ఆర్థిక ప్రగతి అమిత వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. నేనివాళ మీకో ఉదాహరణ చెబుతాను. ఈ రోజుల్లో సమాచారం (డేటా) సరికొత్త ఇంధనమని చెబుతున్నారు. ఇంధనమంటే ఏమిటో హ్యూస్టన్ వాసులైన మీకు చాలా బాగా తెలుసు. అయితే, సమాచారమంటే కొత్త బంగారమని నేను చెబుతున్న మాట. నాలుగో పారిశ్రామిక విప్లవం దృష్టి మొత్తం దీనిపైనే కేంద్రీకృతమైంది. ఇది జాగ్రత్తగా వినండి… మొత్తం ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో సమాచారం లభించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే! ఇవాళ భారతదేశంలో 1జిబి డేటా అమెరికా కరెన్సీలో కేవలం 25-30 సెంట్లు అంటే పావు డాలర్ మాత్రమే. కానీ, ప్రపంచంలో 1జిబి సగటు ధర ఇంతకన్నా 25-30 రెట్లు ఎక్కువగా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. భారతదేశం లో డిజిటల్ భారతానికి ఈ చౌక డేటా ఒక గుర్తింపుగా మారింది. దేశంలో పాలనను కూడా ఈ చౌక డేటా పునర్నిర్వచిస్తోంది. నేడు భారతదేశం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవల లో దాదాపు 10వేల దాకా ఆన్‌ లైన్‌ లో లభ్యమవుతున్నాయి.

మిత్రులారా,

భారతదేశంలో ఒకప్పుడు పాస్ పోర్ట్ కోసం రెండుమూడు నెలలపాటు ఆగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కేవలం వారంలోపే పాస్‘పోర్ట్ నేరుగా ఇంటికే వస్తుంది. అలాగే ఇంతకుముందు వీసా కోసం ఎన్నిరకాల సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చేదో బహుశా నాకన్నా బాగా మీకే తెలిసి ఉంటుంది. అయితే, ఇవాళ భారత వీసా సదుపాయాన్ని అత్యధికంగా వినియోగించుకుంటున్న దేశాల్లో అమెరికాదే అగ్రస్థానం. మిత్రులారా… కొత్త కంపెనీని నమోదు చేసుకోవాలంటే రెండుమూడు వారాలు పట్టే కాలంగురించి కూడా మీకు తెలుసు. కానీ, నేడు కొత్త కంపెనీ నమోదుకు 24 గంటలు చాలు. అలాగే పన్ను రిటర్నుల దాఖలు ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది. అంతేకాకుండా పన్ను వాపసు పొందాలంటే నెలల సమయం పట్టేది. అయితే, ఇవాళ ఎన్ని మార్పులు చోటుచేసుకున్నాయో తెలిస్తే మీరు దిగ్ర్భాంతికి గురికావాల్సిందే. ఇప్పుడు.. అంటే- ఈ ఏడాది ఆగస్టు 31న.. ఒకేఒక రోజులో దాదాపు 50 లక్షల మంది.. అంటే 5 మిలియన్ల మేర తమ ఆదాయపు పన్ను రిటర్నులను ఆన్‘లైన్ ద్వారా దాఖలు చేసేశారు! ఒక్కరోజులోనే 5 మిలియన్ రిటర్ను లు దాఖలు కావడమంటే హ్యూస్టన్ జనాభా కు రెండు రెట్లు అన్న మాట. ఇక ఇంతకు ముందు ఉన్న మరో పెద్ద సమస్య పన్ను వాపసు ను పొందడం కోసం నెలల సమయం వేచివుండవలసి రావడం. కానీ, ఇప్పుడు కేవలం 8 రోజుల నుండి 10 రోజుల లోపే వాపసు మొత్తం నేరు గా బ్యాంకు ఖాతాల కు బదిలీ అవుతోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

సత్వర ప్రగతి ని కాంక్షించే ఏ దేశమైనా పౌరుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం అవశ్యం. ఈ నేపథ్యంలో నవభారత నిర్మాణం దిశగా పౌరులకు అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు కొన్ని అంశాలకు స్వస్తిపలుకుతున్నాం. ఆ మేరకు కొన్నిటికి స్వస్తి పలకడానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చామో సంక్షేమ పథకాల అమలుకు అంతే ప్రాధాన్యమిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబరు 2న మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించేనాటికి భారతదేశంలో బహిరంగ విసర్జనకు స్వస్తి పలుకుతున్నాం. అలాగే గడచిన ఐదేళ్లలో 1500దాకా పురాతన, నిరంకుశ చట్టాలకూ వీడ్కోలి పలికాం. భారతదేశంలో అల్లుకున్న డజన్లకొద్దీ పన్నుల సాలెగూళ్ల ఫలితంగా వ్యాపార సన్నిహిత వాతావరణం ఏర్పడటానికి అవరోధంగా నిలిచాయి. మా ప్రభుత్వం ఈ పన్నుల సాలెగూళ్లను నిర్మూలించడంతోపాటు వస్తుసేవల పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ విధంగా అనేక ఏళ్ల తర్వాత ఒకే దేశం-ఒకే పన్ను స్వప్నాన్ని సాకారం చేశాం.

మిత్రులారా,

మేము అవినీతి పైనా యుద్ధం ప్రకటించాం. ప్రతి స్థాయిలోనూ దానికి చరమగీతం పాడే దిశగా ఒకదాని తర్వాత మరొకటిగా చర్యలు తీసుకుంటున్నాం. గడచిన రెండుమూడేళ్లలో మూడున్నర లక్షలకుపైగా బూటకపు కంపెనీలను భారత్ మూసేసింది. అలాగే కాగితాలపై మాత్రమే కనిపిస్తూ ప్రభుత్వ సేవల దుర్వినియోగానికి కారణమవుతున్న 80 మిలియన్ పేర్లను తొలగించాం. అంతేకాదు మిత్రులారా… ఈ పేర్ల తొలగింపువల్ల అనర్హుల నోట పడకుండా కాపాడుకున్న ప్రజాధనం ఎంతో మీరు ఊహించగలరా? దాదాపు 20 బిలియన్ డాలర్లు! ప్రగతి ఫలాలు ప్రతి భారతీయుడికీ అందేవిధంగా దేశంలో ఒక పారదర్శక పర్యావరణాన్ని మేం కల్పిస్తున్నాం. అంతేకాదు సోదరీసోదరులారా… ఏ ఒక్క భారతీయుడు ప్రగతికి దూరమైనా భారతదేశంలో అది ఆమోదయోగ్యం కాదు. గడచిన 70 ఏళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలుకు కొద్దిరోజుల కిందటే భారత్ వీడ్కోలు పలికింది. అవును మీరు అనుకుంటున్నది అదే… రాజ్యాంగంలోని 370వ నిబంధన రద్దు అంశం. దీనివల్ల జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు అభివృద్ధికి, సమాన హక్కులకు దూరమయ్యారు. ఉగ్రవాద, వేర్పాటువాద శక్తులు ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని ఇన్నేళ్లుగా చెలరేగుతూ వచ్చాయి. దేశంలోని ఇతర ప్రాంతాల భారతీయులందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ఇక జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజలకూ లభ్యమవుతాయి. అక్కడ మహిళలు, పిల్లలు, దళితులపై కొనసాగుతూ వచ్చిన వివక్ష నేడు అంతమైపోయింది.

మిత్రులారా,

ఈ అంశం మీద మేము పార్లమెంటు ఉభయ సభల లో గంటలకొద్దీ చర్చించాము. ఇదంతా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ టీవీల లో ప్రత్యక్షం గా ప్రసారమైంది. మా దేశం లో ఎగువ సభ… అంటే-రాజ్య సభ లో మా పార్టీ కి ఆధిక్యం లేదు. అయినప్పటికీ మా ఉభయ సభలూ దీనికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాల ను మూడింట రెండు వంతుల ఆధిక్యం తో ఆమోదించాయి. ఈ సందర్భం గా భారత పార్లమెంటు సభ్యులందరికీ మీరు కరతాళ ధ్వనుల తో ఘనంగా అభినందనలు తెలపాలని నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను (చప్పట్లు మారుమోగాయి). మీకందరికీ ఎనలేని కృతజ్ఞతలు.

భారతదేశం తన కోసం తాను ఏంచేస్తున్నా తమ దేశాన్ని సజావుగా నడిపించలేని కొద్దిమంది ఇతర దేశాల పాలకుల కు అది మింగుడుపడటం లేదు. భారత్ పట్ల విద్వేషమే రాజకీయ ప్రధాన సూత్రం గా వారు వ్యవహరిస్తున్నారు. నిత్య కల్లోలాన్ని వాంఛిస్తున్న వీరే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉసిగొల్పుతున్నారు. వారు ఎవరన్నది మీకు మాత్రమే కాక యావత్తు ప్రపంచాని కి కూడా చాలా బాగా తెలుసు. అది అమెరికా లో 9/11 లేదా ముంబయి లో 26/11 దాడులు కావచ్చు… వాటి కుట్రదారులు ఎక్కడ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే.

మిత్రులారా,

ఉగ్రవాదం మీద, దాన్ని ప్రోత్సహిస్తున్న దుష్ట శక్తులపైనా నిర్ణయాత్మక పోరాటానికి సమయం ఆసన్నమైంది. ఉగ్రవాదంపై ఈ పోరులో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ దృఢం గా నిలబడ్డారని ఈ సందర్భంగా నేను నొక్కిచెప్పదలచాను. ఈ విషయంలో మనమంతా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ను పెద్దపెట్టున కరతాళ ధ్వనుల తో అభినందించాలి (చప్పట్లు మారుమోగాయి). కృతజ్ఞతలు.. మిత్రులారా కృతజ్ఞతలు.

సోదరులు మరియు సోదరీమణులారా,

భారతదేశం లో చాలా పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఎన్నో మార్పులు వస్తున్నాయి. అయినా, మరింత ప్రగతి కోసం కృషి చేయాలన్న లక్ష్యం తో మేం ముందుకుపోతున్నాము. కొత్త సవాళ్ల ను నిర్దేశించుకుని, వాటి ని సాధించేందుకు కృత నిశ్చయం తో ఉన్నాము. దేశం లో వ్యక్తం అవుతున్న ఈ ప్రగతి భావనల పై నేను ఒక పద్యం రాశాను. అందులో నుండి రెండు పంక్తుల ను ఈ రోజు న నేను వినిపిస్తాను..

‘‘అక్కడ కనిపిస్తున్నది అవరోధాల పర్వతం మాత్రమే కాదు

అది నా స్ఫూర్తి శిఖరం కూడా..’’

సమయాభావం కారణంగా ఇంతకన్నా ఎక్కువ చదవలేదు.

మిత్రులారా,

భారత్ ఇవాళ సవాళ్లనుంచి వెనుకడుగు వేయడం లేదు. వాటిని ఢీకొనడమే మా ధ్యేయం. భారతదేశం ఇవాళ సమస్యల కు సంపూర్ణ పరిష్కారానికే ప్రాధాన్యమిస్తోంది. కొంతకాలం కిందటి వరకు అసాధ్యం గా కనిపించిన ప్రతిదానిని భారత్ ఇప్పుడు సుసాధ్యం చేస్తోంది.

మిత్రులారా,

భారత్ నేడు 5 లక్షల కోట్ల డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు సిద్ధమవుతోంది. మౌలిక సదుపాయాలను, పెట్టుబడులను, ఎగుమతులను పెంచడానికి మేమిప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజాహిత, ప్రగతిహిత, పెట్టుబడిహిత పర్యావరణం సృష్టి దిశగా మేం ముందంజ వేస్తున్నాం. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనపై మేం దాదాపు 100 లక్షల కోట్లు (1.3 లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు చేయబోతున్నాం.

మిత్రులారా,

ప్రపంచమంతటా ఎన్నిరకాల అనిశ్చితి ఉన్నా గడచిన ఐదేళ్లలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా ఉంది. ఏ ప్రభుత్వ హయాంలోనైనా పూర్తికాలపు సగటు ను పరిశీలిస్తే ఇంతకుముందు ఎన్నడూ ఇది సాధ్యం కాలేదు. తొలిసారిగా ద్రవ్యోల్బణం స్వల్పస్థాయిలో నమోదవుతోంది… ద్రవ్యలోటు కనిష్ఠ స్థాయిలోనూ, వృద్ధి గరిష్ఠ స్థాయిలోనూ నమోదవుతున్నాయి. అందుకే ప్రపంచం మొత్తం మీద ఇవాళ భారత్ అత్యుత్తమ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గమ్యాల్లో ఒకటిగా పరిగణనలో ఉంది. ఆ మేరకు 2014 నుంచి 2019 మధ్య కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం రెట్టింపుగా నమోదైంది. ఇక ఏకైక బ్రాండ్ చిల్లర వర్తకం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనల ను మేం సరళీకరించాం. తదనుగుణం గా బొగ్గు తవ్వకం, కాంట్రాక్టు విధానం లో వస్తు తయారీ రంగాల లోనూ నేడు 100 శాతం విదేశీ పెట్టుబడుల కు వీలుంటుంది. నిన్న హ్యూస్టన్ లో నేను శక్తి రంగ ముఖ్య కార్యనిర్వహణాధికారుల తో సమావేశమయ్యాను. కార్పొరేట్ పన్ను ను భారత్ గణనీయం గా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అందరి లోనూ ఉత్సాహం నింపింది. ఈ సందేశాని కి భారతదేశంలోనే కాక ప్రపంచ ప్రసిద్ధ వాణిజ్య సంస్థల నుండి అత్యంత సానుకూల స్పందన లభించింది. భారతదశం అంతర్జాతీయం గా బలమైన పోటీ ని ఇచ్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.

మిత్రులారా,

భారతీయుల కు భారతదేశం లో, అమెరికన్ లకు అమెరికా లో ఇప్పుడు ముందుకు దూసుకుపోవడానికి అంతు లేని అవకాశాలు ఉన్నాయి. ఐదు లక్షల కోట్ల డాలర్ ల విలువైన ఆర్థిక వ్యవస్థ దిశ గా భారత్ పయనంతో పాటు అధ్యక్షుడు శ్రీ ట్రంప్ నాయకత్వంలో అమెరికాలో బలమైన ఆర్థిక వృద్ధి ఈ అవకాశాలకు కొత్త రెక్కలు తొడుగుతాయి. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఆర్థికరంగ అద్భుతాలు ఇందుకు సరికొత్త ఉత్తేజాన్నిస్తాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో నేను అధ్యక్షుడు శ్రీ ట్రంప్ తో చర్చల్లో పాల్గొనబోతున్నాను. ఈ చర్చలద్వారా సానుకూల ఫలితాలు లభిస్తాయని నేను ఆశిస్తున్నాను. సంప్రదింపులలో దిట్టగా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ నన్ను అభివర్ణిస్తున్నప్పటికీ లౌక్యం ప్రదర్శించే ఆ కళలో ఆయనకెంతో నైపుణ్యం ఉంది.. ఆ కళను ఆయననుంచి నేనూ అభ్యసిస్తున్నాను. మిత్రులారా… మెరుగైన భవిష్యత్తు కోసం మేం వేస్తున్న ముందడుగు ఇక మరింత వేగంగా పడుతుంది. నా మిత్రులైన మీరంతా కూడా ఇందులో భాగస్వాములు మాత్రమేగాక దీనివెనుక చోదకశక్తి కూడా మీరే. మీ దేశం నుంచి మీరెంతో దూరంలో ఉన్నా… మీ దేశ ప్రభుత్వం మాత్రం మీ సమీపంలోనే ఉంటుంది. గడచిన ఐదేళ్లలో ప్రవాస భారతీయులతో చర్చల అర్థాన్ని, సమాచార ఆదానప్రదాన రీతిని మేం పూర్తిగా మార్చేశాం. ఈ నేపథ్యం లో రాయబార కార్యాలయం, దౌత్య కార్యాలయాలు కేవలం ప్రభుత్వ ఆఫీసుల్లా కాకుండా మీ తొలి భాగస్వాములుగా ఉంటాయి. ఇతర దేశాల్లో పనిచేస్తున్న మిత్రుల ప్రయోజనాల రక్షణకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఆ మేరకు ‘మదద్, ఇ-మైగ్రేట్, ప్రి-డిపార్చర్ ట్రెయినింగ్, ఇతర దేశాల్లోని భారతీయులకు మెరుగైన బీమా పథకం, పిఐఒ కార్డుదారులందరికీ ఒసిఐ కార్డు సదుపాయం వగైరా చర్యలు తీసుకోబడ్డాయి. దీనివల్ల విదేశాల్లోని భారతీయులు అక్కడి వెళ్లేముందు, వెళ్లాక కూడా వారికి సహాయపడే అనేక కార్యకలాపాలు చేపట్టాం. అంతేకాకుండా ప్రవాస భారతీయ సమాజ సంక్షేమ నిధి ని కూడా మా ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రపంచం లోని అనేక నగరాల లో ప్రవాస భారతీయుల సహాయ కేంద్రాల ను ఏర్పాటు చేశాము.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ వేదిక నుండి వెలువడే సందేశం కొత్త నిర్వచనాల కు రూపాన్ని ఇస్తుంది. అలాగే మన ప్రజాస్వామ్య విలువలకు గల సమాన శక్తి 21వ శతాబ్దంలో కొత్త అవకాశాల ను సృష్టిస్తుంది. రెండు దేశాలకూ సరికొత్త నిర్మాణాల కు అవసరమయ్యే ఒకే విధమైన సంకల్పాలు ఉన్నాయి. కాబట్టి అవి రెండూ మనలను కచ్చితం గా ఉజ్వల భవిష్యత్తు వైపునకు నడిపిస్తాయి. అధ్యక్షుల వారూ.. మీరు సకుటుంబ సమేతం గా భారత పర్యటన కు రావాలని, మీకు మేం ఘన స్వాగతం పలకాలని ఆకాంక్షిస్తున్నాం. మన స్నేహం మన ఉమ్మడి స్వప్నాల ను, మన శక్తిమంతమైన భవిష్యత్తు ను కొత్త శిఖరాల కు చేరుస్తుంది. ఈ సందర్భం గా అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు, ఈ సమావేశాని కి విచ్చేసినటువంటి అమెరికా కు చెందిన రాజకీయ, సామాజిక రంగ మరియు వాణిజ్య రంగ ప్రముఖులు అందరి కి నేను మరొక్క మారు నా హృదయ పూర్వక కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.

టెక్సాస్ ప్రభుత్వాని కి మరియు ఇక్కడి పాలనయంత్రాంగాని కి కూడాను ఇవే నా ధన్యవాదాలు.

థాంక్ యు హ్యూస్టన్, థాంక్ యు అమెరికా.

మిమ్మల్నందరినీ ఈశ్వరుడు దీవించుగాక.

మీకు ఇవే ధన్యవాదాలు.

అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఆ ప్రసంగాని కి స్థూల అనువాదమిది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
‘Make in India’ is working, says DP World Chairman

Media Coverage

‘Make in India’ is working, says DP World Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi condoles loss of lives due to stampede at New Delhi Railway Station
February 16, 2025

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to stampede at New Delhi Railway Station. Shri Modi also wished a speedy recovery for the injured.

In a X post, the Prime Minister said;

“Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.”